
సీహెచ్‌సీల ద్వారా వ్యవసాయ యాంత్రీకరణకు ప్రోత్సాహం
రికార్డు స్థాయిలో 2019–20లో 175 లక్షల టన్నుల దిగుబడులు
విత్తు నుంచి పంట విక్రయం వరకు.. ప్రకృతి సాగుకు ప్రోత్సాహం మొదలు యాంత్రీకరణ వరకు.. కౌలు చట్టం నుంచి మద్దతు ధర వరకు.. వ్యవసాయ, అనుబంధ రంగాలకు 2019–24 మధ్య కాలం స్వర్ణయుగం అని తేలింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణల ఫలితంగా రాష్ట్రం గణనీయ పురోగతి సాధించిందని టీడీపీ కూటమి సర్కారు సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే –2024 స్పష్టం చేసింది.
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, సాధించిన పురోగతిని ఆర్థిక సర్వే ప్రత్యేకంగా ప్రస్తావించింది. అందులోని ముఖ్య అంశాలు పరిశీలిస్తే..
⇒ 2018–19లో 150 లక్షల టన్నులున్న ఆహార పంటల దిగుబడులు 2019లో రికార్డు స్థాయిలో 175 లక్షల టన్నులకు పెరిగాయి. 2019–24 మధ్య సగటున 161.20 లక్షల టన్నుల దిగుబడులు నమోదయ్యాయి.
⇒ ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం 45.59 లక్షల ఎకరాలకు పెరగగా, 2023–24లో రికార్డు స్థాయిలో 365.92 లక్షల టన్నులు దిగుబడులు వచ్చాయి. నేషనల్ ఆయిల్ పామ్ మిషన్‌లో 2023–24లో రికార్డు స్థాయిలో 2.27 లక్షల హెక్టార్లలో సాగు ద్వారా 17.63 లక్షల టన్నుల దిగుబడులు నమోదైంది.
⇒ 2023–24లో 2548.74 లక్షల గుడ్ల ఉత్పత్తితో ఏపీ నంబర్ వన్‌గా నిలవగా, మాంసం (10.68 లక్షల టన్నులు) ఉత్పత్తిలో ఐదో, పాల (139.94 లక్షల టన్నులు) ఉత్పత్తిలో ఏడో స్థానంలో ఉంది.
⇒ గ్యాప్ సర్టిఫికేషన్ ద్వారా రైతులకు మార్కెట్ ధరకు మించి ఆదాయం వచ్చింది. ప్రకృతి సాగుదారులు 4 లక్షల నుంచి 9.53 లక్షలకు పెరిగారు.
ఆర్బీకేలు నిజంగా ఓ వినూత్నం
రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) నిజంగా ఓ వినూత్న ప్రయోగమని ఆర్థిక సర్వేలో స్పష్టంగా పేర్కొన్నారు.
⇒ విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు చేదోడుగా నిలిచేందుకు ఒకేసారి 10,778 ఆర్‌బీకేలతో ఈ వ్యవస్థ ఏర్పాటైందని చెప్పుకొచ్చారు.
విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పశుగ్రాసం, సంపూర్ణ మిశ్రమ దాణా, ఆక్వా ఫీడ్ వంటి సాగు ఉత్పాదకాలను గ్రామ స్థాయిలో రైతులు కోరిన 24 గంటల్లో వారి ముంగిట అందించడం, ఆధునిక సాగు విధానాలు, సలహాలు, సూచనలు అందిస్తూ అగ్రి ఇన్‌పుట్ షాపులుగా, ఫార్మర్ నాలెడ్జ్ సెంటర్స్‌గా రైతులకు ఎంతగానో ఉపయోగపడ్డాయి.
నియోజకవర్గ స్థాయిలో అగ్రి ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్, ఆక్వా, వెటర్నరీ ల్యాబ్స్ ఏర్పాటుతో నాణ్యమైన సాగు ఉత్పత్తుల పంపిణీ సులభతరమైంది. –రూ.3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ద్వారా.. మార్కెట్‌లో ధర లేని సమయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతులకు మద్దతు ధర దక్కేలా కృషి చేసింది.
ఏఐఎఫ్ ద్వారా మౌలిక వసతులు
⇒ వ్యవసాయ మౌలిక సదుపాయల నిధి (ఏఐఎఫ్) ద్వారా 2022–24 మధ్య గ్రామ స్థాయిలో ఆర్బీకేలకు అనుబంధంగా రూ.16 వేల కోట్లతో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశారు.
⇒ పీఏసీఎస్‌లను బహుళ ప్రయోజిత సదుపాయాల కేంద్రాలు (ఎంపీఎఫ్‌సీ)గా తీర్చిదిద్దారు. రూ.736 కోట్లతో 695 గోదాముల నిర్మాణం ద్వారా 3.98 లక్షల టన్నుల అదనపు నిల్వ సామర్థ్యం అందుబాటులోకి వచ్చింది.
⇒ రికార్డు స్థాయిలో 2,037 పీఏసీఎస్‌ల డిజిటలైజేషన్‌తో పాటు 207 పీఏసీఎస్‌లను ఎఫ్‌పీవోలుగా అభివృద్ధి చేశారు. ఈ–పీఏసీఏస్లుగా మార్పుతో ఆన్‌లైన్ లావాదేవీలకు మార్గం సులభతరమైంది. జన ఔషధ కేంద్రాలు, పెట్రోల్ బంకులు, కామన్ సర్వీస్ సెంటర్లుగా పీఏసీఏస్‌లను తీర్చిదిద్దారు. రిజిస్ట్రార్ ఆఫ్ కో ఆపరేటివ్ సొసైటీస్‌ను కంప్యూటరైజ్ చేశారు.
⇒ చేపల ఉత్పత్తిలో 31 శాతం, రొయ్యల ఉత్పత్తిలో 30 శాతంతో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. స్థానిక వినియోగం పెంచేందుకు డొమెస్టిక్ ఫిష్ మార్కెటింగ్ వ్యవస్థ ద్వారా ఫిష్ ఆంధ్రకు బ్రాండింగ్ తీసుకొచ్చింది. అప్సడా, ఏపీ ఫిష్ సీడ్, ఫీడ్ యాక్ట్‌లతో పాటు ఏపీ బొవైన్ బ్రీడింగ్ రెగ్యులేషన్ అండ్ ఆర్టిఫీషియల్ ఇన్‌సెమినేషన్ సర్వీస్ యాక్ట్, భూ యజమానులకు నష్టం వాటిల్లకుండా పంట సాగు హక్కుదారుల చట్టం వంటి సంస్కరణలకు నాంది పలికింది.
కూటమి కనికట్టు
కూటమి ప్రభుత్వం వచ్చాక 2024–25లో వ్యవసాయ యాంత్రీకరణ కింద ఒక్క పరికరం కూడా పంపిణీ చేసిన పాపాన పోలేదు. కానీ, ఈ ఏడాది ఏకంగా రూ.75.80 కోట్ల సబ్సిడీతో 42,864 మంది రైతులకు వ్యక్తిగత పరికరాలు ఇచ్చినట్టుగా ఆర్థిక సర్వేలో పేర్కొన్నారు.
80 శాతం సబ్సిడీపై 875 కిసాన్ డ్రోన్స్ ఇచ్చేసినట్టుగానూ ప్రస్తావించారు. కాగా, ఇదే రిపోర్టులో 2021–24 మధ్య ఆర్బీకేలకు అనుసంధానంగా కస్టమ్ హైరింగ్ సెంటర్స్ ద్వారా వ్యవసాయ యాంత్రీకరణను గత ప్రభుత్వం ప్రోత్సహించిందని కొనియాడడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment