కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
పన్నుల ఊరటకు ప్రధాని సుముఖంగానే ఉన్నా.. అధికారులను ఒప్పించేందుకే సమయం పట్టింది
కొత్త రేట్లతో మధ్యతరగతిపై భారం భారీగా తగ్గుతుంది
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల బడ్జెట్ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. అమెరికా దివంగత అధ్యక్షుడు అబ్రహాం లింకన్ వ్యాఖ్యను ఉటంకిస్తూ.. ‘ఇది ప్రజాభిప్రాయంతో, ప్రజల కోసం, ప్రజలు రూపొందించుకున్న బడ్జెట్‘గా అభివర్ణించారు. పన్నులపరంగా కొత్త రేట్లతో మధ్యతరగతికి గణనీయంగా ఊరట లభిస్తుందని ఆమె చెప్పారు.
‘వారి చేతిలో మరింతగా డబ్బు మిగులుతుంది. దీంతో వినియోగం, పొదుపు, పెట్టుబడులు పెరుగుతాయి‘ అని వివరించారు. రేట్ల కోత ఆలోచనకు ప్రధాని నరేంద్ర మోదీ పూర్తిగా మద్దతునిచ్చినప్పటికీ, బ్యూరోక్రాట్లను ఒప్పించేందుకే సమయం పట్టిందని మంత్రి వివరించారు.
ద్రవ్యోల్బణంపరంగా ప్రతికూల ప్రభావాలను తగ్గించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని నిజాయితీగా పన్నులు చెల్లించే మధ్యతరగతి వర్గాలు కోరుకుంటున్న నేపథ్యంలో ఆ బాథ్యతను ప్రధాని తనకు అప్పగించారని ఆమె పేర్కొన్నారు. పన్నుపరంగా ఉపశమనం కల్పించేందుకు ప్రధాని సత్వరం అంగీకరించినప్పటికీ ఆర్థిక శాఖ, కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) అధికారులను ఒప్పించడానికి సమయం పట్టిందని చెప్పారు. సంక్షేమ పథకాలు, ఇతర స్కీములకు అవసరమైన ఆదాయాన్ని వసూలు చేసే బాధ్యత వారిపై ఉండటమే ఇందుకు కారణమని తెలిపారు.
డాలరుతో పోలిస్తే తప్ప రూపాయి పటిష్టంగానే ఉంది..
బలోపేతమవుతున్న అమెరికా డాలరుతో పోలిస్తే మాత్రమే రూపాయి మారకం విలువ క్షీణించిందని, మిగతా కరెన్సీలతో పోలిస్తే స్థిరంగానే ఉందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. స్థూల ఆర్థికమూలాలు పటిష్టంగా ఉండటమే ఇందుకు కారణమని ఆమె చెప్పారు.
స్వల్ప వ్యవధిలో డాలరుతో పోలిస్తే రూపాయి 3 శాతం పడిపోవడం వల్ల దిగుమతులకు మరింతగా చెల్లించాల్సి రానుండటం ఆందోళన కలిగించే విషయమే అయినా, దేశీ కరెన్సీ అన్ని రకాలుగా బలహీనపడిందనే విమర్శలు ఆమోదయోగ్యం కావని తెలిపారు. మరోవైపు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయాలను రూ. 10.18 లక్షల కోట్ల నుంచి రూ. 11.21 లక్షల కోట్లకు నామమాత్రంగా పెంచడంపై స్పందిస్తూ.. కేవలం అంకెలను కాకుండా ఎంత సమర్థ్ధవంతంగా ఖర్చు చేస్తున్నారనేది చూడాలని మంత్రి చెప్పారు.
ఏడాదిగా కసరత్తు..
గతేడాది జూలైలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచే పన్ను కోతల అంశంపై కసరత్తు జరుగుతోందని నిర్మలా సీతారామన్ తెలిపారు. తాము నిజాయితీగా పన్నులు కడుతున్నప్పటికీ, దానికి తగ్గట్లుగా తమ సమస్యల పరిష్కారానికి చర్యలు ఉండటం లేదని మధ్యతరగతి ప్రజల్లో అభిప్రాయం వ్యక్తమవుతున్న విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు ఆమె చెప్పారు. ‘మీరేం చేయగలరో చూడండి అని ప్రధాని నాకు సూచించారు. ప్రజల కోసం ఏదైనా చేయాలనే విషయంలో ఆయన స్పష్టంగానే ఉన్నారు.
కాకపోతే ఆర్థిక శాఖ, సీబీడీటీ అధికారులను ఒప్పించడానికి సమయం పట్టింది. ఇలా చేయడం వల్ల తలెత్తే ప్రభావాల గురించి వారు నాకు తరచుగా గుర్తు చేసేవారు. వారిని తప్పుపట్టడానికి లేదు. ఎందుకంటే ఆదాయాన్ని సమకూర్చాల్సిన బాధ్యత వారిపై ఉంది. అయితే, అంతిమంగా అందరూ ఒక అభిప్రాయానికి రావడంతో ఇది సాధ్యపడింది‘ అని మంత్రి వివరించారు. ప్రస్తు తం దేశంలో 8.65 కోట్ల మంది ఆదాయ పన్ను రిటర్నులను దాఖలు చేస్తున్నారని, టీడీఎస్ వర్తిస్తున్నా రిటర్నులను ఫైలింగ్ చేయని వారి సంఖ్యను కూడా కలిపితే ఇది 10 కోట్లు దాటుతుందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment