Swaminathan Commission
-
‘కనీస’ చట్టబద్ధత ఎండమావేనా?
ఖరీఫ్ సీజన్‌కు కేంద్ర ప్రభుత్వం 14 పంటలకు ప్రకటించిన మద్దతు ధరలు ఆశించిన మేరకు లేకపోవడంతో అన్నదాతలకు నిరాశే మిగిలింది. వరి ఎక్కువగా పండించే రాష్ట్రాలు వరి సాధారణ రకానికి రూ. 3,000 నుంచి రూ. 3,200; ఏ గ్రేడ్ రకానికి రూ. 3,200 నుంచి రూ. 3,400 ప్రకటించాలని కేంద్రానికి సిఫార్సు చేశాయి. కానీ కేంద్రం సాధారణ రకానికి రూ. 2,300; ఏ గ్రేడ్ రకానికి రూ. 2,320 మాత్రమే ప్రకటించింది. పత్తికి రూ. 1,000 నుంచి రూ.1,500 పెంచాలని కోరితే రూ. 500 పెంపుతో సరిపెట్టారు. జొన్న, మొక్కజొన్న, వేరుశనగ, కందులు, పొద్దుతిరుగుడు, నువ్వులు, సోయా, పెసలు, మినుములు... వంటి పంటలకు రాష్ట్రాల సిఫార్సులకు అనుగుణంగా ధరలు పెంచలేదు. శాస్త్రీయత లేకుండా తోచిన ధర ప్రకటించడంలో ఔచిత్యం ఏమిటి?పంటల సాగు ఖర్చుకు ఒకటిన్నర రెట్లు ఆదాయం అందాలనీ, అప్పుడే రైతుకు న్యాయం జరుగుతుందనీ వ్యవసాయ పితామహుడు డాక్టర్ స్వామినాథన్ 2005లో నాటి యూపీఏ ప్రభుత్వానికి అందించిన నివేదికలో స్పష్టం చేశారు. ఆనాటి నుంచి నేటి వరకు ఈ డిమాండ్ అపరిష్కృతంగానే ఉండిపోయింది. ఆశ్చర్యం ఏమంటే... స్వామినాథన్ కమిషన్ అందించిన సిఫార్సులను 2004 నుంచి 2014 వరకు పదేళ్లపాటు అధికారంలో ఉండి అమలు చేయకుండా అటకెక్కించిన కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామని నమ్మబలికింది. మరోపక్క, దేశంలో దశాబ్దాలపాటు అపరిష్కృతంగా, చిక్కుముళ్లుగా బిగుసుకుపోయిన సమస్యలకు తాము పరిష్కార మార్గాలు చూపగలిగామని ప్రధాని నరేంద్ర మోదీ పదేపదే చెబుతుంటారు. అయెధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన, ఆర్టికల్ 370 రద్దు, త్రిబుల్ తలాక్ రద్దు, చంద్రయాన్ విజయం, సూర్యయాన్‌కు సన్నద్ధత వంటి అంశాలను ఉదహరించే అధికార బీజేపీ గత పదేళ్లుగా రైతాంగ సమస్యలకు అరకొరగా తప్ప శాశ్వత పరిష్కార మార్గాలేమీ చూపించలేకపోవడం గమనార్హం! ఫలితంగానే దేశానికి ఆహార భద్రత చేకూర్చడానికి ఆరుగాలం కష్టపడే అన్నదాతలు దేశం నలుమూలల నుంచి తరలివచ్చి ఢిల్లీ శివారు ప్రాంతాల్లో గుడారాలు వేసుకొని ఎండ, వాన, చలిని తట్టుకొని నెలల తరబడి తమ డిమాండ్ల సాధన కోసం ఉధృతమైన ఉద్యమం చేశారు. గత 10 ఏళ్లల్లో నాలుగు దశల్లో దేశ రైతాంగం చేసిన ఆందోళన కార్యక్రమాలు ఇంతకుముందెప్పుడూ కనివిని ఎరుగనివి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపు 300కు పైగా రైతు సంఘాలు సంఘటితమై ఉద్యమించాయంటే సమస్య తీవ్రత ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు. 750 మందికి పైగా ప్రాణాలు పోయినా లెక్కచేయక రైతాంగం ప్రదర్శించిన పట్టుదల కారణంగానే కేంద్రం పార్లమెంట్లో మూడు వివాదాస్పద రైతు బిల్లుల్ని ఉపసంహరించుకొంది. కానీ వారి ఇతర డిమాండ్లను మాత్రం నెరవేర్చలేదు.దేశ రైతాంగం ముక్తకంఠంతో చేస్తున్న అతి ప్రధాన డిమాండ్ ఎంఎస్పీ(కనీస మద్దతు ధర)కి చట్టబద్ధత. దీనినే ‘కిసాన్ న్యాయ్ గ్యారంటీ’ అంటున్నారు. కేంద్రం ముందు రైతు సంఘాలు పెట్టిన ఇతర డిమాండ్లలో 1) ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) ఒప్పందాల నుంచి భారత్ బయటకు రావడం 2) వ్యవసాయ దిగుమతులపై సుంకాల పెంపుదల 3) 2020 విద్యుత్ సంస్కరణల చట్టం రద్దు 4) ఉపాధి హామీ పనులు ఏడాదికి 200 రోజులకు పెంపు 5) రైతుకు, రైతు కూలీలకు పెన్షన్ వర్తింపు వంటివి ప్రధానంగా ఉన్నాయి. రైతులు పెట్టిన ఈ డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలతో పలుమార్లు చర్చలు జరిపినా పరిష్కారం కాలేదు. ముఖ్యంగా రైతులు పట్టుబడుతున్న ప్రధాన డిమాండ్ 23 పంటలకు కనీస మద్దతు ధరలతో చట్టబద్ధత కల్పించడం. ఈ అంశాన్ని ప్రభుత్వం ఆర్థిక కోణంలో కాకుండా రైతుల ఆర్థిక కోణంలో చూడాలని అంటున్నారు. కానీ, కేంద్రం ఈ డిమాండ్‌కు తలొగ్గకపోగా మరో కొత్త ప్రతిపాదన తెరమీదకు తెచ్చింది. వరి, గోధుమలకు ప్రత్యామ్నాయంగా కంది, మినుము, మొక్కజొన్న, పత్తి వంటి పంటలు పండిస్తే ఐదేళ్లపాటు కనీస మద్దతుతో కేంద్ర సంస్థలయిన జాతీయ వినియోగదారుల సహకార సమాఖ్య (ఎన్సీసీఎఫ్), జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య (నాఫెడ్)లు కొంటాయనీ, అందుకుగాను రైతులతో ముందస్తు ఒప్పందం చేసుకొంటాయనీ ప్రతిపాదించింది. దీనిని రైతు సంఘాలు ఒప్పుకోవడం లేదు. కేంద్రం మాత్రం ఈ ప్రణాళికను అమలు చేయాలనే గట్టి పట్టుదలతో ఉంది. పంటమార్పిడి అన్నది అంత తేలికైనది కాదు. రైతులలో పంట మార్పిడి విధానంపై అవగాహన పెంచాలి. ప్రభుత్వ సహకారం అందాలి. పండించిన పంటకు గిట్టుబాటు ధర లభిస్తుందన్న నమ్మకం రైతుల్లో కలగాలి. ఇందుకు చాలా సమయం పడుతుంది. ముఖ్యంగా, దేశంలోని అన్ని ప్రాంతాలలోని వ్యవసాయ భూములు పంట మార్పిడికి పూర్తి అనుకూలంగా లేవన్నది ఓ చేదు వాస్తవం. సమగ్రమైన అధ్యయనం, వాటి ఫలితాలు పరిశీలించిన తర్వాతనే పంటల మార్పిడి విధానం అమలు చేయాలే తప్ప, బలవంతంగా అమలు చేయాలనుకోవడం వల్ల ప్రతిఘటన ఎదురవుతుంది. నిజానికి, ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించే విషయంలోనూ, ఇతర డిమాండ్ల పరిష్కారంలోనూ ఎన్డీఏ–2 ప్రభుత్వం ప్రదర్శించిన ఉదాసీనత కారణంగానే బీజేపీ ఈ ఎన్నికలలో 60 లోక్‌సభ స్థానాలకు పైగా నష్టపోయిందని పరిశీలకుల విశ్లేషణ. ప్రధానంగా... పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌లోని మెజారిటీ స్థానాల్లో రైతాంగం బీజేపీని ఆదరించలేదు. అయితే, మూడోసారి నరేంద్ర మోదీ ప్రధానిగా కొలువుదీరిన ఎన్డీఏ–3 ప్రభుత్వం రైతాంగం చేస్తున్న డిమాండ్లను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుందా? లేక ఉద్యమాన్ని అణచివేస్తుందా అన్నదే కీలకం. ఎన్నికల ముందు దేశ రైతాంగాన్ని తమ హామీల ద్వారా తమ వైపు తిప్పుకోవాలని కాంగ్రెస్ కూటమి పక్షాలు (ఇండియా బ్లాక్) ప్రయత్నించినా అది పూర్తి స్థాయిలో ఫలించలేదు. ఈ నేపథ్యంలోనే దేశ రైతాంగం ఆశలు, ఆకాంక్షలు ఏమవుతాయనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పిస్తే ఏటా కేంద్ర ప్రభుత్వంపై రూ. 12 లక్షల కోట్ల అదనపు భారం పడుతుందని నీతి ఆయోగ్ తేల్చింది. దాదాపు రూ. 50 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్లో ఇంత మొత్తం కేటాయించడం అసాధ్యమే. పైగా, వ్యవసాయం అంటే కేవలం 23 పంటలే కాదు. వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి, చేపలు, రొయ్యలు, పండ్లు, కూరగాయల మాటేమిటి? వాటికి ప్రోత్సాహకాలు అవసరం లేదా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. దేశంలో జరుగుతున్న రైతాంగ ఉద్యమాలు, వాటిపట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉన్నా రైతుల ఆదాయం గణనీయంగా తగ్గిపోయినట్లు 77వ జాతీయ నమూనా సర్వే వెల్లడించడం గమనార్హం. ఈ సర్వే ప్రకారం దేశంలోని చిన్న సన్న కారు రైతు కుటుంబాల నెలసరి ఆదాయం సగటున రూ. 10,218 మాత్రమే. రైతు కూలీల సగటు నెలవారీ ఆదాయం రూ. 4,063. ఆదాయాలు పెరగకపోవడం వల్ల వారికున్న రుణభారం తగ్గడం లేదు. ఫలితంగానే రైతులు, రైతు కూలీలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నేషనల్ క్రైవ్‌ు రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 2023లో 11,290 మంది, 2022లో 10,281 మంది, 2021లో 9,898 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. రైతుల ఆత్మహత్యల్లో పెరుగుదల 3.7 నుంచి 5.7 శాతంగా ఎన్సీఆర్బీ డేటా వెల్లడిస్తోంది. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో 53 శాతం మంది రైతు కూలీలేనన్నది చేదు నిజం. రైతులు, అనుబంధ వృత్తికూలీల ఆదాయం పెరగకపోవడం కారణంగానే గ్రామీణ పేదరికం క్రమేపీ పెరుగుతున్నది. మోదీ చెప్పినట్లు 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు కాలేదు. ఇప్పట్లో హరియాణాకు తప్ప ఇతర ప్రధాన రాష్ట్రాలకు ఎన్నికలు లేవు కనుక... రైతాంగ సమస్యల పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుందన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రైతులు డిమాండ్ చేస్తున్న ఎంఎస్పీకి చట్టబద్ధత ఓ ఎండమావిగానే మిగిలిపోతుందన్నది నిష్టుర సత్యం.డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి -
ఆకలిపై పోరాటం జరిపిన శాస్త్రవేత్త
ఆయనను తరచుగా భారతదేశ హరిత విప్లవ పితామహుడిగా కీర్తిస్తారు. ఘనత వహించిన శాస్త్రవేత్త–వ్యవహర్త అయిన ప్రొఫెసర్ ఎం.ఎస్. స్వామినాథన్‌కు ‘వరల్డ్ ఫుడ్ ప్రైజ్’ తొలి అవార్డు వచ్చినప్పుడు, ఆయన్ని అప్పటి ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ కర్ట్ వాల్డ్‌హీమ్ ఒక లేఖలో ‘లివింగ్ లెజెండ్’ అని ప్రశంసించారు. స్వామినాథన్ మరణంతో ఒక శకం ముగిసింది. ‘ఓడ నుండి నోటికి’ అనే దుర్భర స్థితిలో ఉండిన దేశం ఆయన మార్గదర్శకత్వంలో వ్యవసాయంలో అద్భుతమైన విజయం సాధించింది. హరిత విప్లవ రూపశిల్పి అయినప్పటికీ ఎరువులు అధికంగా వాడితే కలిగే ప్రతికూల పరిణామాలు ఆయనకు తెలుసు. అలాగే రైతు క్షేమాన్నే ఎల్లవేళలా తలిచారు. ‘హరిత విప్లవ చరిత్ర వాస్తవానికి నాటి ప్రధాని ఇందిరా గాంధీతో కలిసి నేను చేసిన అరగంట కారు ప్రయాణంలో లిఖితమైంది,’ అని ఒకసారి స్వామినాథన్ నాతో చెప్పారు. వ్యవసాయ విప్లవానికి మద్దతు ఇవ్వడానికి కావలసిన రాజకీయ సంకల్పాన్ని పొందడం ఎంత కష్టమనే నా ప్రశ్నకు ఆయన జవాబిస్తూ, అప్పటి ప్రధాని ఇందిరా గాంధీతో కలిసి న్యూఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్‌గా పూసా కాంప్లెక్స్‌లో ఒక భవన ప్రారంభోత్సవానికి వెళ్లిన సంగతిని గుర్తు చేసుకున్నారు. దారిలో ప్రధాని ఆయన్ని అడిగారు: ‘‘స్వామీ, మీరు చెబుతున్న కొత్త గోధుమ పొట్టి వంగడాల రకాలకు నేను అనుమతిస్తాను. కానీ, కొన్నేళ్లలో ఒక కోటి టన్నుల మిగులు గోధుమలు చూపుతానని మీరు నాకు మాటివ్వగలరా? ఈ ‘బ్లడీ అమెరికన్ల’ హింస నాకు తప్పాలి.’’ స్వామినాథన్ మాటిచ్చారు, తర్వాతిదంతా చరిత్ర! ‘ఓడ నుండి నోటికి’ అనే దుర్భర స్థితిలో ఉండిన దేశం అనంతరం వ్యవసాయంలో అద్భుతమైన విజయం సాధించింది. భారతదేశాన్ని స్వయం సమృద్ధ దేశంగానే కాకుండా, నికర ఎగుమతిదారుగా మార్చింది. తగిన విధానాల ద్వారా మద్దతు లభ్యమైన హరిత విప్లవ వీరోచిత గాథ, ప్రధానంగా ఆకలి ఉచ్చు నుండి బయటపడే లక్ష్యంపై దృష్టి పెట్టింది. 1943 బెంగాల్ క్షామం తర్వాత కేవలం నాలుగు సంవత్సరాల లోపే స్వాతంత్య్రం రావడంతో, ఆకలిని అధిగమించే సవాలు అప్పటికి ఎదుర్కోలేదు. దశాబ్దాలుగా, ఉత్తర అమెరికా నుండి పీఎల్–480 పథకం కింద భారత్‌కు ఆహారం వస్తూ ఉండేది. 1970ల మధ్య నాటికి భారతదేశంలోని సగం జనాభా కబేళాలకు దారి తీస్తుందని కొందరు నిపుణులు అంచనా వేశారు. ఆ తర్వాత దేశ క్షుద్బాధపై పోరాడేందుకు స్వామినాథన్ చేసిన తీవ్రాతితీవ్ర ప్రయత్నం, ప్రపంచం వీక్షించిన అత్యంత ముఖ్యమైన ఆర్థిక పరిణామాలలో ఒకటిగా చరిత్రలో నిలిచిపోతుంది. ఇది దేశంలోని కోట్లాది ప్రజల జీవితాలను మార్చడమే కాకుండా, మిగిలిన ప్రపంచానికి కూడా స్ఫూర్తిగా నిలిచింది. హరిత విప్లవానికి రూపశిల్పిగా ఉన్నప్పటికి కూడా, స్వామినాథన్ కు వ్యవసాయంలో ఎరువులు అధికంగా వాడితే కలిగే ప్రతికూల పరిణామాల గురించి తెలుసు. ఆయన ప్రతి కోణంలోనూ దూరదృష్టి గలవారు. రాబోయే పరాజయం గురించి అనేకసార్లు ముందే హెచ్చరించారు. హరిత విప్లవం ప్రారంభమైన కొన్ని సంవత్సరాల తర్వాత, 1968 లోనే ఆయన ఇలా రాశారు: ‘‘నేల సారాన్ని, నేల నిర్మాణాన్ని పరిరక్షించకుండా భూమిపై తీవ్ర ఒత్తిడి కలిగించే సేద్యం చేయడం అంతిమంగా ఎడారుల పుట్టుకకు దారి తీస్తుంది. పురుగు మందులు, శిలీంద్ర (ఫంగస్) సంహారిణులు, కలుపు సంహారకాలను విచక్షణారహితంగా ఉపయోగించడం వలన ధాన్యాలు లేదా ఇతర తినదగిన భాగాలలో చేరే విషపూరిత అవశేషాల వల్ల క్యాన్సర్, ఇతర వ్యాధులకు సంబంధించిన ప్రతికూల మార్పులు సంభవించవచ్చు. భూగర్భ జలాలను అశాస్త్రీయంగా తోడిపారేయడం వల్ల ఈ అద్భుతమైన మూలధన వనరు వేగంగా తరిగిపోతుంది.’’ ఫిలిప్పీన్ ్సలోని అంతర్జాతీయ ధాన్య పరిశోధనా సంస్థ (ఐఆర్ఆర్ఐ) డైరెక్టర్ జనరల్‌గా స్వామినాథన్ ఉన్న సమయంలోనే ఇండోనేషియా అధ్యక్షుడు సుహార్తో నుంచి ఆయనకు అసాధారణ కబురు వచ్చింది. ఇండోనేషియా వరి పంటను బ్రౌన్ ప్లాంట్‌హాపర్ తెగులు నాశనం చేయడంతో, స్వామినాథన్ ఒక పరిష్కార మార్గాన్ని అందించాలని సుహార్తో కోరారు. ఇండోనేషియాకు వెళ్లిన శాస్త్రవేత్తల బృందాన్ని ఒకచోట చేర్చి, వారికి మరిన్ని శక్తిమంతమైన పురుగు మందులను ఉపయోగించాలని సూచించడానికి బదులుగా, వరి పంటపై ఉపయోగించే పురుగు మందులను నిషేధించాలని సుహార్తోకు స్వామినాథన్ సలహా ఇచ్చారు. అదే సమయంలో సమీకృత తెగులు నిర్వహణను ప్రారంభించాలని చెప్పారు. సుహార్తో అధ్యక్ష హోదాలో 57 పురుగు మందులను నిషేధించారు. ప్రొఫెసర్ స్వామినాథన్ టెక్నాలజీని గుడ్డిగా విశ్వసించేవారు కాదని చాలామందికి తెలియదు. జన్యుమార్పిడి పంటలకు వ్యతిరేకంగా ప్రచారం తారస్థాయికి చేరిన రోజుల్లో, బీటీ వంకాయల వాణిజ్యీకరణకు వ్యతిరేకంగా తాత్కాలిక నిషేధం విధించడంపై అప్పటి పర్యావరణ మంత్రి జైరాం రమేష్‌కు ఆయన ప్రతిస్పందన గమనించదగ్గది. చెన్నైలోని ఎం.ఎస్.స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్‌లో జరిగిన ఒక సమావేశంలో, ఆయన ఒక మునగకాయ స్లయిడ్‌ను ప్రదర్శించి, ఆ తర్వాత ‘విటమిన్ ఏ’ని కలిగిన జన్యుమార్పిడి బియ్యం ఆవశ్యకతపై ఒక ప్రశ్నను సంధించారు. అన్నంతోపాటు కలిపి వండిన మునగ ఆకులు మన సాంప్రదాయ ఆహారంలో భాగమనీ, ఇవి తమకు తాముగా విటమిన్ ఏ అందించగలవనీ ఆయన ఉద్దేశ్యం. స్వామినాథన్ పదే పదే లేవనెత్తిన పర్యావరణ పరమైన ఆందోళనలను విధాన నిర్ణేతలు తగిన విధంగా పరిష్కరించినట్లయితే, భారతీయ వ్యవసాయరంగం తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకునేది కాదు. ఆయన అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రాల కన్సార్టియంకు చెందిన మొక్కల జన్యు వనరులపై సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్‌కు కూడా నాయకత్వం వహించారు. నేను ఆ సమయంలో మేధా సంపత్తి హక్కులపై సీసీఐఏఆర్ సెంట్రల్ అడ్వైజరీ బోర్డు సభ్యుడిని. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న మొక్కల జన్యు వనరులను ప్రైవేట్ కంపెనీలకు ఏకమొత్తంగా విక్రయించడాన్ని నిలువరించడంలో ఆయన పోషించిన పాత్ర గుర్తింపు పొందలేదు. ప్రపంచ జీవవైవిధ్యానికి చెందిన అపారమైన సంపదను ప్రైవేటీకరించడానికి జరిగిన ప్రతి ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి ఆయన చేసిన తీవ్రమైన ప్రయత్నాలకు నేనే సాక్షిని. స్వామినాథన్ 2004లో జాతీయ రైతుల కమిషన్ చైర్పర్సన్ గా నియమితులైనప్పుడు, కమిషన్ నివేదికకి చెందిన జీరో డ్రాఫ్ట్‌ను రాయమని నన్ను ఆహ్వానించారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా దానిపై చర్చించి, తుది నిర్ణయం తీసుకోవాలి. రైతును కేంద్ర స్థానంలో ఉంచి, ఆపై అతని పరిస్థితిని ఎలా మెరుగుపరచవచ్చో చూడాలని నాకు ఆదేశం ఇచ్చారు. అయితే కేవలం రైతుపై మాత్రమే దృష్టి పెట్టడం కాకుండా, వివిధ వాటాదారులను కూడా అందులో చేర్చాలని తర్వాత చెప్పినప్పుడు, నేను క్షమాపణలు చెప్పాను. అయితే, ఆ మొత్తం కాలం రైతులకు ఆదాయ భద్రత కల్పించడంపై స్వామినాథన్ దృష్టి సారించారు. ఆహారోత్పత్తిని పెంచడంలో రైతులు పోషిస్తున్న పాత్రను ఆయన అభినందించేవారు. కానీ రైతు సమాజం దుఃస్థితికి ఎప్పుడూ బాధపడేవారు. 2004, 2006 మధ్య ఐదు భాగాలుగా సమర్పించిన స్వామినాథన్ కమిషన్ నివేదిక, భారతీయ వ్యవసాయంలో ఉత్పాదకత, లాభదాయకత, స్థిరత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో రూపొందింది. ఇది దేశవ్యాప్తంగా రైతు సంఘాలకు కీలకమైన అంశంగా నిలుస్తోంది. సగటు(వెయిటెడ్ యావరేజ్) మీద 50 శాతం లాభం రైతులకు అందించాలన్న ఆయన సూచనను ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఈ గొప్ప దార్శనికుడికి దేశం అర్పించే అత్యుత్తమ నివాళి ఏమిటంటే, స్వామినాథన్ కమిషన్ నివేదికను అక్షరమక్షరం అమలు చేయడమే! దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ నిపుణులు -
రైతు పోరాటం ఆరంభమే
ఆర్మూర్: రైతులు నామినేషన్లు వేసింది గెలుపు కోసం కాదని, తమ కడుపు మంట పాలకుల దృష్టికి తీసుకెళ్లడానికేనని మాజీ ఎమ్మెల్సీ, రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్రావు వ్యాఖ్యానించారు. ఈ పోరాటం ఆరంభం మాత్రమేనని చెప్పారు. మంగళవారం ఆర్మూర్‌లో నిర్వహించిన నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి నామినేషన్లు వేసిన 178 మంది రైతుల ఐక్యత సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పసుపు, ఎర్రజొన్న రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడం చాలా చిన్న విషయమని పేర్కొన్నారు. రైతులు ఆత్మహత్యల నుంచి ఎన్నికల్లో పోటీ చేసే స్థాయికి పోరాటాన్ని తీసుకురావడం అభినందనీయమని చెప్పారు. కేవలం పసుపు బోర్డును సాధించుకోవడంతో ఆపేయకుండా పసుపు, ఎర్రజొన్నలకు గిట్టుబాటు ధర, రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం అయ్యేంత వరకు ఉద్యమాన్ని కొనసాగించాలని సూచించారు. నిజామాబాద్, జగిత్యాల జిల్లాల రైతాంగం చేస్తున్న పోరాటం యావత్ దేశంలోని రైతులకు ఆదర్శంగా నిలవాలన్నారు. ఐదు రూపాయలకు కిలో టమాటలు లభించే సమయంలో సూపర్మార్కెట్లో టమాట పచ్చడి వంద రూపాయలకు లభిస్తోందని, అంటే పంట పండించిన రైతులకు కాకుండా ఆ పంటపై వ్యాపారం చేసే వ్యాపారస్తులకే అధిక లాభాలు రావడం విచారకరమన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి రైతుల డిమాండ్లను పరిష్కరించలేని వారు ఇప్పుడు రైతులు నామినేషన్లు వేయగానే అధికారంలోకి వచ్చిన ఐదు రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తామని హామీలు ఇవ్వడం రైతుల విజయమన్నారు. ‘స్థానిక’ఎన్నికల్లోనూ నామినేషన్లు వేయాలి నామినేషన్లు వేసిన రైతులకే ఓటు వేయాలని తీర్మానించారు. పసుపు పంట క్వింటాలుకు 15 వేల రూపాయలు, ఎర్రజొన్న పంట క్వింటాలుకు 3,500 రూపాయలకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. స్వామినాథన్ కమిషన్‌ను అమలు చేయాలని, సమస్యలపై రైతులంతా ఒక్కటిగా ఉండి పోరాటాన్ని కొనసాగించాలని, ఎన్నికల వేళ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక రైతుల సమస్యలు పరిష్కరించని రాజకీయ పార్టీలను గ్రామాల్లోకి రానివ్వకుండా బహిష్కరించాలని తీర్మానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం రైతులు నామినేషన్లు వేసి నిరసన తెలపాలని, రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని, మల్లాపూర్, ముత్యంపేట, బోధన్ షుగర్ ఫ్యాక్టరీలను పునరుద్ధరించాలని, రైతుల ఓట్లు రైతులకే వేయాలని తీర్మానాలు చేశారు. ఈ సభలో సుమారు ఐదు వేల మంది రైతులు పాల్గొన్నారు. -
అన్నదాత ఆగ్రహం
కేంద్రమంత్రులు కొందరు ‘ఫిట్నెస్ చాలెంజ్’ కార్యక్రమంలో తలమునకలై ఉండగా పలు రాష్ట్రాలు నాలుగు రోజులుగా రైతుల ఆందోళనలతో అట్టుడుకుతున్నాయి. ఆగ్రహంతో ఊగి పోతున్న రైతులు రోడ్లపై కాయగూరలు, పాలు పారబోస్తున్న ఉదంతాలు చానెళ్లలో చూస్తుంటే ఎలాంటివారికైనా మనసుకు కష్టం కలగక మానదు. ఆ ఉత్పత్తులన్నీ వారు ఎండనకా, వాననకా రాత్రింబగళ్లు రెక్కలు ముక్కలు చేసుకుని, దొరికినచోటల్లా అప్పులు చేసి పండించినవి. రైతాంగ ఉద్యమం కారణంగా కూరగాయల ధరలు చుక్కలనంటుతున్నాయి. మార్కెట్లో 2 లక్షల లీటర్ల మేర పాల కొరత ఏర్పడిందని డెయిరీ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో నగరాలకు కూరగాయలు, పాలు ఆగిపోయాయి. ఈ ఆందోళన చివరి రోజైన జూన్ 10న ‘భారత్ బంద్’ కూడా జరపబోతున్నారు. ఈ స్ఫూర్తితో దేశంలోని ఇతరచోట్ల కూడా రైతాంగ ఉద్యమాలు తలెత్తే అవకాశాలు లేకపోలేదు. రైతులేమీ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు. వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలని, స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని, కనీస ఆదాయ హామీ పథకం అమలు చేయాలని, ఎరువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు అధికారం చలాయిస్తున్న పార్టీలు ఎన్నికల సమయంలో వాగ్దానాలిచ్చినవే. సాగు యోగ్యమైన భూ విస్తీర్ణంలో ప్రపంచంలో అమెరికాది తొలి స్థానం కాగా, మన దేశానిది రెండో స్థానం. కానీ మన వ్యవసాయ భూముల్లో కేవలం 35 శాతానికి మాత్రమే నీటిపారుదల సదుపాయం ఉంది. మిగిలిందంతా వర్షాధారం. 2 లక్షల కోట్ల డాలర్ల దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం వాటా 15 శాతం. దేశంలో దాదాపు 70 శాతంమంది దానిపై ఆధారపడి బతుకుతున్నారు. ఇంతటి కీలకమైన రంగం మన పాలకులకు పట్టడం లేదు. అలాగని వారికి రైతు సమస్యలు తెలియవని చెప్పలేం. ఎన్నికల సమయంలో రైతులకు అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పడం ఎప్పటినుంచో వింటున్నదే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన పార్టీలు అధికారంలో కొచ్చాయి. ఇక కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న బీజేపీ 2014 తర్వాత జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రైతు రుణాలన్నీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. పంజాబ్‌లో కాంగ్రెస్ కూడా రుణమాఫీ వాగ్దానం చేసి అధికారంలోకొచ్చింది. రుణమాఫీ చేశామని కొన్ని రాష్ట్రాలూ, ఆ ప్రక్రియ కొనసాగుతున్నదని మరికొన్ని రాష్ట్రాలూ చెబుతున్నాయి. మరి రైతుల్లో ఇంత అసంతృప్తి ఎందుకున్నట్టు? వేలాదిమంది రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నట్టు? జాతీయ క్రైం రికార్డుల బ్యూరో గణాంకాల ప్రకారం ఏటా దాదాపు 6,000మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పరిస్థితులు ఇంత తీవ్రంగా ఉన్నప్పుడు తమ విధానాలు సక్రమంగా లేవని, అవి సమస్య మూలాలను తాకడం లేదని పాలకులకు అర్ధమై ఉంటే వేరుగా ఉండేది. కానీ ఎవరూ ఈ దిశగా ఆలోచిస్తున్న దాఖలా లేదు. సామాన్య పౌరులు బియ్యం కొనాలంటే కిలోకు దాదాపు రూ. 50 వెచ్చించాల్సి ఉంటుంది. కానీ వరి ధాన్యానికి నిరుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర వంద కిలోల బస్తా రూ. 1,550. ఈ ధరకు కొనేవారు కూడా దొరక్క చాలామంది రైతులు ఇంతకన్నా తక్కువకే అమ్ముకున్నారు. రైతు అమ్మినప్పుడు కనీస ధర రాని దిగుబడులు వ్యాపారుల దగ్గరకెళ్లేసరికి ఒక్కసారిగా విజృం భిస్తాయి. ఏటా ఇదే తంతు నడుస్తున్నా ప్రభుత్వాలకు పట్టదు. రుణమాఫీ వంటి పథకాలు ఎంత బాగా అమలవుతున్నాయన్నది పక్కనబెడితే అమలైన మేరకైనా నిజమైన రైతుకు చేరడం లేదు. మన దేశంలో వ్యవసాయంలో అధిక భాగం కౌలు రైతుల చేతులమీదుగానే నడుస్తోంది. కానీ ప్రభుత్వ పథకాలేవీ వారిని గుర్తించవు. ఫలితంగా నిజంగా వ్యవసాయం చేస్తూ తీవ్ర నష్టాలు చవిచూస్తున్న రైతులు దిక్కూ మోక్కూలేని స్థితిలో ఉండిపోతున్నారు. ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో సాగుతున్న రైతు ఉద్యమానికి ఈ నేపథ్యం ఉంది. తాము అప్పులు ఊబిలో కూరుకుపోతున్నా పట్టించుకోని పాలకులపై రైతుల్లో అసహనం అంతకంతకు పెరుగుతున్నదని ఈ ఉద్యమం నిరూపిస్తోంది. అదృష్టవశాత్తూ ఇంతవరకూ ఇది కట్టుతప్పలేదు. నిరుడు ఇదే రోజుల్లో ఉత్తరాదిన పెల్లుబికిన రైతుల ఆందోళన గుర్తుకు తెచ్చుకోవాలి. ముఖ్యంగా మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌లో జిల్లా కలెక్టర్, ఎస్పీ సహా పలువురు ఉన్నతాధికారులపై దాడులు చేసి కొట్టడం, కర్ఫ్యూ ధిక్కరించి రాస్తారోకోలకు దిగడం, వాహనాలను ధ్వంసం చేయడం, చివరకు పోలీసు కాల్పుల్లో 8మంది మరణించడం వంటి ఉదంతాలు మరిచిపోకూడదు. కానీ ఇతర రాష్ట్రాల సంగతలా ఉంచి మధ్యప్రదేశ్ ప్రభుత్వమైనా రైతు సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు తీసుకున్న దాఖలా కనబడదు. ఆ రాష్ట్రంలో కూడా సాగుతున్న రైతు ఉద్యమాలే అందుకు రుజువు. దళారులు, గుత్త వ్యాపారుల హవా నడిచే హోల్‌సేల్ మార్కెట్ల స్థానంలో ప్రధాన మార్కెట్లతో అనుసంధానించే ఎలక్ట్రానిక్ ఆధారిత ఈ–మండీలు ప్రారంభిస్తామని రెండేళ్లక్రితం కేంద్రం ప్రకటించింది. అది అమల్లోకొచ్చి కూడా ఏడాది దాటుతోంది. కానీ అవి నామమాత్రంగా మిగిలాయని, యథాప్రకారం దళారులదే పైచేయి అవుతున్నదని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఒకప్పుడు హరిత విప్లవం పేరుతో వ్యవసాయానికి అగ్ర ప్రాధాన్యమిచ్చిన ప్రభుత్వాలే ఇప్పుడు అంతకన్నా అధికాదాయం లభిస్తున్న సేవల రంగానికి, తయారీరంగానికి మళ్లాయి. వ్యవసా యాన్ని గాలికొదిలేశాయి. కనుకనే రైతుల వెతలు తీరడం లేదు. రైతులు కోరుతున్నట్టు స్వామి నాథన్ కమిటీ సిఫార్సులు సక్రమంగా అమలు చేసి, ఎక్కడికక్కడ కోల్డ్ స్టోరేజీలు నిర్మించి, దళా రుల్ని, గుత్త వ్యాపారుల్ని అరికట్టినప్పుడే రైతులు కష్టాలనుంచి గట్టెక్కుతారు. ఆ దిశగా ప్రభు త్వాలు చర్యలు ప్రారంభించాలి. -
పంట పండినా..ఫలం లేదు!
దేశంలో అన్నదాత ఆక్రోశం దేశమంతటా రైతన్నలు రోడ్డెక్కుతున్నారు. మహారాష్ట్రలో రైతులు రోడ్లకు పాలాభిషేకం చేస్తున్నారు. వీధుల్లో కూరగాయలు పారబోస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో రైతుల ఆందోళన హింసాత్మకంగా మారి ఆరుగురు అన్నదాతలను బలితీసుకుంది. గత నెల లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో రైతులు మిర్చిని తగులబెట్టి ఆందోళనకు దిగారు. ఉత్తరప్రదేశ్ రైతులూ మండిపడుతున్నారు. గుజరాత్ రైతాంగం వేడెక్కుతోంది. పంజాబ్, హరియాణాల్లోనూ రైతుల నిరసన రాజుకుంటోంది. ఇవన్నీ విడివిడిగా చూస్తే రాష్ట్రాల్లో స్థానిక సమస్యలపై ఆందోళనలుగా కనిపిస్తున్నా.. దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభం ఒకే రకమైనది. దేశ జనాభాలో సగం మంది పంట పొలాల్లో పనిచేస్తారు. కానీ.. స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా కేవలం 15 శాతమే. మరో రకంగా చెబితే.. సగం జనాభాకు ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయ రంగం ఉత్పాదకతలో మాత్రం ఆరో వంతు కూడా లేదు. అంటే అన్నదాతల ఆదాయం ఎంత తక్కువగా ఉంటుందనేది అర్థమవుతోంది. అయినా రైతన్న ఆరుగాలం శ్రమించి సాగుబడి చేస్తూనే ఉన్నాడు. చివరికి పంట చేతికొచ్చేసరికి మార్కెట్లు మాయచేసి ముంచేస్తున్నాయి. దీంతో అప్పుల ఊబిలో చిక్కుకుని ఆత్మహత్యల బాట పడుతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా మార్పులేదు. వ్యవసాయ కమిషన్ల సిఫారసులున్నా ప్రయోజనం లేదు. ఈ పరిస్థితుల్లో దేశ వ్యాప్తంగా రైతులు వీధుల్లోకి వచ్చి ఉద్యమిస్తున్నారు. వ్యవసాయ రుణాలు రద్దు చేయాలని, గిట్టుబాటు ధరలు కల్పించాలని, పెట్టుబడి రాయితీలు పెంచాలని, సాగుకు నీటి సౌకర్యం కల్పించాలనేవి వారి ప్రధాన డిమాండ్లు. తమిళనాడు నుంచి పంజాబ్ వరకూ అన్ని రాష్ట్రాల్లోనూ రైతన్న పోరుబాట పట్టడానికి దారితీస్తున్న పరిస్థితులివీ... పెరిగిన దిగుబడులు.. పడిపోయిన ధరలు దేశంలో వ్యవసాయ రంగం దశాబ్దాలుగా కరువు బారిన పడింది. రైతుల కమతాల పరిమాణాలు కుంచించుకుపోవడం, భూగర్భజలాలు అడుగంటుతుండటం, ఉత్పాదకత తగ్గిపోతుండటం, ఆధునీకరణ లోపించడం వంటి కారణాలూ దీనికి తోడవుతున్నాయి. కానీ ఇప్పుడు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, హరియాణా తదితర రాష్ట్రాల్లో రైతుల ఆందోళనకు కారణం.. అధిక దిగుబడులతో ధరలు పడిపోవడమేనని నిపుణులు చెప్తున్నారు. వరుసగా రెండేళ్ల పాటు కరవు పరిస్థితులతో వ్యవసాయ రంగం కుదేలు కాగా.. 2016లో రుతుపవనాలు అనుకూలించడంతో పంటలు సమృద్ధిగా పండాయి. 2014–15లో 0.2 శాతానికి కుదించుకుపోయిన సాగురంగం వృద్ధి రేటు 2015–16లో 1.2 శాతాన్ని దాటింది. 2016–17లో అది 4.1 శాతానికి పెరిగింది. ముఖ్యంగా పప్పు దినుసులు పండించే మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో మార్కెట్లకు ఆయా ఉత్పత్తులు వెల్లువెత్తాయి. కందిపప్పు దిగుబడి భారీగా పెరిగింది. అయితే.. అదే సమయంలో మయన్మార్, టాంజానియా, మొజాంబిక్, మలావీ నుంచి పప్పుల దిగుమతులు పెరగడంతో భారతీయ పప్పు రేటు ఒక్కసారిగా పడిపోయింది. 2015 డిసెంబర్లో క్వింటాలు ధర రూ.11,000గా ఉన్న కందిపప్పు ధర.. ఇప్పుడు రూ.4,000కు దిగజారింది. కనీస మద్దతు ధర రూ.5,050 కన్నా తక్కువ. అలాగే.. ఉల్లి, ద్రాక్ష, సోయాబీన్, మిర్చి తదితర పంటల ధరలు దారుణంగా పడిపోయాయని, ఈ విషయంలో ప్రభుత్వాలు సక్రమంగా స్పందించలేదని పరిశీలకులు చెబుతున్నారు. దెబ్బతీసిన నోట్ల రద్దు పంటల ధరలు పడిపోవడానికి ఒక ప్రధాన కారణం.. పెద్ద నోట్ల రద్దేనని కొందరు వాదిస్తున్నారు. అయితే సాగు పెట్టుబడుల కోసం అప్పులపై ఆధారపడే రైతులను నోట్ల రద్దు పెద్దగా ఇబ్బంది పెట్టలేదని.. దీంతో సాధారణం కన్నా ఎక్కువ భూమిని సాగు చేశారని వ్యవసాయ రంగ నిపుణులు వివరిస్తున్నారు. దీనికి వర్షాలు కూడా అనుకూలించడంతో దిగుబడులు బాగా వచ్చాయని.. కానీ అదనపు దిగుబడులను కొనుగోలు చేయడానికి వ్యాపారుల వద్ద తగినంత డబ్బు నిల్వలు లేకపోవడం సమస్యగా మారిందని చెప్తున్నారు. దీనివల్ల పంటల ధరలు పడిపోయాయనేది వారి వాదన. దాచుకోవాలంటే గిడ్డంగుల కొరత పంట దిగుబడులు పెరిగినపుడు నిల్వ చేసుకునేందుకు అవసరమైన గోదాములు, శీతల గిడ్డంగులు వంటి మౌలిక సదుపాయాలు లేకపోవడం, ఆహార శుద్ధి వ్యవస్థలు విస్తరించకపోవడం తరచుగా పంటల ధరలు పడిపోవడానికి కారణమవుతోందని.. ఇప్పుడు కూడా అదే జరిగిందని మరికొందరు చెప్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఉత్పత్తి అయ్యే పండ్లు, కూరగాయల్లో ఐదు శాతం కన్నా తక్కువే శుద్ధి చేసి వినియోగ వస్తువులుగా మారుస్తున్నారు. ముఖ్యంగా ఉల్లి, కూరగాయలు, పండ్లు వంటి ఉత్పత్తులను నిల్వ చేసే సామర్థ్యం పెరగపోవడం, సరఫరా వ్యవస్థ లోపాలు పెద్ద సమస్యగా ఉన్నాయని.. రైతుకు, వ్యాపారికి, వినియోగదారుడికి సంతృప్తికరమైన ధరలో ఆయా ఉత్పత్తులు ఉండేలా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని వారు విమర్శిస్తున్నారు. పంటల ఎంపికపై అవగాహన కొరత సాగు చేసే పంటలను రైతులు ముందస్తు అంచనాలతో ఎంచుకునే విధివిధానాలపై అవగాహన పెంపొందించడానికి ప్రభుత్వాల నుంచి సరైన కృషి జరగడం లేదన్న విమర్శలున్నాయి. సాధారణంగా గత ఏడాది ఏ పంటకు మంచి ధర ఉందనేది చూసుకుని రైతులు ఈ ఏడాది అవే పంటలు సాగు చేయడానికి మొగ్గు చూపుతుంటారు. ఇది అధిక ఉత్పత్తికి దారితీసి ధరలు పడిపోవడానికి కారణమవుతుందని.. లేదంటే ప్రకృతి అనుకూలించకపోతే నష్టపోవడం జరుగుతుందని మరికొందరు విశ్లేషిస్తున్నారు. పంట ఖర్చులు, రైతు కష్టానికి అనుగుణంగా ఆయా ఉత్పత్తుల ధరలను తక్షణమే సవరిస్తూ వారిని కష్టాల బారినుంచి తప్పించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంలో యూపీ బీజేపీ ప్రభుత్వం తక్షణమే మేల్కొని బంగాళాదుంపల మార్కెట్ ధరను పెంచడమే కాకుండా రైతు రుణాల మాఫీని కూడా ప్రకటించిందని.. తద్వారా రైతుల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహాన్ని చల్లార్చగలిగిందని పరిశీలకులు చెప్తున్నారు. కానీ మధ్యప్రదేశ్‌లో అదే బీజేపీ ప్రభుత్వం.. ఉల్లి ధరలు, కొనుగోళ్ల విషయంలో సరైన సమయంలో స్పందించడంలో విఫలమైందని అంటున్నారు. సాగునీటి సౌకర్యాల లేమి దేశంలో సాగు చేసే పంట భూముల్లో 52 శాతం భూములు ఇప్పటికీ వర్షాల పైనే ఆధారపడి ఉన్నాయి. అంటే.. సగం వ్యవసాయం వర్షాధారమే. ఇది రైతుల జీవితాలను తీవ్ర అనిశ్చితిలో పడేస్తోంది. మరోవైపు వాతావరణ మార్పు పర్యవసానంగా భూగర్భ జలాలూ తగ్గిపోతున్నాయి. పైగా.. దేశంలో 80 శాతం మంది రైతులు నీరు అధికంగా అవసరమయ్యే గోధుమ, వరి వంటి పంటలే పండిస్తున్నారు. దీనివల్ల భూగర్భ జలాలు వేగంగా పడిపోతూ తర్వాతి పంటలకు అనుకూలించడం లేదు. గడచిన ఆరు దశాబ్దాల్లో సాగునీటి రంగం మీద 3.5 లక్షల కోట్లు వ్యయం చేసినా ఇంకా సగం భూములకు కూడా నీటి సదుపాయం లభించడం లేదు. అవినీతి.. మార్కెట్ మోసాలు ప్రభుత్వ యంత్రాంగంలో పేరుకుపోయిన అవినీతి, అలసత్వం.. ప్రభుత్వ విధివిధానాల జరిగే జాప్యం రైతాంగానికి మరో శాపంగా పరిణమించాయి. చాలా మంది చిన్న రైతులు తమ పంటలను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించడానికి ఇష్టపడకపోవడానికి ఇదే కారణం. మద్దతు ధరకు కొనుగోలు చేసే ఈ కేంద్రాల్లో విక్రయిస్తే.. ఆ సొమ్ములు చేతికి రావడానికి నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి. దీంతో కాస్త తక్కువ ధరకైనా సరే ప్రైవేటు వ్యాపారులకు అమ్మేస్తున్నారు. దేశవ్యాప్తమవుతున్న మాఫీ డిమాండ్... అధికార పీఠాన్ని అందుకోవడానికి ‘రుణ మాఫీ’ చేస్తామని ఎన్నికల హామీ ఇవ్వడం... ఆపై ఆ మొత్తాన్ని సర్దుబాటు చేయలేక రాష్ట్రంపై అప్పుల భారం పెరగడం ఇప్పుడు ప్రతిచోటా జరుగుతోంది. 2008లో మన్మోహన్సింగ్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం రూ.65,000 కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేసింది. ఇది 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కలిసొచ్చి మరోసారి అధికారం చేపట్టింది. ఇక అప్పటినుంచి జాతీయ, ప్రాంతీయ పార్టీలు... రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టి లో పెట్టుకోకుండా అధికారమే పరమావధిగా ‘రుణమాఫీ’ హామీ ఇస్తున్నాయి. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ రుణమాఫీ హామీనిచ్చి... నాలుగు విడతల్లో 17,000 కోట్లను మాఫీ చేసింది. ఏపీలో చంద్రబాబు ఇదే హామీనిచ్చి... మాయ చేసి ‘మమ’ అనిపించారు. 2016లో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఐదు ఎకరాల్లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులకు రూ. 5,780 కోట్ల రుణాలను మాఫీ చేశారు. తర్వాత కోర్టు ఆదేశంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం మిగతా రైతులకు మరో 1,980 కోట్లు మాఫీ చేయాల్సి వచ్చింది. ఈ ఏడాది మార్చిలో యూపీ సీఎంగా అధికారం చేపట్టిన యోగి ఆదిత్యనాథ్ దాస్ ఎన్నికల హామీ మేరకు రూ. 36,359 కోట్ల రుణాలను మాఫీ చేస్తున్న ట్లు ప్రకటించారు. దీని ప్రభావం ముందుగా బీజేపీ పాలిత రాష్ట్రాలైన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లపై పడింది. క్రమేపీ దేశం లోని మరిన్ని రాష్ట్రాల్లో రుణమాఫీ డిమాండ్ తెరపైకి వస్తోం ది. పంజాబ్‌లో రుణమాఫీ హామీని మేనిఫెస్టోలో పెట్టిన కాం గ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడక్కడ రైతులు రుణమాఫీ ఎప్పుడు చేస్తారని నిలదీస్తున్నారు. హరియాణా, రాజస్థాన్‌లోనూ రుణమాఫీ డిమాండ్లు బలంగా వినపడుతున్నాయి. స్వామినాథన్ కమిషన్ సిఫారసులు ఇవీ... ► కేంద్రం 2004 నవంబర్‌లో ప్రొ. స్వామినాథన్ అధ్యక్షతన రైతులపై జాతీయ కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ 2006 అక్టోబర్ నాటికి ప్రభుత్వానికి ఐదు నివేదికలు సమర్పించింది. ఇప్పటికి పదేళ్లయినా అమలు చేసింది వీసమెత్తయినా లేదన్న విమర్శలున్నాయి. కమిషన్ ఏం సూచించిందంటే... ► రైతులకు వ్యవసాయానికి అవసరమైన భూమి, నీరు, జీవవనరులు, రుణం, బీమా, విజ్ఞాన నిర్వహణ, మార్కెట్లు తదితర కనీస వనరుల అందుబాటుపై భరోసా ఉండాలి. వాటిపై రైతులకు హక్కులు, వారి నియంత్రణ ఉండాలి. వ్యవసాయాన్ని రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాలోకి మార్చాలి. తద్వారా కేంద్ర, రాష్ట్రలు రెండూ ఈ రంగంపై ప్రధాన దృష్టి కేంద్రీకరించేందుకు వీలవుతుంది. ► 1991–92లో దేశ గ్రామీణ జనాభాలో 50 శాతం మంది పేదవర్గాల వద్ద కేవలం మూడు శాతం భూమి మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో సీలింగ్, మిగులు భూములను, బంజరు భూములను పంపిణీ చేయాలి. ప్రధాన వ్యవసాయ భూములను, అడవులను వ్యవసాయేతర అవసరాల కోసం కార్పొరేట్ రంగానికి బదిలీ చేయడం ఆపాలి. ►వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేయాలి. భూగర్భ జల మట్టాలను పునరుద్ధరించాలి. ప్రైవేటు బావులు లక్ష్యంగా పది లక్షల బావుల పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టాలి. ►అధిక ఉత్పాదకత రేటు సాధించడం కోసం వ్యవసాయ సంబంధిత మౌలిక సదుపాయాలు.. ప్రత్యేకించి సాగునీటి సరఫరా, మురుగు పారుదల, భూమి అభివృద్ధి, నీటి పరిరక్షణ, పరిశోధన అభివృద్ధి, రహదారుల అనుసంధానం వంటి వాటిలో ప్రభుత్వ పెట్టుబడులను గణనీయంగా పెంచాలి. ►వ్యవస్థీకృత రుణ వ్యవస్థ అందుబాటును విస్తరించాలి. పంట రుణాల వడ్డీ రేట్లను 4 శాతానికి తగ్గించడం, రుణాల వసూళ్లపై మారటోరియం విధించడం, వ్యవసాయ విపత్తు నిధిని ఏర్పాటు చేయడం, మహిళా రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు అందించడం వంటి చర్యలు తీసుకోవాలి. ► పోషకాహార మద్దతు పథకాలను పునర్వ్యవస్థీకరిస్తూ సార్వజనీన ప్రజా పంపిణీ వ్యవస్థను అమలు చేయాలి. సూక్ష్మపోషకాల లోపం నిర్మూలన, మహిళా స్వయం సహాయక బృందాల నిర్వహణలో సామాజిక ఆహార, నీటి బ్యాంకుల ఏర్పాటు, చిన్న, సన్నకారు రైతులకు సాయం, జాతీయ ఆహార భద్రత చట్టం రూపకల్పన తదితర చర్యలు తీసుకోవాలి. నిజాయితీగా తీసుకున్న అప్పును తిరిగి చెల్లించే సంస్కృతికి ఇది విఘాతం కలిగిస్తుంది. రుణ క్రమశిక్షణపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. భవిష్యత్తులో రుణాలు తీసుకునేవారు తిరిగి దాన్ని చెల్లించకుండా ఉండేలా ప్రోత్సహిస్తుంది. మాఫీ అనేది నైతికతను ప్రమాదంలో పడేస్తుంది. ఎన్నికల సమయంలో రుణమాఫీ జోలికి పార్టీలు వెళ్లకుండా... ఏకాభిప్రాయం సాధించాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం.. – ఉర్జిత్ పటేల్, ఆర్బీఐ గవర్నర్ – సాక్షి నాలెడ్జ్ సెంటర్