భారతదేశంలో సెమీకండక్టర్ రంగంలో 2026 నాటికి దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులు అవసరమవుతారని నివేదికలు వెలువడుతున్నాయి. టాలెంట్ సొల్యూషన్స్ కంపెనీ ఎన్‌ఎల్‌బీ సర్వీసెస్ నివేదిక ఈమేరకు వివరాలు వెల్లడించింది. సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్‌లో మూడు లక్షల ఉద్యోగాలు, చిప్ ఏటీఎంపీ (అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్)లో రెండు లక్షల ఉద్యోగాలు, ఇతర విభాగాల్లో మరిన్ని కొలువులు సృష్టించబడుతాయని ఎన్‌ఎల్‌బీ నివేదించింది.
నివేదికలోని వివరాల ప్రకారం.. దేశంలో సెమీకండక్టర్ ప్రాజెక్ట్‌లకు పెద్ద ఎత్తున అనుమతులు లభిస్తున్నాయి. తాజాగా దాదాపు రూ. 32,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఉత్తరప్రదేశ్‌లో ఆమోదం లభించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం త్వరలో ప్రత్యేకంగా సెమీకండక్టర్ పాలసీను తీసుకురావాలని యోచిస్తోంది. గుజరాత్‌లోని ధొలేరా ప్రాంతంలో టాటా ఎలక్ట్రానిక్స్-పీఎస్‌ఎంసీ చిప్ ప్రాజెక్ట్, అస్సాంలో టాటా అసెంబ్లింగ్, టెస్ట్ యూనిట్‌ను నిర్వహిస్తోంది. సీజీ పవర్, కేన్స్, అదానీ వంటి ప్రైవేట్ కంపెనీలు ఈ రంగంలోకి అడుగుపెడుతున్నాయి. అమెరికాకు చెందిన మైక్రోటెక్ సంస్థ గుజరాత్‌లో ప్రాజెక్ట్ ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం లభించింది.
రూ.166 లక్షల కోట్లు ఖర్చు
ఎలక్ట్రానిక్ భాగాలు, తయారీ, సేవలకు సంబంధించి ఈ రంగంలో గ్లోబల్‌గా దాదాపు రెండు ట్రిలియన్ డాలర్లు(రూ.166 లక్షల కోట్లు) ఖర్చు చేయబోతున్నట్లు ఎలక్ట్రానిక్స్ సప్లై చైన్ ప్లాట్‌ఫామ్ లుమినోవో వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ సెబాస్టియన్ స్కాల్ అంచనా వేశారు. సెమీకండక్టర్ పరిశ్రమలో ప్రాసెస్ ఇంటిగ్రేషన్ ఇంజినీర్, సెమీకండక్టర్ వేఫర్ ఇన్‌స్పెక్టర్, టెక్నికల్ స్పెషలిస్ట్, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ (పీఎం) టెక్నీషియన్, డిజైన్ ఇంజినీర్, ప్రాసెస్ ఇంజినీర్, క్వాలిటీ కంట్రోల్ స్పెషలిస్ట్ వంటి కీలక పోస్టుల కోసం మానవ వనరుల అవసరం ఉందని చెప్పారు.
ఇదీ చదవండి: నాలుగు లైన్ల పోస్ట్‌కు స్పందించి జాబ్ ఆఫర్!
ఏటా ఐదు లక్షల మంది
ఎన్‌ఎల్‌బీ సర్వీసెస్ సీఈఓ సచిన్ అలుగ్ మాట్లాడుతూ..‘ఈ రంగంలో మానవ వనరుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని నైపుణ్యం కలిగిన వర్క్‌ఫోర్స్‌ను తయారు చేయాల్సి ఉంది. భారతదేశం సెమీకండక్టర్ హబ్‌గా మారాలంటే 2026 నాటికి 10 లక్షల మంది నైపుణ్యం కలిగిన ఉద్యోగులు అవసరం. కాబట్టి ఈ రంగంలో ఉపాధి కొరతను తీర్చాలంటే ఏటా ఐదు లక్షల మంది ప్రతిభావంతులను తయారు చేయాల్సి ఉంటుంది’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment