నిస్సహాయ స్థితిలో పంట రుణం కోసం వచ్చిన మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడో కామాంధుడు. కోరికలు తీర్చాలంటూ బ్యాంక్ మేనేజర్ వేధించాడు. ఏకంగా ఇంటికే రాయబారం పంపటంతో సహనం నశించిన ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో విషయం వెలుగు చూసింది.
సాక్షి, ముంబై: బుల్దానా జిల్లా మల్కాపూర్ మండలంలో నివసిస్తున్న రైతు దంపతులు.. లోన్ కోసం జిల్లా కేంద్రంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆశ్రయించారు. అయితే బ్యాంక్ మేనేజర్ రాజేష్ హివాసె సదరు మహిళపై కన్నేశాడు. లోన్ దరఖాస్తులోని ఆమె ఫోన్ నంబర్‌కు ఫోన్‌కాల్ చేసి ‘కోరిక తీర్చాలంటూ’ వేధించాడు. అయితే లోన్ జారీఅయ్యే సమయంలో గొడవ కావటం ఇష్టం లేని ఆమె విషయాన్ని భర్తకు చెప్పలేదు. ఈ దశలో లోన్‌ను హోల్డ్‌లో పెట్టిన రాజేష్.. తన అటెండర్‌ను సదరు మహిళ ఇంటికి పంపి రాయబారం నడపాలని యత్నించాడు.
రుణంతోపాటు అదనంగా లాభాలు, కొంత ప్యాకేజీ కూడా మేనేజర్ ద్వారా ఇప్పిస్తానని సదరు ప్యూన్ ఆమెతో చెప్పాడు. అతని మాటలు వినగానే ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. వెంటబడి రోకలిబండతో అతన్ని తరిమి కొట్టింది. స్థానికులు గుమిగూడటంతో ఆ అటెండర్ అక్కడి నుంచి దౌడుతీశాడు. రాజేష్ కాల్ రికార్డింగ్స్‌తోసహా పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. బాధిత మహిళ దళితురాలు కావటంతో అట్రాసిటీ కేసు, లైంగిక వేధింపుల కేసులు నమోదు చేసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న మేనేజర్ రాజేశ్, అటెండర్‌ల కోసం గాలింపు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment