దేశీ సంస్థలతో భాగస్వామ్యానికి ఆసక్తి
డెలాయిట్ సంస్థ వెల్లడి
న్యూఢిల్లీ: భారత్‌లో సెమీకండక్టర్ యూనిట్ల ఏర్పాటుకు జపాన్ కంపెనీలు ఆసక్తితో ఉన్నట్టు డెలాయిట్ సంస్థ వెల్లడించింది. ఈ రంగంలో జపాన్ కంపెనీలకు ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నాయని, అవి భారత్‌లో భాగస్వామ్యాలకు ఉత్సాహం చూపిస్తున్నట్టు తెలిపింది. నైపుణ్యాలు కలిగిన మానవ వనరులు, నిధుల లభ్యత, ప్రభుత్వం నుంచి మద్దతు భారత్‌లో ఈ రంగం వృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు అనుకూలించనున్నట్టు పేర్కొంది.
జపనీస్ కంపెనీలు భారత మార్కెట్ పట్ల ఎంతో ఉత్సాహం చూపిస్తున్నట్టు డెలాయిట్ ఏపీ, డెలాయిట్ జపాన్ ఎస్‌ఆర్‌టీ లీడర్ షింగో కామయ తెలిపారు. భారత్‌లో సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి చేతులు కలిపిన వాటిల్లో యూఎస్ తర్వాత రెండో క్వాడ్ భాగస్వామి జపాన్ అన్న విషయాన్ని గుర్తు చేశారు. సెమీకండక్టర్ డిజైన్, తయారీ, ఎక్విప్‌మెంట్, పరిశోధన, నైపుణ్యాభివృద్ధికి భారత్, జపాన్ మధ్య అవగాహన ఒప్పందాలు కుదరడాన్ని ప్రస్తావించారు. 100 సెమీకండక్టర్ ప్లాంట్లతో సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ కలిగిన టాప్ 5 దేశాల్లో జపాన్ ఒకటిగా డెలాయిట్ పేర్కొంది.
చిప్‌ల తయారీలో వాడే వేఫర్లు, కెమికల్, గ్యాస్, లెన్స్‌ల తయారీలో జపాన్ టాప్‌లో ఉన్నట్టు వివరించింది. భారత్ 10 ఏళ్లలో 10 సెమీకంక్టర్ కంపెనీల ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకుందని.. ఈ దిశగా జపాన్ మెరుగైన భాగస్వామి అవుతుందని అంచనా వేసింది. సెమీకండక్టర్ పరంగా జపాన్ కంపెనీలకు ఉన్న టెక్నాలజీ, ప్రత్యేక నైపుణ్యాలను ప్రస్తావించింది. ఏదో ఒక ఫ్యాక్టరీ ఏర్పాటుతో సెమీకండక్టర్ లక్ష్యం నెరవేరదని, మొత్తం ఎకోసిస్టమ్ (సమగ్ర వ్యవస్థ) ఏర్పా టు చేయాల్సి ఉంటుందని డెలాయిట్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment