defense sector
-
సైనిక విమాన తయారీకి ఊపు
మూడేళ్ల క్రితం యూరప్ కంపెనీ ‘ఎయిర్‌బస్’తో 56 సి–295 రవాణా విమానాలను కొనడానికి భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో 16 స్పెయిన్‌లో తయారవుతాయి, మిగతా 40 ఇండియాలో ‘టాటా’(టీఏఎస్ఎల్) తయారు చేస్తుంది. సైనిక రవాణా విమానాల తయారీకి ఈ తరహా సహకారం ఇదే మొదటిది. స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్‌తో కలిసి మోదీ అక్టోబర్ 28న వడోదరలో టీఏఎస్ఎల్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ తొలి ప్రైవేట్ సైనిక విమాన తయారీ కేంద్రం ఉపాధికి కూడా తోడ్పడుతుంది. ‘మేక్ ఇన్ ఇండియా’ కింద తొలి సి–295 విమానం 2026లో అందుబాటులోకి రానుంది. మొత్తం 40 విమానాలను 2031కల్లా అందించడం ద్వారా టీఏఎస్ఎల్ తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంది.భారత వైమానిక దళానికి చెందిన పాత అవ్రో విమానాల స్థానంలో 56 సి–295 రవాణా విమానాలను కొనుగోలు చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ 2021 సెప్టెంబర్ లో రూ. 21,935 కోట్ల ఒప్పందంపై సంతకాలు చేసింది. ‘ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్’తో కుదుర్చుకున్న ఈ ఒప్పందం ప్రకారం, మొదటి 16 విమానాలను స్పెయిన్‌లోని సెవిల్లెలో దాని తుది అసెంబ్లింగ్ (విడిభాగాల కూర్పు) కేంద్రం నుంచి సరఫరా చేయాల్సి ఉంది. మిగతా 40 విమానాలను భారత్, స్పెయిన్ కుదుర్చుకున్న పారిశ్రామిక భాగస్వామ్య ఒప్పందం ప్రకారం మన దేశానికి చెందిన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్) తయారు చేస్తుంది. భారత్‌లో రవాణా విమానాల తయారీకి ఈ తరహా సహకారం ఇదే మొదటిది. ప్రధాని మోదీ 2022 అక్టోబర్ 30న గుజరాత్‌లోని వడోదరలో టీఏఎస్ఎల్ చివరి దశ విడిభాగాల కూర్పు సదుపాయానికి శంకు స్థాపన చేశారు. అప్పటి ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌధురీకి 2023 సెప్టెంబర్ 13న స్పెయిన్‌లోని సెవిల్లెలో తొలి విమానాన్ని అందజేశారు. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేతుల మీదుగా ఈ విమానం 2023 సెప్టెంబర్ 25న హిందాన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో లాంఛనంగా భారత వైమానిక దళంలో చేరింది. ‘రైనోస్’ అని కూడా పిలిచే ఐఏఎఫ్ 11 స్క్వాడ్రన్ ఇప్పటికే ఆరు సి–295 విమానాలను నడుపుతోంది.తొలి ప్రైవేట్ సైనిక విమాన తయారీసి–295 బహుళ ప్రాయోజక సైనిక రవాణా విమానంగా రుజువు చేసుకుంది. 9.5 టన్నుల పేలోడ్, 70 మంది ప్రయాణికులు లేదా 49 మంది పారాట్రూపర్లను తీసుకెళ్లగల సామర్థ్యంతో భారత వైమానిక దళం (ఐఏఎఫ్) శక్తిని గణనీయంగా పెంచింది. పగలు, రాత్రి తేడా లేకుండా అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ నడిచే సామర్థ్యం ఉన్న ఈ విమానాన్ని ప్రపంచవ్యాప్తంగా వివిధ వైమానిక దళాలు ఉప యోగిస్తున్నాయి. ఇంకా పలు సామర్థ్యాలు ఎయిర్‌బస్ సి–295 సొంతం. సైనిక రవాణా, ఆకాశమార్గంలో రవాణా, పారాట్రూపింగ్, వైద్య సహాయం కోసం తరలింపు, సముద్రప్రాంత గస్తీ, జలాంత ర్గాములను ఎదుర్కొనే యుద్ధ పరికరాలు, పర్యావరణ పర్యవేక్షణ, సరిహద్దు పహారా, వాటర్ బాంబర్, గాలి పరంగా ముందస్తు హెచ్చరి కలు వంటి విస్తృత శ్రేణి మిషన్ లలో ఇది సమర్థంగా పని చేస్తుంది.స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో శాంచెజ్‌తో కలిసి మోదీ అక్టోబర్ 28న వడోదరలో టీఏఎస్ఎల్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. దేశంలో ఇదే తొలి ప్రైవేట్ సైనిక విమాన తయారీ కేంద్రం. మేక్ ఇన్ ఇండియా కింద తయారు చేసే తొలి సి–295 విమానం 2026 సెప్టెంబర్‌లో అందుబాటులోకి రానుంది. చివరి విమానం 2031 ఆగస్టు నాటికి అందుబాటులోకి వస్తుందని అంచనా. ఈ ప్రాజెక్ట్ దేశంలో విమాన రంగ అభివృద్ధికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇందులో దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న అనేక ఎంఎస్ఎంఈలు విమానాల విడి భాగాలను అందిస్తాయి. ఇప్పటికే 33 ఎంఎస్ఎంఈలను ఎయిర్‌బస్ గుర్తించింది. హైదరాబాద్‌లోని టీఏఎస్ఎల్ ప్రధాన కేంద్రంలో విమా నాల విడిభాగాల తయారీ ప్రారంభమైంది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమి టెడ్ (బీఈఎల్), భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అందించిన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ (ఈడబ్ల్యూ) వ్యవస్థలను ఇప్పటికే విమానంలో అనుసంధానం చేశారు. అయితే, ఒప్పంద చర్చల తుది దశలో ఎక్కువ కాలం జాప్యం కావడంతో వీటిని అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది. పెరిగే ఉపాధి కల్పనతాజా ప్రయత్నం వైమానిక రంగంలో ఉపాధి కల్పనను పెంచు తుందని రక్షణ శాఖ చెబుతోంది. దేశంలో ఏరోస్పేస్, రక్షణ రంగంలో 42.5 లక్షలకు పైగా పనిగంటలతో ప్రత్యక్షంగా 600 అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగాలకు, 3,000కు పైగా పరోక్ష ఉద్యోగాలకు, అదనంగా 3,000 మధ్యతరహా నైపుణ్య ఉపాధి అవకా శాలకు వీలు కలుగుతుంది. ఇతర ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీ దారుల (ఓఈఎం) నుంచి ఎయిర్‌బస్ తెప్పించే ఏరో ఇంజిన్, ఏవి యానిక్స్ మినహా అధిక శాతం నిర్మాణ భాగాలు భారత్‌లోనే తయారవుతాయి. ఒక విమానంలో ఉపయోగించే 14,000 విడి భాగాలలో 13,000 భాగాలు దేశంలోని ముడిసరుకుతోనే తయారవుతాయి. అయితే టీఏఎస్ఎల్ సకాలంలో 40 విమానాలను తయారు చేయడమే అసలైన పరీక్ష. ఇప్పటివరకు చాలా కార్యకలాపాలు ఎయిర్‌బస్ ద్వారా జరుగుతున్నాయి. టీఏఎస్ఎల్ కేవలం వాటిని అమలు చేస్తోంది. భారత వైమానిక రంగ సుస్థిర వృద్ధి కోసం స్థానిక ఉత్పత్తి, డీజీ ఏక్యూఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఏరోనాటికల్ క్వాలిటీ ఎష్యూరెన్స్) ద్వారా నాణ్యత నియంత్రణ, ‘సెమిలాక్’ ద్వారా భవిష్యత్తు ధ్రువీకరణ, దేశీయ తనిఖీ పరీక్షలు, మూల్యాంకనంపై దృష్టి సారించాలి.రక్షణ రంగం అంచెలంచెలుగా ఎదగడానికి గత పదేళ్లలో భారత ప్రభుత్వం చేసిన కృషి దోహదపడింది. రూ. 43,726 కోట్ల నుంచి రూ. 1,27,265 కోట్లకు పెరిగిన రక్షణ ఉత్పత్తుల్లో 21 శాతం వాటా ప్రైవేటు రంగానిదే. పదేళ్ల క్రితం రూ.1,000 కోట్ల లోపు ఉన్న రక్షణ ఎగుమ తులు గత ఏడాది రూ. 21,000 కోట్లకు పైగా పెరిగాయి. కొన్ని విధాన సంస్కరణలతో పాటు మూలధన పరికరాల కొనుగోలు కోసం డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్స్ – 2020లో స్వదేశీ డిజైన్, డెవలప్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ (ఐడీడీఎం) కేటగిరీకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం ఈ గణాంకాలను సాధించడానికి దోహదపడింది. కొత్తగా కేటాయించిన రక్షణ బడ్జెట్లో 75 శాతాన్ని దేశీయ పరిశ్రమల ద్వారా కొనుగోళ్లకు కేటాయించారు. జాయింట్ యాక్షన్ (శ్రీజన్) పోర్టల్ ద్వారా స్వయం సమృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం, సానుకూల స్వదేశీకరణ జాబితాలు (పీఐఎల్), ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్స్‌లెన్స్ (ఐడీఈఎక్స్) ఏర్పాటు, 2024 సెప్టెంబర్ నాటికి రూ. 50,083 కోట్ల పెట్టుబడి అంచనాతో ఉత్తరప్రదేశ్, తమిళనాడుల్లో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ల ఏర్పాటు వంటి అనేక ఇతర చర్యలను ప్రభుత్వం తీసుకుంది. 2013 మేలో రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ) జారీ చేసిన తరువాత ఎయిర్‌బస్‌తో ఒప్పందం కుదుర్చు కోవడానికి రక్షణ మంత్రిత్వ శాఖకు ఆరేళ్ళు పట్టింది. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతులు ఇవ్వడానికి, ఒప్పందం తదుపరి చర్చలకు ఇంకా చాలా చేయాల్సి ఉంది.దేశంలో సి –295 సైనిక రవాణా విమానాల ఉమ్మడి తయారీలో ఎయిర్‌బస్ – టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్) భాగ స్వామ్యం ఇప్పటివరకు సవాళ్లను ఎదుర్కొంటున్న భారత వైమానిక రంగానికి ఆశ, ప్రేరణగా నిలుస్తోంది. అయితే సివిల్ సర్టిఫైడ్ వెర్షన్ కూడా అందుబాటులో ఉన్నందున ఈ ఎయిర్ క్రాఫ్ట్ వెర్షన్లను టీఏఎస్ఎల్ విస్తరిస్తుందో లేదో చూడాలి. ఈ భాగస్వామ్యం పూర్తి ప్రయోజనాలను పొందడానికి దేశంలో ఉత్పత్తి, భవిష్యత్తు ఎగుమ తులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఆత్మనిర్భరత సాధన దిశగా భవిష్యత్ ప్రయాణం క్లిష్టంగా అనిపించినప్పటికీ, ఎయిర్‌బస్, టీఏ ఎస్ఎల్ మధ్య ఈ భాగస్వామ్యం ద్వారా అడుగులు ముందుకు పడ్డాయి. టీఏఎస్ఎల్ నిర్ణీత సమయానికి 40 విమానాలను తయారు చేయడం ద్వారా తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. అయితే ఈ తరహా భాగస్వామ్యాల విషయంలో ప్రభుత్వ రంగం ఐఏఎఫ్ అంచనాలను అందుకోలేదన్నది గత అనుభవాలు చెబుతున్న పాఠం. మరి ఈ ఒప్పందం సఫలమైతే దేశంలో ప్రైవేట్ రంగ భాగ స్వామ్యం మరింత ప్రబలమవుతుంది. వాటి సహకారం లేకుండా 2047 నాటికి ‘వికసిత్ భారత్’ కల నెరవేరదు.అనిల్ గోలానిఎయిర్ వైస్ మార్షల్ (రిటైర్డ్) వ్యాసకర్త సెంటర్ ఫర్ ఎయిర్ పవర్ స్టడీస్అడిషనల్ డైరెక్టర్ జనరల్ -
తుర్కియే వైమానిక సంస్థపై ఉగ్ర దాడి
అంకారా: తుర్కియే రాజధాని అంకారా నగర శివారులోని ఒక వైమానిక, రక్షణ రంగ సంస్థపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారని తుర్కియే అంతర్గత మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. 14 మంది గాయపడ్డారు. అయితే ఎవరు దాడి చేశారు, ఎందుకు చేశారు? అనే వివరాలను బయటపెట్టలేదు. టుటాస్ అనే సంస్థ ప్రాంగణంలో దాడి జరిగినట్లు మంత్రి అలీ యెర్లికాయా చెప్పారు. తుర్కియేలో గతంలో కుర్ద్ మిలిటెంట్లు, ఇస్లామిక్ స్టేట్ గ్రూప్, వామపక్ష ఉగ్రవాదులు దాడులు జరిపారు. సంస్థలో భద్రతా సిబ్బంది షిఫ్ట్ మారే సమయంలో కొందరు ఆగంతకులు హఠాత్తుగా వచ్చి బాంబులు వేసి విచక్షణారహితంగా కాల్పులు జరిపారని ప్రైవేట్ ఎన్టీవీ చానెల్ తన కథనంలో పేర్కొంది. అయితే ఆగంతకులు పారిపోలేదని లోపలి సిబ్బందిని బందీలుగా చేసుకుని అక్కడే ఉన్నారని, ఇరువైపులా కాల్పులు కొనసాగుతున్నాయని వెల్లడించింది. తొలుత కేవలం బాంబు పేలుడు జరిగినట్లు వార్తలొచ్చాయి. సంస్థలోని సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారని హబర్‌టర్క్ టెలివిజన్ పేర్కొంది. -
బొంబార్డియర్ సీఈవోతో గౌతమ్ అదానీ భేటీ
న్యూఢిల్లీ: కెనడాకు చెందిన బిజినెస్ జెట్స్ తయారీ దిగ్గజం బొంబార్డియర్ సీఈవో ఎరిక్ మార్టెల్తో పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. ఎయిర్‌క్రాఫ్ట్ సరీ్వసులు, రక్షణ రంగ కార్యకలాపాల్లో భాగస్వామ్యం తదితర అంశాలపై ఇందులో చర్చించినట్లు మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్‌లో అదానీ పోస్ట్ చేశారు. అదానీ గ్రూప్ దేశీయంగా ఏడు విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. -
హైదరాబాద్‌లో ‘రక్షణ’కు ఊతం
సాక్షి, హైదరాబాద్: రక్షణ రంగం, ఏరోస్పేస్‌కు హబ్‌గా ఎదుగుతున్న హైదరాబాద్‌కు మరింత ఊతం లభించనుంది. కేంద్ర బడ్జెట్లో రక్షణ రంగానికి పెద్ద పీట వేయడంతో ఆ రంగానికి సంబంధించి పరిశోధనలు నగరంలో మరింత ఊపందుకోనున్నాయి. ఇప్పటికే డిఫెన్స్, ఏరోస్పేస్‌కు సంబంధించి హైదరాబాద్‌లోని ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేటు సంస్థలు ఎన్నో ఆవిష్కరణలు తీసుకొచ్చాయి. డీఆర్డీవో, డీఆర్డీఎల్, ఆర్సీఐ, బీడీఎల్, ఎండీఎన్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, డీఎంఆర్ఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు హైదరాబాద్‌లో రక్షణ రంగానికి వన్నె తెస్తున్నాయి. కేంద్రం బడ్జెట్లో రక్షణ శాఖకు రూ.6,21,940 కోట్లను కేటాయించిన విషయం విదితమే. కాగా ఈ కేటాయింపుల్లో రూ.1.05 లక్షల కోట్లను దేశీయ ఆయుధ వ్యవస్థల కొనుగోళ్లకే వాడతామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చెప్పడంతో హైదరాబాద్ నుంచి దేశీయ ఉత్పత్తుల తయారీ ఊపందుకునే అవకాశం ఏర్పడింది. ఆయుధాల తయారీ హబ్‌గా.. ఆయుధాల తయారీలో హైదరాబాద్ ఇప్పటికే అగ్రగామిగా నిలుస్తోంది. అల్రా్టలైట్ రిమోట్ కంట్రోల్ వెపన్ సిస్టమ్‌ను జెన్ టెక్నాలజీస్ అనే సంస్థ ఇప్పటికే అభివృద్ధి పరిచింది. ఇక,హాక్ ఐ, ఎస్టీహెచ్ఐఆర్ స్టాబ్ 640తో పాటు మిషన్ ప్లానింగ్, నావిగేషన్, ప్రమాదాలను గుర్తించడం, ఉగ్రవాదుల జాడ కనిపెట్టేందుకు ప్రహస్త అనే రోబోటిక్ డాగ్‌ను అభివృద్ధి పరిచారు. ఆయుధ కొనుగోళ్లు, సంబంధిత ఇతర వ్యవస్థల కొనుగోలుకు కేంద్రం రూ.1.72 లక్షల కోట్లను కేటాయించింది. దేశీయ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకే అత్యధిక మొత్తం ఖర్చుచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది హైదరాబాద్‌లోని ఆయుధాల తయారీ సంస్థలకు ఊతమిస్తుందని ఆ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతరిక్ష పరిశోధన రంగంలో అగ్రగామిగా.. ఎస్ఈసీ ఇండస్ట్రీస్ రక్షణ రంగంతో పాటు అంతరిక్ష పరిశోధన రంగంలో దేశానికి ఎన్నో సేవలు అందిస్తోంది. గగన్‌యాన్, చంద్రయాన్‌కు కావాల్సిన ప్రధానమైన విడిభాగాలను తయారు చేస్తోంది. క్రూ మాడ్యుల్‌ను ఇక్కడే తయారు చేస్తున్నారు. ఇక స్కార్పీన్ సబ్‌మెరైన్ ప్రాజెక్టులో కీలక విడిభాగాలైన వెపన్ హ్యాండ్లింగ్, స్టోరేజీ సిస్టమ్, వెపన్ లోడింగ్ సిస్టమ్, థ్రస్ట్ బ్లాక్, బల్లాస్ట్ వెంట్ వాల్‌్వలు, హల్ హాచెస్, కాఫర్ డ్యామ్ డోర్స్, హెచ్‌పీ ఎయిర్ సిలిండర్స్ వంటివి ఇక్కడే తయారయ్యాయి. -
రక్షణ కట్టుదిట్టం..
న్యూఢిల్లీ: చైనా కవ్వింపులు, పాక్ ముష్కరుల చొరబాట్లతో సరిహద్దుల వెంట అప్రమత్తంగా ఉండే సైన్యంతోపాటు భూతల, గగనతల రక్షణ వ్యవస్థల మరింత పటిష్టతే లక్ష్యంగా మోదీ సర్కార్ మరోమారు రక్షణ రంగానికి పెద్దపీట వేసింది. 2024–25 ఆర్థికసంవత్సరంలో రక్షణ రంగానికి రూ.6,21,940.85 కోట్లు కేటాయించింది. అత్యాధునిక డ్రోన్లు, యుద్ధవిమా నాలు, నౌకలు, ఆయుధాలు, ఇతర సైనిక ఉపకరణాల కొనుగోలు కోసం ఏకంగా రూ.1,72,000 కోట్లను కేటాయించారు. తాజా కేంద్ర బడ్జెట్లో రక్షణరంగ వాటా 12.9 శాతానికి పెరగడం విశేషం. గత ఆర్థికసంవత్సరంతో పోలిస్తే ఈసారి రక్షణరంగానికి కేటాయింపులు 4.79 శాతం పెంచారు. రక్షణ రంగంలో స్వావలంబనే లక్ష్యంగా సైనిక ఉపకరణాల స్థానిక తయారీని మరింత ప్రోత్సహించేందుకు మోదీ సర్కార్ నడుం బిగించింది. అందుకే స్థానిక ఉపకరణాల సేకరణ కోసం రూ.1,05,518.43 కోట్లను కేటాయించింది. దీంతో బీజేపీ సర్కార్ లక్షిత రక్షణరంగంలో ఆత్మనిర్భరత మరింతగా సాకారంకానుంది. లక్షల కోట్ల బడ్జెట్‌ను రక్షణరంగానికి కేటాయించిన విత్తమంత్రి నిర్మలకు కృతజ్ఞతలు అంటూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ‘ఎక్స్’లో ట్వీట్‌చేశారు. ‘‘ ఆధునిక ఆయుధ సంపత్తి సమీకరణతో త్రివిధ బలగాల శక్తిసామర్థ్యాలు మరింత ద్విగుణీకృతం కానున్నాయి. దేశీయ సంస్థలు తయారుచేసిన సైనిక ఉపకరణాలు, ఆయుధాలతో దేశం రక్షణరంగంలోనూ ఆత్మనిర్భరతను వేగంగా సాధించనుంది’’ అని రాజ్‌నాథ్ అన్నారు.అగ్నిపథ్ పథకం కోసం రూ.5,980 కోట్లుగత బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి సరహద్దుల వెంట రహదారుల నిర్మాణానికి కేటాయింపులు 30 శాతం పెరగడం విశేషం. బీఆర్వోకు కేటాయించిన రూ.6,500 కోట్ల నిధులతో సరిహద్దుల వెంట మౌలికవసతుల కల్పన మెరుగుపడనుంది. రక్షణరంగ పరిశ్రమల్లో అంకుర సంస్థలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఐడెక్స్ పథకానికి రూ.518 కోట్లు కేటాయించారు. అంకుర సంస్థలు, సూక్ష్మచిన్నమధ్యతరహా పరిశ్రమలు, ఆవిష్కర్తలు ఇచ్చే కొత్త ఐడియాలను ఆచరణలో పెట్టేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు.కోస్ట్‌గార్డ్ ఆర్గనైజేషన్‌కు రూ.7,651 కోట్లు కేటాయించారు. తేజస్ వంటి తేలికపాటి యుద్ధవిమానాలను తయారుచేస్తూ నూతన విమానాల డిజైన్, రూపకల్పన, తయారీ కోసం కృషిచేసే హిందుస్తాన్ ఏరోనాటిక్స్‌కు రూ.1,600 కోట్లు కేటాయించారు. రాష్ట్రీయ రైఫిల్స్ విభాగం కోసం రూ.10,535 కోట్లు కేటాయించారు. ఎన్సీసీ కోసం రూ.2,726 కోట్లు, త్రివిధ దళాల్లో అగ్నిపథ్ పథకం నిర్వహణ కోసం రూ.5,980 కోట్లు కేటాయించారు. -
రక్షణ రంగంలో స్వదేశీ గర్జన
రక్షణ రంగంలో స్వావలంబన దిశగా భారత్ అడుగులు వేస్తోంది. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా దేశీయంగా రక్షణ పరికరాల ఉత్పత్తి రెట్టింపవుతోంది. ముడిసరుకు నుంచి ఆయుధ సంపత్తి వరకూ స్వదేశీ వాటా ఏటా పెరుగుతూ వస్తోంది. ‘మేక్ ఇన్ ఇండియా’లో దూసుకుపోతూ ఐదేళ్ల కాలంలో 60 శాతం వృద్ధి రేటు నమోదు చేసింది.2023–24 ఆరి్థక సంవత్సరంలో రూ.1.26 లక్షల కోట్ల విలువైన రక్షణ రంగ ఉత్పత్తుల్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు తయారు చేయడం విశేషం. రక్షణ రంగానికి చెందిన దిగుమతుల్ని క్రమంగా తగ్గించుకుంటూ వస్తున్న భారత్.. 2047 నాటికి పూర్తి 100 శాతం స్వదేశీ ఉత్పత్తులపై దృష్టి సారిస్తూ దూసుకుపోతోంది. ప్రపంచ రక్షణ తయారీ కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసింది. – సాక్షి, విశాఖపట్నంస్వదేశీ విధానంతో ముందుకు.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వదేశీ విధానంతో భారత రక్షణ వ్యవస్థ గతం కంటే పటిష్టంగా మారింది. ‘ఆత్మ నిర్భర్ భారత్’ పేరిట రక్షణ రంగంలోనూ స్వావలంబన సాధించేందుకు తీసుకొచి్చన సంస్కరణల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్, తమిళనాడులో డిఫెన్స్ ఇండ్రస్టియల్ కారిడార్లు ఏర్పాటు చేసింది. దేశీయ రక్షణ రంగ పరిశ్రమకు మూలధన సేకరణ బడ్జెట్లో 75% కేటాయించింది. ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ (ఐడెక్స్), ఐడెక్స్ ప్రైమ్, ఐడెక్స్ అదితీ వంటి పథకాలు, ఆవిష్కరణలను ప్రారంభించడంతో సత్ఫలితాలు నమోదవుతున్నాయి.ప్రపంచ కేంద్రంగా భారత్ప్రపంచ రక్షణ తయారీ కేంద్రంగా భారతదేశాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సుదీర్ఘ ప్రణాళికల్ని అమలు చేస్తోంది. 2023–24 ఆరి్థక సంవత్సరంలో ఏకంగా రూ.1,26,887 కోట్ల విలువైన రక్షణరంగ ఉత్పత్తుల్ని భారత్ తయారు చేయడం విశేషం. గతేడాది కంటే 16.7 శాతం వృద్ధి నమోదు చేసింది. 2022–23లో రూ.1,08,684 కోట్ల విలువైన ఉత్పత్తులు తయారయ్యాయి. 2019–20 నుంచి పరిగణనలోకి తీసుకుంటే.. ఐదేళ్ల కాలంలో 60 శాతం పెరుగుదల కనిపించింది.అన్ని డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్‌లు (డీపీఎస్‌యూలు) ఇతర పీఎస్‌యూలు రక్షణరంగ వస్తువుల తయారీతో పాటు ప్రైవేట్ కంపెనీల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం దేశంలో రక్షణ ఉత్పత్తి విలువ రికార్డు స్థాయిలో ఉంది. 2023–24లో డీపీఎస్‌యూలు, పీఎస్‌యూల వాటా రూ.1,00,381 కోట్లు కాగా ప్రైవేట్ సంస్థలు రూ.26,506 కోట్ల ఉత్పత్తులు తయారు చేశాయి.ఎగుమతుల్లోనూ అదే దూకుడు స్వదేశీకరణ ప్రయత్నాలు నిరంతర ప్రాతిపదికన దూకుడుగా కొనసాగుతుండగా.. ఎగుమతుల్లోనూ అదే జోరు నమోదైంది. స్వదేశీ రక్షణ ఉత్పత్తిలో మొత్తం వృద్ధికి డిఫెన్స్ ఎగుమతులు దోహదపడుతున్నాయి. 2023–24 ఆరి్థక సంవత్సరంలో డిఫెన్స్ ఎగుమతులు రికార్డు స్థాయిలో రూ. 21,083 కోట్లకు చేరుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో రూ.15,920 కోట్లతో పోలిస్తే 32.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. దేశంలో తయారవుతున్న బ్రహ్మోస్ క్షిపణుల్ని కొనుగోలు చేసేందుకు ప్రపంచంలోని చాలా దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. ఈ జాబితాలో తొలి కొనుగోలుదారుగా ఫిలిప్పీన్స్ నిలిచింది. తేజస్ యుద్ధ విమానాల్ని కొనుగోలు చేసేందుకు సైతం ఫిలిప్పీన్స్ ఆసక్తి చూపిస్తోందనీ భారత రక్షణరంగ వర్గాలు చెబుతున్నాయి.విడిభాగాల దిగుమతులు తగ్గుముఖంవివిధ దేశాల నుంచి రక్షణ రంగానికి సంబంధించి 4,664 కీలక విడిభాగాలు దిగుమతి అవుతున్నాయి. ఐదు విడతలుగా 3,318 విడిభాగాల దిగుమతుల్ని నిలుపుదల చేసిన భారత్.. వీటిని స్వయంగా తయారు చేయడం ప్రారంభించింది. దేశంలోని ప్రతి నౌక, జలాంతర్గామి, విమానాలు, ఆయుధ వ్యవస్థ తయారీలో భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో దూసుకుపోతోంది. భారత రక్షణ రంగం స్వయం సమృద్ధిగా మారడానికి కట్టుబడి.. 2047 నాటికి పూర్తిగా స్వావలంబన సాధించే దిశగా అడుగులు వేస్తోంది. -
నేవీలో 10వేల మందికి పైగా సిబ్బంది కొరత
న్యూఢిల్లీ: రక్షణ రంగంలో కీలక విభాగమైన భారత నావికాదళంలో సిబ్బంది కొరత భారీస్థాయిలో ఉంది. ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా శుక్రవారం పార్లమెంట్లో కేంద్రం తెలిపిన వివరాల ఆధారంగా ఈ విషయం వెల్లడైంది. అక్టోబర్ 31వ తేదీ నాటికి నౌకాదళంలో మొత్తంగా 10,896 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. వీటిలో ఆఫీసర్ ర్యాంక్ పోస్టులే 1,777 దాకా ఉన్నాయని లోక్‌సభలో కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ తెలిపారు. -
Madhavi Kattekola: జై జవాన్‌కు టిఫిన్ బాక్స్
సమాజానికి మంచి ఆహారాన్నివ్వాలనుకుంది. ఖాద్యమ్... పేరుతో తినదగిన ఆహారాన్నిస్తోంది. ‘వరల్డ్ ఫుడ్ ఇండియా’లోనూ నిరూపించుకుంది. దేశ రక్షణ కోసం కొండల్లో గుట్టల్లో డ్యూటీ చేసే సైన్యానికి మంచి ఆహారాన్నిచ్చే బాధ్యత చేపట్టింది. ఈ సందర్భంగా కట్టెకోల మాధవి విజయగాథ. రక్షణరంగంలో విధులు నిర్వర్తించే వారి ఆహారం ఎలా ఉండాలో నిర్దేశించడానికి డీఎఫ్‌ఆర్‌ఎల్‌లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం పని చేస్తూ ఉంటుంది. ఆ ప్రమాణాల మేరకు ఆహారం తయారు చేయడానికి అనుమతి సాధించారు ఓ తెలుగు మహిళ. ఈ అనుమతి సాధించడానికి ముందు ఆమె ఆహారం మీద అంతులేని పరిశోధన చేశారు. భూమిలో నాటే గింజ నుంచి పంట దిగుబడి, దినుసులను ప్రాసెస్ చేయడం, వండి చల్లార్చి డబ్బాల్లో ప్యాక్ చేయడం వరకు ప్రతిదీ ఒక చేతి మీదుగా నడిచినప్పుడే నిర్దేశించిన ప్రమాణాలను పాటించగలమని నమ్ముతారామె. సేంద్రియ పంట, వంటను ఈ నెల న్యూఢిల్లీలో జరిగిన ‘వరల్డ్ ఫుడ్ ఇండియా’ సదస్సులో ప్రదర్శించి మరోసారి నిరూపించారు. ఈ సందర్భంగా సాక్షితో తన అనుభవాలను పంచుకున్నారు హైదరాబాద్‌లో నివసిస్తున్న కట్టెకోల మాధవి. రైతులు విచిత్రంగా చూశారు! మాది సూర్యాపేట. నాన్న ఉద్యోగ రీత్యా నా చదువు మొత్తం హైదరాబాద్‌లోనే. నిజానికి నా చదువుకి, నేనెంచుకున్న ఈ రంగానికి సంబంధమే లేదు. బీఎస్సీ స్టాటిస్టిక్స్ చేసి కొంతకాలం టీచర్‌గా, ఆ తర్వాత బ్యాంకులో ఉద్యోగం చేశాను. మా వారు మైక్రో బయాలజీ చేసి హిమాలయ సంస్థలో ఉద్యోగం చేశారు. నెలలో ఇరవై రోజులు క్యాంపుల ఉద్యోగం ఆయనది. జీవితం ఇది కాదనిపించేది. మన జ్ఞానాన్ని సరిగ్గా ఒకదారిలో పెడితే గొప్ప లక్ష్యాలను సాధించవచ్చనిపించింది. సొంతంగా ఏదో ఒకటి చేయాలనే నిర్ణయానికి 2009లో వచ్చాం. నాలుగేళ్లపాటు సమాజం అవసరాలేమిటి, అందుబాటులో ఉన్న వనరులేమిటి అని అధ్యయనం చేశాం. సమాజంలో ఆరోగ్యకరమైన ఆహారం తప్ప అన్నీ ఉన్నాయని తెలిసింది. మేము 2014లో గ్రామాలకు వెళ్లి రైతులతో కొర్రలు పండిస్తారా అని అడిగినప్పుడు మమ్మల్ని వెర్రివాళ్లను చూసినట్లు చూశారు. కుగ్రామాలకు వెళ్లి మహిళలకు మా ఉద్దేశాన్ని వివరించాం. విత్తనాల నుంచి పంటకు అవసరమైన ఇన్పుట్స్ అన్నీ మేమే ఇస్తాం, మీరు పండించిన పంటను మేమే కొంటాం... అని భరోసా ఇచ్చాం. దాంతోపాటు వారు పండించే కంది పంట మధ్య చాళ్లలో చిరుధాన్యాలను పండించమని సూచించాం. ఒక కందిపంట సమయంలో చిరుధాన్యాలు మూడు పంటలు వస్తాయి. తమకు నష్టం ఏమీ ఉండదనే నమ్మకంతోపాటు మామీద విశ్వాసం కలిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, రాజస్థాన్, సిక్కిం రాష్ట్రాల్లో మొత్తం 1350 మంది మహిళారైతులు మాతో కలిశారు. గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత 2018లో కంపెనీ ఖాద్యమ్ని రిజిస్టర్ చేశాం. ఖాద్యమ్ అనే సంస్కృత పదానికి అర్థం తినదగినది అని. పంట నుంచి మా ప్రయోగాలు వంటకు విస్తరించాయి. వండి చల్లబరుస్తాం! ఇడ్లీ, సాంబార్, చట్నీ వంటి ఆహార పదార్థాలు యంత్రాల్లోనే తయారవుతాయి. ఉడికిన వెంటనే మైనస్ నలభై డిగ్రీల ఉష్ణోగ్రతకు తీసుకువెళ్లడంతో వాటిలో ఉండే తేమ హరించుకుపోతుంది. ఇలా తయారైన ఆహారం ప్యాకెట్లలో తొమ్మిది నెలల పాటు నిల్వ ఉంటుంది. వేడినీటిలో ముంచితే ఐదు నిమిషాల్లో ఇడ్లీ మెత్తగా మారుతుంది, సాంబార్, చట్నీలు కూడా అంతే. మేము కనుగొన్న విజయవంతమైన ఫార్ములా ఇది. పోహా నుంచి స్పగెట్టీ, పాస్తా వరకు ఒక ఇంట్లో అన్ని తరాల వారూ ఇష్టపడే రుచులన్నింటినీ ఇలాగే చేస్తున్నాం. మొదట్లో రెడీ టూ కుక్ ఉత్పత్తుల మీద దృష్టి పెట్టాం. రోజూ వండి బాక్సు పట్టుకెళ్లడం కుదరని రోజుల్లో రెడీ టూ ఈట్ విధానాన్ని అనుసరించాం. ఆఫీస్‌కి టిఫిన్ బాక్స్ తేలిగ్గా తీసుకెళ్లడానికి, ప్రయాణాల్లో తీసుకెళ్లడానికి మా ఉత్పత్తులు చాలా అనువుగా ఉంటాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే సైన్యం అవసరాలకు తగినట్లు ఆహారాన్ని తయారు చేయడం పెద్ద సవాల్ అనే చెప్పాలి. మైసూర్లో ఉన్న డీఎఫ్ఆర్ఎల్కి ఎన్నిసార్లు వెళ్లామో లెక్క పెట్టలేం. యాభైసార్లకు పైగా వెళ్లి ఉంటాం. విమాన టిక్కెట్ల ఖర్చే లక్షల్లో వచ్చింది. సైంటిస్టులు సూచించిన నియమావళి ప్రకారం తయారు చేయడం, శాంపుల్ తీసుకెళ్లి చూపించడం, వాళ్లు చెప్పిన సవరణలను రాసుకుని హైదరాబాద్ రావడం, మేడ్చల్ దగ్గర బండ మాదారంలో ఉన్న మా యూనిట్లో తయారు చేసి మళ్లీ పట్టుకెళ్లడం... ఇలా సాగింది. మా ప్రయోగాల గురించిన ప్రతి వివరాన్నీ నోట్స్ సమర్పించాం. జీవితంలో ఓ గొప్ప లక్ష్యాన్ని సాధించాలనుకున్నాం, ఆ ప్రయాణంలో మేము లక్ష్యాన్ని చేరేలోపు ఉద్యోగంలో సంపాదించుకున్న డబ్బు రెండు కోట్లకు పైగా ఖర్చయిపోయింది. ఏ దశలోనూ వెనుకడుగు వేయకుండా దీక్షగా ముందుకెళ్లడమే ఈ రోజు విజేతగా నిలిపింది. ఏ– ఐడియా వంటి ప్రభుత్వరంగ సంస్థలు ఆర్థికంగానూ, మౌలిక వసతుల కల్పనలోనూ సహకరిస్తున్నాయి. మా ఉత్పత్తులు ఈ–కామర్స్ వేదికల మీద పన్నెండు దేశాలకు చేరుతున్నాయి. ఢిల్లీలో ఈ నెల మూడు నుంచి ఐదు వరకు ‘వరల్డ్ ఫుడ్ ఇండియా’ సదస్సు జరిగింది. అందులో స్టాల్ పెట్టమని ప్రభుత్వం నుంచి ఆహ్వానం రావడమే ఈ ప్రయత్నంలో మేము గెలిచామని చెప్పడానికి ఉదాహరణ’’ అని వివరించారు ఖాద్యమ్ కో ఫౌండర్ మాధవి. డీఎఫ్ఆర్ఎల్... డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ లాబొరేటరీ. కర్నాటక రాష్ట్రం మైసూర్లో ఉన్న ఈ సంస్థ డీఆర్డీవో (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్)లో ఒక విభాగం. రక్షణరంగంలో విధులు నిర్వర్తించే వారికి నిల్వ ఉండే ఆహారాన్ని సరఫరా చేస్తుంది. పర్వత ప్రాంతాలు, లోయలు, గడ్డకట్టే మంచులో ఉండే ఆర్మీ క్యాంపుల్లో విధులు నిర్వర్తించేవారికి తాజా ఆహారాన్ని అందించడం కొన్ని సందర్భాల్లో సాధ్యం కాదు. అలాంటి సమయాల్లో వారి ఆకలి తీర్చేది... ముందుగానే వండి, శీతలపరిచి డబ్బాల్లో నిల్వ చేసిన ఆహారమే. అలా నిల్వ చేసే ఆహారాన్ని తయారు చేయడం అత్యంత క్లిష్టమైన పని. ఆహారం నెలల కొద్దీ నిల్వ ఉండాలి, అందులో పోషకాలు లోపించకూడదు. – వాకా మంజులారెడ్డి ఫొటో : నోముల రాజేశ్ రెడ్డి -
G20 Summit: బైడెన్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చలు
న్యూఢిల్లీ: భారత్, అమెరికా దేశాల మధ్య రక్షణ రంగంలో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కంకణం కట్టుకున్నట్లు భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంయుక్తంగా ప్రకటించారు. జీ20 సమావేశాల్లో పాల్గొనేందుకు శుక్రవారం భారత్‌కు విచ్చేసిన బైడెన్‌ను ప్రధాని మోదీ ఢిల్లీలోని తన అధికారిక నివాసం 7, కళ్యాణ్మార్గ్కు సాదరంగా ఆహా్వనించారు. దాదాపు 50 నిమిషాలకుపైగా జరిగిన ఈ భేటీ సందర్భంగా ఇరువురు అగ్రనేతలు కీలకమైన అంశాలపై చర్చించి పలు రంగాలకు సంబంధించి ఒప్పందాలు ఖరారుచేశారు. అమెరికా నుంచి 31 అత్యాధునిక డ్రోన్ల కొనుగోలు, ఆధునిక జెట్ ఇంజిన్ల సంయుక్త తయారీపై రెండు దేశాలు అవగాహనకు వచ్చాయి. జీ20 సారథ్యం, అణుఇంధనంలో సహకారం, 6జీ, కృత్రిమ మేథ వంటి సంక్లిష్ట, అధునాతన సాంకేతికతల్లో పరస్పర సహకారం, బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకుల్లో సంస్కరణలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. అమెరికా రక్షణ రంగ దిగ్గజం జనరల్ అటామిక్స్ సంస్థ నుంచి ఎంక్యూ–9బీ రకం 31 డ్రోన్లను కొనేందుకు భారత రక్షణ శాఖ పంపిన విజ్ఞప్తి లేఖకు బైడెన్ తన సమ్మతి తెలిపారు. చదవండి: G20 Summit 2023: శిఖరాగ్ర భేటీకి శ్రీకారం అమెరికాలోని జీఈ ఏరోస్పేస్, భారత్‌లోని హిందుస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్(హాల్)లు సంయుక్తంగా జీఈ ఎఫ్–414 జెట్ ఇంజన్లను భారత్‌లోనే తయారుచేసేందుకు ఇరునేతలు అంగీకరించారు. సాంకేతికత బదలాయింపు, జెట్ ఇంజన్ల తయారీకి పచ్చజెండా ఊపారు. ‘జీ20 కూటమి అనేది ఏ విధంగా గొప్ప ఫలితాలను రాబట్టగలదన్న దానిని జీ20 సారథిగా భారత్ నిరూపించి చూపింది. సదస్సు తాలూకు ఫలితాలు మున్ముందు మరిన్ని ఉమ్మడి లక్ష్యాలను నిర్ధేశిస్తాయి’ అని బైడెన్ భారత్‌ను పొగిడారు. స్వేచ్ఛాయుత, పారదర్శక, సమ్మిళిత ఇండో–పసిఫిక్ కోసం క్వాడ్ కూటమి అత్యవశ్యకమని ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు. వచ్చే ఏడాది భారత్‌లో జరిగే క్వాడ్(అమెరికా, జపాన్, ఇండియా, ఆ్రస్టేలియా) చతుర్భుజ కూటమి సదస్సుకు రావాలని బైడెన్‌ను మోదీ కోరారు. ‘ స్వేచ్ఛా, ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, బహుళత్వం, సమాన అవకాశాలనే విలువలు రెండు దేశాల పౌరుల విజయానికి ఎంతో కీలకం. ఈ విలువలే రెండు దేశాల మైత్రి బంధాన్ని మరింత బలోపేతం చేశాయి’ అని సంయుక్త ప్రకటనలో ఇరు దేశాలు పేర్కొన్నాయి. ‘సదస్సు తుది నిర్ణయాలు సుస్థిరాభివృద్ధి, బహుపాక్షిక సహకారం, సమ్మిళిత ఆర్థిక విధానాల్లో ఏకరూపత సాధనకు తద్వారా పెను ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు దోహదపడతాయి’ అని సంయుక్త ప్రకటన పేర్కొంది. బైడెన్‌తో చర్చలు ఫలప్రదమయ్యాయని అనంతరం ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఏఏ అంశాల్లో ఒప్పందం కుదిరిందంటే.. ► ప్రపంచ వ్యాప్తంగా సెమీ కండక్టర్ల సరఫరా గొలుసు బలోపేతం ► భారత్‌లో పరిశోధనాభివృద్ధి కోసం మైక్రోచిఫ్ టెక్నాలజీ సంస్థ దాదాపు 30 కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టడం ► వచ్చే ఐదేళ్లలో అధునాతన మైక్రో డివైజ్‌ల కోసం 40 కోట్ల డాలర్ల పెట్టుబడి ► భారత్ 6జీ కూటమి, నెక్ట్స్ జీ కూటమి మధ్య అవగాహన ఒప్పందం(ఎంఓయూ) ► ఇండో–పసిఫిక్‌లో స్వేచ్ఛా వాణిజ్యం, రక్షణ కోసం మరింత సహకారం ► భద్రత, టెలీ కమ్యూనికేషన్స్ రంగాల్లో సహకారం ► సాంకేతిక రంగాల్లో కలిసి పనిచేయడం -
అమెరికా రక్షణ పరికరాల్లో చైనా మాల్వేర్!
వాషింగ్టన్: ప్రపంచంలోనే అత్యంత బలమైన సైన్యం, ఆయుధాలు, కమ్యూనికేషన్ వ్యవస్థ ఉన్న అమెరికాను ఇప్పుడు చైనా మాల్వేర్ బెంబేలెత్తిస్తోంది. ఓ అజ్ఞాత మాల్వేర్ను తమ రక్షణ పరికరాల్లో చైనా ప్రవేశపెట్టిందని అమెరికా సైనికాధికారులు అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని అమెరికా కాంగ్రెస్ అధికారి ఒకరు నిర్ధారించారు. తమ రక్షణ వ్యవస్థపై చైనా హ్యాకర్లు కన్నేశారని, రక్షణ శాఖ పరికరాల్లోకి ఓ కంప్యూటర్ కోడ్‌ను(మాల్వేర్) ప్రవేశపెట్టారని భావిస్తున్నారు. సైన్యానికి చెందిన నెట్వర్క్ కంట్రోలింగ్ పవర్ గ్రిడ్లు, కమ్యూనికేషన్ నెట్వర్క్, సైనిక కేంద్రాలకు నీటిని సరఫరా చేసే వ్యవస్థల్లోకి ఈ మాల్వేర్ రహస్యంగా చేరినట్లు అంచనా వేస్తున్నారు. దీనివల్ల అత్యవసర, సంక్షోభ సమయాల్లో సైన్యానికి అవసరమైన సరఫరాల్లో అంతరాయం కలిగించేందుకు ఆస్కారం ఉంటుంది. టైం బాంబులాంటిదే మాల్వేర్ వ్యవహారం తొలుత ఈ ఏడాది మే నెలలో బయటపడింది. గువామ్‌లో అమెరికా ఎయిర్ బేస్‌కు చెందిన టెలికమ్యూనికేషన్స్ వ్యవస్థల్లో అనుమానాస్పద కంప్యూటర్ కోడ్‌ను తాము గుర్తించినట్లు మైక్రోసాఫ్ట్ సంస్థ వెల్లడించింది. మరో కీలక ప్రాంతంలో ఉన్న కంప్యూటర్లలోనూ ఇది ఉన్నట్లు పేర్కొంది. ఓల్ట్ టైఫన్ అనే చైనా హ్యాకింగ్ సంస్థపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రక్షణ పరికరాల్లో చైనా మాల్వేర్ అనేది నిజంగా టైంబాంబు లాంటిదేనని అమెరికా కాంగ్రెస్ అధికారి చెప్పారు. సైనిక స్థావరాలకు విద్యుత్, నీటి సరఫరాను, సమాచార మారి్పడిని హఠాత్తుగా నిలిపివేయడానికి ఈ మాల్వేర్ను ఉపయోగిస్తుంటారని చెప్పారు. దీనివల్ల సైన్యంలో పనివేగం తగ్గిపోతుందని అన్నారు. కేవలం అమెరికాలోనే కాదు, విదేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాల్లోని పరకరాల్లోకి చైనా హ్యాకర్లు మాల్వేర్ను పంపించినట్లు ప్రచారం సాగుతోంది. తైవాన్ విషయంలో ఇటీవలి కాలంలో చైనా దూకుడు పెంచింది. ఈ దేశంలో సమీపంలో తరచుగా వైమానిక విన్యాసాలు నిర్వహిస్తోంది. తమ దేశంలో తైవాన్ ఒక అంతర్భాగమని వాదిస్తోంది. మరోవైపు తైవాన్‌కు అమెరికా అండగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా రక్షణ పరికరాల్లోకి చైనా మాల్వేర్ ప్రవేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
రక్షణ రంగానికి వెన్నెముక విశాఖ
సాక్షి, విశాఖపట్నం: రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ అమలు ద్వారా అనేక విప్లవాత్మక మార్పులు వచ్చాయని రక్షణశాఖ సైంటిఫిక్ అడ్వైజర్ డాక్టర్ సతీశ్‌రెడ్డి చెప్పారు. ఈ కారణంగానే రక్షణరంగ ఎగుమతులు గతేడాది రూ.16 వేల కోట్లకు చేరుకున్నాయని తెలిపారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో ‘రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో స్వదేశీ పరిజ్ఞానం, ఆవిష్కరణలు’ అనే అంశంపై విశాఖలో నిర్వహించిన సదస్సులో సతీశ్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపారమైన అవకాశాలున్న విశాఖ రక్షణ రంగానికి వెన్నెముకగా ఉందని చెప్పారు. తూర్పు నౌకాదళం, డాక్‌యార్డ్, షిప్‌యార్డు, ఎన్ఎస్టీఎల్ తదితర రక్షణ రంగం, అనుబంధ సంస్థలు ఉన్న విశాఖ భవిష్యత్తులో రక్షణ రంగం, ఏరోసిస్టమ్కు కేంద్రంగా మారనుందని చెప్పారు. రక్షణ రంగ పరికరాల తయారీ పరిశ్రమలు ఇప్పుడిప్పుడే విశాఖలో అభివృద్ధి చెందుతున్నాయన్నారు. మేకిన్ ఇండియాలో భాగంగా డీఆర్డీవో నుంచి సాంకేతికత బదలాయింపుని ప్రోత్సహించడం ద్వారా.. డిఫెన్స్ మెటీరియల్ ఉత్పత్తులు పెరిగాయని తెలిపారు. దేశీయ తయారీరంగానికి ఉత్తేజం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు రక్షణ పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేసిందని చెప్పారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారవుతున్న ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతిచేసే స్థాయికి చేరుకున్నందుకు గర్వంగా ఉందన్నారు. 2014–15 నాటికి రూ.2 వేల కోట్ల కంటే తక్కువగా ఉన్న డిఫెన్స్ ఎక్స్‌పోర్ట్స్ గతేడాది రూ.16 వేల కోట్లకు చేరుకున్నాయని, భవిష్యత్తులో రూ.25 వేల కోట్ల మార్క్‌ని అధిగమించే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. టార్పెడోలు, క్షిపణులు, పరికరాలు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయని తెలిపారు. ఒకప్పుడు రక్షణరంగ పరికరాల దిగుమతుల్లో అగ్రభాగంలో ఉన్న భారత్.. ఇప్పుడు ఎగుమతుల్లో అగ్రస్థానం దిశగా పరుగులు పెడుతుండటం శుభపరిణామమని పేర్కొన్నారు. రక్షణ రంగంలో ఒకప్పుడు సప్లై చైన్‌గా ఉన్న ప్రైవేటు కంపెనీలు డెవలప్మెంట్ ప్రొడక్షన్ సెక్టార్‌గా మారాయని, క్రమంగా డెవలప్మెంట్ కమ్ ప్రొడక్షన్ పార్టనర్స్ (డీసీపీపీ)గా అభివృద్ధి చెందాయని చెప్పారు. ఇప్పటికే ప్రైవేట్ తయారీ సంస్థలు ఏడు మిసైళ్లను తయారు చేశాయన్నారు. రక్షణ రంగానికి అవసరమైన ఇన్నోవేషన్స్‌ని సృష్టించే అంకుర పరిశ్రమలు, ఎంఎస్‌ఎంఈలని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. డిఫెన్స్ ఇన్నోవేషన్ స్టార్టప్ చాలెంజ్ ద్వారా సాంకేతికత బదలాయింపు జరుగుతోందన్నారు. రక్షణ రంగం వైపుగా ఎక్కువ స్టార్టప్స్ అడుగులు వేస్తున్నా యని చెప్పారు. దేశంలో 2016 నాటికి 400 స్టార్టప్లుండగా.. ప్రస్తుతం ఈ సంఖ్య లక్షకు చేరుకోవడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ)లోను మార్పులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సదస్సులో సీఐఐ ఎస్ఐడీఎం చైర్మన్ జె.శ్రీనివాసరాజు, సీఐఐ ఏపీ చైర్మన్ డాక్టర్ ఎం.లక్ష్మీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
అమెరికాతో రక్షణ రోడ్డు మ్యాప్ ఖరారు
న్యూఢిల్లీ: రక్షణ రంగంలో అమెరికా, భారత్ మధ్య పరస్పర సహకారానికి రోడ్డు మ్యాప్ ఖరారైంది. ఢిల్లీలో సోమవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ సుదీర్ఘంగా చర్చించి, ఈ మేరకు రోడ్డు మ్యాప్ సిద్ధం చేశారు. రక్షణ పారిశ్రామిక రంగంతోపాటు రక్షణ ఉత్పత్తుల తయారీలో ఇకపై ఇరు దేశాలు సహకరించుకుంటాయి. ఫాస్ట్–ట్రాక్ టెక్నాలజీ ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. గగతతల, భూ ఉపరితల యుద్ధానికి అవసరమైన ఆయుధాలను కలిసికట్టుగా తయారు చేసుకుంటాయి. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో డ్రాగన్ దేశం చైనా దూకుడు పెరుగుతున్న సమయంలో భారత్, అమెరికా మధ్య ఈ రోడ్డు మ్యాప్ ఖరారు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో రెండు వారాల తర్వాత అమెరికాలో పర్యటించబోతున్నారు. రెండు దేశాల నడుమ సంబంధాలు మరింత బలోపేతం కావడానికి ఈ పర్యటన దోహదపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనా దుందుడుకు చర్యలు, ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర నేపథ్యంలో అంతర్జాతీయంగా వివిధ దేశాల సార్వభౌమత్వానికి ముప్పు పొంచి ఉందని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ అస్టిన్ చెప్పారు. రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్‌కు భారత్–అమెరికా బంధం ఒక మూలస్తంభమని అభివర్ణించారు. భారత సైన్యం ఆధునీకరణకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని పునరుద్ఘాటించారు. భారత్, అమెరికా నడుమ రక్షణ రంగంలో సహకారం విషయంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టడానికే రోడ్డు మ్యాప్ ఖరారు చేసుకున్నట్లు అమెరికా రక్షణ శాఖ కార్యాలయం ‘పెంటగాన్’ వెల్లడించింది. ఫైటర్ జెట్ ఇంజన్లకు అవసరమైన ఆధునిక టెక్నాలజీని భారత్‌కు అందజేయానికి జనరల్ ఎలక్ట్రిక్స్ సంస్థ ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేసింది. అలాగే 30 ఎంక్యూ–9బీ ఆర్మ్డ్ డ్రోన్లను అమెరికా రక్షణ రంగ సంస్థ నుంచి కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోంది. ఈ రెండు అంశాల గురించి లాయిన్ అస్టిన్ వద్ద రాజ్‌నాథ్ సింగ్ ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు తెలిసింది. ద్వైపాకిక్ష రక్షణ సహకారాన్ని పెంపొందించుకోవడానికి 2020 అక్టోబర్‌లో బేసిక్ ఎక్సే్ఛంజ్, కో–ఆపరేషన్ అగ్రిమెంట్(బీఈసీఏ) కుదిరింది. -
ఉపాధికి రక్షణ కవచం!
సాక్షి, అమరావతి : పారిశ్రామికంగా రాష్ట్రం శరవేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. ఓ వైపు పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు.. మరో వైపు సెజ్ (స్పెషల్ ఎకనామిక్ జోన్)లు, వాటిలో భారీ పరిశ్రమల ఏర్పాటుతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వీటికి అనుబంధంగా ఏర్పాటయ్యే పరిశ్రమల ద్వారా లక్షల సంఖ్యలో యువతకు ఉపాధి మార్గాలు చేరువ కానున్నాయి. ఈ నేపథ్యంలో సత్యసాయి జిల్లా పాల సముద్రం వద్ద 914 ఎకరాల్లో కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగానికి చెందిన భారత్ ఎల్రక్టానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ కాంప్లెక్స్ పనులు వేగం అందుకున్నాయి. ఐదు దశల్లో ఈ యూనిట్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే తొలి దశలో రూ.384 కోట్లతో అభివృద్ధికి బోర్డు ఆమోదం తెలిపింది. త్వరలో జరిగే బోర్డు సమావేశంలో మిగిలిన దశలకు సంబంధించి ఆమోదం లభించనుందని బీఈఎల్ అధికారులు తెలిపారు. ఈ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ కాంప్లెక్స్‌లో రాడార్, మిసైల్, సబ్మెరైన్లకు సంబంధించిన పరికరాలను అభివృద్ధి చేయడమే కాకుండా వీటిని పరీక్షించేలా టెస్టింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. తొలి దశకు సంబంధించి క్షిపణుల అసెంబ్లింగ్, ఇంటిగ్రేషన్, టెస్టింగ్ కార్యకలాపాలకు అవసరమైన మౌలిక వసతులను రూ.148 కోట్లతో అభివృద్ధి చేయడానికి ఆసక్తిగల సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. బిడ్ దక్కించుకున్న సంస్థ క్షిపణుల తయారీకి సంబంధించి మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్, ప్రీ ఇంజనీర్డ్ బిల్డ్‌లతో పాటు ఒక ఫ్యాక్టరీకి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించాల్సి ఉంటుంది. వీటితో పాటు విద్యుత్, నీటి సరఫరా, మురుగునీటి శుద్ధి, వరద నీటి కాల్వలు, అంతర్గత రహదారులు, డ్రెయిన్లు, కల్వర్టులు, వీధి దీపాలు వంటి వాటిని సమకూర్చాల్సి ఉంటుంది. ఆసక్తి గల సంస్థలు మే 23లోగా బిడ్లను దాఖలు చేయాలని కోరింది. ఇప్పటికే ఈ 914 ఎకరాల చుట్టూ సుమారు రూ.50 కోట్లతో ప్రహరీ నిర్మించింది. గోడ చుట్టూ రోడ్డు నిర్మాణం పూర్తి కాగా, సొంత అవసరాల కోసం సోలార్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని ఏపీఐఐసీ అధికారులు ‘సాక్షి’కి వెల్లడించారు. చకచకా అనుమతులు గత ప్రభుత్వ అసమర్థ నిర్వాకానికి బీఈఎల్ ప్రాజెక్టు ఒక ఉదాహరణ. అత్యంత ప్రతిష్టాత్మకమైన క్షిపణులు, ఇతర రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ యూనిట్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి 2016లోనే బీఈఎల్ ముందుకు రాగా, రాష్ట్ర ప్రభుత్వ అలసత్వంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. భూమి కన్వర్షన్, పర్యావరణ అనుమతులు తేవడంలో అప్పటి ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించడంతో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించి, త్వరితగతిన అనుమతులు వచ్చేలా చర్యలు చేపట్టారు. మరోపక్క యూనిట్ పనులు ప్రారంభించకపోతే భూ కేటాయింపులు రద్దు చేయడంతో పాటు, పెనాల్టీ విధిస్తామంటూ బీఈఎల్‌కు ఏపీఐఐసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంతో బీఈఎల్ కొంత సమయం ఇవ్వాలని, పెనాల్టిలు రద్దు చేయాలని కోరింది. గతంలో కంటే పెద్ద యూనిట్ ఏర్పాటు చేసేలా, కొత్తగా సమగ్ర ప్రాజెక్టు ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. దీన్ని పరిశీలించిన ఏపీఐఐసీ బోర్డు అన్ని అనుమతులు మంజూరు చేసింది. అనుమతులు రావడంతో బీఈఎల్ కూడా యూనిట్ ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు చేపట్టింది. నిధులు కూడా కేటాయించింది. రక్షణ రంగంలో అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై బీఈఎల్ అధికారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మచిలీపట్నం బీఈఎల్ కార్యాలయంలో ప్రత్యేకంగా బోర్డు సమావేశం ఏర్పాటు చేసి, తొలి దశలో రూ.384 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేసి పనులు ప్రారంభించారు. టెండర్ల ప్రక్రియ పూర్తయితే 2025 నాటికి ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. డిఫెన్స్ హబ్‌గా ఏపీ దేశ రక్షణ అవసరాల తయారీ హబ్‌గా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవింద రెడ్డి తెలిపారు. ఇప్పటికే కేంద్ర రక్షణ సంస్థ 914 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ కాంప్లెక్స్ అభివృద్ధి చేస్తుండగా ఏపీఐఐసీ కూడా 1,200 ఎకరాల్లో ఏపీ ఏరో స్పేస్ అండ్ డిఫెన్స్ ఎల్రక్టానిక్స్ (ఏపీ–ఏడీఈ) పార్క్‌ను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి త్వరలో జరిగే ఏపీఐఐసీ బోర్డు సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నామని చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టుల రాకతో శ్రీ సత్యసాయి జిల్లాతోపాటు రాష్ట్రం రక్షణ రంగ ఉత్పత్తులకు తయారీ కేంద్రంగా తయారవుతుందన్నారు. ఈ రెండు ప్రాజెక్టుల రాకతో ప్రత్యక్షంగా 2,800 మందికి, పరోక్షంగా 8,000 మంది వరకు ఉపాధి లభిస్తుంది. యాంకర్ యూనిట్‌గా బీఈఎల్ భారీ ప్రాజెక్టును చేపడుతుండటంతో అనేక అనుబంధ కంపెనీలు, ఎంఎస్ఎంఈలు ఏర్పాటు కానున్నాయి. -
యుద్ధ విమానం స్వదేశీ గర్జన!
సాక్షి, విశాఖపట్నం: రక్షణ పరిశోధన సాంకేతిక రంగంలోకి ప్రైవేట్ సంస్థలను ఆహ్వానిస్తున్నట్లు డీఆర్డీవో చైర్మన్ సమీర్ వి.కామత్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్పేస్ పాలసీలో భాగంగా రక్షణ రంగంలో ప్రధానంగా స్పేస్ టెక్‌లో ప్రైవేట్ పరిశ్రమలు, పరిశోధన సంస్థలకు అవకాశాలు కల్పించినట్లు వివరించారు. విశాఖలో ని నేవల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ లేబొరేటరీ (ఎన్ఎస్టీఎల్)లో గురువారం ప్రారంభమైన కండిషన్ మానిటరింగ్ జాతీయ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ‘సాక్షి’తో పలు అంశాలపై మాట్లాడారు. అంతరిక్ష పరిశోధనలపై దృష్టి స్పేస్ పాలసీలో భాగంగా పరిశోధనలపై దృష్టి సారించాం. ముఖ్యంగా రక్షణ శాఖతో పాటు అంతరిక్ష పరిశోధనలపై దృష్టి పెట్టాం. రాకెట్ లాంచింగ్, శాటిలైట్స్ అభివృద్ధి.. ఇలా ఎలాంటి హద్దులు లేకుండా ప్రైవేట్ సంస్థలు ముందుకు రావచ్చు. దీనిద్వారా అగ్రదేశాలతో పోటీ పడే స్థాయికి వేగంగా చేరుకుంటాం. అంతరిక్ష ఆధారిత నిఘా, అంతరిక్ష పరిస్థితులపై మన అవగాహన సామర్థ్యాలు మెరుగుపడుతున్నాయి. అంకుర సంస్థలకు ప్రోత్సాహం రక్షణ రంగంలో స్టార్టప్స్‌ని ప్రోత్సహిస్తున్నాం. డిఫెన్స్ సిస్టమ్, టెక్నాలజీపై పని చేస్తున్న స్టార్టప్స్‌కు ప్రాధాన్యమిస్తున్నాం. పరిశోధన అభివృద్ధి(ఆర్ అండ్ డీ) బడ్జెట్లో 25 శాతం వరకూ పరిశ్రమలు, స్టార్టప్స్, విద్యారంగానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించడం శుభ పరిణామం. అందుకే స్టార్టప్స్, ఎంఎస్ఎంఈలకు అవకాశాలు కల్పిస్తున్నాం. 17 వేల అడుగుల ఎత్తు వరకు ‘యూఏవీ’ మానవ రహిత వైమానిక వాహనం (యూఏవీ)పై ప్రధానంగా దృష్టి సారించాం. ఇందుకోసం గైడెన్స్ కిట్, సీట్ ఎజెక్షన్ సిస్టమ్, పైరోటెక్నిక్ కాట్రిడ్స్ అభివృద్ధి చేసే పనిలో ఉన్నాం. ‘యూఏవీ తపస్’ కోసం 180 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన ఇంజన్‌ను దేశీయంగా అభివృద్ధి చేశాం. దీని ద్వారా యూఏవీ 17 వేల అడుగుల ఎత్తువరకూ ఎగరగలదు. 2028లో తొలి దేశీయ యుద్ధ విమానం ఎగరనుంది మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మన సాయుధ బలగాల్లో చాలా వ్యవస్థలు స్వదేశీ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోనున్నాయి. ఇందులో భాగంగా ఎల్సీఏ ఎంకే–2 ఇండక్షన్కు సిద్ధమవుతున్నాం. జీఈఎఫ్ 414 ఇంజన్‌తో కూడిన ఏఎంసీఏ (అడ్వాన్స్డ్ మీడియమ్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్) ఫేజ్–1 యుద్ధ విమానాన్ని 2028లో ఎగురవేసేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నాం. ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతోంది. దీనికి సంబంధించి అనుమతుల కోసం వేచి చూస్తున్నాం. ఎలైట్ క్లబ్లో చేరడం గర్వకారణం ఇటీవల ‘సీ బేస్డ్ ఎండో అట్మాస్ఫియరిక్ ఇంటర్‌సెప్టర్ మిసైల్’ తొలి వి మాన ప్రయోగం విజయవంతం కావడంతో రక్షణ సామర్థ్యాల విషయంలో మన దేశం చరిత్రాత్మక మైలురాయిని అధిగవిుంచింది. నేవల్ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ (బీఎండీ) సామర్థ్యంలో అగ్రదేశాల సరసన నిలిచి ఎలైట్ క్లబ్ ఆఫ్ నేషన్స్‌లో చేరడం గర్వకారణం. యుద్ధనౌకలు, ఉపరితలం నుంచి బాలిస్టిక్ క్షిపణులను నిలువరించే సామర్థ్యాన్ని భారత్ అభివృద్ధి చేసింది. అంతకుముందే భూ ఆధారిత క్షిపణి ప్రయోగాన్ని విజ యవంతంగా నిర్వహించాం. ఈ జంట విజయాలతో సుదూర అణు క్షిపణులు, హైపర్ సోనిక్ మిసైల్స్, గ్లైడర్స్, శత్రు విమానాల్ని అడ్డుకోగల సామర్థ్యాన్ని మన దేశం సొంతం చేసుకుంది. -
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయొద్దు
సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: దేశ రక్షణ రంగంలో కీలకపాత్ర పోషిస్తున్న సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారంలో ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని, ఇతర రక్షణ రంగ కర్మాగారాలను ప్రైవేటుపరం చేయొద్దని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దేశ భద్రతతో పాటు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న74 వేల మంది ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. ఈ మేరకు హరీశ్‌రావు శనివారం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాశారు. ‘డిఫెన్స్ రంగానికి చెందిన ఏడు ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించడం వల్ల నూతన ఆయుధాల అభివృద్ధి నిలిచిపోతుంది. ఇది మేకిన్ ఇండియా స్ఫూర్తిని దెబ్బతీస్తుంది’అని తన లేఖలో పేర్కొన్నారు. ‘ఎద్దుమైలారంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి గతేడాదిలో కావాల్సినంత పని ఉండేది. దాదాపు రూ.930 కోట్ల ఆర్డర్లను సిబ్బంది సమయానికి పూర్తి చేశారు. కానీ ఈ ఏడాదిలో సంస్థకు పెద్దగా పని అప్పగించలేదు. దీనిని సాకుగా చూపి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని ‘ఖాయిలా పరిశ్రమ’’(సిక్ ఇండస్ట్రీ)గా ప్రకటిస్తారని కారి్మకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే ప్రత్యక్షంగా 2,500 మంది ఉద్యోగులతో పాటు పరోక్షంగా మరో ఐదువేల మంది ఉపాధి దెబ్బతింటుంది’అని హరీశ్‌రావు లేఖలో పేర్కొన్నారు. ఎద్దుమైలారం ఫ్యాక్టరీలో యంత్రాలను ఆధునీకరించాలని, ఉద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని కోరారు. అలాగే ఆర్మీ అవసరాలకు అనుగుణంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి ఆర్డర్లు ఇవ్వాలని సూచించారు. -
హెచ్ఏఎల్లో 3.5% వాటా అమ్మకం
ముంబై: రక్షణ రంగ పీఎస్‌యూ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)లో కేంద్ర ప్రభుత్వం 3.5 శాతం వాటా(1.17 కోట్ల షేర్లు)ను విక్రయించనుంది. ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) ద్వారా రూ. 10 ముఖ విలువగల ఒక్కో షేరునీ రూ. 2,450 ధరలో ప్రభుత్వం అమ్మనున్నట్లు హెచ్ఏఎల్ స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలియజేసింది. తద్వారా ప్రభుత్వానికి రూ. 2,867 కోట్లు సమకూరే వీలుంది. ఆఫర్లో భాగంగా ప్రభుత్వం తొలుత 1.75 శాతం ఈక్విటీని(58.51 లక్షల షేర్లు) విక్రయానికి ఉంచనుంది. అధిక సబ్స్క్రిప్షన్ లభిస్తే మరో 1.75 శాతం వాటాను సైతం ఇన్వెస్టర్లకు బదిలీ చేయనుంది. ఈ నెల 23న సంస్థాగత ఇన్వెస్టర్లకు, 24న రిటైలర్లకు ఓఎఫ్ఎస్ విండో ఓపెన్ కానుంది. కాగా.. బుధవారం ముగింపు ధర రూ. 2,625తో పోలిస్తే 6.7 శాతం(రూ. 175) డిస్కౌంట్లో ప్రభుత్వం ఫ్లోర్ ధరను నిర్ణయించింది. 2020లో ప్రభుత్వం కంపెనీలో 15 శాతం ఈక్విటీని షేరుకి రూ. 1,001 ధరలో విక్రయించింది. దీంతో రూ. 5,000 కోట్లు అందుకుంది. 2018 మార్చిలో లిస్టయిన కంపెనీలో ప్రభుత్వానికి 75.15 శాతం వాటా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఇప్పటివరకూ డిజిన్వెస్ట్‌మెంట్, సీపీఎస్ఈల షేర్ల బైబ్యాక్‌ల ద్వారా దాదాపు రూ. 31,107 కోట్లు సమకూర్చుకుంది. హెచ్ఏఎల్ వాటా ద్వారా మరో రూ. 2,867 కోట్లు జమ చేసుకునే వీలుంది. బడ్జెట్ అంచనాలు రూ. 65,000 కోట్లుకాగా.. ప్రభుత్వం గత నెలలో డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని రూ. 50,000 కోట్లకు కుదించిన విషయం విదితమే. -
సత్యసాయి జిల్లాలో క్షిపణుల తయారీ
సాక్షి, అమరావతి: దేశ రక్షణ రంగంలో అత్యంత కీలకమైన అధునాతన క్షిపణులు (మిస్సైల్స్) రాష్ట్రంలో ఉత్పత్తి కానున్నాయి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) సత్యసాయి జిల్లా పాలసముద్రం వద్ద 914 ఎకరాల్లో వీటి తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. క్షిపణులతోపాటు రాడార్ టెస్ట్ బెడ్, ఇతర రక్షణ రంగ ఉత్పత్తులను కూడా ఇక్కడ తయారు చేయనుంది. ఈ యూనిట్‌కు రూ.384 కోట్లు కేటాయిస్తూ శనివారం మచిలీపట్నంలోని బీఈఎల్‌లో జరిగిన సంస్థ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం నిర్వాకంతో ఆగిపోయిన ఈ ప్రాజెక్టును వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని రకాల అనుమతులు మంజూరు చేయించింది. 2016లో ఉమ్మడి అనంతపురం జిల్లా పాలసముద్రం వద్ద కేటాయించిన భూమి కన్వర్షన్, పర్యావరణ అనుమతులు తేవడంతో అప్పటి ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించింది. దీంతో ఈ యూనిట్ నిలిచిపోయింది. వైఎస్ జగన్ సీఎం అయ్యాక దీనిపై దృష్టి సారించారు. త్వరితగతిన అనుమతులు వచ్చేలా చర్యలు చేపట్టారు. మరోపక్క యూనిట్ పనులు ప్రారంభించకపోతే భూ కేటాయింపులు రద్దు చేయడంతో పాటు, పెనాల్టీ విధిస్తామంటూ బీఈఎల్‌కు ఏపీఐఐసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంతో బీఈఎల్ కొంత సమయం ఇవ్వాలని, పెనాల్టీలు రద్దు చేయాలని కోరింది. గతంలో కంటే పెద్ద యూనిట్ ఏర్పాటు చేసేలా కొత్తగా సమగ్ర ప్రాజెక్టు ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. దీన్ని పరిశీలించిన ఏపీఐఐసీ బోర్డు అన్ని అనుమతులు మంజూరు చేసింది. అనుమతులు రావడంతో బీఈఎల్ కూడా యూనిట్ ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు చేపట్టింది. నిధులు కూడా కేటాయించింది. రక్షణ రంగంలో అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై బీఈఎల్ అధికారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. శనివారం బోర్డు సమావేశం అనంతరం బెంగళూరు బీఈఎల్ డైరెక్టర్లు భాను పి.శ్రీవాత్సవ, వినయ్ కుమార్ కత్యాల్, మనోజ్ జైన్, డాక్టర్ పార్థసారధి మంగళగిరిలో ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డిని కలిసి ప్రభుత్వం చొరవను అభినందించారు. ఏమాత్రం ఆలస్యం కాకుండా వెంటనే టెండర్లు పిలిచి త్వరలోనే పనులు మొదలుపెడతామని తెలిపారు. 6 నెలలకు ఒకసారి సమావేశమై పనుల పురోగతిని సమీక్షిస్తామన్నారు. -
రక్షణ రంగంలో రూ.8,431 కోట్ల ఎగుమతులు
సాక్షి, విశాఖపట్నం: రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ అమలు ద్వారా అనేక విప్లవాత్మక మార్పులు వచ్చాయని రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు డాక్టర్ సతీష్‌రెడ్డి చెప్పారు. పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బుధవారం విశాఖపట్నం వచ్చిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. మేకిన్ ఇండియాలో భాగంగా డీఆర్డీవో నుంచి సాంకేతిక బదలాయింపుని ప్రోత్సహించడం ద్వారా రక్షణ సామగ్రి ఉత్పత్తులు పెరిగాయని తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. పెరుగుతున్న ఎగుమతులు దేశీయ తయారీ రంగానికి ఉత్తేజం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు రక్షణ పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేసింది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారవుతున్న ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతిచేసే స్థాయికి చేరుకున్నాం. 2014–15 నాటికి రూ.2 వేల కోట్ల కంటే తక్కువలో ఉన్న డిఫెన్స్ ఎక్స్‌పోర్ట్స్ 2020–21 నాటికి రూ.8,431 కోట్లకు చేరుకోవడం విశేషం. పదుల సంఖ్యలో దేశాలకు ఎగుమతులు జరుగుతుండటం శుభపరిణామం. ప్రస్తుతం 334 శాతం పెరుగుదల ఉన్న ఎగుమతులు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. టార్పెడోలు, రాడార్ల ఎగుమతులపై చర్చలు పలు దేశాలు మన రక్షణరంగ పరికరాలతో పాటు ఆయుధ సంపత్తిని తీసుకుంటున్నాయి. త్వరలోనే అత్యంత శక్తిమంతమైన ఆయుధాల ఎగుమతులకు కూడా ఒప్పందాలు జరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఆకాష్, టార్పెడోలు, రాడార్లతో పాటు క్షిపణుల ఎగుమతులపై ప్రభుత్వం వివిధ దేశాలతో చర్చిస్తోంది. సాంకేతిక బదలాయింపుతో ప్రోత్సాహం రక్షణ రంగానికి అవసరమైన ఇన్నోవేషన్స్‌ని సృష్టించే అంకుర పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలను ప్రోత్సహిస్తున్నాం. డిఫెన్స్ ఇన్నోవేషన్ స్టార్టప్ చాలెంజ్ ద్వారా సాంకేతికత బదలాయింపు జరుగుతోంది. ఇప్పటికే డీఆర్డీవో నుంచి 60 పరిశ్రమలకు దాదాపు రూ.250 కోట్లకుపైగా టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ అందించాం. డిఫెన్స్ రంగం వైపు ఎక్కువ స్టార్టప్స్ అడుగులు వేస్తున్నాయి. పరిశోధనల అభివృద్ధి (ఆర్ అండ్ డీ)లోను మార్పులు వస్తున్నాయి. క్వాంటం, హైపవర్ లేజర్, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్.. ఇలా ఎన్నో పరిశోధనలు వస్తున్నాయి. వీటిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్ అండ్ డీ బడ్జెట్లో 25 శాతం వరకు పరిశ్రమలు, స్టార్టప్స్, విద్యారంగానికి కేటాయించడం చరిత్రాత్మకమైన నిర్ణయం. ఏఐపీ ప్రయోగాలు విజయవంతమవుతున్నాయి డీఆర్డీవోకి చెందిన నేవల్ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ (ఎన్‌ఎంఆర్‌ఎల్)లో అభివృద్ధి చేసిన ఇంధన ఆధారిత ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్(ఏఐపీ) ల్యాండ్ బేస్డ్ ప్రోటోటైప్ ప్రయోగాలు విజయవంతమయ్యాయి. త్వరలో ఇంటిగ్రేషన్ చేయాలి. ఇతర సాంకేతికతలతో పోల్చిచూస్తే ఫ్యూయల్ బేస్డ్ ఏఐపీ సబ్మెరైన్లకు ఎంతో ఉపయోగపడుతుంది. శారదాపీఠంలో సతీష్‌రెడ్డి పూజలు సింహాచలం: విశాఖపట్నం చినముషిడివాడలోని శ్రీ శారదాపీఠాన్ని బుధవారం కేంద్ర రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు సతీష్‌రెడ్డి దర్శించుకున్నారు. పీఠంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు. శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారికి పూజలు చేశారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి ఆశీస్సులు అందుకున్నారు. -
రక్షణ రంగంలో సహకారం బలోపేతం
టోక్యో: రక్షణ రంగంలో సహకారాన్ని మరింత పెంచుకోవాలని భారత్, జపాన్‌లు నిర్ణయించుకున్నాయి. జపాన్ పర్యటనలో భాగంగా భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఆ దేశ రక్షణ మంత్రి యసుకజు హమదాతో చర్చలు జరిపారు. ఇరు దేశాల సైన్యాల సమన్వయం మరింతగా పెరిగేందుకు వీలుగా తొలిసారిగా రెండు దేశాల అధునాతన యుద్ధవిమానాలతో కూడిన సంయుక్త సైనిక విన్యాసాలకూ ఆమోదం తెలుపుతూ మంత్రులిద్దరూ నిర్ణయం తీసుకున్నారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో తమ స్వేచ్ఛాయుత, వ్యూహాత్మక ఒప్పందాలు చైనా దూకుడుకు అడ్డుకట్ట వేస్తాయని భారత్, జపాన్ భావిస్తున్న తరుణంలో ఇరు దేశాల రక్షణ మంత్రుల భేటీ జరగడం గమనార్హం. ‘రెండు దేశాల మధ్య దౌత్యసంబంధాలు మొదలై 70 సంవత్సరాలు పూర్తవుతున్న ఈ సందర్భంగా ద్వైపాక్షిక చర్చలు జరిగాయి’ అని రాజ్‌నాథ్ ట్వీట్‌చేశారు. భారత రక్షణ రంగంలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టాలని జపాన్ పరిశ్రమలను రాజ్‌నాథ్ కోరారు. మరోవైపు, భారత్–జపాన్ 2+2 మంత్రుల భేటీలో భాగంగా జపాన్ విదేశాంగ మంత్రి యొషిమస హయషితో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చర్చించారు.‘ ప్రపంచ దేశాలు అంతర్జాతీయ చట్టాలకు లోబడే ఇతర దేశాలతో విభేదాలను పరిష్కరించుకోవాలని, బెదిరింపులకు, సైనిక చర్యలకు పాల్పడకూడదు. దేశాల మధ్య తగాదాలు, వాతావరణ మార్పులతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమౌతోంది. దీంతో ఇంథన, ఆహార భద్రత సంక్షోభంలో పడుతోంది’ అని జైశంకర్ అన్నారు. -
బాహుబలి నౌక ఐఎన్ఎస్ విక్రాంత్.. ఏకంగా 14 అంతస్తులు, 2,300 కంపార్ట్మెంట్లు
రక్షణ రంగంలో మన శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి ఘనంగా చాటే రోజు రానే వచ్చింది. ఇప్పటిదాకా మన దగ్గరున్న యుద్ధ నౌకలన్నీ బ్రిటన్, రష్యాల నుంచి దిగుమతి చేసుకున్నవే. అలాంటిది అగ్రదేశాలే ఆశ్చర్యపోయేలా అత్యాధునిక విమానవాహక యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ విజయవంతంగా నిర్మించింది. ఈ సామర్థ్యమున్న అమెరికా, రష్యా, ఇంగ్లండ్, ఫ్రాన్స్ సరసన సగర్వంగా తలెత్తుకుని నిలిచింది. చైనాతో ఉద్రిక్తత నెలకొన్న వేళ ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతమిస్తూ నిర్మించిన ఈ బాహుబలి యుద్ధనౌకను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జాతికి అంకితం చేశారు. కొచ్చి తీరంలో నావికాదళానికి అప్పగించారు. ఇది 2023లో తూర్పు నౌకాదళ అమ్ములపొదిలో పూర్తిస్థాయిలో చేరే అవకాశముంది. ఐఎన్ఎస్ విక్రాంత్. విజయానికి, శౌర్యానికి గుర్తు. మన దేశ గౌరవానికి ప్రతీక. మన తొలి విమాన వాహక నౌక. బ్రిటన్ నుంచి 1961లో కొనుగోలు చేసిన ఈ నౌక ఎన్నో యుద్ధాల్లో కీలకపాత్ర పోషించింది. మరపురాని విజయాలు అందించింది. 1997లో రిటైరైంది. ఇప్పుడు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి నౌక ఐఏసీ–1కు కూడా అదే పేరు పెట్టారు. నాటి విక్రాంత్ కంటే మెరుగైన సాంకేతికతతో రూపొందించిన ఈ బాహుబలి యుద్ధ నౌక భారత్ చేతిలో బ్రహ్మాస్త్రమే కానుంది. అత్యాధునిక సాంకేతికత విక్రాంత్ నిర్మాణంలో అత్యాధునిక సాంకేతికతను వాడారు. క్యారియర్ మెషినరీ ఆపరేషన్లు, షిప్ నేవిగేషన్, ఆటోమేటిక్ సర్వైబిలిటీ సిస్టం ఏర్పాటు చేశారు. మేజర్ మాడ్యులర్ ఓటీ, ఎమర్జెన్సీ మాడ్యులర్ ఓటీ, ఎల్ఎం 2500 గ్యాస్ టర్బైన్లు 4, ప్రధాన గేర్‌బాక్స్‌లు, షాఫ్టింగ్, పిచ్ ప్రొపైల్లర్ కంట్రోలర్స్, ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ సిస్టమ్, స్టీరింగ్ గేర్, ఎయిర్ కండిషనింగ్ ప్లాంట్లు, కంప్రెసర్లు, సెంట్రిఫ్యూజన్, 60 క్రిటికల్ పంప్స్, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలు, అగ్నిమాపక వ్యవస్థ తదితరాలున్నాయి. టేకాఫ్ సమయంలో ఎయిర్‌క్రాఫ్ట్‌కు అదనపు లిఫ్ట్ ఇచ్చే ఫ్లైట్ డెక్ స్కీ జంప్‌తో స్టోబార్ కాన్ఫిగరేషన్ ఏర్పాటు చేశారు. దాంతో అతి తక్కువ సమయంలో టేకాఫ్ వీలవుతుంది. ఏ భాగమైనా మొరాయించినా ఆ ప్రభావం మిగతా భాగాలపై పడదు. దాంతో ప్రయాణం నిరాటంకంగా సాగుతుంది. 550 సంస్థలు, 100 ఎంఎస్ఎంఈల భాగస్వామ్యం కేరళలోని కొచ్చి షిప్‌యార్డ్‌లో 2005లో విక్రాంత్ నిర్మాణాన్ని ప్రారంభించారు. నేవీ అంతర్గతసంస్థ అయిన వార్ షిప్ డిజైన్ బ్యూరో (డబ్ల్యూడీబీ) దీన్ని రూపొందించింది. 2009 నుంచి మొదలైన పూర్తిస్థాయి నిర్మాణం 13 ఏళ్లలో పూర్తయింది. బీఈఎల్, భెల్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, జిందాల్, ఎస్ఆర్ గ్రూప్, మిథానీ, జీఆర్ఎస్ఈ, కెల్ట్రాన్, కిర్లోస్కర్, ఎల్ అండ్ టీ మొదలైన 550 దిగ్గజ పరిశ్రమలతో పాటు 100కు పైగా ఎంఎస్ఎంఈలు నిర్మాణంలో పాలుపంచుకున్నాయి. పరికరాలు, యంత్రాలన్నీ దాదాపుగా స్వదేశీ తయారీవే. 23 వేల టన్నుల ఉక్కు, 2,500 కి.మీ. ఎలక్ట్రిక్ కేబుల్స్, 150 కి.మీ. పైపులు, 2 వేల వాల్వులు, గ్యాలీ పరికరాలు, ఎయిర్ కండిషనింగ్, రిఫ్రిజిరేషన్ ప్లాంట్లు, స్టీరింగ్ గేర్స్ వంటివన్నీ స్వదేశీయంగా తయారు చేసినవే. కొన్ని భాగాలను మాత్రం రష్యా నుంచి దిగుమతి చేసుకున్నారు. రెండువేల మంది షిప్‌యార్డు అధికారులు, సిబ్బంది, 13 వేలమంది కార్మికులు, ఉద్యోగులు విక్రాంత్ నిర్మాణంలో భాగస్వాములు. నౌక నిర్మాణం జరిగిన 13 ఏళ్ల పాటు రోజూ 2 వేల మందికి ఉపాధి దొరికింది. పరోక్షంగా పలు తయారీ సంస్థల్లో 40 వేల మందికి ఉపాధి లభించింది. 42,8000 టన్నుల సామర్థ్యంతో రెండు టేకాఫ్ రన్వేలు, ఒక ల్యాండింగ్ స్ట్రిప్‌లతో క్షిపణి దాడిని తట్టుకునేలా నిర్మించారు. రూ.20 వేల కోట్లు ఖర్చయియింది. గత ఏడాది ట్రయల్స్ విజయవంతంగా ముగిశాయి. గంటలో వెయ్యిమందికి చపాతీ, ఇడ్లీ రెడీ ఈ నౌకలో మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ తరహా వైద్య సదుపాయాలున్నాయి. ఫిజియోథెరపీ క్లినిక్, ఐసీయూ, ల్యాబొరేటరీ, సీటీ స్కానర్, ఎక్స్‌రే మెషీన్లు, డెంటల్ కాంప్లెక్స్, ఐసోలేషన్ వార్డులతో కూడిన అత్యాధునిక మెడికల్ కాంప్లెక్స్ ఉంది. 16 బెడ్లు, రెండు ఆపరేషన్ థియేటర్లున్నాయి. ఐదుగురు మెడికల్ ఆఫీసర్లు, 17 మంది మెడికల్ సెయిలర్స్ ఉంటారు. ఇక దీని కిచెన్ కూడా అత్యాధునికమే. గంటలో ఏకంగా 1,000 మందికి చపాతీలు, ఇడ్లీలు తయారుచేసే ఆధునిక పరికరాలున్నాయి. ఎందుకంత కీలకం? రక్షణపరంగా, రవాణాపరంగా ఎంతో కీలకమైన హిందూ సముద్రంలో పైచేయి సాధించేందుకు ఐఎన్ఎస్ విక్రాంత్ మనకు బ్రహ్మాస్త్రంలా ఉపయోగపడనుంది. ఏ దేశానికైనా యుద్ధ విమానాలను మోసుకుపోగలిగే సామర్థ్యం కలిగిన నౌకలు ఉంటే నావికాశక్తి పటిష్టంగా ఉంటుంది. దీంతో సముద్ర జలాల్లోనూ, గగన తలంపై కూడా పట్టు సాధించగలం. చైనా దగ్గర రెండు విమాన వాహక నౌకలు, 355 యుద్ధ నౌకలు, 48 విధ్వంసక నౌకలు, 43 ఫ్రిజెట్లు, 61 కార్వెట్లున్నాయి. మూడో విమాన వాహక నౌక తయారీ కూడా మొదలైంది. మనకు మాత్రం ఇప్పటిదాకా విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య మాత్రమే ఉంది. 10 విధ్వంసక నౌకలు, 12 ఫ్రిగేట్లు, 20 కార్వెట్లున్నాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ రాకతో బంగాళాఖాతం, అరేబియా సముద్ర జలాలపై మన పట్టు మరింత బిగుస్తుంది. ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనే అత్యాధునిక వ్యవస్థ ఐఎన్ఎస్ విక్రాంత్ సొంతం. నౌక మోసుకుపోగలిగే ఆయుధ సంపత్తి ► 34 యుద్ధ విమానాలు (మిగ్–29కే యుద్ధ విమానాలు, కమోవ్–31 విమానాలు, ఏఎల్‌హెచ్ హెలికాప్టర్లు, ఎంహెచ్–60ఆర్సీ హాక్ మల్టీరోల్ హెలికాప్టర్లు) ► దేశీయంగా రూపొందించిన తేలికపాటి హెలికాప్టర్లు మరో యుద్ధనౌకను నిర్మించగలం విక్రాంత్ తయారీలో ప్రతి రోజూ ఉత్కంఠగానే గడిచింది. కరోనాతో కాస్త ఆలస్యమైనా అద్భుతంగా నిర్మించాం. మరో యుద్ధనౌకను కూడా నిర్మించగల సామర్థ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకున్నాం. విక్రాంత్ తయారీలో 76 శాతం స్వదేశీ పరిజ్ఞానమే. తర్వాతి క్యారియర్ నిర్మాణానికల్లా దీన్ని 85 శాతం వరకు పెంచుకోగలం. – మధునాయర్, కొచ్చి షిప్‌యార్డు సీఎండీ – సాక్షి, విశాఖపట్నం -
ప్రపంచ సంక్షేమానికే రక్షణ ఉత్పత్తులు
పటాన్చెరు: రక్షణ రంగంలో స్వయం ప్రతిపత్తి సాధించాలనే లక్ష్యంతో సాధిస్తున్న విజయాలు, మిస్సైళ్లు, ఇతర సాంకేతిక ఉత్పత్తులు వంటివి ఏ దేశాన్నో భయపెట్టేందుకు కాదని.. అవి కేవలం ప్రపంచ సంక్షేమానికేనని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం భానూర్‌లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ పరిశ్రమలో కొత్తగా ఏర్పాటు చేసిన వార్ హెడ్ తయారీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అక్కడి నుంచే వర్చువల్ పద్ధతిలో బీడీఎల్ కంచన్ బాగ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన రక్షణ రంగ సాంకేతికత ఆర్ఎఫ్ సీకర్ను.. ఏపీలోని వైజాగ్‌లో నెలకొల్పిన రక్షణ రంగం సెంట్రల్ స్టోర్స్‌ను, పశ్చిమ గోదావరిలోని మిలటరీ, మాధవరంలో బీడీఎల్ సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన స్కూల్, జిమ్, కమ్యూనిటీ భవనాలను ప్రారంభించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం దేశ రక్షణ రంగంలో ఎవరూ ఊహించని విధంగా గొప్ప సంస్కరణలు తీసుకువచ్చిందని.. అందులో అగ్నిపథ్ కూడా ఒకటని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ప్రపంచ దేశాల్లోని విధివిధానాలను అధ్యయనం చేశాకే అగ్నిపథ్‌ను ప్రవేశపెట్టామన్నారు. బీడీఎల్ పరిశోధనలు, యుద్ధ ట్యాంకుల తయారీ, సాంకేతికతలో రక్షణ రంగానికి తోడ్పాటునందిస్తున్న తీరు హర్షణీయమని చెప్పారు. శాస్త్రవేత్తలను, బీడీఎల్ ఉద్యోగుల పనితీరును అభినందించారు. రక్షణ రంగంలో పరిశోధనలు మరింత వేగవంతం కావాలన్నారు. కొత్త సాంకేతికతను అందిపుచ్చుకునే పరిశోధనలు జరగాలని.. ఇందుకోసం రక్షణ రంగ పరిశోధనలకు, విద్యా సంస్థల అనుసంధానం అవసరమని తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఐదు సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ ఎంటర్ప్రైజెస్ (సీపీఎస్ఈ) ఉండేవని.. ఇప్పుడు 250 సీపీఎస్ఈలు సుమారు రూ.2.50 లక్షల కోట్ల పెట్టుబడులతో కొనసాగుతున్నాయని రాజ్‌నాథ్ చెప్పారు. -
జలాంతర్గాముల సమాచారం లీకేజీ కేసులో ఇద్దరు నేవీ కమాండర్లపై సీబీఐ చార్జిషీట్
న్యూఢిల్లీ: జలాంతర్గాములకు సంబంధించిన రెండు వేర్వేరు ప్రాజెక్టుల్లో కీలకమైన సమాచారం లీకైన కేసులో సీబీఐ మంగళవారం రెండు చార్జిషీటుల్ని దాఖలు చేసింది. ఒక కేసులో ఇద్దరు నేవీ కమాండర్లపై అభియోగాలు నమోదు చేయగా, రెండో చార్జిషీటులో మరో నలుగురిపై అభియోగాల్ని మోపింది. రక్షణ రంగంలో అవినీతికి సంబంధించిన కేసుల్లో వాయువేగంతో సీబీఐ చార్జిషీటు నమోదు చేయడం ఇదే మొదటిసారి. సెప్టెంబర్ 3న తొలి అరెస్ట్ చేసిన సీబీఐ 60 రోజుల్లోనే చార్జిషీటు దాఖలు చేసింది. ఒక కేసులో నేవీ కమాండర్లు రణదీప్ సింగ్, ఎస్జే సింగ్‌లు ఉంటే మరో కేసులో హైదరాబాద్‌కు చెందిన అలెన్ రీన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ లిమిటెడ్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టి.పి. శాస్త్రి, డైరెక్టర్లు ఎన్బి రావు, కె.చంద్రశేఖర్‌లు నిందితులుగా ఉన్నారు. -
ఆర్మీ ఆధునీకరణకు రూ.13,165 కోట్లు
న్యూఢిల్లీ: భారత ఆర్మీ ఆధునీకరణ, సామర్థ్యం పెంపు కోసం అవసరమైన కొనుగోళ్లు చేయడానికి రూ. 13,165 కోట్ల కేటాయింపులకు రక్షణశాఖ బుధవారం ఆమోదముద్ర వేసింది. సైనిక అవసరాలతో పాటు ఆర్మీలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించే ఎఎల్‌హెచ్ మార్క్–3 హెలికాప్టర్లు 25 కొనుగోలు చేయనుంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) సంస్థ హెలికాఫ్టర్ల కోసం రూ. 3,850 కోట్లు, రాకెట్లు, ఇతర ఆయుధాల కోసం రూ.4,962 కోట్లు వ్యవయం అవుతుందని అంచనా వేసినట్టుగా రక్షణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. రూ.7,523 కోట్లతో అర్జున్ ట్యాంకులను కొనుగోలు చేయాలని నిర్ణయించిన కొద్ది రోజులకే హెలికాప్టర్ల కొనుగోలుకి రక్షణ శాఖ భారీగా కేటాయింపులు జరిపింది. డబుల్ ఇంజిన్‌తో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారయ్యే ఈ హెలికాప్టర్లు 5.5 టన్నుల బరువున్న కేటగిరీలోకి వస్తాయి. మొత్తమ్మీద భారత్ ఆర్మీ ఆధునీకరణ కోసం రూ.13,165 కోట్లు కేటాయింపులు జరిపితే, అందులో రూ.11,486 కోట్లు స్వదేశీ సంస్థలకే వెళతాయని ఆ ప్రకటన వివరించింది. -
రక్షణ రంగాన్ని మోదీ బలోపేతం చేశారు
డెహ్రాడూన్: రక్షణ రంగానికి సంబంధించి బడ్జెట్ కేటాయింపులను పెంచడం ద్వారా ప్రధాని మోదీ రక్షణ రంగాన్ని బలోపేతం చేశారని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం వ్యాఖ్యానిం చారు. ఉత్తరాఖండ్‌లోని రైవాలాలో మాజీ సైనికు లతో ఆయన చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ రక్షణ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యతను గుర్తుచేస్తూ ప్రధానిపై ప్రశంసలు కురిపించారు. 2011–12లో రూ. 1,45,000 కోట్లుగా ఉన్న రక్షణరంగ బడ్జెట్ నేడు రూ. 4,78,000 కోట్లకు చేరుకుందని అన్నారు. ప్రధాని మోదీ రక్షణ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యత ఏమిటో చెప్పడానికి ఈ అంకెలు చాలని పేర్కొన్నారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి శంకుస్థాపన చేసిన ప్రపంచ పొడవైన సొరంగ హైవే (9.02 కిమీ) మోదీ హయాంలో పూర్తయిందన్నారు. 10 వేల అడుగుల ఎత్తులో మనాలిని లేహ్‌తో కలుపుతున్న ఈ సొరంగ మార్గం యూపీఏ హయాంలో 10 ఏళ్ల పాటు స్తబ్ధుగా ఉండిపోయిందన్నారు. నిర్ణయాత్మ కతతో పాటు ముందుచూపు కలిగిన ప్రధాని మోదీ ఢిల్లీలోని వార్ మెమోరియల్ నిర్మాణాన్ని చేపట్టారని గుర్తు చేశారు. ఆర్మీలో ఒకే ర్యాంక్–ఒకే పెన్షన్ విధానాన్ని అమలు చేశారని చెప్పారు. నిర్ణయాలు తీసుకొనే అధికారా న్ని మోదీ సాయుధ బలగాలకు ఇచ్చారని చెప్పారు. పదేళ్ల క్రితం అలాంటి నిర్ణయాల కోసం ప్రభుత్వం చెప్పే వరకు బలగాలు వేచి ఉండాల్సి వచ్చేదన్నారు. -
డ్రోన్ విధ్వంసక వ్యవస్థ త్వరలోనే సైన్యానికి..
భారత సైన్యం, ఇతర భద్రతా దళాలకు డ్రోన్లను గుర్తించి ధ్వంసం చేసే వ్యవస్థ త్వరలోనే అందుబాటులోకి రానుంది. డ్రోన్లను గుర్తించడం, జామ్ చేయడం, ధ్వంసం చేయడం కోసం రూపొందించిన పరిజ్ఞానాన్ని విజయవంతంగా పరీక్షించి కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రదర్శించాం. ఈ పరిజ్ఞానాన్ని ఇప్పటికే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌కు అందించాం. మరికొన్ని పరిశ్రమలకు కూడా త్వరలో అందించి వాటి ద్వారా డ్రోన్ విధ్వంసక వ్యవస్థ ఉత్పత్తిని చేపడతాం. సాక్షి, అమరావతి: శత్రు దేశాలు, ఉగ్రవాద సంస్థలు, అసాంఘిక శక్తులు ప్రయోగించే డ్రోన్లను గుర్తించి ధ్వంసం చేసే పరిజ్ఞానాన్ని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) ఇప్పటికే విజయవంతంగా అభివృద్ధి చేసిందని సంస్థ చైర్మన్ జి. సతీశ్‌రెడ్డి వెల్లడించారు. రక్షణ రంగంలో భారత్ ప్రపంచంలోనే అగ్రరాజ్యాలకు దీటుగా అభివృద్ధి సాధిస్తోందని ఆయన చెప్పారు. భారత సైన్యం, ఇతర భద్రతా దళాలకు ఈ వ్యవస్థ త్వరలోనే అందుబాటులోకి వస్తుందన్నారు. విజయవాడలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ డ్రోన్ విధ్వంసక వ్యవస్థతోపాటు రక్షణ రంగంలో భారత్ ప్రపంచంలోనే బలమైన శక్తిగా ఎదుగుతున్న తీరును ఇలా వివరించారు.. ►డ్రోన్లను గుర్తించడం, జామ్ చేయడం, ధ్వంసం చేయడం కోసం రూపొందించిన పరిజ్ఞానాన్ని విజయవంతంగా పరీక్షించి కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రదర్శించాం. ►ఈ పరిజ్ఞానాన్ని ఇప్పటికే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌కు అందించాం. మరికొన్ని పరిశ్రమలకు కూడా త్వరలో అందించి వాటి ద్వారా డ్రోన్ విధ్వంసక వ్యవస్థ ఉత్పత్తిని చేపడతాం. ►టీటీడీతో సహా ఎవరైనా సరే ఆ పరిశ్రమల నుంచి డ్రోన్ విధ్వంసక టెక్నాలజీని కొనుగోలు చేసి అవసరమైనచోట్ల నెలకొల్పుకోవచ్చు. టాప్ ఫైవ్‌లో భారత్ ►రక్షణ రంగంలో భారతదేశం స్వయం సమృద్ధిని సాధించి ప్రపంచంలోనే మొదటి ఐదు అగ్రరాజ్యాల జాబితాలో స్థానం సాధించింది. ►బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ కలిగి ఉన్న నాలుగు దేశాల్లో భారత్ ఒకటి. ►అత్యాధునిక తేజస్ యుద్ధ విమానాలను రూపొందించిన ఆరు దేశాల్లో మన దేశం ఉంది. ►అణు ట్యాంకర్లు కలిగిన ఏడు దేశాల్లో భారత్ ఉంది. ►క్షిపణి విధ్వంసకర వ్యవస్థను అభివృద్ధి చేసిన ఆరు దేశాల్లో భారత్‌కు చోటు దక్కింది. ►ఉపగ్రహాలను న్యూట్రలైజ్ చేసి ధ్వంసం చేయగల సామర్థ్యం కలిగిన నాలుగు దేశాల్లో భారత్ కూడా ఉండటం గర్వకారణం. ►ప్రపంచంలోనే అత్యంత దూరంలోని అంటే 48 వేల కి.మీ. వరకు షెల్స్ ప్రయోగించే 155 ఎంఎం గన్ను రూపొందించాం. ►దేశంలో 2 వేల ప్రధాన పరిశ్రమలతోపాటు మొత్తం 11వేల పరిశ్రమలు రక్షణ ఉత్పత్తులను తయారుచేస్తున్నాయి. ►రాబోయే ఐదారేళ్లలో రక్షణ రంగంలో దిగుమతులను తగ్గించి ఎగుమతులను పెంచడం.. అగ్రరాజ్యాలకు దీటుగా నిలబడాలన్నదే ప్రస్తుత లక్ష్యం. ►కృష్ణాజిల్లాలోని నాగాయలంక క్షిపణి ప్రయోగ కేంద్రం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. కరోనా మూడో వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం దేశంలో కరోనా మూడో వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం, డీఆర్డీఓ పూర్తి సన్నద్ధంగా ఉన్నాయని సతీశ్‌రెడ్డి చెప్పారు. కృష్ణాజిల్లా రచయితల సంఘం ఆదివారం విజయవాడలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో సతీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ప్రతి జిల్లాలో రెండు ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పుతుండటంతోపాటు లిక్విడ్ ఆక్సిజన్ కూడా అందుబాటులో ఉంచేందుకు అవసరమైన ట్యాంకర్లను సిద్ధంచేస్తున్నట్లు చెప్పారు. కరోనాను అరికట్టేందుకు మొత్తం 75 రకాల ఉత్పత్తులను కనిపెట్టడంతోపాటు 190 రకాల పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశామని ఆయన చెప్పారు.