
ఇటీవల కొంత కాలంగా దేశీ ఐటీ దిగ్గజ కౌంటర్లలో కొనుగోళ్లకంటే అమ్మకాలే అధికంగా నమోదవుతున్నాయి. దీంతో స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ఐటీ రంగం వెనకడుగులో ఉంది. వెరసి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ–50లో ఐటీ బ్లూచిప్స్ వెయిటేజీ 16 ఏళ్లలోనే కనిష్టానికి పడిపోయింది. ఇందుకు పలు అంశాలు కారణమైనప్పటికీ టీసీఎస్, ఇన్ఫోసిస్ తదితర దేశీ దిగ్గజాలు మెరుగైన పనితీరునే ప్రదర్శించనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
కొత్త ఏడాదిలో యూఎస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార టారిఫ్‌లకు తెరతీశారు. అమెరికానే ప్రాధాన్యత అంటూ పలు దేశాలపై ఆంక్షలు విధిస్తున్నారు. దీంతో యూఎస్ ఆర్థిక వ్యవస్థ మందగించనున్న అంచనాలు ఇటీవల బలపడుతున్నాయి. ఫలితంగా ఉత్తర అమెరికా మార్కెట్లపై అధికంగా ఆధారపడి బిజినెస్ నిర్వహించే దేశీ సాఫ్ట్‌వేర్ సేవల కంపెనీలపై ప్రతికూల ప్రభావం పడనున్నట్లు పరిశ్రమ వర్గాలలో అంచనాలకు తెరలేచింది. దీంతో స్టాక్ మార్కెట్లలో కొత్త ఏడాది (2025) ఐటీ కౌంటర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ–50లో ఐటీ రంగం వెయిటేజీ తాజాగా 11.66%కి పరిమితమైంది. ఇది 16 ఏళ్ల కనిష్టం కాగా.. 2024 డిసెంబర్‌లో నమో దైన 13.53% నుంచి వెనకడు గు వేస్తూ వస్తోంది. 2022 మార్చిలో 17.67 శాతాన్ని తాకడం ద్వారా 25 ఏళ్ల గరిష్టాన్ని తాకిన ఇండెక్స్ ప్రస్తుతం భారీగా క్షీణించింది.
2025లో వీక్..
2025 జనవరి నుంచి ఐటీ ఇండెక్స్ 14 శాతానికిపైగా క్షీణించింది. దేశీయంగా టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా తదితర టాప్–10 కంపెనీలకు ప్రాతినిధ్యం వహించే ఇండెక్స్ ఎఫ్‌పీఐల అమ్మకాల ఒత్తిడితో ఇటీవల డీలా పడుతోంది. 2024 జనవరి–డిసెంబర్‌లో నిఫ్టీ 9 శాతమే బలపడగా.. ఐటీ ఇండెక్స్ 22 శాతం లాభపడింది. ఐటీ కంపెనీల ఆదాయం గత కొన్ని త్రైమాసికాలుగా సింగిల్ డిజిట్ వృద్ధికే పరిమితమవుతున్నాయి. అయినప్పటికీ రక్షణాత్మక పెట్టుబడుల రంగంగా ఇన్వెస్టర్లు భావిస్తుంటారని విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే ట్రంప్ టారిఫ్‌లు, అమెరికా ఫస్ట్ విధానాలు దేశీ ఐటీ కంపెనీలకు చేటు చేయవచ్చన్న ఆందోళనలు ఇటీవల పెరిగినట్లు తెలియజేశారు. మరోపక్క యూఎస్ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారవచ్చన్న అంచనాలు నెలకొనడంతో ఐటీ షేర్లలో అమ్మకాలు పెరిగినట్లు విశ్లేషించారు. దీంతో రూపాయి బలహీనపడినప్పటికీ ఇన్వెస్టర్లు ఇతర రంగాలవైపు దృష్టిపెడుతున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి: శామ్‌సంగ్ ఇండియాపై రూ.5,149 కోట్ల జరిమానా
ఐటీపై భరోసా
గత వారం ఐటీ దిగ్గజం యాక్సెంచర్ ఫలితాల విడుదల సందర్భంగా యూఎస్ ప్రభుత్వ వ్యయాలు తగ్గడం ఆదాయంపై ప్రభావం చూపినట్లు పేర్కొంది. అయితే టీసీఎస్, ఇన్ఫోసిస్ తదితర దేశీ దిగ్గజాలు యూఎస్ ప్రభుత్వం, ఫెడరల్ ఏజెన్సీల కాంట్రాక్టులపై అతితక్కువగా ఆధారపడుతున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి. యూఎస్ ఆదాయంలో వీటి వాటా సుమారు 2 శాతమేనని తెలియజేశాయి. అయితే యాక్సెంచర్ యూఎస్ ఆదాయంలో వీటి వాటా 16 శాతంకాగా.. అక్కడి ప్రభుత్వ కాంట్రాక్టుల ప్రభావం దేశీ దిగ్గజాలపై తక్కువేనని నిపుణులు వివరించారు.
–సాక్షి, బిజినెస్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment