ప్రపంచవ్యాప్తంగా చాలామేరకు ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నా, ఉపాధి కల్పన మెరుగ్గా కనబడు తున్నా వాణిజ్య వ్యవహారాల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, దేశాల మధ్య పెరుగుతున్న పోటీ ఒక రకమైన అనిశ్చిత వాతావరణానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఆర్థిక సర్వే విడుదల చేసింది. పరస్పర ఆధారిత వర్తమాన ప్రపంచంలో ఏ దేశమూ సమస్యలనూ, సంక్షో భాలనూ తప్పించుకోలేదు. అలాగే వాటి పరిష్కారానికి సాగే కృషిలో భాగస్వామి కాకుండా ఒంట రిగా దేన్నీ అధిగమించలేదు.
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటు ముందుంచిన ఆర్థిక సర్వే దీన్నంతటినీ ప్రతిబింబించింది. మనది ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. ఇతర దేశాలతో పోలిస్తే మనది చురుకైన ఆర్థిక వ్యవస్థే. కానీ ఇటీవలి కాలంలో అది కొంత మంద గమనంతో కదులుతోంది. 2023లో 8.2 శాతంగా ఉన్న వృద్ధి రేటు నిరుడు 6.5 శాతానికి క్షీణించింది. ఇది 2026 వరకూ ఈ స్థాయిలోనే వుంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ఈ నెల 17న అంచనా వేసింది.
పట్టణ ప్రాంత వినియోగంలో క్షీణత, ఆహార పదార్థాల ధరల్లో పెరుగుదల, వేతన స్తంభన, అంతంతమాత్రంగా ఉన్న ఉపాధి కల్పన, ప్రైవేటు రంగ పెట్టుబడుల మందకొడితనం స్పష్టంగా కనబడుతోంది. ఒక్క కర్ణాటక, మహారాష్ట్రల్లో మాత్రమే వినియోగిత పెరి గింది. ఆంధ్రప్రదేశ్‌లో అంతక్రితం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మెరుగ్గా ఉన్న వినియో గిత ఎన్డీయే సర్కారు వచ్చాక క్షీణించింది. ‘మొత్తంమీద ద్రవ్యోల్బణం అదుపులోనే ఉన్నా ఆహార పదార్థాల ధరలు ఇప్పటికీ అధికంగానే ఉన్నాయ’ని సర్వే అంగీకరించింది.
గత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.4 శాతం ఉండగా, అదిప్పుడు 4.9 శాతానికి చేరుకుంది. ఆహారేతర, ఇంధనేతర సరుకుల ధరల తగ్గుదల ఇందుకు కారణం. వాస్తవానికి పంపిణీ మెరుగుకావటం, వాతావరణం అనుకూలించటం వంటి కారణాల వల్ల చాలా దేశాల్లో ఆహార సరుకుల ధరలు తగ్గాయి. మన దేశమూ, చైనా, బ్రెజిల్ వంటి దేశాల్లో ఇందుకు భిన్నమైన పోకడ కనబడుతోంది. నిరుడు 7.5 శాతం ఉన్న ఆహార ద్రవ్యోల్బణం ప్రస్తుతం 8.4 శాతానికి చేరుకుంది.
పంపిణీ వ్యవస్థ సక్రమంగా లేని కారణంగా కూరగాయలు, పప్పులు వగైరా ధరల్లో పెరుగుదల నమోదవుతున్నదని నిపుణుల అభిప్రాయం. రాగల రోజుల్లో కూరగాయల ధరలు తగ్గుతాయని, ఖరీఫ్ పంటలు మార్కెట్లో అడుగుపెడితే ఇతర ధరలు కూడా సర్దుకుంటాయని సర్వే ఆశాభావం వ్యక్తం చేస్తున్నా అదంతా ప్రపంచ స్థితిగతులపై ఆధారపడి వుంటుంది. మున్ముందు ప్రపంచ సాగుపంటల ధర వరలు పెరుగుతాయని, వాతావరణ మార్పులు కూడా అనుకూలించకపోవచ్చని అంచనాలు న్నాయి. అదనంగా దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉండనే ఉన్నాయి.
ఎదగదల్చుకున్నవారికి ఆశావహ దృక్పథం అవసరం. స్వాతంత్య్రం వచ్చి 2047కి వందేళ్లవు తాయి కాబట్టి అప్పటికల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా రూపుదిద్దుకోవాలని ఎన్డీయే సర్కారు కోరుకుంటోంది. కానీ వరసగా రెండు దశాబ్దాలపాటు 8 శాతం నిలకడైన జీడీపీ కొనసాగితేనే ఇది సాధ్యం. ప్రస్తుత జీడీపీలో పెట్టుబడుల వాటా 31 శాతం. దీన్ని కనీసం 35 శాతానికి తీసుకెళ్లాలి. ముఖ్యంగా తయారీరంగం వృద్ధి చెందాలి. కృత్రిమ మేధ (ఏఐ), రోబోటిక్స్, బయోటెక్నాలజీరంగాల్లో విస్తరిస్తున్న సాంకేతికతలను అందిపుచ్చుకోవాలి.
ఇవన్నీ జరిగితేనే ‘వికసిత్ భారత్’ సాకారమవుతుంది. అందుకు భూసంస్కరణలు, కార్మికరంగ సంస్కరణలు అత్యవసరం అంటు న్నది ఆర్థిక సర్వే. కానీ కార్మిక రంగ సంస్కరణలను ట్రేడ్ యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తు న్నాయి. బ్రిటిష్ వలస పాలకుల కాలంనుంచి ఇంతవరకూ పోరాడి సాధించుకున్న అనేక హక్కుల్ని లేబర్ కోడ్ హరిస్తున్నదని వాటి ఆరోపణ.
ముఖ్యంగా ట్రేడ్ యూనియన్ల ఏర్పాటును కష్టతరం చేయటం, ఇప్పటికేవున్న ట్రేడ్ యూనియన్ల గుర్తింపు రద్దుకు వీలు కల్పించటం, సమ్మె హక్కును కాలరాయటం, మధ్యవర్తిత్వ ప్రక్రియకు ప్రతిబంధకాలు ఏర్పర్చటం, లేబర్ కోర్టుల మూసివేత, ట్రిబ్యునల్ ఏర్పాటు వంటివి ఉన్నాయంటున్నారు. వీటిపై కార్మిక సంఘాలతో చర్చించటం, పార దర్శకత పాటించటం, అవసరమైన మార్పులకు సిద్ధపడటం వంటి చర్యలద్వారా అపోహలు తొల గించటానికి కేంద్రం కృషి చేస్తే కార్మిక రంగ సంస్కరణల అమలు సాఫీగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చటానికి సంస్కరణలు అవసరం అనుకున్నప్పుడు ఇదంతా తప్పనిసరి.
వాస్తవాలను గమనంలోకి తీసుకుని జాగురూకతతో అడుగులేయకపోతే లక్ష్యసాధన కష్ట మవుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం నిరుడు లిస్టెడ్ కంపెనీల లాభార్జన22.3 శాతం పెరిగింది. చెప్పాలంటే ఆర్థిక, ఇంధన, ఆటోమొబైల్ రంగాల కార్పొరేట్ సంస్థలకు లాభాలు వచ్చిపడ్డాయి. కానీ ఆ రంగాల్లో ఉపాధి కల్పన పెరిగింది లేదు. వేతనాలు స్తంభించాయి. పరిస్థితులిలా వుంటే వినియోగిత పెరుగుతుందా? తగినంత డిమాండ్ లేనప్పుడు తయారీరంగంలో పెట్టుబడుల వృద్ధి సాధ్యమవుతుందా?
ఈ వ్యత్యాసాలపై దృష్టి పెట్టనంతకాలమూ ఆర్థిక రంగ స్వస్థత సులభం కాదు. వృద్ధికి ఊతం ఇచ్చేందుకు వీలుగా రుణాల వడ్డీ రేట్లు తగ్గించాలని రిజర్వ్‌బ్యాంకును నిర్మలా సీతారామన్‌తోపాటు కేంద్ర వాణిజ్యమంత్రి పీయుష్ గోయల్ కూడా కోరుతున్నారు. మంచిదే. తమవంతుగా ఉద్యోగకల్పన, వేతనాల పెంపుపై కూడాకేంద్రం దృష్టి సారించాలి. శనివారం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో అందుకు తగిన ప్రతిపాదనలుంటాయని ఆశిద్దాం.
Comments
Please login to add a commentAdd a comment