జీఎస్టీ.. జవాబులు లేని ప్రశ్న
దేశంలో 55% మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన వ్యవసాయ రంగం జీఎస్టీ వల్ల మరింతగా సంక్షోభంలో కూరుకొని పోవడం తథ్యం. సేద్యానికి అవసరమైన పనిముట్లను జీఎస్టీ పరిధిలోకి తెచ్చారు. ట్రాక్టర్ విడిభాగాలపై 28% పన్ను విధించి.. ఆ తర్వాత విమర్శలు వెల్లువెత్తడంతో దానిని 18%కు తగ్గించారు. కానీ, ఇప్పటివరకు ఎలాంటి డ్యూటీలేని ట్రాక్టర్‌ను ఇప్పుడు 12% పరిధిలోకి తెచ్చారు. చేనేత రంగాన్ని∙జీఎస్టీ కోలుకోలేని రీతిలో దెబ్బ తీస్తుందన్న భయాలు కూడా వెంటాడుతున్నాయి.
ప్రపంచీకరణ తరువాత కొన్ని పదాలకు అర్థాలు మారాయి. కొన్ని అర్థాలే కోల్పోయాయి. ఆ జాబితాలో ‘సంస్కరణ’ అనే పదం ఒకటి. మన దేశానికి సంబంధించి ‘ఆర్థిక సంస్కరణ’ అంటే ‘మోయలేని ఆర్థికభారంతోప్రజలు కొన్నేళ్లు సతమతం కావడం.. ఆపై కొంత ఊరట లభించడం’. ఆర్థిక సంస్కరణలకు ఆద్యులు పీవీ నరసింహారావు. 1992లో ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో ఆర్థికాంశాలపై తీసుకొన్న కఠిన నిర్ణయాలే ఆర్థిక సంస్కరణలు. పదకోశం ఏం చెప్పినా, అనుభవంలో ‘సంస్కరణలు’ సామాన్య ప్రజలకు కొన్ని మిశ్రమ ఫలితాలను అందించాయి. అప్పటి పరిస్థితులలో అనివార్యమైన ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టిన తరువాత ‘లైసెన్స్‌రాజ్’ సహా, కాలం చెల్లిన అనేక వ్యవస్థలకు మంగళం పాడారు. వంటగ్యాస్, టెలిఫోన్ వంటి సౌకర్యాలు వెంటనే అందుబాటులోకి వచ్చాయి. ఇదంతా నాణేనికి ఒకవైపు.
ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టే ముందు ప్రభుత్వపరంగా తగిన సన్నద్ధత లేకపోవడం, ప్రజలను చైతన్యపరిచి మానసికంగా సంసిద్ధులను చేయకపోవడం వల్ల నాడు స్టాక్ మార్కెట్ కుంభకోణాల వంటి ఆర్థిక నేరాలు జరి గాయి. పేద, మధ్యతరగతి ప్రజలు నష్టపోయారు. ప్రైవేటు రంగానికి పెద్ద పీట వేయడంతో కుబేరులు పెరిగారు. కార్మిక శక్తి, శ్రమశక్తి కారుచౌకగా మారాయి. రెండవదశ ఆర్థిక సంస్కరణలు రాష్ట్రాల స్థాయిలో అమలు జరి గాయి. 2000వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లో రెండవదశ ఆర్థిక సంస్కరణల పేరుతో విద్యుత్ చార్జీల మోత మోగించారు. అన్ని రంగాలు ప్రైవేటుపరం కావడం మెుదలైంది.
సంస్కరణలకు మానవీయ కోణం ఉండదని, పేదలకు, మధ్య తరగతికి వ్యతిరేకమన్న భావన బలపడింది. కానీ సంస్కరణలు ఏ వర్గానికీ చేటు చేయవని, అమలు ప్రక్రియను సజావుగా నిర్వహిస్తే విజయవంతం కాగలవని అనేక దేశాల్లో రుజువైంది. ప్రజలను సంసిద్ధులను చేయకుండా అమలు చేసే ఏ సంస్కరణలు విజయవంతం కావని భారత్ సహా, దక్షిణ తూర్పు ఆసియా దేశాల ఉదాహరణలు తెలియజెప్పాయి.
అమలులోనే లోపాలు
ప్రస్తుతం అమలు చేస్తున్న వస్తుసేవల పన్ను (జీఎస్టీ) కూడా అతి పెద్ద సంస్కరణగా అభివర్ణించారు. కానీ, జీఎస్టీకి తగిన సన్నద్ధత లేదన్నది నిజం. జీఎస్టీ పన్ను రేట్లు, వివిధ శ్లాబులలోకి వచ్చే వస్తువులు, సేవల జాబితాను ప్రకటించినప్పటికీ జీఎస్టీతో పెను ఆర్థికభారం పడుతుందేమోనన్న ఆందోళన నెలకొంది. జీఎస్టీ అమలుకు ప్రభుత్వం సన్నద్ధం కాలేదని తెలుస్తూనే ఉంది. ఈ–ఫైలింగ్ పద్ధతిలో స్వీకరించే ఇన్‌వాయిస్‌ల పరిశీలన, వాటి పరిష్కారానికి అవసరమైన సాఫ్ట్‌వేర్‌లు సిద్ధం కాలేదు. ఆ కారణంగానే వ్యాపార సంస్థలకు తమ రిటర్నులు దాఖలు చేయడానికి రెండు నెలలు అదనపు సమయం ఇచ్చారు. జీఎస్టీ అమలుకు అవసరమైన కంప్యూటర్ ప్రోగ్రామ్ ఇప్పట్లో అందించలేమని ఇన్ఫోసిస్ ప్రకటించింది. దీనితో ప్రభుత్వ సన్నద్ధత గురించి సొంత పార్టీ వారే విమర్శలు చేశారు. జీఎస్టీ అమలుకు వీలుగా జిఎస్‌టిఎన్‌ను సిద్ధం చేయలేకపోయినందుకు ఏకంగా జిఎస్‌టిఎన్ చైర్మన్ నవీన్‌కుమార్‌ను తొలగించాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి డిమాండ్ చేశారు కూడా.
ఓ కంప్యూటర్, అకౌంటెంట్‌ను నియమించుకొని ప్రతిరోజు సాయంత్రం 5 గంటలలోపు లావాదేవీలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి తీరాలని, లేకుంటే చర్యలు తప్పవని తేల్చేయడంతో.. సదరు భారాన్ని ఎలా భరించాలన్న ఆందోళనలో జీఎస్టీ పరిధిలోకి వచ్చే చిన్న వ్యాపారులు కొట్టుమిట్టాడుతున్నారు. ఏ శ్లాబ్ పరిధిలోకి ఏ వస్తువు వస్తుంది అన్న అంశంలోను చాలామంది అవగాహనకు రాలేదు.దేశంలో అక్షరాస్యత 67%. నిరక్షరాస్యులైన మిగిలిన 33% ప్రజానీకానికి జీఎస్టీ, దానివల్ల ఒనగూరే ఫలితాలేమిటో అర్థం కాని పరిస్థితి. జీఎస్టీతో పన్నుల విధానంలో పారదర్శకత వస్తుం దంటూ చేసిన ప్రచారం నిజం కాదు. అనేక వస్తువులు, సేవల పన్ను శ్లాబు విషయంలో అస్పష్టత కొనసాగుతూనే ఉంది. ఉదాహరణకు తాజా పాలను 5% శ్లాబులో చేర్చి; ప్రాసెస్, నిలువ చేసిన ఉత్పత్తులన్నింటినీ 18, 28 శ్లాబుల్లో చేర్చడం అనాలోచిత చర్య. దేశంలోని అత్యధిక నగర, పట్టణ ప్రజానీకం ప్రాసెస్ చేసిన పాల ఉత్పత్తులనే వాడుతున్నారు. ఇప్పుడు అవన్నీ మోయలేని భారంగా పరిణమించాయి.
లోపించిన మానవతాకోణం
దేశాన్ని ‘పన్ను ఉగ్రవాదం’నుంచి విముక్తి చేయడమే జీఎస్టీ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పదేపదే చెప్పారు. అందుకు పలు విడతలుగా రాష్ట్రాలతో జీఎస్టీ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించి వాటి అభిప్రాయాలు, సూచనల నుంచి కొన్ని స్వీకరించి, ఆ మేరకు మినహాయింపులు ఇచ్చిన మాట వాస్తవం. చివరకు 12 వందల పైచిలుకు వస్తువులు, ఐదు వందల రకాల సేవలకు రుసుములు ఖరారు చేశారు. భారీగా జరిగినట్టు కనిపించిన ఈ కసరత్తులో లోపించింది ఏమైనా ఉందీ అంటే.. అది మానవతా దృక్పథమే. జీఎస్టీతో పేదల మీద పెనుభారాన్ని మోపుతున్నారు. ఉదాహరణకు.. మంచినీటి సరఫరా సంస్థల్ని జీఎస్టీ పరిధిలోకి తెచ్చారు. దీనితో తాగునీటిని ప్రైవేటు సంస్థల నుంచి కొనుగోలు చేస్తున్న ప్రజలపై అదనపు భారం పడుతుంది.
తాగునీటిని సరఫరా చేయలేని ప్రభుత్వం ప్రజలు ప్రైవేటు సంస్థల నుంచి కొనుగోలు చేస్తుంటే వారిపై భారం మోపడం సమంజసమా? అలాగే చిన్నా,పెద్దా తేడా లేకుండా హోటళ్లు, రెస్టారెంట్లపై ఉన్న 5% సేవాపన్నును కనిష్టంగా 18%, గరిష్టంగా 28% పన్నుగా నిర్ణయించారు. అందుకే దక్షిణ భారత రాష్ట్రాల్లోని హోటళ్లు ఒకరోజు సమ్మె చేశాయి. జీఎస్టీతో ఇటువంటి సమస్యలు ఉత్పన్నం కావడం రెండు, మూడు రంగాలకే పరి మితం కాలేదు. మహిళలు నెలసరి సమయంలో వాడే నాప్కిన్స్‌ను 12% పన్ను వసూలు చేసే శ్లాబ్‌లోకి చేర్చి ప్రకృతి ధర్మంపై కూడా పన్ను విధిస్తున్నారనే అపప్ర«థను మూటగట్టుకొన్నారు.
రాష్ట్రాల అభ్యర్థనలకు తిలోదకాలు
పలు భేటీల తర్వాత రాష్ట్రాలు నివేదించిన కొన్ని అభ్యర్ధనలను పరిగణనలోకి తీసుకొన్న మాట నిజమే! కశ్మీర్ భేటీ తర్వాత చివరగా 66 రకాల వస్తు సేవలపై పన్ను తగ్గింపులకు కేంద్రం అనుమతించింది. కొన్ని మినహాయింపులకు ససేమిరా అంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీర«థ, మిషన్ కాకతీయ సాగునీటి పథకాలపై జీఎస్టీ భారాన్ని దాదాపు రూ.12,000 కోట్ల మేర మోపారు. అలాగే బీడీ పరిశ్రమపై వస్తుసేవల పన్ను విధించి పేదలను అన్యాయం చేశారు. బీడీ పరిశ్రమలను జీఎస్టీ పరిధి నుంచి తప్పించాలన్న రెండు రాష్ట్రాలు చేసిన అభ్యర్థనలను బుట్టదాఖలు చేయడం నియంతృత్వానికి పరాకాష్ట. అలాగే, తిరుమల తిరుపతి దేవస్థానంతోపాటు, దేశంలోని 70% దేవాలయాల్లోని ఆర్జిత సేవలను, ప్రత్యేకదర్శనం టిక్కెట్లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం గర్హనీయం.
జీఎస్టీతో రాష్ట్రాలు కోల్పోయే ఆదాయాన్ని భర్తీ చేస్తామని కేంద్రం భరోసా ఇచ్చినప్పటికీ ఎన్నేళ్లపాటు భర్తీ చేస్తారన్న అంశంపై స్పష్టత లేదు. కాబట్టి కొన్ని రాష్ట్రాలకు ఆర్థికంగా నష్టం తప్పకపోవచ్చు. ఈ చట్టంతో రాష్ట్రాల హక్కులకు భంగం వాటిల్లుతుందన్నది నిజం. పన్ను విధింపు హక్కులన్నీ రద్దు అవుతాయి. రాష్ట్రాలన్నీ ఆర్థిక వనరుల కోసం కేంద్రం పైనే ఆధారపడాలి. ఇది సమాఖ్య స్ఫూర్తికి, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతమేనని ప్రఖ్యాత ఆర్థికవేత్త ప్రభాయత్ పట్నాయక్ సహా ఎంతోమంది చేస్తున్న వాదనను పరిగణనలోకి తీసుకోవాలి. జమ్మూ కశ్మీర్‌లోను జీఎస్టీని అమలు చేయడమంటే.. ఆ రాష్ట్ర ప్రత్యేక ప్రతిపత్తి కూడా ఉల్లంఘనకు గురైనట్టే!
పారిశ్రామికవేత్తల పరోక్ష సంకేతాలు
జీఎస్టీ మీద బడా పారిశ్రామికవేత్తలలో కూడా ఏకాభిప్రాయం లేదు. ‘జీఎస్టీ’ ని ఈ తరహాలో అమలు చేయడాన్ని స్వాగతించినవారి సంఖ్య స్వల్పం. ఫిక్కి, అసోచామ్ వంటి పారిశ్రామిక సమాఖ్యలు జీఎస్టీ అమలును మరికొంత కాలం వాయిదా వేయాలని అభ్యర్థించాయి. చిరువ్యాపారులకు ప్రాతినిధ్యం వహించే ‘అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సిఎఐటి)’ 28% పన్నురేటు పరిధిలోకి చేర్చిన వస్తువుల జాబితాను కుదించాలని విజ్ఞప్తి చేసింది. ముందూ వెనకా ఆలోచించకుండా అనేక వస్తువులను అత్యధిక పన్ను రేటైన 28%లో చేర్చడం దారుణమని సిఎఐటి సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్‌వాల్ వ్యాఖ్యానించారు. కొందరు పారిశ్రామిక దిగ్గజాలు ‘జీఎస్టీ మంచిదే కాని.. పన్నుపోటు మరీ ఎక్కువ’అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. జీఎస్టీ వల్ల రియల్‌ఎస్టేట్ రంగంలో పన్నుల భారం తగ్గుతుందని భావిస్తున్నప్పటికీ.. దానిని రియల్టర్‌లు కొనుగోలుదారులకు బదిలీ చేస్తేనే ప్రయోజనం కలుగుతుంది.
దేశంలో 55% మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన వ్యవసాయ రంగం జీఎస్టీ వల్ల మరింతగా సంక్షోభంలో కూరుకొని పోవడం తథ్యం. సేద్యానికి అవసరమైన పనిముట్లను జీఎస్టీ పరిధిలోకి తెచ్చారు. ట్రాక్టర్ విడిభాగాలపై 28% పన్ను విధించి.. ఆ తర్వాత విమర్శలు వెల్లువెత్తడంతో దానిని 18%కు తగ్గించారు. కానీ, ఇప్పటివరకు ఎలాంటి డ్యూటీలేని ట్రాక్టర్‌ను ఇప్పుడు 12% పరిధిలోకి తెచ్చారు. చేనేత రంగాన్ని∙జీఎస్టీ కోలుకోలేని రీతిలో దెబ్బ తీస్తుందన్న భయాలు ఉన్నాయి. చేనేతపై జీఎస్టీ భారాన్ని ఎత్తివేసి, ఊరట కల్పించాలని వైఎస్సాఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రధానమంత్రిని లేఖ ద్వారా అభ్యర్థించారు. నిజానికి పెద్దనోట్ల రద్దు నిర్ణయం తర్వాత జీఎస్టీ అమలుకు ప్రభుత్వం పూనుకోవడం పేద ప్రజల మీద, వారి అవసరాల మీద వరస దెబ్బలు కొట్టినట్టయింది.
1947, ఆగస్టు 14 అర్థరాత్రి స్వాతంత్య్రం లభించిన చారిత్రక సందర్భాన్ని జీఎస్టీ అమలుతో పోల్చారు. జూన్ 30 అర్ధరాత్రివేళ జీఎస్టీ అమలును ఓ వేడుకగా నిర్వహించడంలో ఔచిత్యం కనపడదు. జీఎస్టీ అమలును ఆర్థిక స్వాతంత్య్రంగా అభివర్ణించడం తగదు. కేంద్రానికి పన్నుల ద్వారా అధిక రాబడి వచ్చినంత మాత్రాన అది ఆర్థిక స్వాతంత్య్రం కాదు. అన్ని వర్గాల ప్రజల ఆకలిదప్పులు తీరే అవకాశాలు దేశంలో కల్పించగలిగినప్పుడు అది నిజమైన ఆర్థిక స్వాతంత్య్రం అవుతుంది. జీఎస్టీ మీద వివిధ వర్గాల నుంచి వ్యక్తమవుతున్న నిట్టూర్పులు వినిపించకుండా ఉండేందుకే దీనినో జాతరగా మార్చారు.
డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
వ్యాసకర్త ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నాయకులు
మొబైల్ : 99890 24579