Seed Policy In Andhra Pradesh For The First Time In India - Sakshi
Sakshi News home page

AP: రైతుకు విత్తన భరోసా

Published Mon, Oct 18 2021 2:26 AM | Last Updated on Mon, Oct 18 2021 3:03 PM

Seed policy in Andhra Pradesh for the first time in India - Sakshi

విజయనగరం జిల్లా సాలూరులోని ఆంధ్రప్రదేశ్‌ విత్తనాభివృద్ధి సంస్థ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లో విత్తనాలను ప్యాకింగ్‌ చేస్తున్న కూలీలు

సాక్షి, అమరావతి: అన్నదాతకు మరింత భరోసా ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు ముందుకు వేసింది. దేశంలో తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నూతన విత్తన విధానం (సీడ్‌ పాలసీ) తీసుకొచ్చింది. భవిష్యత్‌ అవసరాలకు తగినట్టుగా జన్యుపరంగా అభివృద్ధి చేసిన నాణ్యమైన, ధ్రువీకరించిన విత్తనాన్ని సకాలంలో రైతులకు అందజేయడమే ఈ విధానం లక్ష్యం. తద్వారా రైతన్నకు భరోసా, భద్రత లభించనుంది. రాష్ట్రంలో ఖరీఫ్‌ సీజన్‌లో 92.45 లక్షల ఎకరాల్లో, రబీ సీజన్‌లో 58.65 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలు.. 44.60 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి.

వ్యవసాయ పంటలకు 22.81 లక్షల క్వింటాళ్లు.. పత్తి, మొక్కజొన్న, జొన్న, బాజ్రా పంటలకు 72 వేల క్వింటాళ్లు, ఉద్యాన పంటలకు సంబంధించి కూరగాయలు, మిరప పంటలకు 1.20 లక్షల క్వింటాళ్లు కలిపి మొత్తం 24.73 లక్షల క్వింటాళ్ల విత్తనం అవసరం. 9.20 లక్షల క్వింటాళ్ల విత్తనాలను ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ, 11.33 లక్షల క్వింటాళ్లు ప్రైవేటు కంపెనీలు ఉత్పత్తి చేస్తుంటే 3.13 లక్షల క్వింటాళ్ల విత్తనాలను రైతు సంఘాలు తయారు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో ఏటా రూ.1400 కోట్ల నుంచి రూ.1500 కోట్ల విలువైన విత్తన వ్యాపారం జరుగుతోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ఫలితంగా రైతుల విత్తన కష్టాలకు తెర పడింది. దీనికి తోడు విత్తన పాలసీ వల్ల మరింత మేలు జరగనుంది. 

రైతుల భాగస్వామ్యంతో విత్తనోత్పత్తి
► ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా ప్రస్తుతం 450 గ్రామాల్లో 2 వేల మంది రైతులు 15 రకాల పంటలకు సంబంధించి 5 లక్షల క్వింటాళ్ల విత్తనోత్పత్తి చేస్తున్నారు. విత్తన పాలసీ ద్వారా కొత్తగా మరో 1,000 గ్రామాల్లో 5 వేల మంది రైతుల ద్వారా వ్యవసాయ, ఉద్యాన, పసుగ్రాస.. ఇలా 20 రకాల పంటలకు సంబంధించి 12 లక్షల క్వింటాళ్ల పౌండేషన్, సర్టిఫైడ్, హైబ్రిడ్‌ విత్తనోత్పత్తి చేయబోతున్నారు.
► దశల వారీగా కనీసం 10 వేల మంది రైతుల ద్వారా 2 వేల గ్రామాల్లో 15 లక్షల క్వింటాళ్ల విత్తనోత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. విత్తనోత్పత్తిలో రైతులతో పాటు 15–20 మంది రైతులతో ఏర్పాటయ్యే రైతు సంఘాలను ప్రోత్సహించనున్నారు. తయారైన విత్తనాల నాణ్యతను నాలుగు దశల్లో ధ్రువీకరిస్తారు. 
► వరి, శనగలు, మినుములు, పెసలు, వేరుశనగ, జొన్నలు, మొక్కజొన్న, పత్తి మూల విత్తనాన్ని 2023–24 కల్లా 100 శాతం మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. హైబ్రీడ్‌ పంటల మూల విత్తనాన్ని ఏటా మార్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
► ప్రస్తుతం ఉన్న 18 ప్రాసెసింగ్‌ యూనిట్లకు తోడు కొత్తగా 33 సీడ్‌ ప్రొసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు.  
విజయనగరం జిల్లా మెట్టవలస ఆర్బీకేలో తీసుకున్న విత్తనాలతో రైతులు 

రూ.50 కోట్లతో విత్తన జన్యు కేంద్రం
► వందేళ్ల నాటి విత్తనాలతో పాటు రాష్ట్రంలో డిమాండ్‌ ఉన్న విత్తన రకాల మూల విత్తనం నుంచి మేలు జాతి విత్తనాలు తయారు చేయడమే లక్ష్యంగా రూ.50 కోట్లతో విత్తన జన్యు కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. వర్సిటీలు అభివృద్ధి చేసిన బ్రీడర్‌ సీడ్‌ నుంచి మూల విత్తనోత్పత్తి చేస్తారు. షార్ట్, మీడియం, లాంగ్‌ టర్మ్‌ స్టోరేజ్‌ పద్దతుల్లో 3 నుంచి 50 ఏళ్ల వరకు మూల విత్తనాన్ని ఈ జెన్‌ బ్యాంక్‌లో భద్రపరుస్తారు.  
► సీడ్‌ పాలసీలో భాగంగా ఏపీ స్టేట్‌ విత్తన పరిశోధనా, శిక్షణా సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. వారణాసిలోని జాతీయ విత్తన పరిశోధన కేంద్రానికి దీటుగా దీన్ని తీర్చిదిద్దబోతున్నారు. రైతులతో పాటు వ్యవసాయ డిప్లమో, బీఎస్సీ అగ్రి విద్యార్థులకు విత్తన తయారీపై సర్టిఫికెట్‌ కోర్సుల్లో శిక్షణ ఇస్తారు.
కర్నూలు జిల్లా తంబాలపల్లిలో వేరుశనగ  విత్తనాలను పరిశీలిస్తున్న అధికారులు 
 
విత్తన పాలసీ ప్రధాన లక్ష్యాలు ఇవీ

► అంతర్జాతీయ ప్రమాణాలతో జన్యుపరంగా మేలు జాతి విత్తనాల అభివృద్ధి.
► రైతుల ద్వారా గ్రామ స్థాయిలోనే వ్యవసాయ, ఉద్యాన, పశుగ్రాస పంటల విత్తనోత్పత్తి.
► విత్తనోత్పత్తిలో రైతులను ప్రోత్సహించడం, దశల వారీగా నూరు శాతం విత్తన మార్పిడి, విత్తన పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం ఏర్పాటు చేయడం.
► పెట్టుబడులను నియంత్రిస్తూ అధిక దిగుబడులను సాధించే వంగడాలను అందుబాటులోకి తీసుకురావడం.
► నాణ్యమైన, ధ్రువీకరించిన విత్తనాన్ని ఆర్‌బీకేల ద్వారా రైతులకు అందుబాటులో ఉంచడం.
► విస్తృత స్థాయిలో విత్తన పరిశోధనలు. విత్తనోత్పత్తి చేసే కంపెనీలను నియంత్రిస్తూ.. వాటికి విత్తనాలు సరఫరా చేసే రైతులకు భద్రత కల్పించడం.
► రైతులతో పాటు ఈ రంగంలోకి వచ్చే ప్రతి ఒక్కరికి విత్తనోత్పత్తిపై అత్యుత్తమ శిక్షణ. 
► ఈ మేరకు ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా విత్తన పాలసీ అమలుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement