Indigenous Technology
-
DRDO: స్వదేశీ క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
భువనేశ్వర్(ఒడిశా): దేశీయంగా అభివృద్ధి చేసిన ఇండిజినస్ టెక్నాలజీ క్రూయిజ్ మిస్సైల్(ఐటీసీఎం)ను గురువారం ఒడిశా తీరంలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి విజయవంతంగా పరీక్షించారు. ఇందులో ఉపవ్యవస్థలను అంచనాల మేరకు పనిచేశాయని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) తెలిపింది. క్షిపణి ప్రయాణ మార్గంలో ఏర్పాటు చేసిన రాడార్, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్, టెలిమెట్రీ వంటి సెన్సార్ల ద్వారా పనితీరును అంచనా వేసినట్లు పేర్కొంది. దీంతోపాటు, వాయుసేనకు చెందిన ఎస్‌యూ–30 ఎంకే–ఐ విమానం ద్వారా కూడా క్షిపణి ప్రయాణం తీరును అంచనా వేసినట్లు డీఆర్డీవో వివరించింది. -
బాహుబలి నౌక ఐఎన్ఎస్ విక్రాంత్.. ఏకంగా 14 అంతస్తులు, 2,300 కంపార్ట్మెంట్లు
రక్షణ రంగంలో మన శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి ఘనంగా చాటే రోజు రానే వచ్చింది. ఇప్పటిదాకా మన దగ్గరున్న యుద్ధ నౌకలన్నీ బ్రిటన్, రష్యాల నుంచి దిగుమతి చేసుకున్నవే. అలాంటిది అగ్రదేశాలే ఆశ్చర్యపోయేలా అత్యాధునిక విమానవాహక యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ విజయవంతంగా నిర్మించింది. ఈ సామర్థ్యమున్న అమెరికా, రష్యా, ఇంగ్లండ్, ఫ్రాన్స్ సరసన సగర్వంగా తలెత్తుకుని నిలిచింది. చైనాతో ఉద్రిక్తత నెలకొన్న వేళ ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతమిస్తూ నిర్మించిన ఈ బాహుబలి యుద్ధనౌకను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జాతికి అంకితం చేశారు. కొచ్చి తీరంలో నావికాదళానికి అప్పగించారు. ఇది 2023లో తూర్పు నౌకాదళ అమ్ములపొదిలో పూర్తిస్థాయిలో చేరే అవకాశముంది. ఐఎన్ఎస్ విక్రాంత్. విజయానికి, శౌర్యానికి గుర్తు. మన దేశ గౌరవానికి ప్రతీక. మన తొలి విమాన వాహక నౌక. బ్రిటన్ నుంచి 1961లో కొనుగోలు చేసిన ఈ నౌక ఎన్నో యుద్ధాల్లో కీలకపాత్ర పోషించింది. మరపురాని విజయాలు అందించింది. 1997లో రిటైరైంది. ఇప్పుడు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి నౌక ఐఏసీ–1కు కూడా అదే పేరు పెట్టారు. నాటి విక్రాంత్ కంటే మెరుగైన సాంకేతికతతో రూపొందించిన ఈ బాహుబలి యుద్ధ నౌక భారత్ చేతిలో బ్రహ్మాస్త్రమే కానుంది. అత్యాధునిక సాంకేతికత విక్రాంత్ నిర్మాణంలో అత్యాధునిక సాంకేతికతను వాడారు. క్యారియర్ మెషినరీ ఆపరేషన్లు, షిప్ నేవిగేషన్, ఆటోమేటిక్ సర్వైబిలిటీ సిస్టం ఏర్పాటు చేశారు. మేజర్ మాడ్యులర్ ఓటీ, ఎమర్జెన్సీ మాడ్యులర్ ఓటీ, ఎల్ఎం 2500 గ్యాస్ టర్బైన్లు 4, ప్రధాన గేర్‌బాక్స్‌లు, షాఫ్టింగ్, పిచ్ ప్రొపైల్లర్ కంట్రోలర్స్, ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ సిస్టమ్, స్టీరింగ్ గేర్, ఎయిర్ కండిషనింగ్ ప్లాంట్లు, కంప్రెసర్లు, సెంట్రిఫ్యూజన్, 60 క్రిటికల్ పంప్స్, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలు, అగ్నిమాపక వ్యవస్థ తదితరాలున్నాయి. టేకాఫ్ సమయంలో ఎయిర్‌క్రాఫ్ట్‌కు అదనపు లిఫ్ట్ ఇచ్చే ఫ్లైట్ డెక్ స్కీ జంప్‌తో స్టోబార్ కాన్ఫిగరేషన్ ఏర్పాటు చేశారు. దాంతో అతి తక్కువ సమయంలో టేకాఫ్ వీలవుతుంది. ఏ భాగమైనా మొరాయించినా ఆ ప్రభావం మిగతా భాగాలపై పడదు. దాంతో ప్రయాణం నిరాటంకంగా సాగుతుంది. 550 సంస్థలు, 100 ఎంఎస్ఎంఈల భాగస్వామ్యం కేరళలోని కొచ్చి షిప్‌యార్డ్‌లో 2005లో విక్రాంత్ నిర్మాణాన్ని ప్రారంభించారు. నేవీ అంతర్గతసంస్థ అయిన వార్ షిప్ డిజైన్ బ్యూరో (డబ్ల్యూడీబీ) దీన్ని రూపొందించింది. 2009 నుంచి మొదలైన పూర్తిస్థాయి నిర్మాణం 13 ఏళ్లలో పూర్తయింది. బీఈఎల్, భెల్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, జిందాల్, ఎస్ఆర్ గ్రూప్, మిథానీ, జీఆర్ఎస్ఈ, కెల్ట్రాన్, కిర్లోస్కర్, ఎల్ అండ్ టీ మొదలైన 550 దిగ్గజ పరిశ్రమలతో పాటు 100కు పైగా ఎంఎస్ఎంఈలు నిర్మాణంలో పాలుపంచుకున్నాయి. పరికరాలు, యంత్రాలన్నీ దాదాపుగా స్వదేశీ తయారీవే. 23 వేల టన్నుల ఉక్కు, 2,500 కి.మీ. ఎలక్ట్రిక్ కేబుల్స్, 150 కి.మీ. పైపులు, 2 వేల వాల్వులు, గ్యాలీ పరికరాలు, ఎయిర్ కండిషనింగ్, రిఫ్రిజిరేషన్ ప్లాంట్లు, స్టీరింగ్ గేర్స్ వంటివన్నీ స్వదేశీయంగా తయారు చేసినవే. కొన్ని భాగాలను మాత్రం రష్యా నుంచి దిగుమతి చేసుకున్నారు. రెండువేల మంది షిప్‌యార్డు అధికారులు, సిబ్బంది, 13 వేలమంది కార్మికులు, ఉద్యోగులు విక్రాంత్ నిర్మాణంలో భాగస్వాములు. నౌక నిర్మాణం జరిగిన 13 ఏళ్ల పాటు రోజూ 2 వేల మందికి ఉపాధి దొరికింది. పరోక్షంగా పలు తయారీ సంస్థల్లో 40 వేల మందికి ఉపాధి లభించింది. 42,8000 టన్నుల సామర్థ్యంతో రెండు టేకాఫ్ రన్వేలు, ఒక ల్యాండింగ్ స్ట్రిప్‌లతో క్షిపణి దాడిని తట్టుకునేలా నిర్మించారు. రూ.20 వేల కోట్లు ఖర్చయియింది. గత ఏడాది ట్రయల్స్ విజయవంతంగా ముగిశాయి. గంటలో వెయ్యిమందికి చపాతీ, ఇడ్లీ రెడీ ఈ నౌకలో మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ తరహా వైద్య సదుపాయాలున్నాయి. ఫిజియోథెరపీ క్లినిక్, ఐసీయూ, ల్యాబొరేటరీ, సీటీ స్కానర్, ఎక్స్‌రే మెషీన్లు, డెంటల్ కాంప్లెక్స్, ఐసోలేషన్ వార్డులతో కూడిన అత్యాధునిక మెడికల్ కాంప్లెక్స్ ఉంది. 16 బెడ్లు, రెండు ఆపరేషన్ థియేటర్లున్నాయి. ఐదుగురు మెడికల్ ఆఫీసర్లు, 17 మంది మెడికల్ సెయిలర్స్ ఉంటారు. ఇక దీని కిచెన్ కూడా అత్యాధునికమే. గంటలో ఏకంగా 1,000 మందికి చపాతీలు, ఇడ్లీలు తయారుచేసే ఆధునిక పరికరాలున్నాయి. ఎందుకంత కీలకం? రక్షణపరంగా, రవాణాపరంగా ఎంతో కీలకమైన హిందూ సముద్రంలో పైచేయి సాధించేందుకు ఐఎన్ఎస్ విక్రాంత్ మనకు బ్రహ్మాస్త్రంలా ఉపయోగపడనుంది. ఏ దేశానికైనా యుద్ధ విమానాలను మోసుకుపోగలిగే సామర్థ్యం కలిగిన నౌకలు ఉంటే నావికాశక్తి పటిష్టంగా ఉంటుంది. దీంతో సముద్ర జలాల్లోనూ, గగన తలంపై కూడా పట్టు సాధించగలం. చైనా దగ్గర రెండు విమాన వాహక నౌకలు, 355 యుద్ధ నౌకలు, 48 విధ్వంసక నౌకలు, 43 ఫ్రిజెట్లు, 61 కార్వెట్లున్నాయి. మూడో విమాన వాహక నౌక తయారీ కూడా మొదలైంది. మనకు మాత్రం ఇప్పటిదాకా విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య మాత్రమే ఉంది. 10 విధ్వంసక నౌకలు, 12 ఫ్రిగేట్లు, 20 కార్వెట్లున్నాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ రాకతో బంగాళాఖాతం, అరేబియా సముద్ర జలాలపై మన పట్టు మరింత బిగుస్తుంది. ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనే అత్యాధునిక వ్యవస్థ ఐఎన్ఎస్ విక్రాంత్ సొంతం. నౌక మోసుకుపోగలిగే ఆయుధ సంపత్తి ► 34 యుద్ధ విమానాలు (మిగ్–29కే యుద్ధ విమానాలు, కమోవ్–31 విమానాలు, ఏఎల్‌హెచ్ హెలికాప్టర్లు, ఎంహెచ్–60ఆర్సీ హాక్ మల్టీరోల్ హెలికాప్టర్లు) ► దేశీయంగా రూపొందించిన తేలికపాటి హెలికాప్టర్లు మరో యుద్ధనౌకను నిర్మించగలం విక్రాంత్ తయారీలో ప్రతి రోజూ ఉత్కంఠగానే గడిచింది. కరోనాతో కాస్త ఆలస్యమైనా అద్భుతంగా నిర్మించాం. మరో యుద్ధనౌకను కూడా నిర్మించగల సామర్థ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకున్నాం. విక్రాంత్ తయారీలో 76 శాతం స్వదేశీ పరిజ్ఞానమే. తర్వాతి క్యారియర్ నిర్మాణానికల్లా దీన్ని 85 శాతం వరకు పెంచుకోగలం. – మధునాయర్, కొచ్చి షిప్‌యార్డు సీఎండీ – సాక్షి, విశాఖపట్నం -
బడ్జెట్ ధరలో.. ఇన్‌బిల్ట్ సబ్ వూఫర్స్‌తో మివి సౌండ్‌బార్
భారతదేశపు మొట్ట మొదటి దేశీ సౌండ్ బార్స్ ఫోర్ట్ ఎస్60, ఫోర్ట్ ఎస్100లను మివి సంస్థ లాంఛ్ చేసింది. మివికి చెందిన ఇంజినీర్లు, ఆడియో నిపుణులు ఎన్నో నెలల పాటు శ్రమించి భారతీయ వినియోగ దారుల అభిరుచులకు తగ్గట్టుగా సౌండ్బార్లను మార్కెట్లోకి తెచ్చారు. ఇండియాలో పరిమితంగా ఉండే ఇంటి స్థలం, బాస్‌పై ఉండే మక్కువను దృష్టిలో ఉంచుకుని సౌండ్బార్లోనే ఇన్‌బిల్ట్‌గా సబ్వూఫర్స్ను డిజైన్ చేశారు. ఈ రెండు సౌండ్బార్లు కూడా మివికి చెందిన హైదరాబాద్ తయారీ కేంద్రంలో రూపుదిద్దుకున్నాయి. మివి ఫోర్ట్ ఎస్ 60, ఫోర్ట్ ఎస్100 లను ఎక్స్ క్లూజివ్గా ఫ్లిప్ కార్ట్‌తో పాటు మివి వెబ్సైట్లో అమ్మకానికి ఉంచారు. వీటి ధరలు వరుసగా రూ.3,499, రూ.4,999లుగా ఉన్నాయి. ఇండియాలో సంగీతాభిమానులు భారీగా ఉన్నారు. అయితే స్థానిక పరిస్థితులు, ఇక్కడి అభిరుచికి తగ్గట్టుగా సౌండ్ సిస్టమ్స్ రావడం లేదు. దిగుమతి అవుతున్న సౌండ్ సిస్టమ్స్ అన్నీ వెస్ట్రన్ స్టైల్‌కి తగ్గట్టుగుఆ ఉంటున్నాయి. అందుకే మన వాళ్లకి తగ్గట్టుగా కొత్త సౌండ్ బార్స్‌ని అందుబాటులోకి తెచ్చినట్టు మివి సహవ్యవస్థాపకులు, సీఎంఓ మిదుల దేవభక్తుని తెలిపారు. ఫీచర్స్ - 2.2 చానల్ సరౌండ్ – సౌండ్ అనుభూతి - వీడియో, గేమ్స్‌కి తగ్గట్టుగా సంగీతం - స్లిమ్ అండ్ స్లీక్ వాల్మౌంటెండ్ డిజైన్ - బ్లూ టూత్, ఎయూఎక్స్, కోయాక్సియల్, యూఎస్బీ - ప్లగ్ అండ్ ప్లే ఆపరేటింగ్ - మ్యూజిక్, మూవీ, న్యూస్ మోడ్ ఆప్షన్లు -
స్వదేశీ హైస్పీడ్ డ్రోన్
సాక్షి, హైదరాబాద్: స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన వినూత్నమైన డ్రోన్.. ‘ఎయిర్‌బార్న్ మెడికల్ రాపిడ్ ట్రాన్స్పోర్ట్–25 (ఏఎంఆర్‌టీ25)’ను విజయవంతంగా పరీక్షించిన ట్టు టీవర్క్స్ గురువారం ప్రకటించింది. ఈ డ్రోన్ నిలువుగా పైకి ఎగిరి, వేగంగా ప్రయాణించి, మళ్లీ నిలువుగా (వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్– వీటీఓఎల్) కిందికి దిగుతుందని వెల్లడించింది. దేశంలో ఇలాంటి హైబ్రిడ్ డ్రోన్లను రూపొందించి, తయారు చేసి, పరీక్షించగలిగే అతికొద్ది సంస్థల జాబితాలో ‘టీవర్క్స్’ కూడా చేరినట్టు తెలిపింది. ఈ డ్రోన్‌లో ప్రధాన ఫ్రేమ్‌తోపాటు ఇతర విడిభాగాలన్నింటినీ టీవర్క్స్లోనే తయారుచేశామని వివరించింది. హైదరాబాద్‌లోని బేగంపేటలో ఉన్న తమ కేంద్రంలో సాఫ్ట్వేర్ డిజైన్ టూల్స్, 3డీ ప్రింటింగ్, లేజర్ కట్టింగ్, కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ (సీఎన్సీ) రూటర్ పరికరాలు ఉన్నాయని.. వాటి సాయంతో విడిభాగాలను రూపొందించామని పేర్కొంది. 30 సార్లు విజయవంతంగా..:ఏఎంఆర్‌టీ25ని ఇప్పటివరకు 30 సార్లు విజయవంతంగా పరీక్షించామని.. గరిష్ట దూరం, సామర్థ్యం, నిర్దేశిత గమ్యాన్ని చేరుకోవడం, ప్రయోగించిన చోటికి తిరిగి రావడం వంటి అంశాల్లో సంతృప్తికరమైన ఫలితాలు సాధించిందని టీవర్క్స్ వెల్లడించింది. ఈ డ్రోన్ 33 నిమిషాల వ్యవధిలో 45 కిలోమీటర్ల దూరం ప్ర యాణించి, సురక్షితంగా ల్యాండ్ అయిందని వివరించింది. ఈ దూరాన్ని, బరువు మోసుకెళ్లే సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్టు పేర్కొంది. తాము రూపొందించిన డ్రోన్.. సాధారణ డ్రోన్లతో పోలిస్తే కేవలం పావు వంతు ఇంధనాన్ని మాత్రమే ఉపయోగించుకుంటుందని, ఎక్కువ బరువును, ఎక్కువ దూరం మోసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉందని వెల్లడించింది. రకరకాల డ్రోన్లను తయారు చేసేందుకు అవసరమైన విడిభాగాలను ఇప్పటికే తమ ‘ప్రోటో టీవర్క్స్’ విభాగం ద్వారా అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపింది. ‘మెడిసిన్ ఫ్రం స్కై’ స్ఫూర్తితో.. :కరోనా పరిస్థితుల నేపథ్యంలో గత ఏడాది తెలంగాణ ప్రభుత్వం, వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఉమ్మడిగా ‘మెడిసిన్ ఫ్రం స్కై’ కార్యక్రమాన్ని ప్రకటించాయి. డ్రోన్ల ద్వారా ఔషధాలను తరలించాలని నిర్ణయించాయి. ఈ ఏడాది జూన్‌లో భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వేగంగా, సురక్షితంగా, అన్ని ప్రాంతాలకు వ్యాక్సిన్లు, మందులను సరఫరా చేసే డ్రోన్ల కోసం టెండర్లను ఆహ్వానించింది. ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకున్న టీవర్క్స్.. అడవులు, కొండ ప్రాంతాలు, మారుమూల గ్రామీణ ప్రాంతాలకు వెళ్లగలిగే డ్రోన్ల రూపకల్పనపై దృష్టిపెట్టింది. ఎక్కడైనా టేకాఫ్/ల్యాండింగ్ అయ్యేలా హెలికాప్టర్ తరహా రోటార్లను.. వేగంగా ప్రయాణించేందుకు వీ లుగా విమానాల వంటి రెక్కలు, ముందు భాగంలో ప్రొపెల్లర్ ఫ్యాన్‌ను అమర్చి ఈ డ్రోన్‌ను రూపొందించింది. మరింత మెరుగైన యూఏవీ తయారుచేస్తాం తక్కువ ఎత్తులో, తక్కువ దూరం ప్రయాణించే మల్టీరోటార్ (బహుళ రెక్కల) డ్రోన్లను ప్రస్తుతం ఫుడ్ డెలివరీ, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీలలో ఉపయోగిస్తున్నారు. ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం ఉండే కొన్ని మల్టీరోటార్ డ్రోన్లు 40 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలవు. కానీ ఎక్కువగా అందుబాటులో ఉన్న సాధారణ డ్రోన్లకు 20– 25 కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యం ఉంటుంది. వాటికి తరచూ బ్యాటరీలను మార్చడమో, రీచార్జి చేయడమో తప్పనిసరి. అదే ‘టీవర్క్స్’ రూపొందించిన యూఏవీకి ఎక్కువ దూరం వేగంగా ప్రయాణించే సామర్థ్యం ఉంది. దీనిని మరింతగా మెరుగుపర్చే పనిలో ఉన్నాం. త్వరలో వంద కిలోమీటర్లకు పైగా దూరాన్ని చేరుకునేలా రూపొందిస్తాం. ఈ యూఏవీ తయారీకి అనుసరించిన సాంకేతికత, ఇతర అంశాలన్నింటినీ టీవర్క్స్ వెబ్సైట్లో పొందుపర్చాం. ఆసక్తి ఉన్న ఔత్సాహికులతో మా విజ్ఞానాన్ని పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. యూఏవీల తయారీలో ఆసక్తి ఉన్న ముందుకు రావాలి. – సుజయ్ కారంపురి, టీవర్క్స్ సీఈవో ఏఎంఆర్‌టీ25 ప్రత్యేకతలివీ.. ►ఉన్నది ఉన్నట్టుగా పైకి ఎగిరి, అదే తరహాలో కిందికి దిగుతుంది. టేకాఫ్, ల్యాండింగ్ కోసం కేవలం ఐదు మీటర్లు పొడవు, 5 మీటర్లు వెడల్పు ఉన్న స్థలం సరిపోతుంది. ►గాల్లోకి ఎగిరిన తర్వాత విమానం తరహాలో వేగంగా ముందుకు దూసుకెళ్తుంది. సుమారు 80–90 మీటర్ల ఎత్తులో.. గంటకు 100 కిలోమీటర్లకుపైగా వేగంతో వెళ్లగలదు. ►నిలువుగా గాల్లోకి ఎగరడం (వీటీఓఎల్) కోసం నాలుగు రోటార్లు, ముందుకు దూసుకెళ్లడానికి ప్రొపెల్లర్ ఉన్నాయి. ►4 వీటీఓఎల్ రోటార్లకు 10వేల మిల్లీఆంపియర్హవర్ (ఎంఏహెచ్) బ్యాటరీని అనుసంధానం చేశారు. ►ముందుకు దూసుకెళ్లే ప్రొపెల్లర్ కోసం 30 సీసీ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్‌ను అమర్చారు. ►విమానం తరహాలో ఉండే రెక్కల వెడల్పు 2.5 మీటర్లు (రెండు వైపులా కలిపి..) ►ఈ డ్రోన్లోని అల్యూమినియం ప్రధాన ఫ్రేమ్‌తోపాటు కలప, ప్లైవుడ్, కార్బన్ ఫైబర్ విడిభాగాలను ‘టీవర్క్స్’లోనే త్రీడీ ప్రింటింగ్ సాంకేతికతతో తయారు చేశారు. ►ప్రస్తుతం ఔషధాల సరఫరాకు వినియోగించినా.. ఏరియల్ సర్వే, తనిఖీలు, నిఘా, రక్షణ రంగ అవసరాల కోసం వీటిని ఉపయోగించవచ్చు. ►ఏఎంఆర్‌టీ25 కిలో నుంచి కిలోన్నర బరువు మోసుకుని.. గరిష్టంగా 45–50 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ►వంద కిలోమీటర్ల దూరం, 3.5 కిలోల బరువు మోసుకెళ్లేలా ఈ డ్రోన్ కొత్త మోడల్‌ను తయారు చేస్తున్నారు. -
మొట్టమొదటి స్వదేశీ వీల్‌చైర్ వెహికల్
న్యూఢిల్లీ: దేశంలోనే మొట్టమొదటి స్వదేశీ వీల్‌చైర్ వెహికల్‌ను తయారు చేసినట్లు ఐఐటీ(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నా లజీ) మద్రాస్ పరిశోధకులు ప్రక టించారు. ఈ వాహనం రోడ్లపైనే కాదు, ఇతర అనను కూల ప్రాంతాల్లోనూ ఉపయో గపడు తుందని చెప్పారు. ‘నియోబోల్ట్ అనే పేరు న్న ఈ వాహనంలో వాడే లిథియం– అయాన్ బేటరీని ఒక్కసారి ఛార్జి చేస్తే 25 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. వీల్‌చైర్ వాడే వారికి ఇది ఎంతో సౌకర్యం, సురక్షితం. ఆటో, స్కూటర్, కారు కంటే దీనికయ్యే ఖర్చు తక్కువ’అని వారన్నారు. ఐఐటీ మద్రాస్ లోని సెంటర్ ఫర్ రిహాబిలిటేషన్ రీసెర్చ్ అండ్ డివైజ్ డెవలప్మెంట్ విభాగం ‘నియో మోషన్’ అనే స్టార్టప్‌తో వాణిజ్య స్థాయిలో ఉత్పత్తికి సన్నాహాలు ప్రారంభిం చిందన్నారు. ఈ వీల్ చైర్ సుమారుగా రూ.55 వేలకే అందుబాటులోకి వచ్చే అవకా శం ఉందని ఐఐటీ మద్రాస్ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన సుజాతా శ్రీనివాసన్ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో నియోబోల్ట్ మాదిరి విశిష్టలతో కూడిన వాహనాల ధరలు మూడు నుంచి ఐదు రెట్లు ఎక్కువగా ఉన్నాయన్నారు. దేశంలో ఏటా అమ్ముడయ్యే దాదాపు 3 లక్షల వీల్ చైర్లలో 2.5 లక్షల వీల్ చైర్లు విదేశాల్లో తయారైనవేనని చెప్పారు. -
‘విక్రాంత్’ వచ్చేస్తోంది
స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన విమాన వాహక యుద్ధ నౌక విక్రాంత్ (ఐఏసీ) సేవలందించేందుకు సిద్ధమవుతోంది. బుధవారం నిర్వహించిన సీట్రయల్స్ విజయవంతం కావడంతో.. విమాన వాహక యుద్ధ నౌకలు తయారు చేసిన అమెరికా, రష్యా, ఇంగ్లండ్, ఫ్రాన్స్ దేశాల సరసన భారత్ నిలిచింది. 40 వేల టన్నుల బరువైన విక్రాంత్‌లో రెండు టేకాఫ్ రన్వేలు, ఒక ల్యాండింగ్ స్ట్రిప్ ఏర్పాటు చేశారు. అన్ని హంగులూ పూర్తి చేసుకొని 2022 మార్చినాటికల్లా తూర్పు నౌకాదళం కేంద్రంగా విక్రాంత్ సేవలందించనుంది. సాక్షి, విశాఖపట్నం: రక్షణ రంగంలో అగ్రశ్రేణి దేశాల సరసన నిలిచిన భారత్.. యుద్ధ విమాన వాహక యుద్ధ నౌకల విషయంలో వెనకబడి ఉందన్న గీతని చెరిపేసేలా ఐఏసీ విక్రాంత్ పూర్తిస్థాయిలో సిద్ధమైంది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో భారత నౌకాదళంలో యుద్ధ విమానాల కోసం రూపొందించిన మొట్టమొదటి విక్రాంత్ క్లాస్ నౌక ఇది. 1997లో విక్రాంత్ సేవల నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు అదే పేరుతో స్వదేశీ పరిజ్ఞానంతో ఆత్మనిర్భర్ భారత్ పేరుతో విక్రాంత్ యుద్ధ విమాన వాహక నౌక సన్నద్ధమైంది. విక్రాంత్ నిర్మాణం పదేళ్ల కిందటే ప్రారంభమైంది. పూర్తిస్థాయి భారతీయ పరిజ్ఞానంతో నిర్మిస్తున్న ఈ యుద్ధ నౌకలో అత్యంత ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. 1999లో ఇండియన్ నేవీకి చెందిన డైరెక్టర్ ఆఫ్ నేవల్ డిజైన్ సంస్థ నౌక డిజైన్ మొదలు పెట్టగా.. కొచ్చి షిప్‌యార్డులో 2009లోనే కీలక భాగాల్ని పూర్తి చేశారు. 2011లో డ్రైడాక్ నుంచి విక్రాంత్‌ని బయటికి తీసుకొచ్చారు. 2015 జూన్ 10న కొచ్చిలో జల ప్రవేశం చేసింది. ఏడాది క్రితం బేసిన్ ట్రయల్స్ పూర్తి చేశారు. తొలిసారిగా సముద్ర విహారం ఓడ నిర్మాణం పూర్తయిన తర్వాత మొదటిసారిగా విక్రాంత్ సీట్రయల్ నిర్వహణ కోసం బుధవారం సముద్రంలోకి తీసుకొచ్చారు. 2 నాటికల్ మైళ్లు ప్రయాణించింది. సముద్రంలో మొదటి ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఎల్ఎం 2500 గ్యాస్ టర్బైన్లు 4, ప్రధాన గేర్ బాక్స్‌లు, షాఫ్టింగ్, పిచ్ ప్రొపైల్లర్ కంట్రోలర్స్, ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ సిస్టమ్, సెంట్రిఫ్యూజన్, 60 క్రిటికల్ పంప్స్, విద్యుత్ ఉత్పత్తి, అంతర్గత కమ్యూనికేషన్ పరికరాలను ఈ ట్రయల్‌రన్‌లో పరిశీలించారు. చరిత్రాత్మక ఘటనగా భారత నావికాదళం అభివర్ణన న్యూఢిల్లీ: భారత్‌లో నిర్మించిన తొలి యుద్దవిమాన వాహక నౌక (ఇండిజినస్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్–ఐఏసీ) విక్రాంత్.. సామర్థ్య పరీక్షలు మొదలయ్యాయి. సముద్రంలో ఐఏసీ విక్రాంత్ ట్రయల్స్ ప్రారంభమవడం చరిత్రాత్మకమని భారత నేవీ బుధవారం వ్యాఖ్యానించింది. సొంతంగా యుద్ధవిమాన వాహక నౌకను డిజైన్ చేసి, నౌకను నిర్మించి, సైన్యంలోకి తీసుకునే సత్తా ఉన్న అతికొద్ది దేశాల సరసన భారత్ సగర్వంగా నిలిచిందని నేవీ ప్రకటించింది. భారీ యుద్ధనౌకకు 50 ఏళ్ల క్రితం 1971లో పాకిస్తాన్‌తో పోరులో అద్భుత సేవలందించిన విక్రాంత్ నౌక పేరునే పెట్టారు. ఈ నౌక అన్ని స్థాయిల్లో సామర్థ్య పరీక్షలను విజయవంతంగా పూర్తిచేసుకున్నాక వచ్చే ఏడాదిలో భారత నావికాదళంలో చేరనుంది. భారత్‌లో నిర్మించిన అతి పెద్ద, అనేక ప్రత్యేకతలున్న యుద్ధనౌక ఇదేనని నేవీ అధికార ప్రతినిధి కమాండర్ వివేక్ మథ్వాల్ చెప్పారు. యుద్ధవిమానాల మోహరింపులో ఐఎన్ఎస్ విక్రమాదిత్య మాత్రమే అవసరాలను తీరుస్తోంది. కీలక బాధ్యతలు నిర్వర్తించనున్న విక్రాంత్ రక్షణపరంగా, రవాణా పరంగా ఎంతో కీలకమైన హిందూ సముద్రంలో ఆధిపత్యం కోసం మనదేశంతో పాటు చైనా, అమెరికా మొదలైన దేశాలన్నీ విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో పైచేయి సాధించేందుకు భారత్ సిద్ధం చేసిన బ్రహ్మాస్త్రమే ఐఏసీ విక్రాంత్. విక్రాంత్ రాకతో రక్షణ పరంగా దుర్భేద్యంగా నిలవనుంది. విక్రాంత్ సేవలు వచ్చే ఏడాది నుంచి మొదలు కానున్నాయని ఆశిస్తున్నాం. పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన విక్రాంత్ కోసం దేశమంతా ఎదురు చూస్తోంది. – వైస్ అడ్మిరల్ అజేంద్ర బహుద్దూర్ సింగ్, తూర్పు నౌకాదళాధిపతి -
డీఆర్డీవో శానిటైజర్లు
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్‌పై యుద్ధంలో డీఆర్డీవో మరో ముందడుగు వేసింది. వేర్వేరు ఉపరితలాల నుంచి వైరస్‌లను తొలగించేందుకు పూర్తి స్వదేశీ టెక్నాలజీతో శానిటైజింగ్ యంత్రాలను అభివృద్ధి చేసింది. ఢిల్లీలోని డీఆర్డీవో సంస్థ ‘ద సెంటర్ ఫర్ ఫైర్ ఎక్స్‌ప్లోజివ్ మేనేజ్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ సేఫ్టీ (సీఎఫ్ఈఈఎస్)’అభివృద్ధి చేసిన ఈ యంత్రాల్లో ఒకటి అవసరమైన చోటుకు మోసుకెళ్లేది కాగా, రెండోది చక్రాలపై ఉంచి తరలించగలిగేది. మంటలు ఆర్పేందుకు పనికొచ్చే యంత్రాలను రీడిజైనింగ్ చేయడం ద్వారా తాము ఈ శానిటైజింగ్ యంత్రాలను అభివృద్ధి చేసినట్లు డీఆర్డీవో ఒక ప్రకటనలో తెలిపింది. పోర్టబుల్ యంత్రం ద్వారా ఒక శాతం హైపోక్లోరైట్ ద్రావణాన్ని చల్లవచ్చని, బ్యాక్‌ప్యాక్ ద్వారా తీసుకెళ్లగలమని వివరించింది. గాలితోపాటు ద్రావణాన్ని కూడా చేర్చి స్ప్రే చేయడం దీని ప్రత్యేకతని తెలిపింది. ఒక యంత్రం ద్వారా దాదాపు 300 చదరపు మీటర్ల విస్తీర్ణంలో శానిటైజేషన్ చేపట్టవచ్చని పేర్కొంది. చక్రాలపై ఉంచి తరలించగల రెండో యంత్రంలో హైపోక్లోరైట్ ద్రావణాన్ని మాత్రమే పొగమంచు మాదిరిగా మార్చి పిచికారీ చేసేందుకు ఏర్పాట్లు ఉంటాయని తెలిపింది. ఒక్కోటి 3,000 చదరపు మీటర్ల విస్తీర్ణాన్నిశుభ్రం చేయగలదని వివరించింది. 50 లీటర్ల ద్రావణాన్ని నింపుకోగల ట్యాంకు ఇందులో ఉంటుందని.. 12నుంచి 15 మీటర్ల దూరం వరకూ పిచికారీ చేయవచ్చని తెలిపింది. ఢిల్లీ పోలీసులకు ఇప్పటికే ఈ యంత్రాలను అందుబాటులోకి తెచ్చామని పేర్కొంది. -
రెండో విజయం
సాక్షి, హైదరాబాద్: పూర్తి స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన క్రయోజనిక్ ఇంజన్‌ను రెండోసారి విజయవంతంగా పరీక్షించడం ద్వారా.. అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో మరో మైలురాయిని అందుకుంది. అమెరికా, రష్యా, జపాన్, చైనా, ఫ్రాన్స్‌ల తర్వాత.. స్వదేశీ క్రయోజనిక్ ఇంజన్ సామర్థ్యం సాధించిన దేశంగా గత ఏడాదే నిలిచిన భారత్ తాజా ప్రయోగంతో ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. ఈ విజయం వచ్చే ఏడాది ప్రయోగించనున్న జీఎస్ఎల్వీ మార్క్ 3కి మరింత ఊతమివ్వనుంది. మార్క్ 3 రాకెట్‌తో నాలుగు టన్నుల కంటే ఎక్కువ బరువుండే ఉపగ్రహాలను ప్రయోగించే అవకాశం లభిస్తుంది. ఇస్రో 17 ఏళ్ల కృషి..: రెండు టన్నుల కన్నా అధిక బరువు గల భారీ ఉపగ్రహాలను నింగిలోకి పంపించటానికి క్రయోజనిక్ ఇంజన్లు కీలకమైనవి. స్వదేశీ క్రయోజనిక్ ఇంజన్ల విజయం వెనుక ఇస్రో శాస్త్రవేత్తల దశాబ్దాల శ్రమ ఉంది. 1990 ప్రాంతంలో అమెరికా ఆంక్షల కారణంగా ఈ సంక్లిష్టమైన టెక్నాలజీ మనకు అందకుండా పోయింది. అగ్రరాజ్యం ఒత్తిళ్లకు తలొగ్గిన రష్యా తయారీ టెక్నాలజీ బదలాయింపునకు చేసుకున్న ఒప్పందాన్ని కూడా కాదని ఏడు ఇంజన్లను అందించి చేతులు దులుపుకుంది. అప్పటి నుంచే ఈ ఇంజన్లను సొంతంగా తయారుచేసుకోవాలని ఇస్రో శాస్త్రవేత్తలు సంకల్పించా రు. 1994లో మొదలైన ఈ ప్రాజెక్టు 2010 నాటికి తొలి పరీక్షకు సిద్ధమైంది. అప్పుడు జీఎస్ఎల్వీ డీ3లో ఉపయోగించిన తొలి దేశీ క్రయోజనిక్ ఇంజన్ అసలు మండలేదు. ఈ వైఫల్యాన్ని అధిగమించేందుకు ఇస్రో ఎంతో కృషి చేసింది. శాస్త్రవేత్తలు ఎంతో పట్టుదలతో 37 రకాల పరీక్షలు నిర్వహించి క్రయోజనిక్ ఇంజన్‌ను అభివృద్ధి చేశారు. నాలుగేళ్ల తర్వాత 2014 జనవరి 5న జీఎస్ఎల్వీ-డీ5 ద్వారా స్వదేశీ క్రయోజనిక్ ఇంజన్‌ను ఇస్రో దిగ్విజయంగా వినియోగించింది. మళ్లీ ఇప్పుడు స్వదేశీ క్రయోజనిక్ ఇంజన్‌ను వినియోగించి చేసిన ప్రయోగం కూడా సఫలమవటంతో.. ఈ సాంకేతిక పరిజ్ఞానంపై భారత్ పూర్తిపట్టు సాధించినట్లేనని భావిస్తున్నారు. సంక్లిష్టమైన టెక్నాలజీ..: అంతరిక్ష ప్రయోగాలకు టన్నుల కొద్దీ ఇంధనం అవసరమవుతుంది. తక్కువ ఇంధనంతో ఎక్కువ శక్తిని పొందేందుకు క్రయోజనిక్ ఇంజన్లు మేలైనవి. కానీ ఈ టెక్నాలజీ చాలా సంక్లిష్టమైంది. రాకెట్ ఇంధనాలుగా వాడే హైడ్రోజన్ మైనస్ 253, ఆక్సిజన్ మైనస్ 183 డిగ్రీ సెల్సియస్ వద్ద ద్రవరూపంలోకి మారతాయి. ఇంతటి అత్యంత శీతలమైన స్థితిలో వీటిని నిల్వ చేయడం, ఇంజన్లలో వాడటం కత్తిమీద సామే. రాకెట్‌లోని ఇతర ఇంజన్ల నుంచి వెలువడే వేడి దీన్ని తాకకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అమెరికా 1969లోనే ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసుకుని చంద్రుడిపైకి ప్రయోగించిన రాకెట్లో ఉపయోగించింది. ఇక భారీ ప్రయోగాలే లక్ష్యం వాణిజ్యపరంగా ముందంజ: ఇస్రో చైర్మన్ సూళ్లూరుపేట: క్రయోజనిక్ ఇంజన్ రెండోసారి విజయవంతం కావడం తో జీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా వాణిజ్య ప్రయోగాలు చేయడానికి మార్గం సుగమం అయిందని ఇస్రో చైర్మన్ కిరణ్‌కుమార్ పేర్కొన్నారు. జీఎస్ఎల్ వీ డి6 ప్రయోగం తరువాత విలేకరులతో మాట్లాడుతూ అమెరికాఅంతరిక్ష సంస్థ ఆంట్రిక్స్ కార్పొరేషన్‌తో 20 ఉపగ్రహాలు ప్రయోగించేందుకు ఇస్రో ఒప్పందం చేసుకుందన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో పీఎస్ఎల్వీ సీ30 ద్వారా 4 నాసా ఉపగ్రహాలను పంపనున్నామన్నారు. క్రయోజనిక్ దశలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకుంటూ జీఎస్ఎల్వీ మార్క్4 ద్వారా నాలుగు టన్నుల ఉపగ్రహాన్ని పంపే స్థాయికి పెంచుతామన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆస్ట్రోశాట్, డిసెంబర్లో సింగపూర్‌కు చెందిన ఐదు ఉపగ్రహాలతో పాటు 2016 మార్చిలోఐఆర్ఎన్ఎస్ఎస్ సిరీస్‌లో 3 ఉపగ్రహాలను ప్రయోగిస్తామన్నారు. జీఎస్ఎల్వీ ఎఫ్05 ప్రయోగానికి సిద్ధమవుతున్నామని తెలిపారు.