ప్రొఫెసర్ ఎం.ఎస్. స్వామినాథన్
ఆయనను తరచుగా భారతదేశ హరిత విప్లవ పితామహుడిగా కీర్తిస్తారు. ఘనత వహించిన శాస్త్రవేత్త–వ్యవహర్త అయిన ప్రొఫెసర్ ఎం.ఎస్. స్వామినాథన్‌కు ‘వరల్డ్ ఫుడ్ ప్రైజ్’ తొలి అవార్డు వచ్చినప్పుడు, ఆయన్ని అప్పటి ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ కర్ట్ వాల్డ్‌హీమ్ ఒక లేఖలో ‘లివింగ్ లెజెండ్’ అని ప్రశంసించారు. స్వామినాథన్ మరణంతో ఒక శకం ముగిసింది. ‘ఓడ నుండి నోటికి’ అనే దుర్భర స్థితిలో ఉండిన దేశం ఆయన మార్గదర్శకత్వంలో వ్యవసాయంలో అద్భుతమైన విజయం సాధించింది. హరిత విప్లవ రూపశిల్పి అయినప్పటికీ ఎరువులు అధికంగా వాడితే కలిగే ప్రతికూల పరిణామాలు ఆయనకు తెలుసు. అలాగే రైతు క్షేమాన్నే ఎల్లవేళలా తలిచారు.
‘హరిత విప్లవ చరిత్ర వాస్తవానికి నాటి ప్రధాని ఇందిరా గాంధీతో కలిసి నేను చేసిన అరగంట కారు ప్రయాణంలో లిఖితమైంది,’ అని ఒకసారి స్వామినాథన్ నాతో చెప్పారు. వ్యవసాయ విప్లవానికి మద్దతు ఇవ్వడానికి కావలసిన రాజకీయ సంకల్పాన్ని పొందడం ఎంత కష్టమనే నా ప్రశ్నకు ఆయన జవాబిస్తూ, అప్పటి ప్రధాని ఇందిరా గాంధీతో కలిసి న్యూఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్‌గా పూసా కాంప్లెక్స్‌లో ఒక భవన ప్రారంభోత్సవానికి వెళ్లిన సంగతిని గుర్తు చేసుకున్నారు.
దారిలో ప్రధాని ఆయన్ని అడిగారు: ‘‘స్వామీ, మీరు చెబుతున్న కొత్త గోధుమ పొట్టి వంగడాల రకాలకు నేను అనుమతిస్తాను. కానీ, కొన్నేళ్లలో ఒక కోటి టన్నుల మిగులు గోధుమలు చూపుతానని మీరు నాకు మాటివ్వగలరా? ఈ ‘బ్లడీ అమెరికన్ల’ హింస నాకు తప్పాలి.’’ స్వామినాథన్ మాటిచ్చారు, తర్వాతిదంతా చరిత్ర!
‘ఓడ నుండి నోటికి’ అనే దుర్భర స్థితిలో ఉండిన దేశం అనంతరం వ్యవసాయంలో అద్భుతమైన విజయం సాధించింది. భారతదేశాన్ని స్వయం సమృద్ధ దేశంగానే కాకుండా, నికర ఎగుమతిదారుగా మార్చింది. తగిన విధానాల ద్వారా మద్దతు లభ్యమైన హరిత విప్లవ వీరోచిత గాథ, ప్రధానంగా ఆకలి ఉచ్చు నుండి బయటపడే లక్ష్యంపై దృష్టి పెట్టింది. 1943 బెంగాల్ క్షామం తర్వాత కేవలం నాలుగు సంవత్సరాల లోపే స్వాతంత్య్రం రావడంతో, ఆకలిని అధిగమించే సవాలు అప్పటికి ఎదుర్కోలేదు. దశాబ్దాలుగా, ఉత్తర అమెరికా నుండి పీఎల్–480 పథకం కింద భారత్‌కు ఆహారం వస్తూ ఉండేది.
1970ల మధ్య నాటికి భారతదేశంలోని సగం జనాభా కబేళాలకు దారి తీస్తుందని కొందరు నిపుణులు అంచనా వేశారు. ఆ తర్వాత దేశ క్షుద్బాధపై పోరాడేందుకు స్వామినాథన్ చేసిన తీవ్రాతితీవ్ర ప్రయత్నం, ప్రపంచం వీక్షించిన అత్యంత ముఖ్యమైన ఆర్థిక పరిణామాలలో ఒకటిగా చరిత్రలో నిలిచిపోతుంది. ఇది దేశంలోని కోట్లాది ప్రజల జీవితాలను మార్చడమే కాకుండా, మిగిలిన ప్రపంచానికి కూడా స్ఫూర్తిగా నిలిచింది.
హరిత విప్లవానికి రూపశిల్పిగా ఉన్నప్పటికి కూడా, స్వామినాథన్ కు వ్యవసాయంలో ఎరువులు అధికంగా వాడితే కలిగే ప్రతికూల పరిణామాల గురించి తెలుసు. ఆయన ప్రతి కోణంలోనూ దూరదృష్టి గలవారు. రాబోయే పరాజయం గురించి అనేకసార్లు ముందే హెచ్చరించారు. హరిత విప్లవం ప్రారంభమైన కొన్ని సంవత్సరాల తర్వాత, 1968 లోనే ఆయన ఇలా రాశారు: ‘‘నేల సారాన్ని, నేల నిర్మాణాన్ని పరిరక్షించకుండా భూమిపై తీవ్ర ఒత్తిడి కలిగించే సేద్యం చేయడం అంతిమంగా ఎడారుల పుట్టుకకు దారి తీస్తుంది.
పురుగు మందులు, శిలీంద్ర (ఫంగస్) సంహారిణులు, కలుపు సంహారకాలను విచక్షణారహితంగా ఉపయోగించడం వలన ధాన్యాలు లేదా ఇతర తినదగిన భాగాలలో చేరే విషపూరిత అవశేషాల వల్ల క్యాన్సర్, ఇతర వ్యాధులకు సంబంధించిన ప్రతికూల మార్పులు సంభవించవచ్చు. భూగర్భ జలాలను అశాస్త్రీయంగా తోడిపారేయడం వల్ల ఈ అద్భుతమైన మూలధన వనరు వేగంగా తరిగిపోతుంది.’’
ఫిలిప్పీన్ ్సలోని అంతర్జాతీయ ధాన్య పరిశోధనా సంస్థ (ఐఆర్‌ఆర్‌ఐ) డైరెక్టర్ జనరల్‌గా స్వామినాథన్ ఉన్న సమయంలోనే ఇండోనేషియా అధ్యక్షుడు సుహార్తో నుంచి ఆయనకు అసాధారణ కబురు వచ్చింది. ఇండోనేషియా వరి పంటను బ్రౌన్ ప్లాంట్‌హాపర్ తెగులు నాశనం చేయడంతో, స్వామినాథన్ ఒక పరిష్కార మార్గాన్ని అందించాలని సుహార్తో కోరారు.
ఇండోనేషియాకు వెళ్లిన శాస్త్రవేత్తల బృందాన్ని ఒకచోట చేర్చి, వారికి మరిన్ని శక్తిమంతమైన పురుగు మందులను ఉపయోగించాలని సూచించడానికి బదులుగా, వరి పంటపై ఉపయోగించే పురుగు మందులను నిషేధించాలని సుహార్తోకు స్వామినాథన్ సలహా ఇచ్చారు. అదే సమయంలో సమీకృత తెగులు నిర్వహణను ప్రారంభించాలని చెప్పారు. సుహార్తో అధ్యక్ష హోదాలో 57 పురుగు మందులను నిషేధించారు.
ప్రొఫెసర్ స్వామినాథన్ టెక్నాలజీని గుడ్డిగా విశ్వసించేవారు కాదని చాలామందికి తెలియదు. జన్యుమార్పిడి పంటలకు వ్యతిరేకంగా ప్రచారం తారస్థాయికి చేరిన రోజుల్లో, బీటీ వంకాయల వాణిజ్యీకరణకు వ్యతిరేకంగా తాత్కాలిక నిషేధం విధించడంపై అప్పటి పర్యావరణ మంత్రి జైరాం రమేష్‌కు ఆయన ప్రతిస్పందన గమనించదగ్గది. చెన్నైలోని ఎం.ఎస్.స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్‌లో జరిగిన ఒక సమావేశంలో, ఆయన ఒక మునగకాయ స్లయిడ్‌ను ప్రదర్శించి, ఆ తర్వాత ‘విటమిన్ ఏ’ని కలిగిన జన్యుమార్పిడి బియ్యం ఆవశ్యకతపై ఒక ప్రశ్నను సంధించారు.
అన్నంతోపాటు కలిపి వండిన మునగ ఆకులు మన సాంప్రదాయ ఆహారంలో భాగమనీ, ఇవి తమకు తాముగా విటమిన్ ఏ అందించగలవనీ ఆయన ఉద్దేశ్యం. స్వామినాథన్ పదే పదే లేవనెత్తిన పర్యావరణ పరమైన ఆందోళనలను విధాన నిర్ణేతలు తగిన విధంగా పరిష్కరించినట్లయితే, భారతీయ వ్యవసాయరంగం తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకునేది కాదు.
ఆయన అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రాల కన్సార్టియంకు చెందిన మొక్కల జన్యు వనరులపై సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్‌కు కూడా నాయకత్వం వహించారు. నేను ఆ సమయంలో మేధా సంపత్తి హక్కులపై సీసీఐఏఆర్ సెంట్రల్ అడ్వైజరీ బోర్డు సభ్యుడిని. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న మొక్కల జన్యు వనరులను ప్రైవేట్ కంపెనీలకు ఏకమొత్తంగా విక్రయించడాన్ని నిలువరించడంలో ఆయన పోషించిన పాత్ర గుర్తింపు పొందలేదు. ప్రపంచ జీవవైవిధ్యానికి చెందిన అపారమైన సంపదను ప్రైవేటీకరించడానికి జరిగిన ప్రతి ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి ఆయన చేసిన తీవ్రమైన ప్రయత్నాలకు నేనే సాక్షిని.
స్వామినాథన్ 2004లో జాతీయ రైతుల కమిషన్ చైర్‌పర్సన్ గా నియమితులైనప్పుడు, కమిషన్ నివేదికకి చెందిన జీరో డ్రాఫ్ట్‌ను రాయమని నన్ను ఆహ్వానించారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా దానిపై చర్చించి, తుది నిర్ణయం తీసుకోవాలి. రైతును కేంద్ర స్థానంలో ఉంచి, ఆపై అతని పరిస్థితిని ఎలా మెరుగుపరచవచ్చో చూడాలని నాకు ఆదేశం ఇచ్చారు.
అయితే కేవలం రైతుపై మాత్రమే దృష్టి పెట్టడం కాకుండా, వివిధ వాటాదారులను కూడా అందులో చేర్చాలని తర్వాత చెప్పినప్పుడు, నేను క్షమాపణలు చెప్పాను. అయితే, ఆ మొత్తం కాలం రైతులకు ఆదాయ భద్రత కల్పించడంపై స్వామినాథన్ దృష్టి సారించారు. ఆహారోత్పత్తిని పెంచడంలో రైతులు పోషిస్తున్న పాత్రను ఆయన అభినందించేవారు. కానీ రైతు సమాజం దుఃస్థితికి ఎప్పుడూ బాధపడేవారు.
2004, 2006 మధ్య ఐదు భాగాలుగా సమర్పించిన స్వామినాథన్ కమిషన్ నివేదిక, భారతీయ వ్యవసాయంలో ఉత్పాదకత, లాభదాయకత, స్థిరత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో రూపొందింది. ఇది దేశవ్యాప్తంగా రైతు సంఘాలకు కీలకమైన అంశంగా నిలుస్తోంది. సగటు(వెయిటెడ్ యావరేజ్) మీద 50 శాతం లాభం రైతులకు అందించాలన్న ఆయన సూచనను ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఈ గొప్ప దార్శనికుడికి దేశం అర్పించే అత్యుత్తమ నివాళి ఏమిటంటే, స్వామినాథన్ కమిషన్ నివేదికను అక్షరమక్షరం అమలు చేయడమే!
దేవీందర్ శర్మ
వ్యాసకర్త ఆహార, వ్యవసాయ నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment