నిరసన తెలుపుతున్న రైతులు
ప్రతి బియ్యపు గింజపైనా తినేవాడి పేరు రాసుంటుందంటారు. అదినిజమో కాదో కానీ రైతన్నలు పండించే ప్రతి బియ్యపు గింజలోనూ అతడి చెమటచుక్కలు ఇంకి ఉంటాయి. జనం ఆకలితీర్చే రైతన్న కడుపు మండితే ఏమౌతుందో ఇటీవల ముంబై పురవీధుల్లో కవాతుతొక్కిన మట్టికాళ్ళ మహాపాదయాత్ర చాటిచెప్పింది. అదే రైతు కడుపు మాడినప్పుడు, నిర్లక్ష్యానికి గురైనప్పుడు, బతికే మార్గమే లేనప్పుడు చావును వెతుక్కుంటాడు.
ఈ రోజు(సోమవారం) మహారాష్ట్రలోని 91 మంది రైతన్నలు దాదాపు అదే మార్గాన్ని వెతుక్కున్నారు. అయితే వాళ్ళు కోరుకున్నది బలవన్మరణం కాదు. కారుణ్యమరణం. ఇటీవల సుప్రీంకోర్టు జీవించే హక్కు మాదిరిగానే తప్పనిసరి పరిస్థితి (మెడికల్ కండిషన్)లో చనిపోయే హక్కు పౌరుడికి ఉంటుందని తీర్పిచ్చిన నేపథ్యంలో మహారాష్ట్రలోని బల్ధానా జిల్లా కి చెందిన 91 మంది రైతన్నలు కారుణ్యమరణాన్ని ప్రసాదించాల్సిందిగా గవర్నర్‌కి విజ్ఞప్తి చేశారు.
తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామనీ, తమ కుటుంబ సభ్యుల ఆకలితీర్చే స్థితిలో కూడా లేమనీ, చివరకు హైవే నిర్మాణంలో కోల్పోయిన భూములకు సరైన నష్టపరిహారాన్ని కూడా ఇవ్వకపోవడంతో తమకు మరణమే శరణ్యమనీ భావిస్తూ మరణించే అవకాశాన్ని కల్పించాలంటూ సోమవారం గవర్నర్‌కి లేఖరాసారు. బతుకు భారమైన పరిస్థితుల్లో తమకి చట్టబద్దంగా మరణించేందుకు కారుణ్యమరణం రూపంలో అనుమతివ్వాలంటూ అన్నదాతలు గవర్నర్‌కీ, సబ్‌డివిజనల్ ఆఫీసర్‌కి లేఖ ఇచ్చారు.
మహారాష్ట్రలో గత ఏడాది జనవరి 1 నుంచి అక్టోబర్ 31 లోపు 2,414 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్టు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. మహారాష్ట్రలోని విదర్భలోని అమరావతీ డివిజన్‌లో అత్యధిక సంఖ్యలో 907 మంది, మరట్వాడా జిల్లాలోని ఔరంగాబాద్ డివిజన్‌లో 789 మంది రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. విదర్భ, మరట్వాడా రెండూ కలిపి మొత్తం 19 జిల్లాల్లో వ్యవసాయ సంక్షోభం, బతుకుఛిద్రమైన రైతన్నలకు రుణమాఫీ అందకపోవడమే కారణమని ముంబై మహాపాదయాత్రని నడిపించిన సీపీఎం అనుబంధ సంస్థ ఆల్ ఇండియా కిసాన్ సభ పేర్కొంటోంది.
జస్టిస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులనూ, అలాగే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ను అమలు చేయాలన్న మహాపాదయాత్ర ప్రధాన డిమాండ్లను సైతం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చిన తరువాతనే మహాపాదయాత్రకు తరలివచ్చిన రైతన్నలు వెనుదిరిగారు. ఇప్పుడు మరోమారు కారుణ్యమరణానికి అర్జీ పెట్టుకోవడం అన్నదాతల కృతనిశ్చయాన్ని స్పష్టం చేస్తోంది.–సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment