పంట పండినా..ఫలం లేదు! | Formers Demand for Debt waiver | Sakshi
Sakshi News home page

పంట పండినా..ఫలం లేదు!

Published Sat, Jun 10 2017 2:21 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

పంట పండినా..ఫలం లేదు! - Sakshi

పంట పండినా..ఫలం లేదు!

దేశంలో అన్నదాత ఆక్రోశం
దేశమంతటా రైతన్నలు రోడ్డెక్కుతున్నారు. మహారాష్ట్రలో రైతులు రోడ్లకు పాలాభిషేకం చేస్తున్నారు. వీధుల్లో కూరగాయలు పారబోస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో రైతుల ఆందోళన హింసాత్మకంగా మారి ఆరుగురు అన్నదాతలను బలితీసుకుంది. గత నెల లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో రైతులు మిర్చిని తగులబెట్టి ఆందోళనకు దిగారు. ఉత్తరప్రదేశ్‌ రైతులూ మండిపడుతున్నారు. గుజరాత్‌ రైతాంగం వేడెక్కుతోంది. పంజాబ్, హరియాణాల్లోనూ రైతుల నిరసన రాజుకుంటోంది. ఇవన్నీ విడివిడిగా చూస్తే రాష్ట్రాల్లో స్థానిక సమస్యలపై ఆందోళనలుగా కనిపిస్తున్నా.. దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభం ఒకే రకమైనది.

దేశ జనాభాలో సగం మంది పంట పొలాల్లో పనిచేస్తారు. కానీ.. స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా కేవలం 15 శాతమే. మరో రకంగా చెబితే.. సగం జనాభాకు ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయ రంగం ఉత్పాదకతలో మాత్రం ఆరో వంతు కూడా లేదు. అంటే అన్నదాతల ఆదాయం ఎంత తక్కువగా ఉంటుందనేది అర్థమవుతోంది. అయినా రైతన్న ఆరుగాలం శ్రమించి సాగుబడి చేస్తూనే ఉన్నాడు. చివరికి పంట చేతికొచ్చేసరికి మార్కెట్లు మాయచేసి ముంచేస్తున్నాయి.

దీంతో అప్పుల ఊబిలో చిక్కుకుని ఆత్మహత్యల బాట పడుతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా మార్పులేదు. వ్యవసాయ కమిషన్ల సిఫారసులున్నా ప్రయోజనం లేదు. ఈ పరిస్థితుల్లో దేశ వ్యాప్తంగా రైతులు వీధుల్లోకి వచ్చి ఉద్యమిస్తున్నారు. వ్యవసాయ రుణాలు రద్దు చేయాలని, గిట్టుబాటు ధరలు కల్పించాలని, పెట్టుబడి రాయితీలు పెంచాలని, సాగుకు నీటి సౌకర్యం కల్పించాలనేవి వారి ప్రధాన డిమాండ్లు. తమిళనాడు నుంచి పంజాబ్‌ వరకూ అన్ని రాష్ట్రాల్లోనూ రైతన్న పోరుబాట పట్టడానికి దారితీస్తున్న పరిస్థితులివీ...

పెరిగిన దిగుబడులు.. పడిపోయిన ధరలు
దేశంలో వ్యవసాయ రంగం దశాబ్దాలుగా కరువు బారిన పడింది. రైతుల కమతాల పరిమాణాలు కుంచించుకుపోవడం, భూగర్భజలాలు అడుగంటుతుండటం, ఉత్పాదకత తగ్గిపోతుండటం, ఆధునీకరణ లోపించడం వంటి కారణాలూ దీనికి తోడవుతున్నాయి. కానీ ఇప్పుడు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, హరియాణా తదితర రాష్ట్రాల్లో రైతుల ఆందోళనకు కారణం.. అధిక దిగుబడులతో ధరలు పడిపోవడమేనని నిపుణులు చెప్తున్నారు. వరుసగా రెండేళ్ల పాటు కరవు పరిస్థితులతో వ్యవసాయ రంగం కుదేలు కాగా.. 2016లో రుతుపవనాలు అనుకూలించడంతో పంటలు సమృద్ధిగా పండాయి.

2014–15లో 0.2 శాతానికి కుదించుకుపోయిన సాగురంగం వృద్ధి రేటు 2015–16లో 1.2 శాతాన్ని దాటింది. 2016–17లో అది 4.1 శాతానికి పెరిగింది. ముఖ్యంగా పప్పు దినుసులు పండించే మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, గుజరాత్‌ తదితర రాష్ట్రాల్లో మార్కెట్లకు ఆయా ఉత్పత్తులు వెల్లువెత్తాయి. కందిపప్పు దిగుబడి భారీగా పెరిగింది. అయితే.. అదే సమయంలో మయన్మార్, టాంజానియా, మొజాంబిక్, మలావీ నుంచి పప్పుల దిగుమతులు పెరగడంతో భారతీయ పప్పు రేటు ఒక్కసారిగా పడిపోయింది. 2015 డిసెంబర్‌లో క్వింటాలు ధర రూ.11,000గా ఉన్న కందిపప్పు ధర.. ఇప్పుడు రూ.4,000కు దిగజారింది. కనీస మద్దతు ధర రూ.5,050 కన్నా తక్కువ. అలాగే.. ఉల్లి, ద్రాక్ష, సోయాబీన్, మిర్చి తదితర పంటల ధరలు దారుణంగా పడిపోయాయని, ఈ విషయంలో ప్రభుత్వాలు సక్రమంగా స్పందించలేదని పరిశీలకులు చెబుతున్నారు.

దెబ్బతీసిన నోట్ల రద్దు
పంటల ధరలు పడిపోవడానికి ఒక ప్రధాన కారణం.. పెద్ద నోట్ల రద్దేనని కొందరు వాదిస్తున్నారు. అయితే సాగు పెట్టుబడుల కోసం అప్పులపై ఆధారపడే రైతులను నోట్ల రద్దు పెద్దగా ఇబ్బంది పెట్టలేదని.. దీంతో సాధారణం కన్నా ఎక్కువ భూమిని సాగు చేశారని వ్యవసాయ రంగ నిపుణులు వివరిస్తున్నారు. దీనికి వర్షాలు కూడా అనుకూలించడంతో దిగుబడులు బాగా వచ్చాయని.. కానీ అదనపు దిగుబడులను కొనుగోలు చేయడానికి వ్యాపారుల వద్ద తగినంత డబ్బు నిల్వలు లేకపోవడం సమస్యగా మారిందని చెప్తున్నారు. దీనివల్ల పంటల ధరలు పడిపోయాయనేది వారి వాదన.

దాచుకోవాలంటే గిడ్డంగుల కొరత
పంట దిగుబడులు పెరిగినపుడు నిల్వ చేసుకునేందుకు అవసరమైన గోదాములు, శీతల గిడ్డంగులు వంటి మౌలిక సదుపాయాలు లేకపోవడం, ఆహార శుద్ధి వ్యవస్థలు విస్తరించకపోవడం తరచుగా పంటల ధరలు పడిపోవడానికి కారణమవుతోందని.. ఇప్పుడు కూడా అదే జరిగిందని మరికొందరు చెప్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఉత్పత్తి అయ్యే పండ్లు, కూరగాయల్లో ఐదు శాతం కన్నా తక్కువే శుద్ధి చేసి వినియోగ వస్తువులుగా మారుస్తున్నారు. ముఖ్యంగా ఉల్లి, కూరగాయలు, పండ్లు వంటి ఉత్పత్తులను నిల్వ చేసే సామర్థ్యం పెరగపోవడం, సరఫరా వ్యవస్థ లోపాలు పెద్ద సమస్యగా ఉన్నాయని.. రైతుకు, వ్యాపారికి, వినియోగదారుడికి సంతృప్తికరమైన ధరలో ఆయా ఉత్పత్తులు ఉండేలా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని వారు విమర్శిస్తున్నారు.

పంటల ఎంపికపై అవగాహన కొరత
సాగు చేసే పంటలను రైతులు ముందస్తు అంచనాలతో ఎంచుకునే విధివిధానాలపై అవగాహన పెంపొందించడానికి ప్రభుత్వాల నుంచి సరైన కృషి జరగడం లేదన్న విమర్శలున్నాయి. సాధారణంగా గత ఏడాది ఏ పంటకు మంచి ధర ఉందనేది చూసుకుని రైతులు ఈ ఏడాది అవే పంటలు సాగు చేయడానికి మొగ్గు చూపుతుంటారు. ఇది అధిక ఉత్పత్తికి దారితీసి ధరలు పడిపోవడానికి కారణమవుతుందని.. లేదంటే ప్రకృతి అనుకూలించకపోతే నష్టపోవడం జరుగుతుందని మరికొందరు విశ్లేషిస్తున్నారు.

పంట ఖర్చులు, రైతు కష్టానికి అనుగుణంగా ఆయా ఉత్పత్తుల ధరలను తక్షణమే సవరిస్తూ వారిని కష్టాల బారినుంచి తప్పించాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ విషయంలో యూపీ బీజేపీ ప్రభుత్వం తక్షణమే మేల్కొని బంగాళాదుంపల మార్కెట్‌ ధరను పెంచడమే కాకుండా రైతు రుణాల మాఫీని కూడా ప్రకటించిందని.. తద్వారా రైతుల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహాన్ని చల్లార్చగలిగిందని పరిశీలకులు చెప్తున్నారు. కానీ మధ్యప్రదేశ్‌లో అదే బీజేపీ ప్రభుత్వం.. ఉల్లి ధరలు, కొనుగోళ్ల విషయంలో సరైన సమయంలో స్పందించడంలో విఫలమైందని అంటున్నారు.

సాగునీటి సౌకర్యాల లేమి
దేశంలో సాగు చేసే పంట భూముల్లో 52 శాతం భూములు ఇప్పటికీ వర్షాల పైనే ఆధారపడి ఉన్నాయి. అంటే.. సగం వ్యవసాయం వర్షాధారమే. ఇది రైతుల జీవితాలను తీవ్ర అనిశ్చితిలో పడేస్తోంది. మరోవైపు వాతావరణ మార్పు పర్యవసానంగా భూగర్భ జలాలూ తగ్గిపోతున్నాయి. పైగా.. దేశంలో 80 శాతం మంది రైతులు నీరు అధికంగా అవసరమయ్యే గోధుమ, వరి వంటి పంటలే పండిస్తున్నారు. దీనివల్ల భూగర్భ జలాలు వేగంగా పడిపోతూ తర్వాతి పంటలకు అనుకూలించడం లేదు. గడచిన ఆరు దశాబ్దాల్లో సాగునీటి రంగం మీద 3.5 లక్షల కోట్లు వ్యయం చేసినా ఇంకా సగం భూములకు కూడా నీటి సదుపాయం లభించడం లేదు.

అవినీతి.. మార్కెట్‌ మోసాలు
ప్రభుత్వ యంత్రాంగంలో పేరుకుపోయిన అవినీతి, అలసత్వం.. ప్రభుత్వ విధివిధానాల జరిగే జాప్యం రైతాంగానికి మరో శాపంగా పరిణమించాయి. చాలా మంది చిన్న రైతులు తమ పంటలను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించడానికి ఇష్టపడకపోవడానికి ఇదే కారణం. మద్దతు ధరకు కొనుగోలు చేసే ఈ కేంద్రాల్లో విక్రయిస్తే.. ఆ సొమ్ములు చేతికి రావడానికి నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి. దీంతో కాస్త తక్కువ ధరకైనా సరే ప్రైవేటు వ్యాపారులకు అమ్మేస్తున్నారు.

దేశవ్యాప్తమవుతున్న మాఫీ డిమాండ్‌...
అధికార పీఠాన్ని అందుకోవడానికి ‘రుణ మాఫీ’ చేస్తామని ఎన్నికల హామీ ఇవ్వడం... ఆపై ఆ మొత్తాన్ని సర్దుబాటు చేయలేక రాష్ట్రంపై అప్పుల భారం పెరగడం ఇప్పుడు ప్రతిచోటా జరుగుతోంది. 2008లో మన్మోహన్‌సింగ్‌ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం రూ.65,000 కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేసింది. ఇది 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కలిసొచ్చి మరోసారి అధికారం చేపట్టింది. ఇక అప్పటినుంచి జాతీయ, ప్రాంతీయ పార్టీలు... రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టి లో పెట్టుకోకుండా అధికారమే పరమావధిగా ‘రుణమాఫీ’ హామీ ఇస్తున్నాయి. 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ రుణమాఫీ హామీనిచ్చి... నాలుగు విడతల్లో 17,000 కోట్లను మాఫీ చేసింది. ఏపీలో చంద్రబాబు ఇదే హామీనిచ్చి... మాయ చేసి ‘మమ’ అనిపించారు. 2016లో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఐదు ఎకరాల్లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులకు రూ. 5,780 కోట్ల రుణాలను మాఫీ చేశారు.

తర్వాత కోర్టు ఆదేశంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం మిగతా రైతులకు మరో 1,980 కోట్లు మాఫీ చేయాల్సి వచ్చింది. ఈ ఏడాది మార్చిలో యూపీ సీఎంగా అధికారం చేపట్టిన యోగి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఎన్నికల హామీ మేరకు రూ. 36,359 కోట్ల రుణాలను మాఫీ చేస్తున్న ట్లు ప్రకటించారు. దీని ప్రభావం ముందుగా బీజేపీ పాలిత రాష్ట్రాలైన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లపై పడింది. క్రమేపీ దేశం లోని మరిన్ని రాష్ట్రాల్లో రుణమాఫీ డిమాండ్‌ తెరపైకి వస్తోం ది. పంజాబ్‌లో రుణమాఫీ హామీని మేనిఫెస్టోలో పెట్టిన కాం గ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడక్కడ రైతులు రుణమాఫీ ఎప్పుడు చేస్తారని నిలదీస్తున్నారు. హరియాణా, రాజస్థాన్‌లోనూ రుణమాఫీ డిమాండ్లు బలంగా వినపడుతున్నాయి.

స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసులు ఇవీ...
► కేంద్రం 2004 నవంబర్‌లో ప్రొ. స్వామినాథన్‌ అధ్యక్షతన రైతులపై జాతీయ కమిషన్‌ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్‌ 2006 అక్టోబర్‌ నాటికి ప్రభుత్వానికి ఐదు నివేదికలు సమర్పించింది. ఇప్పటికి పదేళ్లయినా అమలు చేసింది వీసమెత్తయినా లేదన్న విమర్శలున్నాయి. కమిషన్‌ ఏం సూచించిందంటే...
► రైతులకు వ్యవసాయానికి అవసరమైన భూమి, నీరు, జీవవనరులు, రుణం, బీమా, విజ్ఞాన నిర్వహణ, మార్కెట్లు తదితర కనీస వనరుల అందుబాటుపై భరోసా ఉండాలి. వాటిపై రైతులకు హక్కులు, వారి నియంత్రణ ఉండాలి. వ్యవసాయాన్ని రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాలోకి మార్చాలి. తద్వారా కేంద్ర, రాష్ట్రలు రెండూ ఈ రంగంపై ప్రధాన దృష్టి కేంద్రీకరించేందుకు వీలవుతుంది.
► 1991–92లో దేశ గ్రామీణ జనాభాలో 50 శాతం మంది పేదవర్గాల వద్ద కేవలం మూడు శాతం భూమి మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో సీలింగ్, మిగులు భూములను, బంజరు భూములను పంపిణీ చేయాలి. ప్రధాన వ్యవసాయ భూములను, అడవులను వ్యవసాయేతర అవసరాల కోసం కార్పొరేట్‌ రంగానికి బదిలీ చేయడం ఆపాలి.
►వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేయాలి. భూగర్భ జల మట్టాలను పునరుద్ధరించాలి. ప్రైవేటు బావులు లక్ష్యంగా పది లక్షల బావుల పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టాలి.
►అధిక ఉత్పాదకత రేటు సాధించడం కోసం వ్యవసాయ సంబంధిత మౌలిక సదుపాయాలు.. ప్రత్యేకించి సాగునీటి సరఫరా, మురుగు పారుదల, భూమి అభివృద్ధి, నీటి పరిరక్షణ, పరిశోధన అభివృద్ధి, రహదారుల అనుసంధానం వంటి వాటిలో ప్రభుత్వ పెట్టుబడులను గణనీయంగా పెంచాలి.
►వ్యవస్థీకృత రుణ వ్యవస్థ అందుబాటును విస్తరించాలి. పంట రుణాల వడ్డీ రేట్లను 4 శాతానికి తగ్గించడం, రుణాల వసూళ్లపై మారటోరియం విధించడం, వ్యవసాయ విపత్తు నిధిని ఏర్పాటు చేయడం, మహిళా రైతులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు అందించడం వంటి చర్యలు తీసుకోవాలి.
► పోషకాహార మద్దతు పథకాలను పునర్‌వ్యవస్థీకరిస్తూ సార్వజనీన ప్రజా పంపిణీ వ్యవస్థను అమలు చేయాలి. సూక్ష్మపోషకాల లోపం నిర్మూలన, మహిళా స్వయం సహాయక బృందాల నిర్వహణలో సామాజిక ఆహార, నీటి బ్యాంకుల ఏర్పాటు, చిన్న, సన్నకారు రైతులకు సాయం, జాతీయ ఆహార భద్రత చట్టం రూపకల్పన తదితర చర్యలు తీసుకోవాలి.


నిజాయితీగా తీసుకున్న అప్పును తిరిగి చెల్లించే సంస్కృతికి ఇది విఘాతం కలిగిస్తుంది. రుణ క్రమశిక్షణపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. భవిష్యత్తులో రుణాలు తీసుకునేవారు తిరిగి దాన్ని చెల్లించకుండా ఉండేలా ప్రోత్సహిస్తుంది. మాఫీ అనేది నైతికతను ప్రమాదంలో పడేస్తుంది. ఎన్నికల సమయంలో రుణమాఫీ జోలికి పార్టీలు వెళ్లకుండా... ఏకాభిప్రాయం సాధించాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం.. – ఉర్జిత్‌ పటేల్, ఆర్బీఐ గవర్నర్‌

సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement