సెమీకండక్టర్స్ రంగంలో అపార అవకాశాలు
ఇప్పటికే ఐఎస్‌ఎం–1లో రూ.76,000 కోట్ల సబ్సిడీలు
మరికొద్ది నెలల్లోనే తొలి మేకిన్ ఇండియా చిప్
పెట్టుబడుల జోరుతో కొంగొత్త కొలువులకు మార్గం
2026 నాటికి ఈ రంగంలో 10 లక్షల జాబ్స్
అడవుల సంరక్షణ కోసం చేసిన ‘చిప్కో’ ఉద్యమం గురించి విన్నాం... అయితే ఇప్పుడు టెక్నాలజీ రంగంలో భారత్‌ను పవర్‌హౌస్‌గా నిలిపేలా మరో ‘చిప్’కో ఉద్యమం నడుస్తోంది. దేశాన్ని సెమీకండక్టర్స్ శకంలోకి నడిపించేందుకు అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు పారిశ్రామిక అగ్రగాములు రంగంలోకి దూకడంతో ప్రపంచ దిగ్గజాలన్నీ భారత్‌లో చిప్స్ తయారీకి సై అంటున్నాయి. టాటా నుంచి అదానీ వరకు టాప్ కార్పొరేట్ గ్రూప్‌లన్నీ సెమీకండక్టర్ ఉద్యమంలో తలమునకలయ్యాయి. అమెరికా దిగ్గజం మైక్రాన్ నుండి తొలి మేక్ ఇన్ ఇండియా చిప్ కొత్త ఏడాది ఆరంభంలోనే సాక్షాత్కరించనుంది. ఈ భారీ ప్రణాళికల నేపథ్యంలో కొంగొత్త కొలువులకు ద్వారాలు తెరుచుకున్నాయి. రాబోయే రెండేళ్లలో ఏకంగా 10 లక్షల ‘చిప్’ జాబ్స్ సాకారమవుతాయనేది విశ్లేషకుల అంచనా!
నిర్మాణంలో ఉన్న చిప్ ప్లాంట్లు...
మైక్రాన్ టెక్నాలజీస్
ఎక్కడ: గుజరాత్–సాణంద్
మొత్తం పెట్టుబడి: 2.75 బిలియన్ డాలర్లు.
తొలి దశ నిర్మాణం శరవేగంగా సాగుతోంది. 2025 నాటికి ఈ ప్లాంట్ నుంచి తొలి మేక్ ఇన్ ఇండియా చిప్ కల సాకారం కానుంది.
టీటీపీఎల్–పీఎస్‌ఎంసీ
ఎక్కడ: గుజరాత్–ధోలేరా
మొత్తం పెట్టుబడి: రూ. 91,000 కోట్లు.
తైవాన్‌కు చెందిన చిప్ తయారీ దిగ్గజం పవర్‌చిప్ సెమీకండక్టర్ మాన్యుఫాక్చరింగ్ కార్ప్ (పీఎస్‌ఎంసీ) భాగస్వామ్యంతో టాటా ఎల్రక్టానిక్స్ (టీఈపీఎల్) ఈ సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్‌ను నిర్మిస్తోంది.
అదానీ–టవర్ (ఐఎస్‌ఎం ఆమోదం లభించాల్సి ఉంది)
ఎక్కడ: పన్వేల్–మహారాష్ట్ర
మొత్తం పెట్టుబడి: రూ.84,000 కోట్లు
ఇజ్రాయెల్ చిప్ తయారీ సంస్థ టవర్ సెమీకండక్ట్టర్, అదానీ భాగస్వామ్యంతో దీన్ని నెలకొల్పనుంది.
టీశాట్
ఎక్కడ: అస్సాం–మోరిగావ్
మొత్తం పెట్టుబడి: రూ.27,000 కోట్లు. టాటా సెమీకండక్టర్ అసెంబ్లీ్ల అండ్ టెస్ట్ (టీశాట్) ఈ చిప్ ఏటీఎంపీ యూనిట్‌ను నెలకొల్పుతోంది. అత్యాధునిక స్వదేశీ సెమీకండక్టర్ ప్యాకేజింగ్ టెక్నాలజీలను టీశాట్ అభివృద్ధి చేస్తోంది.
కేన్స్ సెమికాన్
ఎక్కడ: గుజరాత్–సాణంద్
మొత్తం పెట్టుబడి: రూ. 3,307 కోట్లు. మైసూరుకు చెందిన ఈ కంపెనీ రోజుకు 63 లక్షల చిప్‌ల తయారీ సామర్థ్యం గల ఓశాట్ (అవుట్‌సోర్స్‌డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్) యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది.
సీజీ పవర్, రెనెసాస్ ఎల్రక్టానిక్స్, స్టార్స్ మైక్రోఎల్రక్టానిక్స్
ఎక్కడ: గుజరాత్–సాణంద్
మొత్తం పెట్టుబడి: రూ.7,600 కోట్లు. జపాన్‌కు చెందిన రెనెసాస్, థాయ్‌లాండ్ సంస్థ స్టార్స్ భాగస్వామ్యంతో సీజీ పవర్ ఈ చిప్ ఏటీఎంపీ యూనిట్‌ను నెలకొల్పుతోంది.
భారత్‌ను సెమీకండక్టర్ తయారీ హబ్‌గా మార్చేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలతో విదేశీ చిప్ దిగ్గజాలు దేశంలో ల్యాండవుతున్నాయి. దేశీ కంపెనీలతో జట్టుకట్టి ఇప్పటికే భారీ పెట్టుబడులను కూడా ప్రకటించాయి. గుజరాత్ అయితే దేశంలో ప్రత్యేక సెమీకండక్టర్ పాలసీ తీసుకొచి్చన తొలి రాష్ట్రంగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ స్కీమ్ ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్‌ఎం)లో ప్రకటించిన రూ.76,000 కోట్ల ప్రోత్సాహకాల చలవతో ఇప్పటికే రూ.1.52 లక్షల కోట్ల విలువైన 5 భారీ ప్రాజెక్టులు కార్యరూపం దాల్చాయి. దీంతో చిప్ డిజైన్ నుంచి ఫ్యాబ్రికేషన్ వరకు పలు ప్రాజెక్టుల నిర్మాణ పనులు జోరందుకున్నాయి.
ఈ స్కీమ్ ద్వారా కంపెనీల ప్రాజెక్ట్ వ్యయంలో కేంద్రం 50 శాతం సబ్సిడీ అందిస్తోంది. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేక సదుపాయాలు కలి్పస్తున్నాయి. కాగా, మరో 20కి పైగా ప్రాజెక్టు ప్రతిపాదనలు కేంద్రం పరిశీలనలో ఉన్నాయి. దీంతో రెండు మూడు నెలల్లోనే మరింత భారీ స్థాయిలో ఐఎస్‌ఎం 2.0 స్కీమ్‌ను ప్రకటించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం దేశంలో 5,000కు పైగా కంపెనీలు సెమీకండక్టర్ పరిశ్రమ పరిధిలో కార్యకలాపాలు సాగిస్తున్నట్లు డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ డేటా క్లౌడ్ సంస్థ చెబుతోంది.
ఇందులో ప్రత్యక్ష చిప్ తయారీ సంస్థలు, పరికర (కాంపొనెంట్) ఉత్పత్తిదారులతో పాటు ఎల్రక్టానిక్స్ డిజైన్, తయారీ, డి్రస్టిబ్యూషన్ డిస్‌ప్లే డిజైన్, ఎల్రక్టానిక్స్, ఇన్నోవేషన్ ఇలా మొత్తం సమగ్ర వ్యవస్థ (ఎకో సిస్టమ్)కు సంబంధించిన కంపెనీలు పాలు పంచుకుంటున్నాయి. 2023–24లో భారత్ దిగుమతి చేసుకున్న సెమీకండక్టర్ల విలువ అక్షరాలా 33.9 బిలియన్ డాలర్లు. 2030 నాటికి ఈ డిమాండ్ 148 బిలియన్ డాలర్లకు ఎగబాకుతుందనేది నోమురా అంచనా.
ఇక చిప్ డిజైన్ జోరు..
త్వరలో కేంద్రం ప్రకటించనున్న సెమికాన్ 2.0 స్కీమ్‌లో చిప్ డిజైనింగ్‌తో పాటు సెమికండక్టర్ పరిశ్రమ ఎకో సిస్టమ్ వృద్ధికి పెద్ద పీట వేయనుంది. దిగ్గజ సంస్థలకూ ప్రాజెక్టుల వ్యయంలో సబ్సిడీ అందించే అవకాశముంది. ప్రస్తుత స్కీ మ్ (రూ.1,000 కోట్లు) చిప్ డిజైన్ స్టార్టప్‌లకు మాత్రమే 50 శాతం సబ్సిడీ (రూ.15 కోట్ల పరిమితితో) అమలవుతోంది. తదుపరి స్కీమ్‌లో ఈ పరిమితి పెంపుతో పాటు బడా కంపెనీలకూ వర్తింపజేయనున్నట్లు సమాచారం. ఎల్‌అండ్‌టీ సెమీకండక్టర్ టెక్నాలజీస్, క్వాల్‌కామ్, మీడియాటెక్, ఎన్‌ఎక్స్‌పీ వంటి కంపెనీలు రెడీగా ఉన్నాయి. అయితే, చిప్ మేధోసంపత్తి హక్కులు (ఐపీ) భారత్‌లోనే ఉండేలా షరతు విధించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
నిపుణులకు ‘చిప్’కార్పెట్!
భారత్‌ను సెమీకండక్టర్ పవర్‌హౌస్‌గా తీర్చిదిద్దాలంటే నిపుణులైన సిబ్బందే కీలకం. అందుకే అటు ప్రభుత్వం, ఇటు పరిశ్రమవర్గాలు ఈ రంగంలో నైపుణ్యాలు పెంచేపనిలో పడ్డాయి. ఎన్‌ఎల్‌బీ సరీ్వసెస్ డేటా ప్రకారం 2026 నాటికి భారత సెమీకండక్టర్ పరిశ్రమ 10 లక్షల కొత్త కొలువులను సృష్టించనుందని అంచనా. ఇందులో చిప్ ఫ్యాబ్రికేషన్‌లో 3 లక్షలు, అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్ అండ్ ప్యాకేజింగ్ (ఏటీఎంపీ)లో 2 లక్షల జాబ్స్ లభించనున్నాయి.
ఇంకా చిప్ డిజైన్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, సిస్టమ్ సర్క్యూట్స్, తయారీ సరఫరా వ్యవస్థ నిర్వహణ తదితర రంగాల్లో దండిగా ఉద్యోగాలు రానున్నట్లు ఎన్‌ఎల్‌బీ నివేదిక పేర్కొంది. ‘సెమీకండక్టర్ పరిశ్రమకు అవసరమైన సిబ్బందిని అందించడంలో రీస్కిల్లింగ్, అప్‌స్కిల్లింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. భారీ డిమాండ్‌ను తీర్చాలంటే కనీసం ఏటా 5 లక్షల నిపుణులను పరిశ్రమకు అనుగుణంగా తీర్చిదిద్దాల్సి ఉంటుంది’ అని ఎన్‌ఎల్‌బీ సరీ్వసెస్ సీఈఓ సచిన్ అలుగ్ అభిప్రాయపడ్డారు.
ప్రధానంగా ప్రొక్యూర్‌మెంట్, క్వాలిటీ కంట్రోల్, మెటీరియల్ ఇంజనీరింగ్ వంటి విభాగాల్లో ఇంజనీర్లు, ఆపరేటర్లు, టెక్నీషియన్లు, స్పెషలిస్టులకు ఫుల్ డిమాండ్ ఉంది. కొన్ని చిప్ తయారీ కంపెనీలు ఇప్పటికే నైపుణ్యాభివృద్ధి చర్యలు మొదలుపెట్టాయి. ఏఎండీ, మైక్రాన్ ఇండియా, ఎల్‌ఏఎం రీసెర్చ్ తదితర కంపెనీలు కొత్త నియామకాల కోసం టెక్నికల్ బూట్‌క్యాంపులు, యూనివర్సిటీల్లో రీసెర్చ్ ల్యాబ్‌ల ఏర్పాటు, మెంటార్‌షిప్ అవకాశాల కల్పనకు నడుంబిగించాయి. – సాక్షి, బిజినెస్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment