Dr UmmaReddy Venkateshwarlu
-
రైతులు అడగాల్సిన ‘మహా’ నమూనా
దేశంలో ప్రజా సమస్యలు వెనుకబడిన పరిస్థితులలో మహారాష్ట్రలో నవంబర్ 20న శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి కొన్ని రైతు సంఘాలు 38 డిమాండ్లతో ‘రైతు మేనిఫెస్టో’ ప్రకటించి రాజకీయ పార్టీలకు సవాలు విసిరాయి. మేనిఫెస్టోను సమర్థించే వారికే ఓటు వేస్తామని చెప్పాయి. కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరల(ఎంఎస్పీ)కి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం బోనస్ అందించడం, 10 హెక్టార్ల లోపు భూమి ఉన్నవారికి రుణమాఫీ చేయడం లాంటివి ఇందులో ఉన్నాయి. ఈ డిమాండ్లు గొంతెమ్మ కోర్కెలు కావు. వ్యవసాయాన్ని, రైతును బతికించుకోవడానికి అడుగుతున్నవే. అన్ని రాష్ట్రాల్లోనూ ఈ తరహా చైతన్యానికి మహారాష్ట్ర మేనిఫెస్టో ఒక నమూనా కావాలి!అమెరికా, చైనా, రష్యా, బ్రెజిల్, జపాన్ వంటివి వ్యవసాయ రంగంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు దూసుకు వెళుతుండగా, భారత దేశంలో రైతాంగం ఇంకా నేల చూపులు చూస్తోంది. కనీస మద్దతు ధరల కోసం, రుణమాఫీ కోసం రోడ్ల మీదకొచ్చి ఉద్యమాలు చేస్తూ రైతులు పోలీసుల లాఠీల దెబ్బలు తింటున్నారు. వ్యవసాయం గిట్టు బాటుకాక, చేసిన అప్పులు తీర్చేదారిలేక, బలవన్మరణాలకు పాల్పడు తున్నారు. నిజం చెప్పాలంటే, భారతదేశ రైతాంగం వెతలు ముగింపు లేని డైలీ టీవీ సీరియల్లా కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో మహారాష్ట్ర రైతు సంఘాలు ఉమ్మడిగా ‘రైతు మేనిఫెస్టో’ ప్రకటించి రాజకీయ పార్టీలకు సవాలు విసరడం విశేషం. అనేక దశాబ్దాలుగా రైతాంగం తరుఫున పోరాడుతున్న సామాజిక కార్యకర్తలు, ప్రముఖ జర్నలిస్టులైన పాలగుమ్మి సాయినాథ్, దినేష్ అబ్రాల్ నేతృత్వంలో రూపొందిన 38 డిమాండ్లతో కూడిన ‘రైతు మేనిఫెస్టో’లో నిజానికి కొత్త అంశాలేమీలేవు. రైతులు అనాదిగా ఎదుర్కొంటున్న సమస్యలే. అందులో ప్రధానమైనవి: కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరల(ఎంఎస్పీ)కి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం బోనస్ అందించాలి; 10 హెక్టార్లలోపు భూమి ఉన్న రైతాంగానికి రుణమాఫీ చేయాలి; ప్రధాన మంత్రి గ్యారంటీ పథకాన్ని కొన్ని రాష్ట్రాలకు బదులుగా అన్ని రాష్ట్రాలకు వర్తింపజేయాలి; పర్యాటకం, మౌలిక సదుపాయాల పేరుతో సముద్రతీర ప్రాంత మత్స్యకార కుటుంబాలను బలవంతంగా వెళ్లగొట్టడం మాను కోవాలి; ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతాంగ సమస్యలను చర్చించడానికి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలి. ఇవిగాక, ఇంకా భూమికి సంబంధించినవి, కౌలు రైతులకు వర్తింపజేసేవి, బలవన్మ రణాలకు పాల్పడ్డ రైతాంగ కుటుంబాలకు అందించే పరిహారం మొదలైనవి ఉన్నాయి. గొంతెమ్మ కోర్కెలు కావు!ఈ డిమాండ్లు వ్యవసాయాన్ని, రైతును బతికించుకొని దేశానికి ఆహార భద్రత చేకూర్చడానికి అడుగుతున్నవే. దేశంలో అతిపెద్ద రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. పారిశ్రామికంగా అగ్రస్థాయిలో ఉన్న రాష్ట్రాల సరసన ఉన్నది. అయినా, బలవన్మరణాలకు పాల్పడే రైతుల సంఖ్య దేశంలోనే మొదటిస్థానంలో ఉంది. ఇది ఒక సామాజిక, రాజకీయ వైచిత్రి. కారణం మహారాష్ట్రలోని అన్ని ప్రాంతాలు ఒకే రీతిలో ఉండవు. విదర్భలో వర్షాభావం వల్ల పంటలు దెబ్బతింటున్నాయి. ఇక్కడ పత్తి, సోయాబీన్, ఉల్లి, చెరకు పంటలను రైతులు ఎక్కువగా పండిస్తున్నారు. వీటికి కేంద్రం ప్రకటించే మద్దతు ధరల కంటే తక్కువ ధరలు లభిస్తున్నందున కేరళ, కర్ణాటక తరహాలో రాష్ట్ర ప్రభుత్వం కూడా 20 శాతం బోనస్ ప్రకటించాలని రైతు సంఘాలు చేస్తున్న డిమాండ్‌లో హేతుబద్ధత ఉంది. ఇక, అధికారంలోకి రావడం కోసం రైతాంగాన్ని ప్రసన్నం చేసు కోవడానికి నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రధానమంత్రి గ్యారంటీ పథ కాన్ని ప్రకటించిందిగానీ దానిని అన్ని రాష్ట్రాలకు వర్తింపజేయకుండా రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్ రాష్ట్రాల ఎన్నికల ముందు అక్కడ అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీని తమ రాష్ట్రంలో కూడా అమలు చేయమని మహారాష్ట్ర రైతాంగం డిమాండ్ చేయడంలో అనౌచిత్యం కనపడదు. కేంద్ర పథకం కొన్ని రాష్ట్రాల్లోనే అమలు చేయడం సమాఖ్య స్ఫూర్తికి విఘాతంగా పరిణమించదా? పీఎం గ్యారంటీ ద్వారా ఎంఎస్పీకి 30 శాతం బోనస్ అందిస్తారు. ఈ పథకం అన్ని రాష్ట్రాలకు అమలు చేస్తేనే కేంద్ర ప్రభుత్వానికి రైతాంగం పట్ల చిత్తశుద్ధి ఉన్నట్లు!వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధదేశం శాస్త్ర సాంకేతిక రంగాలలో, ఇన్ఫర్మేషన్, బయోటెక్నాలజీ రంగాలలో ముందంజ వేసిన మాట నిజమే. వ్యవసాయ రంగంలో అదే రకమైన ప్రగతి ఎందుకు జరగడం లేదు? నాలుగైదు దశాబ్దాల క్రితం పట్టిపీడించిన సమస్యలు నేటికీ వ్యవసాయాన్ని వీడక పోవడానికి కారణం ఏమిటి? 2004లో దేశంలో పత్తి ఉత్పాదకత హెక్టారుకు సగటున 446 కిలోలు ఉండగా, రెండు దశాబ్దాల తర్వాత 2023 నాటికి ఆ మొత్తం 470 కిలోలకు మాత్రమే చేరింది. అదే చైనాలో 2004లో 496 కిలోలు ఉండగా, 2023 నాటికి 1,990 కిలోలకు చేరింది. పత్తి ఒక్కటే కాదు... వరి, గోధుమ, మొక్కజొన్న, సోయా తదితర పంటల ఉత్పాదకతలో మన వృద్ధిరేటు 10 శాతం ఉంటే... చైనా, అమెరికా, బ్రెజిల్, ఇజ్రాయెల్ తదితర దేశాలు రెండు దశాబ్దాల వ్యవధిలో 400 శాతం వృద్ధిరేటు సాధించాయి. ఇందుకు కారణం వాతావరణ మార్పుల్ని, చీడ పీడల్ని సమర్థవంతంగా తట్టుకొని మొల కెత్తగల జన్యుపరమైన వంగడాలను ఆ దేశాల వ్యవసాయ శాస్త్రవేత్తలు సృష్టించగలుగుతున్నారు. దేశీయ వ్యవసాయ రంగంలో సాంకేతిక వినియోగం గణనీయంగా పెరిగినప్పటికీ, ఇతర రంగాలతో పోలిస్తే తక్కువే. వ్యవ సాయ రంగంలో సైతం కృత్రిమ మేధ (ఏఐ) వినియోగాన్ని అభివృద్ధి చెందిన దేశాలు వేగవంతం చేశాయి. భూసార పరీక్షలు చేయడం, ఏ ప్రాంతంలో ఏ పంటలు వేయవచ్చు, ఏ పంటకు ఎంత దిగుబడి వస్తుంది, వాతావరణ మార్పులు ఏ విధంగా ఉంటాయి మొదలైన సమాచారాన్ని ‘కృత్రిమ మేధ’ అందిస్తుంది. పంట తెగుళ్లను చాలా ముందుగానే ప్రారంభ దశలోనే గుర్తించడం ఈ టెక్నాలజీ ద్వారా సాధ్యపడుతుంది. ఏ పంటకు ఎంత నీరు, ఎరువు అవసరమో తెలి యజేస్తుంది. భూసారాన్ని పెంచడం కూడా ఈ విధానంలో సాధ్య మవుతుందని శాస్త్రజ్ఞులు వెల్లడిస్తున్నారు. పండ్ల సాగులో కొన్ని దేశాలు రోబోటిక్స్‌ను వినియోగిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఏఐ, రోబోటిక్స్ వ్యవసాయ రంగ ముఖచిత్రాన్ని మార్చివేయడం ఖాయ మని శాస్త్రజ్ఞులు నమ్ముతున్నారు. వ్యవసాయ విద్య, పరిశోధనలు, విస్తరణ, పాడి, ఉద్యాన మొదలైన రంగాలను బలోపేతం చేయడానికి ఇటీవల కేంద్ర కేబినెట్ ‘డిజిటల్ అగ్రికల్చర్ మిషన్’ పథకాన్ని ప్రారంభించింది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం.అన్ని రాష్ట్రాల్లోనూ...అధిక మొత్తంలో ధర చెల్లించి పప్పు ధాన్యాల్ని దిగుమతి చేసుకొనే బదులుగా, ప్రోత్సాహకాలు అందిస్తే రైతులే అధికంగాపంటలు వేస్తారు. కానీ, కేంద్రం అందుకు చొరవ చూపడం లేదు. దాంతో, పప్పు ధాన్యాల సాగు, ఉత్పత్తిలో క్షీణత కనిపిస్తోంది. మరోపక్క, దేశంలోని తీర ప్రాంత రాష్ట్రాలలో పర్యాటకం, మౌలిక సదుపాయాల వృద్ధిపేరుతో అక్కడి మత్య్సకారుల్ని వెళ్లగొట్టడం ఎక్కువైంది. నిజానికి వ్యవసాయానికి అనుబంధ పరిశ్రమగా పరిగణిస్తున్న మత్స్యరంగంలోనే అధిక వృద్ధి నమోదవుతోంది. రొయ్యలు, చేపల ఎగుమతిలో భారతదేశం అగ్రగామిగా ఉంది. ఈ రంగంపై ఆధారపడిన కోట్లాది మంది మెరుగైన ఉపాధి పొందు తున్నారు. కానీ సముద్రానికీ, మత్స్యకారులకూ ఉండే బంధాన్ని దెబ్బతీసే యత్నాలు జరుగుతున్నాయి. ఈ అంశాన్ని మహారాష్ట్ర రైతు సంఘాలు రైతు మేనిఫెస్టో ద్వారా దేశ ప్రజల దృష్టికి తెచ్చాయి. తమ మేనిఫెస్టోను సమర్థించే వారికే ఓటు వేస్తామని పార్టీలకతీతంగా రైతులు చెప్పడాన్ని ఆహ్వానించాలి. ఒక్క మహారాష్ట్రయే కాదు... అన్ని రాష్ట్రాలు ప్రతి అసెంబ్లీ సమావేశాలలో ఒకటి, రెండు రోజులు ప్రత్యేకంగా రైతాంగ సమస్యలపై చర్చించి పరిష్కార మార్గాలు కనుగొనడానికీ, తదనుగుణంగా ప్రణాళికలు రూపొందించ డానికీ చొరవ చూపాలి. ఇందుకు మహారాష్ట్ర రైతు మేనిఫెస్టో ఓ మోడల్ కావాలి.డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త ఏపీ శాసనమండలి సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి -
‘కనీస’ చట్టబద్ధత ఎండమావేనా?
ఖరీఫ్ సీజన్‌కు కేంద్ర ప్రభుత్వం 14 పంటలకు ప్రకటించిన మద్దతు ధరలు ఆశించిన మేరకు లేకపోవడంతో అన్నదాతలకు నిరాశే మిగిలింది. వరి ఎక్కువగా పండించే రాష్ట్రాలు వరి సాధారణ రకానికి రూ. 3,000 నుంచి రూ. 3,200; ఏ గ్రేడ్ రకానికి రూ. 3,200 నుంచి రూ. 3,400 ప్రకటించాలని కేంద్రానికి సిఫార్సు చేశాయి. కానీ కేంద్రం సాధారణ రకానికి రూ. 2,300; ఏ గ్రేడ్ రకానికి రూ. 2,320 మాత్రమే ప్రకటించింది. పత్తికి రూ. 1,000 నుంచి రూ.1,500 పెంచాలని కోరితే రూ. 500 పెంపుతో సరిపెట్టారు. జొన్న, మొక్కజొన్న, వేరుశనగ, కందులు, పొద్దుతిరుగుడు, నువ్వులు, సోయా, పెసలు, మినుములు... వంటి పంటలకు రాష్ట్రాల సిఫార్సులకు అనుగుణంగా ధరలు పెంచలేదు. శాస్త్రీయత లేకుండా తోచిన ధర ప్రకటించడంలో ఔచిత్యం ఏమిటి?పంటల సాగు ఖర్చుకు ఒకటిన్నర రెట్లు ఆదాయం అందాలనీ, అప్పుడే రైతుకు న్యాయం జరుగుతుందనీ వ్యవసాయ పితామహుడు డాక్టర్ స్వామినాథన్ 2005లో నాటి యూపీఏ ప్రభుత్వానికి అందించిన నివేదికలో స్పష్టం చేశారు. ఆనాటి నుంచి నేటి వరకు ఈ డిమాండ్ అపరిష్కృతంగానే ఉండిపోయింది. ఆశ్చర్యం ఏమంటే... స్వామినాథన్ కమిషన్ అందించిన సిఫార్సులను 2004 నుంచి 2014 వరకు పదేళ్లపాటు అధికారంలో ఉండి అమలు చేయకుండా అటకెక్కించిన కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామని నమ్మబలికింది. మరోపక్క, దేశంలో దశాబ్దాలపాటు అపరిష్కృతంగా, చిక్కుముళ్లుగా బిగుసుకుపోయిన సమస్యలకు తాము పరిష్కార మార్గాలు చూపగలిగామని ప్రధాని నరేంద్ర మోదీ పదేపదే చెబుతుంటారు. అయెధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన, ఆర్టికల్ 370 రద్దు, త్రిబుల్ తలాక్ రద్దు, చంద్రయాన్ విజయం, సూర్యయాన్‌కు సన్నద్ధత వంటి అంశాలను ఉదహరించే అధికార బీజేపీ గత పదేళ్లుగా రైతాంగ సమస్యలకు అరకొరగా తప్ప శాశ్వత పరిష్కార మార్గాలేమీ చూపించలేకపోవడం గమనార్హం! ఫలితంగానే దేశానికి ఆహార భద్రత చేకూర్చడానికి ఆరుగాలం కష్టపడే అన్నదాతలు దేశం నలుమూలల నుంచి తరలివచ్చి ఢిల్లీ శివారు ప్రాంతాల్లో గుడారాలు వేసుకొని ఎండ, వాన, చలిని తట్టుకొని నెలల తరబడి తమ డిమాండ్ల సాధన కోసం ఉధృతమైన ఉద్యమం చేశారు. గత 10 ఏళ్లల్లో నాలుగు దశల్లో దేశ రైతాంగం చేసిన ఆందోళన కార్యక్రమాలు ఇంతకుముందెప్పుడూ కనివిని ఎరుగనివి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపు 300కు పైగా రైతు సంఘాలు సంఘటితమై ఉద్యమించాయంటే సమస్య తీవ్రత ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు. 750 మందికి పైగా ప్రాణాలు పోయినా లెక్కచేయక రైతాంగం ప్రదర్శించిన పట్టుదల కారణంగానే కేంద్రం పార్లమెంట్లో మూడు వివాదాస్పద రైతు బిల్లుల్ని ఉపసంహరించుకొంది. కానీ వారి ఇతర డిమాండ్లను మాత్రం నెరవేర్చలేదు.దేశ రైతాంగం ముక్తకంఠంతో చేస్తున్న అతి ప్రధాన డిమాండ్ ఎంఎస్పీ(కనీస మద్దతు ధర)కి చట్టబద్ధత. దీనినే ‘కిసాన్ న్యాయ్ గ్యారంటీ’ అంటున్నారు. కేంద్రం ముందు రైతు సంఘాలు పెట్టిన ఇతర డిమాండ్లలో 1) ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) ఒప్పందాల నుంచి భారత్ బయటకు రావడం 2) వ్యవసాయ దిగుమతులపై సుంకాల పెంపుదల 3) 2020 విద్యుత్ సంస్కరణల చట్టం రద్దు 4) ఉపాధి హామీ పనులు ఏడాదికి 200 రోజులకు పెంపు 5) రైతుకు, రైతు కూలీలకు పెన్షన్ వర్తింపు వంటివి ప్రధానంగా ఉన్నాయి. రైతులు పెట్టిన ఈ డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలతో పలుమార్లు చర్చలు జరిపినా పరిష్కారం కాలేదు. ముఖ్యంగా రైతులు పట్టుబడుతున్న ప్రధాన డిమాండ్ 23 పంటలకు కనీస మద్దతు ధరలతో చట్టబద్ధత కల్పించడం. ఈ అంశాన్ని ప్రభుత్వం ఆర్థిక కోణంలో కాకుండా రైతుల ఆర్థిక కోణంలో చూడాలని అంటున్నారు. కానీ, కేంద్రం ఈ డిమాండ్‌కు తలొగ్గకపోగా మరో కొత్త ప్రతిపాదన తెరమీదకు తెచ్చింది. వరి, గోధుమలకు ప్రత్యామ్నాయంగా కంది, మినుము, మొక్కజొన్న, పత్తి వంటి పంటలు పండిస్తే ఐదేళ్లపాటు కనీస మద్దతుతో కేంద్ర సంస్థలయిన జాతీయ వినియోగదారుల సహకార సమాఖ్య (ఎన్సీసీఎఫ్), జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య (నాఫెడ్)లు కొంటాయనీ, అందుకుగాను రైతులతో ముందస్తు ఒప్పందం చేసుకొంటాయనీ ప్రతిపాదించింది. దీనిని రైతు సంఘాలు ఒప్పుకోవడం లేదు. కేంద్రం మాత్రం ఈ ప్రణాళికను అమలు చేయాలనే గట్టి పట్టుదలతో ఉంది. పంటమార్పిడి అన్నది అంత తేలికైనది కాదు. రైతులలో పంట మార్పిడి విధానంపై అవగాహన పెంచాలి. ప్రభుత్వ సహకారం అందాలి. పండించిన పంటకు గిట్టుబాటు ధర లభిస్తుందన్న నమ్మకం రైతుల్లో కలగాలి. ఇందుకు చాలా సమయం పడుతుంది. ముఖ్యంగా, దేశంలోని అన్ని ప్రాంతాలలోని వ్యవసాయ భూములు పంట మార్పిడికి పూర్తి అనుకూలంగా లేవన్నది ఓ చేదు వాస్తవం. సమగ్రమైన అధ్యయనం, వాటి ఫలితాలు పరిశీలించిన తర్వాతనే పంటల మార్పిడి విధానం అమలు చేయాలే తప్ప, బలవంతంగా అమలు చేయాలనుకోవడం వల్ల ప్రతిఘటన ఎదురవుతుంది. నిజానికి, ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించే విషయంలోనూ, ఇతర డిమాండ్ల పరిష్కారంలోనూ ఎన్డీఏ–2 ప్రభుత్వం ప్రదర్శించిన ఉదాసీనత కారణంగానే బీజేపీ ఈ ఎన్నికలలో 60 లోక్‌సభ స్థానాలకు పైగా నష్టపోయిందని పరిశీలకుల విశ్లేషణ. ప్రధానంగా... పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌లోని మెజారిటీ స్థానాల్లో రైతాంగం బీజేపీని ఆదరించలేదు. అయితే, మూడోసారి నరేంద్ర మోదీ ప్రధానిగా కొలువుదీరిన ఎన్డీఏ–3 ప్రభుత్వం రైతాంగం చేస్తున్న డిమాండ్లను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుందా? లేక ఉద్యమాన్ని అణచివేస్తుందా అన్నదే కీలకం. ఎన్నికల ముందు దేశ రైతాంగాన్ని తమ హామీల ద్వారా తమ వైపు తిప్పుకోవాలని కాంగ్రెస్ కూటమి పక్షాలు (ఇండియా బ్లాక్) ప్రయత్నించినా అది పూర్తి స్థాయిలో ఫలించలేదు. ఈ నేపథ్యంలోనే దేశ రైతాంగం ఆశలు, ఆకాంక్షలు ఏమవుతాయనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పిస్తే ఏటా కేంద్ర ప్రభుత్వంపై రూ. 12 లక్షల కోట్ల అదనపు భారం పడుతుందని నీతి ఆయోగ్ తేల్చింది. దాదాపు రూ. 50 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్లో ఇంత మొత్తం కేటాయించడం అసాధ్యమే. పైగా, వ్యవసాయం అంటే కేవలం 23 పంటలే కాదు. వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి, చేపలు, రొయ్యలు, పండ్లు, కూరగాయల మాటేమిటి? వాటికి ప్రోత్సాహకాలు అవసరం లేదా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. దేశంలో జరుగుతున్న రైతాంగ ఉద్యమాలు, వాటిపట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉన్నా రైతుల ఆదాయం గణనీయంగా తగ్గిపోయినట్లు 77వ జాతీయ నమూనా సర్వే వెల్లడించడం గమనార్హం. ఈ సర్వే ప్రకారం దేశంలోని చిన్న సన్న కారు రైతు కుటుంబాల నెలసరి ఆదాయం సగటున రూ. 10,218 మాత్రమే. రైతు కూలీల సగటు నెలవారీ ఆదాయం రూ. 4,063. ఆదాయాలు పెరగకపోవడం వల్ల వారికున్న రుణభారం తగ్గడం లేదు. ఫలితంగానే రైతులు, రైతు కూలీలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నేషనల్ క్రైవ్‌ు రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 2023లో 11,290 మంది, 2022లో 10,281 మంది, 2021లో 9,898 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. రైతుల ఆత్మహత్యల్లో పెరుగుదల 3.7 నుంచి 5.7 శాతంగా ఎన్సీఆర్బీ డేటా వెల్లడిస్తోంది. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో 53 శాతం మంది రైతు కూలీలేనన్నది చేదు నిజం. రైతులు, అనుబంధ వృత్తికూలీల ఆదాయం పెరగకపోవడం కారణంగానే గ్రామీణ పేదరికం క్రమేపీ పెరుగుతున్నది. మోదీ చెప్పినట్లు 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు కాలేదు. ఇప్పట్లో హరియాణాకు తప్ప ఇతర ప్రధాన రాష్ట్రాలకు ఎన్నికలు లేవు కనుక... రైతాంగ సమస్యల పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుందన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రైతులు డిమాండ్ చేస్తున్న ఎంఎస్పీకి చట్టబద్ధత ఓ ఎండమావిగానే మిగిలిపోతుందన్నది నిష్టుర సత్యం.డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి -
జీఎస్టీ.. జవాబులు లేని ప్రశ్న
దేశంలో 55% మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన వ్యవసాయ రంగం జీఎస్టీ వల్ల మరింతగా సంక్షోభంలో కూరుకొని పోవడం తథ్యం. సేద్యానికి అవసరమైన పనిముట్లను జీఎస్టీ పరిధిలోకి తెచ్చారు. ట్రాక్టర్ విడిభాగాలపై 28% పన్ను విధించి.. ఆ తర్వాత విమర్శలు వెల్లువెత్తడంతో దానిని 18%కు తగ్గించారు. కానీ, ఇప్పటివరకు ఎలాంటి డ్యూటీలేని ట్రాక్టర్‌ను ఇప్పుడు 12% పరిధిలోకి తెచ్చారు. చేనేత రంగాన్ని∙జీఎస్టీ కోలుకోలేని రీతిలో దెబ్బ తీస్తుందన్న భయాలు కూడా వెంటాడుతున్నాయి. ప్రపంచీకరణ తరువాత కొన్ని పదాలకు అర్థాలు మారాయి. కొన్ని అర్థాలే కోల్పోయాయి. ఆ జాబితాలో ‘సంస్కరణ’ అనే పదం ఒకటి. మన దేశానికి సంబంధించి ‘ఆర్థిక సంస్కరణ’ అంటే ‘మోయలేని ఆర్థికభారంతోప్రజలు కొన్నేళ్లు సతమతం కావడం.. ఆపై కొంత ఊరట లభించడం’. ఆర్థిక సంస్కరణలకు ఆద్యులు పీవీ నరసింహారావు. 1992లో ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో ఆర్థికాంశాలపై తీసుకొన్న కఠిన నిర్ణయాలే ఆర్థిక సంస్కరణలు. పదకోశం ఏం చెప్పినా, అనుభవంలో ‘సంస్కరణలు’ సామాన్య ప్రజలకు కొన్ని మిశ్రమ ఫలితాలను అందించాయి. అప్పటి పరిస్థితులలో అనివార్యమైన ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టిన తరువాత ‘లైసెన్స్‌రాజ్’ సహా, కాలం చెల్లిన అనేక వ్యవస్థలకు మంగళం పాడారు. వంటగ్యాస్, టెలిఫోన్ వంటి సౌకర్యాలు వెంటనే అందుబాటులోకి వచ్చాయి. ఇదంతా నాణేనికి ఒకవైపు. ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టే ముందు ప్రభుత్వపరంగా తగిన సన్నద్ధత లేకపోవడం, ప్రజలను చైతన్యపరిచి మానసికంగా సంసిద్ధులను చేయకపోవడం వల్ల నాడు స్టాక్ మార్కెట్ కుంభకోణాల వంటి ఆర్థిక నేరాలు జరి గాయి. పేద, మధ్యతరగతి ప్రజలు నష్టపోయారు. ప్రైవేటు రంగానికి పెద్ద పీట వేయడంతో కుబేరులు పెరిగారు. కార్మిక శక్తి, శ్రమశక్తి కారుచౌకగా మారాయి. రెండవదశ ఆర్థిక సంస్కరణలు రాష్ట్రాల స్థాయిలో అమలు జరి గాయి. 2000వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లో రెండవదశ ఆర్థిక సంస్కరణల పేరుతో విద్యుత్ చార్జీల మోత మోగించారు. అన్ని రంగాలు ప్రైవేటుపరం కావడం మెుదలైంది. సంస్కరణలకు మానవీయ కోణం ఉండదని, పేదలకు, మధ్య తరగతికి వ్యతిరేకమన్న భావన బలపడింది. కానీ సంస్కరణలు ఏ వర్గానికీ చేటు చేయవని, అమలు ప్రక్రియను సజావుగా నిర్వహిస్తే విజయవంతం కాగలవని అనేక దేశాల్లో రుజువైంది. ప్రజలను సంసిద్ధులను చేయకుండా అమలు చేసే ఏ సంస్కరణలు విజయవంతం కావని భారత్ సహా, దక్షిణ తూర్పు ఆసియా దేశాల ఉదాహరణలు తెలియజెప్పాయి. అమలులోనే లోపాలు ప్రస్తుతం అమలు చేస్తున్న వస్తుసేవల పన్ను (జీఎస్టీ) కూడా అతి పెద్ద సంస్కరణగా అభివర్ణించారు. కానీ, జీఎస్టీకి తగిన సన్నద్ధత లేదన్నది నిజం. జీఎస్టీ పన్ను రేట్లు, వివిధ శ్లాబులలోకి వచ్చే వస్తువులు, సేవల జాబితాను ప్రకటించినప్పటికీ జీఎస్టీతో పెను ఆర్థికభారం పడుతుందేమోనన్న ఆందోళన నెలకొంది. జీఎస్టీ అమలుకు ప్రభుత్వం సన్నద్ధం కాలేదని తెలుస్తూనే ఉంది. ఈ–ఫైలింగ్ పద్ధతిలో స్వీకరించే ఇన్వాయిస్ల పరిశీలన, వాటి పరిష్కారానికి అవసరమైన సాఫ్ట్వేర్లు సిద్ధం కాలేదు. ఆ కారణంగానే వ్యాపార సంస్థలకు తమ రిటర్నులు దాఖలు చేయడానికి రెండు నెలలు అదనపు సమయం ఇచ్చారు. జీఎస్టీ అమలుకు అవసరమైన కంప్యూటర్ ప్రోగ్రామ్ ఇప్పట్లో అందించలేమని ఇన్ఫోసిస్ ప్రకటించింది. దీనితో ప్రభుత్వ సన్నద్ధత గురించి సొంత పార్టీ వారే విమర్శలు చేశారు. జీఎస్టీ అమలుకు వీలుగా జిఎస్‌టిఎన్‌ను సిద్ధం చేయలేకపోయినందుకు ఏకంగా జిఎస్టిఎన్ చైర్మన్ నవీన్‌కుమార్‌ను తొలగించాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి డిమాండ్ చేశారు కూడా. ఓ కంప్యూటర్, అకౌంటెంట్‌ను నియమించుకొని ప్రతిరోజు సాయంత్రం 5 గంటలలోపు లావాదేవీలను ఆన్లైన్లో నమోదు చేసి తీరాలని, లేకుంటే చర్యలు తప్పవని తేల్చేయడంతో.. సదరు భారాన్ని ఎలా భరించాలన్న ఆందోళనలో జీఎస్టీ పరిధిలోకి వచ్చే చిన్న వ్యాపారులు కొట్టుమిట్టాడుతున్నారు. ఏ శ్లాబ్ పరిధిలోకి ఏ వస్తువు వస్తుంది అన్న అంశంలోను చాలామంది అవగాహనకు రాలేదు.దేశంలో అక్షరాస్యత 67%. నిరక్షరాస్యులైన మిగిలిన 33% ప్రజానీకానికి జీఎస్టీ, దానివల్ల ఒనగూరే ఫలితాలేమిటో అర్థం కాని పరిస్థితి. జీఎస్టీతో పన్నుల విధానంలో పారదర్శకత వస్తుం దంటూ చేసిన ప్రచారం నిజం కాదు. అనేక వస్తువులు, సేవల పన్ను శ్లాబు విషయంలో అస్పష్టత కొనసాగుతూనే ఉంది. ఉదాహరణకు తాజా పాలను 5% శ్లాబులో చేర్చి; ప్రాసెస్, నిలువ చేసిన ఉత్పత్తులన్నింటినీ 18, 28 శ్లాబుల్లో చేర్చడం అనాలోచిత చర్య. దేశంలోని అత్యధిక నగర, పట్టణ ప్రజానీకం ప్రాసెస్ చేసిన పాల ఉత్పత్తులనే వాడుతున్నారు. ఇప్పుడు అవన్నీ మోయలేని భారంగా పరిణమించాయి. లోపించిన మానవతాకోణం దేశాన్ని ‘పన్ను ఉగ్రవాదం’నుంచి విముక్తి చేయడమే జీఎస్టీ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పదేపదే చెప్పారు. అందుకు పలు విడతలుగా రాష్ట్రాలతో జీఎస్టీ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించి వాటి అభిప్రాయాలు, సూచనల నుంచి కొన్ని స్వీకరించి, ఆ మేరకు మినహాయింపులు ఇచ్చిన మాట వాస్తవం. చివరకు 12 వందల పైచిలుకు వస్తువులు, ఐదు వందల రకాల సేవలకు రుసుములు ఖరారు చేశారు. భారీగా జరిగినట్టు కనిపించిన ఈ కసరత్తులో లోపించింది ఏమైనా ఉందీ అంటే.. అది మానవతా దృక్పథమే. జీఎస్టీతో పేదల మీద పెనుభారాన్ని మోపుతున్నారు. ఉదాహరణకు.. మంచినీటి సరఫరా సంస్థల్ని జీఎస్టీ పరిధిలోకి తెచ్చారు. దీనితో తాగునీటిని ప్రైవేటు సంస్థల నుంచి కొనుగోలు చేస్తున్న ప్రజలపై అదనపు భారం పడుతుంది. తాగునీటిని సరఫరా చేయలేని ప్రభుత్వం ప్రజలు ప్రైవేటు సంస్థల నుంచి కొనుగోలు చేస్తుంటే వారిపై భారం మోపడం సమంజసమా? అలాగే చిన్నా,పెద్దా తేడా లేకుండా హోటళ్లు, రెస్టారెంట్లపై ఉన్న 5% సేవాపన్నును కనిష్టంగా 18%, గరిష్టంగా 28% పన్నుగా నిర్ణయించారు. అందుకే దక్షిణ భారత రాష్ట్రాల్లోని హోటళ్లు ఒకరోజు సమ్మె చేశాయి. జీఎస్టీతో ఇటువంటి సమస్యలు ఉత్పన్నం కావడం రెండు, మూడు రంగాలకే పరి మితం కాలేదు. మహిళలు నెలసరి సమయంలో వాడే నాప్కిన్స్ను 12% పన్ను వసూలు చేసే శ్లాబ్‌లోకి చేర్చి ప్రకృతి ధర్మంపై కూడా పన్ను విధిస్తున్నారనే అపప్ర«థను మూటగట్టుకొన్నారు. రాష్ట్రాల అభ్యర్థనలకు తిలోదకాలు పలు భేటీల తర్వాత రాష్ట్రాలు నివేదించిన కొన్ని అభ్యర్ధనలను పరిగణనలోకి తీసుకొన్న మాట నిజమే! కశ్మీర్ భేటీ తర్వాత చివరగా 66 రకాల వస్తు సేవలపై పన్ను తగ్గింపులకు కేంద్రం అనుమతించింది. కొన్ని మినహాయింపులకు ససేమిరా అంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీర«థ, మిషన్ కాకతీయ సాగునీటి పథకాలపై జీఎస్టీ భారాన్ని దాదాపు రూ.12,000 కోట్ల మేర మోపారు. అలాగే బీడీ పరిశ్రమపై వస్తుసేవల పన్ను విధించి పేదలను అన్యాయం చేశారు. బీడీ పరిశ్రమలను జీఎస్టీ పరిధి నుంచి తప్పించాలన్న రెండు రాష్ట్రాలు చేసిన అభ్యర్థనలను బుట్టదాఖలు చేయడం నియంతృత్వానికి పరాకాష్ట. అలాగే, తిరుమల తిరుపతి దేవస్థానంతోపాటు, దేశంలోని 70% దేవాలయాల్లోని ఆర్జిత సేవలను, ప్రత్యేకదర్శనం టిక్కెట్లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం గర్హనీయం. జీఎస్టీతో రాష్ట్రాలు కోల్పోయే ఆదాయాన్ని భర్తీ చేస్తామని కేంద్రం భరోసా ఇచ్చినప్పటికీ ఎన్నేళ్లపాటు భర్తీ చేస్తారన్న అంశంపై స్పష్టత లేదు. కాబట్టి కొన్ని రాష్ట్రాలకు ఆర్థికంగా నష్టం తప్పకపోవచ్చు. ఈ చట్టంతో రాష్ట్రాల హక్కులకు భంగం వాటిల్లుతుందన్నది నిజం. పన్ను విధింపు హక్కులన్నీ రద్దు అవుతాయి. రాష్ట్రాలన్నీ ఆర్థిక వనరుల కోసం కేంద్రం పైనే ఆధారపడాలి. ఇది సమాఖ్య స్ఫూర్తికి, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతమేనని ప్రఖ్యాత ఆర్థికవేత్త ప్రభాయత్ పట్నాయక్ సహా ఎంతోమంది చేస్తున్న వాదనను పరిగణనలోకి తీసుకోవాలి. జమ్మూ కశ్మీర్‌లోను జీఎస్టీని అమలు చేయడమంటే.. ఆ రాష్ట్ర ప్రత్యేక ప్రతిపత్తి కూడా ఉల్లంఘనకు గురైనట్టే! పారిశ్రామికవేత్తల పరోక్ష సంకేతాలు జీఎస్టీ మీద బడా పారిశ్రామికవేత్తలలో కూడా ఏకాభిప్రాయం లేదు. ‘జీఎస్టీ’ ని ఈ తరహాలో అమలు చేయడాన్ని స్వాగతించినవారి సంఖ్య స్వల్పం. ఫిక్కి, అసోచామ్ వంటి పారిశ్రామిక సమాఖ్యలు జీఎస్టీ అమలును మరికొంత కాలం వాయిదా వేయాలని అభ్యర్థించాయి. చిరువ్యాపారులకు ప్రాతినిధ్యం వహించే ‘అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సిఎఐటి)’ 28% పన్నురేటు పరిధిలోకి చేర్చిన వస్తువుల జాబితాను కుదించాలని విజ్ఞప్తి చేసింది. ముందూ వెనకా ఆలోచించకుండా అనేక వస్తువులను అత్యధిక పన్ను రేటైన 28%లో చేర్చడం దారుణమని సిఎఐటి సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ వ్యాఖ్యానించారు. కొందరు పారిశ్రామిక దిగ్గజాలు ‘జీఎస్టీ మంచిదే కాని.. పన్నుపోటు మరీ ఎక్కువ’అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. జీఎస్టీ వల్ల రియల్ఎస్టేట్ రంగంలో పన్నుల భారం తగ్గుతుందని భావిస్తున్నప్పటికీ.. దానిని రియల్టర్లు కొనుగోలుదారులకు బదిలీ చేస్తేనే ప్రయోజనం కలుగుతుంది. దేశంలో 55% మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన వ్యవసాయ రంగం జీఎస్టీ వల్ల మరింతగా సంక్షోభంలో కూరుకొని పోవడం తథ్యం. సేద్యానికి అవసరమైన పనిముట్లను జీఎస్టీ పరిధిలోకి తెచ్చారు. ట్రాక్టర్ విడిభాగాలపై 28% పన్ను విధించి.. ఆ తర్వాత విమర్శలు వెల్లువెత్తడంతో దానిని 18%కు తగ్గించారు. కానీ, ఇప్పటివరకు ఎలాంటి డ్యూటీలేని ట్రాక్టర్‌ను ఇప్పుడు 12% పరిధిలోకి తెచ్చారు. చేనేత రంగాన్ని∙జీఎస్టీ కోలుకోలేని రీతిలో దెబ్బ తీస్తుందన్న భయాలు ఉన్నాయి. చేనేతపై జీఎస్టీ భారాన్ని ఎత్తివేసి, ఊరట కల్పించాలని వైఎస్సాఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధానమంత్రిని లేఖ ద్వారా అభ్యర్థించారు. నిజానికి పెద్దనోట్ల రద్దు నిర్ణయం తర్వాత జీఎస్టీ అమలుకు ప్రభుత్వం పూనుకోవడం పేద ప్రజల మీద, వారి అవసరాల మీద వరస దెబ్బలు కొట్టినట్టయింది. 1947, ఆగస్టు 14 అర్థరాత్రి స్వాతంత్య్రం లభించిన చారిత్రక సందర్భాన్ని జీఎస్టీ అమలుతో పోల్చారు. జూన్ 30 అర్ధరాత్రివేళ జీఎస్టీ అమలును ఓ వేడుకగా నిర్వహించడంలో ఔచిత్యం కనపడదు. జీఎస్టీ అమలును ఆర్థిక స్వాతంత్య్రంగా అభివర్ణించడం తగదు. కేంద్రానికి పన్నుల ద్వారా అధిక రాబడి వచ్చినంత మాత్రాన అది ఆర్థిక స్వాతంత్య్రం కాదు. అన్ని వర్గాల ప్రజల ఆకలిదప్పులు తీరే అవకాశాలు దేశంలో కల్పించగలిగినప్పుడు అది నిజమైన ఆర్థిక స్వాతంత్య్రం అవుతుంది. జీఎస్టీ మీద వివిధ వర్గాల నుంచి వ్యక్తమవుతున్న నిట్టూర్పులు వినిపించకుండా ఉండేందుకే దీనినో జాతరగా మార్చారు. డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నాయకులు మొబైల్ : 99890 24579