అటు ఆటలు.. ఇటు ఆరోగ్యం | AP CM YS Jagan Speech Highlights In Adudham Andhra Closing Ceremony In Visakhapatnam, Details Inside - Sakshi
Sakshi News home page

Aadudam Andhra Closing Ceremony: అటు ఆటలు.. ఇటు ఆరోగ్యం

Published Wed, Feb 14 2024 4:35 AM | Last Updated on Wed, Feb 14 2024 9:42 AM

CM YS Jagan Comments On Adudham Andhra End Program - Sakshi

మహిళా క్రికెట్‌ విభాగంలో విజేతగా నిలిచిన ఎన్టీఆర్‌ జిల్లా జట్టుకు రూ.5 లక్షల చెక్కు, కప్‌ను అందించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

మన ఊరిలో.. మన వార్డులో మట్టిలో మాణిక్యాలు ఎందరో ఉన్నారు. వారందరినీ గుర్తించి సాన పట్టగలిగితే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేయవచ్చు. అలాంటి వారిని గుర్తించేందుకే ‘ఆడుదాం ఆంధ్రా..’ అనే బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.
– సీఎం జగన్‌

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సచివాలయ స్థాయి నుంచి ఆరోగ్యంపై శ్రద్ధ, ఆటలపై మక్కువ పెంచేందుకు ‘ఆడుదాం ఆంధ్రా..’ ఎంతో దోహదపడుతుందని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 25.45 లక్షల మంది క్రీడాకారులు ఇందులో పాలుపంచుకున్నారని, ఈ కార్యక్రమాన్ని ఏటా ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు. 47 రోజుల పాటు ఉత్సాహభరితంగా నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు ఉత్సవాలు మంగళవారం విశాఖలోని డాక్టర్‌ వైఎస్సార్‌ ఏసీఏ వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి జగన్‌ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. 

ఆరోగ్యం, వ్యాయామంపై అవగాహన పెంచేలా.. 
మన ఆరోగ్యానికి వ్యాయామం, క్రీడలు ఎంత అవసరం అనే అంశంపై రాష్ట్రంలోని ప్రతి ఇంటిలో, ప్రతి గ్రామంలో అవగాహన పెరగాలి. ఆడుదాం ఆంధ్రా ద్వారా ఆరోగ్యం, వ్యాయామం పట్ల అవగాహన పెరగాలన్నది ఒక ఉద్దేశమైతే గ్రామ స్థాయి నుంచి మట్టిలోని మాణిక్యాల్ని గుర్తించి వారి ప్రతిభకు సాన పెట్టి శిక్షణ ఇవ్వడం మరో లక్ష్యం. తద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన యువత రాణించేలా ప్రోత్సహించవచ్చు.

ఉత్తరాంధ్ర గడ్డపై సగర్వంగా... 
ఆడుదాం ఆంధ్రా ద్వారా క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, బ్మాడ్మింటన్‌ తదితర ఐదు క్రీడల్లో గత 47 రోజులుగా గ్రామ స్థాయి నుంచి ప్రతిభను ప్రోత్సహించే కార్యక్రమాలు చేపట్టాం. 25.40 లక్షల మంది క్రీడాకారులు గ్రామ స్థాయి నుంచి పాల్గొన్నారు. 3.30 లక్షల పోటీలు గ్రామ, వార్డు స్థాయిలో జరిగాయి. 1.24 లక్షల పోటీలు మండల స్థాయిలో, 7,346 పోటీలు నియోజకవర్గ స్థాయిలో, 1,731 పోటీలు జిల్లా స్థాయిలో, 260 మ్యాచ్‌లు రాష్ట్ర స్థాయిలో నిర్వహించాం. ఫైనల్స్‌ ముగించుకొని మన విశాఖలో, మన ఉత్తరాంధ్రలో, మన కోడి రామ్మూర్తి  గడ్డమీద సగర్వంగా ముగింపు సమావేశాలను నిర్వహిస్తున్నాం. దాదాపు 37 కోట్ల కిట్లు గ్రామ స్థాయి నుంచి పోటీ పడుతున్న పిల్లలందరికీ ఇచ్చాం. రూ.12.21 కోట్ల విలువైన బహుమతులు పోటీలో పాలుపంచుకున్న పిల్లలందరికీ అందిస్తున్నాం. 

తమ్ముళ్లు, చెల్లెమ్మలకు ఆల్‌ ది బెస్ట్‌..  
క్రికెట్‌లో ఇద్దరు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెమ్మలను టాలెంటెడ్‌ ప్లేయర్స్‌గా గుర్తించాం. కబడ్డీలో ముగ్గురు తమ్ముళ్లు, ఒక చెల్లెమ్మను గుర్తించాం. వాలీబాల్‌లో ఒక తమ్ముడు, ఒక చెల్లెమ్మ ప్రతిభను చాటుకున్నారు. ఖోఖోలో ఒక తమ్ముడు, చెల్లెమ్మ ప్రతిభను గుర్తించాం. బ్యాడ్మింటన్‌లో ఒక తమ్ముడు, చెల్లెమ్మ ప్రతిభ నిరూపించుకున్నారు. వారికి సరైన శిక్షణ ఇవ్వగలిగితే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ప్రోత్సహిస్తూ అడుగులు వేస్తున్నాం. ఎంపికైన తమ్ముళ్లు, చెల్లెమ్మలకు ఆల్‌ ద బెస్ట్‌. 

14 మంది టాలెంటెడ్‌ ప్లేయర్స్‌ దత్తత... 
ఈ బృహత్తర కార్యక్రమంలో చెన్నై సూపర్‌ కింగ్స్, ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌తో పాటు ప్రో కబడ్డీ, బ్లాక్‌ హాక్స్, వాలీబాల్, ఏపీ ఖోఖో అసోసియేషన్, ఏపీ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ పాల్గొని ప్రతిభ చాటుకున్న 14 మందిని దత్తత తీసుకొని మరింత ట్రైనింగ్‌ ఇచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. క్రికెట్‌ నుంచి పవన్‌ (విజయనగరం), చెల్లెమ్మ కేవీఎం విష్ణువరి్ధని (ఎన్టీఆర్‌ జిల్లా)ని చెన్నై సూపర్‌ కింగ్స్‌ దత్తత తీసుకొని మరింత మెరుగైన శిక్షణ ఇస్తుంది. క్రికెట్‌ నుంచే శివ (అనపర్తి, తూర్పుగోదావరి జిల్లా), చెల్లెమ్మ గాయత్రి (కడప జిల్లా)ని దత్తత తీసుకోవడానికి ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) ముందుకొచ్చింది.

సతీష్‌ (తిరుపతి), బాలకృష్ణారెడ్డి (బాపట్ల)ని ప్రో కబడ్డీ టీమ్‌ దత్తత తీసుకుంది. సుమన్‌(తిరుపతి), సంధ్య (విశాఖ)ను ఏపీ కబడ్డీ అసోసియేషన్‌ దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చింది. వాలీబాల్‌కు సంబంధించి ఎం.సత్యం (శ్రీకాకుళం), మహిళల విభాగానికి సంబంధించి మౌనిక (బాపట్ల)ను దత్తత తీసుకునేందుకు బ్లాక్‌ హాక్స్‌ సంస్థ ముందుకొచ్చింది. ఖోఖోకు సంబంధించి కె.రామ్మోహన్‌ (బాపట్ల), హేమావతి (ప్రకాశం)లకు తర్ఫీదు ఇచ్చేందుకు ఏపీ ఖోఖో అసోసియేషన్‌ ముందుకొచ్చింది. బ్యాడ్మింటన్‌లో ఎ.వంశీకృష్ణంరాజు (ఏలూరు), ఎం.ఆకాంక్ష (బాపట్ల)ను ఏపీ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ దత్తత తీసుకొనేందుకు ముందుకొచ్చింది. ఈ 14 మందికి రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉంటుంది. ఆ సంస్థలు మన పిల్లలకు తర్ఫీదు ఇచ్చేందుకు అడుగులు ముందుకొచ్చాయి. 

ఇక ఏటా ‘ఆడుదాం ఆంధ్రా’...! 
ఈరోజు మనం వేసిన అడుగు ఇక ప్రతి సంవత్సరం ముందుకు పడుతుంది. క్రీడల్లో మన యువత ప్రతిభను గుర్తించి మరింత తర్ఫీదు ఇచ్చి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేస్తాం. సచివాలయాల స్థాయి నుంచే క్రీడలను ప్రోత్సహిస్తూ వ్యాయామం ఆవశ్యకత, ఆరోగ్య జీవన విధానాలను ముందుకు తీసుకెళతాం. వీటివల్ల ఆటలకు మరింత ప్రోత్సాహం లభిస్తుంది.  

ఆకట్టుకున్న లేజర్‌ షో 
ముగింపు ఉత్సవాల సందర్భంగా ‘ఆడుదాం ఆంధ్రా’ ప్రత్యేక గీతాన్ని స్టేడియంలో ప్రదర్శించారు. ఈ పాటకు దాదాపు 5 నిమిషాల పాటు కళ్లు మిరుమిట్లు గొలిపేలా ప్రదర్శించిన లేజర్‌ షో ఆకట్టుకుంది. కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి.  బాణసంచా కాల్చారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జీ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి ఆర్‌కే రోజా, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మంత్రులు విడదల రజని, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్‌నాథ్, కలెక్టర్‌ మల్లికార్జున, ఏసీఏ కార్యదర్శి గోపినాథ్‌రెడ్డి, శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ప్రభుత్వ విప్‌ కరణం ధర్మ శ్రీ, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, భీశెట్టి వెంకటసత్యవతి,  గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాస్, వైఎస్సార్‌సీపీ విశాఖ పార్లమెంట్‌ సమన్వయకర్త బొత్స ఝాన్సీ, మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ జె.సుభద్ర పాల్గొన్నారు.

కమాన్‌.. క్రికెట్‌ టీమ్‌! 
క్రికెట్‌లో విజేతగా నిలిచిన ఏలూరు జట్టుకు చెందిన కెప్టెన్‌, వైస్‌ కెప్టెన్‌ని వేదికపైకి రావాలని తొలుత నిర్వాహకులు ఆహ్వానించగా ముఖ్యమంత్రి జగన్‌ జోక్యం చేసుకుని క్రికెట్‌ టీమ్‌ మొత్తం వేదికపైకి రావాలంటూ స్వయంగా చేతులు చాచి ఆహ్వానించడంతో జట్టు సభ్యులంతా ఉత్సాహంగా స్టేడియంలో పరుగులు తీస్తూ వచ్చారు. సీఎంతో కరచాలనం కోసం పోటీపడ్డారు. సెక్యూరిటీని వారించి సీఎం వారితో ఎక్కువ సేపు గడిపారు.

విజేతలకు ట్రోఫీతో పాటు రూ.5 లక్షల ప్రైజ్‌ మనీని సీఎం జగన్‌ అందజేశారు. మహిళా క్రికెట్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, వాలీబాల్‌ విజేతలు, రన్నరప్‌లకు ట్రోఫీలు, నగదు బహుమతులు అందించారు. ఐదు విభాగాల్లో ప్రతిభ చాటిన క్రీడాకారుల జాబితాను స్వయంగా ప్రకటించి బహుమతులు అందించారు. సీఎం జగన్‌ ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించి వారి పేర్లు అడిగి తెలుసుకున్నారు. జగనన్నని కలిశామన్న ఆనందం వారిలో కొట్టొచ్చినట్లు కనిపించింది.  

అరగంట పాటు మ్యాచ్‌ వీక్షణ 
క్రికెట్‌ మైదానానికి సాయంత్రం 6 గంటలకు చేరుకున్న ముఖ్యమంత్రి జగన్‌ క్రీడాకారులు, ప్రేక్షకులకు అభివాదం చేస్తూ వేదికపైకి చేరుకున్నారు. ఏలూరు, విశాఖ జట్ల మధ్య జరిగిన క్రికెట్‌ ఫైనల్స్‌ని అరగంట పాటు ఆసక్తిగా వీక్షించారు. వికెట్‌ పడినా.. ఫోర్లు, సిక్స్‌ కొట్టినా.. ఇరు జట్లనూ చప్పట్లతో ప్రోత్సహిస్తూ ఉత్సాహపరిచారు. ఈ మ్యాచ్‌లో ఏలూరు జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గి విజేతగా నిలిచింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement