న్యూయార్క్: వరదలు, కరువు వంటి పర్యావరణ సంక్షోభాలు, విలయాలు కలిగించే నష్టం ఎంత అపారంగా ఉంటుందో మనమంతా చూస్తున్నదే. అయితే వీటివల్ల టైఫాయిడ్, జికా వంటి అంటురోగాల వ్యాప్తి కూడా పెరుగుతోందని ఓ సర్వే తేల్చింది! 2016 సంగతి. ఉత్తర సైబీరియాలో నివసించే ప్రజలు ఉన్నట్టుండి రోగాల బారిన పడసాగారు. వారితో పాటు జింకల వంటి జంతువులకు కూడా ఆంత్రాక్స్ సోకి కలకలం రేపింది. ఉష్ణోగ్రతల పెరుగుదలే దీనికి కారణమని తేలింది. 2016లో సైబీరియాలో ఉష్ణోగ్రతలు కనీవినీ ఎరగనంతగా పెరిగాయి. దాంతో మంచు విపరీతంగా కరిగి దశాబ్దాల క్రితం ఆంత్రాక్స్‌తో చనిపోయిన ఓ జింక శవం బయట పడిందట.
అందులోంచి ఆంత్రాక్స్ కారక బ్యాక్టీరియా తదితరాలు గాల్లో వ్యాపించి మరోసారి వ్యాధి తిరగబెట్టేందుకు కారణమయ్యాయని తేలింది! ఇదొక్కటనే కాదు. తుఫాన్లు, కరువులు, వరదలు తదితరాల వాతావరణ సంబంధిత విలయాలు ఆంత్రాక్స్ వంటి బ్యాక్టీరియా మొదలుకుని జికా వంటి వైరస్‌లు, మలేరియా వంటి పరాన్నభుక్కు సంబంధిత అంటువ్యాధుల వ్యాప్తిని 58 శాతం దాకా పెంచుతున్నాయని యూనివర్సిటీ ఆఫ్ హవాయి–మనోవాకు చెందిన కెమిలో మోరా అనే శాస్త్రవేత్త చేసిన అధ్యయనంలో తేలింది. ఇందుకోసం విలయాలు, వ్యాధుల మధ్య సంబంధంపై వచ్చిన వందలాది పరిశోధక పత్రాల నుంచి సమాచారాన్ని ఆయన బృందం సేకరించింది. దాన్ని లోతుగా విశ్లేషించిన మీదట ఈ మేరకు తేల్చింది. ఈ ఫలితాలను నేచర్ జర్నల్ పచురించింది.
గ్రీన్‌హౌస్ ఉద్గారాలను ఆపాల్సిందే
కొన్ని విలయాలకు అంటువ్యాధులతో సంబంధం నేరుగా కనిపిస్తుంది. వరదలొచ్చినప్పుడు కలుషిత నీటి వల్ల వ్యాపించే మెదడు వాపు వంటివాటివి ఇందుకు ఉదాహరణ. నీరు చాలాకాలం నిల్వ ఉండిపోతే డెంగీ, చికున్‌గున్యా, మలేరియా వంటివీ ప్రబలుతాయి. విపరీతమైన వేడి గాలుల వంటి పర్యావరణ విపత్తులు కూడా పలు రకాల వైరస్‌లు ప్రబలేందుకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తాయి. విపత్తుల కారణంగా 1,000కి పైగా మార్గాల్లో అంటురోగాలు ప్రబలినట్టు సర్వేలో తేలిందని మోరా చెప్పుకొచ్చారు. ‘‘వీటన్నింటికీ అడ్డుకట్ట వేయడం భారీ వ్యయప్రయాసలతో కూడిన వ్యవహారం. బదులుగా మూలానికే మందు వేసే ప్రయత్నం చేయాలి. అంటే, పర్యావరణ విపత్తులకు మూలకారణంగా మారిన గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలకు తక్షణం అడ్డుకట్ట వేయాలి’’ అని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment