
షిప్పింగ్ లక్ష్యంగా ఐఎంవో అంగీకారం
లండన్: గ్లోబల్ వార్మింగ్ కట్టడి దిశగా కీలక ముందడుగు పడింది. ఈ దిశగా ప్రపంచ దేశాలు ఒక్కతాటిపైకి వచ్చాయి. గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలపై గ్లోబల్ ట్యాక్స్ విధించేందుకు మొట్టమొదటిసారిగా రంగం సిద్ధమైంది. షిప్పింగ్ వనరుగా ఉన్న ప్రధాన దేశాలు ఇందుకు అంగీకారం తెలిపాయి. దీని ప్రకారం.. నౌకలు విడుదల చేసే ప్రతి టన్ను కార్బన్ డయాక్సైడ్‌పై ఇకపై కనీసం 100 డాలర్ల చొప్పున పన్ను విధించనున్నాయి.
ఆయా దేశాల నౌకలు లక్ష్యాలను చేరలేకపోయినా, ఇంటర్నేషనల్ మారిటైం ఆర్గనైజేషన్ నెట్ జీరో ఫండ్‌కు నిధులందించకున్నా 2028 నుంచి ఈ ట్యాక్స్‌ను వసూలు చేయనున్నారు. ఇందుకు సంబంధించి శుక్రవారం లండన్‌లో 60కిపై దేశాలు ప్రతినిధులతో ఇంటర్నేషనల్ మారిటైం ఆర్గనైజేషన్ (ఐఎంవో) సమావేశం జరిగింది. అయితే అగ్ర రాజ్యం అమెరికా మాత్రం దీనికి గైర్హాజరు కావడం గమనార్హం.
ఓడల్లో వాడే ఇంధనానికి సైతం ఈ సమావేశం పలు ప్రమాణాలను నిర్దేశించింది. మొత్తం ఉద్గారాల్లో షిప్పింగ్ వాటా 3 శాతమని ఐరాస గణాంకాలు చెబుతున్నాయి. ఓడల సంఖ్యతో పాటు వాటి పరిమాణం పెరుగుతుండటం, అందుకు అనుగుణంగా ఇంధన వాడకం విపరీతంగా పెరిగి పోతుండటంతో రానున్న రోజుల్లో షిప్పింగ్ ఉద్గారాలు ఇంకా ఎక్కువవుతాయని భావిస్తున్నారు. ఐఎంవో భేటీలో కుదిరిన ఒప్పందంపై సెక్రటరీ జనరల్ ఆర్సెనియో డొమింగెజ్ హర్షం వెలిబుచ్చారు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి, షిప్పింగ్ ఆధునీకరణకు ఎన్నో సంక్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటూ ఈ బృందం అర్థవంతమైన ఏకాభిప్రాయాన్ని సాధించిందని ఆయన అభిప్రాయపడ్డారు.