కొద్దిమంది వృద్ధుల్ని మినహాయిస్తే, అనంతపురం జిల్లాలోని ఒక గ్రామంలో జనం మొత్తంగా వలస వెళ్లిపోయారు. ఇది ఒక గ్రామం కథ మాత్రమే కాదు.. భారతదేశంలో కరువు పీడిత ప్రాంతాలన్నింటి వ్యథా ఇలాగే ఉంటోంది. ఉన్న ఊరులో బతికే పరిస్థితులు లేక మొత్తం జనం పనుల కోసం వలస వెళ్లిపోతున్నారంటే.. మన గ్రామీణ ప్రాంతాలు చాలావరకు నిర్మానుష్యంగా మారుతున్నాయని అర్థం. రుతుపవనాల రాకలో జాప్యం, వర్షపాతం తగ్గుముఖం పట్టడం, వీటి ప్రభావంతో ఉష్ణోగ్రత తారస్థాయికి చేరడం ఫలితంగా భారతదేశంలోని నగరాలు, పట్టణాలు, పల్లెల్లో భూగర్భ జలాలు వట్టిపోతున్నాయి. సంప్రదాయక నీటి వనరుల పరిరక్షణ, అడుగంటిన భూగర్భ జలాలను రీచార్జ్ చేయడం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. అభివృద్ధి పేరిట అడవుల్ని, జల వ్యవస్థలను విధ్వంసం చేసే ప్రక్రియను నిలిపివేయాలి.
‘‘అందరికీ అభినందనలు... మనం ఈ సంవత్సరం 50 డిగ్రీల ఉష్ణోగ్రతను సాధిం చాము. వచ్చే సంవత్సరం 60 డిగ్రీల ఉష్ణోగ్రతను సాధించడానికి మనం మరిన్ని చెట్లను నరికేద్దాం పదండి’’ పూర్తిగా వ్యంగ్యాన్ని చొప్పిస్తూ పోస్ట్ చేసిన ట్వీట్ నిజంగానే షాక్ కలిగించింది. అయితే ఈ వ్యంగ్యం ట్విట్టర్‌ను అనుసరిస్తున్న మెజారిటీ పాఠకుల తలకెక్కిందా లేక ఎక్కువమంది జనాలను స్థిమితంగా ఆలోచింపజేసిందా అనేది తేల్చి చెప్పడం కష్టమే. ఈ ట్విట్టర్ వ్యాఖ్య ప్రభావం ఎంత అనే చర్చ పక్కన బెట్టి చూస్తే, గత 140 ఏళ్లలో అంటే ఉష్ణోగ్రతల స్థాయిలను ప్రపంచం నమోదు చేయడం మొదలు పెట్టిన తర్వాత నాలుగో అత్యంత ఉష్ణోగ్రతా సంవత్సరంగా 2018 సంవత్సరం చరిత్రకెక్కింది.
2019 సంవత్సరంలో మరింత ఉష్ణోగ్రత ఉంటుందని నాసా అంచనా. ఇప్పటికే వేడి మనుషులను అమాంతంగా చంపేస్తోంది. ఈ సంవత్సరం మార్చి నుంచి మే వరకు రుతుపవనాలకు ముందస్తుగా కురిసే వర్షపాతం భారత్‌లో 22 శాతం లోటును నమోదు చేసింది. ఇది గత 65 ఏళ్లలో రెండో అత్యంత తక్కువ వర్షపాతం. ఈ ఏడు రుతుపవనాలు రావడం 15 రోజులు ఆలస్యం కావడంతో పగటి ఉష్ణోగ్రతలు మండిస్తున్నాయి. రాజస్తాన్‌లోని ఛురు ప్రాంతంలో ఈ సీజన్‌లో ఇప్పటికే ఉష్ణోగ్రత 50 డిగ్రీల స్థాయిని మూడుసార్లు దాటేసింది. దేశ రాజధాని ఢిల్లీలో సైతం ప్రస్తుతం 48 డిగ్రీల సెల్సియస్‌తో మునుపెన్నడూ లేనంత అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది.
నీటి వనరుల క్షీణతే కరువుకు కారణం
ఇప్పటికే దేశ భూభాగంలో దాదాపు 43 శాతం కరువుకోరల్లో చిక్కుకుంది. దాదాపు 60 కోట్లమంది కరువు బారిన పడ్డారని అంచనా. ఉష్ణోగ్రత పెరిగిపోవడంతో నీటి వనరులు శుష్కించిపోతున్నాయి. ఎండవేడికి బీళ్లుగా మారిన నేల ఎంత ప్రభావం చూపిస్తుందో మాటల్లో వర్ణిం చలేం. గార్డియన్ పత్రిక రిపోర్టు ప్రకారం భారతదేశంలో వందలాది గ్రామాల్లోని కుటుంబాలకు కుటుంబాలే కాసిన్ని నీటిచుక్కల కోసం తమ ఇళ్లను ఖాళీచేసి వలస పోతున్నాయి. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో కరువు ప్రభావం కారణంగా 50 వేలమంది పైగా రైతులు తమ పశువులను కాపాడుకోవడం కోసం 500 క్యాంపులకు తరలించారు. మహారాష్ట్రలో 1,501 పశు నిర్వహణా శిబిరాలు ఉంటున్నాయి. ఇక్కడ 72 శాతం భూభాగం కరువు బారినపడింది. ఇక ముంబై నగరం చుట్టూ ఉన్న గ్రామాలకు గ్రామాలే ఖాళీ అవుతున్నాయని వార్తలు. ఇక కర్ణాటకలో 88 శాతం పైగా భూభాగం తీవ్రకరువుతో కునారిల్లిపోతోంది. ఈ రాష్ట్రం లోని 176 తాలూకాలలో 156 తాలూకాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించారు. గత 18 ఏళ్లలో 12 సంవత్సరాలు కర్ణాటక కరువు బారిన పడటం గమనార్హం.
2018–19 సంవత్సరానికి సంబంధించి కర్ణాటక ఆర్థిక సర్వే ప్రకారం వ్యవసాయంలో మైనస్ 4.8 శాతం ప్రతికూల వృద్ధి రేటును నమోదు చేసింది. కరువు వ్యవసాయ పంటలకు భారీ నష్టం కలిగించడంతోపాటు, వ్యవసాయాధారిత ఆర్థిక కార్యాచరణ కుప్పగూలిపోయింది. ఒక కర్ణాటక మాత్రమే కాకుండా, దాదాపు సగం దేశంలో క్షీణిస్తున్న భూగర్భజల మట్టాలు చివరకు దేశం దృష్టిని తమవైపు తిప్పుకున్నాయి. రాష్ట్రాల మధ్య, రాష్ట్రంలోని సామాజిక వర్గాల మధ్య, వ్యక్తుల మధ్య నీటికి సంబంధించిన ఘర్షణలకు తోడుగా నీటికోసం క్యూలలో నిలుచున్న వ్యక్తుల మధ్య ఘర్షణలు కూడా గడచిన కొన్ని సంవత్సరాల్లో బాగా పెరుగుతూ వస్తున్నాయి. దీంతో మన విధాన నిర్ణేతలు నీటి పరిరక్షణ, నీటి పొదుపు ప్రాముఖ్యతను ఇప్పుడు గుర్తించక తప్పని పరిస్థితి ఏర్పడింది. దేశంలోని నాలుగు ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలు (బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ)తోసహా 21 నగరాలు 2020 నాటికల్లా భూగర్భజలాలు పూర్తిగా అడుగంటిపోవడాన్ని చవిచూడనున్నాయని నీతి ఆయోగ్ ఇటీవల వెలువరించిన నివేదిక నిజంగానే ప్రమాద ఘటిం కలను మోగిస్తోంది. భూగర్భజలాలు దేశప్రజలకు అవసరమైన 40 శాతం నీటి అవసరాలను తీరుస్తున్నందువల్ల, దేశవ్యాప్తంగా 60 కోట్లమంది ప్రజలు రానున్న జల సంక్షోభం బారిన పడనున్నారు.
జల సంక్షోభం తీసుకువస్తున్న ఘర్షణలు
అయితే భూగర్భ జల మట్టాలు క్షీణించిపోవడం నగరాలకే పరిమితం కాలేదు. నిజానికి భూగర్భజలాలను విచ్చలవిడిగా తోడిపారేయడం వల్లే వర్షపాతం కాసింతమేరకు తగ్గినా సరే అది విధ్వంసకరమైన కరువుకు దారితీస్తోంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో సంవత్సరానికి భూగర్భజలాల క్షీణత రేటు 0.5 మీటర్లకు మించి నమోదవుతోంది. ఇది ఒక మీటర్ వరకు పడిపోతోంది. ఇక ఎండిపోతున్న నదుల నుంచి లభ్యమయ్యే నీరు కూడా తగ్గిపోతోంది. ఇలా నీటి సంక్షోభం ప్రభావాలు ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. ఉదాహరణకు అత్యంత సమృద్దమైన జలరాశికి నిలయమైన నర్మదా నదిలో నీటి లభ్యత గత దశాబ్దకాలంగా తగ్గుముఖం పడుతూ వస్తోంది. కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ అంచనా ప్రకారం దేశంలోని 91 రిజర్వాయర్లలో నీటి మట్టం వాటి సామర్ద్యం కంటే 18 శాతం దిగువకు క్షీణించిపోయింది. పైగా, అనేక డ్యామ్‌ల లోని నీటిని వ్యవసాయ అవసరాలనుంచి తాగునీటితో సహా నగరప్రాంతాల అవసరాలకు మళ్లిస్తున్నారు. దీంతో రైతుల నిరసనలు తీవ్రతరమై గ్రామీణ–పట్టణ ఘర్షణలకు దారితీస్తున్నాయి.
గత కొన్ని సంవత్సరాలుగా నీటి పరిరక్షణ, నీటి నిల్వ, భూగర్భజలాల రీచార్జ్ నుంచి ప్రభుత్వాల ప్రాధమ్యాలు మారిపోయాయి. కరువు ముంచుకొచ్చిన సమయాల్లో కీలకపాత్ర పోషించే సంప్రదాయక నీటి బావుల పునరుద్ధరణ పనులను పెడచెవిన పెడుతూ వచ్చారు. నీటి చెరువుల పునరుద్ధరణ, భూగర్భజలాల రీచార్జికి చేపట్టవలసిన చర్యలు అసంపూర్ణంగా ఉంటున్నాయి. లేదా వాటిని పూర్తిగా వదిలేశాయి. లేక చాలా నత్తనడకన సాగుతున్నాయి. దేశవ్యాప్త్గంగా ఇప్పటికీ 2 లక్షల మేరకు సంప్రదాయక చెరువులు, దిగుడుబావులు ఉంటున్నాయి. వీటన్నింటినీ యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. పంజాబ్‌లో 138 బ్లాక్‌లలో 110 బ్లాకులు డార్క్ జోన్‌లో ఉంటున్నాయి. అంటే వీటీలో నీటిని విపరీతంగా తోడేశారన్నమాట. 15 వేల చెరువులు, గుంతలను పునరుద్ధరించినట్లయితే భూగర్భజలాలు గణనీయంగా మెరుగుపడే అవకాశం ఉంది.
ఇంతవరకు పంజాబ్‌లో 54 గ్రామీణ చెరువులను పునరుద్ధరించారు. ఆశ్చర్యమేమిటంటే, రాజస్థాన్‌లోనూ, తరాలుగా కొనసాగుతున్న అద్భుతమైన నీటి పరిరక్షణ నిర్మాణాలను పునరుద్ధరించడానికి బదులుగా బిందు సేద్యంపైనే ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. కర్ణాటకలో 39వేల సంప్రదాయక చెరువులు, ట్యాంకులు ఉనికిలో ఉంటున్నాయి. వీటిలో దాదాపు మూడొంతులకు పైగా చుక్కనీరు లేకుండా ఎండిపోయాయి. వీటిలో చాలావాటిని ఇప్పటికీ పునరుద్ధరించవచ్చు. ఈలోగా కర్ణాటక రాష్ట్రం జలామృత పథకాన్ని ప్రారంభించి సంప్రదాయక నీటి వనరులను పునరుజ్జీవింప చేయడానికి ప్రయత్నం మొదలెట్టింది. ఇది చాలా మంచి ప్రయత్నమే కానీ సంప్రదాయక నీటి వనరులను పునరుత్థానం చెందించడాన్ని వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సంప్రదాయక జల వనరులను పునరుద్ధరించాలి
సంప్రదాయక నీటి నిల్వ వ్యవస్థలు అదృశ్యమైపోయాయి. కర్ణాటక రాష్ట్రం ‘కల్యాణీస్’ అనే తనదైన సంప్రదాయక నీటి నిల్వ వ్యవస్థను పరిరక్షించాలని ప్రయత్నిస్తోంది. ఒడిశా అయితే ‘కుట్టా, ముండా’ అనే సంప్రదాయక నీటి నిల్వ వ్యవస్థను కలిగి ఉంటోంది. వీటిలో కొన్ని ఇప్పటికీ ఉనికిలో ఉంటున్నాయి. అయితే సంప్రదాయక నీటి నిల్వ వ్యవస్థల చుట్టూ ఉండే సంప్రదాయక జ్ఞానాన్ని మనం ఇప్పటికే చాలావరకు కోల్పోయాం. చాలా సంవత్సరాల క్రితం అమెరికాలోని టెక్సాస్ ఏ– ఎమ్ యూనివర్శిటీకి నేను వెళ్లినప్పుడు వారు తాము అనుసరిస్తున్న తమిళనాడులోని సంప్రదాయక నీటి పరిరక్షణ వ్యవస్థలను నాకు చూపించారు. ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వానికి తనదైన సంప్రదాయక నీటి పరిరక్షణ వ్యవస్థ గురించి ఏమైనా తెలుసా అనేది నాకు తెలీదు. కానీ కొంతకాలం క్రితం సెంటర్ ఫర్ సైన్స్ – ఎన్విరాన్‌మెంట్ సంస్థ దేశంలోని సంప్రదాయక నీటి పరిరక్షణ వ్యవస్థల జాబితాను పొందుపరుస్తూ ‘డైయింగ్ విజ్‌డమ్’ (అంతరిస్తున్న జ్ఞానం) అనే పుస్తకం ప్రచురించింది. జల వనరుల పరిరక్షణకు సంబంధించి అంతరిస్తున్న మన సంప్రదాయక విజ్ఞానాన్ని తిరిగి ఆవిష్కరించవలసిన అవసరం ప్రస్తుతం ఎంతైనా ఉంది.
బోర్‌వెల్స్ ప్రపంచమంతటా రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో సంప్రదాయక నీటి పరిరక్షణ వ్యవస్థల వైపునకు మళ్లీ వెళ్లడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. పైగా బోర్‌వెల్స్ కూడా త్వరలోనో
లేక ఆ తర్వాతో వట్టిపోక తప్పదు. అడుగంటిన భూగర్భ జలాలను రీచార్జ్ చేయడాన్ని అత్యవసర ప్రాతిపదికన చేపట్టాలి. అయితే యధాతథ స్థితి అనేది ఎప్పటిలాగే కొనసాగుతున్న తరుణంలో దీన్ని ఒక విడి చర్యగా చేపట్టకూడదు. అభివృద్ధి పేరిట అడవులను, జల వ్యవస్థలను, నదీపరివాహక ప్రాంతాలను విధ్వంసం చేసే ప్రక్రియను వెంటనే నిలిపివేయాలి. లేకపోతే ఉష్ణోగ్రతలు కనీవినీ ఎరుగని స్థాయికి పెరుగుతుం డటం అనేది మనం ఊహించని ఉపద్రవాలకు దారితీయక మానదు.
వ్యాసకర్త : దేవిందర్‌శర్మ, వ్యవసాయ నిపుణులు
ఈ–మెయిల్ : hunger55@gmail.com
Comments
Please login to add a commentAdd a comment