సాక్షి, హైదరాబాద్: వస్త్ర పరిశ్రమపై జనవరి ఒకటో తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం విధించనున్న అదనపు జీఎస్టీ ప్రతిపాదనలను వెంటనే విరమించుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. జీఎస్టీ పెంపుతో దేశంలో చేనేత, వస్త్ర పరిశ్రమ పూర్తి స్థాయిలో కుదేలవుతుందని, వస్త్ర పరిశ్రమపై ఆధారపడిన కోట్లాది మందికి ఇది సమ్మెట పోటులాంటిదని కేటీఆర్ అభివర్ణించారు.
చేనేత కార్మికుల జీవితాలను దెబ్బతీసే నిర్ణయాలను విరమించుకోవాలన్నారు. జీఎస్టీ పెంపు ద్వారా చేనేత, జౌళి ఉత్పత్తుల ధరలు పెరుగుతాయని, దాంతో సామాన్యులు ఇబ్బంది పడతారని, కొనుగోళ్లు తగ్గి వస్త్ర, దుస్తుల తయారీ యూనిట్లు నష్టాలబారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. నేతన్నలు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నా కేంద్రం మొండిగా ముందుకు వెళితే వ్యవసాయ చట్టాల విషయంలో రైతులు ఉద్యమించినట్లుగానే నేత కార్మి కులు కూడా తిరగబడతారన్నారు.
పన్ను పెంపు ప్రతిపాదనను కేంద్రం ఉపసంహరించుకునేంత వరకు వస్త్ర పరిశ్రమ, పారిశ్రామికవర్గాలు, నేత కార్మికులకు తెలంగాణ తరపున అండగా నిలబడతామన్నారు. కేంద్ర మంత్రి పీయుష్ గోయల్‌ను ఉద్దేశిస్తూ జీఎస్టీ పెంపు ప్రతిపాదనపై కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలంటూ మీ సొంత పార్టీకి చెందిన కేంద్ర వస్త్ర పరిశ్రమ శాఖ సహా య మంత్రి దర్శనా వి జర్దోశ్‌తో పాటు గుజరా త్ బీజేపీ అధ్యక్షుడు కూడా డిమాండ్ చేస్తున్నారు. మా మాట సరే.. కనీసం గుజరాత్ గొంతునైనా వినండి పీయుష్ గారూ’అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment