Global warming
-
2100 నాటికి ఉష్ణోగ్రతలో... 3.1 డిగ్రీల పెరుగుదల!
వాతావరణ మార్పుల కట్టడి కోసం ప్రస్తుతం ప్రపంచ దేశాలు అమలు చేస్తున్న చర్యలు ఏమాత్రం సరిపోవని ఐక్యరాజ్యసమితి తేలి్చచెప్పింది. భూగోళంపై ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమవుతున్న గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాలను అరికట్టడంలో ప్రపంచ దేశాలు ఘోరంగా విఫలమవుతున్నాయని ఎండగట్టింది. ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ శతాబ్దం ఆఖరు నాటికి సగటు ఉష్ణోగ్రత మరో 3.1 డిగ్రీల సెల్సియస్(5.4 డిగ్రీల ఫారెన్‌హీట్) పెరుగుతుందని స్పష్టంచేసింది. ఈ మేరకు వార్షిక ఉద్గారాల నివేదికను ఐక్యరాజ్యసమితి ఇటీవల విడుదల చేసింది. వాస్తవానికి ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీలకే(2.7 ఫారెన్‌హీట్) పరిమితం చేయాలన్న ప్రతిపాదనకు ప్రపంచదేశాలు మద్దతు పలికాయి. 2015లో పారిస్‌లో జరిగిన కాప్–21 సదస్సులో సంబంధిత ఒప్పందంపై సంతకాలు చేశాయి. భూగోళంపై జీవుల మనుగడ కొనసాగాలంటే ఉష్ణోగ్రతల పెరుగుదలను కట్టడి చేయాల్సిందేనని నిపుణులు స్పష్టంచేశారు. పారిస్ ఒప్పందంపై సంతకాలు చేసి దాదాపు పదేళ్లవుతున్నా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉండడం శోచనీయమని ఐక్యరాజ్యసమితి ఆక్షేపించింది. → ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీలకు పరిమితం చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా, వాస్తవ పరిస్థితిని చూస్తే 2100 నాటికల్లా ఉష్ణోగ్రతలు 3.1 డిగ్రీల దాకా పెరిగిపోనున్నాయి. అంటే లక్ష్యం కంటే రెండింతలు కావడం గమనార్హం. ప్రభుత్వాల చర్యలు ఎంత నాసిరకంగా ఉన్నాయో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. → కర్బన ఉద్గారాలను అరికట్టడం, వాతావరణ మార్పులను నియంత్రించడం తక్షణావసరమని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ వెల్లడించారు. లేకపోతే మనమంతా మహావిపత్తును ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. → 2022 నుంచి 2023 దాకా ప్రపంచవ్యాప్తంగా గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాలు 1.3 శాతం పెరిగినట్లు ఒక అధ్యయనంలో వెల్లడయ్యింది. ఇది 57.1 గిగా టన్నుల కార్బన్ డయాక్సైడ్కు సమానం. → ఒకవేళ ఇప్పటినుంచి ఉద్గారాల నియంత్రణ చర్యలను పటిష్టంగా అమలు చేసినప్పటికీ ఉష్ణోగ్రతలు 2100 కల్లా 2.6 డిగ్రీల నుంచి 2.8 డిగ్రీల దాకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. → కర్బన ఉద్గారాల్లో అధిక వాటా జీ20 దేశాలదే. వాతావరణ మార్పులను అరికట్టడంతో ఆయా దేశాలు దారుణగా విఫలమవుతున్నాయని ఐక్యరాజ్యసమితి అసంతృప్తి వ్యక్తం చేసింది. వాతావరణ లక్ష్యాల సాధనలో చాలా వెనుకంజలో ఉన్నాయని వెల్లడించింది. → ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీలకు పరిమితం చేయాలంటే గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాలను 2030 నాటికి 42 శాతం, 2035 నాటికి 57 శాతం తగ్గించుకోవాల్సి ఉంటుంది. అది దాదాపు అసాధ్యమేనని నిపుణులు అంటున్నారు. → ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో కాన్ఫరెన్స్ ఆఫ్ పారీ్టస్(కాప్–29) సదస్సు వచ్చే నెలలో అజర్బైజాన్లో జరుగనుంది. వాతావరణ మార్పుల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ దిశగా ఈ సదస్సులో కీలక తీర్మానాలు ఆమోదిస్తారని పర్యావరణ ప్రేమికులు ఆశగా ఎదురు చూస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Global Commission on Economics of Water: దారి తప్పిన జల చక్రం!
పర్యావరణంతో శతాబ్దానికి పైగా మనిషి ఆడుతున్న ప్రమాదకరమైన ఆట పెను విపత్తుగా పరిణమిస్తోంది. దాని తాలూకు విపరిణామాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. విచ్చలవిడిగా అడవుల నరికివేత, మితిమీరిన వాతావరణ కాలుష్యం తదితరాల దెబ్బకు చివరికి భూమిపై జీవకోటి మనుగడకు అత్యవసరమైన జలచక్రం కూడా గతి తప్పింది. అంతర్జాతీయ నిపుణుల సమూహమైన గ్లోబల్ కమిషన్ ఆన్ ద ఎకనామిక్స్ ఆఫ్ వాటర్ చేపట్టిన అధ్యయనం ఈ మేరకు తేలి్చంది. ‘‘చరిత్ర పొడవునా అత్యంత భారీ వాతావరణ మార్పులనెన్నింటినో తట్టుకుని నిలిచిన జలచక్రం ఇలా సంతులనం కోల్పోవడం మానవాళి చరిత్రలో ఇదే తొలిసారి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా నీటి ఎద్దడి అతి త్వరలోనే పరాకాష్టకు చేరడం ఖాయం’’ అని బుధవారం విడుదల చేసిన నివేదికలో హెచ్చరించింది. మనిషి నిర్వాకం వల్ల చోటుచేసుకుంటున్న పర్యావరణ మార్పులే ఇందుకు ప్రధాన కారణమంటూ కుండబద్దలు కొట్టింది! ‘‘దీనివల్ల ఆహార సంక్షోభం మొదలుకుని పలు రకాల విపరిణామాలు తలెత్తనున్నాయి. వీటి దెబ్బకు త్వరలో పలు దేశాల ఆర్థిక వ్యవస్థలే అతలాకుతలం కావడం ఖాయం’’ అని జోస్యం చెప్పింది. ఏమిటీ జలచక్రం...!? జలచక్రం భూమిపై నీటి కదలికలకు సంబంధించిన సంక్లిష్టమైన వ్యవస్థ. చెరువులు, నదులు, ముఖ్యంగా సముద్రంలోని నీరు సూర్యరశ్మి ప్రభావంతో ఆవిరిగా వాతావరణంలోకి చేరుతుంది. భారీ నీటి ఆవిరి మేఘాలుగా మారి సుదూరాలకు పయనిస్తుంది. శీతల వాతావరణం ప్రభావంతో చల్లబడి వానగా, మంచుగా తిరిగి నేలపైకి చేరుతుంది. ఈ ప్రక్రియనంతటినీ కలిపి జలచక్రంగా పేర్కొంటారు. మనిషి చేజేతులారా చేస్తూ వస్తున్న పర్యావరణ విధ్వంసం ధాటికి దీనిపై కొన్ని దశాబ్దాలుగా కనీవినీ ఎరగని స్థాయిలో ఒత్తిడి పడుతూ వస్తోంది. ఇటీవలి కాలంలో అది భరించలేని స్థాయికి చేరిందని అధ్యయనం వెల్లడించింది. దశాబ్దాల తరబడి భూమిని విచ్చలవిడిగా విధ్వంసకర విధానాలకు వాడేయడం మొదలుకుని ప్రపంచవ్యాప్తంగా అత్యధిక దేశాలు నీటి నిర్వహణలో కనబరుస్తున్న లెక్కలేనితనం దాకా జలచక్రం గతి తప్పేందుకు దారితీసిన పలు కారణాలను నివేదిక ఏకరువు పెట్టింది. గతి తప్పితే అంతే...! జలచక్రం గతి తప్పితే జరిగే చేటును తాజా నివేదిక కళ్లకు కట్టింది...→ కేవలం నీటి ఎద్దడి దెబ్బకు 2050 నాటికి దాదాపుగా అన్ని దేశాల జీడీపీ కనీసం 8 శాతం, అంతకుమించి తగ్గిపోతుందని అంచనా. అల్పాదాయ దేశాల జీడీపీలో 15 శాతానికి పైగా క్షీణత నమోదు కావచ్చు.→ దీని ప్రభావంతో ఏకంగా 300 కోట్ల మంది తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. చాలా దేశాల్లో పంటలూ నేలచూపులు చూస్తున్నాయి. ళీ భారీ భవనాలు తదితరాల తాలూకు ఓపలేని భారానికి తోడు భూగర్భ జల వనరులూ నిండుకుంటుండటంతో నగరాలు, పట్టణాలు నానాటికీ మరింత వేగంగా భూమిలోకి కూరుకుపోతున్నాయి. → నీటి సంక్షోభం ఇప్పటికే ప్రపంచ ఆహారోత్పత్తిని 50 శాతానికి పైగా ప్రభావితం చేస్తోంది.హరిత జలం.. అతి కీలకం చెరువులు, నదుల వంటి జలాశయాల్లోని నీటికి బ్లూ వాటర్ అంటారు మట్టి, మొక్కల్లో నిల్వ ఉండే తేమను హరిత జలం అని పేర్కొంటారు. మనం ఇప్పటిదాకా పెద్దగా పట్టించుకోని ఈ నీటి వనరును జలచక్రంలో అతి కీలకమైన పొరగా నివేదిక అభివరి్ణంచింది. ‘‘ప్రపంచ వర్షపాతంలో ఏకంగా సగానికి పైగా దీనివల్లే సంభవిస్తోంది. భూమిని వేడెక్కించే కర్బన ఉద్గారాలను చాలావరకు శోషించుకునేది ఈ హరితజలమే’’ అని తేలి్చంది. కానీ, ‘‘ఏ దేశంలో చూసినా చిత్తడి నేలలను నాశనం చేసే ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. దీనికి తోడు అడవులనూ విచ్చలవిడిగా నరికేస్తున్నారు. దాంతో కర్బన ఉద్గారాలు నేరుగా వాతావరణంలోకి విడుదలైపోతున్నాయి. ఫలితంగా గ్లోబల్ వారి్మంగ్ ఊహాతీత వేగంతో పెరిగిపోతోంది. మట్టిలో, చెట్లలో ఉండే తేమ హరించుకుపోతోంది. ఇదో విషవలయం. దీని దెబ్బకు కార్చిచ్చుల ముప్పు కూడా నానాటికీ పెరుగుతోంది’’ అని నివేదిక హెచ్చరించింది.అడ్డూ అదుపూ లేని మానవ కార్యకలాపాల వల్ల భూమిపై జలచక్రంతో సహా అన్నిరకాల సంతులనాలూ ఘోరంగా దెబ్బ తింటున్నాయి. దాంతో వర్షపాత ధోరణులు విపరీతంగా మారుతున్నాయి. దేశాలన్నీ తమ నీటి నిర్వహణ తీరుతెన్నులను యుద్ధ ప్రాతిపదికన మెరుగు పరుచుకోవాలి. కాలుష్యానికి తక్షణం అడ్డుకట్ట వేయాలి. లేదంటే మానవాళి మనుగడకు ముప్పు మరెంతో దూరంలో లేదు’– రిచర్డ్ అలన్, క్లైమేట్ సైన్స్ ప్రొఫెసర్, రీడింగ్ యూనివర్సిటీ, ఇంగ్లండ్ప్రపంచ నీటి సంక్షోభం పెను సమస్య మాత్రమే కాదు. జల ఆర్థిక వ్యవస్థల్లో అత్యవసరమైన మార్పుచేర్పులకు అవకాశం కూడా. ఇందుకోసం ముందుగా నీటి విలువను సరిగా అర్థం చేసుకోవడం చాలా అవసరం. దురదృష్టవశాత్తూ చాలా దేశాల్లో అదే లోపిస్తోంది– గోజీ ఒకొంజో ఇవాలా,డైరెక్టర్ జనరల్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ – సాక్షి, నేషనల్ డెస్క్ -
కోవిడ్‌ను మించే భూతం... భూతాపం
రెండేళ్ల పాటు కరోనా వైరస్ ప్రపంచ మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేసింది. కోవిడ్ కల్లోలం సృష్టించిన నష్టం ఈ శతాబ్దంలోనే కాక, మానవ చరిత్ర లోనే ఓ పెనువిషాదం. ఆ పీడకల నుంచి తేరుకొని ఆర్థిక స్థిరత్వం దిశగా అడుగులు వేస్తున్న ప్రపంచానికి మరో పెద్ద సవాలు... ‘గ్లోబల్ వార్మింగ్’. ఫలితంగా తీవ్రమైన ఎండలు, అంతలోనే వరదలు... మానవాళిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పెరిగే భూతాపం వ్యవసాయ రంగానికి ప్రథమ శత్రువు. వాతా వరణ మార్పుల వల్ల ఒక్క భారతదేశంలోనే వ్యవసాయ దిగుబడుల్లో ప్రతి యేటా రమారమి 30% క్షీణత నమోదవుతోంది. వాతావరణం మార్పులతో ఎదురవుతున్న సవాళ్లను ధీటుగా ఎదుర్కొని స్థిరత్వం వైపు ముందుకు సాగాలంటే... అందుకు అనుగుణమైన విధానాలను ప్రభుత్వాలు అనుసరించాలి.భూతాపం వల్ల సప్త సముద్రాలు వేడెక్కి పోతున్నాయి. మంచు పర్వతాలు కరిగిపోతున్నాయి. 1950 నాటికి హిమాలయాలపై ఘనీభవించిన మంచు నేటికి చాలావరకు కనుమరుగైంది. అంటార్కిటికా సముద్రంలోని మంచు పరిణామం కనిష్ఠ స్థాయికి పడిపోయింది. భారత్‌తో సహా అనేక దేశాలలో శీతాకాలం క్రమంగా ఎండా కాలంగా మారిపోతోంది. మరికొన్ని చోట్ల సముద్ర మట్టాలు పెరిగి సముద్రాలు ముందుకు చొచ్చుకొచ్చి అనేక ద్వీపాలను కబళించి వేస్తున్నాయి. వాతావరణ మార్పుల వల్ల మన దేశంలో అధికంగా నష్టపోతున్న రంగాలలో వ్యవసాయం, ఆరోగ్యం ముఖ్యమైనవి. ఒకవైపు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరుగుదలతో ఐటీ, ఎలక్ట్రానిక్స్ వంటి కొన్ని రంగాలు అభివృద్ధిలో అనూహ్యంగా ముందంజ వేస్తుండగా... మరో వైపు నిలకడైన వాతావరణ పరిస్థితులు లేక వ్యవసాయం, తదితర ఉత్పత్తి రంగాలలో భారీ క్షీణత కనిపిస్తోంది. ఈ వైరుధ్యం ప్రజల మధ్య అనేక అసమానతలకు దారితీస్తోంది. భారీ వర్షాలు, వరదలతో పేదల ఇళ్లు నేలమట్టం అవుతున్నాయి. ఎలాంటి మౌలిక వసతులకు నోచుకోకుండా లోతట్టు ప్రాంతాల్లో నివసించే పేదల జీవితాలు గాల్లో దీపంలా మారాయి. నివాసం ఉన్న చోట బతికే పరిస్థితి లేకపోవడం వల్ల మనుషులు వలసలు పోవాల్సిన దుఃస్థితి అనేక దేశాలలో నెలకొంది. మరోవైపు ఉష్ణోగ్రత పెరుగుదల, భారీ వర్షాల వల్ల అపసవ్య దిశలో సముద్రపు నీరు పొంగి పంట పొలాల్లోకి, నదీసంగమాల వద్ద నదుల్లోకి ప్రవహి స్తోంది. వాతావణ మార్పుల వల్ల జీవ వైవిధ్యం పూర్తిగా గాడి తప్పింది. మారిన వాతావరణ పరిస్థితులకు అలవాటు పడలేక మనుషు లతోపాటు మొక్కలు, జంతుజాలానికి తీవ్రమైన హాని కలుగుతోంది. అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంఘం తాజా నివేదిక ప్రకారం, సుమారు 10 లక్షల వృక్ష, జంతుజాతులు అంతరించే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. గత 400 ఏళ్లల్లో 680 వెన్నెముక గలిగిన జాతులు నశించగా, కేవలం గత 2 దశాబ్దాలలోనే అంతకు రెట్టింపు జాతులు నశించాయి. కాలుష్యం, భూవినియోగంలో మార్పులు, వాతావరణంలో చోటుచేసుకుంటున్న అనూహ్య తేడాలు ఇందుకు కారణంగా శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. భూతాపం, కాలుష్యం కారణంగా మనుషులలో వయస్సుతో సంబంధం లేకుండా అనేక రుగ్మతలు కనపడుతున్నాయి. కేవలం శ్వాస కోశ సంబంధిత వ్యాధులు, గుండె జబ్బులతోనే ప్రపంచవ్యాప్తంగా ప్రతియేటా 87 లక్షల ప్రజలు చనిపోతున్నారు. కాలుష్యం వల్ల అప్పుడే పుట్టిన పసికందులకు కూడా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.ఒకప్పుడు అగ్ని పర్వతాలు బద్దలు కావడం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఆ తర్వాత పారిశ్రామిక విప్లవం వచ్చాక... బొగ్గు, చమురు, గ్యాస్ వంటి శిలాజల ఇంధనాలను మండించడం ఎక్కువయ్యాక వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్, ఇంకా గ్రీన్ హౌజ్ వాయువుల కారణంగా కేవలం 150 సంవత్సరాలలో 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్ మేర భూతాపం పెరిగింది. సహజ వాయువు వెలికితీత, దాని వాడకం వల్ల బయటపడే మీథేన్ కారణంగా మరో 1 డిగ్రీ సెంటిగ్రేడ్ వేడిమి పెరిగే అవకాశం ఏర్పడింది.పెరిగే భూతాపం వ్యవసాయ రంగానికి ప్రథమ శత్రువు. అధిక వర్షాలు, వరదల వల్ల చేతికొచ్చిన పంటల్లో ఉత్పత్తి తగ్గిపోతోంది. ఆహార భద్రతకు అన్ని చోట్లా ప్రమాదం ఏర్పడింది. ఫలితంగా, వ్యవసాయరంగంపై ఆధారపడిన రైతాంగం, అనుబంధ రంగాల కార్మికులకు ఆదాయాలు పడిపోయాయి. ఇప్పటికీ 60% ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన వ్యవసాయ రంగాన్ని రక్షించు కోవాలంటే, అత్యవసర పర్యావరణ కార్యచరణతో ముందుకు సాగ వలసిందే! రుతుపవనాల గమనం, వాతావరణ వైవిధ్యం ఆధారంగా దేశాన్ని 7 జోన్లుగా వర్గీకరించుకొని అందుకు అనుగుణంగా పంటల సాగును నిర్వహిస్తూ వస్తున్న మన దేశంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతాంగానికి కోలుకోలేని దెబ్బ తగులుతోంది. పంటలు పుష్పించే కాలంలో విపరీతమైన ఎండలు కాయడం వల్ల విత్తనాలు బలహీనపడుతున్నాయి. ఇది దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపు తున్నది. ఒక అంచనా ప్రకారం వాతావరణ మార్పుల వల్ల ఒక్క భారతదేశంలోనే వ్యవసాయ దిగుబడుల్లో ప్రతియేటా రమారమి 30% క్షీణత నమోదవుతోంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల ధాన్యం, గోధుమ, పప్పుధాన్యాల్లో ఉండే ప్రొటీన్లు నశిస్తున్నాయి. దీనివల్ల వ్యవసాయ ఉత్పత్తుల్లో పోషకాలు తగ్గిపోతున్నాయి. మరోవైపు అధిక ఉష్ణోగ్రతల కారణంగా దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడి పశువులకు అవసరమైన గ్రాసం అందడం లేదు. దాంతో, పశువుల ఎదుగుదల తగ్గి మాంసం ఉత్పత్తి పడిపోతోంది. పశువుల పునరుత్పత్తిపై ప్రతి కూల ప్రభావం చూపడమేకాక పాల దిగుబడి గణనీయంగా తగ్గింది. అధిక వర్షాలు, వరదల వల్ల కోళ్లు, గొర్రెలు, ఇతర పశువులు పెద్ద సంఖ్యలో చనిపోతున్నాయి. ఈ యేడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే తెలుగు రాష్ట్రాల్లో రెండు పర్యాయాలు కురిసిన భారీ వర్షాలు వ్యవసాయ రంగాన్ని కుదేలు చేశాయి. అధిక వర్షాలు, వరదల వల్ల పంట నష్టాలు జరుగు తున్నప్పుడు రైతాంగానికి ప్రభుత్వపరంగా అందుతున్న సాయం అరకొరగానే ఉంటోంది. వాతావరణ మార్పులను ముందుగానే అంచనా వేయలేని నేపథ్యంలో... పంటవేసి నష్టపోయే కంటే, పంట వేయకపోతేనే తక్కువ నష్టం అనే భావన చాలా ప్రాంతాల్లోని రైతాంగంలో బలంగా నాటుకుపోయింది. ఫలితంగా కొన్ని ప్రాంతాల్లో రైతులు క్రాప్ హాలీడే పాటిస్తున్నారు. ఇందువల్ల దేశ ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. భూతాపం తగ్గించడానికి ప్రపంచ దేశాలు ఇప్పటికే అనేక సదస్సులు నిర్వహించాయి, డిక్లరేషన్లపై సంతకాలు చేసి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. రియో ఒప్పందం, కోపెన్హెగన్ సదస్సు, క్యోటో ఒప్పందం, కాప్ 21 పారిస్ ఒప్పందం... ఇలా అనేక విస్తృత వేదికలపై ప్రపంచ దేశాలు భూతాపం తగ్గించడానికి చేసిన ఉమ్మడి ప్రమాణాలు కాగితాలకే పరిమితం కావడం వల్ల ప్రపంచం ప్రమాదంలో పడింది.అయితే, కొన్ని దేశాలు మాత్రం క్లీన్ ఎనర్జీ (స్వచ్ఛమైన ఇంధనం) వాడకం దిశగా ముందుకు సాగడం కొంతలో కొంత ఊరట. శిలాజ ఇంధనాల వాడకాన్ని పక్కనపెట్టి, సున్నా కాలుష్యం వెదజల్లే (నెట్ జీరో ఎమిషన్) టెక్నాలజీల వైపు పరుగులుపెడుతున్నాయి. ఎలక్ట్రిక్, బ్యాటరీ వాహనాల వినియోగాన్ని పెంచడం; మొక్కజొన్న, మరికొన్ని రకాల ఉత్పత్తుల నుంచి ఇంధనాన్ని తయారీ చేయడం; గాలి మరలు, సోలార్ ప్యానళ్ల నుంచి విద్యుత్ తయారు చేయడం మొదలైన కార్యక్రమాలను పెద్దఎత్తున చేపడుతున్నాయి. కొన్ని దేశాలు బయోఎనర్జీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ కాలుష్యాన్ని తగ్గిస్తు న్నాయి. భారత్‌లో కూడా ఎలక్ట్రిక్, బ్యాటరీ వాహనాల వాడకం మొద లైనప్పటికీ వాటి సంఖ్య స్వల్పం. అలాగే, సోలార్ ఎనర్జీని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని రాయితీలు ప్రకటించింది. వాతావరణం మార్పులతో ఎదురవుతున్న సవాళ్లను ధీటుగా ఎదుర్కొని స్థిరత్వం వైపు ముందుకు సాగాలంటే... అందుకు అనుగుణమైన విధానాలను ప్రభుత్వాలు అనుసరించాలి. జీవ వైవిధ్యాన్ని కాపాడుకునే విధంగా శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాలి. పౌర సమాజంలో చైతన్యాన్ని పెంచాలి. ముఖ్యంగా, ఈ అంశంపై వివిధ రాజకీయ పక్షాలలో ఏకాభిప్రాయం, మద్దతు అవసరం. అంతిమంగా పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా పెద్దఎత్తున కార్యక్రమాలు చేపట్టినట్లయితేనే ఫలితాలు అందుతాయి. లేకుంటే... కరోనాను మించిన భూతం అయిన భూతాపం వల్ల మరిన్ని కష్టాలు వెంటాడుతూనే ఉంటాయి.డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త ఏపీ శాసన మండలి సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి -
యుద్ధక్షేత్రం పరిష్కారం కాదు
ఐరాస: మానవాళి విజయం సమష్టి శక్తిలోనే దాగుంది తప్ప యుద్ధక్షేత్రంలో కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. యుద్ధం ఎన్నటికీ సమస్యల పరిష్కార వేదిక కాబోదని కుండబద్దలు కొట్టారు. సోమవారం న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి 79వ సర్వసభ్య సమావేశంలో భాగంగా ‘ప్రపంచ భవితపై శిఖరాగ్ర సదస్సు’లో ప్రధాని ప్రసంగించారు.ఉక్రెయిన్, గాజా యుద్ధాలు, దేశాల నడుమ ఉద్రిక్తతలు, గ్లోబల్ వార్మింగ్, పర్యావరణ మార్పుల వంటి పెను సమస్యల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రపంచ శాంతికి, ప్రగతికి ఐరాసతో పాటు పలు అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అత్యవసరమని మోదీ అభిప్రాయపడ్డారు. ‘‘మెరుగైన ప్రపంచ భవిష్యత్తు కోసం చేపట్టే ఏ చర్యలకైనా మనిషి సంక్షేమమే అంతిమ లక్ష్యం కావాలి. అప్పుడే అవి ఫలిస్తాయి’’ అని మోదీ సూచించారు. ‘‘నమస్కారం. ప్రపంచ మానవాళిలో ఆరో వంతుకు సమానమైన 140 కోట్ల మంది భారతీయుల తరఫున వారి గళాన్ని విని్పస్తున్నా’’ అంటూ సాగిన ఐదు నిమిషాల ప్రసంగాన్ని పలు దేశాధినేతలు హర్షధ్వానాలతో స్వాగతించారు. ఉగ్రవాదం పెనుముప్పు ఉగ్రవాదం ప్రపంచ శాంతికి, భద్రతకు పెను ముప్పుగా పరిణమించిందని మోదీ అన్నారు. మరోవైపు సైబర్, స్పేస్, మారిటైమ్ క్రైమ్ పెను సవాళ్లు విసురుతున్నాయని అభిప్రాయపడ్డారు. ‘‘వీటిని సమూలంగా రూపుమాపాలంటే కేవలం మాటలు చాలవు. నిర్దిష్ట కార్యాచరణతో ప్రపంచ దేశాలన్నీ కలిసి రావాలి. అలాగే సాంకేతిక పరిజ్ఞానాన్ని బాధ్యతాయుతంగా, సురక్షితంగా వినియోగించుకునేలా అంతర్జాతీయ స్థాయిలో నియంత్రణ వ్యవస్థ రావాలి’’ అని పిలుపునిచ్చారు. ‘‘మానవాళి సంక్షేమానికి ఆహార, ఆరోగ్య భద్రతకు దేశాలు ప్రాధాన్యమివ్వాలి. సంక్షేమ, సుస్థిరాభివృద్ధి పథకాల ద్వారా 25 కోట్ల మంది భారతీయులను పేదరికం నుంచి విముక్తం చేశాం. వాటిని మిగతా దేశాలతో పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అన్నారు. గాడిన పెట్టేందుకే: గుటెరస్ ప్రారం¿ోపన్యాసం చేసిన ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలపై మోదీ అభిప్రాయాలతో ఏకీభవించారు. వాటిని బాధ్యతాయుతంగా, నిష్పాక్షికంగా, ప్రభావశీలంగా తీర్చిదిద్దాల్సిన అవసరముందన్నారు. ఐరాస భద్రతా మండలిని కాలం చెల్లిన వ్యవస్థగా అభివరి్ణంచారు! సరైన సంస్కరణలతో పనితీరును సరి చేసుకోకుంటే దాని విశ్వసనీయత అడుగంటడం ఖాయమని హెచ్చరించారు. ఘర్షణలకు ముగింపు కనుచూపు మేరలో కని్పంచడం లేదంటూ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘పట్టాలు తప్పుతున్న ప్రపంచాన్ని దారిన పెట్టేందుకు కఠిన నిర్ణయాలను, చర్యలను సూచించడమే లక్ష్యంగా సదస్సు జరిగింది’’ అన్నారు. మెరుగైన ప్రపంచ భవిష్యత్తు కోసం చేపట్టాల్సిన చర్యలతో కూడిన ఒప్పందాన్ని సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది. సమగ్రాభివృద్ధి, అంతర్జాతీయ శాంతిభద్రతలు, శాస్త్ర సాంకేతికత, యువత, భావి తరాలు, అంతర్జాతీయంగా పాలన తీరుతెన్నుల్లో మెరుగైన మార్పులపై ఒప్పందం దృష్టి సారించింది.పాలస్తీనా అధ్యక్షునితో భేటీ పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్‌తో మోదీ భేటీ అయ్యారు. గాజాలో మానవతా సంక్షోభం పట్ల తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. పాలస్తీనా ప్రజలకు భారత్ అండగా నిలుస్తుందని పునరుద్ఘాటించారు. కువైట్ రాకుమారుడు షేక్ సబా ఖలీద్ అల్ సబా, నేపాల్ ప్రధాని కె.పి.శర్మ ఓలి తదితరులతో కూడా మోదీ సమావేశమయ్యారు. -
గ్లేసియర్ టూరిజం... ప్రాణాంతకం!
తెల్లని రంగులో మెరిసిపోతూ చూడగానే మనసుకు హాయిగొలిపే హిమానీ నదాలు (గ్లేసియర్స్) మనసును ఇట్టే ఆకర్షిస్తాయి. వాటికి సమీపంలోకి వెళ్లాలని, మంచును బంతులుగా చేసి ఆడుకోవాలని, మంచు ముద్దలతో గుహలాగా చేసుకొని అందులో సేదదీరాలని పర్యాటకులు ఆరాటపడుతుంటారు. అందుకే గ్లేసియర్ టూరిజానికి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంది. గ్లేసియర్స్ ఉన్న దేశాలకు ఈ పర్యాటకంతో భారీ ఆదాయం లభిస్తోంది. హిమానీనదాలను ప్రత్యక్షంగా చూసేందుకు జనం పోటెత్తుతున్నారు. అయితే ఆనందం మాటున విషాదం అన్నట్లుగా గ్లేసియర్ టూరిజం ప్రాణాంతకంగా మారుతోంది. గ్లోబల్ వారి్మంగ్ దెబ్బకు కొన్నేళ్లుగా గ్లేసియర్స్ శరవేగంగా కరిగిపోతుండటం పర్యాటకుల పాలిట శాపమవుతోంది. హిమానీ నదాలను సందర్శించే క్రమంలో కొన్నేళ్లలో పదుల సంఖ్యలో మృతి చెందారు. మంచులో చిక్కి విగత జీవులయ్యారు. వాతావరణాన్ని ముందుగానే అంచనా వేయడానికి ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి ఉన్నా గ్లేసియర్లలో పరిస్థితులు అనూహ్యం. అవి ఎప్పుడు ఎలా మారుతాయో చెప్పలేమని గ్లేసియర్ గైడ్లు అంటున్నారు. ‘‘అప్పటిదాకా రాయిలా స్థిరంగా కనిపించే మంచు క్షణాల్లో కరిగిపోతుంది. ఆ సమయంలో అక్కడు వాళ్లంతా మంచులో కూరుకుపోయి మరణించాల్సిందే’’ అని చెబుతున్నారు...! వాతావరణ మార్పులతో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఫలితంగా ధ్రువాల్లో మంచు కరిగిపోతోంది. భూమిపై ఉన్న మొత్తం గ్లేసియర్లలో 2100 నాటికి సగం అంతరించిపోతాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఇప్పటికే అవి చాలావరకు కరిగిపోయాయి కూడా. అందుకే సాహసికులు త్వరపడుతున్నారు. గ్లేసియర్లను సందర్శించడం చాలామందికి ఒక కల. దాన్ని నిజం చేసుకోవడానికి ధ్రువపు ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. గ్లేసియర్ పర్యాటకాన్ని ‘లాస్ట్–చాన్స్ టూరిజం’గా భావిస్తున్నట్టు యూనివర్సిటీ ఆఫ్ ఒట్టావా అసోసియేట్ ప్రొఫెసర్ జాకీ డాసన్ చెప్పారు. కరిగే మంచు.. పెను ముప్పు సాధారణంగా ఎండాకాలంలోనే గ్లేసియర్ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్టు నిపుణులు గుర్తించారు. గ్లేసియర్ల ఉపరితలంపై మంచు కరుగుతుండడంతో వాటిపై ఒత్తిడి పెరుగుతోంది. దాంతో ముక్కలుగా విచి్ఛన్నమవుతున్నాయి. స్థిరంగా ఉన్న గ్లేసియర్ కంటే కరుగుతున్నవి మరింత ప్రమాదకరం. వాటికి దూరంగా ఉండాలని అసోసియేషన్ ఆఫ్ ఐస్లాండ్ మౌంటెయిన్ గైడ్స్ ప్రతినిధి గరార్ సిగుర్‌జాన్సన్ చెప్పారు. కొన్నేళ్ల క్రితం వరకు గ్లేసియర్లపై సమ్మర్ స్కీయింగ్‌కు జనం అమితాసక్తి చూపేవారు. ప్రమాదాల నేపథ్యంలో వేసవి కాలంలో స్కీయింగ్ను చాలా దేశాలు రద్దు చేశాయి. ప్రమాదాలు, మరణాల పెరుగుతున్నా పర్యాటకుల సంఖ్య తగ్గడం లేదు! ఎన్నెన్ని విషాదాలో...! → 2019లో అలాస్కాలోని వాల్డెజ్ గ్లేసియర్‌లో చిక్కుకొని ముగ్గురు పర్యాటకులు మరణించారు. వీరిలో ఇద్దరు జర్మన్లు, ఒకరు ఆ్రస్టేలియన్. → 2018లో అలాస్కా గ్లేసియర్లలో రెండు ప్రమాదాల్లో 32 ఏళ్ల మహిళ, ఐదేళ్ల బాలుడు చనిపోయారు. → 2022 జూలైలో ఉత్తర ఇటలీలో మార్మోలడా గ్లేసియర్ నుంచి 64 వేల మెట్రిక్ టన్నుల మంచు, నీరు, రాళ్లు విరిగిపడ్డాయి. మంచు మొత్తం నదిలా పారుతూ దిగువన పర్యాటకులను ముంచెత్తింది. దాంతో 11 మంది మరణించారు. → 2023లో ఐస్లాండ్లోని ఓ గ్లేసియర్‌లో మంచు గుహ హఠాత్తుగా కుప్పకూలడంతో అమెరికన్ టూరిస్టు మృతి చెందాడు. ఇది ఐస్లాండ్లో సంచలనం సృష్టించింది. గ్లేసియర్ టూరిజం సంస్థలు వేసవిలో ఐస్ కేవ్ టూర్లను నిలిపేశాయి. పర్యాటకుల భద్రతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ITGC Thwaites Glacier: ‘ప్రళయ’ గ్లేసియర్తో... విలయమే!
మనిషి అత్యాశ భూమి మనుగడకే ఎసరు పెట్టే రోజు ఎంతో దూరం లేదని మరోసారి రుజువైంది. గ్లోబల్ వారి్మంగ్ దెబ్బకు అంటార్కిటికాలోని ‘డూమ్స్‌డే’ గ్లేసియర్ ఊహించిన దానికంటే శరవేగంగా కరిగిపోతోందట. అది మరో 200 ఏళ్లలోపే పూర్తిగా కరగడం ఖాయమని తాజా అంతర్జాతీయ అధ్యయనం ఒకటి కుండబద్దలు కొట్టింది. ‘‘అప్పుడు సముద్రమట్టాలు కనీసం పదడుగుల దాకా పెరిగిపోతాయి. అమెరికా నుంచి ఇంగ్లాండ్ దాకా, బంగ్లాదేశ్ నుంచి పసిఫిక్ దీవుల దాకా ప్రపంచమంతటా తీర ప్రాంతాలన్నీ నీటమునుగుతాయి. తీరప్రాంత మహానగరాలన్నీ కనుమరుగైపోతాయి. పైగా మనం అంచనా కూడా వేయలేనన్ని మరిన్ని దారుణ ఉత్పాతాలకు కూడా ఈ పరిణామం దారితీస్తుంది’’ అని స్పష్టం చేసింది. 2018 నుంచి ఆ గ్లేసియర్ కరుగుదల తీరుతెన్నులను ఆరేళ్లపాటు లోతుగా పరిశీలించిన మీదట ఈ నిర్ధారణకు వచి్చంది. ‘‘శిలాజ ఇంధనాల వాడకాన్ని పూర్తిగా ఆపేయడం వంటి చర్యలతో గ్లోబల్ వారి్మంగ్‌కు ఇప్పటికిప్పుడు ఏదోలా అడ్డుకట్ట వేసినా లాభమేమీ ఉండకపోవచ్చు. ఈ గ్లేసియర్ కరుగుదల రేటును తగ్గించడం ఇక దాదాపుగా అసాధ్యమే’’ అని గురువారం విడుదల చేసిన నివేదికలో హెచ్చరించింది! అంటార్కిటికాలో థ్వైట్స్ గ్లేసియర్ విస్తృతిలో ప్రపంచంలోనే అతి పెద్దది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం సైజులో ఉంటుంది. ఇది కరిగితే సముద్ర మట్టాలు ప్రమాదకర స్థాయిలో పెరిగి ప్రపంచ మానవాళి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తాయి. దాంతో సైంటిస్టులు దీన్ని డూమ్స్‌డే (ప్రళయకాల) గ్లేసియర్‌గా పిలుస్తుంటారు. అందుకే ‘ఇంటర్నేషనల్ థ్వైట్స్ గ్లేసియర్ కొలాబరేషన్’ పేరిట దిగ్గజ సైంటిస్టులంతా బృందంగా ఏర్పడి 2018 నుంచీ దీని కరుగుదల తీరుతెన్నులను నిశితంగా పరిశీలిస్తూ వస్తున్నారు. ఇందుకు ఐస్ బ్రేకింగ్ షిప్పులు, అండర్‌వాటర్ రోబోలను రంగంలోకి దించారు. ఐస్ఫిన్ అనే టార్పెడో ఆకారంలోని రోబోను ఐస్‌బర్గ్ అడుగుకు పంపి పరిశోధించారు. అది అత్యంత ప్రమాదకరమైన వేగంతో కరిగిపోతూ వస్తోందని తేల్చారు. నివేదికలోని ముఖ్యాంశాలు... → డూమ్స్‌డే గ్లేసియర్ కరగడం 1940 నుంచీ క్రమంగా ఊపందుకుంది. గత 30 ఏళ్లుగా శరవేగంగా కరిగిపోతోంది. అది ఈ శతాబ్దంలో ఊహాతీతంగా పెరిగిపోనుంది. → మరో 200 ఏళ్లలోపే గ్లేసియర్ తాలూకు మంచుపొరలన్నీ కుప్పకూలి కరగడం ఖాయం. ఫలితంగా వచ్చి కలిసే నీటి దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా సముద్రమ ట్టం కనీసం రెండడుగులు పెరుగుతుంది. → అంటార్కిటికాలోని విస్తారమైన మంచు పలకల సమూహాన్ని కరగకుండా పట్టి ఉంచేది డూమ్స్‌డే గ్లేసియరే. కనుక దానితో పాటే ఆ భారీ మంచు పలకలన్నీ కరిగి సముద్రంలో కలుస్తాయి. దాంతో సముద్రమట్టం ఏకంగా పదడుగులకు పైగా పెరిగిపోతుంది. → డూమ్స్‌డే గ్లేసియర్ వాలుగా ఉంటుంది. దాంతో అది కరుగుతున్న కొద్దీ అందులోని మంచు వెచ్చని సముద్ర జలాల ప్రభావానికి మరింతగా లోనవుతూ వస్తుంది. వెచ్చని జలాలు గ్లేసియర్ అడుగుకు చొచ్చుకుపోతున్నాయి. దాంతో అది కరిగే వేగం మరింతగా పెరుగుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గాలి నిండా మీథేన్!
పర్యావరణానికి ప్రధాన శత్రువు మనిషేనని మరోసారి రుజువైంది. శిలాజ ఇంధనాల వాడకం, పారిశ్రామికీకరణ వంటి మానవ కార్యకలాపాల వల్ల 20 ఏళ్లలోనే ఏకంగా 67 కోట్ల టన్నుల మేరకు ప్రమాదకర మీథేన్ వాయువు వాతావరణంలోకి విడుదలైందట. స్టాన్‌ఫర్డ్ వర్సిటీ సైంటిస్టుల తాజా అధ్యయనంలో తేలిన చేదు నిజమిది. ఈ దెబ్బకు పారిశ్రామికీకరణకు ముందు నాటితో పోలిస్తే గాలిలో మీథేన్ పరిమాణం ఏకంగా 2.6 రెట్లు పెరిగిపోయిందని ఆ నివేదిక పేర్కొంది. పైగా, ‘‘ఇవి 2020 నాటి గణాంకాల ఆధారంగా వేసిన లెక్కలు. ఈ నాలుగేళ్లలో పరిస్థితి మరింత దిగజారింది’’ అంటూ హెచ్చరించింది... 2000 నుంచి కొన్నాళ్ల పాటు వాతావరణంలో మీథేన్ పెరుగుదల కాస్త అదుపులోనే ఉంటూ వచ్చింది. కానీ ఆ తర్వాత పలు దేశాలు శిలాజ ఇంధనాల ఉత్పత్తి, వాడకాలను విచ్చలవిడిగా పెంచేయడంతో ప్రమాదకర స్థాయిలో పెరుగుతూ వస్తోంది. బొగ్గు, చమురు, సహజవాయువు తదితరాల వెలికితీత, వాడకం వల్ల వెలువడుతున్న మీథేన్ పరిమాణం గత 20 ఏళ్లలో ఏకంగా 33 శాతం పెరిగిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అలాగే వ్యర్థాలు తదితరాల నుంచి మీథేన్ విడుదలవుతున్న 20 శాతం, వ్యవసాయం వల్ల మరో 14 శాతం పెరిగిందని అధ్యయనం తేలి్చంది! ‘ప్రపంచం పెద్దగా పట్టించుకోవడం లేదు గానీ, వాతావరణంలో పెరిగిపోతున్న మీథేన్ పరిమాణం పర్యావరణానికి పెద్ద విపత్తుగా పరిణమిస్తోంది’ అని అధ్యయనానికి సారథ్యం వహించిన గ్లోబల్ కార్బన్ ప్రాజెక్ట్ హెడ్, స్టాన్‌ఫర్డ్ వర్సిటీలో పర్యావరణ శాస్త్రవేత్త రాబ్ జాక్సన్ హెచ్చరించారు. ఈ ప్రాజెక్టు గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను ఎప్పటికప్పుడు గమనిస్తుంటుంది. ‘‘2000 సంవత్సరంలో వాతావరణంలోని మొత్తం మీథేన్ పరిమాణంలో మనిషి వాటా 60 శాతంగా ఉండేది. ఇప్పుడది ఎకాయెకి 65 శాతానికి పెరిగింది. భూ వాతావరణంలో మీథేన్ పెరుగుదల కార్బన్ డయాక్సైడ్ (సీఓటూ) కంటే చాలా ఎక్కువగా నమోదవుతోంది. 2015లోనైతే వాతావరణంలో మీథేన్ సాంద్రత గత 80 లక్షల ఏళ్లలో ఎన్నడూ లేనంత భారీగా నమోదైంది! వాతావరణంలో వేలాది ఏళ్లపాటు ఉండిపోయే సీఓటూతో పోలిస్తే మీథేన్ ఉండేది 12 ఏళ్లే అయినా అది కలగజేసే నష్టం మాత్రం ఎక్కువ. ఎందుకంటే పర్యావరణానికి సీఓటూ కంటే మీథేన్ 82 రెట్లు ఎక్కువ నష్టం చేస్తుంది’’ అని జాక్సన్ వివరించారు. ‘‘మీథేన్, సీఓటూ ఉద్గారాలు ఇలాగే కొనసాగితే 2050 నాటికి ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు ఏకంగా 3 డిగ్రీలకు మించి పెరిగిపోతాయి. అది వినాశనానికి దారితీస్తుంది’’ అని ఆందోళన వెలిబుచ్చారు. ఈ అధ్యయన ఫలితాలు ‘ఎని్వరాన్మెంటల్ రీసెర్చ్ లెటర్స్’లో మంగళవారం ప్రచురితమయ్యాయి.కాగితాల్లోనే లక్ష్యం...మీథేన్ ముప్పుపై అంతర్జాతీయ వేదికలపై ఎన్నోసార్లు చర్చోపచర్చలు జరిగాయి. పర్యావరణ శాస్త్రవేత్తల వరుస ఆందోళనల ఫలితంగా 2021లో దేశాలన్నీ దీనిపై లోతుగా చర్చించాయి. వాతావరణంలో మీథేన్ పరిమాణాన్ని తగ్గిస్తామంటూ ప్రతినబూనాయి. ‘గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్’గా పిలిచే ఒప్పందంపై 100కు పైగా దేశాలు సంతకాలు చేశాయి. మీథేన్ ఉద్గారాలను 2030 నాటికి 30 శాతానికి పైగా తగ్గించాలన్నది దీని లక్ష్యం. ఫలితంగా 2050 నాటికి గ్లోబల్ వార్మింగ్‌లో 0.2 డిగ్రీ సెల్సియస్ మేరకు తగ్గుదల నమోదవుతుందని అంచనా. కానీ ఆచరణలో ఏ దేశమూ చేసింది పెద్దగా ఏమీ లేకపోవడంతో ఈ లక్ష్యం కాగితాలకే పరిమితమైంది. – సాక్షి, నేషనల్ డెస్క్ మీథేన్‌తో పెను ప్రమాదమే⇒ ఏటా 5.8 కోట్ల టన్నుల మీథేన్ వాతావరణంలోకి విడుదలవుతోందని అంచనా. ఇందులో మనిషి వాటాయే ఏకంగా 60 శాతం. ⇒ వ్యవసాయం, శిలాజ ఇంధనాల వెలికితీత, వాటి వాడకం తదితరాల వల్ల 60 శాతం మీథేన్ విడుదలవుతోంది. ⇒ అమెరికాలో కేవలం గ్యాస్ డ్రిల్లింగ్ కారణంగా 2005 నుంచి ఇప్పటిదాకా ఏకంగా 1.17 కోట్ల టన్నుల మీథేన్ విడుదలై ఉంటుందని అంచనా! ⇒ గాల్లో మీథేన్ పరిమాణం పెరిగితే వచ్చే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ⇒ గ్లోబల్ వార్మింగ్‌కు ప్రధాన కారణమైన గ్రీన్‌హౌజ్ వాయు ఉద్గారాల్లో మీథేన్దే పెద్ద వాటా. ⇒ పారిశ్రామికీకరణ అనంతరం గత 150 ఏళ్లలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు ప్రమాదకరంగా పెరిగిపోతుండటం తెలిసిందే. అందులో మూడో వంతు పెరుగుదల మీథేన్ వల్లే సంభవిస్తోంది! ⇒ వాతావరణంలోని వేడిని మీథేన్ నిర్బంధించి దాన్ని తిరిగి భూమిపైకే పంపుతుంది. మరోలా చెప్పాలంటే భూ ఉపరితలంపై ఓజోన్ పొరలాంటి దాన్ని ఏర్పరుస్తుంది. అలా భూ ఉష్ణోగ్రతలు పైకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. తద్వారా పర్యావరణం నానాటికీ వేడెక్కుతోంది. ⇒ వాయు నాణ్యతను కూడా మీథేన్ బాగా దెబ్బ తీస్తుంది. దాంతో మనుషులతో పాటు జంతువుల్లో కూడా శ్వాసకోశ సంబంధిత సమస్యలు పెరుగుతాయి. ⇒ పర్యావరణానికి కార్బన్ డయాక్సైడ్ కంటే మీథేన్ వల్ల జరిగే నష్టం ఏకంగా 82 రెట్లు ఎక్కువ! ⇒ తాజా అధ్యయనం కేవలం 2020 నాటికి అందులో ఉన్న డేటా ఆధారంగా చేసినదే. ఈ నాలుగేళ్లలో మీథేన్ ప్రభావం మరింత వేగంగా పెరుగుతూ వస్తోందన్నది పర్యావరణవేత్తల మాట. తక్షణం దిద్దుబాటు చర్యలు తప్పవని వారంటున్నారు.భూ సగటు ఉష్ణోగ్రతల పెరుగుదలను అంతర్జాతీయంగా అంగీకరించిన 1.5 డిగ్రీ సెల్సియస్ స్థాయికి పరిమితం చేయాలంటే సీఓటూ ఉద్గారాలను సగానికి, మీథేన్ ఉద్గారాలను మూడో వంతుకు తగ్గించాలి. ఈ దిశగా తక్షణ కార్యాచరణ అత్యవసరం – బిల్ హేర్, క్లైమేట్ అనలిటిక్స్ సీఈఓ, పర్యావరణ శాస్త్రవేత్త -
వాతావ'రణం'
సాక్షి, అమరావతి: వాతావరణ మార్పులు మానవ జీవనాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి. కట్టుబట్టలతో ఆవాసాలను వదులుకుని వలసలు పట్టాల్సిన దుస్థితిలోకి నెట్టేస్తున్నాయి. భారతదేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరు గ్లోబల్ వార్మింగ్ దుష్ప్రభావాల బారిన పడుతున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలు,, అనావృష్టి, సముద్ర మట్టం పెరుగుదల, వరదలు, ఇతర కాలుష్యాల విపత్తుల కారణంగా ఉన్న ప్రాంతాలను వదులుకుని వలస దారులు వెతుక్కుంటున్నారు. 2019లో దాదాపు 50 లక్షల మంది దేశంలో వివిధ ప్రదేశాల్లో తలదాచుకున్నట్టు గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ నివేదిక పేర్కొంది. 2050 నాటికి 4.50 కోట్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యే అవకాశం ఉందని క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్ – దక్షిణాసియా నివేదిక తాజాగా ప్రకటించడం ఆందోళన కలిగిస్తోంది. 2021 – 22 నుంచి దేశంలో గ్లోబల్ వార్మింగ్ 11 శాతం పెరిగిందని అమెరికాలోని కొలరాడోకు చెందిన యేల్ ప్రోగ్రామ్ ఆన్ క్లైమేట్ కమ్యూనికేషన్ రిసెర్చ్ సంస్థ ప్రకటించింది. గ్లోబల్ వార్మింగ్ వల్ల కలిగే నష్టాలు ఇవి.. » విపరీతమైన వేడి, కరువు, సముద్ర మట్టం పెరుగుదల, వరదలు వంటి వాతావరణ మార్పుల కారణంగా వలసలు పెరుగుతాయి. » వ్యవసాయం దెబ్బతినడంతో దేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు వేరే ప్రాంతాలకు వలస పోతారు. » మొక్కలు, జంతు జాతులకు ముప్పు వాటిల్లుతుంది. » తీవ్రమైన వేడి తరంగాలు వంటి పర్యావరణ ప్రమాదాలు తలెత్తుతాయి.» ముఖ్యంగా ప్రజల జీవనానికి కరువు, నీటి కొరత, తీవ్రమైన వాయు కాలుష్యం, తీవ్రమైన తుపానులు, వరదలు ఆటంకం కలిగిస్తాయి.» వాతావరణ విపత్తులతో వలసల ప్రభావం మహిళలపై తీవ్రంగా పడుతోంది. కుటుంబంలోని పురుషుడు వలస వెళ్ళినప్పుడు స్త్రీలు వ్యవసాయం, కుటుంబ సభ్యుల సంరక్షణ బాధ్యతలో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. » కుటుంబాలతో సహా వలస వెళ్లిన వారు సొంత భూమితో సంబంధాన్ని కోల్పోతున్నారు. భారత్ సహా దక్షిణాసియాకు ప్రమాద ఘంటికలువాతావరణ ప్రేరిత వలసలు దక్షిణాసియాను కుదిపేస్తున్నాయి. ప్రజల కష్టాలను పెంచి వలసలకు దారితీస్తున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. బంగ్లాదేశ్‌లో నదులు కోతకు గురవుతున్నాయి. పాకిస్తాన్, భారతదేశంలో వరదలు పోటెత్తుతున్నాయి. నేపాల్‌లో హిమానీ నదాలు కరుగుతున్నాయి. ఫలితంగా భారత్, బంగ్లాదేశ్‌లలో సముద్ర మట్టాలు పెరిగి తీర ప్రాంత ప్రజలు ఆవాసాలు కోల్పోవాల్సి వస్తోంది. శ్రీలంకలోని వరి, టీ ఎస్టేట్లపై సాధారణంకంటే భారీ వర్షాలు, తుఫానులు విరుచుకుపడటంతో ప్రజల మనుగడకు ముప్పు వాటిల్లుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రత భారత్‌లోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్‌ను దాటుతోంది. మానవుల వల్ల కలిగే గ్లోబల్ వార్మింగ్ దశాబ్దానికి 0.26 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. గత దశాబ్దంలో ఉష్ణోగ్రత 1.14 డిగ్రీల నుంచి 1.19 డిగ్రీల సెల్సియస్ పెరిగింది. గత ఏడేళ్లలో భారత తలసరి బొగ్గు ఉద్గారాలు 29% పెరిగాయి. వాతావరణంలో వస్తున్న ఈ మార్పులు ప్రజల జీవన విధానాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. -
టీచరమ్మగా రాష్ట్రపతి
న్యూఢిల్లీ: దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము టీచర్‌గా మారారు. రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టి రెండేళ్లయిన సందర్భంగా గురువారం ఆమె విద్యార్థులతో ముచ్చటించారు. భూతాపం పర్యవసానాలు, తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలను వారికి వివరించారు. ప్రెసిడెంట్ ఎస్టేట్‌లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయలో 9వ తరగతి చదువుకునే 53 మంది విద్యార్థులతో ఆమె సంభాషించారు. మొక్కల పెంపకం, వాననీటి సంరక్షణ అవసరాన్ని తెలియజెప్పారు. ముఖాముఖి సందర్భంగా వారి ఆకాంక్షలు, లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. చదువుకుని వైద్యులు, శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఉందంటూ వారు చెప్పిన లక్ష్యాలను విని సంతోషం వ్యక్తం చేశారు. ‘ప్రపంచవ్యాప్తంగా నేడు శాస్త్రవేత్తలు, పాలనాధికారులు, పాలకులు సభలు, చర్చాగోషు్టలు, సమావేశాలు చేపట్టి ఓ పెద్ద సమస్యపై చర్చలు జరుపుతున్నారు. అదేమిటో మీకు తెలుసా?’అని వారినడిగారు. వాతావరణ మార్పులు, భూతాపం, పర్యావరణ కాలుష్యం..అంటూ విద్యార్థులు బదులిచ్చారు. రాష్ట్రపతి ముర్ము బదులిస్తూ..‘ఇది వరకు ఏడాదిలో ఆరు రుతువులుండేవి కానీ, నేడు నాలుగే ఉన్నాయి. వీటిలో అత్యధిక కాలం కొనసాగుతూ మనల్ని ఇబ్బంది పెట్టే రుతువు ఎండాకాలం. రోజురోజుకూ ఎండలు మండిపోతుండటంతో మనుషులే కాదు, జంతువులు, మొక్కలు, పక్షులూ ఇబ్బంది పడుతున్నాయి. కరువులు కూడా ఏర్పడుతున్నాయి. భూతాపమే వీటికి కారణం’అని ఆమె వివరించారు. ‘భూతాపాన్ని ఎదుర్కోవాలంటే నీటిని పొదుపుగా వాడాలి. వర్షం నీటిని సంరక్షించాలి. చెట్లను విరివిగా పెంచాలి’అని వారికి సూచించారు. -
IPE Global: డేంజర్ మార్కు దాటేస్తున్న... భుగభుగలు
ఈ వేసవిలో ఉత్తర భారతమంతా కనీవిని ఎండలతో తల్లడిల్లిపోయింది. ఢిల్లీలో ఏకంగా 40 రోజుల పాటు 40 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు పై చిలుకు ఉష్ణోగ్రతలు నమోదై జనాలను బెంబేలెత్తించాయి. అలస్కాలో హిమానీ నదాలు ఇటీవలి కాలంలో వేసిన అంచనాలను కూడా మించి శరవేగంగా కరిగిపోతున్నట్టు తాజా అధ్యయనాలు తేల్చాయి. భూగోళానికి ఊపిరితిత్తులుగా చెప్పే అమెజాన్ సతత హరిత అరణ్యాలే క్రమంగా ఎండిపోతున్నాయి. ఎన్నడూ లేనంతగా కార్చిచ్చుల బారిన పడుతున్నాయి.సౌదీ అరేబియాలో ఏకంగా 50 డిగ్రీలు దాటేసిన ఎండలకు తాళలేక 1,300 మందికి పైగా మరణించారు. ఈ ఉత్పాతాలన్నీ సూచిస్తున్నది ఒక్కటే. భూగోళం శరవేగంగా విపత్కర పరిస్థితుల్లోకి వెళ్తోంది. వాతావరణ మార్పుల ప్రభావం శాస్త్రవేత్తల అంచనాలకు కూడా అందనంత దారుణ ప్రభావం చూపుతోంది. భూతాపం ఈ శతాబ్దంలోనే ఏకంగా 2.5 డిగ్రీలకు పైగా పెరిగి మొత్తం మానవాళినే వినాశనం వైపు నెట్టడం ఖాయమని వందలాది మంది ప్రపంచ ప్రఖ్యాత వాతావరణ నిపుణులు, శాస్త్రవేత్తలు ముక్త కంఠంతో హెచ్చరిస్తున్నారు! పారిశ్రామికీకరణ ముందు స్థాయితో పోలిస్తే భూతాపం ఇప్పటికే 1.2 డిగ్రీ సెంటీగ్రేడ్ మేరకు పెరిగింది. అది 1.5 డిగ్రీలను దాటితే ఊహించని ఉత్పాతాలు తప్పవని సైంటిస్టులు ఎప్పటినుంచో మొత్తుకుంటున్నారు. అలాంటిది, ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఈ శతాబ్దాంతానికే భూతాపంలో పెరుగుదల 2.5 డిగ్రీల డేంజర్ మార్కును దాటేయడం ఖాయమని ప్రపంచ వాతావరణ సంస్థ నిర్వహించిన తాజా అంతర్జాతీయ సర్వే తేలి్చంది. ఎండాకాలంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కనీవినీ ఎరగని విపరిణామాలు తదితరాలను పరిగణనలోకి తీసుకున్న మీదట ఈ అంచనాకు వచి్చంది. గత ఏడాది కాలంగా ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు ప్రతి నెలా రికార్డులు బద్దలు కొట్టాయి. ఈ ఏడాది సంభవించిన ఎల్‌నినో ఇప్పటిదాకా నమోదైన ఐదు అత్యంత శక్తిమంతమైన ఎల్ నినోల్లో ఒకటిగా నిలిచింది. శిలాజ ఇంధనాల వాడకం తదితరాల వల్ల జరుగుతున్న భారీ కాలుష్యం వంటివి వీటికి తోడవుతున్నాయి. గ్లోబల్ వారి్మంగ్‌లో మూడొంతులు కేవలం కార్బన్ డయాక్సైడ్ (సీఓటూ) ఉద్గారం వల్లనే జరుగుతోంది. వాతావరణంలో సీఓటూ స్థాయి పెరుగుతున్న కొద్దీ వేడి గాలులు, హరికేన్లు, కార్చిచ్చులు, వరదలు వచి్చపడుతున్నాయి. గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల్లో చైనా, అమెరికా, భారత్ టాప్ 3లో ఉన్నాయి. అయితే గ్లోబల్ వార్మింగ్‌కు ప్రధానంగా సంపన్న దేశాలే కారణమని ఐపీఈ గ్లోబల్ క్లైమేట్ చేంజ్ హెడ్ అబినాశ్ మహంతీ చెప్పుకొచ్చారు. ఆ దేశాల్లో గత రెండు శతాబ్దాలుగా జరిగిన మితిమీరిన పారిశ్రామికీరణ పర్యావరణానికి చెప్పలేనంత చేటు చేసిందని వివరించారు. ‘‘ఇప్పుడు కూడా సంప్రదాయేతర ఇంధనాల వాడక తదితరాల ద్వారా గ్లోబల్ వారి్మంగ్‌కు అడ్డుకట్ట వేస్తామన్న పెద్ద దేశాల ప్రకటనలు మాటలకే పరిమితమవుతున్నాయి. ఫలితంగా భరించలేని ఎండలు, ఆ వెంటే వరదలు, హరికేన్ల వంటి ఉత్పాతాలు కొన్నేళ్లుగా సాధారణ పరిణామంగా మారిపోతున్నాయి. ఇవన్నీ ప్రమాద సూచికలే’’ అని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మేల్కొని గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలకు అడ్డుకట్ట వేయకపోతే పరిస్థితి చేయి దాటిపోయే రోజు ఎంతో దూరంలో లేదని హెచ్చరిస్తున్నారు. ఉత్తరాదిన పాతాళానికి భూగర్భ జలాలు20 ఏళ్లలో 450 క్యుబిక్ కి.మీ. మేరకు మాయంఉత్తర భారతదేశంలో భూగర్భ జల వనరులు శరవేగంగా అడుగంటుతున్నాయి! ఎంతగా అంటే, 2002 నుంచి 2021 మధ్య కేవలం 20 ఏళ్లలోనే కంగా 450 క్యుబిక్ కిలోమీటర్ల మేర భూగర్భ జలాలు లుప్తమైపోయినట్టు ఐఐటీ గాం«దీనగర్ తాజా సర్వే తేల్చింది. దేశంలోకెల్లా అతి పెద్ద జలాశయమైన ఇందిరా సాగర్ మొత్తం నీటి పరిమాణానికి ఇది ఏకంగా 37 రెట్లు ఎక్కువని సర్వేకు సారథ్యం వహించిన ఐఐటీ గాం«దీనగర్ సివిల్ ఇంజనీరింగ్, ఎర్త్ సైన్సెస్ విభాగంలో విక్రం సారాబాయి చైర్ ప్రొఫెసర్ విమల్ మిశ్రా వివరించారు! అందుబాటులో ఉన్న సంబంధిత గణాంకాలతో పాటు శాటిలైట్ డేటా తదితరాలను విశ్లేíÙంచి ఈ మేరకు తేలి్చనట్టు తెలిపారు. వాతావరణ మార్పుల ప్రభావం ఇలాగే కొనసాగితే ఈ ధోరణి మరింతగా ఊపందుకుంటుందని హెచ్చరించారు. ‘‘ఉత్తరాదిన గత 75 ఏళ్లలో వర్షపాతం ఇప్పటికే 8.5 శాతం తగ్గిపోయింది. వాతావరణం 0.5 డిగ్రీల మేరకు వేడెక్కింది. దాంతో సాగునీటికి డిమాండ్ అమాంతంగా పెరిగిపోయి విచ్చలవిడిగా బోర్లు పుట్టుకొచ్చాయి. దాంతో కనీసం భూగర్భ జల వనరులు 12 శాతం తగ్గిపోయాయి’’ అని మిశ్రా వెల్లడించారు. ఒక్క 2009లోనే వర్షాకాలంలో అల్ప వర్షపాతం, చలికాలంలో హెచ్చు ఉష్ణోగ్రతల దెబ్బకు ఉత్తరాదిన భూగర్భ జలాలు 10 శాతం మేర తగ్గిపోయాయని అంచనా! ‘‘గ్లోబల్ వారి్మంగ్ మరింత పెరిగే సూచనలే ఉన్నందున భూగర్భ జలాలు ఇంకా వేగంగా ఎండిపోయేలా ఉన్నాయి. ఎలా చూసినా ఇవన్నీ ప్రమాద సంకేతాలే. ఉత్తర భారత దేశంలో ఉష్ణోగ్రతలు గనుక 1 నుంచి 3 డిగ్రీల మేరకు పెరిగితే భూగర్భ జలాలు మరో 10 శాతం దాకా తగ్గిపోతాయి’’ అంటూ సర్వేలో పాల్గొన్న హైదరాబాద్ ఎన్జీఆర్ఐ పరిశోధకులు కూడా ఆందోళన వెలిబుచ్చారు. సర్వే ఫలితాలను జర్నల్ ఎర్త్ తదుపరి సంచికలో ప్రచురించనున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మండుతున్న భూగోళం, 29 ఏళ్ల రికార్డు బద్ధలు!
ఉష్ణోగ్రతలు రికార్డులు బద్ధలుకొడుతున్నాయి. ప్రతి ఏడాది రికార్డు స్థాయిలో పెరుగుతూ ప్రజలను ఠారెత్తిస్తున్నాయి. ఒకవైపు పెరుగుతున్న టెంపరేచర్లు, మరోవైపు ముంచెత్తుతున్న భారీ వరదలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. అయితే.. ఇది స్వీయ తప్పిదమే అంటున్నారు నిపుణులు. మానవ తప్పిదాల వల్లే వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయని హెచ్చరిస్తున్నారు.పెను ఉష్ణోగ్రతలు రికార్డులు సృష్టిస్తున్నాయి. గత మే నెల అత్యంత వేడి నెలగా రికార్డు క్రియేట్ చేసింది. అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఎండల తీవ్రత దాదాపు సంవత్సరమంతా కొనసాగింది. ఆయా నెలలకు సంబంధించిన సరాసరి ఉష్ణోగ్రతల్లో రికార్డులు బద్ధలయ్యాయి. ఈ ఏడాది మేలో ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మాగ్జిమమ్ టెంపరేచర్స్ నమోదయ్యాయి. వాతావరణంలో విపరీతమై మార్పుల వల్ల వర్షాలు, వరదలు ముంచెత్తాయి. ఎల్‌నినోతో పాటు.. మానవ తప్పిదాలే వాతావరణ మార్పులకు కారణమంటూ ఐరోపా వాతావరణ సంస్థ కోపర్నికస్ క్లైమెట్ ఛేంజ్ సర్వీసెస్ వెల్లడించింది.ఈ ఏడాది మే నెలలో సరాసరి ఉష్ణోగ్రతలు.. పారిశ్రామికీకరణకు ముందు నాటితో పోలిస్తే 1.52 డిగ్రీల సెల్సియస్ మేర అధికంగా ఉన్నట్లు ఐరోపా వాతావరణ సంస్థ వివరించింది. అయితే ఇది దీర్ఘకాలం పాటు కొనసాగితేనే పారిస్ ఒప్పందంలో పేర్కొన్న 1.5 డిగ్రీల సెల్సియస్ పరిమితిని మించిపోయినట్లు భావిస్తారు. గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది మే మధ్య 12 నెలల సరాసరి భూ ఉష్ణోగ్రతల్లోనూ రికార్డు నమోదైంది. 1991 నుంచి 2020 మధ్యనాటి ఉష్ణోగ్రతలతో పోలిస్తే 0.75 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదయ్యింది. అంటే.. పారిశ్రామికీకరణకు ముందునాటి కంటే ఇది 1.63 డిగ్రీల సెల్సియస్ మేర ఎక్కువ.రాబోయే ఐదేళ్లలో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయనే వార్తలు ప్రజలను భయపెడుతున్నాయి. పారిశ్రామికీకరణకు ముందునాటితో పోలిస్తే వచ్చే ఐదేళ్లలో ఏదో ఒక ఏడాది.. 2023లో నమోదైన ఉష్ణోగ్రతల రికార్డులు బద్ధలవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూతాపంలో పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్ దాటడానికి 80 శాతం మేర అవకాశముందని ఐరోపా వాతావరణ సంస్థ తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదుకావడానికి 86 శాతం అవకాశముందని వివరించింది. 2024-28 మధ్యకాలంలో ప్రపంచ సరాసరి ఉష్ణోగ్రతల్లో పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్ కొనసాగడానికి 47 శాతం అవకాశం ఉందని తెలిపింది. 2023-27 మధ్య కాలంలో ఇందుకు ఒక శాతం మేర అవకాశం ఉందని గత ఏడాది డబ్ల్యూఎంవో ఇచ్చిన నివేదిక వెల్లడించింది. తాజా నివేదిక ప్రకారం.. 1850 నుంచి 1900 మధ్యనాటితో పోలిస్తే 2024 నుంచి 2028 మధ్యకాలంలో భూ ఉపరితలానికి చేరువలోని వాతావరణం సరాసరి ఉష్ణోగ్రత 1.1 నుంచి 1.9 డిగ్రీల సెల్సియస్ మేర అధికంగా ఉండొచ్చని తెలిపింది. -
గ్లోబల్ వార్మింగ్‌పై ఫైటర్.. ది మమ్మోత్
ఏటేటా పెరిగిపోతున్న వాహనాలు, పరిశ్రమలు.. వాటి నుంచి వెలువడే కాలుష్యం గ్లోబల్ వార్మింగ్‌కు కారణమవుతోంది. వాతావరణంలో నిరంతరం పెరిగిపోతున్న కార్బన్డయాక్సైడ్ భూమి వేడెక్కిపోయేందుకు కారణమ వుతోంది. దీనికి పరిష్కారంగానే.. ప్రపంచ దేశాలన్నీ కర్బన ఉద్గారాలను తగ్గించుకోవడంపై ఫోకస్ పెట్టాయి. ప్రతి దేశానికి టార్గెట్లు పెట్టాయి.ఈ క్రమంలోనే ఐస్ ల్యాండ్‌కు చెందిన ‘క్లైమ్ వర్క్స్’ కంపెనీ సరికొత్త ఐడియాతో ముందుకొచ్చింది. కర్బన ఉద్గారాలను తగ్గించడానికి బదులు.. నేరుగా వాతావరణం నుంచి కార్బన్ డయాక్సైడ్ను తొలగించే సరికొత్త సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆ విశేషాలు ఏమిటో చూద్దామా..ఏటా 36 వేల టన్నుల మేర..గాలిలోంచి కార్బన్ డయాక్సైడ్ ను వేరు చేసి.. దానిని నీటితో కలిపి, భూమిలోపలి పొరల్లోకి పంపేలా క్లైమ్ వర్క్స్ కంపెనీ ఓ భారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. దీని సాయంతో ఏటా 36 వేల టన్నుల కార్బన్‌డయాక్సైడ్‌ను గాలిలోంచి తొలగించి.. భూమి పొరల్లోకి పంపేలా నిర్మించింది. ఇది సుమారు 8 వేల డీజిల్ కార్లు ఏడాదంతా తిరిగితే వెలువడేంత కార్బన్‌డయాక్సైడ్‌తో సమానం కావడం గమనార్హం. చూడటానికి ఇది తక్కువే అనిపించినా.. ఇలాంటి ప్లాంట్లు భారీ సంఖ్యలో పెడితే.. గ్లోబల్ వార్మింగ్ సమస్యకు ఒక పరిష్కారంగా పనికొస్తుందని ‘క్లైమ్ వర్క్స్’ సంస్థ చెప్తోంది.దీనిలో నిలువునా గోడల్లా ఏర్పాటు చేసే ప్రత్యేక నిర్మాణాలు ఉంటాయి. వాటిలో ఒకవైపు భారీ ఫ్యాన్లను ఏర్పాటు చేశారు. వాటి వెనకాల చిన్న చాంబర్ ఉంటుంది. అందులో కార్బన్ డయాక్సైడ్ను సంగ్రహించే ఫిల్టర్లు ఉంటాయి.ఫ్యాన్లను ఆన్ చేసినప్పుడు.. అవి వెనకాల చాంబర్ నుంచి గాలిని లాగి.. ముందు వైపునకు వదులుతాయి. ఈ క్రమంలో చాంబర్‌లోని ఫిల్టర్లు కార్బన్ డయాక్సైడ్ను సంగ్రహిస్తాయి.ఫిల్టర్లు కార్బన్ డయాక్సైడ్తో నిండిపోతే.. ఆటోమేటిగ్గా చాంబర్ సీల్ అయిపోతుంది. అందులో చేసిన ప్రత్యేక ఏర్పాట్లతో 100 సెంటిగ్రేడ్ల మేరకు వేడెక్కుతుంది. దాంతో ఫిల్టర్లలోని కార్బన్ డయాక్సైడ్ ఆవిరి అవుతుంది.ఎలా పనిచేస్తుంది?ఈ ఆవిరిని ప్రత్యేక పైపుల ద్వారా భూగర్భంలోకి తరలిస్తారు. ఆ పైపుల్లోకి నీటిని పంపే ఏర్పాట్లు చేస్తారు. దీనితో కార్బన్ డయాక్సైడ్ నీటిలో కరిగి కార్బన్ వాటర్‌గా మారిపోతుంది. భూగర్భంలోకి ఆ కార్బన్ వాటర్ మెల్లగా గడ్డకట్టి రాళ్లుగా తయారవుతుంది.ఈ ప్రక్రియలో ఫ్యాన్ల కోసం, పైపుల ద్వారా కార్బన్ డయాక్సైడ్, నీరు పంపింగ్ చేయడం కోసం వాడే విద్యుత్‌ను ఆ ప్రాంతంలోని జియోథర్మల్ పవర్ ప్లాంట్ నుంచి తీసుకుంటున్నారు.ఇది వేడినీటి బుగ్గల నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్ కాబట్టి.. దాని వినియోగంతో పర్యావరణానికి సమస్యేమీ లేదని ‘క్లైమ్ వర్క్స్’ కంపెనీ ప్రతినిధులు చెప్తున్నారు.అమెరికాలోని లూసియానాలో 2030 నాటికి ఏటా 10 లక్షల టన్నుల కార్బన్‌డయాక్సైడ్‌ను సంగ్రహించగలిగే ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.– సాక్షి సెంట్రల్ డెస్క్ -
Living Planet Index: ఐదో వంతు జీవ జాతులు... అంతరించే ముప్పు
ప్రపంచవ్యాప్తంగా పలు కారణాలతో ఏటా వలస బాట పట్టే అసంఖ్యాక జీవ జాతులపై తొలిసారిగా సమగ్ర అధ్యయనానికి ఐక్యరాజ్యసమితి తెర తీసింది. ఇందులో భాగంగా 1997 ఐరాస ఒప్పందం ప్రకారం రక్షిత జాబితాలో చేర్చిన 1,189 జీవ జాతులను లోతుగా పరిశీలించారు. పరిశోధనలో తేలిన అంశాలను 5,000 పై చిలుకు జీవ జాతుల తీరుతెన్నులను 50 ఏళ్లుగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్), లివింగ్ ప్లానెట్ ఇండెక్స్ సంస్థల గణాంకాల సాయంతో విశ్లేíÙంచారు. విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 22 శాతం జీవ జాతులు అతి త్వరలో పూర్తిగా అంతరించనున్నట్టు తేలింది. మొత్తమ్మీద 44 శాతం జీవ జాతుల సంఖ్య నిలకడగా తగ్గుముఖం పడుతూ వస్తున్నట్టు వెల్లడైంది. ఈ వివరాలతో కూడిన తాజా నివేదికను ఐరాస ఇటీవలే విడుదల చేసింది. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఏకంగా ఐదో వంతు వలస జీవజాతులు అంతరించే ప్రమాదంలో పడ్డాయి. జీవజాతుల వలసలు కొత్తగా మొదలైనవి కావు. అనాదిగా భూమ్మీదా, సముద్రంలోనూ అత్యంత కఠినతరమైన, భిన్న వాతావరణ పరిస్థితుల గుండా ఏటా వందల కోట్ల సంఖ్యలో సాగుతుంటాయి. ఇన్నేళ్లలో ఏనాడూ లేని ముప్పు ఇప్పుడే వచ్చి పడటానికి ప్రధాన కారణం మానవ జోక్యం, తత్ఫలితంగా జరుగుతున్న వాతావరణ మార్పులు, సాగుతున్న పర్యావరణ విధ్వంసమే’’ అని తేలి్చంది. ఇప్పటికైనా కళ్లు తెరిచి నష్ట నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరముందని ఐరాస వలస జాతుల సంరక్షణ సదస్సు కార్యదర్శి అమీ ఫ్రాంకెల్ అన్నారు. గత వారం ఉబ్జెకిస్తాన్‌లోని సమర్ఖండ్లో జరిగిన సదస్సు భేటీలో ఈ అంశాన్నే ఆయన నొక్కిచెప్పారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా 30 శాతం భూ, సముద్ర భాగాల సమగ్ర పరిరక్షణకు కృషి చేస్తామంటూ 2022 గ్లోబల్ బయో డైవర్సిటీ సమిట్‌లో పాల్గొన్న దేశాలు ప్రతిజ్ఞ చేశాయి. దాన్ని నెరవేర్చాల్సిన సమయం వచ్చింది’’ అన్నారు. ప్రమాదపుటంచుల్లో... 1979 ఐరాస రక్షిత జాబితాలోని 1,189 జీవ జాతులను నివేదిక లోతుగా పరిశీలించింది. అనంతరం ఏం చెప్పిందంటే... ► ప్రపంచవ్యాప్తంగా 44 శాతం వలస జీవ జాతుల సంఖ్య నానాటికీ భారీగా తగ్గుముఖం పడుతోంది. ► 22 శాతం అతి త్వరలో అంతరించేలా ఉన్నాయి. మొత్తమ్మీద ఐదో వంతు అంతరించే ముప్పు జాబితాలో ఉన్నాయి. ► ఇది జీవవైవిధ్యానికి తీవ్ర విఘాతం. మన జీవనాధారాలపైనా, మొత్తంగా ఆహార భద్రతపైనా పెను ప్రభావం చూపగల పరిణామం. ► ఆవాస ప్రాంతాలు శరవేగంగా అంతరిస్తుండటం మూడొంతుల జీవుల మనుగడకు మరణశాసనం రాస్తోంది. ► జంతువులు, చేపల వంటివాటిని విచ్చలవిడిగా వేటాడటం కూడా ఆయా జాతుల మనుగడను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ► కార్చిచ్చులు, గ్లోబల్ వారి్మంగ్ వంటివి ఇందుకు తోడవుతున్నాయి. ► భారీ డ్యాములు, గాలి మరలకు తోడు ఆకస్మిక వరదలు, అకాల క్షామాలు తదితరాల వల్ల వలస దారులు మూసుకుపోవడం, మారిపోవడం జరుగుతోంది. ఇది పలు జీవ జాతులను అయోమయపరుస్తోంది. ఏం చేయాలి? తక్షణం వలస జీవ జాతుల సంరక్షణ చర్యలకు పూనుకోవాల్సిన ఆవశ్యకతను నివేదిక నొక్కిచెప్పింది. అందుకు పలు సిఫార్సులు చేసింది... ► జీవావరణాల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలి. ► భారీ డ్యాములు తదితరాల పర్యావరణ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని తగు నష్ట నివారణ చర్యలు తీసుకోవాలి. ► ఈ అన్ని సమస్యలకూ తల్లి వేరు పర్యావరణ విధ్వంసం. కార్చిచ్చులకైనా, అకాల వరదలు, క్షామాలకైనా, గ్లోబల్ వార్మింగ్కైనా అదే ప్రధాన కారణం. కనుక దానికి వీలైనంత త్వరలో చెక్ పెట్టేందుకు దేశాలన్నీ కృషి చేయాలి. ఆహారం, పునరుత్పాదన వంటి అవసరాల నిమిత్తం వేలాది జీవ జాతులు వలస బాట పట్టడం ప్రపంచవ్యాప్తంగా అనాదిగా జరుగుతూ వస్తున్న ప్రక్రియ. పలు జంతు, పక్షి జాతులైతే కోట్ల సంఖ్యలో వలస వెళ్తుంటాయి. ఈ క్రమంలో కొన్ని పక్షి జాతులు ఏటా 10 వేల కిలోమీటర్లకు పైగా సుదీర్ఘ ప్రయాణాలు చేస్తుంటాయి! పర్యావరణ సంతులన పరిరక్షణకు కూడా ఎంతగానో దోహదపడే ప్రక్రియ ఇది. కానీ గ్లోబల్ వారి్మంగ్, వాతావరణ మార్పుల ప్రభావం జంతువులు, పక్షుల వలసపై కూడా విపరీతంగా పడుతోంది. ఈ ప్రమాదకర పరిణామంపై ఐరాస తీవ్ర ఆందోళన వెలిబుచి్చంది. దీనికి తక్షణం అడ్డుకట్ట వేయకపోతే కనీసం ఐదో వంతు వలస జీవులు అతి త్వరలో అంతరించిపోయే ప్రమాదం పొంచి ఉందని తాజా నివేదికలో హెచ్చరించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Copernicus Climate Change Service: ఏడాదంతా భూతాపం 1.5 డిగ్రీల పెరుగుదల
న్యూఢిల్లీ: కాలుష్యం, భూతాపం కారణంగా భూమిపై ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయన్నది తెలిసిన సంగతే. కానీ, 2023 ఫిబ్రవరి నుంచి 2024 జనవరి దాకా ఏడాదంతా భూసగటు ఉష్ణోగ్రత 1.52 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైనట్లు యూరోపియన్ యూనియన్‌కు చెందిన కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీసు (సీ3ఎస్) గురువారం వెల్లడించింది. 1850–1900 నాటి ఉష్ణోగ్రతల సగటుతో పోలిస్తే ఏడాది పొడవునా 1.52 డిగ్రీలు అధికంగా నమోదు కావడం ఇదే మొదటిసారి అని పేర్కొంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు ఇంకా పెరుగుతాయని చెప్పడానికి ఇదొక సంకేతమని తెలియజేసింది. ఈ ఏడాది జనవరి నెల అత్యంత వేడి జనవరిగా రికార్డుకెక్కిందని వివరించింది. 1850–1900 నాటి కంటే ఈ జనవరిలో 1.66 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. వాతావరణంలో ఎల్ నినో పరిస్థితులే ఇందుకు కారణమని అభిప్రాయపడింది. వాతావరణ మార్పులతోపాటు సెంట్రల్ పసిఫిక్ సముద్రంలో ఉపరితల జలాలు వేడెక్కడం వల్ల భూఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని కోపరి్నకస్ క్లైమేట్ చేంజ్ సరీ్వసు స్పష్టం చేసింది. -
వేల ఏళ్ల పురాతనమైన వినాశకర వైరస్ల విజృంభణ!
వాషింగ్టన్: రాజులు, సంపన్నులు దాచిన గుప్తనిధులు, లంకెబిందెలు వందల ఏళ్లకు ఇంకెవరికో దొరికితే సంబరమే. కానీ అందుకు భిన్నంగా జరిగితే?. అలాంటి ఉపద్రవమే ముంచుకు రావొచ్చని జీవశాస్త్రవేత్తలు మానవాళిని హెచ్చరిస్తున్నారు. 48,500 సంవత్సరాలపాటు మంచుమయ ఆర్కిటిక్ ఖండంలో మంచు ఫలకాల కింద కూరుకుపోయిన వినాశకర వైరస్లు పర్యావరణ మార్పులు, భూతాపం కారణంగా మంచు కరిగి బయటికొస్తున్నాయని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇన్ని వేల సంవత్సరాలు గడిచినా ఆ వైరస్‌లకు ఇప్పటికీ ఇంకొక జీవికి సోకే సాంక్రమణ శక్తులు ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. రష్యాలోని సైబీరియా ప్రాంతంలో యకూచి అలాస్ సరస్సులో తవి్వతీసిన నమూనాల్లో పురాతన వ్యాధికారక వైరస్‌లను ఇటీవల జీవశాస్త్రవేత్తల బృందం కనుగొంది. వాటిలో కొన్ని రకాలకు జాంబీ(దెయ్యం)వైరస్‌లుగా వర్గీకరించారు. నిద్రాణ స్థితిలో ఉన్నప్పటికీ ఇంకో జీవికి సంక్రమించే సత్తా ఇంకా వీటికి ఉందో లేదో పరీక్షిస్తున్నట్లు ఎయిక్స్–మార్సెల్లీ విశ్వవిద్యాలయంలో జన్యు శాస్త్రవేత్త జీన్ మైఖేల్ క్లావెరీ చెప్పారు. ‘‘ఆర్కిటిక్ ఖండం ఉపరితలంలో 20 శాతం భూభాగం శాశ్వతంగా మంచుతో కప్పబడి ఉంది. అత్యంత చల్లని, ఆక్సిజన్‌రహిత, ఘనీభవించిన ఈ ప్రదేశంలో పెరుగును పడేస్తే అలా పాడవ్వకుండా అలాగే ఉంటుంది. ఒక 50వేల సంవత్సరాల తర్వాత సైతం తినేయొచ్చు’ అని క్లావెరీ అన్నారు. నెదర్లాండ్స్‌లోని రోటెర్డామ్ ఎరాస్మస్ మెడికల్ సెంటర్లోని వైరాలజీ శాస్త్రవేత్త మేరియాన్ కూప్‌మెన్స్ మరికొన్ని వివరాలు చెప్పారు. ‘‘ ఈ మంచు ఫలకాల కింది వైరస్లు బయటికొచ్చి వ్యాప్తి చెందితే ఎలాంటి రోగాలొస్తాయో ఇప్పుడే చెప్పలేం. అయితే 2014లో సైబీరియాలో మేం ఇదే తరహా వైరస్‌లను పరీక్షించగా వాటికి ఏకకణ జీవులకు సోకే సామర్థ్యం ఉందని తేలింది. 2015లోనూ ఇదే తరహా పరీక్షలు చేశాం. ల్యాబ్‌లో అభివృద్దిచేసిన జీవులకూ ఈ వైరస్లు సోకాయి. ఆర్కిటిక్ ప్రాంతంలో మానవసంచారం పెరగనంతకాలం వీటితో ప్రమాదం ఏమీ లేదు. శతాబ్దాల క్రితం లక్షలాది మందిని పొట్టనబెట్టుకున్న పురాతన పొలియో వ్యాధికారక వైరస్‌లకు ఇప్పటికీ ఆ సంక్రమణ శక్తి ఉండొచ్చు. మనుషుల రాకపోకలతో అంటువ్యాధులను వ్యాపింపజేసే వైరస్లు ఆర్కిటిక్ ప్రాంతం దాకా వ్యాపిస్తే అవి, ఇవీ అన్ని కలసి కొత్తరకం ఊహించని వ్యాధుల వ్యాప్తికి కారణమవుతాం’’ అని వేరియాన్ కూప్‌మెన్స్ విశ్లేíÙంచారు. -
భూగోళం భగ్గుమంటోంది!
మరో శాస్త్రీయ నివేదిక బయటకొచ్చింది. ముంచుకొస్తున్న ప్రమాదాన్ని మళ్ళీ గుర్తు చేసింది. గత 150 ఏళ్ళలో ఎన్నడూ లేనంత అధిక ఉష్ణోగ్రత నమోదైన సంవత్సరం 2023 అని తేలిపోయింది. ఆ మధ్య వెలువడ్డ ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) తాత్కాలిక నివేదికతో పాటు తాజాగా మంగళవారం ఐరోపా యూనియన్‌కు చెందిన వాతావరణ పర్యవేక్షక సంస్థ ‘కోపర్నికస్ క్లైమేట్ ఛేంజ్ సర్వీస్’ (సీసీసీఎస్) సైతం ఆ సంగతి నిర్ధారణ చేసింది. ఒకప్పుడు 2016 ‘భుగభుగల నామ సంవత్సరం’గా రికార్డ్ సృష్టిస్తే, తాపంలో అంతకన్నా గణనీయమైన తేడాతో ఆ అపకీర్తి కిరీటాన్ని ఇప్పుడు 2023 దక్కించుకుంది. భూవిజ్ఞాన సాక్ష్యాధారాలు, ఉపగ్రహ సమాచారాలను క్రోడీకరించి చూస్తే, దాదాపు లక్ష సంవత్సరాల్లో అధిక వేడిమి గల ఏడాది ఇదేనట. ఇది పెనునిద్దుర వదిలించే మాట. యథేచ్ఛగా సాగుతున్న గ్రీన్హౌస్ వాయు ఉద్గారాల వల్ల భూతాపం ఇంతగా పెరిగిందని శాస్త్రవేత్తలకు తెలుసు. ఈ ధోరణి ఇలాగే కొనసాగనుందా? రానున్న సంవత్సరాల్లో భూగోళం అంతకంతకూ వేడెక్కనుందా? పాత రికార్డ్‌లు తుడిచిపెట్టుకు పోనున్నాయా అన్నది ప్రశ్న. 2024 సైతం అత్యధిక భూతాప వత్సరం కావచ్చన్న అంచనాలు పారా హుషార్ అంటున్నాయి. పారిశ్రామికీకరణ ముందు నాటితో పోలిస్తే 2 డిగ్రీల సెల్సియస్‌కు మించి ప్రపంచ ఉష్ణోగ్రత పెరగకుండా చూసుకోవాలన్నది లక్ష్యం. ఎనిమిదేళ్ళ క్రితం ప్యారిస్‌లో జరిగిన ‘కాప్–21’లో ఈ మేరకు ప్రపంచ దేశాలు ప్రతిన బూనాయి. వీలుంటే 1.5 డిగ్రీల సెల్సియస్ లోపలే ఉండేలా శ్రమించాలనీ తీర్మానించాయి. ప్యారిస్ ఒప్పందం తర్వాత వరుసగా పెరుగుతున్న వాతావరణ విపరిణామ ఘటనలు ప్రపంచాన్ని అప్రమత్తం చేశాయి. ఫలితంగా పర్యావరణ మార్పుకు సంబంధించి ఈ 1.5 డిగ్రీల సెల్సియస్ అనే హద్దు అలిఖిత శాసనమైంది. అయితే, ఇప్పుడు ఆ హద్దును దాటిపోయే పరిస్థితి వచ్చింది. గడచిన 2023లో భూగోళం భుగభుగలాడింది. ఉష్ణోగ్రతలో పెంపు ప్రమాదకర స్థాయికి చేరింది. ప్రతి రోజూ 1850 – 1900 మధ్య కాలం కన్నా కనీసం ఒక డిగ్రీ అధిక తాపం ఉంది. గత జూన్‌లో మొదలై డిసెంబర్ దాకా ప్రతి నెలా గరిష్ఠ వేడిమి మాసంగా రికార్డవుతూ వచ్చాయి. ఏడాదిలో సగం రోజులు ఎప్పటికన్నా 1.5 డిగ్రీలు ఎక్కువ వేడి ఉన్నాయి. నవంబర్‌లో రెండు రోజులైతే ఏకంగా 2 డిగ్రీల చెలియలికట్టను దాటేశాయి. భూతాపం లెక్కలు రికార్డ్ చేయడం మొదలుపెట్టాక గత 150 ఏళ్ళలో ఎన్నడూ లేనంత వేడిమి గల వత్సరంగా 2023 రికార్డుకెక్కింది. గతంలో అత్యధిక ఉష్ణోగ్రత రికార్డయిన ఏడాది 2016. సగటున 0.17 డిగ్రీల హెచ్చు ఉష్ణో గ్రతతో 2023 ఆ రికార్డును తిరగరాసింది. ఈ సంగతి ఆందోళన కలిగిస్తుంటే, ఇంత కన్నా భయ పెడుతున్న విషయం ఉంది. వచ్చే 12 నెలల్లో భూగోళం 1.5 డిగ్రీల మార్కును సైతం దాటేసే ప్రమాదం ఉందట. సీసీసీఎస్ శాస్త్రవేత్తలే ఆ మాటన్నారు. అంటే ఈ 2024 మరింత వేడిమితో ఉడుకెత్తించనుందన్న మాట. ఒక పక్క రికార్డు స్థాయిలో కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు, మరోపక్క సహజ వాతావరణ పరిణామమైన ఎల్ నినో... ఈ రెండూ భూగోళంపై ఉష్ణోగ్రతలు ఇంతగా పెరగడానికి ప్రాథమిక కారణమని శాస్త్రవేత్తల మాట. ఈ అధిక ఉష్ణోగ్రతల దెబ్బతో వడగాడ్పులు, వరదలు, కార్చిచ్చులు చెలరేగుతున్నాయి. విశ్వవ్యాప్తంగా ప్రాణికోటి ఆయువు తీస్తున్నాయి. జీవనోపాధిని దెబ్బతీస్తున్నాయి. అమెరికా, ఐరోపాలలో ఆ మధ్య చెలరేగిన వేడిగాలుల లాంటి వాతావరణ విపరిణామాలు సైతం మానవ తప్పిదాలతో పెరిగిన భూతాపంతోనే సంభవించాయి. డబ్ల్యూఎంఓ, సీసీసీఎస్‌లే కాదు... వందలాది శాస్త్రీయ అధ్యయనాలూ ప్రమాదాన్ని అద్దంలో చూపుతున్నాయి. జపాన్‌కు చెందిన మరో వాతావరణ సంస్థ విడిగా చేసిన మరో విశ్లేషణ ఫలితాలూ ఇలానే ఉన్నాయి. డిగ్రీలో పదో వంతు మేర భూతాపం పెరిగినా... వడగాడ్పులు, తుపానులు తీవ్ర మవుతాయి. సముద్రమట్టాలు పెరుగుతాయి. హిమానీనదాలు త్వరగా కరిగి నీరవుతాయి. ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా మనం నిరుడు చూసినవే. భూతాపంతో ఇరాన్, చైనా, గ్రీస్, స్పెయిన్, టెక్సాస్, అమెరికా దక్షిణ ప్రాంతాలు ఉడికిపోయాయి. కెనడాలో విధ్వంసకరమైన కార్చిచ్చు చెలరేగింది. సముద్ర ఉష్ణోగ్రతలు మునుపెన్నడూ లేనంత పెరిగి, సముద్ర వడగాడ్పులు వీచాయి. వేసవిలోనూ, శీతకాలంలోనూ అంటార్కిటికా సముద్ర తీరాల వెంట హిమ ఘనీభవనం చాలా తక్కువైంది. రికార్డు స్థాయిలో పడిపోయింది. ఇవన్నీ ప్రకృతి మోగిస్తున్న ప్రమాద ఘంటికలని గ్రహించాలి. పెరుగుతున్న భూతాపాన్ని నివారించడానికి ఇకనైనా చిత్తశుద్ధితో సంకల్పించాలి. విపరీత ఘట నల్ని నివారించాలంటే, అత్యవసరంగా ఆర్థిక వ్యవస్థను కర్బన రహిత దిశగా నడిపించాలి. పర్యావ రణ సమాచారాన్నీ, జ్ఞానాన్నీ ఆసరాగా చేసుకొని భవిష్యత్తు వైపు అడుగులేయాలి. భూగోళంపై జీవకోటి ప్రాణాధార వ్యవస్థలు అమితంగా దెబ్బతిన్నాయనీ, ఇప్పటికే సురక్షిత వలయం బయట మానవాళి గడుపుతోందనీ శాస్త్రవేత్తలు ఇటీవల వెల్లడించారు. భూతాపం, వాతావరణ మార్పులు హద్దు మీరితే పరిస్థితి ఎలా ఉంటుందన్నది 2023 రుచి చూపింది. ఇకనైనా ప్రపంచ దేశాలు తమ నిర్లక్ష్యాన్ని వీడి, వాతావరణ మార్పులపై కార్యాచరణకు దిగాలి. శిలాజ ఇంధనాల వినియోగాన్ని గణనీయంగా తగ్గించడంలో మీనమేషాలు లెక్కించడం మానవాళికి శ్రేయస్కరం కాదు. అగ్ర రాజ్యాలు సహా అన్నీ ఆ పనికి దిగాలి. వీలైనంత త్వరగా నెట్ జీరో స్థాయి చేరి, జీవనయోగ్యమైన వాతావరణాన్ని పరిరక్షించుకోవాలి. మన జీవితంలో రాబోయే వత్సరాలన్నీ ఇంతకింత భూతాపంతో ఉంటాయనే భయాలూ లేకపోలేదు. అదే నిజమై, వాటితో పోలిస్తే గడచిన 2023వ సంవత్సరమే చల్లగా ఉందని భావించాల్సిన పరిస్థితి వస్తే, అది ఘోరం. చేతులారా చేస్తున్న పాపానికి ఫలితం! -
సముద్ర గర్భంలో ఏకంగా 8 అగ్నిపర్వతాలు
అవున్నిజమే. అది కూడా ఒకటి కాదు, రెండు కాదు. ఏకంగా 8 అగ్ని పర్వతాలు! అంటార్కిటికా మహాసముద్రంలో 4 వేల మీటర్ల లోతున చాలాకాలంగా నిద్రాణంగా ఉన్నాయట. ఇవి ఒక్కోటీ సగటున కిలోమీటరు పై చిలుకు ఎత్తులో ఉన్నాయి. వీటిలో అతి పెద్ద అగ్నిపర్వత శ్రేణి 1.5 కిలోమీటర్ల ఎత్తుంది! టాస్మేనియా నుంచి అంటార్కిటికా మధ్య 20 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పరిశోధనలు చేపట్టిన సీఎస్ఐఆర్ఓ వోయేజ్ నౌకలోని పరిశోధక బృందం వీటి ఉనికిని తాజాగా గుర్తించింది. 3డి ఇమేజింగ్ ద్వారా ఈ పర్వతాలను అత్యంత స్పష్టంగా మ్యాపింగ్ కూడా చేసింది. సముద్ర గర్భంలో అగ్నిపర్వతాల ఉనికి ఇంత స్పష్టంగా చిక్కడం నిజంగా అద్భుతమని సీఎస్ఐఆర్ఓ జియో ఫిజిసిస్ట్ డాక్టర్ క్రిస్ యూల్ చెప్పారు. సముద్ర ప్రవాహాల వేగం అత్యంత ఎక్కువగా ఉండే ధ్రువ ప్రాంతంలో ఇవి ఉండటం ఆశ్చర్యమేనని ఆయనన్నారు. వీటిలో నాలుగు పర్వతాల ఉనికిని కొన్నేళ్లుగా అనుమానిస్తూనే ఉన్నారు. ఇప్పుడది ధ్రువపడటంతో పాటు వాటి పక్కనే మరో నాలుగు అగ్నిపర్వతాలు కూడా ఉన్నట్టు తేలింది. ఇవి మకారీ ద్వీపానికి దాదాపు 200 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నాయి. భూ అయస్కాంత శక్తి చాలని ఫలితంగా బహుశా 20 లక్షల ఏళ్ల కింద ఇవి ఏర్పడి ఉంటాయని భావిస్తున్నారు. సీఎస్ఐఆర్ఓ వోయేజ్ ప్రాజెక్టును అమెరికా, ఫ్రాన్స్ అంతరిక్ష సంస్థలు ఉమ్మడిగా తలపెట్టాయి. సముద్ర అంతర్భాగపు రహస్యాలను అన్వేషించడంతో పాటు వాటిని స్పష్టంగా మ్యాపింగ్ చేయడం దీని ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. ‘‘అంటార్కిటికా మహాసముద్రపు ధ్రువ ప్రవాహ గతి సముద్ర అడుగు భాగాన్ని ఢీకొనడం వల్ల ఏర్పడే భారీ సుడిగుండాలు వేడిమితో పాటు కర్బనాన్ని సముద్రంలో అన్నివైపులకూ చెదరగొడతాయి. అలా గ్లోబల్ వార్మింగ్ కట్టడిలో కీలకపాత్ర పోషిస్తాయి’’ అని వోయేజ్ మిషన్ చీఫ్ కో సైంటిస్టు డాక్టర్ హెలెన్ ఫిలిప్స్ వివరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Year End 2023: ఆవిష్కరణల ఏడాది
అంతరిక్ష అన్వేషణ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ దాకా, గ్లోబల్ వారి్మంగ్ నుంచి పలు మానవ వికాసపు మూలాల దాకా శాస్త్ర సాంకేతిక రంగాల్లో 2023లో పలు నూతన ఆవిష్కరణలు చోటుచేసుకున్నాయి. ప్రపంచం దృష్టిని తమవైపుకు తిప్పుకోవడమే గాక భవిష్యత్తుపై కొంగొత్త ఆశలు కూడా కల్పించాయి. వినాశ హేతువైన గ్లోబల్ వారి్మంగ్‌లో కొత్త రికార్డులకూ ఈ ఏడాది వేదికైంది! 2023లో టాప్ 10 శాస్త్ర సాంకేతిక, పర్యావరణ పరిణామాలను ఓసారి చూస్తే... 1. చంద్రయాన్ దశాబ్దాల కృషి అనంతరం భారత్ ఎట్టకేలకు చందమామను చేరింది. తద్వారా చంద్రయాన్–3 ప్రయోగం చరిత్ర సృష్టించింది. పైగా ఇప్పటిదాకా ఏ దేశమూ దిగని విధంగా చంద్రుని దక్షిణ ధ్రువంవైపు చీకటి ఉపరితలంపై దిగిన రికార్డును కూడా చంద్రయాన్–3 సొంతంచేసుకుంది. ఇంతటి ప్రయోగాన్ని ఇస్రో కేవలం 7.5 కోట్ల డాలర్ల వ్యయంతో దిగి్వజయంగా నిర్వహించడం ప్రపంచాన్ని అబ్బురపరిచిందనే చెప్పాలి. చంద్రుని ఉపరితలంపై సల్ఫర్ జాడలున్నట్టు చంద్రయాన్–3 ప్రయోగం ధ్రువీకరించింది. రెండు వారాల పాటు చురుగ్గా పని చేసి దాన్ని ప్రయోగించిన లక్ష్యాన్ని నెరవేర్చింది. 2. కృత్రిమ మేధ ఈ రంగంలో కీలక ప్రగతికి 2023 వేదికైంది. 2022 చివర్లో ఓపెన్ఏఐ విడుదల చేసిన ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ ఈ ఏడాది అక్షరాలా సంచలనమే సృష్టించింది. ఆకా శమే హద్దుగా అన్ని రంగాల్లోకి చొచ్చుకుపోయింది. లీవ్ లెటర్లు ప్రిపేర్ చేసినంత సులువుగా సృజనాత్మకమైన లవ్ లెటర్లనూ పొందికగా రాసి పెడుతూ వైవిధ్యం చాటుకుంది. అప్పుడప్పుడూ తడబడ్డా, మొత్తమ్మీద అన్ని అంశాల్లోనూ అపారమైన పరిజ్ఞానం, నైపుణ్యంతో యూజర్ల మనసు దోచుకుంది. గూగుల్ తదితర దిగ్గజాలు కూడా సొంత ఏఐ చాట్బోట్లతో బరిలో దిగుతుండటంతో ఏఐ రంగంలో మరిన్ని విప్లవాత్మక పరిణామాలు వచ్చేలా ఉన్నాయి. 3. ఆదిమ ‘జాతులు’! మనిషి పుట్టిల్లు ఏదంటే తడుముకోకుండా వచ్చే సమాధానం... ఆఫ్రికా. అంతవరకూ నిజమే అయినా, మనమంతా ఒకే ఆదిమ జాతి నుంచి పుట్టుకొచ్చామని ఇప్పటిదాకా నమ్ముతున్న సిద్ధాంతం తప్పని 2023లో ఓ అధ్యయనం చెప్పింది. మన మూలాలు కనీసం రెండు ఆదిమ జాతుల్లో ఉన్నట్టు తేలి్చంది! 10 లక్షల ఏళ్ల కింద ఆఫ్రికాలో ఉనికిలో ఉన్న పలు ఆదిమ జాతులు హోమోసెపియన్ల ఆవిర్భావానికి దారి తీసినట్టు డీఎన్ఏ విశ్లేషణ ఆధారంగా అది చెప్పడం విశేషం! మూలవాసులైన అమెరికన్లు దాదాపు 20 వేల ఏళ్ల కింద ఉత్తర అమెరికాకు వలస వెళ్లి యురేషియాకు తిరుగు పయనమైనట్టు మరో అధ్యయనం తేల్చింది. 4. గ్రహశకలం ఓసిరిస్ నాసా ప్రయోగించిన ఒసిరిస్ రెక్స్ రోబోటిక్ అంతరిక్ష నౌక ఏడేళ్ల ప్రయాణం అనంతరం బెన్నూ గ్రహశకలంపై దిగింది. అక్కడి దాదాపు పావు కిలో పరిమాణంలో రాళ్లు, ధూళి నమూనాలను సేకరించి భూమికిపైకి పంపింది. అవి సెపె్టంబర్ 24న అమెరికాలోని ఉటా ఎడారి ప్రాంతంలో దిగాయి. వాటిని విశ్లేషించిన సైంటిస్టులు నీటితో పాటు భారీ మొత్తంలో కార్బన్ జాడలున్నట్టు తేల్చారు. బెన్నూ గ్రహశకలం భూమి కంటే పురాతనమైనది. దాని నమూనాల విశ్లేషణ ద్వారా భూమిపై జీవం ఆవిర్భావానికి సంబంధించిన కీలకమైన రహస్యాలు వెలుగు చూడవచ్చని భావిస్తున్నారు. 5. అత్యంత వేడి ఏడాది చరిత్రలో ఇప్పటిదాకా నమోదైన అత్యంత వేడి ఏడాదిగా 2023 ఓ అవాంఛనీయ రికార్డును సొంతం చేసుకుంది. ఏప్రిల్ నుంచి నవంబర్ దాకా ప్రతి నెలా ఇప్పటిదాకా అత్యంత వేడిమి మాసంగా నమోదవుతూ వచి్చంది! ఫలితంగా ఏడాది పొడవునా లిబియా నుంచి అమెరికా దాకా తీవ్ర తుఫాన్లు, వరదలు, కార్చిచ్చులు ఉత్పాతాలు సృష్టిస్తూనే వచ్చాయి. పైగా నవంబర్‌లో అయితే 17వ తేదీన భూ తాపంలో చరిత్రలోనే తొలిసారిగా 2 డిగ్రీల పెరుగుదల నమోదైంది! 2 డిగ్రీల లక్ష్మణ రేఖను తాకితే సర్వనాశనం తప్పదని సైంటిస్టులు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం వణికిస్తోంది. 6. సికిల్ సెల్‌కు తొలి జన్యుచికిత్స సికిల్ సెల్, బెటా థలస్సీమియా వ్యాధులకు తొలిసారిగా జన్యు చికిత్స అందుబాటులోకి వచి్చంది. వాటికి చికిత్స నిమిత్తం కాస్జెవీ 9క్రిస్పర్ కేస్9) జన్యు ఎడిటింగ్ టూల్ వాడకానికి బ్రిటన్ ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం లభించింది. ఈ థెరపీ ద్వారా రోగులకు నొప్పి నిదానించిందని, ఎర్ర రక్త కణాల మారి్పడి ఆవశ్యకత కూడా తగ్గుముఖం పట్టిందని తేలింది. కాకపోతే ఈ చికిత్స ఖరీదే ఏకంగా 20 లక్షల డాలర్లు! పైగా భద్రత అంశాలు, దీర్ఘకాలిక పనితీరు తదితరాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 7. ఊబకాయానికి మందు మధుమేహానికి ఔషధంగా పేరుబడ్డ వెగోవీ ఊబకాయాన్ని తగ్గించే మందుగా కూడా తెరపైకి వచ్చి సంచలనం సృష్టించింది. బరువును తగ్గించడం మాత్రమే గాక గుండెపోటు, స్ట్రోక్ తదితర ముప్పులను కూడా ఇది బాగా తగ్గిస్తుందని తేలడం విశేషం. వీటితో పాటు పలురకాల అడిక్షన్లకు చికిత్సగా కూడా వెగోవీ ప్రభావవంతంగా ఉపయోగపడుతోందని తేలింది. అయితే దీని వాడకం వల్ల థైరాయిడ్ క్యాన్సర్ వంటి సైడ్ ఎఫెక్టులు రావచ్చంటున్నారు! 8. పాపం పక్షిజాలం ప్రపంచవ్యాప్తంగా జంతుజాలానికి, మరీ ముఖ్యంగా పక్షిజాలానికి మరణశాసనం రాసిన ఏడాదిగా 2023 నిలిచింది! ప్రపంచ వ్యాప్తంగా లక్షల కొద్దీ పక్షి జాతుల జనాభాలో ఈ ఏడాది విపరీతమైన తగ్గుదల నమోదైనట్టు సైంటిస్టులు తేల్చారు. గత నాలుగు దశాబ్దాలుగా పెరుగుతూ వస్తున్న ఈ ధోరణి 2023లో బాగా వేగం పుంజుకున్నట్టు పలు పరిశోధనల్లో తేలింది. పురుగుమందుల విచ్చలవిడి వాడకమే పక్షుల మనుగడకు ముప్పుగా మారిందని తేలింది! 9. మూల కణాధారిత పిండం అండం, శుక్ర కణాలతో నిమిత్తం లేకుండానే కేవలం మూల కణాల సాయంతో మానవ పిండాన్ని సృష్టించి ఇజ్రాయెల్ సైంటిస్టులు సంచలనం సృష్టించారు. అది కూడా మహిళ గర్భంతో నిమిత్తం లేకుండా ప్రయోగశాలలో వారీ ఘనత సాధించారు. ఈ నమూనా పిండం ప్రయోగశాలలో 14 రోజుల పాటు పెరిగింది. ఆ సమయానికి సహజంగా తల్లి గర్భంలో ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఎదిగిందని తేలింది. మానవ పునరుత్పత్తి రంగంలో దీన్ని కీలక మైలురాయిగా భావిస్తున్నారు. ఇలాంటి మరిన్ని ప్రయోగాలకు ఇది ప్రేరణగా నిలుస్తుందని భావిస్తున్నారు. 10. కార్చిచ్చులు 2023లో కార్చిచ్చులు కొత్త రికార్డులు సృష్టించాయి. ముఖ్యంగా కెనడాలోనైతే పెను వినాశనానికే దారి తీశాయి. వీటి దెబ్బకు అక్కడ గత అక్టోబర్ నాటికే ఏకంగా 4.5 కోట్ల ఎకరాలు బుగ్గి పాలయ్యాయి! అక్కడ 1989లో నమోదైన పాత రికార్డుతో పోలిస్తే ఇది ఏకంగా రెట్టింపు విధ్వంసం. అమెరికా, బ్రిటన్, స్పెయిన్, నార్వే వంటి పలు ఇతర దేశాల్లోనూ కార్చిచ్చులు విధ్వంసమే సృష్టించాయి. వీటి దెబ్బకు జూన్ నెలంతా అమెరికాలో వాయు నాణ్యత ఎన్నడూ లేనంతగా తగ్గిపోయింది. హవాయి దీవుల్లో కార్చిచ్చుకు ఏకంగా 100 మంది బలయ్యారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రానున్నది ఉష్ణ ప్రకోపమే!
వాతావరణం, శీతోష్ణస్థితి గురించి లెక్కలు తీసి రికార్డుగా దాచి ఉంచడం మొదలుపెట్టి 170 సంవత్సరాలకు పైనే అయింది. ఈ మొత్తం కాలంలోనూ 2023వ సంవత్సరం అన్నిటికన్నా వేడి అయినదిగా నమోదవుతుంది అని పరి శోధకులు అప్పుడే చెప్పేస్తున్నారు. ఇటీ వలి కాలం ఇంత వేడిగా ఉండడా నికి మనుషుల కారణంగా మారుతున్న శీతోష్ణస్థితి మాత్రమే అని ఎటువంటి అనుమానం లేకుండా తేల్చేస్తున్నారు. యూరోపియన్ యూనియన్ స్పేస్ ప్రోగ్రావ్‌ు వారి ‘కోపర్ని కస్ క్లైమేట్ ఛేంజ్ సర్వీస్’ వారి లెక్కల ప్రకారం, ఇంతకు ముందు ఎప్పుడూ వేసంగి ఇంత వేడిగా ఉన్నది లేదు. గతంలో కంటే ఈసారి ఉష్ణోగ్రత 0.32 డిగ్రీ సెల్సియస్ సగటున ఎక్కువగా ఉన్నట్టు లెక్క తేలింది. ప్రపంచం మొత్తం మీద మునుపెన్నడూ లేని మూడు వేడి దినాలు నమోదైనట్లు కూడా తెలిసింది. ఇప్పటికే ఈ ఏడాది వేసవికాలం మునుపెన్నడూ లేనంత వేడిగా ఉందని లెక్కతేల్చి పెట్టారు. 2023వ సంవత్సరంలో నెలల ప్రకారం లెక్కలు చూచినా... ప్రపంచమంతటా ఆరు మాసాలు అంతకు ముందు ఎన్నడూ లేని వేడి కనబరిచినట్టు ఇప్పటికే లెక్కలు వచ్చాయి. అంటార్కిటికాలో మంచు కూడా అంతకు ముందు ఎన్నడూ లేనంతగా కరిగిపోయినట్టు కూడా గమనించారు. ప్రపంచంలో పారిశ్రామికీకరణ కన్నా ముందు కూడా వాతా వరణంలోని వేడి గురించిన రికార్డులు ఉన్నాయి. ఈ సంవత్సరం ఇప్పటి వరకు సగటున ప్రపంచం మొత్తం మీద 1.46 డిగ్రీల సెల్సియస్ వేడి పారిశ్రామికీకరణకు ముందున్న వేడి కన్నా ఎక్కువగా ఉంది. పరిశ్రమల వల్ల వాతావరణం వేడెక్కుతున్న దన్న భావన చాలాకాలంగా ప్రపంచంలో ఉండటం తెలిసిందే. 2016లో వేడిమి ఎక్కువగా ఉన్నట్టు ఇప్పటి వరకు ఉన్న రికార్డులు తెలుపుతున్నాయి. అయితే ఈ సంవత్సరం వేడి 2016లో కన్నా ఎక్కువగా ఉన్నట్టు నమోదయింది. ఈ ప్రకారంగా ఇప్పటి వరకు రికార్డులో ఉన్న సంవత్సరాల అన్నింటిలోకీ 2023 అత్యంత వేడిగా ఉన్నట్టు లెక్క తేలింది. ఈ విషయాన్ని ఈ మధ్యనే ‘సీ త్రీ ఎస్’ సంస్థ పరిశోధకురాలు సమంతా బుర్జెస్ ఒక ప్రకటనలో బయటపెట్టారు. శరత్ కాలం కూడా వేడిగా ఉండడానికి ‘ఎల్ నినో’ కారణం అని ఇప్పటికే మనకంతా తెలుసు. ఎల్ నినో వల్ల భూమధ్య రేఖ వద్ద సముద్రాలలో ఉపరితలం నీరు వేడెక్కుతుంది. దాని వల్ల ప్రపంచంలోని గాలులు వేడవుతాయి. 2023 జూన్‌లోనే ఈ ప్రక్రియ మొదలైంది. వచ్చే ఏడాది కూడా ఈ వేడి కొనసాగుతుందని అంటున్నారు. గడచిన మూడు సంవత్సరాల పాటుఎల్ నినోకు వ్యతిరేకంగా ఉండే ‘లా నినా’ అనే పరిస్థితి కారణంగా వేడిమి కొంతవరకు అదుపులో ఉంది. ఈ ‘లా నినా’ప్రస్తుతం లేదు. కనుక వేడిమి హద్దు లేకుండా పెరుగుతున్నది. మరికొంతమంది నిపుణులు టోంగాలో సముద్రం లోపల 2022లో పేలిన అగ్నిపర్వతం కారణంగా వేడి నీటి ఆవిరులు వాతావరణంలో పెరిగాయనీ, ఈ సంవత్సరం వేడి పెరుగుదలకు అది కూడా కొంతవరకు కారణం కావచ్చుననీ అంటున్నారు. అయితే పరి శోధకులు మాత్రం ఈ విషయం గురించి అను మానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచమంతటా వాతావరణం వేడిగా మారడానికి ‘గ్లోబల్ వార్మింగ్’ అన్న ప్రక్రియ కారణం అని అందరికీ తెలుసు. గ్రీన్ హౌస్ వాయువుల కారణంగా ఈ పరిస్థితి ఎదురవుతున్నదని కూడా తెలుసు. ఈ ప్రక్రియ వల్ల ప్రపంచ వాతావరణంలో 25 బిలి యన్ల అణుబాంబుల శక్తికి సమానంగా ఉష్ణశక్తి చేరిందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఇదంతా గడిచిన 50 సంవ త్సరాల పాటు జరిగిన మార్పు. ఈ మార్పు ఒక పక్కన గాలిని వేడెక్కిస్తుండగా, మరొక పక్కన ఊహకు అందకుండా ఎల్ నినో వచ్చే పరిస్థితులకు దారితీస్తున్నది. రానురానూ పరిస్థితి మరింత దారుణంగా మారుతున్నది. డిసెంబర్ 4న ‘కాప్’ 28 అనే యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ ఛేంజ్ కాన్ఫరెన్స్ జరిగింది. వాతావరణంలోకి కార్బన్ డై ఆక్సైడ్నుపంపించడం ఈ సంవత్సరం అంతకు ముందు ఎన్నడూ లేని స్థాయికి చేరిందని అక్కడ ప్రకటించారు. పరిస్థితి ఇలాగుంటే, వాతావరణం నియంత్రణలో ఉంటుందని అనుకోవడానికి వీలే లేదు అన్నారు అక్కడ.గ్లోబల్ వార్మింగ్ ప్రభావాలు ప్రస్ఫుటంగా బయట పడు తున్నాయి. ప్రపంచమంతటా తీర ప్రాంతాల్లో ఉన్న నగరాలు ముంపునకు గురవుతున్నాయి. ప్రపంచంలోని పెద్ద పెద్ద సరస్సులు, జలాశయాలు సగం కుదించుకుపోయాయి. సముద్ర అంతర్భాగంలో ఉండే గల్ఫ్ ప్రవాహం కూడా ప్రభావం కనపరు స్తున్నది. సముద్ర మట్టాలు ఎక్కడికక్కడ పెరుగుతున్నాయి. అయితే పరిశోధకులు, పరిస్థితిని చక్కదిద్దుకోవడానికి అవ కాశాలు ఇంకా ఉన్నాయి అని ఆశాభావం కనబరుస్తున్నారు. వాతావరణంలో మార్పులను మనకు అనుకూలంగా మార్చే మార్గాలు లేకపోలేదు అంటున్నారు పెన్సిల్వేనియా విశ్వ విద్యా లయం పరిశోధకులు. కానీ ఆ అవకాశం కూడా రానురానూ తగ్గి పోతున్నది అన్నది వారి అభిప్రాయం. కె. బి. గోపాలం వ్యాసకర్త సైన్స్ రచయిత -
శిలాజ ఇంధనాలకు బైబై
దుబాయ్: హరిత గృహ వాయువుల ఉద్గారానికి, తద్వారా భూతాపానికి, భూగోళంపై ప్రకృతి విపత్తులకు, జీవకోటి మనుగడకు పెనుముప్పుగా పరిణమించిన శిలాజ ఇంధనాల వాడకానికి వీడ్కోలు చెప్పే దిశగా అడుగులు వేసేందుకు దాదాపు 200 దేశాలు అంగీకారానికి వచ్చాయి. ఈ మేరకు దుబాయ్‌లో జరుగుతున్న ‘కాప్–28’ సదస్సులో చరిత్రాత్మక ఒప్పందానికి అన్ని దేశాలు మద్దతు పలికాయి. ‘శిలాజ ఇంధనాల వాడకం మానేద్దాం.. మార్పు సాధిద్దాం’ అంటూ ప్రతిన బూనాయి. కాప్–28 సదస్సులో బుధవారం చివరి సెషన్ జరిగింది. శిలాజ ఇంధనాలకు వ్యతిరేకంగా కీలక ఒప్పందాన్ని సభ్యదేశాల ప్రతినిధులంతా ముక్తకంఠంలో ఆమోదించారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణం కరతాళ ధ్వనులతో మార్మోగింది. 2050 నాటికి నెట్‌జీరో(సున్నా) ఉద్గారాలే లక్ష్యంగా ఒప్పందంలో 8 సూత్రాల ప్రణాళికను జోడించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఈ ఏడాది కాప్ సదస్సులో చెప్పుకోదగ్గ తీర్మానాలేవీ ఉండబోవన్న అనుమానాలు పటాపంచలయ్యాయి. భూగోళాన్ని కాపాడుకుంటేనే భవిష్యత్తు తరాలకు మనుగడ ఉంటుందని కాప్–28 అధ్యక్షుడు సుల్తాన్ అల్–జబేర్ తేలి్చచెప్పారు. పారిస్ ఒప్పందాన్ని పరిగణనలోకి తీసుకుంటూ, ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలని, ఇందుకోసం ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా పని చేయాలని, పటిష్టమైన, నిర్మాణాత్మక చర్యలకు శ్రీకారం చుట్టాలని కాప్–28 సదస్సు పిలుపునిచ్చింది. ప్రమాదకరమైన గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాన్ని గణనీయంగా తగ్గించాల్సిన బాధ్యత అన్ని దేశాలపైనా ఉందని స్పష్టం చేసింది. చేతలు కావాలి: బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని తగ్గించుకోవాలని గతంలో జరిగిన కాప్ సదస్సుల్లో ప్రత్యేకంగా సూచించారు. ఈసారి మాత్రం ఈ ప్రస్తావన లేకపోవడం గమనార్హం. బొగ్గుతో విద్యు త్ను ఉత్పత్తి చేయడంలో ప్రపంచంలో చైనా, భారత్ ముందంజలో ఉన్నాయి. తమ విద్యుత్ అవసరాలు తీర్చుకోవడానికి బొగ్గుపై ఆధారపడుతున్నాయి. ఉష్ణోగ్రతల పెరుగుదలను నియంత్రించడానికి బుధవారం ఆమోదించిన ఒప్పందమే అతిపెద్ద కార్యాచరణ ప్రణాళిక అని సుల్తాన్ అల్–జబేర్ అన్నారు. కాప్–28 టాప్ 10 చరిత్రాత్మక శిలాజ ఇంధన ఒప్పందంతో కాప్–28 సదస్సు ముగిసింది. ఇలాంటి కాలుష్య ఇంధనాల వాడకాన్ని క్రమంగా నిలిపివేయడానికి ప్రపంచ దేశాలు అంగీకరించాయి. పెట్రోల్, డీజిల్, బొగ్గు వినియోగం అంతమయ్యే దిశగా అడుగులు పడ్డాయని చెప్పొచ్చు. 1. చరిత్రాత్మక శిలాజ ఇంధన ఒప్పందంతో కాప్–28 సదస్సు ముగిసింది. ఇలాంటి కాలుష్య ఇంధనాల వాడకాన్ని క్రమంగా నిలిపివేయడానికి ప్రపంచ దేశాలు అంగీకరించాయి. పెట్రోల్, డీజిల్, బొగ్గు వినియోగం అంతమయ్యే దిశగా అడుగులు పడ్డాయని చెప్పొచ్చు. 2. సంపన్న దేశాల నిర్వాకం వల్లే వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. వాటి వల్ల పేద దేశాలు నష్టపోతున్నాయి. పేద దేశాలకు వాటిల్లుతున్న నష్టానికి గాను బడా దేశాలు పరిహారం ఇవ్వాలన్న ప్రతిపాదన చాలాఏళ్లుగా ఉంది. ఈ సదస్సులో దానికి కార్యరూపం వచి్చంది. వాతావరణ మార్పుల వల్ల నష్టపోయే పేద దేశాలకు ఆర్థిక సాయం అందించడం కోసం ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడానికి ఆమోదం లభించింది. 3. నిర్దేశిత గడువు కంటే నెట్జిరో కర్బన ఉద్గారాల లక్ష్యాన్ని సాధిస్తామని కెనడా, బెల్జియం వంటి దేశాలు ప్రకటించాయి. 2030 నాటికి ఉద్గారాలను 50 శాతం తగ్గించుకుంటామని దుబాయ్ వెల్లడించింది. 4. 2030 కంటే ముందే గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారాన్ని అరికట్టడానికి శుద్ధ ఇంధనాల వనరుల వాడకాన్ని గణనీయంగా పెంచుకోవాలని నిర్దేశించారు. 5. క్లైమేట్ యాక్షన్ కోసం సంపన్న దేశాల నుంచి నిధులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలకు బదిలీ చేయాలన్న ప్రతిపాదనపై చర్చలు జరిగాయి. 6. జీవ వైవిధ్యానికి, మానవళికి ఎలాంటి హాని కలగకుండా వాతావరణ మార్పుల నియంత్రణకు కార్యాచరణ ప్రణాళిక చేపట్టాలని నిర్దేశించారు. 7. ప్రస్తుతం అమల్లో ఉన్న పారిస్ ఒప్పందం లక్ష్యాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా శిలాజ ఇంధనాల వినియోగం, ఉత్పత్తిని తగ్గించుకోవాలని ఆదేశించారు. 8. పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ క్లైమేట్ ఫండ్ తరహాలో క్లైమేట్ ఫైనాన్స్, సపోరి్టంగ్ ఫండ్స్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనకు కొన్నిదేశాలు, సంస్థలు మద్దతు ప్రకటించాయి. 9. కాప్–26 సదస్సు ఫలితాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత కర్బన్ ఉద్గారాల సమాచారాన్ని నమోదు చేసే విషయంలో నిబంధనలు సవరించారు. 10. అన్ని దేశాల, అన్ని వర్గాల అవసరా లను దృష్టిలో పెట్టుకొని శిలాజ ఇంధనాల నుంచి ఇతర ప్రమాద రహిత ఇంధనాల వైపు క్రమానుగతంగా మారాలని సూచించారు. -
Global Warming: భూమిని వేడెక్కిస్తున్న పాపం... పెద్ద దేశాలదే!
గ్లోబల్ వార్మింగ్. కొన్ని దశాబ్దాలుగా ప్రపంచాన్ని వణికిస్తున్న సమస్య. దీని దెబ్బకు భూగోళపు సగటు ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. అవి ఇంకో అర డిగ్రీ మేరకు పెరిగినా సర్వ వినాశనం జరిగే పరిస్థితి! ప్రాణికోటి మనుగడకే పెను ముప్పు! ఈ ప్రమాదం ఎంతో దూరం కూడా లేదని ఐక్యరాజ్యసమితి ఇప్పటికే ఎన్నోసార్లు హెచ్చరించింది. అయినా పరిస్థితిలో పెద్దగా మెరుగుదల లేదు. ముఖ్యంగా గ్లోబల్ వార్మంగ్‌కు ప్రధాన కారణమైన గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు ఏటికేడు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. అంతర్జాతీయ పర్యావరణ సదస్సుల్లో దీనిపై ఎంతగా ఆందోళన వ్యక్తమవుతున్నా అది మాటలకే పరిమితమవుతోంది. ఉద్గారాలకు ముకుతాడు వేస్తామన్న సంపన్న దేశాల వాగ్దానాలు నీటిమూటలే అవుతున్నాయి. తరచి చూస్తే, గ్రీన్‌హౌస్‌వాయు ఉద్గారాల్లో సింహ భాగం పెద్ద దేశాలదే. మాటలే తప్ప చేతల్లేవు 2022లో ప్రపంచ దేశాలన్నీ కలిపి విడుదల చేసిన గ్రీన్హౌస్ వాయువుల పరిమాణమెంతో తెలుసా? ఏకంగా 5,000 కోట్ల మెట్రిక్ టన్నులు! పర్యావరణ కాలుష్య కారకాల్లో అతి ముఖ్యమైనవి గ్రీన్హౌస్ ఉద్గారాలే. భూగోళాన్ని వేడెక్కించడంలో కూడా వీటిదే ప్రధాన పాత్ర. ఇంతటి ప్రమాదకరమైన సమస్య విషయంలో మన నిర్లిప్త వైఖరికి ఏత ఏడాది గ్రీన్‌హౌజ్ వాయు ఉద్గారాల పరిమాణం మరో తాజా ఉదాహరణ మాత్రమే. ఈ పాపంలో సంపన్న దేశాల పాత్రే ఎక్కువ. చైనా విషయమే తీసుకుంటే, గతేడాది ప్రపంచ గ్రీన్హౌస్ ఉద్గారాల్లో ఆ ఒక్క దేశం వాటాయే ఏకంగా 30 శాతం! 2022లో అది 1,440 కోట్ల టన్నుల మేరకు కార్బన్ డయాక్సైడ్ (సీఓటూ) ఉద్గారాలను వాతావరణంలోకి విడుదల చేసిన చెత్త రికార్డును మూటగట్టుకుంది. కొన్ని దశాబ్దాలుగా చైనా పారిశ్రామిక వ్యవస్థ ప్రధానంగా బొగ్గుపై ఆధారపడటమే ఇందుకు ప్రధాన కారణం. ఇక 639 కోట్ల టన్నులతో అమెరికా రెండో స్థానంలో ఉంది. 343 కోట్ల టన్నులతో యూరోపియన్ యూనియన్(ఈయూ) నాలుగో స్థానంలో ఉంది. గణాంకాలపరంగా 352 కోట్ల టన్నులతో ఈ జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉన్నట్టు కనిపించినా జనాభాను బట్టి చూస్తే కర్బన ఉద్గారాల పాపంలో మన వాటా నిజానికి చాలా తక్కువ. మన తలసరి వార్షిక కర్బన ఉద్గారాలు కేవలం 2.5 టన్నులు! ప్రపంచ వేదికలపై పెద్ద మాటలు చెప్పే అమెరికాదే ఈ పాపంలో అగ్ర స్థానం! ఒక్కో అమెరికన్ ఏటా సగటున 19 టన్నుల సీఓటూ ఉద్గారాలకు కారకుడవుతున్నాడు. కేవలం 2.5 కోట్ల జనాభా ఉన్న ఆ్రస్టేలియాలో తలసరి కర్బన ఉద్గారాలు 20 టన్నులు, 3.8 కోట్ల జనాభా ఉన్న కెనడాలో 18 టన్నులు, 14 కోట్ల జనాభా ఉన్న రష్యాలో 14 టన్నులు! 20.7 టన్నుల తలసరి ఉద్గారాలతో సౌదీ అరేబియా ఈ జాబితాలో అగ్ర స్థానంలో ఉండటం విశేషం. మొత్తమ్మీద ప్రపంచ కర్బన ఉద్గారాల్లో చైనా, అమెరికా, ఈయూ వాటాయే దాదాపు సగం! వీటిలోనూ చారిత్రకంగా చూసుకుంటే అమెరికా, ఈయూ రెండే ప్రపంచ కాలుష్యానికి ప్రధాన కారకులుగా ఉంటూ వస్తున్నాయి. వేడెక్కుతున్న భూమి భూగోళపు ఉష్ణోగ్రత పారిశ్రామికీకరణకు ముందు నాటితో గత 150 ఏళ్లలో 1.5 డిగ్రీలకు మించి పెరిగిపోయింది! ఇటీవల ఒకానొక దశలో అది 2 డిగ్రీలకు మించి కలవరపరిచింది కూడా. దాన్ని 1.5 డిగ్రీలకు మించకుండా కట్టడి చేయాలన్న పారిస్ ఒప్పందానికి ప్రపంచ దేశాలన్నీ పేరుకు అంగీకరించాయే తప్ప ఆచరణలో చేస్తున్నది పెద్దగా కన్పించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రపంచం ఇప్పుడు ఏ క్షణమైనా పేలనున్న మందుపాతర మీద ఉందని ఐక్యరాజ్యసమితి తాజాగా ఆందోళన వెలిబుచి్చంది. కర్బన ఉద్గారాల ప్రవాహం ఇలాగే కొనసాగి గ్లోబల్ వార్మింగ్ పెరుగుతూ పోతే ప్రపంచ దేశాలన్నీ ఎలాగోలా ప్రస్తుత పర్యావరణ లక్ష్యాలను చేరుకున్నా భూమి 2 డిగ్రీలను మించి వేడెక్కడం ఖాయమని హెచ్చరించింది. అప్పుడు కనీవినీ ఎరగని ఉత్పాతాలను, ఘోరాలను నిత్యం కళ్లజూడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. ఇంతటి విపత్కర పరిస్థితుల నేపథ్యంలో దుబాయ్‌లో అంతర్జాతీయ పర్యావరణ సదస్సు కాప్–28 జరుగుతోంది. అందులోనైనా కర్బన ఉద్గారాలకు కళ్లెం వేసి భూగోళాన్ని కాపాడుకునే దిశగా ఏమైనా నిర్ణయాత్మకమైన అడుగులు పడతాయేమో చూడాలి. ఏమిటీ కర్బన ఉద్గారాలు? బొగ్గు, చమురు, గ్యాస్‌ను మండించినప్పుడు అవి వాతావరణంలోకి భారీ పరిమాణంలో కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తాయి. అది కొన్ని వందల ఏళ్లపాటు వాతావరణంలోనే ఉండిపోయి భూమిని వేడెక్కిస్తూ ఉంటుంది. ‘‘ఆ లెక్కన భూమికి ముప్పు కేవలం 2022 తాలూకు కర్బన ఉద్గారాలు మాత్రమే కాదు. పారిశ్రామికీకరణ ఊపందుకున్నాక గత 150 ఏళ్లలో విడుదలైన కర్బన ఉద్గారాలన్నీ ఇప్పటికీ భూమిని వేడెక్కిస్తూనే ఉన్నాయి. ఆ లెక్కన ఈ 150 ఏళ్లలో అత్యధిక కర్బన ఉద్గారాలకు కారణమైన అమెరికాదే గ్లోబల్ వార్మింగ్‌లో ప్రధాన పాత్ర అని చెప్పాల్సి ఉంటుంది’’ అని బ్రిటన్‌లోని ఎక్స్టర్ యూనివర్సిటీ పర్యావరణ శాస్త్రవేత్త పియరీ ఫ్రెడ్లింగ్‌స్టెయిన్ కుండబద్దలు కొట్టారు! – సాక్షి, నేషనల్ డెస్క్ -
మంచు‘మాయం’
సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా భూతాపం పెరిగిపోతోంది. మంచుపర్వతాలు కరిగిపోతున్నాయి. హిమానీనదాలు క్రమంగా మాయమైపోతున్నాయి. ఆసియాలోని హిందూ కుష్‌తో పాటు పెరూ మంచు పర్వతాల్లోని హిమానీనదాల తగ్గుదల పర్యావరణవేత్తలను, శాస్త్రవేత్తలను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రపంచంలోని హిమానీనదాల్లో దశాబ్ద కాలంలో 332 గిగాటన్నుల మంచు అదృశ్యమైందని అంచనా. ఇక ఆసియాలోని హిందూ కుష్ హిమాలయాలు అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, చైనా, భారత్, మయన్మార్, నేపాల్, పాకిస్తాన్ మీదుగా 3,500 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. ప్రస్తుతం ఇవి వేగంగా కరిగిపోతున్నాయి. ఈ శతాబ్దం చివరి నాటికి వాటి పరిమాణంలో 75 శాతం వరకు కోల్పోయే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదే జరిగితే.. ఈ హిమానీనదాల దిగువ ప్రాంతాలను వరదలు ముంచెత్తుతాయని, తీవ్ర నీటి ఎద్దడి తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దాదాపు 200 కోట్ల మంది ప్రజలపై ఈ ప్రభావం పడుతుందని చెబుతున్నారు. హిమాలయ పర్వతాల దిగువున ఉన్న 12 హిమానీనదాల్లోని నీటి లభ్యత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరెస్ట్ శ్రేణుల్లో గత 30 ఏళ్లలోనే 2 వేల సంవత్సరాలకు సంబంధించిన మంచు కరిగిపోయిందని పరిశోధకులు తేల్చారు. భూతాపంతో భారీ నష్టం.. భూతాపాన్ని 1.5 డిగ్రీల వద్ద కట్టడి చేయడంలో ప్రపంచ దేశాలన్నీ విఫలమయ్యాయి. ఫలితంగా సెప్టెంబర్ 17న భూతాపం 2 డిగ్రీల మార్కును చేరుకుంది. ఇదే పరిస్థితి కొనసాగితే హిందూకుష్ హిమానీ నదాలు 2100వ సంవత్సరం నాటికి 30 నుంచి 50 శాతం మేర కనుమరుగవుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా భూతాపం 3 డిగ్రీల మార్కుకు చేరితే నేపాల్, భూటాన్లలో 75 శాతం మేర మంచు కరిగిపోయే ప్రమాదముంది. అదే 4 డిగ్రీలకు పెరిగితే నష్టం 80 శాతానికి చేరుకుంటుంది. పెరూలో దారుణ పరిస్థితి.. ప్రపంచంలోని ఉష్ణమండల హిమానీనదాల్లో 68 శాతం పెరూలో ఉన్నాయి. గత ఆరు దశాబ్దాల్లో తలెత్తిన వాతావరణ మార్పుల వల్ల పెరూలోని హిమానీనదాల వైశాల్యం సగానికి పైగా తగ్గిపోయింది. 2016– 2020 మధ్య తలెత్తిన వాతావరణ మార్పులతో 175 హిమానీనదాలు అంతరించిపోయినట్టు పెరూవియన్ శాస్త్రవేత్తలు తేల్చారు. ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించి తాజా పరిస్థితిని అంచనా వేస్తున్నారు. పెరూలోని కొన్ని పర్వత శ్రేణుల్లో ప్రస్తుతం 1,050 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోనే మంచు ఉంది. 1962వ సంవత్సరంలో 2,399 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మంచు ఉండేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూతాపం ఇలాగే కొనసాగితే పెను వినాశనం తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. -
Climate Change: డేంజర్ మార్క్ దాటేశాం
భయపడుతున్నంతా అవుతోంది. మితిమీరిన కాలుష్యం, ఇంధన వాడకం, అడ్డూ అదుపూ లేని పారిశ్రామికీకరణ, విచ్చలవిడిగా అడవుల నరికివేత భూమిని శరవేగంగా వినాశనం వైపు నెడుతున్నాయి. వీటివల్ల భూతాపోన్నతి అతి త్వరలో ‘2 డిగ్రీ’ల అంతిమ హద్దును దాటుతుందని, అదే జరిగితే సర్వనాశనమేనని పర్యావరణప్రియులు, శాస్త్రవేత్తలు కొన్ని దశాబ్దాలుగా హెచ్చరిస్తుండటం తెలిసిందే. ఈ పెను విపత్కర పరిస్థితిని నివారించడమే ఏకైక లక్ష్యంగా చిన్నా పెద్దా దేశాలన్నీ దశాబ్దాలుగా మేధోమథనం చేస్తున్నాయి. గ్లోబల్ వారి్మంగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు భారీ లక్ష్యాలు నిర్దేశించుకుంటూ వస్తున్నాయి. అందుకు వందల కోట్ల డాలర్లను కేటాయిస్తున్నట్టు ప్రకటనలు చేస్తున్నాయి. అవన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయని, ఆ లక్ష్యాల సాధనకు క్షేత్ర స్థాయిలో చేస్తున్నదేమీ లేదని తేలిపోయింది. నవంబర్ 17న అంతటి విపత్కర పరిస్థితిని భూమి తొలిసారిగా రుచిచూసింది. భూతాపంలో గత శుక్రవారం తొలిసారి ఏకంగా 2 డిగ్రీల పెరుగుదల నమోదైంది! భూగోళాన్ని మనం శరవేగంగా వినాశనం దిశగా నెడుతున్నామనేందుకు ఇది తాజా హెచ్చరిక సంకేతమేనని సైంటిస్టులు ఆందోళన చెందుతున్నారు...! వినాశనమే...? గ్లోబల్ వారి్మంగ్‌తో ఎదురయ్యే ప్రమాదాన్ని కళ్లకు కట్టేందుకు పర్యావరణవేత్తలు భూతాపాన్ని పారిశ్రామికీకరణకు ముందు నాళ్లతో, అంటే 1850–1900 మధ్య కాలంతో పోల్చి చెబుతుంటారు. అప్పటితో పోలిస్తే భూతాపం ఇప్పటికే 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ దాకా పెరిగిపోయింది. దానికే కొన్నేళ్లుగా కనీవినీ ఎరగని ఉత్పాతాలతో ప్రపంచమంతా అతలాకుతలమైపోతోంది. అలాంటిది, నవంబర్ 17న సగటు భూతాపంలో పెరుగుదల కొద్దిసేపు ఏకంగా 2.06 డిగ్రీలుగా నమోదైందని యూరప్‌లోని కోపరి్నకస్ వాతావరణ మార్పుల సంస్థ సోమవారం ప్రకటించింది! 1991–2020 మధ్య నమోదైన భూతాప సగటుతో పోలి్చనా ఇది ఏకంగా 1.17 డిగ్రీలు ఎక్కువని సంస్థ డిప్యూటీ డైరెక్టర్ సమంతా బర్గెస్ ఆందోళన వెలిబుచ్చారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆమె చేసిన పోస్టు పర్యావరణవేత్తల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ‘‘గ్లోబల్ వారి్మంగ్‌కు అడ్డుకట్ట వేయకుంటే సర్వనాశనం తప్పదన్న హెచ్చరికలను సంపన్న దేశాలు పెడచెవిన పెడుతున్నాయని తేలిపోయింది. భూమిపై జీవజాలాన్ని తుడిచిపెట్టగల ఈ ప్రమాదానికి అడ్డుకట్ట వేసేందుకు కృషి చేస్తున్నామన్న మాటలు నీటి మూటలేనని రుజువైంది’’ అంటూ వారు మండిపడుతున్నారు. మానవాళి చరిత్రలో నవంబర్ 17 దుర్దినమేనని సైంటిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘కాప్’ లక్ష్యాలన్నీ గాలికి... గ్లోబల్ వారి్మంగ్ను 2 డిగ్రీల కంటే తక్కువ స్థాయికి, సరిగ్గా చెప్పాలంటే 1.5 డిగ్రీలకు పరిమితం చేసి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని పారిస్ పర్యావరణ సదస్సులో ప్రపంచ దేశాలు ప్రతినబూనాయి. దాని సాధనే ప్రధాన లక్ష్యంగా ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఏటా కాప్ సదస్సులు నిర్వహించుకుంటూ వస్తున్నాయి. కాప్–27 పర్యావరణ సదస్సు గతేడాది నవంబర్‌లో జరిగింది. పర్యవారణ లక్ష్యాల సాధనకు ఆర్థిక వనరుల్లేని పేద దేశాలకు వందలాది కోట్ల డాలర్లు గ్రాంట్‌గా అందజేసేందుకు సంపన్న దేశాలన్నీ అంగీకరించాయి. గ్లోబల్ వారి్మంగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు తామంతా కూడా చిత్తశుద్ధితో కృషి చేస్తామని ప్రకటించాయి. ముఖ్యంగా శిలాజ ఇంధనాల వాడకాన్ని దాదాపుగా తగ్గించేస్తామని చెప్పుకొచ్చాయి. కానీ వాస్తవంలో జరుగుతున్నది వేరు... ► చాలా దేశాలు శిలాజ ఇంధనోత్పత్తిని 2030కల్లా రెట్టింపు, అంతకంటే ఎక్కువ చేయనున్నాయని ఐరాస గత వారం విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది! ► గ్లోబల్ వారి్మంగ్ 1.5 శాతానికి పెరగకుండా ఉండాలంటే కర్బన ఉద్గారాలను 2030కల్లా 45 శాతం తగ్గించాల్సి ఉంది. గత కాప్ సదస్సులో దేశాలన్నీ నిర్దేశించుకున్న లక్ష్యం కూడా అదే. కానీ అన్ని దేశాలూ తమ తమ పర్యావరణ లక్ష్యాలను సాధించినా కర్బన ఉద్గారాలు 2030కల్లా 9 శాతం పెరుగుతాయని హెచ్చరించింది. ► గ్లోబల్ వార్మింగ్ ఉత్పాతానికి అడ్డుకట్ట వేసేందుకు దేశాలు చేయాల్సినంత ప్రయత్నం చేయడం లేదని పలు అంతర్జాతీయ పర్యావరణ నివేదికలు కూడా ముక్త కంఠంతో ఘోషిస్తున్నాయి. ► ముఖ్యంగా గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారాన్ని తగ్గించేందుకు కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టడం చాలా అవసరమని బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్‌లో క్లైమేట్ సైన్స్ ప్రొఫెసర్ రిచర్డ్ అలన్ స్పష్టం చేస్తున్నారు. ► గత సదస్సుల వాగ్దానాలేవీ ఆచరణలోకి రాలేదన్న పెదవి విరుపుల మధ్య మరో రెండు వారాల్లో దుబాయ్‌లో కాప్–28 సదస్సు జరగనుంది. అందులో ఏమేం చర్చిస్తారో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి! వినాశనమే...? ఉష్ణోగ్రతలో ఒకట్రెండు డిగ్రీల పెరుగుదలతో ఏమవుతుంది లెమ్మనుకుంటే చాలా పొరపాటు. భూమి సగటు ఉష్ణోగ్రత అతి తక్కువగా పెరిగినా తీవ్ర పర్యవసానాలుంటాయి. అలాంటిది ఒక డిగ్రీ పెరిగిందంటే అది తీవ్ర ప్రభావమే చూపుతుంది. పారిశ్రామికీకరణకు ముందు నాటితో పోలిస్తే అదే జరుగుతోంది! గత వందేళ్లలో భూతాపం విపరీతంగా పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే సగటున ఒకటిన్నర డిగ్రీల మేరకు పెరిగిపోయింది. దాంతో నానారకాల పర్యావరణ ఉత్పాతాలతో మానవాళి అతలాకుతలం అవుతోంది. అదే ఉష్ణోగ్రతలో పెరుగుదల గనక 2 డిగ్రీలకు చేరితే కనీవినీ ఎరగని వినాశనం, కష్టనష్టాలు తప్పవని పర్యావరణవేత్తలు ఎప్పట్నుంచో నెత్తీనోరూ బాదుకుంటున్నారు. భూతాపోన్నతి 1.5 డిగ్రీలను దాటిన కొద్దీ దారుణాలు జరుగుతాయి. అదే 2 డిగ్రీలు పెరిగిందంటే... ► పెను తుఫాన్లు, తీవ్ర దుర్భిక్షం వంటి అతి దారుణ పరిస్థితులు తలెత్తుతాయి. ► పర్యావరణ సంతులనాన్ని కాపాడటంలో అతి కీలకమైన కోరల్ రీఫ్‌లు, ధ్రువ ప్రాంతపు మంచు పొరలు సమూలంగా తుడిచిపెట్టుకుపోతాయి. ► పర్యావరణ వ్యవస్థ మరింకెప్పటికీ ఎన్నటికీ బాగుచేయలేనంతగా పాడైపోతుంది. ► క్రమంగా భూమి నివాసయోగ్యం కాకుండా పోతుంది. ► జీవ, జంతు జాలాల మనుగడ ప్రమాదంలో పడుతుంది. ► అత్యుష్ణ పరిస్థితులు స్థిరంగా కొనసాగితే జీవజాలం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినా ఆశ్చర్యం లేదు. ► గత 12 నెలలు ఆధునిక ప్రపంచ చరిత్రలోనే అత్యంత వేడి నెలలుగా రికార్డుకెక్కాయి. గత ఏడాది కాలంలో పాకిస్తాన్, ఉత్తర అమెరికాలో తీవ్ర వరదలు, ఆస్ట్రేలియా, అమెరికాల్లో కార్చిచ్చులు, మంచు తుఫాన్ల వంటి వైపరీత్యాలతో ప్రపంచం అల్లాడింది. ► మన దేశంలో చూసుకుంటే పారిశ్రామికీకరణకు ముందు చెన్నై సగటు ఉష్ణోగ్రత 28 డిగ్రీలుండేది. ఇప్పుడది 29.5 డిగ్రీలు దాటేసింది! ఇదే ధోరణి దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ ప్రతిఫలిస్తోంది. ► ఇటీవలే ఉత్తరాఖండ్‌లో భూమి బీటలుబారడం తెలిసిందే. భూతాపంలో పెరుగుదల 2 డిగ్రీల సెంటీగ్రేడ్ల సరిహద్దును దాటింది కొద్దిసేపు మాత్రమే. కానీ భూమి నానాటికీ ఆమోదయోగ్యం కానంతగా వేడెక్కిపోతోందనేందుకు ఇది అతి పెద్ద సంకేతం. ఇదే ధోరణి ఇంకొంతకాలం కొనసాగితే దిద్దుబాటు అసాధ్యమే కావచ్చు! – సమంతా బర్గెస్, డిప్యూటీ డైరెక్టర్, కోపర్నికస్ వాతావరణ మార్పుల సంస్థ – సాక్షి, నేషనల్ డెస్క్ -
2023 హాటెస్ట్ వేసవి
2023లో ఎండలు అక్షరాలా మండిపోయా యి. ఎంతగా అంటే, మానవ చరిత్రలో రికార్డయిన అత్యంత హెచ్చు ఉష్ణోగ్రతలు ఈ ఎండాకాలంలోనే నమోదయ్యాయి. ఈ ఏడాదే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న రికార్డులు బద్దలయ్యేంతటి వడ గాడ్పులు, వాటి అనంతర పరిణామాలు ఇందుకు మరింతగా దోహదం చేశాయి. కొన్ని దశాబ్దాలుగా భూగోళం అంతటా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్న పరిణామానికి ఇది ప్రమాదకరమైన కొనసాగింపేనని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు... 2023 వేసవి 1880లో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ వివరాలు నమోదు చేయడం మొదలు పెట్టిన నాటినుంచి అత్యంత వేడిమితో కూడినదిగా రికార్డు సృష్టించింది. ఈ ఆందోళనకర గణాంకాలను న్యూయార్క్‌లోని నాసాకు చెందిన గొడార్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ (జీఐఎస్ఎస్) వెల్లడించింది. ‘ఇప్పటికైనా మేలుకుని గ్లోబల్ వారి్మంగ్‌కు, ముఖ్యంగా విచ్చలవిడిగా సాగిస్తున్న పర్యావరణ విధ్వంసానికి అడ్డుకట్ట వేయడం ప్రపంచ దేశాల ముందున్న తక్షణ కర్తవ్యం’ అని పర్యావరణ ప్రియులు, శాస్త్రవేత్తలు∙ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పులి మీద పుట్రలా... ఈ వేసవిలో ఎండలు గత రికార్డులన్నింటిన్నీ బద్దలు కొట్టడం వడ గాడ్పుల పాత్ర చాలా ఎక్కువే. ఈ ఏడాది ప్రపంచంలో చాలా ప్రాంతాలను అవి తీవ్రంగా వణికించాయి... ► ఇటు అమెరికా నుంచి అటు జపాన్ దాకా, యూరప్ నుంచి దక్షిణ అమెరికా ఖండం దాకా కానీ వినీ ఎరగని స్థాయిలో వేడి గాలులు అతలాకుతలం చేసి వదిలాయి. ► ఇటలీ, గ్రీస్ తో పాటు పలు మధ్య యూరప్ దేశాల్లో విపరీతమైన వర్షపాతానికి కూడా ఈ గాలులు కారణమయ్యాయి. ► ఈ వడ గాడ్పుల దుష్పరిణామాలను ఏదో ఒక రూపంలో ప్రపంచమంతా చవిచూసింది. ఇవీ రికార్డులు... ఈ ఏడాది ఎండలు అన్ని రికార్డులనూ బద్దలు కొట్టి పర్యావరణ ప్రియుల ఆందోళనలను మరింతగా పెంచాయి. ► ముఖ్యంగా జూన్, జూలై, ఆగస్ట్ ఉమ్మడి ఉష్ణోగ్రతలు నాసా రికార్డుల్లోని గత అన్ని గణాంకాల కంటే 0.23 డిగ్రీ సెంటిగ్రెడ్ ఎక్కువగా నమోదయ్యాయి. ► అదే 1951–1980 మధ్య అన్నీ వేసవి కా సగటు ఉష్ణోగ్రత కంటే ఏకంగా 1.2 డిగ్రీ సెంటిగ్రేడ్ ఎక్కువగా తేలాయి! మేలుకోకుంటే అంతే... గ్రీన్ హౌస్, కర్బన ఉద్గారాలు ఉష్ణోగ్రతల్లో విపరీతమైన పెరుగుదలకు ప్రధాన కారణమని నాసా జెట్ ప్రొపల్షన్ లేబోరేటరీలో క్లైమేట్ సైంటిస్ట్, ఓషనోగ్రఫర్ జోష్ విల్లిస్ అంటున్నారు. ‘ కొన్నేళ్లుగా భూగోళం స్థిరంగా వేడెక్కుతూ వస్తోంది. ప్రధానంగా మనిషి నిర్వాకమే ఈ వాతావరణ అవ్యవçస్థకు దారి తీస్తోంది. సాధారణంగా కూడా ఎల్ నినో ఏర్పడ్డప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగడం రివాజు’ అని ఆయన అన్నారు. ఎలా నమోదు చేస్తారు? నాసా ఉష్ణోగ్రతల రికార్డు పద్ధతిని జిస్ టెంప్ అని పిలుస్తారు. ► దీనిలో భాగంగా భూ ఉపరితల ఉష్ణోగ్రతలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేల వాతావరణ కేంద్రాల ద్వారా ఎప్పటికప్పుడు సేకరిస్తారు. ► నౌకలు తదితర మార్గాల ద్వారా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలను కూడా సేకరిస్తారు. ► 1951–1980 మధ్య కాలాన్ని సూచికగా తీసుకుని, ఆ 30 ఏళ్ల సగటుతో పోలిస్తే ఏటా ఉష్ణోగ్రతల తీరుతెన్నులు ఎలా ఉన్నదీ లెక్కిస్తారు. మరీ విపరీతమైన మార్పులుంటే తక్షణం అన్ని దేశాలనూ అప్రమత్తం చేస్తారు. ‘ఈ రికార్డు స్థాయి ఉష్ణోగ్రతల దు్రష్పభావం మున్ముందు కూడా ప్రపంచం మొత్తం మీదా చెప్పలేనంతగా ఉండనుంది’ – బిల్ నెల్సన్, నాసా అడ్మినిస్ట్రేటర్ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో అత్యంత హెచ్చుదల నమోదవడమే ఈసారి కనీ వినీ ఎరుగని ఎండలకు ప్రధాన కారణం. – జోష్ విల్లిస్, క్లైమేట్ సైంటిస్ట్, ఓషనోగ్రఫర్, నాసా జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ – సాక్షి, నేషనల్ డెస్క్ -
డేంజర్ జోన్లో భారత్, తీవ్రవైన కరువు దేశంగా..
భూతాపం కారణంగా తీవ్రమైన కరువును ఎదుర్కోవాల్సిన దేశాలలో భారత్ కూడా ఉంది.రాబోయే 30 ఏళ్ళల్లో ఈ తీష్ణత మరింతగా పెరుగుతూ ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.భారతదేశంలోని 50 శాతం మందిపై కరువు బరువు పడే సూచనలు కనిపిస్తున్నాయి.భూతాపం 3డిగ్రీల సెల్సియస్ పెరిగితే చాలు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని నివేదికలు చెబుతున్నాయి. 1.5 డిగ్రీల సెల్సియస్ పెరిగినా పరిణామాలు తీవ్రంగానే ఉండనున్నాయి.ముఖ్యంగా వ్యవసాయభూమి దాదాపు సగానికి పైగా కరువుక్షేత్రంగా మారిపోతుందని పరిశోధకులు చెబుతుంటే ఒళ్ళు గగుర్పొడుస్తోంది. ప్యారిస్ ఒప్పందంలో చెప్పినట్లుగా ఉష్ణోగ్రతలను పారిశ్రామిక యుగం నాటికి తీసుకురాగలిగితే చాలా వరకూ ముప్పును తప్పించుకో గలుగుతాం. ఆచరణలో అది జరిగేపనేనా? అన్నది పెద్దప్రశ్న. భూమి వేడిక్కిపోతోందిరా! బాబూ అంటూ శాస్త్రవేత్తలు నెత్తినోరు మొత్తుకుంటూనే ఉన్నారు. పర్యావరణ పరిరక్షణకై ఎప్పటి నుంచో ఎన్నో ఉద్యమాలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ వేదికలపై దేశాధినేతలు కలుసుకున్నప్పుడల్లా చర్చించే అంశాల్లో ఇదొకటి.ఉపన్యాసాలు, ఒప్పందాలు, నినాదాలు తప్ప అంతటా ఆచరణ శూన్యం. భూమి వేడిక్కిపోతున్న ప్రభావంతో శీతోష్ణస్థితుల్లో తీవ్రమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఉష్ణోగ్రతలను కొలవడం ద్వారా దుష్ప్రభావాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. ఆ వివరాలను సంబంధిత విభాగాలు ప్రపంచానికి తెలియజేస్తూనే ఉన్నాయి.వాతావరణంలో మార్పులు చేర్పులు అన్నది అనాదిగా జరిగే పరిణామం. శీతోష్ణస్థితుల ప్రభావం ప్రపంచంపై, మానవుల మనుగడపై ఎంతో శక్తివంతంగా పనిచేస్తూ ఉంటుంది. ముఖ్యంగా, 20వ శతాబ్దం మధ్యకాలం నుంచీ ఉష్ణోగ్రతల్లో పెరుగుదల అసాధారణ స్థితికి చేరిపోయింది.ఈ ప్రభావంతో రుతువుల ప్రయాణం కూడా గతితప్పింది. అకాల వర్షాలు, ప్రకృతి భీభత్సాలు, కరువుకాటకాలు, వింత వింత జబ్బులు అన్నింటికీ భూమి వేడెక్కిపోవడమే ప్రధాన కారణం. పారిశ్రామికం వెర్రితలలు వేసి,ఆర్ధిక స్వార్థం ప్రబలి, హరిత చైతన్యం అడుగంటడం వల్ల అనర్ధాలు జరుగుతున్నాయి.ఆరోగ్యకరమైన అభివృద్ధికి అవరోధాలు పెరుగుతున్నాయి.కార్బన్ డై ఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారమే కొంప ముంచుతోంది. భూమి వేడెక్కిపోవడం వల్ల ఏర్పడుతున్న పరిణామాలు విస్తృతంగా ఉంటాయి.సముద్ర మట్టాలు పెరిగిపోవడం, మహా సముద్రాల ఆమ్లీకరణం,అడవులు మండిపోవడం, అనేక జాతులు అంతరించిపోవడం, పంటల దిగుబడి తగ్గిపోవడం, ఆహారకొరత చుట్టుముట్టడం మొదలైన ఎన్నో దుష్పరిణామాలు సంభవిస్తున్నాయి. సముద్ర తీర ప్రాంత వాసులు ఖాళీ చేసి వేరే ప్రాంతాలకు కూడా తరలిపోవాల్సి వస్తుంది.భూతాపాన్ని అడ్డుకోవడం అందరి సమిష్టి బాధ్యత. ప్రభుత్వాలు, పారిశ్రామిక వర్గాలు, ప్రజలు అందరూ కలిసి రంగంలోకి దిగాలి. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ దుస్థితికి కారణం మనిషి. మనిషిలోని స్వార్ధ చింతన, బాధ్యతా రాహిత్యం, రేపటి పట్ల ఏ మాత్రం స్పృహ లేకపోవడం ఈ దుస్థితికి చేర్చాయి. ఐక్య రాజ్య సమితి ఇటీవల నిర్వహించిన సమావేశంలోనూ ఈ అంశం బలంగా చర్చకు వచ్చింది. ఉద్గారాలను పెద్దఎత్తున తగ్గించాలి.భూతాపాన్ని 2 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువకు పరిమితం చేయాలని 2016లో పారిస్ లో ఒప్పందం జరిగింది. ఈ ఆరేడేళ్లలో అది తగ్గకపోగా మరింత పెరిగింది.భూమిని, వనరులను వాడుకొనే విధానంలో పెను అనారోగ్యకరమైన విధానాలు వచ్చాయి. నివాసయోగ్య భూమి -అటవీ భూమి మధ్య ఉన్న నిష్పత్తులు మారిపోయాయి. వ్యవసాయభూమిని వాడుకోవడంలోనూ మార్పులు వచ్చాయి. వ్యవసాయం కంటే మిగిలిన వాటికి ఆ భూమిని వాడే సంస్కృతి పెరిగిపోయింది. పర్యవసానంగా అటవీ భూమి, వ్యవసాయ భూమి తగ్గిపోయింది. కొన్ని రసాయనాల సమ్మేళనం మేఘాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి.భూమికి చేరే సూర్యకాంతి పరిమాణంలో కూడా తగ్గుదల మొదలైంది. దీనిని 'గ్లోబల్ డిమ్మింగ్ ' అంటారు. భూమికి సూర్యుడే ప్రధానమైన శక్తి.ఆ వనరులు తగ్గిపోవడం అత్యంత ప్రమాదకరం.ఇప్పటికైనా మేలుకోవాలి. గ్రీన్ వాయివులను తగ్గించుకోవాలి. సౌరశక్తి, పవన శక్తిని ఎక్కువగా సద్వినియోగం చేసుకోవాలి. కార్బన్ వాడకాన్ని తగ్గించడం ఎంత ముఖ్యమో,అడవులను పెంచడం అంతకంటే ముఖ్యం. పబ్లిక్ రవాణా విధానంలో చాలా మార్పులు రావాలి.కార్లు మొదలైన వాహనాల వాడకం తగ్గించి, నడక, సైకిళ్ల వాడకం పెంచమని నిపుణులు సూచిస్తున్నారు.భూతాపం వల్ల 2030 నాటికి మరో 12 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికంలోకి వెళ్ళనున్నారని నివేదికలు చెబుతున్నాయి.వాతావరణాన్ని మనకు అనుకూలంగా మలుచుకోవడంలో ఆరోగ్యకరమైన విధానాలను పాటిస్తే ఉధృతి తీవ్రత తగ్గుముఖం పడుతుంది. ప్రకృతిని గౌరవిస్తే, అది మనల్ని కాపాడుతుంది. -మాశర్మ, సీనియర్ జర్నలిస్ట్