రక్షణ రంగంలో మన శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి ఘనంగా చాటే రోజు రానే వచ్చింది. ఇప్పటిదాకా మన దగ్గరున్న యుద్ధ నౌకలన్నీ బ్రిటన్, రష్యాల నుంచి దిగుమతి చేసుకున్నవే. అలాంటిది అగ్రదేశాలే ఆశ్చర్యపోయేలా అత్యాధునిక విమానవాహక యుద్ధనౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ విజయవంతంగా నిర్మించింది. ఈ సామర్థ్యమున్న అమెరికా, రష్యా, ఇంగ్లండ్, ఫ్రాన్స్ సరసన సగర్వంగా తలెత్తుకుని నిలిచింది. చైనాతో ఉద్రిక్తత నెలకొన్న వేళ ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతమిస్తూ నిర్మించిన ఈ బాహుబలి యుద్ధనౌకను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జాతికి అంకితం చేశారు. కొచ్చి తీరంలో నావికాదళానికి అప్పగించారు. ఇది 2023లో తూర్పు నౌకాదళ అమ్ములపొదిలో పూర్తిస్థాయిలో చేరే అవకాశముంది.
ఐఎన్‌ఎస్ విక్రాంత్. విజయానికి, శౌర్యానికి గుర్తు. మన దేశ గౌరవానికి ప్రతీక. మన తొలి విమాన వాహక నౌక. బ్రిటన్ నుంచి 1961లో కొనుగోలు చేసిన ఈ నౌక ఎన్నో యుద్ధాల్లో కీలకపాత్ర పోషించింది. మరపురాని విజయాలు అందించింది. 1997లో రిటైరైంది. ఇప్పుడు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి నౌక ఐఏసీ–1కు కూడా అదే పేరు పెట్టారు. నాటి విక్రాంత్ కంటే మెరుగైన సాంకేతికతతో రూపొందించిన ఈ బాహుబలి యుద్ధ నౌక భారత్ చేతిలో బ్రహ్మాస్త్రమే కానుంది.
అత్యాధునిక సాంకేతికత
విక్రాంత్ నిర్మాణంలో అత్యాధునిక సాంకేతికతను వాడారు. క్యారియర్ మెషినరీ ఆపరేషన్లు, షిప్ నేవిగేషన్, ఆటోమేటిక్ సర్వైబిలిటీ సిస్టం ఏర్పాటు చేశారు. మేజర్ మాడ్యులర్ ఓటీ, ఎమర్జెన్సీ మాడ్యులర్ ఓటీ, ఎల్‌ఎం 2500 గ్యాస్ టర్బైన్లు 4, ప్రధాన గేర్‌బాక్స్‌లు, షాఫ్టింగ్, పిచ్ ప్రొపైల్లర్ కంట్రోలర్స్, ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ సిస్టమ్, స్టీరింగ్ గేర్, ఎయిర్ కండిషనింగ్ ప్లాంట్లు, కంప్రెసర్లు, సెంట్రిఫ్యూజన్, 60 క్రిటికల్ పంప్స్, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలు, అగ్నిమాపక వ్యవస్థ తదితరాలున్నాయి. టేకాఫ్ సమయంలో ఎయిర్‌క్రాఫ్ట్‌కు అదనపు లిఫ్ట్ ఇచ్చే ఫ్లైట్ డెక్ స్కీ జంప్‌తో స్టోబార్ కాన్ఫిగరేషన్ ఏర్పాటు చేశారు. దాంతో అతి తక్కువ సమయంలో టేకాఫ్ వీలవుతుంది. ఏ భాగమైనా మొరాయించినా ఆ ప్రభావం మిగతా భాగాలపై పడదు. దాంతో ప్రయాణం నిరాటంకంగా సాగుతుంది.
550 సంస్థలు, 100 ఎంఎస్‌ఎంఈల భాగస్వామ్యం
కేరళలోని కొచ్చి షిప్‌యార్డ్‌లో 2005లో విక్రాంత్ నిర్మాణాన్ని ప్రారంభించారు. నేవీ అంతర్గతసంస్థ అయిన వార్ షిప్ డిజైన్ బ్యూరో (డబ్ల్యూడీబీ) దీన్ని రూపొందించింది. 2009 నుంచి మొదలైన పూర్తిస్థాయి నిర్మాణం 13 ఏళ్లలో పూర్తయింది. బీఈఎల్, భెల్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, జిందాల్, ఎస్‌ఆర్ గ్రూప్, మిథానీ, జీఆర్‌ఎస్‌ఈ, కెల్‌ట్రాన్, కిర్లోస్కర్, ఎల్ అండ్ టీ మొదలైన 550 దిగ్గజ పరిశ్రమలతో పాటు 100కు పైగా ఎంఎస్‌ఎంఈలు నిర్మాణంలో పాలుపంచుకున్నాయి. పరికరాలు, యంత్రాలన్నీ దాదాపుగా స్వదేశీ తయారీవే. 23 వేల టన్నుల ఉక్కు, 2,500 కి.మీ. ఎలక్ట్రిక్ కేబుల్స్, 150 కి.మీ. పైపులు, 2 వేల వాల్వులు, గ్యాలీ పరికరాలు, ఎయిర్ కండిషనింగ్, రిఫ్రిజిరేషన్ ప్లాంట్లు, స్టీరింగ్ గేర్స్ వంటివన్నీ స్వదేశీయంగా తయారు చేసినవే. కొన్ని భాగాలను మాత్రం రష్యా నుంచి దిగుమతి చేసుకున్నారు. రెండువేల మంది షిప్‌యార్డు అధికారులు, సిబ్బంది, 13 వేలమంది కార్మికులు, ఉద్యోగులు విక్రాంత్ నిర్మాణంలో భాగస్వాములు. నౌక నిర్మాణం జరిగిన 13 ఏళ్ల పాటు రోజూ 2 వేల మందికి ఉపాధి దొరికింది. పరోక్షంగా పలు తయారీ సంస్థల్లో 40 వేల మందికి ఉపాధి లభించింది. 42,8000 టన్నుల సామర్థ్యంతో రెండు టేకాఫ్ రన్‌వేలు, ఒక ల్యాండింగ్ స్ట్రిప్‌లతో క్షిపణి దాడిని తట్టుకునేలా నిర్మించారు. రూ.20 వేల కోట్లు ఖర్చయియింది. గత ఏడాది ట్రయల్స్ విజయవంతంగా ముగిశాయి.
గంటలో వెయ్యిమందికి చపాతీ, ఇడ్లీ రెడీ
ఈ నౌకలో మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ తరహా వైద్య సదుపాయాలున్నాయి. ఫిజియోథెరపీ క్లినిక్, ఐసీయూ, ల్యాబొరేటరీ, సీటీ స్కానర్, ఎక్స్‌రే మెషీన్లు, డెంటల్ కాంప్లెక్స్, ఐసోలేషన్ వార్డులతో కూడిన అత్యాధునిక మెడికల్ కాంప్లెక్స్ ఉంది. 16 బెడ్లు, రెండు ఆపరేషన్ థియేటర్లున్నాయి. ఐదుగురు మెడికల్ ఆఫీసర్లు, 17 మంది మెడికల్ సెయిలర్స్ ఉంటారు. ఇక దీని కిచెన్ కూడా అత్యాధునికమే. గంటలో ఏకంగా 1,000 మందికి చపాతీలు, ఇడ్లీలు తయారుచేసే ఆధునిక పరికరాలున్నాయి.
ఎందుకంత కీలకం?
రక్షణపరంగా, రవాణాపరంగా ఎంతో కీలకమైన హిందూ సముద్రంలో పైచేయి సాధించేందుకు ఐఎన్‌ఎస్ విక్రాంత్ మనకు బ్రహ్మాస్త్రంలా ఉపయోగపడనుంది. ఏ దేశానికైనా యుద్ధ విమానాలను మోసుకుపోగలిగే సామర్థ్యం కలిగిన నౌకలు ఉంటే నావికాశక్తి పటిష్టంగా ఉంటుంది. దీంతో సముద్ర జలాల్లోనూ, గగన తలంపై కూడా పట్టు సాధించగలం. చైనా దగ్గర రెండు విమాన వాహక నౌకలు, 355 యుద్ధ నౌకలు, 48 విధ్వంసక నౌకలు, 43 ఫ్రిజెట్లు, 61 కార్వెట్లున్నాయి. మూడో విమాన వాహక నౌక తయారీ కూడా మొదలైంది. మనకు మాత్రం ఇప్పటిదాకా విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య మాత్రమే ఉంది. 10 విధ్వంసక నౌకలు, 12 ఫ్రిగేట్లు, 20 కార్వెట్లున్నాయి. ఐఎన్‌ఎస్ విక్రాంత్ రాకతో బంగాళాఖాతం, అరేబియా సముద్ర జలాలపై మన పట్టు మరింత బిగుస్తుంది. ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనే అత్యాధునిక వ్యవస్థ ఐఎన్‌ఎస్ విక్రాంత్ సొంతం.
నౌక మోసుకుపోగలిగే ఆయుధ సంపత్తి
► 34 యుద్ధ విమానాలు (మిగ్–29కే యుద్ధ విమానాలు, కమోవ్–31 విమానాలు, ఏఎల్‌హెచ్ హెలికాప్టర్లు, ఎంహెచ్–60ఆర్‌సీ హాక్ మల్టీరోల్ హెలికాప్టర్లు)
► దేశీయంగా రూపొందించిన తేలికపాటి హెలికాప్టర్లు
మరో యుద్ధనౌకను నిర్మించగలం
విక్రాంత్ తయారీలో ప్రతి రోజూ ఉత్కంఠగానే గడిచింది. కరోనాతో కాస్త ఆలస్యమైనా అద్భుతంగా నిర్మించాం. మరో యుద్ధనౌకను కూడా నిర్మించగల సామర్థ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకున్నాం. విక్రాంత్ తయారీలో 76 శాతం స్వదేశీ పరిజ్ఞానమే. తర్వాతి క్యారియర్ నిర్మాణానికల్లా దీన్ని 85 శాతం వరకు పెంచుకోగలం.
– మధునాయర్, కొచ్చి షిప్‌యార్డు సీఎండీ
– సాక్షి, విశాఖపట్నం
Comments
Please login to add a commentAdd a comment