
దేశీయంగా రూపొందిస్తున్న తొలి కమర్షియల్ మైక్రోకంట్రోలర్‌ను మరో ఆరు నెలల్లో ఆవిష్కరించే అవకాశం ఉందని చెన్నైకి చెందిన మైండ్ గ్రోవ్ టెక్నాలజీస్ సంస్థ సహ వ్యవస్థాపకులు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ టీఆర్ శశ్వత్ తెలిపారు. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రోటోటైపింగ్ పూర్తి చేసి టెస్టింగ్ తర్వాత అవసరమైన డిజైన్ మార్పులు చేసినట్లు చెప్పారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ నాటికి చిప్‌ను లాంచ్ చేయాలనుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
స్మార్ట్ వాచ్‌లు, హెడ్ ఫోన్‌లు, కనెక్టెడ్ హోమ్ డివైజెస్ (స్మార్ట్ లాక్‌లు, స్పీకర్లు, స్మార్ట్ ఫ్యాన్‌లు), స్మార్ట్ సిటీ పరికరాలు (విద్యుత్, నీరు, గ్యాస్ మీటర్లు), యాక్సెస్ కంట్రోల్ పరికరాలు (బయోమెట్రిక్స్), థర్మల్ ప్రింటర్లు, పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) యంత్రాలు వంటి పరికరాల్లో ఈ మైక్రోకంట్రోలర్లను ఉపయోగించనున్నారు. ఇది నిర్దిష్ట పరికరాలు లేదా అవి చేసే పనులను నియంత్రించడానికి రూపొందిస్తున్నారు.
ఇదీ చదవండి: ఫిబ్రవరిలో క్రెడిట్ కార్డుల జారీ ఎలా ఉందంటే..
మైక్రో కంట్రోలర్లు అవసరమయ్యే కంపెనీలతో సంస్థ ఒప్పందాలను ఖరారు చేసిన తర్వాత ఏ మేరకు ఉత్పత్తి చేయాలో నిర్ణయిస్తామని శశ్వత్ తెలిపారు. హై-పెర్ఫార్మెన్స్ ఎడ్జ్ కంప్యూటింగ్, వీడియో ప్రాసెసింగ్ అప్లికేషన్ల కోసం ఈ మైక్రోకంట్రోలర్లను ఉపయోగిస్తున్నారని చెప్పారు. సీసీటీవీ కెమెరాలు, వీడియో రికార్డర్లు, ఎలక్ట్రానిక్ ఆటోమోటివ్ పరికరాలు, స్మార్ట్ టీవీలు.. వంటి డివైజ్‌ల్లో ఈ చిప్‌లను వాడబోతున్నట్లు పేర్కొన్నారు. డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద చిప్ అభివృద్ధికి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నుంచి గత ఏడాది సెప్టెంబర్‌లో అనుమతి లభించిందన్నారు.