ఆర్మూర్: రైతులు నామినేషన్లు వేసింది గెలుపు కోసం కాదని, తమ కడుపు మంట పాలకుల దృష్టికి తీసుకెళ్లడానికేనని మాజీ ఎమ్మెల్సీ, రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్‌రావు వ్యాఖ్యానించారు. ఈ పోరాటం ఆరంభం మాత్రమేనని చెప్పారు. మంగళవారం ఆర్మూర్‌లో నిర్వహించిన నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి నామినేషన్లు వేసిన 178 మంది రైతుల ఐక్యత సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పసుపు, ఎర్రజొన్న రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడం చాలా చిన్న విషయమని పేర్కొన్నారు. రైతులు ఆత్మహత్యల నుంచి ఎన్నికల్లో పోటీ చేసే స్థాయికి పోరాటాన్ని తీసుకురావడం అభినందనీయమని చెప్పారు.
కేవలం పసుపు బోర్డును సాధించుకోవడంతో ఆపేయకుండా పసుపు, ఎర్రజొన్నలకు గిట్టుబాటు ధర, రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం అయ్యేంత వరకు ఉద్యమాన్ని కొనసాగించాలని సూచించారు. నిజామాబాద్, జగిత్యాల జిల్లాల రైతాంగం చేస్తున్న పోరాటం యావత్ దేశంలోని రైతులకు ఆదర్శంగా నిలవాలన్నారు. ఐదు రూపాయలకు కిలో టమాటలు లభించే సమయంలో సూపర్‌మార్కెట్‌లో టమాట పచ్చడి వంద రూపాయలకు లభిస్తోందని, అంటే పంట పండించిన రైతులకు కాకుండా ఆ పంటపై వ్యాపారం చేసే వ్యాపారస్తులకే అధిక లాభాలు రావడం విచారకరమన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి రైతుల డిమాండ్లను పరిష్కరించలేని వారు ఇప్పుడు రైతులు నామినేషన్లు వేయగానే అధికారంలోకి వచ్చిన ఐదు రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తామని హామీలు ఇవ్వడం రైతుల విజయమన్నారు.
‘స్థానిక’ఎన్నికల్లోనూ నామినేషన్లు వేయాలి
నామినేషన్లు వేసిన రైతులకే ఓటు వేయాలని తీర్మానించారు. పసుపు పంట క్వింటాలుకు 15 వేల రూపాయలు, ఎర్రజొన్న పంట క్వింటాలుకు 3,500 రూపాయలకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. స్వామినాథన్ కమిషన్‌ను అమలు చేయాలని, సమస్యలపై రైతులంతా ఒక్కటిగా ఉండి పోరాటాన్ని కొనసాగించాలని, ఎన్నికల వేళ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక రైతుల సమస్యలు పరిష్కరించని రాజకీయ పార్టీలను గ్రామాల్లోకి రానివ్వకుండా బహిష్కరించాలని తీర్మానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం రైతులు నామినేషన్లు వేసి నిరసన తెలపాలని, రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని, మల్లాపూర్, ముత్యంపేట, బోధన్ షుగర్ ఫ్యాక్టరీలను పునరుద్ధరించాలని, రైతుల ఓట్లు రైతులకే వేయాలని తీర్మానాలు చేశారు. ఈ సభలో సుమారు ఐదు వేల మంది రైతులు పాల్గొన్నారు.
రైతు పోరాటం ఆరంభమే
Published Wed, Apr 10 2019 2:18 AM | Last Updated on Wed, Apr 10 2019 2:18 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment