విశ్లేషణ
ఖరీఫ్ సీజన్‌కు కేంద్ర ప్రభుత్వం 14 పంటలకు ప్రకటించిన మద్దతు ధరలు ఆశించిన మేరకు లేకపోవడంతో అన్నదాతలకు నిరాశే మిగిలింది. వరి ఎక్కువగా పండించే రాష్ట్రాలు వరి సాధారణ రకానికి రూ. 3,000 నుంచి రూ. 3,200; ఏ గ్రేడ్ రకానికి రూ. 3,200 నుంచి రూ. 3,400 ప్రకటించాలని కేంద్రానికి సిఫార్సు చేశాయి. కానీ కేంద్రం సాధారణ రకానికి రూ. 2,300; ఏ గ్రేడ్ రకానికి రూ. 2,320 మాత్రమే ప్రకటించింది. పత్తికి రూ. 1,000 నుంచి రూ.1,500 పెంచాలని కోరితే రూ. 500 పెంపుతో సరిపెట్టారు. జొన్న, మొక్కజొన్న, వేరుశనగ, కందులు, పొద్దుతిరుగుడు, నువ్వులు, సోయా, పెసలు, మినుములు... వంటి పంటలకు రాష్ట్రాల సిఫార్సులకు అనుగుణంగా ధరలు పెంచలేదు. శాస్త్రీయత లేకుండా తోచిన ధర ప్రకటించడంలో ఔచిత్యం ఏమిటి?
పంటల సాగు ఖర్చుకు ఒకటిన్నర రెట్లు ఆదాయం అందాలనీ, అప్పుడే రైతుకు న్యాయం జరుగుతుందనీ వ్యవసాయ పితామహుడు డాక్టర్ స్వామినాథన్ 2005లో నాటి యూపీఏ ప్రభుత్వానికి అందించిన నివేదికలో స్పష్టం చేశారు. ఆనాటి నుంచి నేటి వరకు ఈ డిమాండ్ అపరిష్కృతంగానే ఉండిపోయింది. ఆశ్చర్యం ఏమంటే... స్వామినాథన్ కమిషన్ అందించిన సిఫార్సులను 2004 నుంచి 2014 వరకు పదేళ్లపాటు అధికారంలో ఉండి అమలు చేయకుండా అటకెక్కించిన కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామని నమ్మబలికింది.
మరోపక్క, దేశంలో దశాబ్దాలపాటు అపరిష్కృతంగా, చిక్కుముళ్లుగా బిగుసుకుపోయిన సమస్యలకు తాము పరిష్కార మార్గాలు చూపగలిగామని ప్రధాని నరేంద్ర మోదీ పదేపదే చెబుతుంటారు. అయెధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన, ఆర్టికల్ 370 రద్దు, త్రిబుల్ తలాక్ రద్దు, చంద్రయాన్ విజయం, సూర్యయాన్‌కు సన్నద్ధత వంటి అంశాలను ఉదహరించే అధికార బీజేపీ గత పదేళ్లుగా రైతాంగ సమస్యలకు అరకొరగా తప్ప శాశ్వత పరిష్కార మార్గాలేమీ చూపించలేకపోవడం గమనార్హం! ఫలితంగానే దేశానికి ఆహార భద్రత చేకూర్చడానికి ఆరుగాలం కష్టపడే అన్నదాతలు దేశం నలుమూలల నుంచి తరలివచ్చి ఢిల్లీ శివారు ప్రాంతాల్లో గుడారాలు వేసుకొని ఎండ, వాన, చలిని తట్టుకొని నెలల తరబడి తమ డిమాండ్ల సాధన కోసం ఉధృతమైన ఉద్యమం చేశారు.
గత 10 ఏళ్లల్లో నాలుగు దశల్లో దేశ రైతాంగం చేసిన ఆందోళన కార్యక్రమాలు ఇంతకుముందెప్పుడూ కనివిని ఎరుగనివి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపు 300కు పైగా రైతు సంఘాలు సంఘటితమై ఉద్యమించాయంటే సమస్య తీవ్రత ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు. 750 మందికి పైగా ప్రాణాలు పోయినా లెక్కచేయక రైతాంగం ప్రదర్శించిన పట్టుదల కారణంగానే కేంద్రం పార్లమెంట్‌లో మూడు వివాదాస్పద రైతు బిల్లుల్ని ఉపసంహరించుకొంది. కానీ వారి ఇతర డిమాండ్లను మాత్రం నెరవేర్చలేదు.
దేశ రైతాంగం ముక్తకంఠంతో చేస్తున్న అతి ప్రధాన డిమాండ్ ఎంఎస్‌పీ(కనీస మద్దతు ధర)కి చట్టబద్ధత. దీనినే ‘కిసాన్ న్యాయ్ గ్యారంటీ’ అంటున్నారు. కేంద్రం ముందు రైతు సంఘాలు పెట్టిన ఇతర డిమాండ్లలో 1) ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) ఒప్పందాల నుంచి భారత్ బయటకు రావడం 2) వ్యవసాయ దిగుమతులపై సుంకాల పెంపుదల 3) 2020 విద్యుత్ సంస్కరణల చట్టం రద్దు 4) ఉపాధి హామీ పనులు ఏడాదికి 200 రోజులకు పెంపు 5) రైతుకు, రైతు కూలీలకు పెన్షన్ వర్తింపు వంటివి ప్రధానంగా ఉన్నాయి.
రైతులు పెట్టిన ఈ డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలతో పలుమార్లు చర్చలు జరిపినా పరిష్కారం కాలేదు. ముఖ్యంగా రైతులు పట్టుబడుతున్న ప్రధాన డిమాండ్ 23 పంటలకు కనీస మద్దతు ధరలతో చట్టబద్ధత కల్పించడం. ఈ అంశాన్ని ప్రభుత్వం ఆర్థిక కోణంలో కాకుండా రైతుల ఆర్థిక కోణంలో చూడాలని అంటున్నారు. కానీ, కేంద్రం ఈ డిమాండ్‌కు తలొగ్గకపోగా మరో కొత్త ప్రతిపాదన తెరమీదకు తెచ్చింది.
వరి, గోధుమలకు ప్రత్యామ్నాయంగా కంది, మినుము, మొక్కజొన్న, పత్తి వంటి పంటలు పండిస్తే ఐదేళ్లపాటు కనీస మద్దతుతో కేంద్ర సంస్థలయిన జాతీయ వినియోగదారుల సహకార సమాఖ్య (ఎన్‌సీసీఎఫ్), జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య (నాఫెడ్)లు కొంటాయనీ, అందుకుగాను రైతులతో ముందస్తు ఒప్పందం చేసుకొంటాయనీ ప్రతిపాదించింది. దీనిని రైతు సంఘాలు ఒప్పుకోవడం లేదు. కేంద్రం మాత్రం ఈ ప్రణాళికను అమలు చేయాలనే గట్టి పట్టుదలతో ఉంది.
పంటమార్పిడి అన్నది అంత తేలికైనది కాదు. రైతులలో పంట మార్పిడి విధానంపై అవగాహన పెంచాలి. ప్రభుత్వ సహకారం అందాలి. పండించిన పంటకు గిట్టుబాటు ధర లభిస్తుందన్న నమ్మకం రైతుల్లో కలగాలి. ఇందుకు చాలా సమయం పడుతుంది. ముఖ్యంగా, దేశంలోని అన్ని ప్రాంతాలలోని వ్యవసాయ భూములు పంట మార్పిడికి పూర్తి అనుకూలంగా లేవన్నది ఓ చేదు వాస్తవం. సమగ్రమైన అధ్యయనం, వాటి ఫలితాలు పరిశీలించిన తర్వాతనే పంటల మార్పిడి విధానం అమలు చేయాలే తప్ప, బలవంతంగా అమలు చేయాలనుకోవడం వల్ల ప్రతిఘటన ఎదురవుతుంది.
నిజానికి, ఎంఎస్‌పీకి చట్టబద్ధత కల్పించే విషయంలోనూ, ఇతర డిమాండ్ల పరిష్కారంలోనూ ఎన్డీఏ–2 ప్రభుత్వం ప్రదర్శించిన ఉదాసీనత కారణంగానే బీజేపీ ఈ ఎన్నికలలో 60 లోక్‌సభ స్థానాలకు పైగా నష్టపోయిందని పరిశీలకుల విశ్లేషణ. ప్రధానంగా... పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌లోని మెజారిటీ స్థానాల్లో రైతాంగం బీజేపీని ఆదరించలేదు.
అయితే, మూడోసారి నరేంద్ర మోదీ ప్రధానిగా కొలువుదీరిన ఎన్డీఏ–3 ప్రభుత్వం రైతాంగం చేస్తున్న డిమాండ్లను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుందా? లేక ఉద్యమాన్ని అణచివేస్తుందా అన్నదే కీలకం. ఎన్నికల ముందు దేశ రైతాంగాన్ని తమ హామీల ద్వారా తమ వైపు తిప్పుకోవాలని కాంగ్రెస్ కూటమి పక్షాలు (ఇండియా బ్లాక్) ప్రయత్నించినా అది పూర్తి స్థాయిలో ఫలించలేదు. ఈ నేపథ్యంలోనే దేశ రైతాంగం ఆశలు, ఆకాంక్షలు ఏమవుతాయనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
ఎంఎస్‌పీకి చట్టబద్ధత కల్పిస్తే ఏటా కేంద్ర ప్రభుత్వంపై రూ. 12 లక్షల కోట్ల అదనపు భారం పడుతుందని నీతి ఆయోగ్ తేల్చింది. దాదాపు రూ. 50 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్‌లో ఇంత మొత్తం కేటాయించడం అసాధ్యమే. పైగా, వ్యవసాయం అంటే కేవలం 23 పంటలే కాదు. వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి, చేపలు, రొయ్యలు, పండ్లు, కూరగాయల మాటేమిటి? వాటికి ప్రోత్సాహకాలు అవసరం లేదా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.
దేశంలో జరుగుతున్న రైతాంగ ఉద్యమాలు, వాటిపట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉన్నా రైతుల ఆదాయం గణనీయంగా తగ్గిపోయినట్లు 77వ జాతీయ నమూనా సర్వే వెల్లడించడం గమనార్హం. ఈ సర్వే ప్రకారం దేశంలోని చిన్న సన్న కారు రైతు కుటుంబాల నెలసరి ఆదాయం సగటున రూ. 10,218 మాత్రమే. రైతు కూలీల సగటు నెలవారీ ఆదాయం రూ. 4,063. ఆదాయాలు పెరగకపోవడం వల్ల వారికున్న రుణభారం తగ్గడం లేదు. ఫలితంగానే రైతులు, రైతు కూలీలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నేషనల్ క్రైవ్‌ు రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 2023లో 11,290 మంది, 2022లో 10,281 మంది, 2021లో 9,898 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు.
రైతుల ఆత్మహత్యల్లో పెరుగుదల 3.7 నుంచి 5.7 శాతంగా ఎన్‌సీఆర్‌బీ డేటా వెల్లడిస్తోంది. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో 53 శాతం మంది రైతు కూలీలేనన్నది చేదు నిజం. రైతులు, అనుబంధ వృత్తికూలీల ఆదాయం పెరగకపోవడం కారణంగానే గ్రామీణ పేదరికం క్రమేపీ పెరుగుతున్నది. మోదీ చెప్పినట్లు 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు కాలేదు. ఇప్పట్లో హరియాణాకు తప్ప ఇతర ప్రధాన రాష్ట్రాలకు ఎన్నికలు లేవు కనుక... రైతాంగ సమస్యల పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుందన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రైతులు డిమాండ్ చేస్తున్న ఎంఎస్‌పీకి చట్టబద్ధత ఓ ఎండమావిగానే మిగిలిపోతుందన్నది నిష్టుర సత్యం.
డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment