devinder sharma
-
కనీస ధరే రైతుకు భరోసా
భారతీయ రైతులు అభివృద్ధి నిచ్చెనలో అట్టడుగున ఉండటమే కాకుండా, దాదాపు పాతికేళ్లుగా ఏటా నష్టాలను చవిచూస్తున్నారు. వ్యవసాయ మార్కెట్ శక్తుల దయాదాక్షిణ్యాలకు ప్రభుత్వాలు రైతులను వదిలేశాయి. శాశ్వత పేదరికం నుండి రైతులను బయటపడేయడానికి ఉన్న ఏకైక ఆమోదయోగ్యమైన మార్గం – కనీస మద్దతు ధరకు హామీ ఇచ్చే చట్టాన్ని తేవడమే! చట్టపరమైన కనీస మద్దతు ధర వినియోగదారులపై ధరల భారాన్ని పెంచుతుందనీ, తద్వారా అది మార్కెట్లను దెబ్బతీస్తుందనీ ఆర్థికవేత్తలు భావిస్తుంటారు. అదే కార్పొరేట్లు వినియోగదారులపై ధరల భారాన్ని మోపినప్పుడు మాత్రం వీళ్లు నిశ్శబ్దంగా ఉంటారు. చట్టబద్ధంగా హామీ ఇచ్చే కనీస మద్దతు ధరను అందించడం వ్యవసాయ రంగం ఎదురుచూస్తున్న పెద్ద సంస్కరణ.ఏకీకృత పెన్షన్ పథకం (యూపీఎస్) ప్రభుత్వ ఉద్యోగులకు గౌరవాన్ని, ఆర్థిక భద్రతను కల్పిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దాన్ని పెన్షన్ సంస్కరణ అన్నారు. దేశ ప్రగతికి గణనీయంగా దోహదపడే ప్రభుత్వ ఉద్యోగులందరి కృషిని చూసి గర్విస్తున్నామని కూడా అన్నారు.చివరిగా ఉద్యోగి పొందిన వేతనంలో 50 శాతానికి సమానమైన పెన్షన్‌కు హామీ ఇచ్చే యూపీఎస్, వాస్తవానికి మునుపటి మార్కెట్ అనుసంధానిత నూతన పెన్షన్ స్కీమ్(ఎన్పీఎస్) ప్రభుత్వ ఉద్యోగు లకు మేలు చేయలేదని అంగీకరించింది. ప్రభుత్వ ఉద్యోగులకు ‘నిర్ధారిత ప్రయోజనపు’ హామీ ఇవ్వడం కోసం, వాళ్లు మార్కెట్ల దౌర్జ న్యాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా కేంద్ర మంత్రిమండలి పెన్షన్ పథకాన్ని సవరించింది.ప్రధానమంత్రి అనేక సందర్భాల్లో దేశంలోని రైతులను ప్రశంసించినప్పటికీ తమ పంటలకు హామీ ధరలు ఉండాలని దీర్ఘకాలంగా చేస్తున్న డిమాండ్‌ను మాత్రం పట్టించుకున్న నాథుడు లేడు. ఉద్యోగు లకు భరోసా పెన్షన్ అవసరమైనప్పుడు, రైతులకు కూడా భరోసా ధర అవసరమే.ప్రపంచంలో ఎక్కడా మార్కెట్లు రైతులకు అధిక ఆదాయాన్ని అందించడం లేదు. ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో సబ్సిడీ ఆదాయ అంత రాన్ని భర్తీ చేస్తుంది. వ్యవసాయ రాయితీలను అందించడంలో చైనా అగ్రస్థానంలో ఉంది. భారతదేశం మాత్రం వ్యవసాయ మార్కెట్ శక్తుల దయాదాక్షిణ్యాలకు రైతులను వదిలేసింది. కొన్ని అధ్యయనాలు చెబుతున్నట్టుగా, భారతీయ రైతులు అభివృద్ధి నిచ్చెనలో అట్టడుగున ఉండటమే కాకుండా, దాదాపు పాతికేళ్లుగా ఏటా నష్టాలను చవి చూస్తున్నారు.శాశ్వత పేదరికం నుండి రైతులను బయటపడేయడానికి ఏకైక ఆమోదయోగ్యమైన మార్గం, వ్యవసాయ ధరలకు హామీ ఇవ్వడం కోసం ఒక చట్టబద్ధమైన ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడం. కనీస మద్దతు ధర (ఎంఎస్పి)కి హామీ ఇచ్చే చట్టం మార్కెట్లను అస్తవ్యస్తం చేస్తుందని ఎన్డీయే ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. విచిత్రమేమిటంటే, రైతుల విషయానికి వచ్చేసరికి, విధాన నిర్ణేతలు మార్కెట్లు అస్తవ్యస్తం అవుతాయన్న పల్లవిని ఎత్తు కుంటారు. అదే ఉద్యోగుల విషయంలో అంతా బానేవుంటుంది. మార్కెట్ల అస్తవ్యస్త భయం అకస్మాత్తుగా అదృశ్యమవుతుంది.చట్టపరమైన కనీస మద్దతు ధర వినియోగదారులపై ధరల భారాన్ని పెంచుతుందనీ, తద్వారా అది మార్కెట్లను దెబ్బతీస్తుందనీ ప్రధాన ఆర్థికవేత్తలు విశ్వసిస్తున్నారు; వాస్తవంలో, ఇది కార్పొ రేట్ల లాభాలను పిండేస్తుంది కాబట్టే నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అదే స్వేచ్ఛా మార్కెట్ ప్రబోధక ఆర్థికవేత్తలు అమెరికాలోని కార్పొరేట్లు వినియోగదారులపై ధరల భారాన్ని మోపినప్పుడు మాత్రం నిశ్శబ్దంగా ఉంటారు. ఇదీ నిజానికి ధరలను వక్రీకరించడం. అందుకే ఇప్పటికే కాలిఫోర్నియా, ఫ్లోరిడా, న్యూయార్క్‌తో సహా 38 రాష్ట్రాలు ఈ ధరల పెరుగుదలను నిషేధించే చట్టాలను తెచ్చాయి. ఉదాహరణకు, కోవిడ్ మహమ్మారి సమయంలో హ్యాండ్ శానిటైజర్ల ధరలను 400 శాతం మేరకు పెంచిన కంపెనీలకు వ్యతిరేకంగా న్యూయార్క్ రాష్ట్రం చర్యలు తీసుకుంది. అయినప్పటికీ చాలామంది మార్కెట్ సమర్థక ఆర్థిక వేత్తలు స్పష్టంగా కనిపిస్తున్న ఈ మార్కెట్ వక్రీకరణలపై జరిగే ఇటువంటి తనిఖీలను సోవియట్ శైలి ధరల నియంత్రణగా పేర్కొంటున్నారు.రైతులకు ఆర్థిక భద్రత కల్పించాల్సిన సమయంలో మార్కెట్‌కు అనుకూలమైన పక్షపాత దృష్టి పెరుగుతుంది. కానీ కార్పొరేట్లు విని యోగదారుల రక్తమాంసాలను పీల్చివేయడం కోసం ధరలను పెంచి నప్పుడు మాత్రం ఎవరూ మాట్లాడరు. మార్కెట్ వక్రీకరణ అనే ఈ ద్వంద్వ ప్రమాణం రైతులకు జీవన ఆదాయాన్ని అందించే మార్గంలో అడ్డుగా నిలుస్తోంది. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా, మార్కెట్లు రైతుల హామీ ధరలకు అనుగుణంగా వాటికవే సర్దుబాటు చేసుకుంటాయి. కేవలం భావజాలమే దీనికి అడ్డు నిలుస్తోంది.మహమ్మారి తర్వాత ఆహారం, కిరాణా వస్తువుల ధరలు 53 శాతం పెరగడానికి కారణమైన కార్పొరేట్ ధరల పెరుగుదలపై నిషేధం విధించాలని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పిలుపునిచ్చారు. రిపబ్లికన్లు ఆమె వైఖరిని ‘కమ్యూనిస్ట్’ అన్నారు. మితవాద పక్షం ఏదైనా చెప్పనీ... కొందరు ఆర్థికవేత్తలు అంగీకరించినట్లుగా, ధరల పెరుగుదలపై నిషేధం అనేది మంచి ఆర్థిక శాస్త్రం, మంచి రాజకీయం అనే అభిప్రాయాన్ని ఎవరూ తిరస్కరించడం లేదు. ఈ సందర్భంగానే, ఆహార పదార్థాల ధరలను కృత్రిమంగా ఎక్కువగా ఉంచుతున్న కంపెనీలపై చర్యలు తీసుకుంటామని కమలా హారిస్ హామీ ఇచ్చారు.ఉద్యోగుల పెన్షన్ విషయానికి తిరిగి వస్తే, కేంద్ర వ్యయ శాఖ ఈ నిర్ణయాన్ని సమర్థించేందుకు అన్ని ప్రయత్నాలూ చేయడం ఆసక్తికరం. ఇది ‘ఆర్థికంగా వివేకవంతమైన’ నిర్ణయమనీ, ‘ఇది భవిష్యత్ తరాల పౌరులకు ఆర్థిక కష్టాలను నివారిస్తుం’దనీ పేర్కొంది. ఉద్యోగు లకు ఇస్తున్న హామీ పెన్ష¯Œ పథకానికి ఎవరూ వ్యతిరేకం కాదు. ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించగలుగుతున్నప్పుడు, రైతులకు ఆర్థిక భద్రత కల్పించలేకపోవడానికి కారణం ఏదీ లేదు. ఎందుకంటే రైతులు కూడా దేశ ప్రగతికి గణనీయంగా దోహదపడుతున్నారు. వారి నిర్విరామ కృషి వల్లే దేశానికి ఆహార భద్రత ఏర్పడింది.మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ జిల్లాకు చెందిన కమలేశ్ పాటీదార్ అనే రైతు తన పదెకరాల్లోని సోయాబీన్ పంటను దున్నివేసినప్పుడు, అది ఒక గొలుసుకట్ట చర్యను ప్రేరేపిస్తుందని అతను అనుకోలేదు. ఈ సంఘటన తాలూకు వీడియో వైరల్ అయిన కొద్ది రోజులకే, చాలా మంది రైతులు తమ పంటను దున్నేశారని వార్తలొచ్చాయి.సోయాబీన్ ధరల పతనం... అది కూడా, కోత కాలానికి నెలన్నర ముందు ధరలు పడిపోవడం అనేది, రైతులు మంచి ధరను పొందే వరకు పంటను నిల్వ ఉంచుకోవాలని సూచించే మరొక ఆర్థిక నమ్మ కాన్ని పోగొట్టింది. తర్వాతైనా ఎక్కువ ధర వస్తుందనే ఆశతో కమలేష్ పాటీదార్ గత ఏడాది పండించిన పంటను అలాగే నిల్వ ఉంచు కున్నాడు. అది కూడా ఫలించలేదు.సోయాబీన్ ధరలు పన్నెండేళ్ల క్రితపు స్థాయికి పడిపోవడంతో వ్యవసాయ జీవనోపాధి ధ్వంసమైన లక్షలాది మంది రైతులకు ఇది ఆగ్రహం కలిగించింది. కనీస మద్దతు ధర కంటే చాలా తక్కువగా ఉన్న ధరలు ఉత్పత్తి ఖర్చులకు కూడా సరిపోవు. భవిష్యత్ తరాల రైతులకు మాత్రమే కాకుండా ప్రస్తుత రైతులకు కూడా ఆర్థిక కష్టాలను నివారించే భరోసా ధరల విధానం ఎప్పుడు వస్తుందా అని నేను ఎదురుచూస్తున్నాను.ఆ తర్వాత, టమోటా ధరలు 60 శాతం క్షీణించి, 25 కిలోల పెట్టెకు 300 రూపాయల కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయని వార్తలొచ్చాయి. అనంతరం, బాస్మతి బియ్యం ధర క్వింటాల్‌కు 28 శాతం తగ్గి రూ. 2,500కు చేరుకుందని వార్తలొచ్చాయి. ఇది ఈ సంవత్సరం మాత్రమే జరిగిన ప్రత్యేకమైన ఘటనలు కావు. ఇది దేశం ఏమాత్రం ఆందోళన చెందని బాధాకరమైన వార్షిక ధోరణిగా తయారైంది.అమ్ముకోదగినంత మిగులు ఉన్న రైతులకు చట్టబద్ధంగా హామీ ఇచ్చే కనీస మద్దతు ధరను అందించడం, సన్నకారు రైతులకు ప్రత్యక్ష ఆదాయ మద్దతులను అందించడం అనేవి వ్యవసాయ రంగం ఎదురు చూస్తున్న పెద్ద సంస్కరణలుగా చెప్పాలి.దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులుఈ–మెయిల్: hunger55@gmail.com -
మద్దతు ఇవ్వడమే శాశ్వత పరిష్కారం
యూరప్‌లో కనివిని ఎరుగని వ్యవసాయ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్రాన్స్‌లో ప్రారంభమై, జర్మనీకి వ్యాపించి, రొమేనియా, నెదర్లాండ్స్, పోలండ్, బెల్జియం దేశాలను కూడా తాకాయి. మరోవైపు దేశంలో పంజాబ్, హరియాణా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల రైతులు తమ నిరసన ప్రదర్శన కోసం ఢిల్లీకి వెళ్లడానికి మళ్లీ సిద్ధమవుతున్నారు. వ్యవసాయ మార్కెట్ల క్రమబద్ధీకరణను ఎత్తివేయడం, వ్యవసాయంపై కార్పొరేట్ నియంత్రణను తీసుకురావడం ఆచరణీయమైన ప్రత్యామ్నాయాలు కావని ఐరోపా అనుభవాలు చాటుతున్నాయి. మార్కెట్లను సరళీకరించడం అనేది వ్యవసాయ ఆదాయాన్ని పెంచడంలో విఫలమయింది. అందుకే భారతీయ రైతులు కనీస మద్దతు ధర కోసం చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను కోరుతున్నారు. ప్రస్తుతం వ్యవసాయదారుల నిరసనలు ఫ్రాన్స్‌లో ప్రారంభమై, జర్మనీకి వ్యాపించాయి. అక్కడ కోపోద్రిక్తులు అయిన రైతులు బెర్లిన్ ను దాదాపుగా స్తంభింపజేశారు. ఇప్పుడు మళ్లీ ఈ నిరసన ఫ్రాన్స్‌కు తిరిగి వచ్చింది. ఆగ్రహించిన రైతులు ప్యారిస్ను ట్రాక్టర్లతో ముట్టడిస్తామని హెచ్చరించారు. వ్యవసాయదారుల ప్రకంపనలు రొమేనియా, నెదర్లాండ్స్, పోలాండ్, బెల్జియంలకు కూడా విస్తరించాయి. స్పానిష్ రైతులు కూడా నిరసనల్లో పాల్గొనాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రైతులు ట్రాఫిక్ని అడ్డుకుని ప్రభుత్వ భవనాలపై పేడ చల్లుతున్నారు. యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్, సభ్య దేశాలలో వ్యవసాయ సమాజంలో పెరుగుతున్న నిరుత్సాహాన్ని, నిరాశను గుర్తించడం ద్వారా బ్రస్సెల్స్‌లోని యూరోపియన్ పార్లమెంట్లో చర్చను ప్రారంభించారు. ‘ఎటువంటి ప్రశ్న లేకుండా, సవాళ్లు పెరుగుతున్నాయని మేము అందరం అంగీకరిస్తాము. విదే శాల నుండి పోటీ కావచ్చు, స్వదేశంలో అధిక నియంత్రణ కావచ్చు, వాతావరణ మార్పు కావచ్చు లేదా జీవవైవిధ్యం కోల్పోవడం... పేర్కొనడానికి ఇవి కొన్ని అంశాలు’ అని ఆమె అన్నారు. కానీ సమస్యలను ప్రస్తావించడంలో ఆమె విఫలమైన విషయం ఏమిటంటే... రైతులకు భరోసా ఇవ్వకపోవటం, సరైన ధరను నిరాకరించడం పైనే ప్రధానంగా రైతుల ఆగ్రహం ఉంటోందని. ఉక్రెయిన్ (లేదా ఇతర ప్రాంతాల) నుండి వస్తున్న దిగుమతులు ధరలు తగ్గడా నికి కారణమయ్యాయి. అలాగే అనేక దశాబ్దాలుగా వ్యవసాయ వాహ నాలకు ఇస్తున్న డీజిల్ సబ్సిడీని ఉపసంహరించుకున్నారు. వాస్తవికత ఏమిటంటే వ్యవసాయ ఆదాయం క్రమంగా క్షీణించడం. ‘మాకు ప్రోత్సాహకాలు అక్కర్లేదు. మా ఉత్పత్తులు విలువైనవి, అవి మంచి ధరలకు విక్రయం అవాలని మేము కోరుకుంటున్నాము’ అని ఆగ్రహించిన ఒక బెల్జియన్ రైతు చెప్పాడు. వీటన్నింటికీ నిరసనగా వేలాది ట్రాక్టర్లతో ముట్టడించడానికి యూరోపియన్ రైతులను నడిపిస్తున్న నిరాశను ఆయన క్రోఢీకరించాడు. ‘మేము చనిపోవడానికి మాత్రమే ఇక మిగిలి ఉన్నాము’ అని మరొక బెల్జియన్ రైతు వ్యాఖ్యానించాడు. ఫ్రాన్ ్స రైతులలో మూడింట ఒకవంతు మంది కేవలం నెలకు 300 యూరోల (సుమారు రూ. 27,000)తో జీవిస్తున్నారనీ, ఎంపీల భత్యాలను మరో 300 యూరోలు పెంచడాన్ని వ్యతిరేకిస్తున్నారనీ ఒక ఫ్రెంచ్ ఎంపీ ఇటీవల అన్నారు. రైతులు నిరసనల తరుణంలో ఎంపీ లకు భత్యాల పెంపుపై తీవ్ర వ్యతిరేకత వస్తుందని భావించి వాటిని తాత్కాలికంగా ఉపసంహరించుకున్నారు. జర్మనీలో 2016–23 సంవ త్సరాల మధ్య, వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ అధ్వాన్నంగా ఉందని వ్యవసాయ ఆర్థిక బారోమీటర్ సూచిక చూపిస్తోంది. రొమేనియాలో నికర వ్యవసాయ ఆదాయం 2023లో 17.4 శాతం క్షీణించింది. ఈ పరిస్థితి యూరప్‌కే పరిమితం కాదు. ‘వారు మమ్మల్ని ప్రపంచ పటం నుండి తుడిచివేయడానికి ప్రయత్నిస్తున్నారు’ అని అమెరికాలోని చిన్న రైతులను ఉటంకిస్తూ వచ్చిన మీడియా నివేదిక లను ఇది నాకు గుర్తు చేస్తోంది. అమెరికాలో గ్రామీణ ఆత్మహత్యలు జాతీయ సగటు కంటే 3.5 రెట్లు అధికంగా ఉండటంతో, వ్యవసాయ మాంద్యంలో పెరుగుతున్న ఆటుపోట్లను పరిష్కరించడం జాతీయ సమస్యగా మారుతోంది. భారతదేశంలో 2022లో 11,290 మంది రైతులు, వ్యవసాయ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతు పట్ల మార్కెట్లు అవగాహనతో ఉన్నట్లయితే రైతులు ప్రపంచ వ్యాప్తంగా అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొనేవారు కాదు. ఇంకా, వ్యవ సాయ సంక్షోభానికి శాశ్వత పరిష్కారాన్ని కనుగొనే బదులు, వ్యవసాయం నుండి రైతులను తప్పించడానికి యూరోపియన్ దేశాల ప్రభుత్వాలకు వాతావరణ మార్పు ఉపయోగపడుతోంది. ‘రైతుల నిరసనలు సమర్థనీయమైనవే’ అని రొమేనియా ప్రధాన మంత్రి మార్చెల్ చొలాకూ అంగీకరించారు. కొత్తగా నియమితులైన ఫ్రెంచ్ ప్రధాని గాబ్రియేల్ అటల్ తమ ప్రభుత్వం ‘వ్యవసాయాన్ని అన్నింటికంటే ఉన్నత స్థాయిలో ఉంచాలని’ నిర్ణయించుకున్నట్లు చెప్పారు. వ్యవసాయానికి డీజిల్ సబ్సిడీని ఒకేసారి రద్దు చేయడానికి బదులుగా దశలవారీగా తొలగించాలని జర్మనీ ఇప్పటికే నిర్ణయించింది. ఈ హామీలు ఉన్నప్పటికీ, రైతులకు భరోసాగా ఆదాయాన్ని అందించడంలో మార్కెట్ల వైఫల్యం, వ్యవసాయ రంగంలో పెరుగు తున్న నిరుత్సాహం వెనుక ఉన్న అసలు విలన్‌ను యూరోపియన్ నాయకులెవరూ ఎత్తి చూపలేకపోయారనేది వాస్తవం. వ్యవసాయ మార్కెట్ల క్రమబద్ధీకరణను ఎత్తివేయడం, వ్యవ సాయంపై కార్పొరేట్ నియంత్రణను తీసుకురావడం ఆచరణీయమైన ప్రత్యామ్నాయం అయివుంటే, ఐరోపా ఇప్పుడు దశాబ్దంగా ఎక్కడో ఒకచోట పునరావృతమౌతున్న రైతుల అశాంతిని ఎదుర్కొనేందుకు ఎటువంటి కారణమూ లేకపోయేది. మార్కెట్లను సరళీకరించడం అనేది వ్యవసాయ ఆదాయాన్ని పెంచడంలో విఫల మయిందని ఇప్పుడు స్పష్టంగా చెప్పాలి. వ్యవసాయ ధరలను తక్కువగా ఉంచడం ద్వారా ఆర్థిక సంస్కరణలను ఆచరణీయంగా ఉంచడానికి రూపొందించిన స్థూల ఆర్థిక విధానాలు ప్రాథమికంగా లోపభూయిష్టంగా ఉన్నా యని ఇది చూపిస్తుంది. ఆహార ద్రవ్యోల్బణాన్ని తక్కువగా ఉంచడంపై దృష్టి కేంద్రీకరించినప్పటికీ, ద్రవ్యోల్బణం యొక్క నిజమైన చోదక శక్తులైన గృహ నిర్మాణం, విద్య, ఆరోగ్యం ఉద్దేశపూర్వకంగా దూరంగా ఉంచబడ్డాయి. అది స్థూల ఆర్థిక వంచన. రైతులు తరచుగా ఎదుర్కొంటున్న నష్టాలను పూడ్చేందుకు మరిన్ని ప్రోత్సాహకాలు అందించడం శాశ్వత పరిష్కారం కాదని స్పష్టంగా అర్థమైంది. 2020–22లో సంవత్సరానికి 107 బిలియన్ డాలర్ల భారీ మద్దతును గుమ్మరించినప్పటికీ (ఏదేమైనప్పటికీ, సబ్సిడీలు, ప్రత్యక్ష ఆదాయ మద్దతును అత్యధికంగా స్వీకరించే వారిలో యూరోపియన్ రైతులే ఎక్కువగా ఉన్నారు) వ్యవసాయ జనాభాను చెక్కుచెదరకుండా ఉంచడంలో విఫలమయ్యారు. 2023లో యూరోపియన్ వ్యవసాయ నిరసనల కోపాన్ని కూడా అది తగ్గించలేదు. 2024 ప్రారంభం ఆందోళన విస్తరిస్తున్నట్లు, ఇంకా తీవ్రతరం అవబోతున్నట్లు కనిపిస్తోంది. భారతదేశంలోని రైతు సంఘాల డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా వర్తిస్తుండటం ఇక్కడే నేను చూస్తున్నాను. ప్రోత్సాహకాల కోసం అడగడానికి బదులుగా, భారతీయ రైతులు కనీస మద్దతు ధర కోసం చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను కోరుతున్నారు. కనీస మద్దతు ధరని రూపొందించే ఫార్ములాకు పునర్విమర్శ అవసరం అయినప్పటికీ, మార్కెట్ల దయాదాక్షిణ్యాలకు వదిలేస్తే, వ్యవసాయ జనాభా త్వర లోనే అంతరించిపోతుందని యూరోపియన్ రైతులు అర్థం చేసు కోవాలి. వ్యవసాయాన్ని ఆచరణీయమైనదిగా మార్చడానికి, వ్యవ సాయ ధరలకు కచ్చితమైన హామీ ఇస్తూ, నిర్దేశిత ధర కంటే తక్కువ కొనుగోళ్లకు అనుమతి లభించకుండా చూసుకోవడం ఒక్కటే మార్గం. హామీ ఇవ్వబడిన వ్యవసాయ ధరలు మార్కెట్లను అస్తవ్యస్తం చేస్తాయని ప్రధాన ఆర్థికవేత్తలు వాదిస్తారు. మార్కెట్లు సర్దుబాటు అవుతాయి, ఆ పేరుతో రైతులకు జీవన ఆదాయాన్ని తిరస్కరించ లేము. ధర విధానాలలో చరిత్రాత్మక దిద్దుబాటుకు ఇది సమయం. ఏ రైతూ బాధను అనుభవించకుండా లేదా అతని జీవితాన్ని బలవంతంగా ముగించకుండా ఇది నిలుపుతుంది. దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com -
సన్నకారుకు నారూ నీరూ!
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో ప్రస్తుతం ఒక ఫలవంతమైన మార్పు నిశ్శబ్దంగా జరుగుతోంది. ఇది సరికొత్త సన్నకారు వ్యవసాయానికి పరివర్తనను రూపొందిస్తోంది. ఏపీలో ఎనిమిది లక్షల మంది రైతులు రసాయనాల నుంచి పూర్తిగా రసాయనేతర వ్యవసాయం వైపు మళ్లారు. లేదా పరివర్తన దశలో ఉన్నారు. 2031 నాటికి రాష్ట్రంలో మొత్తం 60 లక్షల వ్యవసాయ జనాభాను రసాయనాల నుండి సహజ వ్యవసాయానికి తరలించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అంటే రైతు సంక్షేమానికి నారు, నీరు నీరు పోయడమే! కార్పొరేట్ ప్రయోజనాలకు మాత్రమే సరిపోయే కాలం చెల్లిన ఆర్థిక విధానాలను నియంత్రించడం ద్వారా ఏపీ ప్రభుత్వం ఈ అద్భుతమైన మార్పును సాకారం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా వీరపనేని గూడెం గ్రామానికి చెందిన సన్నకారు రైతు మహిళ రాధిక. ఆమెకు 1.1 ఎకరాల భూమి మాత్రమే ఉంది. దాంట్లో సహజ వ్యవసాయం సాగుతోంది. తన కొడుకు ఎంబీఏ చేశాడని, కూతురు అమెరికాలో చదువుతోందని ఆమె చెప్పినప్పుడు నేను నమ్మ లేకపోయాను. పిల్లలు బాగా చదువుతున్నందున ఆమె వ్యవసా యాన్ని ఎందుకు వదిలిపెట్టలేదని అడిగాను. అందుకు ఆమె ‘‘నేను నా పని వదులుకుని వారితో కలిసి జీవించాలని నా పిల్లలు కోరుకుంటారు. కానీ మీరు ఏం చేస్తున్నారో అది చేయండి. అలాగే నేను ఏం చేస్తూ ఆనందిస్తున్నానో ఆ పనిని చేయనివ్వండి అని వారికి చెబుతు న్నాను’’ అని పేర్కొంది. ఆమె సహజసాగు పంట పద్ధతిని అనుస రిస్తోంది, దీనినే ఏటీఎమ్ (ఎనీ టైమ్ మనీ) అని పిలుస్తారు. ఇది ఆమెకు క్రమం తప్పకుండా ఆదాయాన్ని అందిస్తోంది. ఏటీఎమ్ అనేది ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ–నిర్వహణలోని సహజ వ్యవసాయ కార్యక్రమం కింద పొందుపరిచిన కార్యకలాపాల వర్గీకర ణలో ఒక రూపం, ఇది ప్రకృతికి అనుగుణంగా వ్యవసాయం చేయ డంలో భాగం. రెండు దశాబ్దాల క్రితం ఖమ్మం జిల్లాలోని పునుకల గ్రామం నుంచి ప్రారంభమైన ఈ వ్యవసాయ– పర్యావరణ సేద్య విధానం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో 26 జిల్లాల్లోని 3,730 గ్రామాలకు విస్తరించింది. ఎనిమిది లక్షల మంది రైతులు రసాయనాల నుంచి పూర్తిగా రసాయనేతర వ్యవసాయం వైపు మళ్లారు లేదా పరివర్తన దశలో ఉన్నారు. 2031 నాటికి రాష్ట్రం మొత్తం 60 లక్షల వ్యవసాయ జనాభాను రసాయనాల నుండి సహజ వ్యవసాయానికి తరలించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మైసమ్మ ఎన్టీఆర్ జిల్లా బత్తినపాడు గ్రామానికి చెందిన మహిళ. ఆమె రెండు ఎకరాల్లో పత్తి సాగు చేసేది. 2018లో సహజ వ్యవసాయం వైపు మళ్లింది. తన కూతురు ఏరోనాటికల్ ఇంజనీర్ అని చెప్పినప్పుడు, ఒక్క క్షణం నేను ఒక మధ్యతరగతి గృహిణితో మాట్లా డుతున్నట్లు అనిపించింది. అయితే వీరు చిన్న, సన్నకారు రైతులు. ఎక్కువగా మహిళలు. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వీరు వాతావరణాన్ని తట్టుకోగల, పర్యావరణానికి ఆరోగ్యకరమైన సహజ వ్యవసాయ విధానపు సద్గుణాలు, బలాలతో పాటు దాని అపారమైన సంభావ్యత గురించి తమ అనుభవాలను పంచుకున్నారు. వారిలో కొందరికి, సగటున 1 ఎకరం కంటే తక్కువ భూమి ఉంది. కొంతమందికి 0.10 నుండి 0.50 సెంట్ల వరకు భూమి ఉంది. ఏపీసీఎన్ఎఫ్ (ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్)కి చెందిన గుంటూరు ప్రధాన కార్యాలయంలో వీరు సమావేశ మయ్యారు. దీనిని ప్రభుత్వ యాజమాన్యంలోని రైతు సాధికార సంస్థ (ఆర్‌వైఎస్‌ఎస్) నిర్వహిస్తోంది. ప్రధాన స్రవంతి ఆలోచన ఆచరణీయమైన ప్రత్యామ్నాయాలను అమలు చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తుందో వెనువెంటనే స్పష్ట మైంది. చిన్న భూకమతాలు తరచుగా పనికిరానివిగా పరిగణించ బడతాయి కాబట్టి భూ సంస్కరణలు, కార్మిక సంస్కరణల పేరుతో ఆర్థికవేత్తలు, కార్పొరేట్ నాయకులు వ్యవసాయం నుండి వారిని మిన హాయించాలని వాదించారు, చిన్న కమతాల్లో పనిచేసేవారిని పట్టణ శ్రామికశక్తిలో ఏకీకృతం చేయాలని కోరుతారు. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక రూపకల్పన చిన్న, సన్నకారు రైతులను ఆర్థిక భారంగా మారుస్తుంది. కానీ కొద్దిగా చేయూత నివ్వడంతోపాటు తగిన మార్కె టింగ్ కార్యక్రమాలు ఈ పొలాలను ఆచరణీయంగా మార్చగలవు, ఇవి భూగ్రహాన్ని వేడి చేయవు. గాలి, నీరు, నేలను విషపూరితం చేయవు. 50 సంవత్సరాల కాలంలో 51 దేశాలలో నిర్వహించిన అధ్యయనాల నుండి సేకరించిన డేటాతో కొంతకాలం క్రితం ‘నేచర్’ పత్రికలో వచ్చిన ఒక వ్యాసం నాకు గుర్తొస్తోంది. సాధారణంగా భావించే అవగాహనకు విరుద్ధంగా, చిన్న పొలాలు మరింత ఉత్పాద కత కలిగి ఉండి పర్యావరణపరంగా స్థిరమైనవి అని ఆ వ్యాసంలో పేర్కొన్నారు. కానీ అలాంటి అధ్యయనాలు ప్రధాన స్రవంతి సైన్స్ విధానంలో భాగం కావు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు, మీడియా, విధాన నిర్ణేతలు వ్యవసాయ వ్యాపార దిగ్గజాల వాణిజ్య ప్రయోజనాలను దశాబ్దాలుగా ఆమోదించారు. ఇవి సాంద్ర వ్యవసాయాన్ని మినహాయించి, పర్యావరణపరంగా ఆరోగ్యకరమైన, సమాన ఉత్పాదక, స్థిరమైన ఆహార వ్యవస్థ వైపు వెళ్లే ప్రయత్నాలను నిరోధించాయి. అయినప్పటికీ ఒక నిశ్శబ్ద మార్పు జరుగుతోంది. ఇది కొత్త వ్యవసాయానికి పరివర్తనను రూపొందిస్తోంది. నేను దీనిని కొత్త వ్యవ సాయం అని పిలుస్తాను. ఎందుకంటే మిగులు ఉత్పత్తిపై ఎక్కువగా ఆధారపడే సాంప్రదాయిక ఏకరూప వ్యవసాయ పద్ధతులు వ్యవ సాయ భూములను ఎండిపోయేలా చేశాయి. భూములను నిర్వీర్యంగా మార్చాయి, భూగర్భ జలాలను తోడేశాయి. ఆహార గొలుసును కలుషితం చేశాయి. పైగా వ్యవసాయ జనాభా వ్యవసాయాన్ని విడిచిపెట్టి వలస వెళ్లవలసి వచ్చింది. ఇంకా ఇది మానవ వ్యాధులు, వాతావరణ అత్యవసర పరిస్థితుల అధిక భారానికి చెందిన ద్వంద్వ సవాళ్లకు దోహదపడింది. అయితే, పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా, భవిష్యత్తులో ఈ రకమైన వ్యవసాయం పరిమిత పాత్రతో మిగిలిపోతుంది. అందుకే ఆహార వ్యవస్థను వ్యవసాయ – పర్యావరణ వ్యవస్థ వైపు మళ్లించడం అనేది ఆహార భద్రత, పోషణను మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరిస్తుంది. ఆర్థికంగా లాభదాయక మైన జీవనోపాధిని ప్రోత్సహిస్తుంది. తద్వారా ఉపాధి కల్పనకు దోహదం చేస్తుంది. వ్యవసాయం గురించి పునరాలోచించడం ఈ కాలపు అవసరం. ఫిలిప్పీన్స్ నుండి వియత్నాం వరకు, కంబోడియా నుండి మెక్సికో వరకు; భారతదేశం నుండి అమెరికా వరకు, వ్యవసాయ–పర్యావరణ శాస్త్రం వైపు ఒక బలమైన, శక్తిమంతమైన ఉద్యమంగా నెమ్మదిగానే కావచ్చు కానీ స్థిరంగా విధానాలలో మార్పును తీసుకువస్తోంది. అయితే కార్పొరేట్ ప్రయోజనాలకు మాత్రమే సరిపోయే కాలం చెల్లిన ఆర్థిక విధానాలను విస్మరించాల్సిన అవసరం మాత్రం ఉంది. వ్యవ సాయ పరిశోధన, విద్య కోసం పర్యావరణ స్థిరత్వం వైపు పరివర్తనను ఎంచుకోవడం కూడా చాలా ముఖ్యమైనది. జన్యుపరంగా మార్పు చెందిన బీటీ పత్తి విఫలం కావడం వల్ల కలిగే విధ్వంసాన్ని తీసుకోండి. వెండి బుల్లెట్‌గా కీర్తించబడినది దుమ్ములో కలిసిపోయింది. మరోవైపు సేంద్రియ పద్ధతిలో పత్తి సాగు చేస్తున్న ఎన్టీఆర్ జిల్లాకు చెందిన లక్ష్మీనారాయణ వంటి రైతుల్లో నాకు ఆశ కనిపిస్తోంది. అతని పొలంలో 100 కంటే ఎక్కువ బంతులతో పెద్ద సంఖ్యలో మొక్కలు ఉన్నాయి. 50 కంటే ఎక్కువ ఆరోగ్యకరమైన బంతులు ఉన్న మొక్కను మంచి పంటగా పేర్కొనవచ్చు. ఎకరాకు 12 నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చిందని, ఇది చాలా ప్రోత్సా హకరంగా ఉందన్నారు. అదే విధంగా అదే జిల్లాకు చెందిన గోపాల రావు 3.5 ఎకరాల్లో సేంద్రియ వరి సాగు చేశాడు. రెండేళ్ల క్రితం సేంద్రియ వ్యవసాయానికి మారిన ఆయన ఎకరాకు దాదాపు 30 క్వింటాళ్ల పంట వస్తుందని చెప్పారు. రసాయనేతర వ్యవసాయం కాబట్టి ఇది సాంద్ర వ్యవసాయంతో సానుకూలంగా పోలిక అవుతుంది. దీనికి మరిన్ని పరిశోధనలు, ప్రభుత్వ రంగ పెట్టుబడులు అవసరం. ఏమైనా మనం వెనక్కి తగ్గకూడదు. చిన్న, సన్నకారు రైతులను చేయి చేయి పట్టి సరైన దిశలో నడిపిద్దాం. అప్పుడే వ్యవసాయం మరింత ఆశాజనకం అవుతుంది. దేవిందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ నిపుణులు -
ఆకలిపై పోరాటం జరిపిన శాస్త్రవేత్త
ఆయనను తరచుగా భారతదేశ హరిత విప్లవ పితామహుడిగా కీర్తిస్తారు. ఘనత వహించిన శాస్త్రవేత్త–వ్యవహర్త అయిన ప్రొఫెసర్ ఎం.ఎస్. స్వామినాథన్‌కు ‘వరల్డ్ ఫుడ్ ప్రైజ్’ తొలి అవార్డు వచ్చినప్పుడు, ఆయన్ని అప్పటి ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ కర్ట్ వాల్డ్‌హీమ్ ఒక లేఖలో ‘లివింగ్ లెజెండ్’ అని ప్రశంసించారు. స్వామినాథన్ మరణంతో ఒక శకం ముగిసింది. ‘ఓడ నుండి నోటికి’ అనే దుర్భర స్థితిలో ఉండిన దేశం ఆయన మార్గదర్శకత్వంలో వ్యవసాయంలో అద్భుతమైన విజయం సాధించింది. హరిత విప్లవ రూపశిల్పి అయినప్పటికీ ఎరువులు అధికంగా వాడితే కలిగే ప్రతికూల పరిణామాలు ఆయనకు తెలుసు. అలాగే రైతు క్షేమాన్నే ఎల్లవేళలా తలిచారు. ‘హరిత విప్లవ చరిత్ర వాస్తవానికి నాటి ప్రధాని ఇందిరా గాంధీతో కలిసి నేను చేసిన అరగంట కారు ప్రయాణంలో లిఖితమైంది,’ అని ఒకసారి స్వామినాథన్ నాతో చెప్పారు. వ్యవసాయ విప్లవానికి మద్దతు ఇవ్వడానికి కావలసిన రాజకీయ సంకల్పాన్ని పొందడం ఎంత కష్టమనే నా ప్రశ్నకు ఆయన జవాబిస్తూ, అప్పటి ప్రధాని ఇందిరా గాంధీతో కలిసి న్యూఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్‌గా పూసా కాంప్లెక్స్‌లో ఒక భవన ప్రారంభోత్సవానికి వెళ్లిన సంగతిని గుర్తు చేసుకున్నారు. దారిలో ప్రధాని ఆయన్ని అడిగారు: ‘‘స్వామీ, మీరు చెబుతున్న కొత్త గోధుమ పొట్టి వంగడాల రకాలకు నేను అనుమతిస్తాను. కానీ, కొన్నేళ్లలో ఒక కోటి టన్నుల మిగులు గోధుమలు చూపుతానని మీరు నాకు మాటివ్వగలరా? ఈ ‘బ్లడీ అమెరికన్ల’ హింస నాకు తప్పాలి.’’ స్వామినాథన్ మాటిచ్చారు, తర్వాతిదంతా చరిత్ర! ‘ఓడ నుండి నోటికి’ అనే దుర్భర స్థితిలో ఉండిన దేశం అనంతరం వ్యవసాయంలో అద్భుతమైన విజయం సాధించింది. భారతదేశాన్ని స్వయం సమృద్ధ దేశంగానే కాకుండా, నికర ఎగుమతిదారుగా మార్చింది. తగిన విధానాల ద్వారా మద్దతు లభ్యమైన హరిత విప్లవ వీరోచిత గాథ, ప్రధానంగా ఆకలి ఉచ్చు నుండి బయటపడే లక్ష్యంపై దృష్టి పెట్టింది. 1943 బెంగాల్ క్షామం తర్వాత కేవలం నాలుగు సంవత్సరాల లోపే స్వాతంత్య్రం రావడంతో, ఆకలిని అధిగమించే సవాలు అప్పటికి ఎదుర్కోలేదు. దశాబ్దాలుగా, ఉత్తర అమెరికా నుండి పీఎల్–480 పథకం కింద భారత్‌కు ఆహారం వస్తూ ఉండేది. 1970ల మధ్య నాటికి భారతదేశంలోని సగం జనాభా కబేళాలకు దారి తీస్తుందని కొందరు నిపుణులు అంచనా వేశారు. ఆ తర్వాత దేశ క్షుద్బాధపై పోరాడేందుకు స్వామినాథన్ చేసిన తీవ్రాతితీవ్ర ప్రయత్నం, ప్రపంచం వీక్షించిన అత్యంత ముఖ్యమైన ఆర్థిక పరిణామాలలో ఒకటిగా చరిత్రలో నిలిచిపోతుంది. ఇది దేశంలోని కోట్లాది ప్రజల జీవితాలను మార్చడమే కాకుండా, మిగిలిన ప్రపంచానికి కూడా స్ఫూర్తిగా నిలిచింది. హరిత విప్లవానికి రూపశిల్పిగా ఉన్నప్పటికి కూడా, స్వామినాథన్ కు వ్యవసాయంలో ఎరువులు అధికంగా వాడితే కలిగే ప్రతికూల పరిణామాల గురించి తెలుసు. ఆయన ప్రతి కోణంలోనూ దూరదృష్టి గలవారు. రాబోయే పరాజయం గురించి అనేకసార్లు ముందే హెచ్చరించారు. హరిత విప్లవం ప్రారంభమైన కొన్ని సంవత్సరాల తర్వాత, 1968 లోనే ఆయన ఇలా రాశారు: ‘‘నేల సారాన్ని, నేల నిర్మాణాన్ని పరిరక్షించకుండా భూమిపై తీవ్ర ఒత్తిడి కలిగించే సేద్యం చేయడం అంతిమంగా ఎడారుల పుట్టుకకు దారి తీస్తుంది. పురుగు మందులు, శిలీంద్ర (ఫంగస్) సంహారిణులు, కలుపు సంహారకాలను విచక్షణారహితంగా ఉపయోగించడం వలన ధాన్యాలు లేదా ఇతర తినదగిన భాగాలలో చేరే విషపూరిత అవశేషాల వల్ల క్యాన్సర్, ఇతర వ్యాధులకు సంబంధించిన ప్రతికూల మార్పులు సంభవించవచ్చు. భూగర్భ జలాలను అశాస్త్రీయంగా తోడిపారేయడం వల్ల ఈ అద్భుతమైన మూలధన వనరు వేగంగా తరిగిపోతుంది.’’ ఫిలిప్పీన్ ్సలోని అంతర్జాతీయ ధాన్య పరిశోధనా సంస్థ (ఐఆర్ఆర్ఐ) డైరెక్టర్ జనరల్‌గా స్వామినాథన్ ఉన్న సమయంలోనే ఇండోనేషియా అధ్యక్షుడు సుహార్తో నుంచి ఆయనకు అసాధారణ కబురు వచ్చింది. ఇండోనేషియా వరి పంటను బ్రౌన్ ప్లాంట్‌హాపర్ తెగులు నాశనం చేయడంతో, స్వామినాథన్ ఒక పరిష్కార మార్గాన్ని అందించాలని సుహార్తో కోరారు. ఇండోనేషియాకు వెళ్లిన శాస్త్రవేత్తల బృందాన్ని ఒకచోట చేర్చి, వారికి మరిన్ని శక్తిమంతమైన పురుగు మందులను ఉపయోగించాలని సూచించడానికి బదులుగా, వరి పంటపై ఉపయోగించే పురుగు మందులను నిషేధించాలని సుహార్తోకు స్వామినాథన్ సలహా ఇచ్చారు. అదే సమయంలో సమీకృత తెగులు నిర్వహణను ప్రారంభించాలని చెప్పారు. సుహార్తో అధ్యక్ష హోదాలో 57 పురుగు మందులను నిషేధించారు. ప్రొఫెసర్ స్వామినాథన్ టెక్నాలజీని గుడ్డిగా విశ్వసించేవారు కాదని చాలామందికి తెలియదు. జన్యుమార్పిడి పంటలకు వ్యతిరేకంగా ప్రచారం తారస్థాయికి చేరిన రోజుల్లో, బీటీ వంకాయల వాణిజ్యీకరణకు వ్యతిరేకంగా తాత్కాలిక నిషేధం విధించడంపై అప్పటి పర్యావరణ మంత్రి జైరాం రమేష్‌కు ఆయన ప్రతిస్పందన గమనించదగ్గది. చెన్నైలోని ఎం.ఎస్.స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్‌లో జరిగిన ఒక సమావేశంలో, ఆయన ఒక మునగకాయ స్లయిడ్‌ను ప్రదర్శించి, ఆ తర్వాత ‘విటమిన్ ఏ’ని కలిగిన జన్యుమార్పిడి బియ్యం ఆవశ్యకతపై ఒక ప్రశ్నను సంధించారు. అన్నంతోపాటు కలిపి వండిన మునగ ఆకులు మన సాంప్రదాయ ఆహారంలో భాగమనీ, ఇవి తమకు తాముగా విటమిన్ ఏ అందించగలవనీ ఆయన ఉద్దేశ్యం. స్వామినాథన్ పదే పదే లేవనెత్తిన పర్యావరణ పరమైన ఆందోళనలను విధాన నిర్ణేతలు తగిన విధంగా పరిష్కరించినట్లయితే, భారతీయ వ్యవసాయరంగం తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకునేది కాదు. ఆయన అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రాల కన్సార్టియంకు చెందిన మొక్కల జన్యు వనరులపై సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్‌కు కూడా నాయకత్వం వహించారు. నేను ఆ సమయంలో మేధా సంపత్తి హక్కులపై సీసీఐఏఆర్ సెంట్రల్ అడ్వైజరీ బోర్డు సభ్యుడిని. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న మొక్కల జన్యు వనరులను ప్రైవేట్ కంపెనీలకు ఏకమొత్తంగా విక్రయించడాన్ని నిలువరించడంలో ఆయన పోషించిన పాత్ర గుర్తింపు పొందలేదు. ప్రపంచ జీవవైవిధ్యానికి చెందిన అపారమైన సంపదను ప్రైవేటీకరించడానికి జరిగిన ప్రతి ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి ఆయన చేసిన తీవ్రమైన ప్రయత్నాలకు నేనే సాక్షిని. స్వామినాథన్ 2004లో జాతీయ రైతుల కమిషన్ చైర్పర్సన్ గా నియమితులైనప్పుడు, కమిషన్ నివేదికకి చెందిన జీరో డ్రాఫ్ట్‌ను రాయమని నన్ను ఆహ్వానించారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా దానిపై చర్చించి, తుది నిర్ణయం తీసుకోవాలి. రైతును కేంద్ర స్థానంలో ఉంచి, ఆపై అతని పరిస్థితిని ఎలా మెరుగుపరచవచ్చో చూడాలని నాకు ఆదేశం ఇచ్చారు. అయితే కేవలం రైతుపై మాత్రమే దృష్టి పెట్టడం కాకుండా, వివిధ వాటాదారులను కూడా అందులో చేర్చాలని తర్వాత చెప్పినప్పుడు, నేను క్షమాపణలు చెప్పాను. అయితే, ఆ మొత్తం కాలం రైతులకు ఆదాయ భద్రత కల్పించడంపై స్వామినాథన్ దృష్టి సారించారు. ఆహారోత్పత్తిని పెంచడంలో రైతులు పోషిస్తున్న పాత్రను ఆయన అభినందించేవారు. కానీ రైతు సమాజం దుఃస్థితికి ఎప్పుడూ బాధపడేవారు. 2004, 2006 మధ్య ఐదు భాగాలుగా సమర్పించిన స్వామినాథన్ కమిషన్ నివేదిక, భారతీయ వ్యవసాయంలో ఉత్పాదకత, లాభదాయకత, స్థిరత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో రూపొందింది. ఇది దేశవ్యాప్తంగా రైతు సంఘాలకు కీలకమైన అంశంగా నిలుస్తోంది. సగటు(వెయిటెడ్ యావరేజ్) మీద 50 శాతం లాభం రైతులకు అందించాలన్న ఆయన సూచనను ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఈ గొప్ప దార్శనికుడికి దేశం అర్పించే అత్యుత్తమ నివాళి ఏమిటంటే, స్వామినాథన్ కమిషన్ నివేదికను అక్షరమక్షరం అమలు చేయడమే! దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ నిపుణులు -
సాగుబడి లాభసాటి కావాలంటే...
న్యూఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండిలో కూరగాయలమ్మే వ్యక్తి తాలూకు ఒక వీడియో వైరల్ అయ్యింది. దిగమింగుకోవడం కష్టమైపోయిన ఆయన కన్నీళ్లలో తన ఆర్థిక బాధ స్పష్టంగా కనిపించింది. జీవనోపాధి కోసం ఎక్కువ మంది ఆధారపడి ఉన్నందున, వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చే సవాలును ఆర్థికవేత్తలు స్వీకరించాలి. ఇప్పుడున్న ఆర్థిక నమూనాను ధిక్కరించయినా రైతుల చేతులకు ఎక్కువ ఆదాయాన్ని అందించాలి. వచ్చే ఐదేళ్లను పూర్తిగా వ్యవసాయాన్ని పునర్నిర్మించడానికి కేటాయించాలి. సంస్కరణలు ప్రారంభించినప్పటి నుండి పరిశ్రమలకు ఇచ్చినన్ని వనరులు, ప్రోత్సాహకాలు, ఆర్థిక ఉద్దీపనలను ఇప్పుడు వ్యవసాయానికి అందించాలి. ప్రతి రైతు, కూలీ కన్నీళ్లు తుడవడానికి ఇది తప్ప వేరే మార్గం లేదు. కొన్నిసార్లు మాటల కంటే నిశ్శబ్దం మరింత బిగ్గరగా మాట్లాడుతుంది. న్యూఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండిలో ఓ కూరగాయల అమ్మకందారుపై తీసిన,గుండెను పిండేసే వీడియో క్లిప్ వైరల్‌గా మారింది. పెరిగిన ధరలకు టమోటాలు కొనలేకపోతే ఖాళీ బండితో తిరిగి వెళతావా అని అడిగినప్పుడు, ఆయన మూగబోయాడు. అదే సమయంలో తన కన్నీళ్లను అదుపులో పెట్టుకోలేకపోయాడు. ఆయన మౌనమే శక్తిమంతమైన సమాధానం అయింది. మార్కెట్లోకి వచ్చే కొత్త కార్ మోడళ్లు, సూపర్‌స్టోర్‌లను ముంచెత్తుతున్న సరికొత్త ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల వెంటపడుతున్న దేశ ప్రజల సున్నిత హృదయాలకు ఆ చిన్న వీడియో షాక్ కలిగించింది. తాజా ఆటోమొబైల్స్ గురించి, సరికొత్త ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల గురించి టీవీ షోలు నిత్యం మోతమోగిస్తున్నప్పుడు, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ గురించి ఎప్పటికప్పుడు నివేదికలు వెలువడుతున్న ప్పుడు, ఒక వీడియో క్లిప్... మధ్యతరగతిని మైకం నుంచి బయటకు లాగడమే కాకుండా కఠినమైన వాస్తవాలను వారి ముఖాముఖి తీసు కొచ్చింది. న్యూఢిల్లీకి చెందిన కూరగాయలమ్ముకునే రామేశ్వర్‌పై చిత్రించిన క్లిప్ సరిగ్గా అటువంటి ఉదాహరణే. దిగమింగుకోవడం కష్టమైపోయిన ఆయన కన్నీళ్లలో తన ఆర్థిక బాధ స్పష్టంగా కనిపించింది. ఎంత సంపాదించారని ప్రశ్నించగా, రోజుకు రూ.100–200కు మించి రావడం లేదన్నాడు. ఆయన సమాధానం భారతదేశ పేదరిక స్థాయిలనే కాకుండా, పెరుగుతున్న అసమానతల విస్ఫోటనాన్ని కూడా బయటపెట్టింది. అయితే మహారాష్ట్రలోని ఠిక్పుర్లీకి చెందిన 45 ఏళ్ల చెరకు రైతు, కూలీ గురించి చాలామందికి తెలియదు. భారతి పాటిల్ అనే ఆ రైతు, ఒక పరిశోధనా వేదికతో మాట్లాడుతూ, ‘‘గత ఐదేళ్లుగా మా కూలీలు పెద్దగా మారలేదు. నోట్ల రద్దుకు ముందు రోజుకు 100 రూపాయలు వచ్చేది, ఇప్పుడు సాయంత్రం 5 గంటల వరకు పనిచేసినా మాకు రూ. 150 మాత్రమే చేతికి అందుతోంది’’ అని పేర్కొన్నారు. మరో మాటలో చెప్పాలంటే, ఒక సన్నకారు చెరకు రైతుకు ఒక రోజుకు దక్కుతున్న మొత్తాన్ని ఇది బయటపెడుతుండగా, మహారాష్ట్రలోని చక్కెర బెల్ట్‌లో రోజువారీ కూలీ గత ఐదేళ్లలో రూ.50 మాత్రమే పెరిగిందని కూడా వెల్లడవుతోంది. నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నా సన్నకారు రైతులు, రైతు కూలీలు ఏటా అదే తక్కువ కూలీ మొత్తంతో ఎలా బతుకుతున్నారనేది జీర్ణించుకోవడం కష్టం. ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేసినప్పుడు నిజమైన కూలీల పెరుగుదల సున్నాకు దగ్గరగానే ఉంది. ఏరకమైన అర్థవంతమైన పెరుగుదలా కనబడలేదు. వాస్తవానికి, కొన్ని అధ్యయనాలు 2013 –17 మధ్య నిజమైన వేతనాలు తగ్గుముఖం పట్టడం లేదా స్తబ్ధుగా ఉండటాన్ని సూచించాయి. దేశంలోని 90 కోట్ల మంది కార్మికులలో చాలా మంది అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాల పట్ల భ్రమలు కోల్పోయారనీ, దీంతో వారు ఉద్యోగాల కోసం వెతకడం కూడా మానేశారనీ 2022 ఏప్రిల్‌లో సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎమ్ఐఈ) పేర్కొంది. ఈ కారణం వల్లే 2021–22లో దేశ ఉపాధిలో 45.5 శాతంగా ఉన్న వ్యవసాయ రంగం వాటా, మహమ్మారి ముందు స్థాయికి చేరలేదని పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే పేర్కొంది. అప్పుడు శ్రామిక శక్తిలో 42.5 శాతంతో వ్యవసాయరంగ జనాభా వాటా సాపేక్షంగా తక్కువగా ఉందని ఈ నివేదిక తెలిపింది. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్ విధించిన తర్వాత వారి గ్రామాలకు తిరిగి వచ్చిన 10 కోట్ల మంది కార్మికులలో గణనీయమైన భాగం మళ్లీ నగరాలకు తిరిగి రాలేదు. అదేవిధంగా, బంగ్లాదేశ్‌లో కూడా ఈ సంవత్సరం వ్యవసాయంపై ఆధారపడటం పెరిగింది. బంగ్లాదేశ్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం, వ్యవసాయ రంగంలో సంవత్సర ప్రాతిపదికన చూసిన ప్పుడు 2023 ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో అత్యధిక ఉద్యోగాల కల్పన జరిగింది. అదే సమయంలో నగరాల్లో అధికారిక ఉపాధి అవకాశాలు లేకపోవడాన్ని సూచిస్తున్నందున ఇది మంచి సంకేతం కాదని కొందరు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అసమానత ఎంత నిరుత్సాహకరంగా మారుతున్నదో ముందుగా చూద్దాం. ప్రపంచ స్థాయిలో అధ్వాన్నంగా పెరుగుతున్న అసమానతలను ‘వరల్డ్ ఇన్–ఈక్వాలిటీ రిపోర్ట్’ వెల్లడించింది. తాజా నివేదిక ప్రకారం, ప్రపంచ జనాభాలో అత్యంత సంపన్నులైన 10 శాతం మంది మొత్తం సంపదలో 76 శాతాన్ని కలిగి ఉన్నారు. అయితే దిగువ సగం మంది కేవలం 3 శాతం సంపద కలిగి ఉన్నారు. భారతదేశంలో కూడా అగ్రశ్రేణి 1 శాతం మంది, దేశ సంపదలో 40.5 శాతాన్ని కలిగి ఉన్నారని ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ చెబుతోంది. ధనికులు సంపదను కూడబెట్టుకోవడం కొనసాగిస్తుండగా, పేదలు పేదరికంలోకి మగ్గిపోయేలా ఆర్థిక రూపకల్ప నను మన విధాన నిర్ణేతలు అల్లుకుంటూ వచ్చారు. పెట్టుబడిదారీ వ్యవస్థ ఎంత బలంగా పాతుకుపోయిందంటే, అసమానతలను అంతం చేయడంపై పెద్ద చర్చ జరుగుతున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి 500 మంది అత్యంత సంపన్నులు 2023 మొదటి ఆరు నెలల్లోనే తమ సంపదకు మరో 852 బిలియన్ డాలర్లను జోడించుకున్నారు. ప్రపంచ బ్యాంక్ ప్రమాణాల ప్రకారం, రోజుకు నాలుగు డాలర్ల కంటే తక్కువ ఆదాయంతో బతుకుతున్న ‘బ్రిక్స్’ దేశాల జనాభాలో ఇండియా మొదటిస్థానంలో ఉంది. 91 శాతం జనాభా నిర్దేశిత ప్రమాణానికి కిందికి ఉంది. 50.3 శాతంతో రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా కంటే కూడా ఇది ఎంతో ఎక్కువ. వ్యవసాయాన్ని అతి పెద్ద ఉపాధి కల్పనారంగంగా పరిగణనలోకి తీసుకుంటే, అసమానతలను తగ్గించడానికి ఉత్తమ మార్గం ఏమిటంటే, వనరులను అవసరం ఉన్న చోట ఉపయోగించడమే. పైనుంచి కిందికి ప్రవహించే విఫల ‘ట్రికిల్ డౌన్’ ఆర్థిక వ్యవస్థను కొనసాగించ డానికి బదులుగా– దిగువ, మధ్య స్థాయులను పైకి తేవడం మీద దృష్టి పెట్టడమే అసలైన కర్తవ్యం కావాలి. భారతదేశం, బంగ్లాదేశ్‌లలో జీవనోపాధి కోసం ఎక్కువ భాగం వ్యవసాయంపై ఆధారపడి ఉన్నందున, గ్రామీణ పరిశ్రమలను ప్రోత్స హించడం ద్వారా వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చే సవాలును ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తలు స్వీకరించాలి. దిగువ స్థాయి నుండి సంపదను పిండుకునే బదులు, ఇప్పుడున్న ఆర్థిక నమూనాను ధిక్క రించయినా రైతుల చేతులకు ఎక్కువ ఆదాయాన్ని అందించాలి. సజీవ వ్యవసాయం అనేది ఈ కాలపు అవసరం. ప్రతి రైతు, కూలీ కన్నీళ్లు తుడవడానికి ఇది తప్ప మరో మార్గం లేదు. వచ్చే ఐదేళ్లను వ్యవసాయాన్ని పునర్నిర్మించడానికి కేటాయించాలని నా సూచన. సంస్కరణలు ప్రారంభించినప్పటి నుండి పరి శ్రమలకు మనం ఇచ్చినన్ని వనరులు, ప్రోత్సాహకాలు, ఆర్థిక ఉద్దీపన లను ఇప్పుడు వ్యవసాయానికి అందించాలి. ఆరోగ్యకరమైన, సంప న్నమైన, పునరుత్పత్తి చేసే తదుపరి దశ సంస్కరణలకు నాంది పలికేందుకు కేవలం ఐదేళ్ల పాటు, చిన్న తరహా వ్యవసాయాన్ని, పర్యా వరణపరంగా స్థిరమైన వ్యవసాయాన్ని పునర్నిర్మించాలి. కేవలం ఐదేళ్లు – ఇంతమాత్రమే నేను అడుగుతున్నది! దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com -
పొలం నుంచి వైఫల్యం వరకు...
దేశ వ్యవసాయదారుల వ్యధలను ఎవరూ గుర్తిస్తున్నట్లు కనిపించడం లేదు. లేదా వారి గురించి కనీసంగానైనా సరే ఎవరూ ఆలోచిస్తున్నట్లు లేదు. ‘నేను దాన్ని పెంచాను. నేనే దాన్ని ధ్వంసం చేస్తున్నాను. ఇలా చేయడం చాలా కష్టంగా ఉంది కానీ నేను ఏం చేయగలను? గిట్టుబాటు ధరైనా రాకుంటే..’ అని కూరగాయలు, పండ్లు పండించే రైతు ఆవేదన చెందుతున్నాడు. పంట ఉత్పత్తికి ఎకరాకు వేలాది రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ఆ పంట మొత్తాన్ని నాశనం చేయడమనేది రైతుల జీవితాలను దారుణంగా దెబ్బతీస్తుంది. ‘పొలం నుంచి వైఫల్యం వరకు’ అనే ఈ పునరావృత రైతు గాథ దేశంలో ప్రతిచోటా కనిపిస్తున్నదే. అంతేకాదు... కొన్ని సంవత్సరాలుగా ఈ విఫలగాథ మరింతగా విస్తృతమవుతూ వస్తోంది! ఈ సంవత్సరం క్వింటాల్ బంగాళా దుంపల ధర రూ. 500లకు పడిపోయి నప్పుడు (గత సంవత్సరం రూ. 1,200లు సగటు ధర పలికింది) ఒక రైతు మీడియాతో ఏం చెప్పాడంటే... ‘‘క్వింటాల్ బంగాళా దుంపలను 900 నుంచి 1000 రూపాయల ధరకు తక్కువ అస్సలు అమ్మలేము. ఎందుకంటే ఈ రేటు వద్ద అయితేనే మాకు దిగుబడి ఖర్చులు రావడమే కాకుండా కాస్త లాభం కళ్ల చూడగలం’’ అని. అయితే ఇప్పుడు బంగాళాదుంపల ధర ఏమాత్రం పెరిగే సూచనలు కనిపించకపోవడంతో రానున్న కాలంలో బంగాళా దుంపల ఉత్పత్తిదారులు గడ్డు కాలాన్నే ఎదుర్కోనున్నారు. పంజాబ్‌లోనే కాదు, బెంగాల్, బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలో కూడా బంగాళాదుంపల ధర ఘోరంగా పతనం కానుంది. క్యాలిఫ్లవర్, క్యాబేజి, టమోటా ధరలు కూడా పడిపోయాయి. కేజీకి 3 రూపాయల ధర కూడా పలకదని గుర్తించక ముందే పంజాబ్‌లో రైతులు తమ పంటను ఇప్పటికే ధ్వంసం చేయడం ప్రారంభించారు. ‘నేను దాన్ని పెంచాను. నేను దాన్ని ధ్వంసం చేస్తున్నాను. ఇలా చేయడం చాలా కష్టంగా ఉంది. కానీ నేను ఏం చేయగలను..’ అని కూరగాయలు పండించే రైతు ఒకరు అన్నారు. వీటి ఉత్పత్తికి ఎకరాకు రూ. 30 వేలు ఖర్చు పెట్టిన తర్వాత ఆ పంట మొత్తాన్నీ నాశనం చేయడమనేది ఈ రైతుల జీవితాలను దారుణంగా దెబ్బతీయకుండా ఉంటుందా?! ఇటీవల తెలంగాణలోని జహీరాబాద్ జిల్లా ప్రాంతాల గుండా నేను ప్రయాణిస్తున్నప్పుడు, అక్కడ విరివిగా పండిన టమోటాకి కూడా ఇదే గతి పట్టడం చూశాను. టమోటా పంటను ఎందుకు పండించడం లేదని అడిగాను. నిరాశతో కనిపించిన టమోటా రైతు ఒకరు నాతో మాట్లాడుతూ, మార్కెట్ ధర కిలో టమోటాకు 2 రూపాయలు పలుకుతున్నప్పుడు టమోటాలను బుట్టల్లో సర్దడం, వాటిని రవాణా చేయడం వంటివాటికి అదనపు ఖర్చు పెట్టాలని తానను కోవడం లేదని చెప్పాడు. ‘మీకు ఎన్ని టమోటాలు కావాలంటే అన్నీ తీసుకోండి’ అని అతను నిస్పృహతో అన్నాడు. ‘పొలం నుంచి వైఫ ల్యానికి’ సంబంధించిన ఈ గాథను నేను ప్రతి చోటా చూస్తున్నాను. దేశ వ్యవసాయదారుల వ్యధలను ఎవరూ గుర్తిస్తున్నట్లు కనిపించడం లేదు. లేదా వారి గురించి కనీసంగానైనా సరే ఎవరూ ఆలో చిస్తున్నట్లు లేదు. నేను ఎందుకిలా చెబుతున్నానంటే, ఛత్తీస్‌గఢ్ నుంచి పక్షం రోజుల క్రితం ఒక నివేదిక వచ్చింది. మహాసముండ్కి చెందిన ఒక రైతు రాయపూర్ మండీకి వంకాయ పంటను తీసుకెళితే అతడికి రూ. 1,475 రూపాయలు మాత్రమే ఆదాయం వచ్చిందనీ, రవాణా ఖర్చులు, ఇతర ఖర్చుల కింద అదనంగా 121 రూపాయలను రైతే చెల్లించాల్సి వచ్చిందనీ ఆ వార్త తెలిపింది. అంతకు ముందు నెల రోజుల క్రితం వెల్లుల్లి రైతులు తమ పంట మొత్తాన్ని స్థానిక నదుల్లో కలిపేశారన్న వార్తలు మీడియాలో రాజ్యమేలాయి. తర్వాత ఉల్లి పాయల సాగుదార్ల వ్యధలకు సంబంధించిన వార్తలు కూడా బయటికి వచ్చాయి. మరో మాటలో చెప్పాలంటే, దేశంలో ఈ పరిస్థితి రోజువారీ కార్యక్రమంలా సాగుతోంది. కొన్ని సంవత్సరాలుగా, పొలం నుంచి వైఫల్యానికి సంబంధించిన గాథ మరింతగా విస్తృతమవుతూ వచ్చింది. పొలంలో రైతు చిందిస్తున్న రక్తం మీడియాలో పేజీలకు మాత్రమే పరిమితమవుతోంది. స్టాక్ మార్కెట్లో రక్త పాతాన్ని దేశం చూస్తున్నప్పుడు కలుగుతున్నటువంటి తీవ్ర స్పందన రైతుల వ్యధల పట్ల కలగడం లేదు. ఇది చాలదన్నట్లుగా, మార్కెట్లో జోక్యం చేసుకునే వ్యవస్థ (ఎమ్ఐఎస్)ను మరింతగా బలోపేతం చేయడంలో ఎలాంటి ప్రయో జనాన్నీ మన ఆర్థిక మంత్రి చూడడం లేదు! సమృద్ధిగా పంటలు పండి ధరలు పడిపోయినప్పుడు లేదా పంటలు చేతికొచ్చిన సమయంలో ఉత్పత్తి ధరకంటే తక్కువ ధరకు పడిపోయినప్పుడు ఎమ్ఐఎస్ రంగంలోకి దిగుతుందన్నది తెలిసిందే. 2023 బడ్జెట్ ఖర్చుల కింద, ధర మద్దతు పథకం (పీఎస్ఎస్), ఎమ్ఐఎస్లకు కేటా యింపులను బాగా తగ్గించినట్లు కనిపిస్తోంది. గత ఏడాది ఎమ్ఐఎస్కి బడ్జెట్లో రూ. 1,500 కోట్లు కేటాయించగా, ఈ సంవత్సరం దాన్ని కేవలం లక్ష రూపాయలకు కోసిపడేశారు. బడ్జెట్లో పొందుపర్చిన ఈ కేటాయింపు, కొద్దిమంది వెల్లుల్లి ఉత్పత్తిదారులకు కలిగిన నష్టాలను పూరించడానికైనా సరిపోతుందని నేను భావించడం లేదు. 2018–19 బడ్జెట్లో రూ. 500 కోట్ల కేటాయింపుతో ప్రారంభించిన ఆపరేషన్ గ్రీన్స్ స్కీమ్‌ను గుర్తుంచుకోండి. టమోటో, ఉల్లి పాయలు, బంగాళాదుంపలు మామూలుగా ఎదుర్కొంటున్న అస్థిర ధరల నియంత్రణకు ఉద్దేశించినట్లు చూపించినప్పటికీ అవసరమైన దానికంటే తక్కువగా బడ్జెటరీ కేటాయింపులు చేశారు. ఆపరేషన్ ఫ్లడ్ ప్రాతిపదికన, కనీసం ఈ మొత్తాన్నయినా ప్రకటించారు. ఈ పథకాన్ని అన్ని పండ్లు, కూరగాయలకు వర్తింపచేస్తూ, ఆత్మనిర్భర్ అభియాన్ కింద ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ స్కీమ్‌ని మరింతగా విస్తరించింది. కానీ 2023 నాటికి ఈ పథకాన్ని దాదాపుగా విస్మరించేశారు. కూరగాయల ధరలు (పండ్ల విషయంలో కూడా) పడిపోయిన ప్రతి సందర్భంలోనూ నేను ట్వీట్ చేసినప్పుడు, ఇవి పాడైపోయే సరకులు అని సాధారణ పల్లవి పాడుతూ వచ్చేవారు. సాధారణ ప్రజానీకం నుంచి ఈ మాటలు వింటే వాటిని సులువుగా పక్కనపెట్టేయవచ్చు కానీ విధాన నిర్ణేతలు ఇంత భిన్నంగా ఉండ టానికి ఇది కారణం కాకూడదు. అమెరికాలో కూడా, ధరలు పడిపోయినప్పుడు రైతులు నష్ట పోకుండా ఒక యంత్రాంగాన్ని ఏర్పర్చారు. పాలధరలు పడి పోయిన సమయాల్లో స్కూల్ ఫీడింగ్ ప్రోగ్రామ్‌లలో పొందు పరిచేలా రైతులు మరింత చీజ్‌ని తయారు చేయాలని రైతులను కోరే యంత్రాంగాన్ని అమెరికా రూపొందించింది. అలాగే స్ట్రాబెర్రీ ధరలు పతనం అయే సమయాల్లో ఇదే విధమైన కార్యక్రమాలు ఉంటున్నాయి. ప్రతిదీ సజావుగా ఉంటుందని చెప్పలేం కానీ, వ్యవ సాయ క్షేత్రాల నష్టాలను తగ్గించడానికి ఇప్పటికీ ప్రయత్నాలు జరుగు తున్నాయి. భారత్‌లో తగిన ఉష్ణోగ్రతా నియంత్రిత నిల్వ సౌకర్యాలు, ప్రాసె సింగ్‌పై ఆధారపడి ఉండే వాల్యూ ఛెయిన్‌ని పునర్నిర్మించడానికి, స్థానికంగా అందుబాటులో ఉంచేందుకు చిత్తశుద్ధితో కూడిన ప్రయ త్నాలు చేపట్టాలి. ధరల క్షీణత పథకాన్ని అమలు చేసే యంత్రాంగం ద్వారా దీన్ని అమలు చేయాలి. కానీ మధ్యప్రదేశ్‌లో గతంలో స్కీమ్ పైఫల్యం చెందడం అనేది పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలి. అయితే మరింత ముఖ్యంగా ధరల అస్థిరత్వాన్ని అధిగమించడానికి రైతుల కోసం గ్యారంటీ ధరకు హామీ పడటం మార్గదర్శక స్ఫూర్తిగా ఉండాలి. కూరగాయల పెంపకందార్లకు గ్యారంటీ ధరను అందిస్తున్న కేరళ స్కీమ్ నుంచి వెలికివచ్చిన పాఠాలను నేర్చుకోవలసి ఉంటుంది. రైతుల కోసం భవిష్యత్తులో పండ్లు, కూరగాయల ధరలను స్థిరీకరించడంలోనే కాదు.. వైవిధ్యభరితమైన పంటల వైపు మారే విషయంలో వారికి సహకారం అందివ్వడంలో ఆపరేషన్ గ్రీన్స్ కి అతి పెద్ద సవాలు ఎదురవుతోంది. వినియోగదారులు ఇప్పటికే అత్యధిక మార్కెట్ ధరను చెల్లిస్తున్నారు. కానీ భారీగా ఆర్గనైజ్ అయివుండే వ్యాపారంలో కూడా జరిగే బేరసారాల్లో రైతులే నిండా మునిగి పోతున్నారు. కాబట్టి పొలం నుంచి వైఫల్యానికి చెందిన గాథ మారాల్సి ఉంది. కొనసాగుతున్న వ్యవసాయ దుఃస్థితికి గాను సప్లయ్ – డిమాండును మాత్రమే మనం నిందిస్తూ కూర్చోలేము. దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com -
రావాల్సిన ‘చిరు’ విప్లవం
ఐక్యరాజ్యసమితి 2023ను చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. కిలో బియ్యం పండించేందుకు 3–5 వేల లీటర్ల నీళ్లు అవసరం కాగా, చిరుధాన్యాలకు 200 లీటర్లు చాలు. వాటి పర్యావరణ హితాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులకు కనీస మద్దతు ధర నిర్ణయించాలి. ఆంధ్రప్రదేశ్‌లో ‘టీటీడీ’ ఆధ్వర్యంలో 11 ధార్మిక ప్రాంతాలకు వీటిని అందించేట్టుగా చేసుకున్న ఒప్పందం లాంటిది పంజాబ్ లాంటి రాష్ట్రాలు అనుసరించవచ్చు. చిరుధాన్యాల హల్వా, పాయసాలు ప్రసాదంగా మంచి ప్రత్యామ్నాయాలు. దేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 12 కోట్ల మంది చదువుకుంటున్నారు. మధ్యాహ్న భోజనంలో వారంలో ఒక పూటైనా చిరుధాన్యాలు అందిస్తే వీటి డిమాండ్ పెరిగి, రైతులను ఆ దిశగా మళ్లేట్టు చేస్తుంది. ఈ ఏడాదిని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి తీర్మానించింది. దీంతో ఈ అద్భుత సిరిధాన్యాలపై మరోసారి అందరి దృష్టి కేంద్రీకృతం కానుంది. 2023 ఏడాది ముగిసేలోపు ఈ చిరుధాన్యాలను తృణప్రాయంగా పక్కనబెట్టే మానసిక స్థితి నుంచి అందరూ బయటపడతారని నేనైతే నమ్మకంగా ఉన్నాను. ప్రతిగా... ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అదృశ్య ఆకలి ప్రమాదాన్ని భారత్ కూడా సమర్థంగా ఎదుర్కునే అవకాశం లభిస్తుంది. ఒకప్పుడు వీటిని తృణధాన్యాలని పిలిచేవారు. ఇవి ముతకగా ఉండవచ్చునేమో కానీ, ఆరోగ్యానికి హాని చేసేవి కాదు. నిజానికి పోష కాలతో నిండి ఉంటాయి. వాతావరణాన్ని తట్టుకోగల తెలివైన పంటలు కూడా. మెట్ట, వర్షాధారిత ప్రాంతాల్లో ఎంచక్కా పండించు కోవచ్చు. చిరుధాన్యాల జాబితాలోకి సజ్జలు, జొన్న, రాగులతోపాటు ఇతర చిన్న సైజు గింజలుండే ఆరు ధాన్యాలు(కొర్ర, అండుకొర్ర, అరికె, ఊద, సామ, వరిగ) వస్తాయి. చాలాకాలంగా వీటిని ఉద్దేశ పూర్వకంగానే నిర్లక్ష్యం చేశారు. యూరోపియన్ లేదా అమెరికన్ ఆహార శైలుల్లోకి ఇవి ఇమడకపోవడం ఒక కారణం. సంప్రదాయ సాగు నుంచి మళ్లించాలి... అయితే మిల్లెట్స్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా తదితర పౌర సమాజ వర్గాలు చిరుధాన్యాల ప్రయోజనాలపై చేసిన విస్తృత స్థాయి ప్రచారం పుణ్యమా అని ఇప్పుడు వీటికి మరోసారి ప్రాధాన్యం ఏర్పడుతోంది. ప్రజా పంపిణీ వ్యవస్థలోకి వీటిని చేర్చడం కారణంగా ఇప్పుడు వైవిధ్యభరిత ఆహార, పంటల వ్యవస్థలకు మార్గం సుగమమైంది. చిరుధాన్యాల లాభాల గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. ఈ ఏడాదిలో వీటి గురించి మరింత వింటాం కూడా. ప్రజల్లో అవగాహన మరింత పెంచడం, దిగుబడుల పెంపు, ఆహార శుద్ధికి అవకాశాలు కల్పించడం, సేకరణ మెరుగుపరచడం వంటి అంశాలపై ఈ ఏడాది చర్చోపచర్చలు జరగనున్నాయి. అయితే చిరుధాన్యాల సాగును మరింతగా పెంచాలంటే, నీటి అవసరాలు ఎక్కువగా ఉండే వరి సాగు నుంచి రైతులను మళ్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం చిరుధాన్యాల సాగు రైతులకు లాభదాయకంగా ఉండాలి. అయితే ఇది చెప్పినంత సులువైన పనేమీ కాదు. సంప్రదాయ పంటల సాగు నుంచి రైతును ఇంకో దిశకు మళ్లించడం కోసం గతంలోనూ కొన్ని విఫలయత్నాలు జరిగిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. ఒక కిలో బియ్యం పండించేందుకు ప్రాంతం, వాతావరణాలను బట్టి మూడు నుంచి ఐదు వేల లీటర్ల నీరు అవసరమవుతుంది. కానీ చిరుధాన్యాల విషయంలో నీటి అవసరం కేవలం 200 లీటర్లు మాత్రమే. పైగా వీటి సాగులో రసాయన ఎరువులు, క్రిమి, కీటక నాశినుల వాడకమూ పెద్దగా ఉండదు. పోషకాలూ మెండుగా ఉంటాయి. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ‘కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్స్ అండ్ ప్రైజెస్’ (సీఏసీపీ) చిరుధాన్యాల ధరల నిర్ణయానికి కొత్త ఫార్ములాను రూపొందించాలి. పర్యావరణానికి చిరు ధాన్యాలు అందించే తోడ్పాటును కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వినియోగదారుడికి అందే ధరలో రైతుకు దక్కేది కొంతే కాబట్టి ధరలు నిర్ణయించే తీరు మారడం ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. పండించే పంటకు కచ్చితంగా కొంచెం పెద్ద మొత్తంలోనే ధర లభిస్తుందని తెలిస్తే రైతుకూ, సమాజానికీ లాభం. స్ఫూర్తిదాయకమైన ఏపీ మోడల్ చిరుధాన్యాలకు మద్దతుధరలు కొత్తగా నిర్ణయించడంతోపాటు వరి పంటకు పేరెన్నికగన్న పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో చిరుధాన్యాల సాగును పెంచాలి. 1950లో అవిభాజ్య పంజాబ్‌లో సుమారు 11 లక్షల హెక్టార్లలో సజ్జలు సాగవుతూండేవి. ఇప్పుడు ఇది వెయ్యి హెక్టార్ల కనిష్ఠానికి పడిపోయింది. గోధుమ, వరి పంటలను మార్చి మార్చి వేయడమన్న విధానానికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల పరిస్థితి ఇంతకు దిగజారింది. పప్పులు, నూనెగింజలతోపాటు చిరుధాన్యాల సాగు మళ్లీ చేపట్టడం మేలైన ముందడుగు అవుతుంది. ఇలా పంటల వైవిధ్యానికి చిరుధాన్యాలు చేర్చడం వల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయి. పర్యావరణ విధ్వంసానికి కారణమైన హరిత విప్లవ దుష్ప రిణామాలను చక్కదిద్దగలగడం ఒకటైతే... చిరుధాన్యాలకు డిమాండ్ పెంచడం రెండోది. చిరుధాన్యాల సాగు విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలను పంజాబ్ పరిగణనలోకి తీసుకోవడం మంచిది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని 11 ధార్మిక ప్రాంతాల్లో సెంటర్ ఫర్ సస్టెయినబుల్ అగ్రికల్చర్ (సీఎస్ఏ), రైతు సాధికార సంస్థ, ఏపీ మార్క్‌ఫెడ్ కలిసికట్టుగా ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో భాగంగా 12 రకాల పంటలను 15,000 టన్నుల మేరా సహజసేద్య విధానంలో అందించాలి. ఇందులో భాగంగా కనీస మద్దతు ధర కంటే పది శాతం ఎక్కువ ధర రైతుకు లభించనుంది. ఒకవేళ మార్కెట్లో ఆయా పంటకు ఎక్కువ ధర ఉంటే... అదనంగా ఇంకో పదిహేను శాతం చెల్లిస్తారు. కర్ణాటకలోనూ గతంలో రాగుల సాగును ప్రోత్సహించేందుకు కనీస మద్దతు ధర కంటే 40 శాతం ఎక్కువ చెల్లించారు. పంజాబ్‌లోని వేల గురుద్వారాలను దృష్టిలో ఉంచుకుంటే చిరుధాన్యాలకు, అదికూడా సేంద్రీయ ఉత్పత్తలకు మంచి డిమాండే ఉంటుంది. శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ వంటి సంస్థల సాయంతో సేంద్రీయ లంగర్ ఏర్పాటుకు ప్రయత్నించవచ్చు. ఇందులో వడ్డించే ఆహార పదార్థాల్లో చిరుధాన్యాలను చేర్చవచ్చు. ఆ మాటకొస్తే చిరుధాన్యాల హల్వా, పాయసాలు ప్రసాదంగా మంచి ప్రత్యామ్నాయాలవుతాయి. చిరుధాన్యాల సక్రమ నిల్వ, సరఫరాల బాధ్యతను మార్క్‌ఫెడ్ వంటి సంస్థలకు పంజాబ్ అప్పగించవచ్చు. ఖేతీ విరాసత్ మిషన్ వంటి లాభాపేక్ష లేని సంస్థలకు సేంద్రీయ వ్యవసాయ సముదాయాల ఏర్పాటు పనులు అప్పగించవచ్చు. నాణ్యతను నిర్ధారించేందుకు అవసరమైన చర్యలూ సులువుగా చేపట్టవచ్చు. పాఠశాలల డిమాండ్ కూడా చేరితే... పంజాబ్‌లో సుమారు 30 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠ శాలల్లో చదువుతున్నారు. వీరికందించే మధ్యాహ్న భోజన పథకంలో ప్రారంభంలో వారానికి ఒకసారి చిరుధాన్యాలను కూడా చేరిస్తే విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుంది. తద్వారా స్థానికంగానే వీటి సరఫరాకు అవకాశం ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో టీటీడీ నిర్ణయించినట్లే చిరుధాన్యాలను పంజాబ్‌లోనూ స్థానిక రైతుల నుంచి మాత్రమే సేకరిస్తామని చెప్పవచ్చు. కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌లో సుమారు 110 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీరికి వారంలో ఒకసారి చిరుధాన్యాలను వడ్డిస్తున్నారు. అయితే ఈ డిమాండ్‌ను తట్టుకోవడం కష్టమవుతోంది. పంజాబ్ మొత్తమ్మీద చిరు ధాన్యాలను వడ్డిస్తే పరిస్థితి ఎలా ఉండనుందో ఇట్టే అర్థం చేసు కోవచ్చు. పాఠశాలలు, గురద్వారాలతో ఏర్పడే డిమాండ్‌ను తట్టు కునేందుకు పంజాబ్ ప్రభుత్వం, రైతులు ఏదో ఒక మాయ కచ్చితంగా చేయగలరు. జాతీయ స్థాయిలో చూస్తే సుమారు 12.7 లక్షల ప్రభుత్వ పాఠశాలల్లో 12 కోట్ల మంది చదువుకుంటున్నారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా వీరందరికీ చిరుధాన్యాలు ఏదో ఒక స్థాయిలో అందించడం రైతులను చిరుధాన్యాల సాగుకు మళ్లించేందుకు మేలిమి మార్గం కాగలదు. పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రార్థనాలయాల సాయంతో చిరుధాన్యాల సాగు, వినియోగాన్ని పెంచడం సుసాధ్య మవుతుంది. పంజాబ్ ఈ దిశగా అడుగులేసి దేశంలో చిరుధాన్యాల విప్లవాన్ని సృష్టించాలని ఆశిద్దాం! దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com -
GM Mustard: ఆధారాలు లేకుండానే అనుమతులా?
ప్రశ్నలు వేయడం, వాటికి సమాధానాలు కనుక్కోవడంతోనే సైన్స్ ప్రస్థానం మొదలవు తుందని మా సైన్స్ టీచర్ చెబుతూండేది. ఇంకోలా చెప్పాలంటే... సైన్స్ ఎల్లప్పుడూ ప్రశ్నలకు సిద్ధంగా ఉంటుందీ అనాలి! దీనివల్ల సాంఘిక, ఆర్థిక ఆందోళనలకు తావిచ్చే, పర్యావరణ విధ్వంసానికి దారితీసే అపోహలను తొలగించుకోవచ్చు. అందుబాటులో ఉన్న సాక్ష్యాలపై వ్యాఖ్యానం చేయవచ్చు. అయితే ఆర్థిక ప్రయోజనాల కారణంగా సత్యాన్వేషణ తాలూకూ గొంతుకలను నొక్కివేసే ప్రయత్నం జరుగుతోంది. ఈ క్రమంలో ప్రదర్శించే సాక్ష్యాలు కూడా నమ్మదగ్గవిగా ఉండవు. విషయం ఏమిటంటే... జన్యుమార్పిడి పంటలపై ఎప్పుడు చర్చ మొదలైనా, సాక్ష్యాల ఆధారంగా ముందుకెళ్లాలని కొందరు శాస్త్రవేత్తలు చెబుతూంటారు. తద్వారా శాస్త్రీయ సమాచారం, వాదం, ప్రజా విచారణలన్నీ పక్కకు తొలగిపోయేలా చేస్తూంటారు. దేశంలోకి మొట్టమొదటి జన్యుమార్పిడి పంట బీటీ కాటన్‌ను 2001లో వాణిజ్యస్థాయిలో విడుదల చేశారు. అప్పట్లో జరిగిన జెనెటిక్ ఇంజినీరింగ్ అప్రైజల్ కమిటీ (జీఈఏసీ) సమావేశాల్లో పాల్గొన్న వారిలో నేనూ ఉన్నాను. జన్యుమార్పిడి పంటల ప్రవేశంపై తుది నిర్ణయం తీసుకునే ఈ జీఈఏసీ సభ్యులతోపాటు, ‘జెనిటిక్ మ్యానిపులేషన్ అండ్ ద మానిటరింగ్ కమిటీ’కి సంబంధించిన పర్యవేక్షణ బృందం కూడా ఈ సమావేశంలో పాల్గొంది. బీటీ పత్తి విత్తనాన్ని అభివృద్ధి చేసిన మహికో – మోన్శాంటో సభ్యులు, కొంతమంది పౌర సమాజపు ప్రతినిధులు కూడా అందులో ఉన్నారు. రెండు నెలలు ఆలస్యంగా నాటినా ఆ ఏడాది పత్తి పంట దిగుబడి యాభై శాతం ఎక్కువైనట్లు దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం చెబుతోందని సమావేశంలో ప్రస్తావించారు. బీటీ కాటన్ కారణంగానే ఇలా జరిగిందనడంతో ఆశ్చర్యం వేసింది నాకు. ఆ సమాచారం తప్పనీ, అశాస్త్రీయమైందనీ, దాన్ని ఏదైనా పరిశోధన సంస్థతో నిర్ధారించాలనీ నేను పర్యవేక్షణ కమిటీ ఛైర్మన్, అప్పటి ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్) డిప్యూటీ డైరెక్టర్‌ను కోరాను. సాధారణ పరిస్థితుల్లో ఎదిగేందుకు ఐదు నెలల సమయం తీసుకునే పంటలో రెండు నెలలు ఆలస్యంగా విత్తినా అధిక దిగుబడి సాధించడం దాదాపు అసాధ్యం. వ్యవసాయ పరి శోధనల్లో విత్తనాలు వేసే సమయం చాలా ముఖ్యమైన అంశమన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి అంశంలో ఒక ప్రైవేట్ కంపెనీకి మినహాయింపు ఇస్తే, భవిష్యత్తులో యూనివర్సిటీ శాస్త్రవేత్తలను కూడా విత్తిన సమయం గురించి పట్టించుకోవద్దని చెప్పే అవకాశం ఏర్పడుతుంది. జీఈఏసీ ఛైర్మన్‌కు నేను వేసిన ప్రశ్న ఏమిటంటే– రెండు నెలలు ఆలస్యంగా విత్తినా దిగుబడి పెరగడ మంటే... అది రైతులకు చాలా ప్రయోజనకరమైంది కాబట్టి, రైతులందరూ రెండు నెలలు ఆలస్యంగా విత్తుకోవాలని ఎందుకు సలహా ఇవ్వకూడదూ? అని! ఈ సమావేశం పూర్తయిన తరువాత సాయంకాలం ఐసీఏఆర్ ఉన్నతాధికారి ఒకరు నాతో మాట్లాడుతూ, బీటీ విత్తనాల ట్రయల్స్ ఇంకో ఏడాది చేయాల్సిందిగా మహికో–మోన్శాంటో కంపెనీని కోరినట్లు తెలిపారు. అవసరమైనంత మేర అన్ని పరీక్షలు పూర్తి చేసినట్లు మోన్శాంటో చెప్పినా జన్యుమార్పిడి పంటల అనుమతిని ఒక ఏడాది ఆలస్యం చేయగలిగామన్నమాట. ఆ సమావేశంలో ప్రశ్నలేవీ వేయకుండా ‘సాక్ష్యాల’ ఆధారంగా అనుమతులిచ్చి ఉంటే ఏడాది ముందుగానే జన్యుమార్పిడి పంటలు దేశంలోకి వచ్చేసి ఉండేవి. బీటీ వంకాయపై నిషేధం దేశంలోకి బీటీ వంకాయ అనుమతిని నిరాకరిస్తూ 2010లో అప్పటి పర్యావరణ శాఖ మంత్రి జైరామ్ రమేశ్ ఒక ప్రకటన చేశారు. ‘డెసిషన్ ఆన్ కమర్షియలైజేషన్ ఆఫ్ బీటీ బ్రింజాల్(బీటీ వంకాయ వాణిజ్యీకరణ మీద నిర్ణయం)’ పేరుతో అప్పట్లో 19 పేజీల డాక్యుమెంట్ ఒకటి విడుదలైంది. దీనిపై శాస్త్రవేత్తలు ఎన్ని మాటలు చెప్పినా నా అంచనా ప్రకారం ప్రతి వృక్ష శాస్త్రవేత్తా కచ్చితంగా చదవాల్సిన డాక్యుమెంట్ అది. దేశ విదేశాల్లోని శాస్త్రవేత్తలతో, ఏడు దఫాలుగా ప్రజలతో సంప్రదింపుల తరువాత జైరామ్ రమేశ్ ఆ డాక్యుమెంట్‌ను విడుదల చేశారు. జన్యుమార్పిడీ టెక్నాలజీపై రైతులు, ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు దేశం మొత్తమ్మీద వంకాయ పండించే ప్రాంతాల్లో సంప్రదింపులు జరపడం ఇదే తొలిసారి. జాగరూకత, ముందస్తు జాగ్రత్త, సిద్ధాంతాల ఆధారంగా జైరామ్ రమేశ్ ఒక నిర్ణయం తీసుకుంటూ... ఏ కొత్త టెక్నాలజీ అయినా ఆయా సముదాయాల సామాజిక, సాంస్కృతిక విలువలకు ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు. మీడియాలో ఒక వర్గం జన్యుమార్పిడి పంటలపై బహిరంగ విచారణను తోసిపుచ్చింది. అంతా బూటకం అని కొట్టి పారేసింది కూడా. అయితే ప్రజలు లేవనెత్తిన కీలకమైన అభ్యంతరాలను మంత్రి గుర్తించి తగు నిర్ణయం తీసుకోవడం మాత్రం నాకు ఆనందం కలిగించింది. అంతేకాదు... జన్యుమార్పిడి విత్తన సంస్థల అధ్యయనాల నియమాలు, సమాచారాన్ని విశ్లేషించిన తీరు, ఫలితాలన్నింటినీ ప్రస్తావిస్తూ డాక్యుమెంట్‌ను రూపొందించడమూ ప్రశంసనీయమైన అంశం. జాగరూకతతోనే ముందుకు వాస్తవ పరిస్థితులకూ, కొందరు సేకరించే సాక్ష్యాలకూ మధ్య ఉన్న అంతరం సైన్స్ ఆధారిత పద్ధతుల అవసరాన్ని మరోసారి నొక్కి చెబుతోంది. శాస్త్రపరమైన విచారణను పరిమితం చేయడం మార్కెట్ పోకడల్లో ఒకటి. వ్యాపార ప్రయోజనాలను కాపాడేందుకు మార్కెట్లు సైన్స్‌ను తొక్కేసేందుకూ ప్రయత్నిస్తూంటాయి. జీఎం ఆవాల విషయంలో జరుగుతున్నదీ అదే. జీఈఏసీ ఇటీవలే దీనికి పర్యావరణ అనుమతులు ఇచ్చేసింది. ఈ డీఎంహెచ్–11 జన్యుమార్పిడి ఆవాల పంట దిగుబడి సామర్థ్యం ఎంతన్నది ఐసీఏఆర్‌కూ తెలియక ముందే పర్యావరణ అనుమతులు రావడం గమనార్హం. దేశ వంటనూనె దిగుమతులను ఈ సరికొత్త ఆవాల ద్వారా తగ్గించుకోవచ్చు అన్న భావనను కలిగిస్తున్నారు. అయితే దీని దిగుబడి చాలా తక్కువ అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటే అదెంత తప్పుడు భావనో అర్థమైపోతుంది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం... జీఎం ఆవాల పరీక్షలకు అన్ని ప్రోటోకాల్స్‌ను ఢిల్లీ యూనివర్సిటీ స్వయంగా సిద్ధం చేసింది. విద్యార్థినే ప్రశ్నాపత్రం తయారు చేయమని అడగటం లాంటిది ఇది. అంతేకాదు... హెర్బిసైడ్ల(గడ్డిమందుల)ను తట్టుకునే ఆవాల వెరైటీ బీటీ వంకాయ మాదిరిగా కనీస పరీక్షలను కూడా ఎదుర్కోలేదు. జీఎం ఆవాల పరీక్షల్లో ఆరోగ్య నిపుణులు ఎవరూ లేకపోవడం, తేనెటీగలపై జీఎం ఆవాల ప్రభావం ఏమిటన్నది పరిశీలించకపోవడం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న లోపాలు. ఇన్ని లోపాల మధ్య జీఈఏసీ విత్తనాల వృద్ధికి ఎలా అనుమతిచ్చిందో అర్థం కావడం లేదు. సైన్స్ అంటే సత్యాన్ని వెతకడం. ఇటాలియన్–బ్రిటిష్ ప్రొఫెసర్ మైకెలా మాసిమీ 2017లో లండన్ రాయల్ సొసైటీ అవార్డు అందుకుంటున్న సందర్భంగా చేసిన ప్రసంగంలో అచ్చంగా ఈ వ్యాఖ్యే చేశారు. ‘‘ప్రజలకు సైన్స్ విలువను అర్థమయ్యేలా చేయడం మన బాధ్యత అని నేను నమ్ముతున్నాను. కచ్చితత్వం, సాక్ష్యాలు, సిద్ధాంతాలపై విశ్వాసం, కచ్చితమైన పద్ధతులను అవలంబించడం వంటి వాటిని కూడా నిశితంగా పరిశీలించాలి’’! (క్లిక్ చేయండి: జనం మేలుకోకపోతే జీఎం పంటల వెల్లువే!) - దేవీందర్ శర్మ ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com -
‘రాజుగారు’ ఒక ఆశాకిరణం
వాతావరణ మార్పు నుండి జెనిటిక్ ఇంజనీరింగ్ వరకు, వాయు కాలుష్యం నుండి ప్లాస్టిక్ ముప్పు వరకు మానవాళి బాధ్యత వహించవలసిన అనేక చర్చనీయాంశాలను బ్రిటిష్ సింహాసనాన్ని కొత్తగా అధిష్ఠించిన ఛార్లెస్ ఏనాడో తన ప్రాధాన్యాలుగా చేసుకున్నారు. జీవావరణానికి హితంగా ఉండేలా తన అలవాట్లను మార్చుకున్నారు. రసాయన రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత గురించి మాట్లాడడమే కాక, పునరుత్పాదక వ్యవసాయం కోసం ఒక స్వచ్ఛంద సంస్థను కూడా నెలకొల్పారు. పర్యావరణ పరిరక్షణపై ఆయనకున్న దృఢమైన నిబద్ధత ఆయనను కేవలం ఉత్సవ చక్రవర్తిగా ఉంచకపోవచ్చు. ప్రపంచంలో నిస్పృహలు పెరుగుతున్న సమయంలో ఈ కొత్త రాజు కొత్త రాచరిక పాత్రను సులభంగా పోషించగలరు. మనోహరమైన చిద్విలాసాలు, ప్రజాసమూ హాలకు అభివాదాలు, కార్యక్రమాల ప్రారం భోత్సవాలు.. ఇటువంటి సాధారణ కర్తవ్యాల వరకే రాచరికాలు పరిమితమై ఉన్న తరుణంలో బ్రిటిష్ సింహాసనాన్ని అధిష్ఠించిన మూడవ ఛార్లెస్ రాజు తన సొంతవైన ఆలోచనలతో, సున్నితమైన వ్యక్తిత్వంతో, భూగ్రహాన్ని రక్షించాలన్న ప్రబలమైన కాంక్షతో ‘హరిత చక్రవర్తి’గా అవతరించగలరన్న ఆశలు రేకెత్తిస్తున్నారు. ‘‘ఆయన తన ఇరవైల ప్రారంభంలో భవిష్యత్ కాలుష్య దుష్ప్రభావాలపై ప్రభావ వంతమైన ప్రసంగాలు చేశారు. తన మధ్యవయస్సులో ఆర్థిక, పర్యా వరణ, సామాజిక అంశాల మధ్య సమతూకం సాధించే అత్యున్నత స్థాయి సుస్థిరతలకు చొరవ చూపారు. ఈ ఏడాది జనవరిలో తన 73 ఏళ్ల వయసులో వాతావరణ మార్పును నియంత్రించేందుకు అత్యవ సర చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి, వ్యాపార దిగ్గజాలకు స్పష్టమైన పిలుపు నిచ్చారు’’ అని ‘టైమ్’ పత్రిక రాసింది. రానున్న కాలంలో కానున్న రాజుగా మొన్నటి వరకు ఆయన సాగించిన ప్రయాణాన్ని ఈ నాలుగు మాటల్లో ఆ పత్రిక సముచిత పరిచింది. బ్రిటన్ రాజైన వెంటనే, బ్రిటిష్ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు ‘చరిత్ర నాపై మోపిన బాధ్యత ఎంత బరువైనదో తెలుస్తోంది’ అని ఛార్లెస్ అన్నారు. తనెంతో శ్రద్ధ వహిస్తూ వచ్చిన స్వచ్ఛంద కార్య కలాపాలకు, ఇతర విధులకు ఇకపై తన సమయాన్ని, శక్తిని కేటా యించడం మునుపటి స్థాయిలో సాధ్యం కాదని స్పష్టం చేశారు. అయితే ఆయన యోగ్యతలను, పర్యావరణ పరిరక్షణపై ఆయన కున్న దృఢమైన నిబద్ధతను గుర్తెరిగిన చరిత్ర ఆయన్ని కేవలం ఉత్సవ చక్రవర్తిగా ఉంచగలదని నేను భావించడం లేదు. ఎలిజబెత్ రాణి అంత్యక్రియలకు ఐరోపా దేశాల రాచరిక కుటుంబాల నుంచి హాజ రైన వారిలో జపాన్ చక్రవర్తి దంపతులు సహా అందరూ అనామకంగా ఉన్న రాజులు, రాణులే. వారందరిలోనూ ఉన్న సారూప్యం ఒక్కటే. వారిలో ఎవరి జీవితాలూ సునిశితమైన గమనింపులతో గడుస్తున్నవి కావు. వారు తమ మనోభావాలను బయటి వ్యక్తం చేసేవారు కాదు కనుక ప్రజా జీవనంలో వారి గురించి మాట్లాడటానికి ఉన్నది చాలా తక్కువ. పైగా అది వారు ఎంపిక చేసుకుని, అనుసరిస్తున్న జీవనశైలి కూడా. కానీ ఛార్లెస్ అలా కాదు. తన మనోభావాలను వెల్లడించడానికి ఆయన ఏనాడూ సంకోచించలేదు. అది వ్యతిరేకమైన ఫలితాన్నే ఇచ్చినా ధైర్యంగా నిలబడి ఉన్నారు. ఉదాహరణకు ఆయన నిశ్చితాభి ప్రాయాలు ఇలా వ్యక్తం అయ్యేవి : ‘రసాయనాల వాడకం వ్యవసా యానికి వినాశకరంగా పరిణమిస్తుంది. అనేక విధాలుగా భారీ నష్టాన్ని కలిగిస్తుంది. కాలుష్య కారకాలైన ఉద్గారాలు విపరీతంగా వెలువడతాయి’ అనేవారు. లేదా, ‘చిన్న పొలాలు కనుమరుగైతే అది బ్రిటిష్ గ్రామీణ ప్రాంతాల హృదయాన్నే చీల్చివేస్తుంది’ అని చెప్పే వారు. విధ్వంసక వ్యవసాయం, మత్స్య పరిశ్రమలకు రాయితీలు అనే అంశాలు తరచు ఆయన మాటల్లో వెల్లడయేవి. రసాయన రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత గురించి మాట్లాడడమే కాకుండా, పునరుత్పాదక వ్యవసాయం కోసం ఒక స్వచ్ఛంద సంస్థను కూడా నెలకొల్పారు. జీవావరణానికి హితంగా ఉండేలా తన అలవాట్లను మార్చు కున్నారు. మాంసాహారాన్ని దాదాపుగా త్యజించారు. పశుగణాభివృద్ధి అవసరాన్ని తగ్గిస్తే ఉద్గారాలను నియంత్రించవచ్చు అన్న ఆలోచనే ఆయన్ని శాకాహారం వైపు మళ్లించింది. పాల ఉత్పత్తులను తీసు కోవడాన్ని కూడా ఛార్లెస్ తగ్గించారు. ‘కాప్–26’ సదస్సుకు ముందు ఆయన తన ఆస్టన్ మార్టిన్ కారును బయో–ఇథనాల్‌తో నడుపు తున్నట్లు వెల్లడించడం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుందని ‘ది గార్డియన్’ ఒక వార్తాకథనం రాసింది. ఇంగ్లిష్ వైట్ వైన్ అవశేషాలు, జున్ను తయారీలోని పాల విరుగుడుల మిశ్రమమే ఆ బయో– ఇథనాల్. దాని ద్వారా ఛార్లెస్ తన ప్రజలకు ఒక స్పష్టమైన ఆచరణా త్మక సందేశాన్ని అందిస్తున్నారు. ‘మీ వంతుగా ఉద్గారాలను తగ్గిం చండి, తద్వారా పర్యావరణాన్ని రక్షించడంలో ప్రధాన పాత్ర పోషించండి’ అన్నదే ఆ సందేశం. వాతావరణ మార్పు నుండి జెనిటిక్ ఇంజనీరింగ్ వరకు, వాయు కాలుష్యం నుండి ప్లాస్టిక్ ముప్పు వరకు, సేంద్రియ వ్యవసాయం నుండి ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన వరకు... బాధ్యత వహించవలసిన అనేక చర్చనీయాంశాలను ఛార్లెస్ ఏనాడో తన ప్రాధాన్యాలుగా చేసు కున్నారు. దీనిని ఎలాగైనా పిలవండి. విపరీతం అనండి, అతిమోహం అనండి. ఒకటి మాత్రం వాస్తవం. ఆయన బాగా చదివినవారు. విషయంపై అవగాహన లేకుంటే, ఆధిపత్య కథనాలను సవాలు చేయడం అంత సులభమేమీ కాదు. అది కూడా డబ్బు మూటలతో పెద్ద పెద్ద కంపెనీలు ఆ కథనాలకు మద్దతు ఇస్తున్నప్పుడు! దీనిని బట్టి ఆయన తన పాలనను ఎలా నిర్వహిస్తారు, తన కొత్త పాత్రను ఎలా మలుచుకుంటారు అనేవి ఆధారపడి ఉంటాయని భావిస్తు న్నాను. అంతకంటే కూడా ఆయన తను ఎలా గుర్తుండి పోవాలని అనుకుంటున్నారో అది కూడా కీలక పాత్ర వహిస్తుంది. నేను బాగా ఇష్టపడే మరొక చక్రవర్తి కూడా ఈ సందర్భంలో గుర్తుకు వస్తున్నారు. థాయ్‌లాండ్ రాజు భూమిబోల్ అదుల్యాతేజ్ 1946లో సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత 70 సంవత్సరాలు పరిపాలించారు. ప్రజల అభివృద్ధి అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రత్యక్షంగా వారితో సమయం గడపడం అనే ఆయన మానవీయ దృక్పథానికి విద్యార్థిగా ఉండగా నేను ఆకర్షితుడనయ్యాను. ఒక రాజుగా ఆయనకు అంత చేయవలసిన అవసరం లేదు. కానీ ఆర్థిక శ్రేయస్సు, ప్రజా సంక్షేమంపై ఆయన ఆసక్తి చివరికి ఆయన ఓ ‘సమృద్ధ ఆర్థిక వ్యవస్థ’ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేయడానికి దోహద పడింది. 1997లో ఆసియా ఆర్థిక సంక్షోభం సమయంలో ఉన్నప్పుడు టెలివిజన్ ప్రసంగంలో ఆయన ఇలా అన్నారు: ‘‘దేశం పులిగా మారా లని దేశ ప్రజలు పిచ్చిగా కోరుకుంటున్నారు. పులిగా ఉండటం ముఖ్యం కాదు. దేశం సమృద్ధ ఆర్థిక వ్యవస్థను కలిగి ఉండటం ముఖ్యం. సమృద్ధిగా అంటే, మనల్ని మనం పోషించుకోవడానికి తగి నంతగా.’’ ఈ మాటలు ప్రస్తుతం భారత్‌కు కూడా వర్తిస్తాయి. ఏదేమైనా అభివృద్ధి చక్రానికి స్థిరత్వపు ఇరుసు లాంటి ఆ ‘సమృద్ధ ఆర్థిక వ్యవస్థ’ సిద్ధాంతం నేడు థాయ్‌లాండ్‌లోని 23 వేల గ్రామాల్లో ఆచరణలో ఉంది. ఎగుమతులపై దృష్టి పెట్టడానికి బదులు, స్వయం సమృద్ధిని నిర్మించడం అనే భావనపై ఆ సిద్ధాంతం ఆధారపడి ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మట్టి పునరుత్పత్తి, సూక్ష్మక్రిమి కణాల సేకరణలతో పాటు అనేక అభివృద్ధి ప్రణాళికల కోసం కృషి చేసిన థాయ్ రాజును ఐక్యరాజ్య సమితి 2006లో తన మొదటి ‘మానవాభివృద్ధి అవార్డు’కు ఎంపిక చేసింది. ఆయనకు ప్రపంచంలోని మొట్టమొదటి, ఏకైక ‘అభివృద్ధి రాజు’గా గుర్తింపు ముద్ర వేస్తూ, ఆనాటి సమితి ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్... ‘‘థాయ్‌లాండ్‌లోని పేద, అత్యంత బలహీన వర్గాల ప్రజల చెంతకు.. వారి స్థితి, జాతి లేదా మతంతో సంబంధం లేకుండా థాయ్ రాజు వెళ్లారు. వారి జీవితాలను వారే తమ చేతుల్లోకి తీసుకునే సాధికారతను వారికి ఇచ్చారు’’ అని కీర్తించారు. అనేక విధాలుగా ఛార్లెస్ కూడా తనను కేంద్ర స్థానంలో నిలబెట్టే ఒక వారసత్వాన్ని పంచుకున్నారు. ప్రపంచానికి ఇప్పుడు సుస్థిరతపై దృష్టిని మళ్లించగల కొన్ని తెలివైన స్వరాల అవసరం ఉంది. పర్యావరణ పరిరక్షణతో పాటు, అసమానతలు మరింత పెరిగేందుకు దారితీసిన ఆర్థిక మాంద్యంపై కచ్చితంగా ఆయన దృష్టి సారించాలి. ఎలాంటి రాజకీయ వివాదాలలోకీ వెళ్లకుండా, నిస్పృహలు పెరుగు తున్న ఈ సమయంలో ఆశలను పెంపొందించేందుకు ఈ కొత్త రాజు ఒక కొత్త రాచరిక పాత్రను సులభంగా పోషించగలరని నేను విశ్వసి స్తున్నాను. వ్యాసకర్త: దేవీందర్ శర్మ, ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు (‘ది ట్రిబ్యూన్’ సౌజన్యంతో) ఈ–మెయిల్: hunger55@gmail.com -
ఉన్నవాళ్లకే మరిన్ని రాయితీలా?
పేదలకు అత్యవసరమైన ఉచితాలను ‘పప్పు బెల్లాలు’ అంటూ చాలామంది గగ్గోలు పెడుతుంటారు. కానీ కార్పొరేట్ కంపెనీలకు అందుతున్న రాయితీల గురించి ఎవరూ మాట్లాడరు. వ్యవసాయ రుణాలను మాఫీ చేసినప్పుడు రుణ సంస్కృతిని అవి విచ్ఛిన్నపరుస్తున్నాయని చాలామంది ఆక్షేపించారు. కానీ భారీ ఎత్తున కార్పొరేట్ పన్నులు తగ్గించడం అనేది ఆర్థిక పురోగతికి దారి తీస్తుందని వీరే తప్పుడు సూత్రాలు వల్లిస్తున్నారు. గత అయిదేళ్లలో రూ.10 లక్షల కోట్ల కార్పొరేట్ నిరర్థక రుణాలను మాఫీ చేసినట్లు కేంద్రప్రభుత్వం ఇటీవలే పార్లమెంటుకు తెలిపింది. అత్యంత సంపన్నుల జేబుల్లో డబ్బును తేరగా పోయడం ద్వారా ఇప్పటికే ఉన్న సంపద అసమానత్వం మరింతగా పెరిగింది. సంపన్నులకు యాభై సంవత్సరాలుగా లభిస్తున్న పన్ను రాయితీలు ఏమాత్రం తగ్గడం లేదని ఒక అధ్యయనాన్ని ఉల్లేఖిస్తూ ‘బ్లూమ్‌బెర్గ్’లో ఒక కథనం ప్రచురితమైంది. లండన్‌లోని కింగ్స్ కాలేజీకి చెందిన ఇద్దరు పరిశోధకులు అధునాతనమైన గణాంక విధానాన్ని ఉపయోగించడమే కాకుండా, 18 పురోగామి ఆర్థిక వ్యవస్థలు అనుసరించిన విధానాలను పరిశీలించారు. సాక్ష్యాధారాలు లేకుండా అనుభవపూర్వకంగా చాలామంది ఇంతకాలంగా చెబుతున్నదాన్ని వీళ్లు ససాక్ష్యంగా నిరూపించారు. అనేకమంది భారతీయ ఆర్థికవేత్తలు కార్పొరేట్ పన్నులను తగ్గించాల్సిన అవసరాన్ని సమర్థించడానికి అనేక ప్రయత్నాలు చేశారు. కానీ ఈ ఇద్దరు పరిశోధకుల అధ్యయనం (కొద్దిమంది ఇతరులు కూడా) స్పష్టంగా ఒక విషయాన్ని బయటపెట్టింది. పన్ను రాయితీ అనేది ఆర్థిక పురోగతికి సహాయం చేయలేదు. అది మరిన్ని ఉద్యోగావశాలను కూడా కల్పించలేదు. డబ్బును తేరగా అత్యంత సంపన్నుల జేబుల్లో పోయడం ద్వారా ఇప్పటికే ఉన్న సంపద అసమానత్వాన్ని మరింతగా పెంచడంలో పన్ను రాయితీ సాయపడింది. భారతదేశంలో రైతులతో సహా పేదలకు అందిస్తున్న ఉచితాలను ‘పప్పు బెల్లాల’ సంస్కృతి అంటూ ఎన్నో వార్తాపత్రికల కథనాలు ధ్వజమెత్తుతున్నాయి. అదే సమయంలో కార్పొరేట్ సంస్థలకు అంది స్తున్న భారీ స్థాయి ఉచితాల గురించి ఇవి ఏమాత్రం ప్రస్తావించడం లేదు. కొద్దిమంది వ్యాఖ్యాతలను మినహాయిస్తే– మాఫీలు, ట్యాక్స్ హాలిడేలు, ఉద్దీపన ప్యాకేజీలు, పన్ను తగ్గింపులు వంటి కార్పొరేట్ సబ్సిడీల విస్తృతి, స్వభావాన్ని చాలామంది దాచిపెడుతున్నారు. భారతీయ రిజర్వ్ బ్యాంకు ‘ఫలితం ఇవ్వని ఉచితాలు’ అంటూనే, ఆ మాటకు అర్థమేమిటో స్పష్టంగా నిర్వచించలేక పోయినప్పటికీ, భారత్‌లో కార్పొరేట్ పన్నుల తగ్గింపు కూడా ఈ విభాగంలోనే చేరతుందని అంతర్జాతీయ అధ్యయనాలు తెలుపు తున్నాయి. కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ ఆర్థిక వేత్త జెఫ్రీ సాచెస్ను గతంలో ఒక ప్రశ్న అడిగారు. పారిశ్రామిక ఉత్పత్తిని ఏమాత్రం పెంచనప్పుడు లేదా అదనపు ఉద్యోగాలను సృష్టించలేకపోయినప్పుడు కార్పొరేట్లకు భారీస్థాయి పన్ను తగ్గింపు ద్వారా ఏం ఫలితం దక్కింది అని ప్రశ్నించారు. పన్ను రాయితీల ద్వారా ఆదా అయిన డబ్బు కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్‌ల జేబుల్లో పడిందని ఆయన క్లుప్త సమాధానం ఇచ్చారు. కొన్ని ప్రముఖ ఆర్థిక వ్యవస్థల్లో కేంద్ర బ్యాంకులు వాస్తవంగా అత్యంత ధనవంతుల జేబుల్లోకి చేరేలా అదనపు డబ్బును ముద్రించాయి. 2008–09 కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిన రోజుల్లో పరిమాణాత్మక సడలింపు అనే పదబంధాన్ని వ్యాప్తిలోకి తీసుకొచ్చారు. ఈ పేరుతో ధనిక దేశాలు 25 లక్షల కోట్ల డాలర్ల అదనపు డబ్బును ముద్రించాయి. తక్కువ వడ్డీరేటుతో, అంటే సుమారు రెండు శాతంతో ఫెడరల్ బాండ్ల రూపంలో ఆ సొమ్మును సంపన్నులకు జారీ చేశాయి. ఈ మొత్తం డబ్బును వాళ్లు అభివృద్ధి చెందుతున్న దేశాల స్టాక్ మార్కెట్లలో మదుపు చేశారు. అందుకే ఆ కాలంలో బుల్ మార్కెట్లు ఎలా పరుగులు తీశాయో చూశాం. మోర్గాన్ స్టాన్లీకి చెందిన రుచిర్ శర్మ ఒక వ్యాసంలో కరోనా మహమ్మారి కాలంలో జరిగిన తతంగంపై రాశారు. మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో 9 లక్షల కోట్ల డాలర్ల నగదును అదనంగా ముద్రించారనీ, కునారిల్లిపోయిన ఆర్థిక వ్యవస్థలకు ఉద్దీపన ప్యాకేజీలను అందించడమే దీని లక్ష్యమనీ చెప్పారు. కానీ ఉద్దీపన ప్యాకేజీల కోసమని కేటాయించిన ఈ మొత్తం నగదు స్టాక్ మార్కెట్ ద్వారా అత్యంత సంపన్నుల జేబుల్లోకి వెళ్లిపోయిందని వెల్లడించారు. ఈ భారీమొత్తం ఏ రకంగా చూసినా ఉచితాల కిందకే వస్తుంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కల్లోల పరిస్థితుల్లో ఉన్న 2008–09 కాలంలో భారతదేశంలో 1.8 లక్షల కోట్ల రూపాయలను ఆర్థిక ఉద్దీపన పేరుతో పరిశ్రమ వర్గాలకు అందుబాటులో ఉంచారు. ఈ భారీ ప్యాకేజీని ఒక సంవత్సరం తర్వాత ఉపసంహరించుకోవాలి. కానీ ఒక వార్తా నివేదిక ప్రకారం, ప్రభుత్వంలో ఎవరో ‘నల్లాను ఆపేయడం’ మర్చిపోయారు. దీని ఫలితంగా ఉద్దీపన కొనసాగుతూ వచ్చింది. మరో మాటల్లో చెప్పాలంటే, ఆ తర్వాత పదేళ్ల కాలంలో భారత పరిశ్రమ దాదాపుగా రూ. 18 లక్షల కోట్ల డబ్బును ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా అందుకుంది. దీనికి బదులుగా ఈ మొత్తాన్ని వ్యవసాయ రంగానికి అందుబాటులోకి తెచ్చి ఉంటే, ప్రధానమంత్రి కిసాన్ పథకంలో భాగంగా మన రైతులకు యేటా ఒక్కొక్కరికి 18 వేల రూపాయల మేరకు అదనంగా ప్రత్యక్ష నగదు మద్దతు కింద అంది ఉండేది. సెప్టెంబర్ 2019లో భారత పరిశ్రమకు మరోసారి రూ. 1.45 లక్షల కోట్ల పన్నులను ప్రభుత్వం తగ్గించింది. చాలామంది ఆర్థిక వేత్తలు గ్రామీణ డిమాండును ప్రోత్సహించడం కోసం ఆర్థిక ఉద్దీపనను అందించాలని కోరుతున్న సమయంలో మళ్లీ కార్పొరేట్ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం కరుణించింది. దాదాపు రూ.2.53 లక్షల కోట్ల మేరకు వ్యవసాయ రుణాలను మాఫీ చేసినప్పుడు రుణ సంస్కృతిని అవి విచ్ఛిన్నపరుస్తున్నాయని ఆర్థికవేత్తలు ఆరోపించారు. కానీ భారీ ఎత్తున కార్పొరేట్ రుణాలను మాఫీ చేయడం వల్ల ఆర్థిక పురోగతికి దారి తీస్తుందని తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. గత అయిదేళ్లలో రూ. 10 లక్షల కోట్ల కార్పొరేట్ నిరర్థక రుణాలను కొట్టేసినట్లు ప్రభుత్వం ఇటీవలే పార్లమెంటుకు తెలిపింది. కార్పొరేట్ పన్నులు తగ్గించడం ద్వారా వచ్చే ప్రయోజనాలు సగటు మనిషిని చేరుకోలేదు. సంపన్నులు మాత్రమే వాటినుంచి లబ్ధిపొందారు. ఇది సంపన్నులకు, పేదలకు మధ్య అంతరాన్ని మరింతగా పెంచింది. వ్యవసాయ రుణాలను మాఫీచేసినప్పుడు బ్యాంకులు తమకు రావలసిన అసలు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి డిమాండ్ చేసి మరీ తీసుకుంటాయి. కానీ కార్పొరేట్ రుణాలను మాఫీ చేసినప్పుడు బ్యాంకులు పైసా డబ్బును కూడా వసూలు చేయలేక దెబ్బతింటాయి. దేశంలో రుణాలు చెల్లించే సామర్థ్యం ఉండి కూడా ఎగవేస్తున్న సంస్థలు 10 వేల వరకు ఉంటాయి. రెండు వేలమంది రైతులు తీసుకున్న రుణాలను చెల్లించలేదని జారీ చేసిన అరెస్టు వారెంట్లను కొన్ని నెలలక్రితం పంజాబ్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. కానీ ఉద్దేశ పూర్వకంగా రుణాలు ఎగ్గొడుతున్న వారిని మాత్రం స్వేచ్ఛగా వదిలేస్తున్నారు. మునుపటి ప్రణాళికా సంఘం సబ్సిడీపై కార్యాచరణ పత్రాన్ని రూపొందించింది. న్యూఢిల్లీలో ఎకరాకు రూపాయి చొప్పున 15 ఎకరాల భూమిని ఒక కార్పొరేట్ ఆసుపత్రికి సబ్సిడీల పేరిట అప్పనంగా ధారపోశారని ఇది బయటపెట్టింది. ఐటీ రంగంతో సహా ప్రైవేట్ ఆసుపత్రులు, పరిశ్రమలకు తరచుగానే చదరపు మీటరుకు ఒక రూపాయి చొప్పున భూమిని ధారపోస్తున్నారు. అదే సమయంలోనే మౌలిక వసతుల కల్పనకు, వడ్డీ, మూలధనం, ఎగుమతులతో పాటు విద్యుత్, నీరు, ముఖ్యమైన సహజ వనరులకు కూడా సబ్సిడీలు అందిస్తున్నారు. ఇవి చాలవన్నట్లుగా పలు రాష్ట్రాలు నూరు శాతం పన్ను మినహాయింపు, ‘ఎస్జీఎస్టీ’ మినహాయింపు వంటి ప్రోత్సాహకాలను అందజేస్తున్నాయి. ఈరకంగా కార్పొరేట్ ఇండియా కూడా భారీ సబ్సిడీలు, ఉచితాల మీదే ఎలా బతుకీడుస్తోంది అనేది అధ్యయనం చేయడం ఆసక్తికరంగా ఉంటుంది. దీంతో అమూల్యమైన వనరులు హరించుకుపోతున్నాయి. పేదలకు కొద్ది మొత్తం ఉచితాలు మిగులుతున్నాయి. - దేవీందర్ శర్మ ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
చేద్దామా? చద్దామా?
సెకనుకు సుమారు 13.3 హిరోషిమా అణ్వాయుధాలు లేదా రోజుకు 11,50,000 అణ్వాయుధాలు పడితే ఎలా ఉంటుంది? ప్రస్తుతం భూగోళం ఎదుర్కొంటున్న సమస్య ఇంత తీవ్రంగా ఉంది. ఈ మంటలు పుట్టించే వేడికి ఏ దేశమూ మినహాయింపు కాదు. చల్లటి ప్రాంతాలుగా పేరొందిన యూరోపియన్ దేశాలు సైతం ఎండలకు మాడిపోతున్నాయి. ఇంకోవైపు కనీవినీ ఎరుగని స్థాయిలో వర్షాలు పడుతున్నాయి. వాతావరణం అదుపు తప్పిందన్నది నిజం. ఎప్పటికో అనుకున్నది ఇప్పటికే వచ్చేసింది. కొందరు నమ్ముతున్నట్టు ఏ కొత్త టెక్నాలజీనో వచ్చి అమాంతం సమస్యను పరిష్కరించలేదు. ప్రభుత్వాల స్థాయిలో, వ్యక్తిగత స్థాయిలో చర్యలు మొదలుకావాలి. లేదంటే, ‘వాతావరణ ఆత్మహత్యలే’ శరణ్యం. విపరీత వాతావరణం పుణ్యమా అని గత వారంలో స్పెయిన్, పోర్చుగల్‌లలో వెయ్యి మంది ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి ఏమిటన్నది అర్థం చేసుకోవచ్చు. బ్రిటన్‌లోనైతే రికార్డులు బద్దలు కొడుతూ 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకుని జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించేశారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెరస్ ఈ వడగాడ్పులను సామూహిక ఆత్మహత్యలకు ఏమాత్రం తీసిపోని పరిణామమని హెచ్చరించారు. వాతావరణ మార్పుల మీద జరిగిన రెండు రోజుల సమావేశంలో 40 దేశాలకు చెందిన మంత్రులతో మాట్లాడుతూ... ‘‘మానవాళిలో సగం ఇప్పటికే వరదలు, కరవులు, తుపాన్లు, కార్చిర్చుల ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ ప్రమాదం నుంచి ఏ దేశానికీ మినహాయింపు లేదు. అయినా మనం శిలాజ ఇంధనాల వ్యసనాన్ని కొనసాగి స్తున్నాం. ఇప్పుడు మన ముందు ఒక అవకాశం ఉంది. కలిసికట్టుగా సమస్యను అధిగమించే ప్రయత్నం చేద్దామా? లేక అందరమూ కలిసికట్టుగా ఆత్మహత్య చేసుకుందామా? నిర్ణయం మన చేతుల్లోనే ఉంది’’ అని వ్యాఖ్యానించారు. ప్రకృతి వైపరీత్యాల ప్రకోపం పతాక స్థాయికి చేరిన ఈ తరుణంలో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి హెచ్చరిక అనూహ్యమేమీ కాదు. ఎవరో అన్నట్లు... ఇవి వాతావరణ మార్పులు కాదు, ‘వాతావరణ ఆత్మహత్యలు’. యూరప్, ఉత్తర అమెరికాల్లో చాలా భాగాల్లో కార్చిచ్చులు కలవరపెడుతున్నాయి. ఇంకోవైపు భారత్‌లో కనీవినీ ఎరుగని స్థాయిలో వర్షాలు పడుతున్నాయి. ధ్రువ ప్రాంతాల్లో ఏటికేడాదీ కుంచించుకుపోతున్న మంచు! అదే సమ యంలో ఆఫ్రికాలోని పలు ప్రాంతాల్లో కరవు పరిస్థితులు! ఇవన్నీ చూస్తే ప్రపంచ వాతావరణం అదుపు తప్పినట్లే కనిపిస్తోంది. వాతా వరణ మార్పుల ప్రభావం ఎలా ఉంటుందో తెలిసినప్పటికీ... ఎప్పుడో వస్తున్నాయనుకున్నవి ఇప్పుడే వచ్చేస్తూండటం, జరుగు తున్న నష్టం తీవ్రంగా ఉండటం ఆందోళన కలిగించే విషయం. ఒహాయో యూనివర్సిటీ మాజీ గణిత శాస్త్రవేత్త ఇలియట్ జాకబ్సన్‘వాచింగ్ ద వరల్డ్ గో బై’ పేరుతో ఓ లెక్క చెప్పారు. ‘‘ఈ గ్రహంపై సెకనుకు 13.3 హిరోషిమా అణు బాంబులు పేలితే పుట్టేంత వేడి పుడుతోంది. అంటే రోజుకు 11,50,000 అణు బాంబులంత వేడన్నమాట’’ అని విస్పష్టంగా పేర్కొన్నారు. సముద్ర జలాల ఉష్ణోగ్రతలు కూడా సెకనుకు 12 హిరోషిమా అణుబాంబుల స్థాయిలో పెరుగుతున్నాయని ఆయన చెప్పారు. తలుచుకుంటేనే భయం పుట్టే స్థాయి. అయినా సరే, మనం కలిసికట్టుగా పనిచేసేం దుకు సిద్ధంగా లేము. అందుకేనేమో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి కూడా ప్రభుత్వాలు చెప్పేదొకటీ, చేసేది ఇంకోటీ అని నిష్టూరమాడారు. పచ్చిగా మాట్లాడాల్సి వస్తే దేశాలన్నీ అబద్ధాలు చెబుతున్నాయన్నారు. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ తాజా నివేదిక విడుదలైన సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఈ శతాబ్దాంతానికి భూమి సగటు ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ పెరగకూడదనుకుంటే... 2022 నాటికి కర్బన ఉద్గారాలు పతాకస్థాయికి చేరాలని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఇంకోలా చెప్పాలంటే, 2023 నుంచి ఉద్గారాలు గణనీయంగా తగ్గాలే తప్ప మరి పెరగకూడదన్నమాట. అయితే వాస్తవ పరిస్థితులు దీనికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. కానీ సమయమేమో మించిపోతోంది. హెచ్చరికలు బేఖాతరు... వాతావరణం మనకిప్పటికే అన్ని రకాల హెచ్చరికలు చేస్తున్నా అన్నీ బేఖాతరవుతున్నాయి. రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, ఆర్థిక వేత్తలు, శాస్త్రవేత్తలు, మీడియా ప్రతినిధులు కూడా నిమ్మకు నీరెత్తి నట్లు వ్యవహరిస్తున్నారు. సమాజాన్ని ప్రభావితం చేయగల వీరు ఇస్తున్న సందేశమేమిటి? ఏం ఫర్వాలేదు; కొత్త కొత్త టెక్నాలజీ లొస్తున్నాయి; వాతావరణ సమస్యలకు ఇవి సమాధానం చెబుతాయి; అందోళన అనవసరం అని! ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత ప్రకృతి వైపరీ త్యాలకూ వాతావరణ మార్పుల ప్రభావానికీ సంబంధం లేదని కూడా కథనాలు వెలువడుతున్నాయి! అంతేకాకుండా... ఆర్థికాభివృద్ధి పేరుతో ప్రకృతి వనరుల విధ్వంసాన్ని కూడా కొందరు సమర్థించుకుంటున్నారు. ఈ రకమైన ఆర్థిక విధానాలకు ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. శిలాజ ఇంధనాలను త్యజించాలన్న డిమాండ్ పెరుగుతోంది కూడా. ప్రధాన స్రవంతిలోని ఆర్థికవేత్తలకు భిన్నంగా ఆలోచిస్తున్న బ్రిటిష్ మంత్రి జాక్ గోల్డ్ స్మిత్ ఒక ట్వీట్ చేస్తూ... ‘‘యూరప్ మొత్తమ్మీద కార్చిచ్చులు చెలరేగుతున్నాయి. ఉష్ణోగ్రతల రికార్డులు బద్ధలవు తున్నాయి. అడవులు, పర్యావరణ వ్యవస్థలు కూడా రికార్డు వేగంతో నశించిపోతున్నాయి. అయినా పర్యావరణ పరిరక్షణకు డబ్బులు ఖర్చు చేయడం ఏమంత లాభదాయకం కాదనే రాజకీయ నేతలు మళ్లీ పదవులకు ఎన్నికవుతున్నారు’’ అని వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్య సమితి మాజీ ప్రధాన కార్యదర్శి బాన్ –కీ మూన్ గతంలో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ, వాతావరణ విధ్వంసానికి కారణమవుతున్న ఆర్థిక విధానాలను చక్కదిద్దే నాయకత్వపు అవసరం ఇప్పుడు ఎంతైనా ఉందని చెప్పడం ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. ఈ సమస్యకు పరిష్కారం కూడా ఇదేననీ, రాజకీయ నేతలు ఈ గట్టి నిర్ణయం తీసుకోలేకపోతున్నారనీ నా నమ్మకం కూడా. అభివృద్ధికి సూచిక స్థూల జాతీయోత్పత్తి అన్న వ్యామోహం నుంచి బయటపడనంత వరకూ వాతావరణ సమస్య లకు పరిష్కారం లభించనట్లే. మనకిష్టమైనా, కాకపోయినా సరే... ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ నిర్మాణం సమాజంలో అంతరాలను పెంచిం దన్నది మాత్రం నిజం. అంతేకాకుండా... పర్యావరణ సమస్యలను తెచ్చిపెట్టిందీ, ప్రపంచం అంతరించిపోయే స్థితికి చేర్చింది కూడా ఇవే. కాబట్టి ఆర్థిక వ్యవస్థ సమూల ప్రక్షాళన తక్షణావసరం. ప్రస్తుత అస్తవ్యస్త వ్యవహారం ఇకపై ఎంతో కాలం కొనసాగే అవకాశాలు లేవు. బహుశా ప్రస్తుతం వీస్తున్న వడగాడ్పులు ఓ షాక్ థెరపీనేమో. మానవాళి మేల్కొనేందుకు అవసరమైనదే కావచ్చు. నిర్మాణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాల్సిన అవసరాన్ని గుర్తుచేసే సందర్భమూ ఇదే. ఎందుకంటే, ఇది పోతే ఇంకోటి ఉందిలే అని భూమి గురించి అనుకోలేము కదా! కర్బన ఉద్గారాలకు, వాతావరణ సమస్యలకు, సంపద సృష్టికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందన్నది నిర్వివాదాంశం. ఆర్థికాభివృద్ధి ఎంత ఎక్కువైతే, అంతేస్థాయిలో కర్బన ఉద్గారాలూ పెరుగుతాయి. స్థూలజాతీయోత్పత్తిని పెంచు కోవాలన్న తపనలో భూమి వేడి కూడా పెరిగిపోతోంది. ఈ నేపథ్యం లోనే మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీకి చెందిన డాక్టర్ హెర్మన్ డాలీ ‘స్టెడీ స్టేట్ ఎకానమీ’కి మద్దతిచ్చారు. ‘‘ప్రతి రాజకీయ నాయ కుడూ వృద్ధికి అనుకూలంగా ఉన్నాడు. అర్థం చేసుకోదగ్గ విషయమే. కానీ అసలు ప్రశ్నకు సమాధానం మాత్రం దాటవేస్తారు’’ అని ఆయన పేర్కొన్నారు. అయితే, వృద్ధి మనల్ని నిజంగానే ధనవంతులను చేస్తోందా? లేక లాభాలకంటే ఖర్చుల్ని ఎక్కువ చేస్తోందా? అన్నది కూడా ఆలోచించాలి. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థను సమర్థిస్తున్న వారు సమాధానమివ్వాల్సిన ప్రశ్న కూడా ఇదే. ఆర్థికవేత్తల ఆలోచనలు ఎలా ఉన్నా, సామాన్యుల వ్యవహారశైలిలోనూ కొన్ని మార్పులు అని వార్యం. వినియోగాన్ని తగ్గించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల ప్రభా వాన్ని తగ్గించుకోవచ్చు. వాతావరణ సమస్య మనం సృష్టించింది కాకపోయినా, ఇప్పటివరకూ కొనసాగడంలో మాత్రం మనవంతు భాగస్వామ్యం తప్పకుండా ఉంది. దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
రైతులు కిందికి... పరిశ్రమలు పైకి...
ప్రపంచవ్యాప్తంగా రైతులు తమ ఉత్పత్తి ఖర్చులను రాబట్టుకోవడానికి తపన పడుతున్న సమయంలోనే ఆక్స్‌ఫామ్ నివేదిక షాకింగ్ నిజాన్ని వెల్లడించింది. గత రెండేళ్లలో ఆహార రంగ పరిశ్రమకు సంబంధించిన 62 మంది అత్యంత సంపన్నుల క్లబ్లో చేరిపోయారు. ఒక కార్గిల్ ఫుడ్ పరిశ్రమ కుటుంబంలోనే 12 మంది బిలియనీర్లు అయ్యారనీ, కోవిడ్‌కు ముందు ఈ కుటుంబంలో 8 మంది బిలియనీర్లు ఉండేవారనీ ఈ నివేదిక తెలిపింది. సరకుల ధరలు విపరీతంగా పెరగడం, ఆహార రంగ ద్రవ్యోల్బణం పెరిగిపోవడం, భూమి విలువలు రికార్డు స్థాయిలో పెరగడం, సాంకేతిక ఆవిష్కరణలు వెల్లువలా కొనసాగడం... ఉత్పాదకత పెంపుదల పేరుతో, ఆహార రంగ పరిశ్రమలో లాభాలు ఆకాశాన్నంటుతున్నాయి. సంపద పంపిణీలో ఎవరినీ వెనక్కు నెట్టకూడదనే సంక్షేమ భావన ఎప్పుడో గాలికి ఎగిరిపోయింది. కానీ ఆహార సరఫరా చైన్ సంస్థలు లాభాల మేటతో మురిసిపోతుండగా నిజమైన ఆహార ఉత్పత్తిదారైన రైతు ఎందుకు చిక్కిపోతున్నాడనే విషయం ఎవరికీ పట్టడం లేదు. అంతర్జాతీయ దిగ్గజ కంపెనీ అయిన కార్గిల్‌తో సహా నాలుగు ఆహార ధాన్యాల వాణిజ్య కంపెనీలు అంతర్జాతీయ ఆహార వాణిజ్యంలో 70 శాతాన్ని నియంత్రిస్తున్నాయి. కోట్లాదిమంది రైతులు ప్రతిఏటా సాగిస్తున్న ఆహార ఉత్పత్తులను వాణిజ్య కంపెనీలు సరఫరా చేస్తున్నాయి. మరో మాటలో చెప్పాలంటే రైతులు ఉత్పత్తి చేస్తున్న సంపదను చాలా సులభంగా, వాణిజ్య కంపెనీలు చప్పరించి వేస్తున్నాయి. వ్యవసాయరంగంలో సమస్యలకు పరిష్కారం అని చెబుతూ సాంకేతిక సంపన్న సంస్థలు నిత్యం సాంకేతిక మార్గాలను ప్రోత్సహిస్తున్నది నిజం. బతకడం ఎలాగా అని రైతులు ఘర్షణ పడుతున్న సమయంలోనే టెక్నాలజీ కంపెనీల స్టాక్‌లు అమాంతం పెరిగిపోతున్నాయి. రుఫో క్వాంటిటేటివ్ అనే పారిస్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రైవేట్ ఇన్వెస్టర్, ‘ఆహారం సిలికాన్ వేలీలో పెరగదు’ (ఫుట్ డజ్ నాట్ గ్రో ఇన్ సిలికాన్ వేలీ) అనే చక్కటి ఆలోచనా త్మకమైన వ్యాసంలో ఈ ప్రశ్నను లేవనెత్తారు. ‘స్టాండర్డ్ సోషల్ ఇన్నోవేషన్ రివ్యూ’లో రుఫో ఈ వ్యాసం ప్రచురించారు. ‘మానవ చరిత్రలో ఏ దశలో కంటే కూడా ఆహార వ్యవస్థలో గత వందేళ్లలోనే అనేక ఆవిష్కరణలు జరిగాయి. ఈ ఆవిష్కరణలు అన్నిటి లక్ష్యం ఏమిటంటే ఆహార ధరలను తగ్గిస్తూ పోవడం, రైతులను దారిద్య్రం ఊబిలోకి నెట్టడం, పర్యావరణాన్ని ధ్వంసం చేయడం మాత్రమే’’ అని ఆ వ్యాసంలో రుఫో పేర్కొన్నారు. నిజానికి, ఈ సాంకేతిక ఆవిష్కరణలు అత్యధిక వ్యవసాయ ఆదాయాలకు దారితీయాలి. వాస్తవానికి రైతులు ఎంత ఎక్కువగా ఉత్పత్తి చేస్తే అంత అధికంగా వారి ఆదాయం తగ్గిపోతోంది. ఉదాహరణకు, ఈరోజు కెనడాలో ఒక గోధుమ రైతు సాధిస్తున్న మార్కెట్ ధరను పోల్చి చూస్తే, ఆ రైతు ముత్తాత ఆరు రెట్లు ఎక్కువగా సంపాదించేవాడు. ఇప్పుడు పంజాబ్ విషయానికి వద్దాం. పంజాబ్ వార్షిక పంట ఉత్పత్తి ప్రపంచంలోనే అత్యధికంగా ఉంటున్నప్పటికీ పర్యావరణ విధ్వంసానికి కేంద్రంగా మారిపోయింది. టెక్నాలజీ ఇక్కడ పంట దిగుబడిని పెంచి ఉండవచ్చు. కానీ భూగర్భజలాన్ని మితిమీరి తోడేయడం వల్ల జలధారలు లోలోపలే ఎండిపోయాయి. రసాయన పెట్టుబడులు పర్యావరణాన్ని కుళ్లబొడిచేశాయి. నేల సాంద్రత క్షీణించి పోయింది. పంటల కుదుళ్లను తగులబెట్టడం వల్ల ఆ కాలుష్యం వాతావరణంలో కలిసిపోతోంది. వీటన్నింటి కారణంగా దేశ ధాన్యాగారమైన పంజాబ్ ఇప్పుడు ఆరోగ్య కరమైన, నిలకడైన వ్యవసాయ వ్యవస్థ వైవు పరివర్తన కోసం విలపిస్తోంది. టెక్నాలజీ రాజకీయాలు ఎలా పనిచేస్తాయో అర్థం చేసు కోవడానికి పంజాబ్ ఒక మంచి అవకాశాన్ని అందిస్తోంది. భూగర్భ జలాలను పరిరక్షించడంపై కొనసాగుతున్న చర్చ, కొన్ని దశాబ్దాల క్రితం ఫిలిప్పైన్స్‌లోని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థను సందర్శించిన రోజులను నాకు మళ్లీ గుర్తుకు తెచ్చింది. వరి విత్తనాలను విత్తినా లేదా మొక్కలను నాటినా పంట దిగుబడిలో పెద్దగా తేడా ఉండదని అక్కడ ఒక అధ్యయనాన్ని చూశాను. ఆ అధ్యయనం తెలిపిన అంశాలపై ఆసక్తితోనూ, ఆసియాలోని పలు ప్రాంతాల్లో వరిగింజలను పొలంపై చల్లడం గతంలో ఎక్కువగా పాటించేవారని తెలిసి ఉండటంతోనూ, ఆ పరిశోధనా కేంద్రంలోని ఒక సీనియర్ రైస్ సైంటిస్టును దీనిపై ప్రశ్నించాను. ఆయన చెప్పిన సమాధానం నన్ను నివ్వెరపర్చింది. ‘మేం ట్రాక్టర్ పరిశ్రమకు సహాయం చేయాలని ప్రయత్నిస్తున్నాము. ఆసియా ఖండంలో 97 శాతం వరకు వరినే పండిస్తారు’ ఫిలిప్పైన్స్ లోని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ మరొక అధ్యయనం ప్రకారం, వరిపొలంలో నేరుగా పురుగుమందులను చల్లినా, స్ప్రేయర్ ద్వారా చల్లినా క్రిమి సంహారక సామర్థ్య విషయంలో పెద్దగా తేడా ఉండదని తెలిసింది. కానీ మనం తెగుళ్లను సంహరించడానికి స్ప్రేయర్లే సమర్థమైనవని నూరిపోస్తున్నాం. విధానపరమైన మద్దతు, సబ్సిడీలు, సులభరీతిలో రుణ లభ్యత వంటి కారణాల వల్ల రైతులు మరింతగా యంత్రాలను కొనడానికి ముందు కొస్తున్నారు. రైతులు ముందుకు రావటం అనటం కంటే వారిచేత అవసరానికి మించి యంత్రాలను కొనిపిస్తున్నారు అంటే బాగుంటుంది. టెక్నాలజీని ఎవరూ వ్యతిరేకించరు. కానీ ఎల్లప్పుడూ ఖరీదైన బ్రాండెడ్ సాంకేతిక ఆవిష్కరణలే ఎందుకు అన్నదే ప్రశ్న. దివంగత సురీందర్ దలాల్ ఆవిష్కరించిన పత్తిపంటపై పురుగుమందులు చల్లే ‘నిదాన’ మోడల్ టెక్నాలజీ చాలా తక్కువ ఖర్చుతో సమర్థంగా పని చేస్తుంది. అయితే దీనికి యంత్రాలు అవసరం లేదు కాబట్టి హరియాణాలో నిదాన మోడల్ టెక్నాలజీని కొనేవారే లేకుండా పోయారు. వ్యవసాయంలో విదేశీ పెట్టుబడుల తగ్గింపు, తక్కువ మెషిన్లు అవసరమయ్యే స్వావలంబన టెక్నాలజీల వినియోగం వైపు మన ఆలోచనలు మారాల్సిన అవసరం ఉంది. (క్లిక్: ఆయన పర్యటన ఏం సాధించినట్లు?) - దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com -
ఇప్పటికీ నేర్వని ఆహార పాఠాలు
నిలకడైన ఆహార వ్యవస్థలను నిర్మించుకోవడం, ఆహార స్వావలంబనను ప్రోత్సహించడానికి బదులుగా, మన విధాన నిర్ణేతలు అంతర్జాతీయ మార్కెట్ నిబంధనలను పొడిగించుకుంటూ పోతున్నారు. అంటే దీనర్థం మార్కెట్ శక్తులు తమ ఇష్టానుసారం రాజ్యమేలడానికి అవకాశం ఇవ్వడమే! ప్రపంచంలోని అతి పెద్ద కంపెనీలు ఈ సంవత్సరం ఇప్పటికే రికార్డు స్థాయిలో లాభాలు ఆర్జించాయని అంతర్జాతీయ మీడియా కోడై కూస్తోంది. బడా కంపెనీలు లాభాలు ఆర్జిస్తున్నాయంటే ప్రపంచం ముందు క్షుద్భాధ సమస్య పొంచి ఉన్నదని ఆర్థం. అదీ ఆహార ఉత్పత్తులు తగ్గకుండానే సంక్షోభం ఏర్పడే పరిస్థితి. ఆహార వ్యవస్థలను సంస్కరించడంలోని వైఫల్యం అంతర్జాతీయ ఆహార సంక్షోభానికి దారితీసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 కోట్ల మంది ప్రజలు తీవ్రమైన ఆకలి బాధలను, ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నారని ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవ సాయ సంస్థ (ఎఫ్ఏఓ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ క్యు డోంగ్యు మే 4న పేర్కొన్నారు. వాస్తవానికి ఆయన చెప్పదలుచుకున్న విషయం మరొకటి ఉంది. గ్రామీణ జీవనాన్ని తీవ్రంగా ధ్వంసం చేసినందువల్లే పేదరికం అంచుల్లో ఉన్న ప్రజానీకం మరింతగా క్షుద్బాధా రేఖ కంటే దిగువకు పడిపోయారని అంతర్జాతీయ సమాజానికి ఆయన చెప్ప దలిచారు. నిజానికి ప్రపంచం ఇప్పటికే మూడో అంతర్జాతీయ ఆహార సంక్షోభం ముంగిట్లో ఉందని చాలామంది భావిస్తున్నారు. నిలకడైన ఆహార వ్యవస్థలపై అంతర్జాతీయ నిపుణుల ప్యానెల్ మరొక కచ్చితమైన శీర్షికతో రూపొందించిన ప్రత్యేక నివేదిక ఉక్రె యిన్‌పై రష్యా ఆక్రమణ నుంచి తలెత్తిన తీవ్రమైన ఆహార పరిస్థితిని వివరించడానికి పూనుకుంది. అలాగే ఆహార వ్యవస్థల సంస్కరణల్లో వైఫల్యం వల్ల గత 15 సంవత్సరాల్లో మూడో అంతర్జాతీయ ఆహార సంక్షోభం ఎలా ఏర్పడింది అనే ప్రశ్నకు సమాధానం వెతకడానికి ప్రయత్నించింది. 2007–08లో మొట్టమొదటి ప్రపంచ ఆహార సంక్షోభం వచ్చినప్పుడు దాదాపు 37 దేశాలు ఆహార దాడులను ఎదు ర్కోవలసి వచ్చింది. అది కూడా ప్రపంచ ఆహార ఉత్పత్తిలో ఏమాత్రం తగ్గుదల కనిపించని సమయంలో ఈ ఉత్పాతం సంభవించింది. ఉక్రెయిన్ యుద్ధం కంటే ముందుగానే ఆహార ధరలు సరికొత్త శిఖరాలను చేరుకున్నాయి. 2007–08 నాటి ఆహార సంక్షోభ కాలాని కంటే మించి ఆహార ధరలు పెరిగాయి. మొక్కజొన్నలు, పప్పులు, వెజిటబుల్ ఆయిల్, పత్తి, సోయాబీన్, చక్కెర వంటి ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. యుద్ధం ప్రారంభం కాకముందే, ఆహార ధరలు రికార్డు స్థాయికి చేరడంతో, ప్రపంచం ఆహార సంక్షోభం దిశగా వేగంగా పయనించింది. దురదృష్టవశాత్తూ, ఈ కారణాలవల్లే మొదటి ప్రపంచ ఆహార సంక్షోభం చెలరేగిందని గ్రహించాలి. ఆహార రంగంలో సంస్థాగత సమస్యలను పరిష్కరించడంలో వైఫల్యం కారణంగానే ఇప్పుడు మరో దఫా ఆహార సంక్షోభం పొంచి ఉంది. గత ఆహార సంక్షోభాల నుంచి ఎవరూ ఏ రకంగానూ పాఠాలు నేర్వనట్లు కనిపిస్తోందని ఐపీఈఎస్–ఫుడ్ కో–చైర్ అలివర్ డి షుట్టర్ పేర్కొన్నారు. కాగా ఈ విషయంపైనే ఈ సంస్థ వైస్–చైర్ జెన్నిఫర్ క్లాప్ పెరుగుతున్న ఆహార ధరలపై జూదమాడటం మొదలై పోయిం దని చెప్పారు. దీనివల్ల ప్రపంచంలో అత్యంత నిరుపేదలు తీవ్రమైన ఆకలి సమస్యలో కూరుకుపోతున్నారని ఆమె అన్నారు. ఫ్యూచర్స్ మార్కెట్లను పర్యవేక్షించడం, ‘సట్టా’ వ్యాపార తీరు తెన్నులకు వ్యతిరే కంగా పోరాడాల్సిన అవసరం గురించి జి–7 దేశాల వ్యవసాయ మంత్రులు అప్పట్లోనే మాట్లాడారు. అయినప్పటికీ ధరలలో ఊహా గానాలను నియంత్రించడంలో జి–7 దేశాల కూటమి విఫలమైంది. 2007–08 కాలంలో ఆహార సంక్షోభం ఏర్పడిన సమయంలో మితిమీరిన సరుకుల వర్తకం, ఊహాగానాలు (స్పెక్యులేషన్) అంత ర్జాతీయ ధరలు చుక్కలంటడానికి చోదక శక్తగా పనిచేశాయని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కౌన్సిల్ పేర్కొంది. దానికి అనుగుణంగా ఫ్యూచర్స్ మార్కెట్లు ఆనాటి ఆహార సంక్షోభానికి 75 శాతం వరకు కారణమయ్యాయని ఆరోపించింది. స్పెక్యులేషన్ అనేది బడా వ్యవసాయ వాణిజ్య కంపెనీలకు భారీ లాభాలను ఆర్జించి పెట్టగా, లక్షలాదిమంది ఆకలితో పడి ఉండాల్సిన పరిస్థితికి అది ఎలా కారణమైందో వివరిస్తూ అమెరికాలోని పాపులర్ టీవీ అయిన ‘డెమాక్రసీ నౌ’ వివరణాత్మక కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. ఆ సమయంలో అంతర్జాతీయ ఆహార ఉత్పత్తి క్షీణించిపోలేదు. అయినా సరే వ్యవసాయ ఉత్పత్తుల ధరలు చుక్కలనంటాయి. అంటే మొదటి ఆహార సంక్షోభం నుంచి ఎవరూ ఏ రకమైన గుణపాఠాలు నేర్చుకోలేదని ఇది సూచిస్తుంది. నిలకడైన ఆహార వ్యవస్థలను నిర్మించుకోవడం, ఆహార స్వావలంబనను ప్రోత్సహిం చడానికి బదులుగా, మన విధాన నిర్ణేతలు అంతర్జాతీయ మార్కెట్ నిబంధనలను పొడిగించుకుంటూ పోతున్నారు. అంటే మార్కెట్ శక్తులు తమ ఇష్టానుసారం రాజ్యమేలడానికి అవకాశం ఇవ్వడమే! దీనివల్ల అంతర్జాతీయ వ్యవసాయ సప్లయ్ చైన్లను నిర్మించడంపైనే దృష్టి పెడతారు. తద్వారా వేళ్లమీద లెక్కించదగిన కొన్ని కంపెనీలపైనే ఆధారపడటం పెరుగుతుంది. ఆ తర్వాత ఆ కంపెనీలు తమ ఇష్ట ప్రకారం ధరలు పెంచుకుంటూ పోతాయి. ప్రపంచంలో అతిపెద్ద ఆహార కంపెనీల్లో ఒకటైన ‘కార్గిల్’ ఈ సంవత్సరం ఇప్పటికే రికార్డు స్థాయిలో లాభాలు సాధించిందని ‘గార్డియన్’ పత్రిక నివేదించింది. అనేకానేక పరిశ్రమల్లో వేళ్లమీద లెక్కబెట్టగలిగన దిగ్గజ కంపె నీలు మార్కెట్‌ను శాసిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గతంలోనే చెప్పారు. చాలా తరచుగా ఇవి చిన్న చిన్న పోటీ దారులను నిర్మూలించడానికి తమ శక్తిని ఉపయోగిస్తున్నాయనీ, కొత్త వాణిజ్య సంస్థల ఆవిర్భవాన్ని అడ్డుకుంటున్నాయనీ పేర్కొన్నారు. దీనికి ఉదాహరణగా పశుసంపద పరిశ్రమను ఆయన ఎత్తి చూపారు. ఇది మొత్తంగా నాలుగు బడా కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోయి అవి మార్కెట్ ధరలను శాసిస్తున్నాయి. కానీ అధిక ధరలకు కారణమవుతున్న కంపెనీలపై ప్రజాగ్రహం రగలకపోవడమే ఆశ్చర్యంగా ఉంది. కమోడిటీ ట్రేడింగ్ కార్యకలాపాల్లో అనేక పెట్టుబడి మదుపులు పెరుగుతున్నాయి. కానీ గోధుమ కాంట్రాక్ట్‌లలో ఫ్యూచర్ ట్రేడింగ్ లలోని పదిమంది కొనుగోలుదార్లలో కనీసం ఏడుగురు స్పెక్యులేటర్లే అని తెలిసింది. దీనివల్ల సరుకుల ధరలు పెరిగిపోయాయి. ప్రపంచ బ్యాంకు ప్రకారం వ్యవసాయ ధరల సూచి గత ఏడాదితో పోలిస్తే ఇప్పటికే 41 శాతం ఎక్కువగా పెరిగింది. గోధుమ ధరలు 60 శాతం పెరగగా, మొక్క జొన్న ధర 54 శాతం పెరిగింది. ఆహార ధరల పెరుగుదలకు, స్పెక్యులేషన్‌కి మధ్య ప్రత్యక్ష లింకు ఉందని ఇది సూచించదు కానీ, భారత్‌లో పెరుగుతున్న వ్యాపార ప్రయోజనాలను ఇది కచ్చితంగా ఎత్తి చూపుతుంది. ఉదాహరణకు... ఇప్పుడు భారత్ అవధులు లేని గోధుమ ఎగుమతులు చేయాలని వాణిజ్య వర్గాలు కోరుతున్నాయి. ఎందుకంటే ఈ ఎగుమతుల ద్వారా పెరుగుతున్న లాభాలను, ఇంకా పెరుగుతున్న ధరలను వీరు చూస్తున్నారు. అంతర్జాతీయ ఆహార ధరల్లో పెరుగుదల పేద దేశాలను దారుణంగా దెబ్బతీస్తోంది. అదే సమయంలో దిగుమతులు కూడా ఖరీదైనవిగా మారుతున్నాయి. ఇప్పటికే సూడాన్ నుంచి అఫ్గానిస్తాన్ వరకు 53 పేద దేశాలు తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొం టున్నాయి. ఈ క్షుద్బాధా సమస్యే క్షామానికి దారితీసి విస్తృత సంఖ్యలో మరణాలకు కారణమవుతోందని ఎఫ్ఏఓ చెబుతోంది. కొన్ని దేశాలు ఇప్పటికీ సంఘర్షణను ఎదుర్కొంటున్నప్పటికీ ఆహార భద్రతను ప్రోత్సహించే దిశగా అంతర్జాతీయ ప్రయత్నాలు తగి నంతగా జరగలేదు. అదేవిధంగా, ప్రాంతీయ ఆహార రిజర్వులను ఏర్పర్చుకోవాలి. దీనివల్ల ఆహార సరఫరాలు ఏ కా>రణం వల్ల తగ్గిపోయినా పెద్ద ప్రభావం చూపకపోవచ్చు. యుద్ధం, వాతావరణ మార్పు, దారిద్య్రం, ఆర్థిక ప్రకంపనలు వంటి పలు అంశాల వల్లే ఆహారధరలు పెరుగుతున్నాయని సాధారణంగా భావిస్తున్నప్పటికీ అసలు సమస్య ఏమిటంటే ఆహార దిగుమతులపై అతిగా ఆధారపడుతుండటమే. ఉదాహరణకు రష్యా, ఉక్రెయిన్ ప్రాంతం 30 దేశాలకు గోధుమలను సరఫరా చేస్తోంది. వాస్తవానికి ఇలా ఆహారాన్ని దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో అధిక భాగం ఆహార స్వావలంబన దేశాలుగా మారవచ్చు. ఇక్కడే మనం పాఠాలు నేర్వాల్సి ఉంది. వ్యాసకర్త: దేవీందర్ శర్మ ఆహార, వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com (‘ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
వ్యాపారులకో నీతి... రైతులకో నీతి
దేశంలో ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగ్గొడుతున్న 1,913 మంది కార్పొరేట్ వ్యాపారుల వద్ద పేరుకుపోయిన మొండి బకాయిలు రూ.1.46 లక్షల కోట్లు. వీరిని అరెస్టు చేయడం కాదు కదా, వారి పేర్లను కూడా బహిర్గతం చేయరు. మరోవైపున రెండు వేల మంది పంజాబీ రైతులపై అరెస్టు వారంట్లు జారీ అయ్యాయి. పంజాబ్‌లోని 71 వేల మంది రైతుల మొత్తం బకాయిలు రూ. 3,200 కోట్లు మాత్రమే. రైతులను ఎంతగా అవమానిస్తున్నారంటే దాని పర్యవసానంగా వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తద్భిన్నంగా, ఇలాంటి శిక్షలు, అవమానాల నుంచి కార్పొరేట్ వర్గాలు తప్పించుకుంటూ స్వేచ్ఛను ఆస్వాదిస్తున్నాయి. రైతుల బకాయిలను స్వాధీన పర్చుకోవడానికి నిరంకుశ పద్ధతులు సరైన మార్గం కాదు. పంజాబ్ రాష్ట్ర సహకార వ్యవసాయ అభివృద్ధి బ్యాంకు (పీఏడీబీ) రుణ బకాయిలను వసూలు చేసుకోవడానికి గాను ఐదు ఎకరాలకు మించి భూములున్న దాదాపు రెండు వేలమంది రైతులపై అరెస్టు వారెంట్లు జారీ చేసింది. అదే సమయంలో జాతీయ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు వందలాదిమంది బడా బకాయిదారుల పేర్లను కూడా బయటపెట్టకుండా గత పదేళ్ల కాలంలోనే 11.68 లక్షల కోట్ల మొండి బకాయిలను మాఫీ చేసేశాయి. అంటే వేరు వేరు వర్గాలకు వేరు వేరు సత్కారాలన్నమాట! పంజాబ్‌లోని 71 వేల మంది రైతుల మొత్తం బకాయిలు రూ. 3,200 కోట్లు. ఈ బకాయిల స్వాధీన ప్రక్రియను వేగవంతం చేయడానికి సహకార బ్యాంకు రుణ ఎగవేతదారులకు వ్యతిరేకంగా మధ్యవర్తిత్వం, ఒప్పించడంతోపాటు అరెస్ట్ వారెంట్లు కూడా జారీచేసింది. వీళ్ల న్యాయం బాగానే ఉంది. కానీ 34 ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు నిశ్శబ్దంగా 2020–21 ఆర్థిక సంవత్సరంలో 2.02 లక్షలకోట్ల మేరకు కార్పొరేట్ సంస్థలు చెల్లించాల్సిన బకాయిలను మాఫీ చేసిపడేశాయి. ఇక 2021–22 ఆర్థిక సంవత్సరం తొలి ఆరునెలల కాలంలోనే ఈ బ్యాంకులు వరుసగా రూ. 46,382 కోట్లు, రూ. 39,000 కోట్ల మొండిబకాయిలను రద్దుచేశాయి. కార్పొరేట్ రుణ ఎగవేతదారులకు వ్యతిరేకంగా అరెస్టు వారెంట్లను జారీ చేసినట్టు ఎన్నడైనా విన్నారా? సంపన్నులైన రుణ ఎగవేత దారులు చాలామంది తప్పించుకుని విదేశాలకు చెక్కేస్తుంటే, మన దేశంలోని ఒక రైతు లేదా ఒక చిన్న రుణ గ్రహీత పట్ల రుణ వసూలు ప్రక్రియలో ఇంత అన్యాయంగా, ఇంత చెడుగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? రైతులకు అరెస్టు వారెంట్లు జారీ చేసిన ఘటనతో పంజాబ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు రావడంతో ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా రైతులపై అన్ని వారంట్లనూ ఉపసంహరించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే అంతకంటే పెద్ద ప్రశ్న ఏమిటంటే, రైతులకు జైలు శిక్ష విధించేటంత కఠిన వైఖరిని ఎందుకు ప్రదర్శిస్తున్నారు అనేదే. రైతులను ఎంతగా అవమానిస్తున్నారంటే దాని పర్యవసానంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తద్భిన్నంగా, ఇలాంటి శిక్షలకు, అవమానాలకు వ్యతిరేకంగా మన కార్పొరేట్ వర్గాలు పూర్తిగా తప్పించుకుంటూ స్వేచ్ఛను ఆస్వాదిస్తున్నాయి. రుణాలను ఎగవేస్తున్న మన బడా కంపెనీల పట్ల భారత రిజర్వ్ బ్యాంకు కల్పిస్తున్న రక్షణ కవచం తీరు ఇదే మరి. సంపన్నులు నష్ట భయం లేకుండా సంతోషంగా గడుపుతుండగా, రైతులు నిరాశా నిస్పృహల్లో కూరుకుపోతున్నారు. రెండు సెక్షన్ల బ్యాంకు రుణాల ఎగవేతలకు రెండు రకాల నిబంధనలు ఉన్నట్లు కనిపిస్తోంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934లోని సెక్షన్ ‘45ఈ’ని ఉపయోగించి, కార్పొరేట్ డిఫాల్టర్ల గుర్తింపును బహిర్గతం చేయడానికి బ్యాంకింగ్ రెగ్యులేటర్ తిరస్కరిస్తోంది. దీనికి గోప్యతను ప్రధాన కారణంగా చెబుతున్నారు. న్యాయస్థానం ఆదేశాలతో కొంతమంది డిఫాల్టర్ల పేర్లను బయటపెట్టారు. కార్పొరేట్ డిఫాల్టర్లకు సంబంధించినంతవరకూ రుణ రికవరీ ట్రిబ్యునల్స్‌కి వెళ్లడం, ‘సెక్యూరిటైజేషన్ అండ్ రికన్స్ట్రక్షన్ ఆఫ్ పైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్’ కింద చర్య తీసుకోవడంతో సహా బ్యాంకులు సొమ్ము రాబట్టుకోవడానికి ఎలాంటి యంత్రాంగాన్నయినా ఉపయోగించవచ్చు. అలాగే ‘ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్’ కింద నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో కేసులు నమోదు చేయవచ్చు. బకాయిలు రాబట్టడం ఇప్పటికీ సంతృప్తికరంగా లేనందున, ఈ లక్ష్యం కోసం ‘బ్యాడ్ బ్యాంక్’ నెలకొల్పాలన్న తాజా నిర్ణయం కూడా తీసుకున్నారు. బకాయి రూణాన్ని రద్దు చేయడం అంటే రుణ మాఫీ వంటిది కాదని నాకు తెలుసు. నిరర్థక రుణాన్ని మరొక బ్యాంక్ లెడ్జర్‌కి మార్చినప్పటికీ బ్యాంకుల ద్వారా రికవరీ ప్రక్రియ కొనసాగుతుంది. వాయిదాలో ఉన్న బకాయిలలో పది శాతం కూడా బ్యాంకులు వసూలు చేయలేకపోయాయని పలు ఆర్టీఐ ఆధారిత నివేదికలు చూపుతున్నాయి. మిగిలివున్న బకాయిలు ఇక ఎన్నటికీ వసూలు కావు. వ్యవసాయ రంగంలోని ఎగవేతదారులకు కూడా దీన్నే వర్తింపజేయవచ్చు. రుణాలు చెల్లించలేకపోయిన రైతులను కటక టాలలో బంధించడానికి బదులుగా, బకాయి రుణాలను కూడా మరొక లెడ్జర్‌కి పంపించి రుణాల రికవరీ ప్రక్రియను కొనసాగిం చాలని బ్యాంకులు ఎందుకు ఆదేశించ కూడదు? ఈలోగా రైతులు తమ వ్యవసాయ కార్యకలాపాలను కొనసాగించడాన్ని ఎందుకు అను మతించకూడదు? రైతులపై వ్యతిరేకతను ప్రతి దశలోనూ ప్రదర్శించడం స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. వ్యవసాయ కమ్యూనిటీ మీద వ్యతిరేకత, ద్వేషభావం పెరుగుతున్నాయి. అది కూడా విద్యాధికుల్లో ఈ వ్యతిరేకత పెరిగిపోతోంది. వ్యవసాయ రుణాల మాఫీని ఏ రాష్ట్రప్రభుత్వమైనా ప్రకటిస్తే చాలు... మీడియా విరుచుకపడుతోంది. రైతురుణాల మాఫీని నిలిపివేయాలని ప్యానెల్ చర్చలు గావుకేకలు పెడుతుంటాయి. దీనికి బదులుగా ప్రతి ఆరునెలలకోసారి కార్పొరేట్ నిరర్థక రుణాలను గణనీయంగా బ్యాంకులు రద్దు చేస్తున్నాయి. కార్పొరేట్ రుణాల రద్దును నిలిపివేయాలని టీవీల్లో జరిగిన చర్చలను మీరు చూసి ఎన్నాళ్లయిందో గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి. మరొక పాలసీ నిర్ణయం స్పష్టంగా ఈ వివక్షను ఎత్తిచూపిస్తోంది. మధ్యప్రదేశ్, హరియాణాతో సహా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, రైతులు తమ పంటలను కనీస మద్దతు ధరకు మండీల్లో అమ్ముకున్న తర్వాత దాన్నుంచి కిసాన్ క్రెడిట్ కార్డు కింద చెల్లించని బకాయలను తీసివేశాయి. ఇది క్రూరం, అన్యాయం మాత్రమే కాదు; రైతుల కోసం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని తొక్కిపడేసే ధోరణిని ఇది సూచిస్తుంది. పంట నుంచి చెల్లించని మొత్తాలని ఇది తీసివేస్తోంది. రైతు నుంచి బ్యాంకు రుణాలను రికవరీ చేసుకోవడానికి కనీస మద్దతు ధర ఒక సమర్థనీయమైన పరికరంగా ఉంటోంది. కానీ పరిశ్రమలకు తాజా రుణాలను జారీ చేసేటప్పుడు నిరర్థక రుణాల మొత్తాన్ని ఆ రుణం నుంచి బ్యాంకులు ఎందుకు తీసుకోలేవు? నిరర్థక రుణాలను రికవరీ చేసే ఒక సాధనమైన ఐబీసీ ప్రొసీడింగ్స్ ప్రకారం పరిశ్రమలు సగటున 65 నుంచి 95 శాతం వరకు నిరర్థక రుణాలను కలిగి ఉంటున్నాయి. అయినా సరే ఇవి బ్యాంకులనుంచి తాజా రుణాలు పొందగలుగుతున్నాయి. బ్యాంకులు ఈ కార్పొరేట్ సంస్థల తాజా రుణాల నుంచి తమ పాత బాకీలను చెల్లింపు చేసుకోవు. భారీగా కార్పొరేట్ మొండి బకాయిలను రద్దు చేస్తున్నప్పుడు కూడా ఏ బ్యాంకూ కొత్త రుణాలను జారీ చేసేటప్పుడు అంతకుముందు చెల్లించని రుణాన్ని కొత్త రుణాలనుంచి తీసుకుందామని భావించదు. 2020 జూన్ నెలలో మీడియాలో వార్తల ప్రకారం దేశంలో ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగ్గొడుతున్న 1,913 మంది వద్ద పేరుకుపోయిన మొండి బకాయిలు రూ.1.46 లక్షల కోట్లు. వీరిని అరెస్టు చేయడం కాదు కదా, వారి పేర్లను కూడా బహిర్గతం చేయరు. మరోవైపున కో ఆపరేటివ్ బ్యాంక్ మాత్రం రెండు వేలమంది పంజాబీ రైతులపై వారంట్లు జారీ చేసింది. వ్యవసాయం తీవ్ర నిçస్పృహ మధ్య కొనసాగుతోంది. రైతుల బకాయిలను స్వాధీన పర్చుకోవడానికి నిరంకుశ పద్ధతులు అవలం బించడం సరైన మార్గం కాదని బ్యాంకులు గ్రహించాలి. ఏ సందర్భంలో అయినా రైతులపై అరెస్టు వారెంట్లు జారీ చేసినట్లయితే, అదేవిధమైన న్యాయ నిబంధనను కార్పొరేట్ రుణ ఎగవేతదారులకు కూడా పొడిగించాల్సి ఉంటుందని ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. సమాన న్యాయానికి ఇది తగు సమయం కాదా? వ్యాసకర్త: దేవీందర్ శర్మ ఆహార, వ్యవసాయ నిపుణులు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
స్వావలంబన లేని సంస్కరణలు ఏల?
భారతదేశంలో వ్యవసాయ వాణిజ్య కంపెనీలను పైకి తీసుకురావడానికి కమీషన్ ఏజెంట్లను నిందించే ప్రక్రియను పద్ధతి ప్రకారం కొనసాగిస్తున్నారు. వ్యవసాయరంగంలో మధ్య దళారీలను నియంత్రించాల్సిందే. కానీ, మాంస పరిశ్రమను బలోపేతం చేయాలని తలపెట్టిన ప్రయత్నం, కొన్ని కంపెనీల చేతుల్లో మార్కెట్ కేంద్రీకృతం అవడానికి కారణమయ్యిందని అమెరికన్ అనుభవం చెబుతోంది. మార్కెట్ చలన సూత్రాలు అమెరికా రైతులకు ప్రశాంతమైన జీవితాన్ని అందించడంలో మళ్లీ విఫలమయ్యాయి. రైతుల పంటలకు మద్దతు ధర కల్పించాలనే కీలక సమస్యను గుర్తించడంలో విఫలమవుతున్నందునే అంతర్జాతీయంగా రైతులు నిరంతర నష్టాలు అనే పెను భారాన్ని మోయవలసి వస్తోంది. అమెరికా వ్యవసాయ రంగంలో గత అర్ధ శతాబ్ధంపైగా ప్రవేశపెడుతూ వచ్చిన మార్కెట్ సంస్కరణల వైఫల్యం నుంచి మన విధాన నిర్ణేతలు, ఆర్థిక వేత్తలు ఎలాంటి గుణపాఠాలూ నేర్చుకోవడం లేదు. చివరకు ఇటీవలే వివా దాస్పదమైన మూడు వ్యవసాయ సంస్కరణ చట్టాలను రద్దుచేసిన తర్వాత కూడా, సరఫరా–డిమాండ్ మధ్య సమతౌల్యమే ధరలను నిర్ణయిస్తుందని ఇప్పటికీ వీరు పాత పాటే వల్లె వేస్తున్నారు. మార్కెట్ చలన సూత్రాలు అమెరికా రైతులకు ప్రశాంతమైన జీవితాన్ని అందిం చడంలో మరోసారి విఫలమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ వాస్తవాన్ని చక్కగా గుర్తిం చారు. ఇటీవలే ఒక ప్రకటనలో యాభై ఏళ్లకు ముందు అమెరికా రైతులు మాంసాహార ఉత్పత్తులపై సంపాదించిన రాబడుల్లో సగం కూడా ఇప్పుడు వారికి లభించడం లేదని బైడెన్ చెప్పారు. ‘‘50 ఏళ్ల క్రితం అమెరికాలో రైతులు, బీఫ్ ఉత్పత్తిపై వెచ్చించిన ప్రతి డాలర్‌కి 60 సెంట్ల రాబడిని సంపాదించేవారు. ఈరోజు వారికి 39 సెంట్లు మాత్రమే దక్కుతోంది. అలాగే 50 ఏళ్ల క్రితం పందుల్ని పెంచిన రైతులు వెచ్చించిన ప్రతి డాలర్ ఖర్చుకు 48 నుంచి 50 సెంట్ల రాబడి సాధించేవారు. కానీ ఈరోజు వారి రాబడి 19 సెంట్లకు పడిపోయింది. అదే సమయంలో బడా కంపెనీలు మాత్రం భారీ లాభాలను సాధిస్తున్నాయి.’’ ఒక సంవత్సర కాలంలో బీఫ్ ధరలు 21 శాతం, పంది మాంసం ధర 17 శాతం, చికెన్ ధర 8 శాతం పెరిగినట్లు అమె రికా వ్యవసాయ విభాగం (యూఎస్డీఏ) అంచనా వేసిన సమయం లోనే రైతుల రాబడి ఇంతగా పడిపోయిందని గ్రహించాలి. ‘‘వ్యవసాయ వాణిజ్య సంస్థల లాభాలు పెరిగే కొద్దీ దుకాణాల్లో సరకుల ధరలు కూడా భారీగా పెరుగుతూ వచ్చాయి. కానీ మార్కె ట్లకు తమ ఉత్పత్తులను తీసుకొచ్చిన రైతులకు దక్కాల్సిన ధరలు మాత్రం పడిపోయాయి’’ అంటూ అమెరికా అధ్యక్షుడు మరిన్ని వివ రాలు తెలిపారు. అమెరికా వ్యవసాయ శాఖ కార్యదర్శి టామ్ విల్సక్ దీనికి బలం చేకూరుస్తూ ట్వీట్ చేశారు. ‘‘ఈ వేసవిలో, లోవా రాష్ట్రంలో ఒక రైతును కలిశాను. ‘ఒక పశువును 150 డాలర్లకు అమ్మి నేను నష్టపోయాను. కానీ దాని మాంసాన్ని ప్రాసెస్ చేసి అమ్మినవాడు మాత్రం ఒక్కో పశువుకు 1,800 డాలర్ల లాభం సంపాదించాడు’ అని ఆ రైతు వాపోయాడు.’’ ఒకవైపు రైతుల ఆదాయాన్ని హరిస్తూ, మరో వైపు లాభాలు ఆర్జిస్తున్న మాంసాహార ప్రాసెసింగ్ కంపెనీల లాభాలు ఏ స్థాయిలో ఉంటున్నాయో ఈ ఒక్క ఉదాహరణ నుంచే ఊహించు కోవచ్చని టామ్ చెప్పారు. భారతదేశంలో, రైతులను నిలువుదోపిడీ చేస్తున్నందుకు వ్యాపా రులను, లాభాలు దండుకుంటున్న కమిషన్ ఏజెంట్లను మనం కచ్చి తంగా నిందించాల్సిందే. అమెరికాలో 85 శాతం మాంస పరిశ్రమను నియంత్రిస్తున్న నాలుగు మాంసాహార దిగ్గజ సంస్థలను వాస్తవానికి భారీస్థాయి దళారీలనే చెప్పాలి. వీళ్లు సముద్ర సొరచేపలకు ఏమాత్రం తక్కువ కాదు. భారతదేశంలో వ్యవసాయ వాణిజ్య కంపెనీలను పైకి తీసుకురావడానికి కమీషన్ ఏజెంట్లపై నిందమోపే ప్రచారాన్ని పద్ధతి ప్రకారం చేస్తూ వస్తున్నారు. మధ్య దళారీలను నియంత్రించాల్సిందే. కానీ, మాంస పరిశ్రమను బలోపేతం చేయాలని తలపెట్టిన ప్రయత్నం, కొన్ని కంపెనీల చేతుల్లో మార్కెట్ కేంద్రీకృతం అవడానికి కారణమయ్యిందని అమెరికన్ అనుభవం చెబుతోంది. మాంస ఉత్ప త్తుల ధరలు పడిపోవడంతో తరాలుగా పశువులు, పందులు, కోళ్లను పెంచుతున్న రైతు కుటుంబాలు కుప్పగూలిపోయాయి. వ్యవసాయంలో స్వేచ్ఛా మార్కెట్ల రాకతో జరిగిన విధ్వంసం అమెరికా వ్యవసాయరంగం కుప్పగూలిపోయిన తీరుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. అదే క్రమంలో రైతులకు న్యాయమైన ధరలను కల్పించడంలో సరఫరా–డిమాండ్ సమతౌల్యం మరింత చెత్త ఫలితాలను తీసుకొచ్చింది. మొదట్లో ఈ పతనం వ్యవసాయ సరు కులు, పాల పరిశ్రమలో సంభవించగా ఇప్పుడు పశుమాంస వ్యవ సాయం దాని బారినపడింది. వ్యవసాయ దిగుబడుల నుంచి రిటైల్ మార్కెట్ దాకా సప్లయ్ చైన్ క్రమం మొత్తంగా బలపడుతూ వచ్చింది. నిజానికి ఈ కేంద్రీకరణ గుత్తాధిపత్యానికి, బలప్రదర్శనకు దారి తీసింది. వ్యవసాయ వాణిజ్య కంపెనీలు, సిండికేట్‌గా ఏర్పడిన క్రమం అనేది అటు వ్యవసాయ ఉత్పత్తిదారులనూ, ఇటు వినియోగ దారులనూ నిర్దాక్షిణ్యంగా దోపిడీ చేయడంతో ముగిసింది. తమ రక్త మాంసాలను బహుళజాతి కార్పొరేషన్లు పీల్చేస్తుండటానికి వ్యతిరే కంగా అమెరికా జాతీయ రైతుల యూనియన్ దేశవ్యాప్త ప్రచారాన్ని నిర్వహిస్తోంది. కార్పొరేట్ గుత్తాధి పత్యాన్ని బద్దలు చేసి రైతులకు న్యాయం చేయడం, యాంటీ–ట్రస్ట్ చట్టాలను కఠినంగా అమలు చేయాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. అమెరికా ప్రభుత్వం రైతుల డిమాండ్ల పట్ల స్పందించింది. ధరలను భారీగా పెంచేలా ఆర్థిక వ్యవస్థను నడుపుతున్న కొన్ని వ్యవసాయ వాణిజ్య దిగ్గజ సంస్థలపై వేటు వేయాలని దేశాధ్యక్షుడు బైడెన్ పిలుపునిచ్చారు. పరిశ్రమలోని దిగ్గజాలతో పోటీ పడేందుకు చిన్నతరహా మాంసాహార ప్రాసెసింగ్ విభాగాల్లో ఒక బిలియన్ డాలర్ల మేరకు పెట్టుబడులను ప్రభుత్వం ఆమోదించింది. ఇది సమగ్ర పరి ష్కారం కానప్పటికీ, ఉత్పత్తిదారులు, వినియోగదారులు ఇరువు రిపై తీవ్ర ప్రభావం చూపుతున్న కార్పొరేట్ గుత్తసంస్థల విధ్వంసాన్ని కాస్త అర్థం చేసుకోవడానికి ప్రభుత్వ చర్య తోడ్పడింది. వ్యవసాయ సరు కులు, పశుసంపదను ఉత్పత్తి చేసే రైతులకు మద్దతు ధర కల్పించడమే ఉత్తమమార్గం. భారతీయ రైతులు కూడా కనీస మద్దతు ధరకు చట్ట బద్ధతను కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మద్దతు ధరకు దిగువన ఎలాంటి వ్యాపార లావాదేవీలూ సాగవద్దన్నదే రైతుల డిమాండ్. యూరప్‌లో కూడా తమను వెంటాడుతున్న వ్యవసాయ సంక్షోభం నుంచి బయట పడేయడానికి న్యాయమైన ధరలకు హామీ కల్పించాలని రైతులు పదేపదే నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా వ్యవసాయ రంగ ఆదాయాలు పడి పోతుం డటమే... ప్రపంచ వ్యవసాయ సంక్షోభానికి ప్రధాన కారణం. వ్యవ సాయ సంక్షోభం, పరిష్కారాలపై కెనడా జాతీయ రైతుల యూనియన్ 2005లో ఒక నివేదికను సమర్పించింది. గత 20 ఏళ్లుగా వ్యవసాయ ఆదాయాల్లో కనీవినీ ఎరుగని సంక్షోభానికి కారణాలను ఈ నివేదిక వివరించింది. 1985, 2005 మధ్య వ్యవసాయ ఆదాయాలు తిరోగ మన ధోరణిలో కొనసాగాయి. గత 20 ఏళ్ల కాలంలో ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేసిన తర్వాత వ్యవసాయ పంటల ధరలు స్తబ్దతలో ఉండిపోయిన వైనాన్ని అంక్టాడ్ (యూఎన్‌సీటీఏడీ) కూడా స్పష్టంగా పేర్కొంది. 1930లలో మహా మాంద్య సంవత్సరాల్లో కంటే 2005లో రైతుల పంటలు మరింతగా పతనమయ్యాయని కెనడియన్ ఎన్‌ఎఫ్‌యు పేర్కొంది. ప్రపంచం ఆర్థికాభివృద్ధి దిశలో పయనిస్తున్న, స్టాక్ మార్కెట్ చెలరేగుతున్న సమయంలో రైతు రాబడులు ఇంతగా పతనం చెందడం గమనార్హమని ఎన్ఎఫ్యూ చెప్పింది. ఈ సంక్షోభ నివారణకు అది చేసిన 16 ప్లాన్ ప్యాకేజీలో రైతుకు మద్దతు ధర అనేది తొలి స్థానంలో నిలబడింది. రైతులు తమ పంటలకు పెడుతున్న పెట్టుబడుల్లో 95 శాతానికి హామీ ఇచ్చేలా వ్యవసాయ ఆదాయ మద్దతు కార్యక్రమాన్ని అమలు చేయాలని ఎన్ఎఫ్యూ ఆ దేశ ప్రభుత్వాన్ని కోరింది. అలాగే శ్రమశక్తి, యాజమాన్య నిర్వహణ, పెట్టుబడులకు కూడా న్యాయమైన రాబడిని కల్పించాలని కోరింది. కానీ అమెరికా లాగే కెనడా ప్రభుత్వం కూడా మద్దతు ధరపై రైతుల చట్టబద్ధమైన డిమాండును విస్మరించింది. రైతులు కనీసంగా జీవించడానికి అనువైన ఆదాయం వారికి కల్పిం చడం అత్యవసరం అవుతున్న సమయంలో ప్రపంచం మొత్తంగా కేంద్రస్థానంలో ఉంటున్న బలమైన ఆర్థిక చింతన రైతుల ప్రాణాధార సమస్యను గుర్తించడంలో విఫలమవుతోంది. దీని ఫలితంగానే ప్రపంచ వ్యాప్తంగా రైతులు నిరంతర నష్టాలతో ఆహార ఉత్పత్తి చేయడం అనే పెను భారాన్ని మోయవలసి వస్తోంది. వ్యాసకర్త: దేవీందర్ శర్మ ఆహారం, వ్యవసాయరంగ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
ఈ వ్యవసాయం ఓ ఆశాకిరణం
పురుగుమందులను, రసాయనిక ఎరువులను వాడకుండా సాగుతున్న ప్రకృతి వ్యవసాయం ఒక సరికొత్త సామాజిక ఉద్యమంలా ఆవిర్భవించింది. ఈ నూతన వ్యవసాయం ఇప్పుడు అంతర్జాతీయంగా ఒక ఆశాకిరణంగా కనిపిస్తోంది. ఛిన్నాభిన్నమైపోయిన ఆహార వ్యవస్థను ఇది చక్కదిద్దుతోంది. ప్రకృతి వ్యవసాయంతో పంటలకు పట్టే తెగుళ్ల కేసులు 86 శాతం పడిపోయాయి. ప్రతి రైతు కుటుంబం ఆరోగ్య ఖర్చులకు పెడుతున్న మొత్తంలో 50 శాతం దాకా తగ్గిపోయింది. వ్యవసాయ ఖర్చులు 68 శాతం తగ్గిపోయాయి, పంట దిగుబడుల్లో 88 శాతం పెరుగుదల నమోదైంది. పంటల రకాలను బట్టి, రాబడి 8 నుంచి 111 శాతం వరకు పెరిగింది. ఇది భవిష్యత్ సమాజ ఆహారానికి నిలకడైన మార్గంవైపుగా జరుగుతున్న మౌలిక పరివర్తన. దేశంలో రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకంతో ఛిన్నాభిన్నమైపోయిన ఆహార వ్యవస్థను ప్రకృతి వ్యవసాయం ఎలా చక్కదిద్దుతుంది అనేది పెద్ద ప్రశ్న. ఈ విషయంపై స్పష్టత కోసం, భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) మాజీ డైరెక్టర్ జనరల్‌కి నేను కాల్ చేసి, కమ్యూనిటీ నేతృత్వంలో వ్యవసాయం సాగుతున్న ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని గ్రామాలను సందర్శించాల్సిందిగా అభ్యర్థించాను. పురుగుమందులను వాడకుండా నడుస్తున్న ఈ నూతన వ్యవసాయ వ్యవస్థ ఏపీలో ఒక సరికొత్త సామాజిక ఉద్యమంలా ఆవిర్భవించిందని చెప్పాను. ఆయన నా మాటలు ఓపిగ్గా విన్నారు. పురుగుమందులు లేని వ్యవసాయ వ్యవస్థ ఏపీ రైతులను ఎలా ఆకట్టుకుందీ, ఒక సురక్షితమైన, ఆరోగ్యకరమైన వ్యవసాయ విధానం వైపుగా రైతుల పరివర్తన ఎలా జరిగిందీ వివరంగా తెలుసుకోదలిచినట్లు ఆయన చెప్పారు. నా కాల్ ముగించిన వెంటనే ఆయన హైదరాబాద్ లోని ఐసీఏఆర్ డైరెక్టరేట్‌ను సంప్రదించారు. ప్రకృతి వ్యవసాయంపై ప్రాథమిక అంచనా నిమిత్తం, ఏపీలోని కొన్ని గ్రామాలను సందర్శించడానికి శాస్త్రవేత్తల బృందాన్ని పంపించాలని ఆయన ఆదేశించారు. కొద్ది రోజుల తర్వాత ఆయన నాకు కాల్ చేసి ఈ అంశంపై తానందుకున్న నివేదిక చాలా సానుకూలంగా ఉందనీ, ఇప్పటికే అమలవుతున్న వ్యవసాయ విధానాల నుంచి కొత్త పద్ధతికి మారడానికి రైతాంగం ఆలోచనల్లోనే సమూల మార్పులు అవసరమనీ తెలిపారు. పురుగుమందుల అవసరం లేని సాగు వ్యవస్థ వైపు మళ్లడానికి ఉన్న అపారమైన అవకాశాలను ఎంత త్వరగా చూడగలం అని చెప్పడానికే నేను ఈ కథనాన్ని ఇక్కడ పొందుపర్చాను. ఈ నూతన వ్యవసాయ వ్యవస్థ ఇప్పుడు అంతర్జాతీయంగా ఒక ఆశాకిరణంగా కనిపిం చడానికి ముందుగా, ఒక చిన్న చొరవ ద్వారా ప్రారంభమైందని తెలుసుకుంటే మన హృదయాలు ఉప్పొంగుతాయి. కమ్యూనిటీ స్థాయిలో ప్రకృతి వ్యవసాయ (సిఎమ్‌ఎన్‌ఎఫ్) కార్యక్రమం అని మనం చెప్పుకుంటున్నది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల్లోని 3,780 గ్రామాలకు విస్తరించింది. దాదాపు 7 లక్షలమంది రైతులు ఇప్పుడు ఈ మార్గంలో పయనిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రపంచంలోనే అతి పెద్ద వ్యవసాయ పర్యావరణ వ్యవస్థగా ఆవిర్భవించింది. గ్లోబల్ అలయెన్స్ ఫర్ ది ఫ్యూచర్ ఆఫ్ ఫుడ్ సంస్థ తాజాగా విడుదల చేసిన ‘నిజమైన విలువ : ఆహార వ్యవస్థ పరివర్తన సానుకూల ప్రభావాల వెల్లడి’ అనే నివేదిక ఈ కార్యక్రమాన్ని, ఛిన్నాభిన్నమైన ఆహార వ్యవస్థలను సమర్థంగా చక్కదిద్దగల ఆరు అంతర్జాతీయ ప్రేరణల్లో ఒకటిగా పేర్కొంది. ప్రపంచం ఎదురుచూస్తున్న గొప్ప మార్పునకు ఇది ఒక నాందీవాచకమై నిలిచిందని ఈ నివేదిక ప్రశంసించింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న సహజ వ్యవసాయ విధానం 8 లక్షల హెక్టార్లలో అమలవుతోంది. వికేంద్రీకరించిన వ్యవసాయ వ్యవస్థ కింద నడుస్తున్న ఈ కార్యక్రమం ప్రభుత్వ యాజమాన్యంలోని లాభాలతో నిమిత్తం లేని రైతు సాధికార సంస్థ (ఆర్‌వైఎస్‌ఎస్) ద్వారా కొనసాగుతోంది. ఒక్కొక్కటి 2 వేల కుటుంబాలను పర్యవేక్షిస్తున్న 12,500 గ్రామ కౌన్సిళ్లతో విజయవంతమైన ఈ కార్యక్రమం పరస్పర అనుసంధానంతో నడుస్తోంది. దీంట్లో స్థానికంగా గుర్తింపు పొందిన ఒక రైతు నిపుణుడు, ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతు, వ్యవసాయ నిపుణుడితో కూడిన ముగ్గురు ముఖ్యమైన రైతుల బృందం నిత్యం ఈ విధానంలో సాగు చేస్తున్న తోటి రైతులకు సూచనలు అందిస్తూ మార్గదర్శకత్వం వహిస్తుంటుంది. పై నివేదిక పేర్కొన్నట్లుగా స్థానికంగా ప్రకృతి వ్యవసాయ సూత్రాల అమలులో మహిళా బృందాలు గొప్ప పాత్ర పోషిస్తున్నాయి. మహిళా శక్తి ఒక సమాజాన్ని ఎలా మార్చివేయగలదో తెలుసుకోవాలంటే ఏపీలో 70 లక్షల మంది మహిళలు 6,52,440 స్వయం సహాయక బృందాలను ఏర్పర్చి నిర్వహిస్తున్న వైనాన్ని మీరు స్వయంగా వచ్చి చూడాలి. ప్రకృతి వ్యవసాయ ఉద్యమానికి ‘ఆధ్యాత్మిక పెట్టుబడి’లాగా పేరొందిన ఈ మహిళా బృందాలు నిర్ణయాలను తీసుకోవడంలో ముందంజ వేస్తున్నాయి. నా పర్యటనల సందర్భంగా మహిళా శక్తి సామర్థ్యాలను చూసి నిజంగానే ఆశ్చర్యపోయాను. రుణాలను పంపిణీ చేయడంలో, పంట దిగుబడి సరఫరాలను నిర్వహించడంలో, ఆహార ధాన్యల నిల్వల నిర్వహణ, ప్రాసెస్ చేయడంలో, తమకు తెలిసిన జ్ఞానాన్ని పరస్పరం పంచుకోవడంలో వీరి ప్రతిభ అసాధారణం. ప్రకృతి వ్యవసాయ ఉద్యమాన్ని ఏది ముందుకు తీసుకెళుతోందో, నూతన వ్యవసాయ శక్తి కేంద్రాలుగా మహిళలు ఎలా వ్యవహరిస్తున్నారో తెలుసుకోవాలంటే మీరు స్వయం సహాయక బృందాల సమావేశాలకు తప్పకుండా హాజరై పరిశీలించాల్సి ఉంది. హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ సస్టెయినబుల్ అగ్రికల్చర్ కార్యనిర్వాహక డైరెక్టర్ డాక్టర్ జీవీ రామాంజనేయులు ఈ పురుగుమందుల రహిత వ్యవసాయానికి సమర్థ ప్రచారకర్త. వ్యవసాయ పర్యావరణ వ్యవస్థలపై అపార విశ్వాసం ఉన్న ఈయన, మహిళా స్వయం సహాయక బృందాల సమావేశాలకు నన్ను తీసుకెళ్లారు. కమ్యూనిటీ స్థాయిలో ప్రకృతి వ్యవసాయంలో నిమగ్నమై ఉన్న 38 ఎన్జీవోలలో ‘సెంటర్ ఫర్ సస్టెయినబుల్ అగ్రికల్చర్’ తలమానికంలా ఉంది. ఈ సంస్థ వరంగల్ జిల్లాలోని ఒక గ్రామం మొత్తాన్ని సేంద్రియ వ్యవసాయం వైపు మరల్చడమే కాకుండా, ఈ గ్రామంలో వ్యవసాయ కో ఆపరేటివ్‌ను కూడా ఏర్పర్చింది. అప్పటి నుంచి మరో ఆరు సేంద్రియ వ్యవసాయ గ్రామాలు తయారయ్యాయి. పురుగుమందుల వాడకం పూర్తిగా నిలిపివేయడంతోపాటు, రసాయనిక ఎరువులను తగ్గించి వాడటంతో పంటలకు పట్టే తెగుళ్ల కేసులు 86 శాతం పడిపోయాయి. అంతే కాకుండా ప్రతి రైతు కుటుంబం ఆరోగ్య ఖర్చులకు పెడుతున్న మొత్తంలో 50 శాతం దాకా తగ్గిపోయింది. వైద్య ఖర్చులు అమాంతంగా పెరిగిపోవడం, దేశంలో రైతుల ఆత్మహత్యల పెరుగుదలకు కారణమైంది. ఈ నేపథ్యంలో రైతులను రుణాల విషవలయం నుంచి తప్పించడమే ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం లక్ష్యం. పైగా ప్రకృతి వ్యవసాయంతో రైతులకు వ్యవసాయ ఖర్చులు 68 శాతం తగ్గిపోయాయి, పంట దిగుబడుల్లో 88 శాతం పెరుగుదల నమోదైంది. వ్యవసాయ పంటల రకాలను బట్టి వ్యవసాయ రాబడి 8 నుంచి 111 శాతం వరకు పెరిగింది. ప్రకృతి వ్యవసాయంలో పంటలకు 55 శాతం నీళ్లు, విద్యుత్ మాత్రమే అవసరమవుతాయి. దీనివల్ల కాలుష్య ఉద్గారాలు 55 నుంచి 99 శాతం దాకా తగ్గిపోయే అవకాశముంది. నేల క్షయాన్ని నిరోధించడం ద్వారా ఏటా రూ. 12.3 లక్షల కోట్ల ఖర్చును ఆదా చేయవచ్చు కూడా! తమ భూముల్లో 43 శాతం దాకా వానపాములు పెరిగినాయని, 52 శాతం దాకా నేల గుల్ల అయిందని, పచ్చదనం 36 దాకా పెరిగిందని రైతులు చెప్పారు. పైగా తాము పండించిన పంటల రుచి ఎంతో మెరుగైందని 95 శాతం రైతులు చెప్పడంతో నేను ఆశ్చర్యపోయాను. రసాయనాలు లేని ఆహారాన్ని 70 శాతం దాకా స్థానికంగా వాడుతున్నారు. దీంతో పీచుపదార్థం సమృద్ధిగా ఉన్న పోషకాహారం తీసుకోవడం బాగా పెరిగింది. ఏపీ వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు ప్రకృతి వ్యవసాయం కోసం ఒక విధానపరమైన చట్రాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో వ్యవసాయ జనాభాను మొత్తంగా రసాయన రహిత సేద్యం వైపు మళ్లించేందుకు బడ్జెట్లో మద్దతు కూడా అవసరం. ప్రపంచంలో ప్రతి విజయవంతమైన మార్పు వెనుక ఒక శక్తిమంతమైన ఉత్ప్రేరకం ఉంటుంది. ప్రస్తుతం ఆర్‌వైఎస్‌ఎస్‌కో చైర్మన్‌గా ఉంటున్న సీనియర్ రిటైర్డ్ ప్రభుత్వాధికారి విజయకుమార్ థిల్లామ్... ఏపీలో ప్రకృతి వ్యవసాయ పరంగా జరుగుతున్న అద్భుతమైన పరివర్తనకు ప్రేరణ. ఏపీలో స్మార్ట్ వ్యవసాయం పేరిట జరుగుతున్న గొప్ప పరివర్తనకు ఈయనే మూలకర్తగా ఉన్నారు. ఇది ఏపీకి గర్వకారణమే కాదు.. భవిష్యత్ సమాజ ఆహారానికి నిలకడైన మార్గం వైపుగా జరుగుతున్న మౌలిక పరివర్తన కూడా! -దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహారం, వ్యవసాయరంగ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com -
లాభం శూన్యం... నష్టాలు అనంతం!
ఒక సగటు భారతీయరైతు సాధారణ కూలీ కంటే ఘోరమైన స్థితిలో ఉన్నాడని జాతీయ గణాంకాల సంస్థ (ఎన్ఎస్ఓ) నివేదిక సూచిస్తోంది. 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా దేశంలో రైతులు పంట సాగు ద్వారా కంటే రోజు కూలీ ద్వారానే ఎక్కువగా ఆర్జిస్తున్నారంటే, వ్యవసాయ రాబడులను ఉద్దేశపూర్వకంగా తగ్గించివేసిన ఆర్థిక నమూనాలకు ఇది ప్రతిఫలంగానే చెప్పాల్సి ఉంటుంది. రైతులకు న్యాయమైన ఆదాయాన్ని తిరస్కరించడం అనేది గత కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వాలు వరుసగా అమలు చేస్తూ వచ్చిన వ్యవసాయ వ్యతిరేక విధానాల ఫలితమే. గ్రామీణ ప్రజలను వ్యవసాయం నుంచి పక్కకు నెట్టడమే వీటి లక్ష్యం. అందుకే కొన్ని దశాబ్దాలుగా రైతులకు దక్కుతున్నది శూన్యం. కష్టాలు, కడగండ్లు మాత్రం అనంతం. ప్రపంచ వాణిజ్య సంస్థ 1995లో ఉనికిలోకి వచ్చిన కొన్నేళ్ల తర్వాత లండన్‌కి చెందిన ‘ది ఎకాలజిస్టు’ పత్రిక నన్ను ఆహ్వానించి, భారతీయ రైతును యూరోపియన్ రైతుతో పోలుస్తూ ఒక వ్యాసం రాయమని కోరింది. భారత్‌లో సాపేక్షికంగా తక్కువ ఖర్చుతో సాగే వ్యవసాయాన్ని దృష్టిలో పెట్టుకుని, ప్రపంచ వాణిజ్యానికి తలుపులు తెరిచాక భారతీయ రైతులు ఆర్థికంగా ఎలా ప్రయోజనం పొందారు అనేది ఆ వ్యాసం లక్ష్యంగా ఉండాలని నాకు సూచించారు. పెరుగుతున్న పట్టణీకరణ వేగంగా ఆర్థిక వృద్ధికి దారితీస్తుందని, వ్యవసాయాన్ని క్షీణింపజేస్తుందని, రైతులు సాగును వదిలిపెట్టి వలసపోతారన్నది ఆ పత్రిక అభిప్రాయం. రైతుల వ్యతిరేకత పెరుగుతున్నప్పటికీ ప్రపంచ వాణిజ్య ఒప్పందంలో చేరవలసిన అవసరాన్ని సమర్థించుకోవడానికి ఆనాడు ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తలు సాధారణంగా పేర్కొంటూ వచ్చిన అభిప్రాయమిది. వ్యవసాయంపై డబ్ల్యూటీఓ ఒప్పందం అనేక అవకాశాలను కల్పించి రైతులకు స్వర్గ ద్వారాలను తెరుస్తుందనేంత విపరీత అభిప్రాయాన్ని కూడా వీరిలో ఒకరు వ్యక్తపరిచారు. వ్యవసాయ ఎగుమతులు పుంజుకోనుండటంతో వ్యవసాయ రాబడులు కూడా పెరుగుతాయని, దీంతో భారతీయ వ్యవసాయ రంగ దశ పూర్తిగా మారిపోతుందని ఇలాంటి వారు ఊదరగొడుతూ వచ్చారు. దీనికి ఎలాంటి ఆధారమూ లేనందున, వాస్తవానికి నేను ఆనాడు రాసిన వ్యాసంలో భారతీయ రైతును యూరోపియన్ ఆవుతో పోల్చి ముగించాను. ప్రపంచ వాణిజ్య సంస్థను ప్రారంభించి దాదాపు 26 ఏళ్లు గడచిన తర్వాత, గ్రామీణ భారతంలోని వ్యవసాయ కుటుంబాల ఆదాయాలపై జాతీయ గణాంకాల సంస్థ (ఎన్ఎస్ఓ) అత్యంత నిరాశా చిత్రణతో కూడిన తాజా నివేదికను గత వారం విడుదల చేసింది. వ్యవసాయ పరిస్థితుల సర్వేపై (ఎస్ఓఎస్) రూపొందించిన ఈ నివేదికను 2018–19 సంవత్సరంలో నిర్వహించారు. భారతీయ రైతు సాధారణ కూలీ కంటే ఘోరమైన పరిస్థితుల్లో చిక్కుకున్నాడనే భయంకర వాస్తవాన్ని ఈ నివేదిక బయటపెట్టింది. 75 ఏళ్ల స్వాతంత్య్రానంతరం కూడా రైతులు పంట సాగు ద్వారా కంటే రోజు కూలీల ద్వారానే ఎక్కువగా ఆర్జిస్తున్నారంటే, వ్యవసాయ రాబడులను ఉద్దేశపూర్వకంగా తగ్గించివేసిన ఆర్థిక నమూనాలకు ఇది పరాకాష్ట. నగరాల్లో జరిగే నిర్మాణ పనులకు కారు చౌక శ్రమ అవసరం కాబట్టి గ్రామీణ ప్రాంతాలనుంచి పట్టణాలకు వలసలను భారీగా ప్రోత్సహించడాన్ని మన విధాన నిర్ణేతలు కొనసాగిస్తూ వచ్చిన ఫలితమే ఇది. చివరిసారిగా వ్యవసాయ పరిస్థితుల సర్వేని 2012–13 సంవత్సరంలో నిర్వహించినప్పుడు, దేశంలోని సగటు వ్యవసాయ కుటుంబం 48 శాతం ఆదాయాన్ని పంట సాగు ద్వారా ఆర్జించేది. 2018–19 సర్వే నాటికి ఇది 38 శాతానికి పడిపోయింది. ఇదే కాలంలో రోజుకూలీ ద్వారా రైతు కుటుంబ ఆదాయం 32 శాతం నుంచి 40 శాతానికి పెరిగింది. సగటు వ్యవసాయ కుటుంబం రోజుకూలీ ద్వారానే ఎక్కువగా సంపాదించడం మొదలైంది. కొన్ని వ్యవసాయ ఖర్చులను ముందుగానే చెల్లించివేయడం ప్రాతిపదికన, సగటు వ్యవసాయ కుటుంబానికి నెలకు రూ. 10,218 రూపాయల ఆదాయం వస్తుందని లెక్కగట్టారు. 2012–13 సంవత్సరంలో రైతుకుటుంబ ఆదాయం నెలకు రూ. 6,426లతో పోలిస్తే, ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేశాక గత పదేళ్లలో పెరిగిన వ్యవసాయ కుటుంబ ఆదాయం 16 శాతం మాత్రమేనని తెలుస్తుంది. 2018–19 సంవత్సరంలో సగటు వ్యవసాయ కుటుంబ ఆదాయం నెలకు రూ. 8,337లకు చేరుకుంది. రైతు పెట్టే సొంత పెట్టుబడి, వేతనాలు చెల్లించని శ్రమ, సొంత పనిముట్లు, సొంత విత్తనాలు వంటివాటిని ముందుగానే చెల్లించే వ్యవసాయ ఖర్చుల కింద లెక్కగడుతున్నారని గమనించాలి. ఇక పంట సాగు విషయానికి వస్తే సగటు వ్యవసాయ కుటుంబం 2018–19 సంవత్సరంలో రూ. 3,798లను సంపాదించేది. వాస్తవానికి ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేశాక, వ్యవసాయ ఆదాయం 2012– 13 నుంచి 2018–19 మధ్య కాలంలో 8.9 శాతం క్షీణించిపోవడం గమనార్హం. ఒక పత్రిక చేసిన ఆసక్తికరమైన విశ్లేషణ బట్టి పంట సాగు ద్వారా రోజుకు రూ. 27ల రాబడి మాత్రమే రైతుకుటుంబానికి దక్కుతోందని తెలుస్తుంది. జాతీయ ఉపాధి పథకంలో భాగంగా పనిచేసే కూలీ సైతం ఇంతకంటే ఎక్కువగా సంపాదిస్తుంటాడు. నేను చాలా కాలం నుంచి పదే పదే చెబుతున్నట్లుగా, పంట పండిస్తున్నందుకు రైతుపై జరిమానా విధిస్తున్నారని ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. సాగు ద్వారా రైతుకు వస్తున్న ఆదాయం రోజువారీగా ఆవుపాల ద్వారా వచ్చే ఆదాయం కంటే చాలా తక్కువ అని స్పష్టమవుతోంది. వ్యవసాయ రాబడి ఎంత తక్కువగా వస్తే, అంత ఎక్కువగా వివిధ మార్గాల్లో రైతు తీసుకునే అప్పులు పెరిగిపోతుంటాయి. 2012– 13 సంవత్సరంలో రూ. 47 వేలుగా ఉన్న సగటు రైతు కుటుంబం అప్పు 2018–19 నాటికి రూ. 74,100లకు పెరిగిపోయింది. దేశంలోని వ్యవసాయ కుటుంబాల్లో 50.2 శాతం అలివిమాలిన రుణభారంలో చిక్కుకుపోయి ఉన్నారు. 2021 మార్చి చివరినాటికి దేశంలో పేరుకుపోయిన రైతు రుణాల మొత్తం రూ. 16.8 లక్షల కోట్లకు పెరిగిందని పార్లమెంటుకు ప్రభుత్వం వివరించింది. దేశంలో దాదాపు 77 శాతం వ్యవసాయ కుటుంబాలు స్వయం ఉపాధిని ఆధారం చేసుకుంటున్న విషయాన్ని పరిశీలిస్తే, 70.8 శాతం వ్యవసాయ కమతాలు హెక్టారు కంటే తక్కువగా ఉన్నాయన్న వాస్తవం కలవరపెడుతుంది. 9.9 శాతం వ్యవసాయ కమతాలు మాత్రమే ఒకటి నుంచి రెండు హెక్టార్ల పరిమాణంలో ఉంటున్నాయి. వ్యవసాయ ఉత్పత్తి ద్వారా, అనుబంధ పనుల ద్వారా రూ. 4,000 కంటే ఎక్కువ ఆదాయాన్ని సంపాదిస్తూ, సంవత్సరంలో కనీసం ఒక కుటుంబ సభ్యుడు ప్రధానంగా వ్యవసాయ కార్యకలాపాల్లో ఉంటాడన్న అంచనాపైనే వ్యవసాయ కుటుంబాన్ని నిర్వచిస్తున్నాము. గ్రామీణ కుటుంబాల్లో 0.2 శాతం మాత్రమే 10 ఎకరాల కంటే ఎక్కువ భూమిని కలిగి ఉన్నారన్న వాస్తవాన్ని గమనిస్తే రైతు ఆందోళనలు బడా రైతుల ప్రయోజనం కోసమే జరుగుతున్నాయని ఆరోపించడం పచ్చి అబద్ధమేనని తేటతెల్లమవుతుంది. రైతులకు న్యాయమైన ఆదాయాన్ని తిరస్కరించడం అనేది గత కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వాలు వరుసగా అమలు చేస్తూ వచ్చిన రైతు వ్యతిరేక విధానాల ఫలితమే. గ్రామీణ ప్రజలను వ్యవసాయం నుంచి పక్కకు నెట్టడమే వీటి లక్ష్యం. గ్రామీణ ప్రాంతాల నుంచి జనాభాను పెద్ద ఎత్తున పట్టణాలకు తరలించడంపై ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఊదరగొడుతూ చేసిన ప్రచారం సమకాలీన ఆర్థిక చింతనపై తీవ్ర ప్రభావం చూపింది. పట్టణీకరణ దశను పెంచడం అనేది ఆర్థిక వృద్ధిని వేగవంతం చేస్తుందని, వ్యవసాయాన్ని ఉద్దేశపూర్వకంగా క్షీణింపజేస్తూ వస్తే రైతులు తమ భూములు వదులుకుని వలస పోయే పరిస్థితులు ఏర్పడతాయన్నది ఈ ఆర్థిక చింతన సారాంశం. వ్యవసాయ పరిస్థితుల సర్వే 2018–19 పేర్కొన్న వాస్తవాలను కూడా మన ఆర్థికవేత్తలు తమకు అనుకూలంగా మల్చుకుని, పట్టణాలకు వలస ప్రక్రియను మరింత వేగవంతం చేస్తూ విధానాలను మార్పుచేయాలని ప్రతిపాదిస్తే నేనేమాత్రం ఆశ్చర్యపోను. ఈ రైతు వ్యతిరేక విధానాలను పూర్తిగా తిరగతోడాల్సి ఉంది. ప్రతి ఏటా ఆహారధాన్యాల ఉత్పత్తి పెరుగుతూనే ఉంది. కానీ వ్యవసాయ రంగ ఆదాయాలు మాత్రం తగ్గుముఖం పడుతూనే ఉన్నాయి. కేంద్రప్రభుత్వం గత ఏడాది తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణ చట్టాలు వ్యవసాయ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తాయని రైతులు స్పష్టంగానే గ్రహించి జాగరూకతతో ఉన్నారు. రైతులు కోరుతున్నదల్లా ఒకటే... వ్యవసాయ ఆదాయ విధానాల పట్ల పునరాలోచన చేయాలనే. దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయరంగ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com (ది ట్రిబ్యూన్ సౌజన్యంతో...) -
పామాయిల్ సాగుకన్నా ముఖ్యం ఇదీ...
ప్రపంచ వాణిజ్య సంస్థ విధివిధానాలను నెరవేర్చడం కోసం దిగుమతి పన్నులను క్రమానుగతంగా తగ్గించడాన్ని భారత్ మొదలెట్టినప్పుడు ‘ఎల్లో రివల్యూషన్’ (నూనెగింజల ఉత్పత్తి) ద్వారా దేశం సాధించిన ఫలితాలు హరించుకుపోయాయి. వంటనూనెల దిగుమతిపై దేశం 300 శాతం వరకు పన్ను విధించే అవకాశం ఉన్నప్పటికీ ఒకవైపు దిగుమతి లాబీలు, మరోవైపు దేశంలోని ప్రముఖ ఆర్థికవేత్తల ఒత్తిడితో దిగుమతి పన్ను రేట్లను ఒక దశలో జీరోకి తగ్గించేశారు. దీంతో స్వల్ప కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద వంటనూనెల దిగుమతిదారుగా భారత్ మారిపోయింది. పామాయిల్ సాగుకోసం భూమిని అధికంగా కేటాయించడానికి బదులుగా, మనం మర్చిపోయిన ‘నూనెగింజల విప్లవా’న్ని పునరుద్ధరించడం తక్షణావసరంగా ఉంది. కొన్ని రోజుల క్రితం పామాయిల్ని దేశీ యంగా ఉత్పత్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం వంటనూనెలు– ఆయిల్ పామ్‌పై జాతీయ మిషన్ (ఎన్ఎమ్ఈఓ–ఓపీ) కోసం రూ. 11,040 కోట్లకు ఆమోదముద్ర వేసింది. వంట నూనెల దిగుమతిపై అతిగా ఆధారపడటాన్ని తగ్గించుకోవడమే దీని లక్ష్యం. కాయధాన్యాలు, నూనెగింజలకు సంబంధించిన ఉత్పత్తి పరి స్థితులపై చర్చించడానికి ఒక టీవీ ప్యానెల్లో కూర్చున్నాను. ఆ ప్యానెల్లో నీతి ఆయోగ్ సభ్యుడొకరు ముఖ్యమైన సమాచారం తెలిపారు. రాబోయే కొన్నేళ్లలో దేశీయ వంటనూనెల అవసరాల్లో 40 శాతం పైగా పామాయిల్ సాగు ద్వారా పూరించాలన్నదే ఈ పథకం లక్ష్యమట. పర్యావరణ, వాతావరణ కారణాల వల్ల పామాయిల్ ఇప్పటికే ఆరోగ్యపరమైన వివాదంలో చిక్కుకుని ఉన్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వ తాజా పథకం దిగ్భ్రాంతిని కలిగించింది. ఇతర వంటనూనెలతో పోలిస్తే పామాయిల్ ధర తక్కువ కాబట్టి నీతినియమాలు లేని వర్తకులు తరచుగా పామాయిల్ని ఇతర వంటనూనెలతో కల్తీ చేసి ప్రయోజనం పొందుతున్నారు. పైగా స్థానిక ఉత్పత్తి, స్థానిక అవసరాలపై ఆధారపడి దేశంలో అనేకరకాల ఆరోగ్యకరమైన వంటనూనెలు అంటే– ఆవ, పొద్దుతిరుగుడు, వేరుశనగ, నువ్వులు, కుసుమలు, వెర్రి నువ్వులు (ఒడిసలు) వంటి నూనె గింజలపై భారతీయులు సాంప్రదాయకంగా ఆధారపడి ఉన్నారు. అందుకే భారతీయులు పామాయిల్ పట్ల ఏ ఆసక్తీ చూపలేదు. పైగా పామాయిల్ని జంక్ ఫుడ్, ప్రాసెసింగ్ పరిశ్రమ, సౌందర్య ఉత్పత్తులు, షాంపూ, డిటర్జెంట్స్, క్యాండిల్స్, టూత్ పేస్టులు వంటి వేగంగా అమ్ముడయ్యే వినియోగదారీ ఉత్పత్తులలో ఉపయోగించడానికే పరిమితం చేస్తున్నారు. పామాయిల్ దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ప్రతిపాదిం చిన కేంద్ర పథకం గురించి మనం మొదటగా తెలుసుకుందాం. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సమాచారం ప్రకారం 2025–26 నాటికి దేశంలో పది లక్షల హెక్టార్లలో పామాయిల్ తోటల సాగును పెంచాలనీ, 2029–30 నాటికి దీన్ని 16.7 లక్షల హెక్టార్లకు విస్తరించాలని కేంద్ర పథకం లక్ష్యం. ఈ కొత్త పంటలో చాలా భాగాన్ని పర్యావరణపరంగా దుర్బలంగా ఉండే ఈశాన్య భారత్‌లో, అండమాన్, నికోబార్ దీవుల్లో సాగు చేయనున్నారు. పామాయిల్ సాగుకోసం అవసరమైన ఉత్పాదకాలకు రాయితీ కల్పించడతోపాటు, ప్రారంభ సంవత్సరాల్లో ఎరువులపై ఖర్చును నూరుశాతం రీయింబర్స్మెంట్ కూడా ఇవ్వనున్నారు కాబట్టి రైతులు పామాయిల్ సాగుపట్ల తప్పక ఆకర్షితులవుతారు. పైగా ధరల హెచ్చుతగ్గులను అధిగమించడానికి పామాయిల్ సాగుకు గ్యారంటీ ధర చెల్లిస్తామనే హామీని కూడా కేంద్ర పథకం ప్రతిపాదిం చింది. టోకు ధరల సూచీకి అనుగుణంగా గత అయిదేళ్లలో సగటు ముడి పామాయిల్ ధరపై ఆధారపడి పామాయిల్ ధరను నిర్ణయించనున్నారని సమాచారం. ఒకవేళ ప్రాసెసింగ్ పరిశ్రమ పామాయిల్ సాగు రైతులకు ఇచ్చిన హామీమేరకు ధర చెల్లించకపోతే, రెండు శాతం ప్రోత్సాహకాన్ని ప్రభుత్వమే చెల్లించనుంది. భారతదేశం తన వంట నూనెల అవసరాల్లో దాదాపు 55 నుంచి 60 శాతం దిగుమతుల ద్వారా తీర్చుకుంటోంది కానీ, దిగుమతుల చెల్లింపుల అంతరం మొత్తంమీద రూ. 75 వేల కోట్లకు చేరుకుంది. పర్యావరణ వైపరీత్యాలకు ప్రధాన కారణం పెరుగుతున్న అడవుల నిర్మూలన, జీవవైవిధ్య విధ్వంసమేనని వాతావరణ మార్పుపై అంతర్ ప్రభుత్వ ప్యానెల్ (ఐపీసీసీ) పదేపదే హెచ్చరిస్తూ వచ్చింది. సహజ వర్షాటవుల స్థానంలో వైవిధ్య రహితమైన తోటలను సాగుచేసే ప్రయత్నాలు అత్యంత విలువైన జీవజాతులు నశించిపోయేలా చేస్తున్నాయని, కర్బన ఉద్గారాలు పెరిగిపోవడానికి కారణమవుతున్నాయని పలు అధ్యయనాలు చూపించాయి. 2020 జనవరిలో సమర్పించిన ఒక నివేదిక ప్రకారం భారతీయ అటవీ పరిశోధనా, విద్యా మండలి కూడా జీవవైవిధ్య పరంగా మెరుగ్గా ఉన్న ప్రాంతాలను పామాయిల్ తోటల సాగుకు అప్పగించడంపై తీవ్రంగా హెచ్చరించింది. భారీస్థాయిలో పెరిగిపోతున్న దిగుమతుల బిల్లును తగ్గించడానికి దేశీయంగా వంటనూనెల ఉత్పత్తిని పెంచాలనుకోవడంలో ఆర్థికపరంగా ఔచిత్యం ఉన్నప్పటికీ, 1993–94 నాటికే దేశీయ వంటనూనెల అవసరాల్లో 97 శాతాన్ని ఉత్పత్తి చేసి దాదాపుగా స్వయంసమృద్ధిని సాధించిన భారతదేశం... ఇంత తక్కువ కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద వంటనూనెల దిగుమతిదారుగా ఎలా మారిపోయిందన్నది పెద్ద ప్రశ్న. 1985–86లో భారత్ ప్రారంభించిన చమురుగింజల టెక్నాలజీ మిషన్ లక్ష్యం ఏమిటంటే, దేశీయ ప్రాసెసింగ్ ఉత్పత్తిని బలోపేతం చేస్తూనే నూనెగింజల ఉత్పత్తి పెంపుదలపై దృష్టిపెట్టడమే. దీన్నే తదనంతరం ‘ఎల్లో రివల్యూషన్’ అని ప్రశంసించారు. వ్యవసాయంపై డబ్ల్యూటీఓ ఒడంబడిక ప్రకారం భారతదేశం సోయాబీన్ మినహా ఇతర వంటనూనెలపై 300 శాతం వరకు దిగుమతి పన్నులు విధించవచ్చు. వంటనూనెల దిగుమతిపై దేశం ఇంత అత్యధిక శాతం పన్ను విధించే అవకాశం ఉన్నప్పటికీ ఒకవైపు దిగుమతి లాబీలు, మరోవైపు దేశంలోని ప్రముఖ ఆర్థికవేత్తల ఒత్తిడి కారణంగా ఎగుమతి పన్ను రేట్లను తగ్గించేశారు. ఇది ఏ స్థాయికి చేరుకుం దంటే ఒక దశలో దిగుమతి పన్నులు దాదాపుగా జీరోకి చేరుకున్నాయి. దీంతో చౌక నూనె దిగుమతుల వెల్లువ మొదలై దేశీయ నూనెగింజల సాగుదారులు రంగం నుంచే తప్పుకోవలసివచ్చింది. దేశీయ వంటనూనె ఉత్పత్తిని ప్రోత్సహించే ఉత్తమ మార్గం ఏదంటే, ఎల్లో రివల్యూషన్ ఎక్కడ తన ప్రభను కోల్పోయిందో గ్రహించి, నూనె గింజల ఉత్పత్తిని తిరిగి పెంచడంపై దృష్టి పెట్టడమే. ప్రభుత్వం దేశంలోని పామాయిల్ సాగుదారులకు గ్యారంటీ ధర కల్పించాలని భావిస్తున్నట్లయితే, నూనె గింజల సాగుదారుల్లో చాలామంది చిన్న రైతులే కాబట్టి, వీరికి గ్యారంటీ ధరకు హామీని కల్పించకపోవడంలో ఎలాంటి హేతువును నేను చూడటం లేదు. ఆర్థిక నిచ్చెనలో రైతులు అత్యంత దిగువన ఉంటున్నారన్న వాస్తవాన్ని గుర్తించి గ్యారంటీ ధర, మార్కెటింగ్ వ్యవస్థ కల్పనతో నూనె గింజల సాగుకు తిరిగి ప్రాణం పోయాలి. ఇది ఆర్థికంగా చెల్లుబాటు కాగల ప్రత్యామ్నాయంగా మారితే అధిక నీటిని ఉపయోగించి వరి సాగు చేసే పంజాబ్ రైతులు కూడా తమ ప్రాధాన్యతను మార్పు చేసుకుంటారు. పైగా ఆబ్సెంటీ భూస్వాములకు, కొద్దిమంది పారిశ్రామిక దిగ్గజాలకు మాత్రమే ప్రయోజనం కలిగించే పామాయిల్ సాగుకి కాకుండా, నూనెగింజల సాగును ప్రోత్సహిస్తే అది దేశంలోని కోట్లాది సన్నకారు రైతులకు వ్యవసాయాన్ని లాభదాయకంగా మారుస్తుంది. ఎల్లో రివల్యూషన్ కుప్పగూలిపోయాక దేశంలో నూనె గింజల సాగుదారుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. పైగా నూనెగింజల సాగుకు భూముల విస్తరణ కోసం పెద్ద ఎత్తున సహజ అడవులపై వేటు వేయాల్సిన అవసరం లేదు. దేశంలో భూగర్భజలాలు అడుగంటిపోవడానికి విస్తృతంగా గోధుమ, వరి పంటలను పండించడమే కారణమని నిపుణులు మొత్తుకుంటున్న సమయంలో, నీటిని అధికంగా ఉపయోగించుకునే పామాయిల్ సాగువైపు దేశాన్ని నెట్టడంలో అర్థం లేదు. సగటున ఒక పామ్ చెట్టు రోజుకు 300 లీటర్ల నీటిని పీల్చుకుంటుంది. ఒక హెక్టార్‌లోని పామ్ చెట్ల సంఖ్యను లెక్కించి చూస్తే పామాయిల్ తోటలు నీటిని తోడేస్తాయని చెప్పాలి. కాబట్టే మరో పర్యావరణ సంక్షోభంలో మనం కూరుకుపోవడానికి ముందుగా ఖర్చులు తగ్గించుకునే నిష్పత్తిని సమగ్రంగా అధ్యయనం చేయాల్సి ఉంది. పామాయిల్ సాగుకోసం సాగుభూమి విస్తరణను ప్రతిపాదించడానికి బదులుగా, మనం మర్చిపోయిన నూనెగింజల విప్లవాన్ని పునరుద్ధరించడం తక్షణావసరంగా ఉంది. నూనె గింజల్లో స్వయం సమృద్ధిని సాధించే మార్గం ఇదే. వ్యాసకర్త: దేవీందర్ శర్మ ఆహారం, వ్యవసాయరంగ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
అంతరాల తొలగింపే... అసలు లక్ష్యం
సంపన్న దేశాల్లో రైతాంగ వ్యవసాయాన్ని పారిశ్రామిక వ్యవసాయం విధ్వంసం చేసింది. ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛా మార్కెట్లు వ్యవసాయాన్ని తీవ్ర దుఃస్థితిలోకి నెట్టాయి. ఆ చేదు అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని దేశీయ సంస్కరణలను తిరగ రాసుకోవలసిన అవసరం ఉంది. ప్రజారోగ్యం, విద్య, వ్యవసాయ అభివృద్ధి విషయంలో పెరుగుతున్న అవసరాలను పెంపొందించడమే సంస్కరణల విధి. ‘సంస్కరణల పట్ల ఆనందం వ్యక్తం చేయడానికిది సమయం కాదు. వాటిని మరింత లోతుగా పరిశీలించి ఆలోచించాల్సి ఉంది. 1991లో ఏర్పడిన సంక్షోభం కన్నా మించిన ప్రమాదకర పరిస్థితి దేశాన్ని ఆవరిస్తోంది’ అంటూ నాటి సంస్కరణల్లో ప్రధానభూమిక పోషించిన మన్మోహన్ సింగ్ చేసిన తాజా ప్రకటన సంస్కరణల సమర్థకులకు కనువిప్పు. మూడు దశాబ్దాల క్రితం ప్రారంభమైన ఆర్థిక సంస్కరణల 30వ వార్షికోత్సవ సంబ రాలను జరుపుకుంటూ ఆహా ఓహో అంటూ సంస్కరణల సమర్థకులు చంకలు గుద్దుకుంటున్న వేళ, నాటి సంస్కరణల ప్రధాన కర్త తదనం తరం దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మన్మోహన్ సింగ్ తాజా ప్రకటనలో నాటి సంస్కరణల పట్ల ఆనందంతో గంతులేయాల్సిన సమయం కాదనేశారు. ’సంస్కరణల పట్ల ఆనందం వ్యక్తం చేయడా నికిది సమయం కాదు. వాటిని మరింత లోతుగా పరిశీలించి ఆలోచిం చాల్సి ఉంది. 1991లో ఏర్పడిన సంక్షోభం కంటే మించిన ప్రమాదకర పరిస్థితి దేశాన్ని ఆవరిస్తోంది’ వాతావరణ మార్పుపై అంతర్ ప్రభుత్వాల ప్యానెల్ రూపొం దించిన ఆరవ అంచనా నివేదిక తొలి ఇన్స్టాల్మెంట్కి సంబంధించిన అంతర్జాతీయ అధ్యయనం చేసిన ఒక ప్రకటన మానవజాతి మొత్తా నికి ప్రమాద సంకేతాలను పంపించింది. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అంటోనియో గ్యుటెరెస్ స్పష్టంగా ఈ అంశంపై మాట్లా డుతూ, ’మనముందున్న సాక్ష్యాధారాలను తోసిపుచ్చలేం. గ్రీన్ హౌస్ ఉద్గారాలు మన భూ ఖండాన్ని ఆక్రమించేస్తున్నాయి. దీంతో వందల కోట్ల మంది ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి’ అని ప్రకటిం చారు. అయితే జీడీపీని మాత్రమే అభివృద్ధికి కొలమానంగా భావి స్తున్న నయా ఉదారవాద ఆర్థశాస్త్రం నేపథ్యంలో మన భూ ఖండం వాస్తవంగానే మండిపోతోందని గుర్తించడంలో ఈ నివేదిక విఫల మైంది. లేదా, ప్రపంచ జనాభాలో 1 శాతం సగం ప్రపంచం వెలువ రించే ఉద్గారాలకు రెండు రెట్లకు పైగా ఎలా వెలువరిస్తోందన్న వాస్త వాన్ని ఎవరైనా ఎలా వివరించగలరు? మరొక 20 సంవత్సరాల్లో ప్రపంచ ఉష్ణోగ్రత 1.5 సెంటీగ్రేడ్ డిగ్రీల మేరకు పెరగనుండటాన్ని ఎవరూ కాదనలేరని ఈ నివేదిక హెచ్చరిస్తోంది. ఇప్పటికే 1.1 సెంటీగ్రేడ్ డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగింది. మరొక 0.4 సెంటీగ్రేడ్ డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగేందుకు ఇంకెన్ని సంవత్స రాల సమయం పడుతుందో నాకు తెలీదు. కాకుంటే, పారిశ్రామిక అభివృద్ధి ప్రారంభ సంవత్సరాల్లో మాదిరే ప్రపంచ వాతావరణం వేడెక్కుతోంది. దీన్ని బట్టి చూస్తే ఆర్థిక వృద్ధి నమూనాను రూపొందిం చిన మార్గం మౌలికంగానే లోపభూయిష్టంగా ఉందని తెలుపుతుంది. ప్రపంచ ఆర్థిక వేదికపై ఇంటర్నేషనల్ చారిటీ ఆక్స్‌ఫామ్ వరుసగా నివేదించిన అసమానతలపై నివేదిక మరొక అంతర్జాతీయ అధ్యయనంగా మనముందుకొచ్చింది. సంపన్నులు మరింత సంప న్నులెలా అవుతున్నారో, పేదలు మరింత నిరుపేదలుగా ఎలా మారి పోతున్నారో ఈ నివేదికలు స్పష్టంగా వివరించాయి. మన సంస్కర ణలపై పునరాలోచన తక్షణం అవసరమనేందుకు ఇదొక బలమైన సూచికగా కనబడుతుంది. భారత్‌లో ఒక శాతం మంది చేతుల్లో ఉన్న సంపద, 73 శాతం జనాభా సంపద కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉందన్న వాస్తవం ఒక్కటే... అసమానతలను తీవ్రంగా పెంచివేయ డంలో ఆర్థిక సరళీకరణ పాత్రను అర్థం చేసుకోవచ్చు. ఇటీవలే అంత రిక్ష యాత్ర చేసిన జెఫ్ బెజోస్ రోజుకు 8 బిలియన్ డాలర్లను సంపాదిస్తూ కూడా అమెరికాలో స్టెనోగ్రాఫర్ చెల్లించే పన్ను కంటే తక్కువ పన్నును చెల్లిస్తున్నాడు. సంపన్నులు అపారమైన సంపదను పెంచుకోవడంలో ప్రపంచ ఆర్థిక సరళీకరణల నమూనా ఎలా తోడ్ప డుతుందో ఇది స్పష్టంగా తెలుపుతుంది. భారత్‌లో కూడా ఈజీ మనీ, ఆర్థిక ఉద్దీపనలు స్టాక్ మార్కెట్లోకి వెళ్లిపోయాయి. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కొట్టుమిట్టాడుతున్న సమయంలోనూ స్టాక్ మార్కెట్లు పుంజుకుంటున్నాయంటే ఆశ్చర్యపో వలసింది లేదు. అసమానత్వమే చెడు ఆర్థికవ్యవస్థకు సంకేతం. పబ్లిక్ సిటిజన్ సలహా బృందం మనకు చెప్పినట్లుగా అమెరికాలోని బడా టెక్ కంపెనీల సీఈఓల సామూహిక సంపద 2021లో 651 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ మొత్తాన్ని ఉపయోగించి ఉంటే ప్రపంచ క్షుద్బాధను నిర్మూలించవచ్చు. మలేరియాని మటుమాయం చేయ వచ్చు. ప్రపంచం మొత్తానికి కోవిడ్ వ్యాక్సిన్ షాట్లను వేసి ఉండవచ్చు. అమెరికాలోనే ఇళ్లు లేని నిరాశ్రయుల సమస్యకు ముగింపు పలక వచ్చు. అప్పటికీ ఈ బిలియనర్ల వద్ద ఎంతో డబ్బు మిగిలే ఉంటుంది. భారత్‌లో ఒక శాతం సంపన్నుల వద్ద పోగుపడిన భారీ సంప దలో అతి చిన్న భాగాన్ని ఖర్చు చేయచేయగలిగితే మన దేశ దారి ద్య్రాన్ని నిర్మూలించడానికి, దేశీయ ఆకలి చరిత్రను తుడిచిపెట్టడానికి సరిపోతుంది. ఆర్థికవేత్త సుర్జిత్ భల్లా చెప్పినట్లుగా భారత్‌లో ఒక సంవ త్సరం దారిద్య్రాన్ని పూర్తిగా తొలగించాలంటే 48 వేల కోట్ల రూపా యలు కేటాయిస్తే చాలు. 2020 ప్రపంచ క్షుద్బాధా సూచిలో 107 దేశాల జాబితాలో భారత్ 94వ ర్యాంకులో ఉండటానికి మరో కారణం అవసరం లేదని నాకు అనిపిస్తుంది. అది కూడా మన ఆహార ధాన్యాల నిల్వలు పలు సంవత్సరాల పాటు దేశ అవసరాలకు సరిపోయేంత స్థాయిలో పోగు పడివుండటాన్ని ప్రత్యేకించి పరిశీలించాల్సి ఉంది. వ్యవసాయ దుస్థితి కొనసాగింపు కారణంగానే ఢిల్లీ చుట్టుపట్ల రైతుల తీవ్ర నిరసన చోటుచేసుకుంది. అందుకే మరింత కఠిన సంస్కరణలు చేపట్టడం కాదు. మానవీయ రూపంలో సంస్కరణలను తీసుకు రావటం ఇప్పుడెంతో అవసరం. ముఖ్యంగా ప్రజారోగ్యం, విద్య, వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక వ్యత్యాసాల తగ్గింపు అవసరాలను తీర్చగల సంస్కరణలు కావాలిప్పుడు. ఆరోగ్యకరమైన, గౌరవప్రదమైన జీవితం అనేది ఆరోగ్యకరమైన పర్యావరణంతోపాటు పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది. 2020 పర్యావరణ పనితీరు సూచీ ప్రకారం 180 దేశాల జాబితాలో భారత్ 168వ స్థానంలోకి పడిపోయింది. దీర్ఘకాలిక లక్ష్యాలతో ప్రజారోగ్య పరిరక్షణ, సహజవనరుల పరిరక్షణ, కర్బన ఉద్గారాల తగ్గింపుపై విశేషంగా కృషి చేసిన దేశాలు అత్యధిక ర్యాంకులను సాధించాయని ఈ సూచి తేల్చి చెప్పింది. అయితే సంపన్న దేశాలు ఈ సామాజిక, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలను సాధించాయని చెప్పలేము. ఎందు కంటే పారిశ్రామిక యుగం ప్రారంభమైనప్పటినుంచి 63 శాతం కాలుష్య ఉద్గారాలను 90 కంపెనీలు మాత్రమే సామూహికంగా విడు దల చేశాయి. అంటే భారత ఆర్థికవేత్తలు, విధాన నిర్ణేతలు మరింత నిలకడైన, సమీకృత మార్గంపై కృషి చేయాల్సి ఉందని ఈ వాస్తవం స్పష్టం చేస్తోంది. ఆర్థిక సంస్కరణల అవసరం గురించి గుండెలు బాదుకుంటూ శోకన్నాలు పెడుతున్న వారికి సంస్కరణలు అంటే ప్రైవేటీకరణ అని మాత్రమే అర్థం కావడంతో దేశం మొత్తంగా ఐఎమ్ ఎఫ్ నేతృత్వంలోని అంతర్జాతీయ ఉచ్చులో చిక్కుకుపోయింది. దీనికి బదులుగా, మధ్య, దిగువ తరగతుల్లోని మెజారిటీ జనాభా మరిం తగా సంపాదించేలా మన విధానాలను మార్చాలి. అప్పుడు మాత్రమే భారీ ఎత్తున గ్రామీణ డిమాండును సృష్టించవచ్చు. ’వాషింగ్టన్ సమ్మతి’ అనే స్పష్టమైన డిజైన్‌ను దాటి ముందుకెళ్లేం దుకు ఒక చారిత్రక అవకాశాన్ని భారతీయ విధాన నిర్ణేతలు కోల్పో యారు. అలాగే వ్యవసాయాన్ని రెండో అభివృద్ధి చోదకశక్తిగా పరిగ ణించే తరహా దేశీయ ఆర్థిక సంస్కరణల నమూనాను చేపట్టే అవకాశం కూడా వీరు చేజార్చుకున్నారు. వ్యవసాయం నుంచి రైతాంగాన్ని పక్కకు నెట్టేయడానికి బదులుగా, వ్యవసాయాన్ని ఆర్థికవృద్ధి శక్తికేంద్రంగా మార్చడంపై మనం ఇకనైనా దృష్టి పెట్టాలి. ఈ కీలక మార్పు ఇప్పటికీ సాధ్యమే. సంపన్న దేశాల్లో వ్యవ సాయ రంగాన్ని విధ్వంసం చేసిన పారిశ్రామిక వ్యవసాయం గుణ పాఠాలను, ప్రపంచ వ్యాప్తంగా స్వేచ్ఛా మార్కెట్లు భారీ ఎత్తున సృష్టించిన వ్యవసాయ దుస్థితి నేర్పుతున్న పాఠాలను దృష్టిలో ఉంచు కుని ఆహార వ్యవసాయ వ్యవస్థను సమర్థంగా నిర్వహించగలిగిన స్థితిలోకి రైతులను తీసుకురావాలి. వీరందరికీ నిర్దిష్టధరపై హామీ ఇస్తూ స్థిర ఆదాయాన్ని అందుకునేలా సంస్కరణలను మార్చాల్సి ఉంది. ప్రజారోగ్యం, విద్య, వ్యవసాయ అభివృద్ధి విషయంలో పెరు గుతున్న అవసరాలను పెంపొందించడమే సంస్కరణల విధి. దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు -
జనధనానికి జవాబుదారీ లేదా?
కరోనా వల్ల మధ్యతరగతి మరింత నిరుపేదదైంది. నిరుద్యోగం పెరిగిపోయింది. కానీ, కోటీశ్వరుల సంపద మాత్రం 35 శాతం పెరిగింది. కార్పొరేట్ లాభాలు పెరిగినంత మాత్రాన ధనికుల నుంచి అధికంగా పన్ను వసూళ్ళు ఉంటాయని అనలేం. కోటీశ్వరులకు భారీగా పన్ను రాయితీలు లభిస్తుంటే, మిగతా వర్గాలు మరిన్ని పన్నులు చెల్లిస్తున్నాయి. ఇప్పుడు వీధిలోని సామాన్యుడు సైతం పెట్రోలు, డీజిల్‌పై పన్నుల రూపంలో రూ. 5.70 లక్షల కోట్లు అధికంగా చెల్లించాల్సి వచ్చింది. బ్యాంకులు వ్యవసాయ ఋణాలు మాఫీ చేస్తే గగ్గోలు పెడుతుంటాం. కానీ, కోటీశ్వరులకు లాభం కలిగేలా లక్షల కోట్ల మేర మొండి బకాయిలు మాఫీ చేస్తుంటే మాట్లాడం! ప్రజాధనాన్ని ఇలా చట్టబద్ధంగా కొట్టేస్తుంటే, అనుమతించాల్సిందేనా? కరోనా మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. సామాన్యులు కష్టపడి పొదుపు చేసుకున్న సొమ్ములు కరిగిపోయాయి. మరోపక్క నిరు ద్యోగం పెరిగిపోయింది. కరోనా విస్ఫోటనం మొదలైన తొలి ఏడాదిలోనే అదనంగా 23 కోట్ల మంది నిశ్శబ్దంగా దారిద్య్ర రేఖ దిగు వకు జారిపోయారు. అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం (ఎ.పి.యు.) లోని సుస్థిర ఉపాధి కేంద్రం (సీఎస్ఈ) ఈ లెక్కలు చెప్పింది. ఇదే కరోనా తొలి ఏడాదిలోనే దేశంలో మధ్యతరగతి వర్గంలో 3.2 కోట్ల మంది తగ్గిపోయారని మరో అధ్యయనంలో ప్యూ రీసెర్చ్ సెంటర్ తేల్చింది. కనీవినీ ఎరుగని ఈ మహమ్మారి మన మధ్యతరగతిపైన, నిరుపేదలపైన ఎంత గట్టి దెబ్బకొట్టిందో ఈ రెండు అధ్యయనాలూ కలతపరిచేలా గుర్తుచేస్తున్నాయి. ఇక, ఈ ఏడాది విరుచుకు పడ్డ కరోనా రెండో వేవ్ ఎంత తీవ్రంగా దెబ్బ తీసిందో ఇంకా తెలియరాలేదు. ఎవరిని ఏ మేరకు దెబ్బ తీసిందన్నది పక్కన పెడితే, సమాజంలోని అన్ని వర్గాల ప్రజాలపైనా ప్రభావమైతే పడిందన్నది నిర్వివాదాంశం. గృహస్థులు దాచుకున్న డబ్బులు అనూహ్యంగా తరిగిపోయాయి. నిరుద్యోగం ఆకాశానికి అంటింది. దాంతో, ప్రభుత్వం చివరకు అవసరార్థులైన 80 కోట్ల మందికి నెలకు 5 కిలోల ఉచిత రేషన్ ఇచ్చే పథకాన్ని వచ్చే నవంబర్ దాకా పొడిగించాల్సి వచ్చింది. కానీ, గత ఆర్థిక సంవత్స రంలోనే లిస్టెడ్ కంపెనీల కార్పొరేట్ నికర లాభాలు మాత్రం 57.6 శాతం పైకి ఎగబాకాయి. ఒక వైపు కరోనా దెబ్బతో ఆర్థిక వ్యవస్థ అస్తుబిస్తు అవుతున్న సమయంలోనే, మిగులు ధనాన్ని అందిపుచ్చు కున్న స్టాక్ మార్కెట్లు కూడా పైకి దూసుకుపోయాయి. భారతదేశం లోని కోటీశ్వరుల సంపద ఏకంగా 35 శాతం పెరిగింది. అంబానీ సంపద 8,400 కోట్ల డాలర్లకూ, అదానీ ఐశ్వర్యం 7,800 కోట్ల డాలర్లకూ ఎగబాకాయని బ్లూమ్‌బర్గ్ తేల్చింది. ఒక్క మాటలో– కరోనా వల్ల ధనికుల వద్ద సంపద మరింత పోగుపడితే, పేదసాదలు మరింత నిరుపేదలయ్యారు. ఇంకా లోతు ల్లోకి వెళితే– కార్పొరేట్ లాభాలు పెరిగినంత మాత్రాన ధనికుల నుంచి అధికంగా పన్ను వసూళ్ళు ఉంటాయని అనలేం. వాస్తవంలో ధనవంతులకు భారీ పన్ను రాయితీలు, సులభంగా డబ్బు లభిస్తే, దేశంలోని మిగతా వర్గాలు మరిన్ని పన్నులు చెల్లించాల్సి వస్తోంది. కార్పొరేట్ పన్ను వసూళ్ళు గణనీయంగా పడిపోయాయి. గత పదేళ్ళలో ఎన్నడూ లేనంత కనిష్ఠానికి చేరాయి. ఇలా పన్ను వసూలు తగ్గిపోవడం ప్రపంచ వ్యాప్త ధోరణికి తగ్గట్లే ఉంది. 2019 సెప్టెం బర్లో దేశ ఆర్థికశాఖ మంత్రి కార్పొరేట్ పన్ను ప్రాతిపదికను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించారు. అలాగే, నూతన ఉత్పత్తి సంస్థలకేమో 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గించారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ. 1.45 లక్షల కోట్ల మేర ఆదాయం పోతుంది. ఇదే సమయంలో కార్పొరేట్లతో నుంచి సగటు కుటుంబాలకు పన్ను ప్రాతిపదిక ఎలా మారిందో చూద్దాం. 2020 –21లో కార్పొరేట్ పన్నులు, వ్యక్తిగత ఆదాయపు పన్నులతో కూడిన ప్రత్యక్ష పన్ను వసూళ్ళు రూ. 9.45 లక్షల కోట్లు. కానీ, అదే సమయంలో పరోక్ష పన్ను వసూళ్ళు దాన్ని దాటేశాయి. ఏకంగా రూ. 11.37 లక్షల కోట్లకు గరిష్ఠానికి చేరాయి. ఇది కాక, వీధిలోని సామాన్యుడు పెట్రోలు, డీజిలుపై పన్నుల (ఎక్సైజ్, వ్యాట్) రూపంలో రూ. 5.70 లక్షల కోట్లు అధికంగా చెల్లించాల్సి వచ్చింది. అందులో దాదాపు 60 శాతం మేర ఇంధనపు పన్ను కేవలం ద్విచక్ర వాహనదారుల నుంచే వస్తోంది. ఇది కాక, రియల్ ఎస్టేట్ రిజిస్ట్రీ, మద్యంపై ఎక్సైజ్ సుంకంతో పాటు వినియోగదారులు చెల్లించే ఎలక్ట్రిసిటీ డ్యూటీని కలుపుకొని చూడండి. అవన్నీ చూస్తే, చివరకు సామాన్యుడు చెల్లిస్తున్న పరోక్ష పన్నుల వాటా చాలా ఎక్కువ. అంటే, కనీసం ఇప్పుడిక అభివృద్ధికి కేవలం తమ వల్లనే వనరులు సమకూరుతున్నాయని వ్యక్తిగత పన్ను చెల్లింపు దారులు అనలేరు. పన్ను చెల్లింపుదారులు కానివారిది కూడా ఆదాయ సృష్టిలో గణనీయంగా అధిక వాటాయే. చివరకు ప్లాస్టిక్ చెప్పులు వేసుకొనే సాధారణ కూలీ కూడా జి.ఎస్.టి. చెల్లిస్తున్నాడని మర్చి పోకండి. దీన్నిబట్టి ఒక విషయం స్పష్టమవుతోంది. దేశంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకమైన పన్ను కడుతూనే ఉన్నారన్న మాట. గమనిస్తే – దేశం స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో కార్పొరేట్ లాభం వాటా గత పదేళ్ళలో ఎన్నడూ లేనంత గరిష్ఠమైన 2.63 శాతా నికి చేరింది. కానీ, అదే సమయంలో 2020–21లో ఏకంగా రూ. 1.53 లక్షల కోట్ల మేర కార్పొరేట్ మొండి బకాయిలను భారతీయ బ్యాంకులు మాఫీ చేశాయి. బ్యాంకులకున్న ఈ నిరర్థక ఆస్తులు (ఎన్.పి.ఎలు) ఇంకా పెరుగుతాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్ అంచనా. ఇది ఇలా ఉండగా, 2017–18 నుంచి గత నాలుగేళ్ళలో బ్యాంకులు మాఫీ చేసిన మొత్తాలు భారీగా రూ. 6.96 లక్షల కోట్ల మేర ఉన్నాయి. నిజానికి, వ్యవసాయ ఋణాలను మాఫీ చేసినప్పు డల్లా గగ్గోలు పెట్టేస్తుంటారు కానీ, బ్యాంకులు క్రమం తప్పకుండా చేసే ఈ మొండి బకాయిల మాఫీ మాత్రం ఎవరి కంటికీ కనపడదు. ఇది చాలదన్నట్టు, అనేక ఆర్థిక మోసాలలో రూ. 5 లక్షల కోట్ల బ్యాంకు సొమ్ము ఇరుక్కుపోయింది. సమాచార హక్కు చట్టం కింద వచ్చిన జవాబు ఆధారంగా ఇటీవలే ఓ వార్తాపత్రిక తన కథనంలో అదెలా జరిగిందో వెల్లడించింది. ఆ మొత్తంలో 76 శాతం వాటా అగ్రశ్రేణిలో నిలిచిన 50 ఋణ ఖాతాల లావాదేవీలదే! ఇలాంటి దీర్ఘకాలిక ఎగవేతదారులను శిక్షించడం కోసం దివాలా నియమావళి (ఐ.బి.సి)ని తీసుకొచ్చారు. కానీ, దాని వల్ల ఆశించినది జరగడం లేదు. ఇటీవల రెండు దివాలా వ్యవహారాల్లో బ్యాంకులు (లేదా ఋణదాతలు) తామిచ్చిన అప్పులో ఏకంగా 93 నుంచి 96 శాతం మేర మాఫీ చేయాల్సి వచ్చింది. దానిపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. ఒక కేసులో అప్పులలో కూరుకుపోయిన వీడియోకాన్ గ్రూపులోని 13 సంస్థలపై వేదాంత గ్రూపునకు చెందిన ట్విన్ స్టార్ టెక్నాలజీస్ దాదాపుగా ఏమీ చెల్లించకుండానే నియంత్రణ సాధించింది. ఆ కార్యాచరణకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్.సి.ఎల్.టి.) ఆమోదం తెలిపింది. 64 వేల కోట్లకు పైగా మొత్తానికి గాను ఏక మొత్తపు చెల్లింపు పరిష్కారం కింద కేవలం 2 వేల కోట్ల పైన మాత్రమే వేదాంత గ్రూపు చెల్లించింది. మొత్తం సొమ్ములో అది కేవలం 4.15 శాతం. మరోమాటలో చెప్పాలంటే, బ్యాంకులతో సహా ఋణదాతలు మిగతా 95.85 శాతం బకాయిని మాఫీ చేయడానికి ఒప్పుకున్నారన్న మాట. ఇదంతా చూసిన ౖఫైనాన్షియల్ జర్నలిస్టు – రచయిత్రి సుచేలా దలాల్ కడుపు మండి, ‘సామాన్యులు ఒక్కసారి సైకిల్ కోసం అప్పు తీసుకొన్నా, బ్యాంకులు ఎలా ప్రవర్తిస్తాయో తెలుసు’ అని వ్యాఖ్యా నించారు. ఇలా అనేక కేసుల్లో బిడ్డర్లు కారుచౌక ఒప్పందాలతో దర్జాగా ముందుకు సాగిపోతున్నారు. బ్యాంకులు, ఇతర ఋణదాత సంస్థలే తరచూ 80– 95 శాతం మేర బకాయిని మాఫీ చేసి, నష్టపోతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే, చట్టబద్ధంగా వాళ్ళు ప్రజాధనాన్ని దోచే స్తున్నారన్న మాట! ఎందుకంటే, బ్యాంకుల్లో ఉండేది ప్రజాధనం. బ్యాంకులు ఇలా ఆర్థిక మోసాలలో ఋణమాఫీ చేశాయంటే ప్రజా ధనం నష్టపోయినట్టే్ట! బహుశా, దీనివల్లే వ్యాపారవేత్త హర్ష్ గోయెం కాకు చీకాకు వచ్చినట్టుంది. ప్రధానమంత్రి కార్యాలయాన్ని ట్యాగ్ చేస్తూ, ‘జనం కష్టపడి సంపాదించిన డబ్బును ఇలా కొందరు చట్ట బద్ధంగా దొంగిలించడం అనుమతించకూడదు’ అంటూ ఆయన ఏకంగా ఓ ట్వీట్ చేశారు. అవును... జరుగుతున్న కథ చూసి, విషయం గ్రహిస్తే– ఎవరైనా ఆ మాటే అంటారు! వ్యాసకర్త ఆహార, వ్యవసాయరంగ నిపుణులు దేవిందర్ శర్మ ఈ–మెయిల్ : hunger55@gmail.com -
ధనికులు, పేదల మధ్య ఇంత అగాధమా?
మహమ్మారి కాలంలో భారతీయ బిలియనీర్ల సంపద 35 శాతం మేరకు పెరిగింది. భారత్‌లోని కేవలం 11 మంది అగ్రశ్రేణి బిలియనీర్ల పెరిగిన సంపదతో జాతీయ ఉపాధి పథకాన్ని పదేళ్ల పాటు కొనసాగించవచ్చు అని ఆక్స్‌ఫామ్ నివేదిక సూచించింది. దేశంలోని ఒక్క శాతం అగ్రశ్రేణి సంపన్నుల సంపద పది కోట్లమంది నిరుపేదల సంపదకు నాలుగురెట్లు ఎక్కువగా ఉందని అంచనా. ఆర్థిక వృద్ధి నమూనాలు బలిసిన వారిని మరింత బలిసేలా అమలవుతున్నాయి. అదే సమయంలో నిరుపేదలు నిత్యం తమను తాము కాచుకునే దుస్థితిలోకి దిగజారిపోతున్నారు. అంతిమంగా చెప్పాలంటే, అభివృద్ధి అనే భావన ప్రధానంగా పేదలను పరిగణనలోకి తీసుకోవాలి. ఆదాయపరమైన అసమానతల తొలగింపునకు అదే అసలైన పరిష్కారం. కరోనా మహమ్మారి తొలి వేవ్ దేశదేశాలను లాక్డౌన్ బారిన పడవేసినప్పటి నుంచి ప్రధానంగా సంపన్నదేశాలకు చెందిన కేంద్ర బ్యాంకులు 9 లక్షల కోట్ల డాలర్ల మేరకు అదనపు డబ్బును ముద్రించాయి. దీంతో ఆయా ఆర్థిక వ్యవస్థలు కాస్తా ఊపిరి పీల్చుకున్నాయనే చెప్పాలి. ఆర్థికవేత్త, మోర్గాన్ స్టాన్లీ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ చీఫ్ గ్లోబల్ స్ట్రాటజిస్ట్ రుచిర్ శర్మ ప్రకారం, ఈ మహమ్మారి సంపన్నుల సంపదను మరింత పెంచే ఉద్దీపన శక్తిగా మారిపోయింది. ఆయా ప్రభుత్వాలు ప్రకటిం చిన ఉద్దీపన ప్యాకేజీల్లో అధిక భాగం ఆర్థిక మార్కెట్లలోకి ప్రవేశించాయి. అక్కడి నుంచి నయా సంపన్నుల నికర సంపదగా మారిపోయాయని రుచిర్ మే 16న ఫైనాన్షియల్ టైమ్స్‌లో రాశారు. మహమ్మారి తొలి వేవ్ కాలంలోనే అతి సంపన్నుల మొత్తం సంపద 5 లక్షల కోట్ల డాలర్ల నుంచి 13 లక్షల కోట్ల డాలర్లకు అమాంతంగా పెరిగిపోయింది. అంటే దేశాలు ఆర్థికవ్యవస్థను సంక్షోభం నుంచి బయటపడేయడానికి మల్లగుల్లాలు పడుతున్న సమయంలోనే మార్కెట్లు ధనరాసులను తరిలించుకుపోయాయంటే ఆశ్చర్యపడాల్సింది లేదు. విచారకరమైన విషయం ఏమిటంటే ప్రజల చేతుల్లోని సంపద పరోక్షంగా నయా సంపన్నుల జేబుల్లోకి సునాయాసంగా తరలిపోవడమే. బ్రూక్సింగ్స్ సంస్థ చేసిన మదింపు ప్రకారం 2020 సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా 14 కోట్ల 40 లక్షల మంది దారిద్య్ర రేఖ దిగువకు నెట్టబడ్డారని తెలిసినప్పుడే ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ గణాంకాల ప్రకారం చూస్తే అత్యంత దారిద్య్రంలో కూరుకుపోయిన అత్యధిక జనాభా విషయంలో భారత్ ఇప్పుడు నైజీరియానే అధిగమించింది. భారత్‌లో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న భారీ జనసంఖ్యకు ఇప్పుడు మరో 8 కోట్ల 50 లక్షల మంది జతకావడం విశేషం. కోవిడ్–19 సెకండ్ వేవ్ సృష్టిస్తున్న విధ్వంసం ఫలితంగా మరింత జనాభా దారిద్య్ర రేఖ కిందికి దిగజారిపోవడం ఖాయమనిపిస్తుంది. అయితే మనం గుర్తించకపోయిన విషయం ఏమిటంటే.. ప్రపంచం నుంచి కటిక దారిద్య్రాన్ని నిర్మూలించడానికి కేవలం 100 బిలియన్ల అమెరికన్ డాలర్లు వెచ్చిస్తే సరిపోతుంది. మహమ్మారి కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలో ఇది అత్యంత చిన్న భాగం మాత్రమే. సంపన్నుల చేతిలో మరింత సంపద పోగుపడేలా చేయడానికి ఆర్థిక వ్యవస్థలు చేసిన ప్రయత్నంలో దారిద్య్ర నిర్మూలన అనే అంశం గాలికెగిరిపోయింది. దారిద్య్రం నిర్మూలనకు తగినంత డబ్బు కేటాయించడంలో ప్రపంచం వెనుకబడి ఉంటున్న సమయంలోనే ప్రపంచ బిలియనీర్ల వద్ద సంపద మరింతగా ఎలా పోగుపడుతోందన్నది అర్థం కావడం లేదు. ఉద్దీపన ప్యాకేజీల్లో అతి చిన్న భాగాన్ని దారిద్య్ర నిర్మూలన కోసం వెచ్చించి ఉంటే, ఈ ప్రపంచం మరింత నివాస యోగ్యంగా ఉండేది. ఈలోగా, కరోనా మహమ్మారి ఆదాయ అసమానత్వాన్ని కనీవినీ ఎరుగని పరాకాష్ట స్థితికి తీసుకుపోయింది. అమెరికాలోని బిలియనీర్ల సంపద కరోనా కాలంలో 44.6 శాతానికి పెరిగిపోయిందని ఇన్స్టిట్యూట్ ఫర్ పాలసీ స్టడీ పేర్కొంది. ఇదే కాలంలో అమెరికాలో 8 కోట్లమంది ప్రజలు తమ ఉద్యోగాలు కోల్పోయారు. అమెరికాలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న 16 కోట్ల మంది సంపదతో పోలిస్తే 50 మంది అగ్రశ్రేణి సంపన్నుల సంపద అధికంగా ఉందని ఈ అధ్యయనం తేల్చి చెప్పింది. ఇక భారత్ విషయానికి వస్తే ఆదాయాల మధ్య అసమానత ఏమంత తక్కువగా లేదు. 2013 నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీసు (ఎన్ఎస్ఎస్ఓ) నివేదిక ప్రకారం సగటు వ్యవసాయ కుటుంబం ఆదాయాన్ని పరిశీలిస్తే, సగటున నెలకు రూ. 6,426లు మాత్రమే ఉంటోందని తెలుస్తుంది. అందుకనే సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులు తమ పంటలకు గ్యారంటీ ఆదాయాన్ని కల్పించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. ఆక్స్‌ఫామ్ ఇనీక్వాలిటీ వైరస్ రిపోర్ట్‌తో దీన్ని పోల్చి చూడండి. మహమ్మారి కాలంలో భారతీయ బిలియనీర్ల సంపద 35 శాతం మేరకు పెరిగింది. భారత్‌లోని కేవలం 11 మంది అగ్రశ్రేణి బిలియనీర్ల పెరిగిన సంపదతో జాతీయ ఉపాధి పథకాన్ని పదేళ్ల పాటు కొనసాగించవచ్చు అని ఆక్స్‌ఫామ్ నివేదిక సూచించింది. దేశంలోని ఒక్క శాతం అగ్రశ్రేణి సంపన్నుల సంపద దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పది కోట్లమంది సంపదకు నాలుగురెట్లు ఎక్కువగా ఉందని అంచనా.పెరిగిన ఈ సంపద పేదల జీవితాల్లో ఎలాంటి అద్భుతాలు సృష్టించగలదో అర్థం చేసుకోవడానికి, సార్వత్రిక ప్రాథమిక ఆదాయంపై ప్రయోగ ఫలితం కేసి చూడాల్సి ఉంటుంది. కరోనా మహమ్మారి విరుచుకుపడటానికి రెండేళ్లకుముందు అంటే 2018 ప్రారంభంలో కెనడాలో ఫౌండేషన్ ఫర్ సోషల్ చేంజ్ చారిటబుల్ సంస్థ, యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియాతో కలిసి వాంకోవర్ ప్రాంతంలోని నివాసాలు లేని 50 కుటుంబాలకు 7,500 కెనడియన్ డాలర్లను (6,206 అమెరిన్ డాలర్లు) ఇచ్చాయి. ఏడాది తర్వాత ఈ డబ్బు ఎలా ఉపయోగపడింది అనే అంశంపై చారిటీ సంస్థ జరిపిన పరిశీలనలో అద్భుత ఫలితాలు కనిపించాయి. పైగా ఇలా నగదు సరఫరా అనేది ఎంతో ప్రోత్సాహకరమైన ఫలితాలను ఇచ్చింది. నిరుపేదలకు డబ్బుతో ఎలా వ్యవహరించాలో తెలీదంటూ సమాజంలో ఉండే సాధారణ అభిప్రాయానికి భిన్నంగా, తమకు అందిన పరిమితమైన ఆర్థిక సహాయాన్ని కూడా వారు ఎంతో తెలివిగా ఉపయోగించుకున్నారని ఈ అధ్యయన ఫలితాలు స్పష్టంగా వెల్లడిం చాయి. ప్రధానంగా ఆ కాస్త మొత్తాన్ని వారు ఆహారం, దుస్తులు, ఇంటి నిర్వహణ వంటి అవసరాలకు మాత్రమే తెలివిగా ఖర్చుపెట్టారు. వార్తా నివేదికల ప్రకారం ప్రాథమిక ఆహారంపై వినియోగం 37 శాతం పెరిగిందని తెలుస్తోంది. అదే సమయంలో నిరుపేదలు డ్రగ్స్, ఆల్కహాల్‌పై పెట్టే ఖర్చును గణనీయంగా తగ్గించుకున్నారు. అంతవరకు నివాస స్థలం లేకుండా గడిపిన వీరు తాము ఉండటానికి ఒక గూడుకోసం ప్రయత్నించి పక్కా ఇళ్లను సంపాదించుకోవడంపై పని చేశారు. ఈ అధ్యయనం ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా నిరుపేదలకు రోటీ, కపడా, మకాన్ ఎంతో ప్రాధాన్యత కల అంశాలుగా ఉంటున్నాయని స్పష్టంగా అర్థమవుతుంది. మరో మాటలో చెప్పాలంటే ఇలాంటి చిన్న మొత్తాలతో నగదును బదలాయించడం అనేది దారిద్య్రం కోరలనుంచి పేదలను గణనీయంగా బయట పడేస్తుంది. నిరుపేదల జీవితాల్లో వెలుగును తీసుకొచ్చే ఈ విశిష్ట ప్రక్రియను అమలు చేయడానికి బదులుగా... ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలు, పన్ను రాయితీలు, బ్యాంక్ బకాయిల రద్దు, బెయిలవుట్లు, కార్పొరేట్ ప్రోత్సాహకాల పేరిట భారీ స్థాయిలో సంస్థలకు సబ్సిడీలను అందించడం రూపంలో మరింత డబ్బును సంపన్నుల జేబుల్లోకి చేరే తరహా విధానాల కొనసాగింపును మనం చూస్తూ వస్తున్నాం. పేదలకు వారి వాటా వారికిచ్చే విషయం చర్చకు వచ్చినప్పుడల్లా, ఒక విచిత్రమైన వాదనను మన ఆర్థిక పండితులు తీసుకొస్తుంటారు. అదనపు డబ్బును నేరుగా పేదలకు బదలాయిస్తే సమాజంలోని ప్రతిఒక్కరూ ఖర్చుపెట్టడం అలవాటు చేసుకుని మరింత ద్రవ్యోల్బణం పెరగడానికి కారకులవుతారని మేధావుల ఉవాచ. ఈ వాదనకు అనుగుణంగానే ఆర్థిక వృద్ధి నమూనాలు చాలా తెలివిగా సమాజంలో ఆదాయాల మధ్య అసమానతకు మరింత తోడ్పడేలా పథకాలను రూపొందిస్తూ వస్తున్నాయి. అంటే బలిసిన వారిని మరింత బలిసేలా ఈ విధానాలు అమలవుతున్నాయి. అదే సమయంలో నిరుపేదలు నిత్యం తమను తాము కాచుకునే దుస్థితి లోకి దిగజారిపోతున్నారు. అంతిమంగా చెప్పాలంటే, అభివృద్ధి అనే భావన ప్రధానంగా పేదలను పరిగణనలోకి తీసుకోవాలి. ఆదాయపరమైన అసమానతల తొలగింపునకు అదే అసలైన పరిష్కారం. వ్యాసకర్త: దేవీందర్ శర్మ ఆహారం, వ్యవసాయరంగ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
ప్రజారోగ్య విధ్వంసం... కారకులెవరు?
మన ప్రధాన ఆర్థిక వేత్తలు పాశ్చాత్య దేశాల్లోని ఉత్తమ విధానాలను కాపీ కొట్టి సత్వరం సొంతం చేసుకునేందుకే అలవాటు పడిపోయారు తప్పితే దేశానికి ఏది నిజంగా అవసరమైంది అనే ప్రాథమిక సమాచారాన్ని కనుగొనడానికి ప్రయత్నించలేదు. దేనికైనా సరే విదేశాలకేసి చూడటమే సులభమని భావిస్తూ వచ్చారు. ఆరోగ్యం, విద్య, ఆహారం, వ్యవసాయం వంటి సామాజిక రంగాలపై పెడుతున్న వ్యయాన్ని కుదించాలని పిలుపునిచ్చే వారిదే పైచేయి కావడంతో దేశంలో ప్రైవేటీకరణ తృష్ణ పెరుగుతూ పోయింది. ప్రజారోగ్య మౌలిక వ్యవస్థలో మన వైఫల్యాలను కరోనా సెకండ్ వేవ్ స్పష్టంగా ఎత్తి చూపింది. భారత్ వంటి దేశాలకు ఎలాంటి ఆర్థిక విధానాలు అవసరం అనే అంశంపై ఇప్పుడే పెద్ద ఎత్తున చర్చ జరగాలి. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ ప్రభుత్వ ఆసుపత్రిలో పలువురు రోగులు తమ మడతమంచాలను తామే తెచ్చుకున్నారని, అనేకమంది నేలపై బెడ్ షీట్లు వేసుకుని పడుకున్నారని ఒక జాతీయ పత్రిక నివేదించింది. ఇక పాట్నాలోని రెండు ప్రభుత్వ ఆసుపత్రులలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఈ ఆసుపత్రుల్లో చేరాలంటేనే ప్రజలు తిరస్కరిస్తున్నారని, ఇంట్లోనే ఉండి చికిత్స చేయించుకోవడానికే వీరు ప్రాధాన్యమిస్తున్నారని, దేవుడు కరుణించకపోతే ఇంటిలోనే చావాలని కోరుకుంటున్నారని ఒక ప్రముఖ ఆంగ్ల వెబ్ సైట్ పేర్కొంది. ఈ రెండు వార్తా నివేదికలు మన గ్రామీణ ఆరోగ్య సంరక్షణ మౌలిక వసతుల కల్పన ఎంత దిగజారిపోయిందో తేల్చి చెబుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వైరస్ ఎంత తీవ్రంగా చొచ్చుకుపోయింది అనే వాస్తవాన్ని ఈ రెండు వార్తా కథనాలు స్పష్టం చేశాయి. గ్రామీణ ఆరోగ్య సంరక్షణ మౌలిక వసతుల కల్పన ఎంతగా మట్టిగొట్టుకుపోయింది అనే విషయం అర్థమవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణను మెరుగుపర్చి ఉంటే ప్రస్తుతం కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం సాపేక్షంగా సులభతరమై ఉండేది. దేశంలో ఎంత దుర్భర పరిస్థితులు నెలకొని ఉన్నాయో చెప్పడానికి పంజాబ్‌లోని అబోహర్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గంలో 68 గ్రామాలకు కలిపి ఒకే ఒక ఆసుపత్రి ఉన్న వైనాన్ని గుర్తించాలి. ఈ ఆసుపత్రిలోనూ ఒక్కటంటే ఒక్క ఆక్సిజన్ పడక లేదు. దేశంలోని ఇతర గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి, పట్టణ ప్రాంతాల్లో సెకండ్ వేవ్ విరుచుకుపడటానికి ముందుగా, ప్రభుత్వ గ్రామీణ ఆరోగ్య వ్యవస్థ దాదాపుగా కుప్పగూలిపోయిన స్థితిలో ఉంది. కానీ ఈ పరిస్థితి మనపై పెద్దగా ప్రభావితం చూపదు కాబట్టి దాన్ని నిర్లక్ష్యం చేశాం. గ్రామీణ కుటుంబంలో ఒక వ్యక్తి తీవ్ర అనారోగ్యం పాలైతే ఆ కుటుంబం మొత్తంగా దారిద్య్ర రేఖ దిగువకు పడిపోతుందని అనేక అధ్యయనాలు మనకు చూపించాయి. వైద్య బిల్లులు చెల్లించాలంటే వీరు తరచుగా రుణాలు తీసుకోవలసి ఉంటుంది. దీంతో వారు మరింత అప్పుల ఊబిలోకి కూరుకుపోతారు. వైద్య చికిత్స కోసం గ్రామీణ ప్రాంతాల్లోని జనాభాలో 74 శాతం మంది ప్రైవేట్ రంగంపైనే ఆధారపడుతున్నారు. దీంతో ప్రజారోగ్య సంరక్షణ పేదలకు అందుబాటులో లేకుండా పోయింది. కోవిడ్–19 మహమ్మారి విరుచుకుపడటంతో నగరాల్లోని ఆసుపత్రులలో ఆక్సిజన్, ఔషధాలు, పడకలు నిండుకున్నాయి. దీంతో రోగుల బంధువులు, స్నేహితులు సహాయం కోసం సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు. మన నగరాల్లోనూ ప్రజారోగ్య సంరక్షణ కుప్పగూలిపోవడానికి సిద్ధంగా ఉందని కాస్త ఆలస్యంగానైనా సరే ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. ఇప్పటికే చాలా ఆసుపత్రుల్లో పడకలు అందుబాటులో లేవు. రోగులను వారి బంధువులు ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి ప్రవేశం కోసం తీసుకెళుతున్న దృశ్యాలు కలవరపెడుతున్నాయి. ఇది నగర మధ్యతరగతిని తీవ్రంగా కంపింపజేస్తోంది. విషాదమేమిటంటే నగరాల్లోని చాలా కుటుంబాలు తమ ప్రియతములను ఇప్పటికో కోల్పోయాయి. మీ ఫేస్బుక్ టైమ్‌లైన్‌ని కాస్త తెరిచి చూడండి, ప్రాణాంతక మహమ్మారి బారిన పడి కన్నుమూసిన వారి బంధువులు, స్నేహితులు నివాళి పలుకుతున్న దృశ్యాలు విస్తృతంగా మీకు కనిపిస్తాయి. సకాలంలో ఆసుపత్రిలో ప్రవేశం దొరికి వైద్య సహాయం అంది ఉంటే అనేకమంది ప్రాణాలు నిలిచేవని ఇప్పుడు ప్రజలు గుర్తిస్తున్నారు. కాబట్టే కరోనా సెకండ్ వేవ్‌లో మరణాల సంఖ్య ఇంతగా పెరగడానికి ఆరోగ్య మౌలిక వసతులు తగినంత లేకపోవడమే కారణమని అర్థమవుతోంది. కానీ మనం ఒక విషయంలో స్పష్టతతో ఉండాలి. మనం వ్యవస్థను తప్పుపట్టే ముందు.. ప్రజారోగ్య వ్యవస్థను ప్రైవేటీకరిస్తున్నప్పుడు మనందరం మూగ ప్రేక్షకుల్లా నిలబడి చూస్తుండిపోవడం వాస్తవం కాదా? బడ్జెట్లో ఆరోగ్యం, విద్య, వ్యవసాయంపై ప్రభుత్వ పెట్టుబడులపై తీవ్రంగా కోత విధించేవైపుగా ప్రభుత్వ విధానం కొట్టుకుపోతున్నప్పుడు జాతీయ స్రవంతి ఆర్థికవేత్తలను, మీడియాను ప్రశ్నించడంలో మనం విఫలం కాలేదా? మారిన ప్రభుత్వ విధానం మనల్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనే ఆలోచన మన మనస్సుల్లో ఉంది కాబట్టే నిమ్మళంగా ఉండిపోయాం. మన చుట్టూ మృత్యుదేవత తాండవిస్తున్న దృశ్యాలైనా మనలను మేల్కొల్పుతాయా అంటే హామీ ఇవ్వలేను. కానీ ట్విట్టర్లో ఎవరో ప్రభుత్వ ఆసుపత్రులు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయని నివేదించారు కూడా. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ప్రజారోగ్య వ్యవస్థతో ప్రభుత్వం ఎలా చెలగాటమాడుతూ వచ్చిందో ఇది తేల్చి చెప్పింది. ఆ తర్వాత నీతి ఆయోగ్ సైతం జిల్లా ఆసుపత్రులను ప్రైవేటీకరించాలని, పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం నమూనాలోకి వీటిని తీసుకురావాలని సూచించింది. దేశంలోని అగ్రశ్రేణి ఆసుపత్రులు వైద్య పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్నప్పుడు ఎంతమంది విధాన నిర్ణేతలు, మీడియా వ్యక్తులు, కార్పొరేట్ బడా సంస్థలు అభినందనలు తెలియజేశాయో మర్చిపోవద్దు. పైగా ద్రవ్యలోటును పరిమితుల్లో పెట్టడానికి సామాజిక రంగంపై పెడుతున్న పెట్టుబడులపై కోత విధించాలని కొందరు సుప్రసిద్ధ ఆర్థిక వేత్తలు కూడా సెలవిచ్చారని మనం మర్చిపోరాదు. నిజానికి, పార్లమెంటులో జరిగిన ప్రతి బడ్జెట్ సమావేశమూ ద్రవ్యలోటుపైనే కన్నేసి ఉంచిందని మర్చిపోకూడదు. గత సంవత్సరం అంటే 2020లో నీతి ఆయోగ్ మళ్లీ 250 పేజీల విధాన పత్రంతో ముందుకొచ్చింది. కొత్తగా నెలకొల్పనున్న లేదా ఇప్పటికే కొనసాగుతున్న ప్రైవేట్ వైద్య కళాశాలలను పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా జిల్లా ఆసుపత్రులతో అనుసంధానం చేసే పథకాలను తీసుకురావాలని ఈ పత్రం పేర్కొంది. విదేశాల్లోని ఉత్తమ విధానాలకు అనుగుణంగా ప్రభుత్వ ఆరోగ్య మౌలికవసతుల రంగాన్ని ఎలా ప్రైవేటీకరించాలో తెలిపే మార్గదర్శినిని కూడా నీతి ఆయోగ్ పేర్కొంది. పైగా, కొద్దిమంది ఆరోగ్య కార్యకర్తలు మినహా దేశంలోని ప్రతి ఒక్కరూ వీటిపట్ల కూడా మౌనం వహించారు. ఇదే నిజమైన సమస్య. మన ప్రధాన ఆర్థిక వేత్తలు పాశ్చాత్య దేశాల్లోని ఉత్తమ విధానాలను కాపీ కొట్టి సత్వరం సొంతం చేసుకునేందుకో అలవాటు పడిపోయారు తప్పితే దేశానికి ఏది నిజంగా అవసరమైంది అనే ప్రాథమిక సమాచారాన్ని కనుగొనడానికి వీరు ఏమాత్రం ప్రయత్నించలేదు. దేనికైనా సరే విదేశాలకేసి చూడమే సులభమని వీరు భావిస్తూ వచ్చారు. కానీ ప్రపంచంలోని అత్యంత సమర్థవంతమైనదిగా రేటింగ్ ఉంటున్న బ్రిటన్ లోని పబ్లిక్ సెక్టర్ నేషనల్ హెల్త్ సర్వీస్‌పై వీరు ఎందుకు చూపు సారించరు అని నాకు ఆశ్చర్యమేస్తుంది. ఏదేమైనప్పటికీ ఆరోగ్యం, విద్య, ఆహారం, వ్యవసాయం వంటి సామాజిక రంగాలపై పెడుతున్న వ్యయాన్ని కోసిపడేయాలని పిలుపునిచ్చే ఆర్థిక వేత్తలదే పైచేయి కావడంతో దేశంలో ప్రైవేటీకరణ తృష్ణ పెరుగుతూనే పోయింది. ప్రజారోగ్యానికి డబ్బు తక్కువగా ఉన్నట్లయితే, ఆరోగ్య మౌలిక వ్యవస్థను ఎలా ముందుకు తీసుకుపోగలం? అంతర్జాతీయ సంస్థలు చెప్పిందానికల్లా గుడ్డిగా తలూపుకుంటూ పోదామా? క్రెడిట్ రేటింగ్ సంస్థల ఆదేశాలను మనమెందుకు పాటించాలి? విషాదకరమేమంటే ద్రవ్యలోటును తగ్గించడం అనే మందునే మన కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తూ పోతున్నాయి. మన వైఫల్యాలను కరోనా సెకండ్ వేవ్ స్పష్టంగా ఎత్తి చూపింది. భారత్ వంటి దేశాలకు ఎలాంటి ఆర్థిక విధానాలు అవసరం అనే అంశంపై ఇప్పుడే పెద్ద ఎత్తున చర్చ జరగాలి. ప్రాణాంతక సెకండ్ వేవ్ మనల్ని పునరాలోచనలో పడవేస్తుందని, మన ఆర్థిక విధానాలపై విధాన నిర్ణేతలు పునరాలోచించి ఆత్మనిర్భర్ భారత్ సవాళ్లను ఎదుర్కోగలరని ఆశిద్దాం. దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహారం, వ్యవసాయరంగ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
ఈ అసమానత్వం.. దురాశకు పరాకాష్ట
ప్రజారోగ్యం విషయంలో అధిక లాభాల సాధన కోసం దురాశ అవధులు మీరిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి బదులుగా ప్రపంచ వాణిజ్య సంస్థకి చెందిన వాణిజ్యసంబంధిత మేధో సంపత్తి హక్కుల కింద పేటెంట్ రక్షణ పొందిన అతికొద్ది వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలు యావత్ ప్రపంచాన్ని నిలువుదోపిడీ చేస్తున్నాయి. పేదలంతా కరోనా వైరస్ నుంచి రక్షణ పొందనిదే తాము ఏకాంత దంత శిఖరాలపై సురక్షితంగా ఉండలేమన్న వాస్తవాన్ని సంపన్నులు అర్థం చేసుకోవాలి. కోవిడ్ మహమ్మారి వల్ల ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల 22 వేలమంది చనిపోయారు. మానవ జీవితాలను పణంగా పెట్టి అతికొద్ది కంపెనీలు భారీ లాభాలు ఆర్జించడాన్ని ప్రపంచం ఎలా అనుమతిస్తుందన్నదే ప్రశ్న. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి బదులుగా, ప్రపంచ వాణిజ్య సంస్థ ట్రిప్స్ (టీఆర్‌ఐపీ) ఒప్పందం కింద రోగ భద్రతపై గుత్తాధిపత్యాన్ని ఉపయోగించుకుంటున్న కొద్దిమంది వ్యాక్సిన్ ఉత్పత్తిదారులు యావత్ ప్రపంచాన్ని నిలువుదోపిడీ చేస్తున్నారు. బడా మందుల కంపెనీలు మాత్రమే కాదు.. అభివృద్ధి చెందిన కొన్ని దేశాలు సైతం వ్యాక్సిన్లను దొంగ నిల్వలు పెట్టుకుంటున్నారు. అధికాదాయం కల దేశాల్లో ప్రతి నలుగురిలో ఒకరికి వ్యాక్సిన్ అందిస్తుండగా, స్వల్పాదాయం కల దేశాల్లో ప్రతి 500 మంది ప్రజల్లో ఒకరికి మాత్రమే వ్యాక్సిన్ అందటం అనేది నిజంగానే కలవరపెడుతోంది. దీన్ని బట్టే వ్యాక్సిన్ అసమానత్వం హద్దులు మీరిపోయిందని తెలుస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, పేదదేశాలు ఇప్పటివరకు 0.2 శాతం వ్యాక్సిన్ డోసులను మాత్రమే పొందగా, ధనిక దేశాలు 87 శాతం వ్యాక్సిన్ డోసులను పొందగలిగాయి. ఇక డోసుల విషయానికి వస్తే అమెరికాలో 32 శాతం మంది, బ్రిటన్‌లో 27 శాతం మంది, భారత్‌లో 2 శాతం మంది, ఫిలిప్పైన్స్‌లో 0.3 శాతం మంది మాత్రమే వ్యాక్సిన్ రెండు డోసులూ పొందగలిగారు. ఈ నిష్పత్తిలో ప్రపంచం పూర్తిగా కరోనా మహమ్మారి నుంచి బయటపడాలంటే సంవత్సరాల సమయం పట్టేటట్టుంది. పైగా పేదవారికి వైరస్ నుంచి భద్రత కల్పించకుండా ప్రాణాంతక వైరస్ నుంచి తాము సురక్షితంగా ఉండలేమని సంపన్నులు గ్రహించాల్సి ఉంది. పైగా ప్రజారోగ్యం విషయంలో అధిక లాభాల సాధన కోసం దురాశ అవధులు మీరిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి బదులుగా ప్రపంచ వాణిజ్య సంస్థకి చెందిన వాణిజ్య సంబంధిత మేధో సంపత్తి హక్కుల కింద పేటెంట్ రక్షణ పొందిన అతికొద్ది మంది వ్యాక్సిన్ ఉత్పత్తిదారులు యావత్ ప్రపంచాన్ని నిలువుదోపిడీ చేస్తున్నాయి. బడా మందుల కంపెనీలు మాత్రమే కాదు.. అభివృద్ధి చెందిన కొన్ని దేశాలు సైతం వ్యాక్సిన్స్‌లను దొంగ నిల్వ చేస్తూ పేటెంట్ రక్షణను తాత్కాలికంగా అయినా సరే.. తొలగించేటటువంటి ఎలాంటి చర్యనైనా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఒక్క అమెరికానే 6 కోట్ల ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ డోసులను నిల్వ చేసిపెట్టుకుంది. పైగా, అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లను (భారత్‌లో కోవిషీల్డ్ అంటున్నారు) దేశీయంగా వినియోగించడం పట్ల ఆమోదం తెలపలేదు. అలాంటప్పుడు ఈ వ్యాక్సిన్‌ని అమెరికా నిల్వ చేసిపెట్టుకోవడ అర్థంపర్థం లేని విషయమని అర్థమవుతుంది. కోవిడ్–19 వ్యాక్సిన్‌పై పేటెంట్ రక్షణను రద్దు చేయడానికి డబ్లు్యటీఓ అనుమతించాలని కోరుతూ భారత్, దక్షిణాఫ్రికా, తదితర అభివృద్ధి చెందుతున్న దేశాలు దరఖాస్తు చేశాయి కానీ, అమెరికా, ఇంగ్లండ్, ఈయూ, జపాన్, కెనడా, స్విటర్లాండ్, నార్వే, బ్రెజిల్, ఆస్ట్రేలియాతో కూడిన సంపన్న వాణిజ్య మండలి ఇలాంటి ప్రయత్నాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. మేధోసంపత్తి హక్కుల రద్దుపై భారత్, దక్షిణాఫ్రికా సంయుక్తంగా చేసిన ప్రతిపాదనను తిరస్కరించాలని కోరుతూ అమెరికా అధ్యక్షుడికి ప్రపంచ ఔషధ దిగ్గజాలు ఉత్తరం రాశాయి. అవి అమెరికా ప్రభుత్వ యంత్రాంగంపై కూడా ఒత్తిడి తీసుకొచ్చాయి. ఏ కంపెనీకైనా ఒక పేటెంటుపై 20 ఏళ్లపాటు గుత్తాధిపత్యాన్ని ట్రిప్స్ ఒడంబడిక కల్పిస్తోంది. ట్రిప్స్ ఒడంబడికలో అభివృద్ధి చెందుతున్న దేశాలు పేటెంటుపై తప్పనిసరి లైసెన్సు తీసుకునే అవకాశాన్ని కూడా ఒక నిబంధన ద్వారా కల్పించినందువల్ల అత్యవసర పరిస్థితుల్లో స్థానిక ఉత్పత్తి దారులు పేటెంట్ పొందిన ఉత్పత్తిని చేయడానికి ఆయా ప్రభుత్వాలకు అనుమతించినట్లయింది కానీ, పేటెంట్ గుత్తాధిపత్యం గురించి ఆందోళన చెందకుండానే వర్థమాన దేశాలు దీన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉపయోగించుకోవచ్చు కానీ వ్యాపారపరమైన ప్రతీకార దాడికి గురవ్వాల్సి వస్తుందనే భయంతో ఈ అవకాశాన్ని ఎంచుకోవడానికి ఆ దేశాలు సిద్ధపడటం లేదు. చివరకు ఇండియన్ పెటెంట్స్ యాక్ట్‌లోని సెక్షన్ 92ని ఉపయోగించి, పెటెంట్ హక్కు ఉన్న ఔషధాన్ని తయారు చేసేందుకు తప్పనిసరి లైసెన్స్‌ను జారీ చేయవచ్చని సుప్రీంకోర్టు సైతం సూచించినప్పటికీ, ఈ అంశంపై ప్రభుత్వం ముందుకెళ్లలేదు. లాభాన్ని ఆశించని ధర వద్ద భారత్‌కి తన వ్యాక్సిన్ అందిస్తానని ఫైజర్ కంపెనీ తాజాగా ప్రతిపాదించినప్పటికీ పేటెంట్ సమస్యపై అది వెనక్కు తగ్గడం లేదు. వ్యాక్సిన్ సరఫరా చేయాలంటే తనకు సైనిక స్థావరాలను, సార్వభౌమాధికార ఆస్తులను తనఖా పెట్టాలంటూ ఈ ఔషధ కంపెనీ దిగ్గజం కొన్ని లాటిన్ అమెరికన్ దేశాలను కోరిన విషయం ఈ ఫిబ్రవరిలో ఒక టీవీచానెల్‌లో ప్రసారమైంది. ఇప్పటికే ఫైజర్ ఏడు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. అర్జెం టీనా, బ్రెజిల్ దేశాలతో సంప్రదిస్తోంది కూడా. అర్జెంటీనా విషయంలో నైతే, దాని బ్యాంకు రిజర్వులను, సైనిక స్థావరాలను, రాయబార కార్యాలయాలను తనకు అప్పగించాలని ఫైజర్ సంస్థ కోరింది. బ్రెజిల్‌ను కూడా సైనిక స్థావరాలను, సార్వభౌమాధికార ఆస్తులను అప్పగించాలని కోరుతూనే, న్యాయవివాదాల కోసం అయ్యే ఖర్చులను చెల్లించడానికి అంతర్జాతీయ ఫండ్‌ని కూడా ఏర్పర్చాలని ఫైజర్ బ్రెజిల్ ప్రభుత్వాన్ని కోరింది. అయితే ఈ ఒప్పందాలు వెనక్కి పోయాయనుకోండి. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు సరసమైన ధరలకే వ్యాక్సిన్ అందించడానికి తాను నిబద్ధతతో ఉన్నానని ఫైజర్ చైర్మన్ ఆల్బర్ట్ బౌర్లా తెలిపారు. ఇది ఆ కంపెనీ ద్వంద్వ ప్రమాణాన్ని సూచిస్తుంది. పైగా కోవిడ్–19 వ్యాక్సిన్ ఉత్పత్తికి ఫైజర్ తన సొంత నిధులను వెచ్చించలేదు. ప్రజాధనంతో ఈ వ్యాక్సిన్లను రూపొందించారు. ఉదాహరణకు, ఆపరేషన్ రాప్ స్పీడ్ పథకం ద్వారా అమెరికా వివిధ కంపెనీలకు వ్యాక్సిన్ పరిశోధన, తయారీ, సరఫరాల కోసం 12 బిలియన్ డాలర్ల మేరకు ఆర్థిక సహాయం అందించింది. అలాగే లండన్ లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఇంపీరియల్ కాలేజీలకు బ్రిటన్ ప్రభుత్వం 84 మిలియన్ పౌండ్లను అందించింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆ తర్వాత అస్ట్రాజెనెకాతో ప్రపంచ లైసెన్సింగ్ ఒప్పందం కుదుర్చుకుంది. జర్మన్ ప్రభుత్వం ఫైజర్ భాగస్వామి బయోన్టెక్కి 445 మిలి యన్ యూరోలను సహాయంగా అందించింది. ఈ మొత్తం వ్యవహారంపై ప్రముఖ ఆర్థికవేత్త జెఫ్రీ డి సాచ్ కీలక వ్యాఖ్య చేశారు. మోడెర్నా, బయెన్టెక్–ఫైజర్, తదితర కంపెనీల మేధో సంపత్తి ఈ కంపెనీల సృజనాత్మక కృషి ఫలితం కాదని, అమెరికా ప్రభుత్వం, ప్రత్యేకించి జాతీయ ఆరోగ్య సంస్థ నిధులతో కొనసాగుతున్న విద్యా పరిశోధన ఫలితం కాదు. ప్రజాధనంతో, అకడమిక్ సైన్స్ సహా యంతో భారీగా ఉత్పత్తవుతున్న వ్యాక్సిన్లపై ప్రైవేట్ కంపెనీలు విస్తృత హక్కును ప్రకటించుకోవడం గర్హనీయమని వ్యాఖ్యానించారు. అభివృద్ధి చెందిన దేశాలకు వ్యాక్సిన్ టెక్నాలజీని సరఫరా చేసే ఎలాంటి ప్రయత్నాన్నైనా తాను వ్యతిరేకిస్తానంటూ బిల్‌గేట్స్ చేసిన తాజా ప్రకటనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఉత్పత్తిని శరవేగంగా చేయగలిగే శక్తిసామర్థ్యాలు భారత్, కెనడా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ తదితర దేశాలకు చెందిన పలు కంపెనీలకు ఉన్నాయి. మేధోసంపత్తి హక్కు రద్దు ద్వారా జెనెరిక్ మందులను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసి కారుచౌకగా వాటిని అందించవచ్చు. ఈ సంక్లిష్ట సమయంలో ప్రపంచానికి అవసరమైంది ఇదే. కోవిడ్–19 మహమ్మారి వల్ల ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల 22 వేలమంది చనిపోయారన్న విషయం మర్చిపోవద్దు. పేటెంట్ హక్కుపై చర్చ జరుగుతున్నప్పటికీ, మానవ జీవితాలను పణంగా పెట్టి వేళ్లమీద లెక్కించే కంపెనీలు భారీ లాభాలు ఆర్జించడాన్ని ప్రపంచం ఎలా అనుమతిస్తుందన్నదే ప్రశ్న. వ్యాసకర్త: దేవీందర్ శర్మ ఆహారం, వ్యవసాయరంగ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
స్పెయిన్ చెబుతున్న ‘రైతు’ పాఠం
స్పానిష్ రైతులు ఇటీవలికాలంలో నెలలతరబడి కొనసాగించిన నిరసనల ఫలితంగా, రైతులకు అనుకూలంగా స్పెయిన్ ఒక గొప్ప చట్టాన్ని తీసుకువచ్చి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అదేమిటంటే ఉత్పత్తికి అయిన ఖర్చు కంటే ఆహారాన్ని తక్కువ ధరకు అమ్మడాన్ని నిషేధిస్తూ చట్టం తీసుకురావడమే. రైతులకు నష్టం తెప్పించేలా ఆహార ధాన్యాలను తక్కువ ధరకు అమ్మే చిల్లర వ్యాపారులకు, హోల్‌సేల్ విక్రేతలకు జరిమానా విధించడం అనే ఒక చారిత్రక కార్యక్రమానికి స్పెయిన్ నాంది పలికింది. కేంద్రప్రభుత్వ సాగు చట్టాలను రద్దు చేసి కనీస మద్దతు ధరకు చట్టరూపం కల్పించాలని భారత రైతులు పోరాడుతున్న తరుణంలో కనీస మధ్దతు ధరకంటే తక్కువకు అమ్మకుండా స్పెయిన్ తరహా చట్టం నిరోధిస్తుంది. వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర కొనసాగింపు కోసం, సాగు చట్టాల రద్దుకోసం భారతీయ రైతులు గత కొన్ని నెలలుగా చేస్తున్న నిరసనల నేపథ్యంలో రెండు పాత ఘటనలు నాకు గుర్తుకు వస్తున్నాయి. 2018 డిసెంబర్లో మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో ఒక రైతు తాను పండించిన 2,657 కేజీల ఉల్లిపాయలను కిలోకి ఒక్క రూపాయి ధరతో మాత్రమే అమ్మగలిగాడు. ఇలా అమ్మిన మొత్తంలో రవాణా ఖర్చు, కూలీ ఖర్చులు, మార్కెట్ ఫీజులను చెల్లించగా శ్రేయస్ అభాలే అనే ఆ రైతు ఇంటికి ఎంత తీసుకుపోయాడో తెలుసా. రూ. 6లు. కేవలం ఆరు రూపాయలు. రైతులు ఎదుర్కొంటున్న మార్కెట్ల క్రూరత్వానికి అతడు నిరసన తెలుపుతూ, ముఖ్యమంత్రికి ఆరు రూపాయల మనీ ఆర్డర్ పంపాడు. కానీ ఈరోజు వరకు పరిస్థితిలో మార్పు రాలేదు. మరొక ఉదంతం ఐర్లండ్ రైతుకు సంబంధించింది. షాన్ డైవర్ అనే అతను, ఐర్లండ్‌లో ఒక గొర్రెల పెంపకం కేంద్రం మేనేజర్. అతడి వ్యవసాయ క్షేత్రంలో 240 గొర్రెలు ఉంటున్నాయి. గత నెలలో అతడు 455 కేజీల గొర్రెల ఊలును 67 యూరోల ధరతో అమ్మేశాడు. అమ్మిన ధర చీటీని ట్యాగ్ చేస్తూ షాన్ ఆగ్రహంతో ట్వీట్ చేశాడు.. ‘240 గొర్రెలనుంచి తీసిన ఊలు ధర 560 యూరోలు మాత్రమేనా.. ఇది తప్పు. చాలా తీవ్రమైన తప్పిదం’ అని దాని సారాంశం. ప్రపంచవ్యాప్తంగా రైతులు వాస్తవానికి తమ రోజువారీ జీవితాలకు హామీ ఇవ్వలేని నామమాత్రపు రాబడులతో తీవ్రంగా ఘర్షణ పడుతున్నారు. అన్యాయపు ధరలు, మార్కెట్లో తారుమారు చేయడం వంటి పరిణామాలకు బాధితులైన రైతులు ఆహార సరఫరా సంస్థల చేతుల్లో దోపిడీకి గురవుతూ తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. చివరకు అమెరికా జాతీయ రైతుల యూనియన్ సైతం ఈ వాస్తవాన్ని గుర్తిం చింది ‘గత కొన్ని దశాబ్దాలుగా విధాన నిర్ణేతలు అమెరికన్ రైతులకు ధరల మద్దతు వ్యవస్థను బలహీనపరుస్తూ వచ్చారు. అధికోత్పత్తి, తక్కువ ధరలు అనే విషవలయంలో కూరుకుపోయిన లక్షలాది చిన్న, మధ్య తరహా సంస్థలు వ్యాపారం నుంచి వైదొలగాల్సి వచ్చింది’. అందుకే ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) ప్రకారం 20 బడా వ్యవసాయ వాణిజ్య సంస్థలు 2015 నుంచి 2017 మధ్యకాలంలో ప్రతి సంవత్సరం 475 బిలియన్ డాలర్ల మేరకు ప్రత్యక్ష ఆదాయ మద్దతును రైతులకు అందించాయని మీడియా పేర్కొంది. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోయి రైతులు ఎదుర్కొంటున్న నష్టాలను కాస్త తగ్గించడానికి ఇలా ప్రత్యక్ష నగదు మద్దతును అందించారు. అంటే రైతులు పండించిన పంటలకు సరైన ధరను నిర్ణయించడంలో సప్లై డిమాండ్ వర్గీకరణ క్రమం నిజానికి రైతుల మూలాలను పీల్చేసిందని, వారు వట్టిపోయేలా చేసిందని చెప్పడానికి ఇది సూచిక. దశాబ్దాలుగా అనేక దేశాల్లో కొనసాగుతూ వస్తున్న రైతు నిరసనలు వారు పండించిన పంటలకు హామీపూర్వకమైన ధరను అందించాల్సిన అవసరంపైనే దృష్టిపెడుతూ వచ్చాయి. అయితే ఇటీవలే స్పానిష్ రైతులు నెలలతరబడి కొనసాగించిన నిరసనల ఫలితంగా, స్పెయిన్ రైతులకు అనుకూలంగా ఒక గొప్ప చట్టాన్ని తీసుకువచ్చి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. అదేమిటంటే ఉత్పత్తికి అయిన ఖర్చు కంటే ఆహారాన్ని తక్కువ ధరకు అమ్మడాన్ని నిషేధిస్తూ స్పెయిన్ ఒక చట్టం తీసుకొచ్చింది. రైతులు ఎక్కడ ఉన్నా సరిగ్గా దీన్నే కోరుకుంటున్నారు. రైతులకు నష్టం తెప్పించేలా ఆహార ధాన్యాలను తక్కువ ధరకు అమ్మే చిల్లర వ్యాపారులకు, హోల్‌సేల్ విక్రేతలకు జరిమానా విధించడం అనేది ఒక చారిత్రక కార్యక్రమానికి స్పెయిన్ నాంది పలికింది. ఇది ఫుడ్ సప్లయ్ చెయిన్ పద్ధతిని పూర్తిగా మార్చివేయడమే కాదు.. చిన్న తరహా వ్యవసాయాన్ని బలపరుస్తుంది కూడా. స్పెయిన్ తీసుకొచ్చిన రైతు అనుకూల చట్టం తీసుకొచ్చే ప్రతిస్పందనలు ఖండాంతరాల్లో ప్రతిధ్వనిస్తాయి. ఇప్పటికే ఫ్రాన్స్, జర్మనీ దేశాలు ఫుడ్ సప్లయ్ చెయిన్ పని తీరులో జరుగుతున్న లోపాలను అరికట్టేలా చట్టాలను ప్రవేశపెట్టాయి కానీ ఇవి ఏమంత శక్తిమంతమైనవి కాదు. ఉదాహరణకు ఫ్రాన్స్‌లో వాస్తవ ధరకంటే తక్కువ ధరకే వ్యవసాయ ఉత్పత్తులను అమ్మడాన్ని నిషేధిస్తూ 2018లోనే ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. దీని ప్రకారం రిటైల్ ఆహారధాన్యాల ధరను పది శాతానికి పెంచారు కానీ రైతుల ఆదాయం మాత్రం పెరగలేదు. ఫుడ్ సప్లయ్ చెయిన్ విలువను విధ్వంసం చేయడాన్ని నిరోధించడానికి స్పెయిన్ మరికాస్త ముందుకెళ్లింది. తమ ఉత్పత్తి ఖర్చును తమకు అందించేటటువంటి గ్యారంటీ ధరకోసం రైతులు ఎల్లప్పుడూ పోరాడుతూ వచ్చిన డిమాండుకు చట్ట రూపం కల్పించడం ద్వారా స్పెయిన్ ఒక మెట్టు ముందే నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నాయకత్వం సిగ్గుపడి తలదించుకునే గొప్ప నిర్ణయాన్ని స్పెయిన్ తీసుకుంది. ఇంతవరకు రైతులను పణంగా పెట్టి వినియోగదారులను, పరిశ్రమను రక్షించే విధంగా ప్రభుత్వాల చర్యలు ఉండేవి. వినియోగదారులకు, కార్పొరేట్ సంస్థలకు ఇన్నేళ్లుగా రైతులే తమ పంటలను సబ్సిడీ ధరకింద ఇస్తూవచ్చారని అర్థం. అంతవరకు అమలులో ఉన్న 2013 ఆహార సప్లయ్ చెయిన్ చట్టం పనితీరును మెరుగుపర్చేందుకు స్పెయిన్ సవరణలు చేసింది. 2020 ఫిబ్రవరి 27నుంచి ఈ సవరణ చట్టం అమలులోకి వచ్చింది. వ్యవసాయదారుడికి, ప్రాథమిక కొనుగోలుదారుకు మధ్య కుదిరిన ధర.. ఉత్పత్తి వ్యయాలకు అనుగుణంగా ఉండేలా చూడటమే ఈ సవరణ చట్టం లక్ష్యం. ఉత్పత్తి ధరను నిర్ణయించేటప్పుడు, స్పానిష్ చట్టసభ సభ్యులు బహుశా భారతీయ అనుభవం నుంచి నేర్చుకోవచ్చు. కాకపోతే ఉత్పత్తి ధర కంటే తక్కువ ధరకు అమ్ముతూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించేవారికి 3 వేల యూరోల నుంచి లక్ష యూరోల వరకు జరిమానా విధిస్తారు. కొన్ని కేసుల్లో అయితే ఇది పదిలక్షల యూరోలకు పెరగవచ్చు. ఫ్రాన్స్ గతంలోనే దీనికి సంబంధించి 75 వేల యూరోల జరిమానా విధిస్తామని ప్రకటించింది. రైతులకు ఉత్పత్తి ధరను తప్పనిసరిగా అందించాలంటే ఆహార సప్లయ్ చెయిన్ సంస్థలు తమపై పడే అదనపు ఖర్చును వినియోగదారులపై మోపవలసి వస్తుందని జర్మనీ ఆక్స్‌ఫామ్ సంస్థ సీనియర్ పాలసీ సలహాదారు మారిటా విగ్గెర్తేల్ చెప్పారు. ఈ కొత్త చట్టం అమలు ఇప్పుడే మొదలైనందున వినియోగదారు ధరలపై దీని ప్రభావం గురించిన విశ్లేషణలు అందుబాటులో లేవు. సూపర్ మార్కెట్లు ఆహార ఉత్పత్తులపై 30 నుంచి 40 శాతం లాభాన్ని తీసుకోవడం ఆపాలని ఫ్రాన్స్, జర్మనీ దేశాలు గతంలోనే కోరినప్పటికీ అది ఆచరణలోకి రాలేదు. ఈ పరిస్థితుల్లో స్పెయిన్ తీసుకొచ్చిన కొత్త చట్టం భారత్‌కు బ్రహ్మాండంగా వర్తిస్తుంది. కేంద్రప్రభుత్వ సాగు చట్టాలను రద్దు చేసి కనీస మద్దతు ధరకు చట్టరూపం కల్పించాలని భారత రైతులు పోరాడుతున్న తరుణంలో కనీస మద్దతు ధరకంటే తక్కువకు అమ్మకుండా స్పెయిన్ తరహా చట్టం నిరోధిస్తుంది. అంటే ప్రభుత్వమే ఆహార ధాన్యాలను కొనుగోలు చేయాలని అర్థం కాదు. ఇది రైతులకు చెల్లిం చాల్సిన ధరను కాస్త పెంచుతుంది. రైతులనుంచి కొనేటప్పుడు ప్రైవేట్ వర్తకులు న్యాయమైన ధరను వారికి చెల్లించేలా చూడటమే ఈ తరహా చట్టం లక్ష్యం. వాస్తవ ఆహార ధాన్యాల ధరతో రైతుల ఆదాయాలను ముడిపెట్టనంతవరకు వ్యవసాయం లాభదాయక వృత్తిగా మారాలని భావించడం నిష్ఫలమే అవుతుంది. వ్యవసాయంలో ప్రైవేట్ పెట్టుబడులు తీసుకొస్తే రైతుల ఆదాయాలు పెరుగుతాయని ఎవరు గ్యారంటీ ఇస్తారు? అలాగే నియంత్రణ లేని మార్కెట్లు రైతుల ఉత్పత్తులకు మంచి ధరను కల్పిస్తాయనడానికి కూడా వీల్లేదు. ఈ పరిస్థితుల్లో స్పెయిన్ తరహాలోనే కనీస మద్దతుధర కంటే తక్కువ ధర ప్రతిపాదించే వర్తకులపై జరిమానా విధించటం పటిష్టంగా అమలైతే, వ్యవసాయ సంక్షోభాన్ని అధిగమించి ఆర్థికంగా లాభదాయికత వైపు వ్యవసాయాన్ని దీర్ఘకాలంలోనైనా మళ్లించవచ్చు. ఈ దిశగా స్పెయిన్ తీసుకొచ్చిన కొత్త చట్టం కొత్త హామీని ఇస్తోంది. వ్యాసకర్త దేవీందర్ శర్మ , వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ :hunger55@gmail.com -
వ్యవసాయాన్ని వెనక్కినెట్టిన బడ్జెట్
నూతన చట్టాల రద్దును డిమాండ్ చేస్తూ ఢిల్లీ శివార్లలో నిరసన తెలుపుతున్న వేలాదిమంది రైతులకు, దేశ రైతాంగానికి ఈ ఏడు బడ్జెట్ మిశ్రమ సంకేతాలను పంపించింది. ఒకవైపు వ్యవసాయం, సహకారం, రైతుల సంక్షేమానికి పెట్టే వ్యయంపై 2021–22 బడ్జెట్ 8.5 శాతం కోత విధించింది. మరోవైపు ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకంపై ఈ బడ్జెట్లో 13 శాతం కోత విధించారు. రైతులకు నగదు బదిలీ చేసే ఈ పథకానికి గత ఏడాదితో పోలిస్తే 10 వేల కోట్ల రూపాయలను తగ్గించివేశారు. కౌలురైతులు, మహిళారైతులు, ఆదివాసీ రైతులు వంటి భూమి పట్టాలేని వారిని కూడా ఈ పథకంలో చేర్చాలని డిమాండ్ చేస్తుండగా ఉన్న పథకంపైనే కోత వేశారని మహిళా కిసాన్ అధికార్ మంచ్ నాయకురాలు కవితా కురుగంటి వాపోయారు. ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతులు కనీస మద్దతు ధర ద్వారా కనీస రాబడి కోసం ప్రశ్నిస్తున్న తరుణంలో వారి మనోభావాలను గౌరవిస్తూ వ్యవసాయ రాబడులను పెంచడానికి కొన్ని ఏర్పాట్లను 2021–22 బడ్జెట్లో చేరుస్తారని అందరూ భావించారు. పైగా గ్రామీణ కొనుగోలు డిమాండ్‌ను పెంపొందించడానికి తగుచర్యలు తీసుకోవాలని పలువురు ఆర్థికవేత్తలు కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో.. ప్రత్యక్ష నగదు మద్దతు ద్వారా, ఆందోళన చేస్తున్న రైతులు చేతిలో మరింత నగదును అందించడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాస్త ఉదారంగా వ్యవహరిస్తారని భావించారు. దీనికి బదులుగా ఈ సంవత్సరం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద కేటాయింపులను రూ. 75 వేల కోట్లనుంచి 65 వేల కోట్లకు తగ్గించేశారు. ఈ పథకం కింద భూ యజమానులకు సంవత్సరానికి మూడు వాయిదాల్లో రూ.6 వేల నగదును రైతుల ఖాతాలకు బదిలీ చేస్తున్నారు. ఈ పథకంలో ఈ సారి భూమిలేని కౌలు రైతులను కూడా చేరుస్తారని నేను ఆశించాను. గత ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల్లో వ్యవసాయం మాత్రమే దేశానికి వెలుగు చూపినందున ఒక్కొక్క రైతుకు నగదు బదిలీ కింద చెల్లించే మొత్తాన్ని ఈ యేడు రూ.18 వేలకు పెంచుతారని అందరూ భావించారు. దీనికోసం అదనంగా రూ. 1.5 లక్షల కోట్లను బడ్జెట్లో కేటాయించవలసి ఉంటుంది. అయితే వ్యవసాయ రంగానికి ప్రస్తుతం కేటాయించిన బడ్జెట్ దాదాపు గత యేడు బడ్జెట్‌కు సరిసమానంగానే ఉండటం గమనార్హం. గత సంవత్సరం వ్యవసాయరంగానికి సవరించిన అంచనా ప్రకారం రూ. 1.45 లక్షల కోట్లను కేటాయించగా ఈ ఏడు రూ. 1.48 లక్షల కోట్లను కేటాయించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ పరపతి పరిమితిని రూ. 15 లక్షల కోట్లనుంచి రూ. 16.5 లక్షల కోట్లకు పెంచి నప్పటికీ రైతులను రుణ ఊబి నుంచి బయటపడేసేందుకు మరికొన్ని చర్యలు చేపట్టాలని దేశంలో కొనసాగుతున్న వ్యవసాయ దుస్థితి సూచించింది. దీనికి గాను వ్యవసాయంలో ప్రభుత్వ రంగ మదుపులను పెంచాల్సి ఉంది. ఆర్బీఐ లెక్కల ప్రకారం 2011–12 నుంచి 2017–18 మధ్య కాలంలో వ్యవసాయంలో ప్రభుత్వ రంగ మదుపులు మొత్తం బడ్జెట్లో కేవలం 0.4 శాతం మాత్రమే కావడం గమనార్హం. కాబట్టి పెట్రోల్, డీజిల్‌పై సెస్ విధింపు ద్వారా వ్యవసాయ మదుపు నిధిని సృష్టించాలనే ఆర్థిక మంత్రి ప్రతిపాదనను స్వాగతించాల్సిందే కానీ రైలు, రోడ్డు, మూలధన మదుపు వంటివాటిపై చేసే ప్రకటనలకు మల్లే వ్యవసాయ మదుపుపై కూడా నిర్దిష్టమైన ఏర్పాట్లు చేయడం ఉత్తమమార్గంగా ఉంటుంది. వ్యవసాయరంగానికి ఇప్పుడు అత్యంత ప్రాధాన్యమైన విషయం ఏమిటంటే తగిన మార్కెటింగ్ మౌలిక వసతులను ఏర్పర్చడమే. భారత్‌లో వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్ కమిటీలు (ఏపీఎంసీ) క్రమబద్ధీకరించే 7 వేల మండీలు ఉంటున్నాయి. దేశంలో ప్రతి 5 కిలోమీటర్లకు ఒక మండీ చొప్పున ఏర్పర్చాలంటే ఇప్పటికిప్పుడు 42 వేల మండీలు అవసరం అవుతాయి. అయితే 22 వేల గ్రామ సంతలను మెరుగుపర్చి వాటిని ఎలక్ట్రానిక్ జాతీయ వ్యవసాయ మార్కెట్ (ఈ–నామ్)తో అనుసంధానం చేయాలనే ప్రభుత్వ వాగ్దానానికి ఇప్పటివరకు ప్రోత్సాహం లభించలేదని తెలుసుకున్నప్పుడు, గ్రామీణ మార్కెటింగ్ మౌలిక వసతులను ఏర్పాటు ఇక ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయకూడని అంశంగా మనముందుకొస్తోంది. సాగుచట్టాలకు వ్యతిరేకంగా వేలాది మంది రైతులు నిరసన ప్రదర్శనలను నెలల తరబడి కొనసాగిస్తున్న సమయంలో 2021–22 బడ్జెట్ రంగంలోకి వచ్చింది కాబట్టి ఇటీవలి సంవత్సరాల్లో గోధుమ, వరి, కాయధాన్యాలు, పత్తి వంటి పంటలకు కనీస మద్దతు ధర ఎలా అందించాము అనే విషయాన్ని ఆర్థిక మంత్రి బడ్జెట్లో ప్రస్తావిస్తూ లబ్ధిదారుల సంఖ్యను కూడా వెల్లడించారు. అయితే సంపూర్ణంగా సాగు చట్టాలను రద్దు చేయాలని పోరాడుతున్న రైతులు ప్రభుత్వం చెబుతున్న కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేసి తమ హక్కులను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే ప్రతి సంవత్సరం 23 పంట లకు గాను ప్రకటిస్తున్న కనీస మద్దతు ధరకంటే తక్కువ ధరను పెట్టి వ్యాపారం చేయడానికి వీలు ఉండదని దీనర్థం. వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులపై కనీసం 50 శాతం లాభాన్ని కనీస మద్దతు ధర అందిస్తోందని ప్రభుత్వం చెబుతున్న వివరాలను ఢిల్లీ శివార్లలో నిరసన తెలుపుతున్న రైతులు సవాలు చేశారు. స్వామినాథన్ కమిషన్ ప్రతిపాదనల ప్రకారం రైతులు పెట్టే విస్తృత ఖర్చులపై 50 శాతం లాభాన్ని కనీసమద్దతు ధర ఇవ్వాల్సి ఉంటుంది. స్వామినాథన్ కమిషన్ ప్రతిపాదించినట్లుగా రైతులకు కనీస మద్దతు ధర అంది ఉంటే 2020–21 బడ్జెట్లో అదనంగా రూ. 14,296 కోట్ల మేరకు పంజాబ్ రైతులు లబ్ధి పొందేవారు. మొత్తంమీద చూస్తే రైతుల చేతికి మరింత నగదు అందేలా చేస్తేనే ప్రధాని నరేంద్ర మోదీ చెప్పే సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అనేది సాధ్యపడుతుంది. ఇది దానికదేగా మరింత గ్రామీణ డిమాండును సృష్టిస్తుంది. ప్రాణాంతక కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థను ప్రశ్నార్థకం చేస్తున్న సమయంలో, గ్రామీణ డిమాండును సృష్టించి ఉంటే అది మొత్తం ఆర్థిక వ్యవస్థకు వరంలాగా పనిచేయడమే కాకుండా, ఆర్థికాభివృద్ధిని రాకెట్లాగా ముందుకు తీసుకెళ్లేది. ఉజ్వలంగా ప్రకాశించే వ్యవసాయ రంగం భారీ స్థాయిలో వ్యవసాయ అవకాశాలను సృష్టించడమే కాకుండా అనేక మంది జీవితాలను నిలబెట్టి ఉండేది. కాబట్టి ఒక్క వ్యవసాయ రంగమే ఆర్థిక వృద్ధికి సజీవ కేంద్రంగా మారగలిగి ఉండేది. నూతన వ్యవసాయ చట్టాల రద్దును డిమాండ్ చేస్తూ రెండున్నర నెలలకుపైగా ఢిల్లీ శివార్లలో నిరసన తెలుపుతున్న వేలాదిమంది రైతులకు, దేశ రైతాంగానికి ఈ యేడు బడ్జెట్ మిశ్రమ సంకేతాలను పంపించింది. ఒకవైపు వ్యవసాయం, సహకారం, రైతుల సంక్షేమానికి పెట్టే వ్యయంపై 2021–22 బడ్జెట్ 8.5 శాతం కోత విధించింది. మరోవైపు కేంద్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకంపై ఈ బడ్జెట్లో 13 శాతం కోత విధించారు. రైతులకు నగదు బదిలీ చేసే ఈ పథకానికి గత సంవత్సరంతో పోలిస్తే 10 వేల కోట్ల రూపాయలను తగ్గించివేశారు. మరోవైపున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన బడ్జెట్ ప్రసంగంలో రైతులకు కనీస మద్దతు ధరను చెల్లించడంలో తమ ప్రభుత్వం ఘనమైన రికార్డును కలిగి ఉందని నొక్కి చెప్పారు. అలాగే లక్ష కోట్ల మేరకు వ్యవసాయ మౌలిక వసతుల నిధిని ప్రభుత్వ నిర్వహణలోని వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలకు అందిస్తామని మంత్రి తెలిపారు. అయితే ప్రభుత్వ నూతన సాగు చట్టాలు ఇంతవరకు కొనసాగుతున్న మండీల వ్యవస్థను, కనీస మద్దతు రేట్లను కుప్పగూల్చి సన్నకారు రైతులను కార్పొరేట్ సంస్థల దయాదాక్షిణ్యాలకు వదిలేస్తాయని రైతులు భయాందోళనలకు గురైనందువల్లనే సాగు చట్టాల రద్దుకోసం పోరాడుతున్నారనే విషయం మర్చిపోరాదు. అయితే ఇటీవలి సంవత్సరాల్లో బడ్జెట్ ప్రసంగాల మాదిరి కాకుండా తాజా బడ్జెట్ ప్రసంగంలో వ్యవసాయానికి సంబంధించిన ప్రకటనలకు పెద్దగా ప్రాధాన్యత లభించకపోవడం గమనార్హం. సోమవారం బడ్జెట్ ప్రసంగం ప్రారంభించిన గంట తర్వాతే వ్యవసాయరంగానికి కేటాయింపుల గురించి ఆర్థిక మంత్రి తడిమారు. పైగా వ్యవసాయ రంగ విశ్లేషకులను తాజా బడ్జెట్ పెద్దగా ప్రభావితం చేయలేదు. పీఎమ్ ఆషా, ధరల మద్దతు పథకం వంటి పథకాలకు ఈ ఏడు బడ్జెట్లో 20 నుంచి 25 శాతం దాకా కోత విధించారు. రైతులకు ఏటా తలసరి 6 వేల రూపాయలను అందిస్తున్న పీఎమ్ కిసాన్ పథకాన్ని ఈసారి 9 కోట్లమంది రైతులకే పరిమితం చేస్తూ సవరించారు. ప్రభుత్వం వాస్తవానికి 14.5 కోట్ల రైతు కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించుకుంది ఇది కూడా కోత పడటం రైతులు జీర్ణింప చేసుకోలేకున్నారు. కౌలురైతులు, మహిళారైతులు, ఆదివాసీ రైతులు వంటి భూమి పట్టాలేని వారిని కూడా ఈ పథకంలో చేర్చాలని మేం డిమాండ్ చేస్తుండగా ఉన్న పథకంపైనే కోత వేశారని మహిళా కిసాన్ అధికార్ మంచ్ నాయకురాలు కవితా కురుగంటి వాపోయారు. మౌలిక వసతుల నిధి పేరుతో ప్రకటించిన భారీ మొత్తాలు వాస్తవానికి బడ్జెట్ కేటాయింపుల్లో భాగం కాదని వీటిని రుణాల రూపంలో తీసుకోవలసిన ఫైనాన్స్ ప్రాజెక్టులని రైతులకు వీటితో ఒరిగేదేమీ లేదని రైతునేతలు చెబుతున్నారు. ఈ కోణంలో చూస్తే ఈ ఏటి బడ్జెట్ కూడా రైతాంగాన్ని సంతృప్తిపర్చే బడ్జెట్‌గా కనిపించడం లేదనే చెప్పాలి. దేవీందర్ శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com