గత బడ్జెట్‌తో పోలిస్తే అదనంగా 9.53% నిధులు
బలగాల ఆధునీకరణ,అత్యాధునిక ఆయుధాల కొనుగోళ్లకు ప్రాధాన్యం
రక్షణ రంగంలో స్వయం సమృద్ధి దిశగా బడ్జెట్ అడుగులు
మూలధన వ్యయంలో 75శాతం దేశీయంగానే ఖర్చు చేస్తామన్న కేంద్ర ఆర్థిక మంత్రి
దేశంలోని ప్రైవేటు రక్షణ, పరిశోధన సంస్థల నుంచి కొనుగోళ్లకు రూ.26,817 కోట్లు కేటాయింపు
న్యూఢిల్లీ :గణతంత్ర వజ్రోత్సవాలు జరుపుకొంటున్న మన దేశాన్ని ఆధునిక రణతంత్రం దిశగా నడిపించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో రక్షణ రంగానికి భారీగా కేటాయింపులు చేశారు. గత బడ్జెట్‌లో కేటాయించిన రూ.6.22 లక్షల కోట్లతో పోలిస్తే... సుమారు 9.53 శాతం అదనంగా ఈసారి రూ.6.81 లక్షల కోట్లు ప్రతిపాదించారు. ఇది మొత్తం బడ్జెట్‌లో 13.45 శాతం, మన దేశ జీడీపీలో ఇది 1.91 శాతం కావడం గమనార్హం.
రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు వీలుగా మూలధన వ్యయం కింద రూ.1,92,387 కోట్లను చూపారు. ఇందులో అత్యాధునిక యుద్ధ విమానాలు, నౌకలు, ఆయుధాలు, పరికరాల కొనుగోళ్లకు రూ.1,48,722 కోట్లను.. దేశీయంగా ఆయుధాలు, రక్షణ సాంకేతికతల అభివృద్ధి కోసం రూ.31,277 కోట్లను.. డిఫెన్స్ సర్వీసెస్ కోసం రూ.12,387 కోట్లను కేటాయించారు. గత బడ్జెట్ సవరించిన అంచనాల ప్రకారం.. మూలధన వ్యయం రూ.1.59 లక్షల కోట్లు. దానితో పోలిస్తే ఈసారి రూ.21 వేల కోట్లు అదనంగా ఇవ్వనున్నారు.
ఆధునీకరణ కోసం..
మూలధన వ్యయం కింద చేసిన కేటాయింపులను రక్షణ రంగం ఆధునీకరణ కోసం వినియోగించనున్నారు. ఇందులో రూ.48,614 కోట్లను యుద్ధ విమానాలు, వాటి ఇంజన్ల కొనుగోలు, అభివృద్ధి కోసం కేటాయించారు. నౌకా దళంలో కొనుగోళ్లు, అభివృద్ధి కోసం రూ.24,390 కోట్లు, నావికాదళ డాక్‌యార్డుల ప్రాజెక్టుల కోసం అదనంగా రూ.4,500 కోట్లు ఇచ్చారు. ఇతర ఆయుధాలు, క్షిపణుల కొనుగోలు, అభివృద్ధి కోసం రూ.63,099 కోట్లు కేటాయించారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో.. దేశ సరిహద్దుల రక్షణతోపాటు యుద్ధాలు, దాడులకు సంబంధించి వ్యూహాత్మక సన్నద్ధత దిశగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
జీతాలు, పెన్షన్లకు అధిక వ్యయం..
రక్షణ రంగానికి చేసిన కేటాయింపులలో ఈసారి కూడా పెద్ద మొత్తంలో రక్షణ బలగాల వేతనాలు, పెన్షన్లు, రోజువారీ నిర్వహణ వ్యయమే అధికంగా ఉన్నాయి. మొత్తం కేటాయింపుల్లో రూ.4,88,822 కోట్లు అంటే 71శాతానికిపైగా వీటికే ఖర్చుకానున్నాయి. ఇందులో రూ.1,60,795 కోట్లు పెన్షన్ల కోసమే వ్యయం కానున్నాయి.
సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణానికి రూ.7,146.5 కోట్లు
దేశ సరిహద్దుల్లో వ్యూహాత్మక రోడ్ల నిర్మాణానికి బడ్జెట్‌లో రూ.7,146.5 కోట్లు కేటాయించారు. చైనా, పాకిస్తాన్ సరిహద్దుల వెంట భద్రతా దళాల కదలికలు సులువుగా సాగేందుకు వీలుగా రోడ్లు, సొరంగాలు, వంతెనల నిర్మాణానికి ఈ నిధులను వినియోగిస్తారు.
దేశీయంగానే రక్షణ కొనుగోళ్లకు పెద్దపీట
రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడంలో భాగంగా మూలధన వ్యయంలో 75 శాతాన్ని దేశీయంగానే ఖర్చు చేయనున్నట్టు బడ్జెట్‌లో పేర్కొన్నారు. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచే రక్షణ పరికరాలు, ఆయుధాలను కొనుగోలు చేస్తారు. ఈ మేరకు రూ.1,11,544 కోట్లను దేశీయంగా ఖర్చు చేయనున్నట్టు బడ్జెట్‌లో వెల్లడించారు. ఈ వ్యయంలో రూ.27,886 కోట్ల (25 శాతం)ను మన దేశంలోని ప్రవేటు రక్షణ, పరిశోధన సంస్థల నుంచి కొనుగోళ్ల కోసం వినియోగించనున్నట్టు తెలిపారు.
డీఆర్‌డీవోకు రూ.26,817 కోట్లు..
కీలకమైన ‘రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)’కు ఈ బడ్జెట్‌లో రూ.26,817 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్ కేటాయింపులు రూ.23,856 కోట్లతోపోలిస్తే సుమారు రూ.3 వేల కోట్లు అదనంగా ఇచ్చారు. దేశీయంగా రక్షణ పరికరాలు, ఆయుధాలపై పరిశోధన, అభివృద్ధి కోసం ఈ నిధులను వినియోగించనున్నారు.
⇒ మొత్తం బడ్జెట్‌లో 13.45%
⇒ మన దేశ జీడీపీలో 1.91%
⇒ ఆయుధాలకొనుగోళ్లు, అభివృద్ధికి 1,92,387 కోట్లు
⇒ వేతనాలు, రోజువారీ వ్యయానికి రూ.4,88,822 కోట్లు (ఇందులో పెన్షన్లకు 1,60,795 కోట్లు)
Comments
Please login to add a commentAdd a comment