చేనేతరంగంపై పిడుగుపాటు జీఎస్టీ
సందర్భం
కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ జాతీయ ఫైబర్ విధానం రూపకల్పనకు 2009 జూలై నెలలో శ్రీకారం చుట్టింది. దేశీయంగా పత్తి, కృత్రిమ నూలు మధ్య ఉన్న నిష్పత్తిని మార్చడం. కృత్రిమ నూలు ఉత్పత్తిని పెంచి, పత్తిపై ఆధారపడడాన్ని తగ్గించి ఆధునిక జౌళి రంగ అభివృద్ధి సాధించడమే ఈ ముసాయిదా ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఈ నిష్పత్తి 40:60 ఉండగా దేశంలో ఇది 59:41గా ఉన్నది. అంటే, పత్తి ఉత్పత్తి కృత్రిమ నూలుతో పోలిస్తే మన దేశంలో ఎక్కువ. అంతర్జాతీయంగా తక్కువ. మనం అంతర్జాతీయంగా ప్రస్తుతం ఉన్న పత్తి, కృత్రిమ నూలు ఉత్పతి మధ్య ఉన్న నిష్పత్తిని అందుకోవాలని ఈ ముసాయిదాలో చెప్పారు.
భారతదేశం పత్తి ఉత్పత్తిలో ప్రపంచ స్థాయిలో రెండవ స్థానంలో ఉంది. 2008లో జరిగిన ఉత్పత్తి 5 బిలియన్ కేజీలు. పత్తి నూలు, పత్తి ఆధార వస్త్ర ఉత్పత్తిలో కూడా అగ్రగామి. 17 మిలియన్ కేజీల ఉత్పత్తితో సిల్క్‌లో కూడా రెండవ స్థాయిలో ఉంది. జనపనార ఉత్పత్తి 1.7 బిలియన్ కేజీలు చేరుకొని ప్రపంచంలో మొదటి స్థాయిలో ఉంది. ఏ దేశంలో కూడా ఇన్ని రకాల ఫైబర్ ఉత్పత్తులు చేసే సామర్థ్యం లేదు. ఇంతటి వైవిధ్యం కలిగిన భారత జౌళి రంగంలో కనీసం 10 కోట్ల మంది కేవలం సహజ ఫైబర్ ఉత్పత్తుల మీద ఆధారపడి జీవిస్తున్నారు.
1995లో ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటు సందర్భంగా జరిగిన ఒప్పందాలలో భాగముగా భారత ప్రభుత్వం దేశీయ జౌళి రంగాన్ని సంస్కరించ పూనుకున్నది. 2005లో ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛా వస్త్ర వాణిజ్యం అమలులోకి వచ్చిన తర్వాత కూడా సంస్కరణల పరంపర కొనసాగింది. ఎగుమతుల ద్వారా భారత జౌళి రంగం ఇంకా వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయని జౌళి విధానాలలో మార్పులు తీసుకుని వచ్చారు. ఈ మార్పులలో కుటీర, చిన్న చేనేత రంగాలకు ప్రాధాన్యం కల్పించలేదు. గత పదేళ్లలో, పెద్ద పారిశ్రామికులకు ఆధునీకరణ పేరుతో దాదాపు లక్ష కోట్ల రూపాయల రాయితీలు, సబ్సిడీలు, ప్రోత్సాహకాలు ఇచ్చారు. ఇంకా రాయితీలు, సబ్సీడీలు, ప్రోత్సాహకాలు కల్పించే దిశగా జాతీయ ఫైబర్ విధానం రూపొందించారు. జీఎస్టీ వల్ల ఆ ప్రయోజనాలు ఇంకా విస్తృతం అవుతాయి.
ఇప్పటికే, గత ఇరవై ఏళ్ళ విధానపర వివక్షతో కుదేలైన చేనేత పరిశ్రమ, దాని మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు జీఎస్టీ ఒక గొడ్డలిపెట్టు. జీఎస్టీలో ఉన్న ఆలోచనలు, అమలు పద్ధతుల వల్ల, ఇన్ని ఏండ్లుగా చేనేత మీద లేని పన్ను భారం, ఇప్పుడు పడుతుంది. సహజ నూలు మీద కూడా పన్నులు కట్టాల్సి వస్తుంది. సహజ ఫైబర్ ఉత్పత్తుల మీద మాత్రం 4 నుంచి 12 శాతం వరకు భారం పడుతుంది. దీని వలన, దాదాపు పది కోట్ల చిన్న, సన్నకారు రైతులు, చేనేత కార్మిక కుటుంబాల మీద తీవ్ర దుష్ప్రభావం ఉంటుంది.
భారత జౌళి రంగంలో జీఎస్టీ పెను మార్పులు తీసుకు వస్తుంది. కృతిమ నూలు దిశగా అభివృద్ధి అడుగులు వేసే ప్రతిపాదనలు చెయ్యటం ఆత్మహత్యాసదృశ్యం. గత పదేళ్లలో జాతీయ జౌళి విధానంవల్ల అనేక ప్రాంతాలలో అనేక కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి. పేదరికం పెరిగింది. నిపుణులు కనుమరుగవుతున్నారు. ఈ పరిస్థితుల్లో జాతీయ ఫైబర్ విధానం తీసుకు వచ్చి పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నాలు చెయ్యకుండా గోరుచుట్టుపై రోకటి పోటు లాగ జీఎస్టీ పేరుతో చేనేత ఉత్పత్తి మీద భారం పెరుగుతున్నా పట్టించుకోకపోవటం అత్యంత బాధాకరం.
క్లుప్తంగా, జీఎస్టీ వల్ల చేనేత మీద భారం పెరుగుతుంది. ఇప్పటికే కుదేలు అయిన పరిశ్రమకోసం, జీఎస్టీలో సహజ నూలుకు, చేనేత వస్త్రాలు మినహాయింపు ఇవ్వకపోతే, చేనేత ఉపాధి పూర్తిగా తగ్గుతుంది. చిన్న, సన్నకారు రైతులు.. చేనేత కార్మిక కుటుంబాల సమస్యలు పరిష్కారాలు ఇందులో మిళితంచేసి ఒక సమగ్ర విధానం రూపకల్పన చెయ్యాలి. దేశీయ జౌళి రంగంలోని అన్ని ఉప రంగాల ప్రయోజనాలు కాపాడాల్సిన అవసరం ఎంతైన ఉంది. జీఎస్టీ అమలులోకి వస్తే భారత జౌళి రంగం యొక్క స్వరూపం మారిపోయే అవకాశం ఉన్నది. మొదటగా, చిన్న ఉత్పత్తిదారులు కనుమరుగు అవుతారు. రెండవ దశలో దిగుమతులు మరియు విదేశీ ఉత్పత్తులు పెరిగిపోతాయి. ఈ రెండు దశల క్రమంలో సహజ నూలు ఉత్పత్తులు 60 శాతం దేశ ప్రజలకు అందుబాటులో ఉండవు.
దేశీయ జౌళి రంగం యొక్క ప్రాశస్త్యం సహజ నూలు ఉత్పత్తులు కనుక వీటిని ప్రోత్సహించేలా వ్యూహాలు పొందుపరచాలి. మార్కెట్లో వినియోగదారులు మోసపోకుండా జౌళి ఉత్పత్తులకు లేబులింగ్ చట్టం తీసుకురావాలి. సహజ నూలుకోసం ఒక నిధిని ఏర్పాటు చెయ్యాలి. నూలు ధరల స్థిరీకరణకు ప్రత్యేక నియంత్రణ యంత్రాంగం ఏర్పాటు చెయ్యాలి. జీఎస్టీ మినహాయింపుల జాబితాలో చేనేత ఉత్పత్తులు, సహజ నూలు వస్త్రాలు మరియు దుస్తులను విధిగా చేర్చాలి. ఈ దిశగా, చేనేత వ్యాపార వర్గాలు, చేనేత కార్మికులు, కుటుంబాలు, చేనేత వినియోగదారులు, దేశీయ పరిశ్రమ కోసం పాటు పడే వర్గాలు కలిసికట్టుగా పని చేసి, ప్రభుత్వం మీద ఒత్తిడి చెయ్యాలి.
డా డి. నరసింహారెడ్డి
చేనేత జౌళి విధాన నిపుణులు
ఈ–మెయిల్ : nreddy.donthi16@gmaill.com