
2024లో గ్లోబల్ వార్మింగ్ హెచ్చరికలు జారీ
1.5 డిగ్రీలు అధికంగా సగటు భూ ఉపరితల ఉష్ణోగ్రతలు నమోదు
చరిత్రలో తొలిసారి అని ప్రకటించిన ‘సీ3ఎస్’
గ్లోబల్ వార్మింగ్‌కు సమీపిస్తున్నామని హెచ్చరిక
ఈ ఏడాది కూడా ఎండ ప్రచండమే..
కర్బన ఉద్గారాలే ప్రధాన కారణమని స్పష్టీకరణ
సాక్షి, విశాఖపట్నం: భానుడి ప్రకోపానికి భూగోళం భగభగమండుతోంది. పెరుగుతున్న కాలుష్యం మానవాళిని ముప్పు ముంగిటకు నెట్టేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో వేసవి కాలం మొదలైంది. ఈ ఏడాది కూడా భానుడి భగభగలు తప్పవని ప్రపంచ ఉష్ణోగ్రతల డేటా ప్రొవైడర్ కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ (సీ3ఎస్) వెల్లడించింది. పగటి ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది.
భూతాపం భారీగా పెరిగిందని ప్రకటించింది. అదేవిధంగా 2050 నాటికి ప్రీ ఇండస్ట్రియల్ లెవల్ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీలకు చేరుకునే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇప్పటిౖకైనా మేలుకొని కర్బన ఉద్గారాల నియంత్రణకు ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా అడుగులు వెయ్యకపోతే ఉష్ణతాపాన్ని తట్టు కోవడం కష్టమని సీ3ఎస్ హెచ్చరించింది. 1850 నుంచి ఉష్ణోగ్రతల గణాంకాలు తీసుకుంటే... 2024ను అతి దుర్భరమైన (గ్లోబల్ వార్మింగ్) సంవత్సరంగా ప్రకటించింది.
సముద్రాలు సైతం వేడెక్కుతున్నాయ్!
కేవలం భూతాపమే కాదు... సముద్రాలు సైతం వేడెక్కుతున్నాయని సీ3ఎస్ హెచ్చరించింది. అంటార్కిటికా, ఆస్ట్రేలియా మినహా అన్ని ఖండాంతర ప్రాంతాలు, సముద్రంలోని గణనీయమైన భాగాలు, ముఖ్యంగా ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, పశ్చిమ పసిఫిక్ మహాసముద్రాల ఉపరితల ఉష్ణోగ్రతలు కూడా 2024లో రికార్డు స్థాయిలో నమోదయ్యాయి.
2024లో ధ్రువ సముద్రంపై వార్షిక సగటు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత(ఎస్‌ఎస్‌టీ) రికార్డు స్థాయిలో 20.87 డిగ్రీలకు చేరుకుంది. ఇది 1991–2020 సగటు కంటే 0.51 డిగ్రీలు ఎక్కువగా ఉండటం గమనార్హం.
2025 మరో వేడి సంవత్సరం కాబోతోందా.?
ఈ ఏడాది కూడా 2024 మాదిరిగానే భానుడి భగభగలతో మండిపోయే సూచనలు ఆదిలోనే స్పష్టంగా కనిపించాయని సీ3ఎస్ వెల్లడించింది. జనవరి నెలాఖరు నుంచే వేసవిని తలపించేలా పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీలు గరిష్టంగా నమోదవుతుండటమే ఇందుకు సంకేతమని వెల్లడించింది.
గత ఏడాది జనవరి నుంచి ఫిబ్రవరి మధ్యలో సాధారణం కంటే 0.37 డిగ్రీలు పెరగగా.. ఈ ఏడాది జనవరిలోనే సగటు ఉష్ణోగ్రత 0.94 డిగ్రీలు పెరగడం అసాధారణ హెచ్చరికగా పరిశోధకులు భావిస్తున్నారు. 2015–24 మధ్య కాలంలో సాధారణం కంటే 0.3 డిగ్రీలు ఉష్ణోగ్రతలు పెరిగి అత్యంత వేడి దశాబ్దంగా నమోదైందని.. ఉష్ణోగ్రత సగటు ఒక్కో డిగ్రీ పెరిగే కొద్దీ.. వడదెబ్బ మరణాల సంఖ్య 5 శాతం పెరిగే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
సీ3ఎస్ ఏం చెప్పిందంటే..
» 1850 నుంచి భూ ఉపరితల ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే 2024 అత్యంత వేడి సంవత్సరంగా రికార్డు పొందింది.
» సీ3ఎస్ పరిశోధనల ప్రకారం ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 15.10 డిగ్రీల సెల్సియస్.
» 1991–2020 మధ్య సగటు 0.72 డిగ్రీల సెల్సియస్ కాగా, అది 2024లో 1.5 డిగ్రీలు అధికంగా నమోదైంది.
» గత 10 సంవత్సరాల ఉష్ణోగ్రతలను పరిగణనలోకి తీసుకుంటే 2024 అత్యంత గరిష్ట ఉష్ణోగ్రతల సంవత్సరం.
» 2024 జూలై 24న రోజువారీ ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 17.16 డిగ్రీలు నమోదైంది. ఇదే ఇప్పటి వరకు చరిత్రలో అత్యంత ఉష్ణతాపం రోజుగా సీ3ఎస్ ప్రకటించింది.
»2024లో వాతావరణంలో నీటి ఆవిరి మొత్తం కూడా రికార్డు స్థాయికి చేరుకుంది. 1991–2020 సగటు కంటే దాదాపు 5శాతం ఎక్కువగా వ్యాపించింది.
ఎందుకిలా జరుగుతోంది?
శీతోష్ణస్థితి మార్పులు భయపెడుతున్నాయి. ఈ శతాబ్దం చివరి నాటికి ప్రపంచవ్యాప్త ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తోంది. దీనికి కారణం మానవ తప్పిదాలేనన్నది స్పష్టమవుతోంది. పెరుగుతున్న కాలుష్యం కారణంగా వాతావరణంలోకి కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్... మొదలైన వాయువుల కారణంగా గ్లోబల్ వార్మింగ్ ప్రమాదంముంచుకొస్తోంది.
గత ఏడాది భూమి వేడెక్కడానికి కారణమైన సీవో2 వంటి వాయు ఉద్గారాలు ఇప్పటికీ వాతావరణంలో రికార్డు స్థాయిలోనే ఉన్నాయని సీ3ఎస్ వెల్లడించింది. కర్బన ఉద్గారాలు అధికంగా విడుదల చేస్తున్న దేశాల జాబితాలో 29.18 శాతంతో చైనా అగ్రస్థానంలో ఉండగా.. అమెరికా (14.02 శాతం), భారత్ (7.09శాతం), రష్యా (4.65శాతం) ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి. వాతావరణంలోని గ్రీన్‌హౌస్ వాయువుల సాంద్రతలే మన వాతావరణాన్ని ప్రభావితం చేసే అతిపెద్ద అంశమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భవిష్యత్తు వాతావరణం మనచేతుల్లోనే ఉంది
భూ ఉపరితల ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో వేడెక్కడం చూస్తే వాతావరణం.. మానవాళికి తీవ్ర హెచ్చరికలు జారీ చేసినట్లే. వాతావరణ మార్పుల కారణంగా సంభవించే వేడిగాలులు, సముద్ర మట్టాల పెరుగుదల, వన్యప్రాణులు అంతరించిపోవడం వంటి ప్రమాదాలు చాలా తీవ్రమయ్యే రోజులు ముందున్నాయి. మనం ఇప్పుడు దానికి అత్యంత చేరువలో ఉన్నాం. గాల్లో సీవో2, మీథేన్, సల్ఫర్ మోనాక్సైడ్ వాతావరణ సాంద్రతలు పెరుగుతూనే ఉన్నాయి.
ఒక పాయింట్ సీవో2 దాదాపు 100 ఏళ్ల వరకు గాల్లో ఉంటుంది. మీథేన్ 400 ఏళ్లు ఉంటుంది. కాబట్టి.. వీటిని నియంత్రించాల్సిన బాధ్యత అందరిది. 2024లో ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన తుఫానులు, వరదలతోపాటు వడగాడ్పులు, కరువు, కార్చిచ్చు ఘటనలు సంభవించాయి. భూతాపం పెరిగే కొద్దీ ఈ తరహా ప్రమాద ఘంటికలు మోగుతూనే ఉంటాయి.
కాబట్టి కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించగలిగితే భూమి వేడెక్కడాన్ని తగ్గించగలం. ఇదే మన ముందున్న అతి పెద్ద సవాల్. చెట్ల కంటే.. సముద్రాలే అసలైన వాతావారణ పరిరక్షకులు. అందులో ఉండే మొక్కలు ఆక్సిజన్ని ఎక్కువగా అందిస్తున్నాయి. అందుకే సముద్రాలను సంరక్షించుకోవాలి. – ప్రొఫెసర్ ఓఎస్‌ఆర్ భానుకుమార్, వాతావరణశాస్త్ర నిపుణుడు