electronic companies
-
హేయర్ ఇండియాపై దిగ్గజాల కన్ను
ముంబై: చైనీస్ కన్జూమర్ అప్లయెన్సెస్ కంపెనీ హేయర్ దేశీ కార్యకలాపాలపై పలు కార్పొరేట్ దిగ్గజాలు కన్నేసినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. హేయర్(Haier) అప్లయెన్సెస్ ఇండియాలో 51 శాతం వాటా కొనుగోలు చేయాలని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఇందుకు పలు పీఈ దిగ్గజాలు, దేశీ కార్పొరేట్ల(Corporate)తో చేతులు కలిపాయి. వార్బర్గ్ పింకస్.. భారతీ ఎంటర్‌ప్రైజెస్‌తో, బెయిన్ క్యాపిటల్ దాల్మియా భారత్ గ్రూప్‌తో జట్టు కట్టాయి. ఈ రేసులో వెల్స్పన్ గ్రూప్‌తోపాటు.. ఇతర పీఈ దిగ్గజాలు టీపీజీ క్యాపిటల్, గోల్డ్‌మన్ శాక్స్, జీఐసీ(సింగపూర్) పోటీ పడుతున్నాయి. ఎలక్ట్రానిక్ అప్లయెన్సెస్ చైనీస్ దిగ్గజం హేయర్ ఇండియా దేశీయంగా హోమ్ అప్లయెన్సెస్‌లో మూడో పెద్ద కంపెనీగా నిలుస్తోంది. రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్, ఏసీ, టీవీల విక్రయాలలో కొరియన్ దిగ్గజాలు ఎల్జీ, శామ్సంగ్తో పోటీ పడుతోంది. అయితే హేయర్ ఇండియాలో నియంత్రిత వాటా (51 శాతం) కొనుగోలు చేసేందుకు దేశీ కార్పొరేట్లతోపాటు.. గ్లోబల్ పీఈ(Global PE) సంస్థలు సైతం దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. వివరాలు చూద్దాం..ఇప్పటికే ఆఫర్లుహేయర్ ఇండియాలో నియంత్రిత వాటా కొనుగోలుకి కొన్ని సంస్థలు ఇప్పటికే నాన్‌బైండింగ్ బిడ్స్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు ఆసక్తిని చూపుతున్న ఇతర దేశీ కార్పొరేట్లలో మణిపాల్ గ్రూప్, డాబర్ గ్రూప్, ముంజాల్ కుటుంబం ఉన్నట్లు సమాచారం. కంపెనీతో చర్చలు చేపట్టిన పీఈ దిగ్గజాలలో బ్లాక్‌స్టోన్, సీవీసీ క్యాపిటల్ పార్ట్నర్స్, ఈక్యూటీ, టీఏ అసోసియేట్స్ సైతం ఉన్నాయి. లిస్టెడ్ కంపెనీల ద్వారా కాకుండా ప్రమోటర్లు, గ్రూప్ ప్రయివేట్ సంస్థల నుంచి ఆసక్తిని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. స్థానికతకు ప్రాధాన్యందేశీ నియంత్రణ సంస్థల నిశిత పరీక్షల నేపథ్యంలో హేయర్ ఇండియా కార్యకలాపాలలో స్థానికతను పెంచుకునే వ్యూహాల్లో ఉంది. దీనిలో భాగంగా దేశీ భాగస్వామి కోసం చూస్తోంది. 20–49 శాతం వరకూ వాటాను సైతం ఆఫర్ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే 51 శాతం వాటాకు స్థానిక సంస్థలు డిమాండ్ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తద్వారా చైనాయేతర సంస్థలు మెజారిటీ వాటాను కలిగి ఉండటం ద్వారా యాజమాన్య నిర్వహణకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిపాయి. ఆపై స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు వీలుగా ఒప్పందం కుదుర్చుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: భారత్‌కు ‘తయారీ’ స్వర్ణయుగంభారీ వృద్ధిపై దృష్టిఈ క్యాలెండర్ ఏడాది(2024)లో బిలియన్ డాలర్లకుపైగా(రూ.8,900 కోట్లు) ఆదాయ మైలురాయిని అధిగమించే లక్ష్యంలో సాగుతున్నట్లు హేయర్ ఇండియా ప్రెసిడెంట్ ఎన్ఎస్ సతీష్ వెల్లడించారు. ఇందుకు పండుగలు, వేసవి సీజన్, ప్రీమియం ధరలు సహకరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ బాటలో 2025లో రూ. 11,500 కోట్ల ఆదాయాన్ని అందుకోవాలని భావిస్తున్నట్లు తెలియజేశారు. వెరసి 2024లో 35 శాతం వృద్ధి సాధించడం ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించనున్నట్లు వివరించారు. ప్రధానంగా లెడ్, వాషింగ్ మెషీన్ల విభాగం పటిష్ట పురోగతిని అందుకుంటున్నట్లు వెల్లడించారు. కాగా.. ఇప్పటికే దేశీయంగా రూ. 2,500 కోట్లు ఇన్వెస్ట్ చేసిన ఎల్రక్టానిక్స్, కన్జూమర్ కంపెనీ మూడో తయారీ కేంద్రాన్ని దక్షిణాదిలో ఏర్పాటు చేసే సన్నాహాల్లో ఉంది. 2026 లేదా 2027కల్లా కార్యకలాపాలను ప్రారంభించే ప్రణాళికల్లో ఉంది. ప్రస్తుతం పుణే, గ్రేటర్ నోయిడాలలో తయారీ ప్లాంట్లను కలిగి ఉంది. కంపెనీ జనవరి–డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. -
రెండేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు
భారతదేశంలో సెమీకండక్టర్ రంగంలో 2026 నాటికి దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులు అవసరమవుతారని నివేదికలు వెలువడుతున్నాయి. టాలెంట్ సొల్యూషన్స్ కంపెనీ ఎన్ఎల్బీ సర్వీసెస్ నివేదిక ఈమేరకు వివరాలు వెల్లడించింది. సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్‌లో మూడు లక్షల ఉద్యోగాలు, చిప్ ఏటీఎంపీ (అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్)లో రెండు లక్షల ఉద్యోగాలు, ఇతర విభాగాల్లో మరిన్ని కొలువులు సృష్టించబడుతాయని ఎన్ఎల్బీ నివేదించింది.నివేదికలోని వివరాల ప్రకారం.. దేశంలో సెమీకండక్టర్ ప్రాజెక్ట్‌లకు పెద్ద ఎత్తున అనుమతులు లభిస్తున్నాయి. తాజాగా దాదాపు రూ. 32,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఉత్తరప్రదేశ్‌లో ఆమోదం లభించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం త్వరలో ప్రత్యేకంగా సెమీకండక్టర్ పాలసీను తీసుకురావాలని యోచిస్తోంది. గుజరాత్‌లోని ధొలేరా ప్రాంతంలో టాటా ఎలక్ట్రానిక్స్-పీఎస్ఎంసీ చిప్ ప్రాజెక్ట్, అస్సాంలో టాటా అసెంబ్లింగ్, టెస్ట్ యూనిట్‌ను నిర్వహిస్తోంది. సీజీ పవర్, కేన్స్, అదానీ వంటి ప్రైవేట్ కంపెనీలు ఈ రంగంలోకి అడుగుపెడుతున్నాయి. అమెరికాకు చెందిన మైక్రోటెక్ సంస్థ గుజరాత్లో ప్రాజెక్ట్ ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం లభించింది.రూ.166 లక్షల కోట్లు ఖర్చుఎలక్ట్రానిక్ భాగాలు, తయారీ, సేవలకు సంబంధించి ఈ రంగంలో గ్లోబల్‌గా దాదాపు రెండు ట్రిలియన్ డాలర్లు(రూ.166 లక్షల కోట్లు) ఖర్చు చేయబోతున్నట్లు ఎలక్ట్రానిక్స్ సప్లై చైన్ ప్లాట్‌ఫామ్ లుమినోవో వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ సెబాస్టియన్ స్కాల్ అంచనా వేశారు. సెమీకండక్టర్ పరిశ్రమలో ప్రాసెస్ ఇంటిగ్రేషన్ ఇంజినీర్, సెమీకండక్టర్ వేఫర్ ఇన్స్పెక్టర్, టెక్నికల్ స్పెషలిస్ట్, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ (పీఎం) టెక్నీషియన్, డిజైన్ ఇంజినీర్, ప్రాసెస్ ఇంజినీర్, క్వాలిటీ కంట్రోల్ స్పెషలిస్ట్ వంటి కీలక పోస్టుల కోసం మానవ వనరుల అవసరం ఉందని చెప్పారు.ఇదీ చదవండి: నాలుగు లైన్ల పోస్ట్‌కు స్పందించి జాబ్ ఆఫర్!ఏటా ఐదు లక్షల మందిఎన్ఎల్బీ సర్వీసెస్ సీఈఓ సచిన్ అలుగ్ మాట్లాడుతూ..‘ఈ రంగంలో మానవ వనరుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని నైపుణ్యం కలిగిన వర్క్‌ఫోర్స్‌ను తయారు చేయాల్సి ఉంది. భారతదేశం సెమీకండక్టర్ హబ్‌గా మారాలంటే 2026 నాటికి 10 లక్షల మంది నైపుణ్యం కలిగిన ఉద్యోగులు అవసరం. కాబట్టి ఈ రంగంలో ఉపాధి కొరతను తీర్చాలంటే ఏటా ఐదు లక్షల మంది ప్రతిభావంతులను తయారు చేయాల్సి ఉంటుంది’ అన్నారు. -
బీఐఎస్ గుర్తింపు తప్పనిసరి.. ఏ ఉత్పత్తులకంటే..
నాణ్యత కొనుగోలుదారుడి హక్కు అని భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్) చెబుతోంది. ఈ క్రమంలో వివిధ వస్తువులు, ఉత్పత్తులు, పరికరాలు సహా అన్నీ బీఐఎస్ నిర్దేశిత ప్రమాణాల మేరకు ఉండాల్సిందేనని అధికారులు తెలిపారు. దేశ ప్రజలు నిత్యం వినియోగించే దాదాపు 344 వస్తువులకు విధిగా బీఐఎస్ నాణ్యత గుర్తు ఉండాల్సిందేనని స్పష్టం సంస్థ స్పష్టం చేసింది. విదేశాల నుంచి మన దేశానికి వస్తున్న మొబైల్ఫోన్లు సహా అనేక రకాల ఎలక్ట్రానిక్ వస్తువులకు బీఐఎస్ గుర్తింపు తప్పనిసరని తెలిపింది. బీఐఎస్ ఇప్పటి వరకూ సుమారు 20 వేల ప్రమాణాలను ధ్రువీకరించి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిసింది. నాణ్యత లేని వస్తువుల దిగుమతిని అరికట్టడానికి, దేశీయ తయారీని పెంచడానికి ప్రభుత్వం స్విచ్, సాకెట్, కేబుల్ ట్రంక్.. వంటి ఎలక్ట్రికల్ వస్తువులకు నాణ్యత నిబంధనలను తప్పనిసరి చేసింది. ఎలక్ట్రికల్ యాక్సెసరీస్ (క్వాలిటీ కంట్రోల్) ఆర్డర్, 2023ని ఈ ఏడాది జనవరి 1న డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) జారీ చేసింది. ఈ ఆర్డర్ ప్రకారం ఎలక్ట్రిక్ వస్తువులకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) గుర్తు తప్పనిసరి చేసింది. లేదంటే వాటిని ఉత్పత్తి చేయడం, విక్రయించడం, వ్యాపారం చేయడం, దిగుమతి చేయడం, నిల్వ చేయడం సాధ్యం కాదు. ఆర్డర్ వెలువడిన ఆరు నెలల నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయిని డీపీఐఐటీ తెలిపింది. ఎంఎస్ఎంఈ రంగాన్ని రక్షించడానికి అధికారులు నిబంధనల్లో కొన్ని సడలింపులు ఇచ్చినట్లు తెలుస్తుంది. చిన్న పరిశ్రమలకు అదనంగా తొమ్మిది నెలలు, మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌లు 12 నెలల తర్వాత నిబంధనల పరిధిలోకి వస్తాయని సమాచారం. బీఐఎస్ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘిస్తే, మొదటి నేరానికి గరిష్ఠంగా రెండేళ్ల జైలుశిక్ష లేదా కనీసం రూ.2 లక్షల జరిమానా విధించవచ్చు. రెండో, తదుపరి నేరాల విషయంలో మరింత కఠిన శిక్షలు ఉంటాయి. ఇదీ చదవండి: ప్రపంచంలోనే అతిచిన్న ఎలక్ట్రిక్ కారు.. ధర ఎంతంటే? బీఐఎస్ ప్రమాణాలను ఎలా నిర్ధారిస్తుందంటే.. తయారీదారులు, ప్రయోగశాలలు, సంబంధిత సైంటిస్టులు, నియంత్రణ సంస్థలు, వినియోగదారులు, ఆ రంగంలోని నిపుణులు కమిటీగా ఏర్పడి ప్రమాణాల ముసాయిదాను రూపొందిస్తారు. ఆపై భారతీయ ప్రమాణాలను తయారుచేస్తారు. ఏదైనా సంస్థ తయారు చేసిన వస్తువు నమూనా (శాంపిల్) తీసుకుని ప్రయోగశాలల్లో పరిశీలించి బీఐఎస్ నిర్దేశిత ప్రమాణాలు ఉంటే ఐఎస్ఐ మార్కు వినియోగానికి లైసెన్స్ కేటాయిస్తారు. -
గృహోపకరణాల పరిశ్రమ@ రూ.1.48 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: గృహోపకరణాలు, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ (ఏసీఈ) పరిశ్రమ వచ్చే మూడేళ్లలో రెట్టింపై రూ.1.48 లక్షల కోట్లకు చేరుకుంటుందని పరిశ్రమ మండలి సీఈఏఎంఏ అంచనా వేసింది. ప్రస్తుతం ఈ మార్కెట్ పరిమాణం రూ.75 లక్షల కోట్ల స్థాయిలో ఉంటుందని పేర్కొంది. భారత్ వేగంగా వృద్ధి చెందుతున్న ఏసీఈ మార్కెట్లలో ఒకటని కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్సెస్ తయారీ దారుల సంఘం (సీఈఏఎంఏ) ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగంజా తెలిపారు. చైనా, ఇతర ఆగ్నేయాసియా దేశాలకు భారత్ ప్రత్యామ్నాయ తయారీ కేంద్రంగా మారుతున్నట్టు చెప్పారు. 2021 మొత్తం మీద ఏసీఈ పరిశ్రమలోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 198 మిలియన్ డాలర్లుగా ఉంటే, 2022 జూన్ నాటికే రెట్టింపు స్థాయిలో 481 మిలియన్ డాలర్లు (రూ.3,888 కోట్లు) వచ్చినట్టు బ్రగంజా తెలిపారు. సీఈఏఎంఏ వార్షిక సమావేశం గురువారం ఢిల్లీలో జరిగింది. ఈ కార్యక్రమంలో వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ సైతం పాల్గొన్నారు. తయారీ కేంద్రాల ఏర్పాటు.. ఇప్పుడు కొన్ని అంతర్జాతీయ ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీ కంపెనీలు (ఓఈఎం) భారత్‌లో తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటున్నట్టు బ్రగంజ చెప్పారు. ప్రభుత్వం ఏసీలకు సంబంధించి ప్రకటించిన పీఎల్ఐ పథకం ఇందుకు మద్దతుగా నిలుస్తున్నట్టు పేర్కొన్నారు. చిన్న, పెద్ద గృహోపకరణాలకు సంబంధించి ఇదే మాదిరి పీఎల్ఐ పథకాలను ప్రకటించినట్టయితే దేశీయంగా తయారీ మరింత ఊపందుకుంటుందని, మరింత మందికి ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ఎరిక్ బ్రగంజ అభిప్రాయపడ్డారు. ‘‘ఇతర ఉత్పత్తుల విభాగాలకు సంబంధించి పీఎల్ఐ పథకం ప్రకటించాలని కోరుతున్నాం. ఇలా చేయడం వల్ల దేశంలో విడిభాగాల తయారీ వసతులు ఏర్పడతాయి. దీంతో దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుంది. ఆత్మనిర్భర భారత్ పిలుపునకు ఇది మద్దతుగా నిలుస్తుంది’’అని బ్రగంజ వివరించారు. వృద్ధికి భారీ అవకాశాలు ఇతర ప్రపంచ దేశాలతో పోలిస్తే ఏసీఈ పరిశ్రమలోని కొన్ని విభాగాలకు సంబంధించి భారత్‌లో విస్తరణ ఇంకా చిన్న స్థాయిలోనే ఉన్నట్టు బ్రగంజ చెప్పారు. కనుక వృద్ధికి భారీ అవకాశాలున్నట్టు పేర్కొన్నారు. ‘‘కరోనా వల్ల గత రెండు సంవత్సరాల్లో పరిశ్రమ వృద్ధిని చూడలేదు. ఇప్పుడు తిరిగి వృద్ధి బాటలోకి అడుగు పెట్టింది. ఈ ఏడాది వేసవిలో కంప్రెషర్ ఆధారిత కూలింగ్ ఉత్పత్తులు అధికంగా అమ్ముడయ్యాయి. పరిశ్రమ ఎంతో ఆశాభావంతో ఉంది. నూతన టెక్నాలజీని అందుపుచ్చుకుని, భారత్‌లో తయారీ కింద స్థానికంగా తయారు చేసేందుకు సుముఖంగా ఉంది. కొన్ని స్టార్టప్‌లు సైతం పరిశ్రమకు విలువను తెచ్చిపెడుతున్నాయి’’అని బ్రగంజ వివరించారు. పరిశ్రమలో మధ్యస్థ, ఖరీదైన ఉత్పత్తులకు డిమాండ్ పెరిగినట్టు చెప్పారు. జీఎస్టీ విధానం కింద పన్నుల పరంగా పరిశ్రమకు ప్రోత్సాహం అవసరమన్నారు. టీవీలకు సంబంధించి స్క్రీన్ సైజుతో సంబంధం లేకుండా ఏకీకృత పన్ను రేటు ఉండాలన్న అభిప్రాయాన్ని వినిపించారు. ప్రస్తుతం 32 అంగుళాల టీవలపై 18 శాతం జీఎస్టీ ఉంటే, అంతకుపైన సైజుతో ఉన్న వాటిపై 28 శాతం జీఎస్టీ అమలవుతున్నట్టు చెప్పారు. విద్యుత్‌ను ఆదా చేసే ఏసీలను 28 శాతం నుంచి 18 శాతం రేటు కిందకు తీసుకురావాలని కోరారు. చదవండి: ఎలాన్ మస్క్‌కు భారీ ఝలకిచ్చిన ఉద్యోగులు.. ఇప్పుడేం చేస్తావ్! -
China Power Crisis: చైనాలో చీకట్లు !
షెన్యాంగ్: చైనాలో స్మార్ట్ ఫోన్ వెలుగులో ప్రజలు బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నారు. చాలా నగరాల్లో విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలనే లక్ష్యాలను చేరుకోవడానికి విద్యుత్ కోతలు అమలు చేశారని కొందరు ఆర్థిక వేత్తలు విశ్లేషిస్తూ ఉంటే , ఇటీవల కాలంలో బొగ్గు ధరలు ఆకాశాన్నంటడంతో డిమాండ్‌కి తగ్గ సప్లయ్ చేయలేమని విద్యుత్ కంపెనీలు చేతులెత్తేసినట్టు వార్తలు వస్తున్నాయి. చైనాలో కొన్ని ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి నిలిపివేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఫలితంగా స్మార్ట్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ఎగుమతులపై ప్రభావం పడుతుందనే ఆందోళనలు మొదలయ్యాయి. ఇటీవల చైనా విద్యుత్ వినియోగం రెట్టింపు అయింది. దీంతో కర్బన ఉద్గారాలు అధిక స్థాయిలో వెలువడి వాతావరణ కాలుష్యం పెరిగిపోతోంది. ఐక్యరాజ్య సమితి పర్యావరణ సదస్సు అక్టోబర్ 12–13 తేదీల్లో చైనాలోని కన్మింగ్‌లో జరగనుంది. ఆతిథ్య దేశంగా ఉంటూ ఈ స్థాయిలో ఇంధనాన్ని వినియోగిస్తే అంతర్జాతీయంగా విమర్శలు వస్తాయి. దీంతో అధ్యక్షుడు జిన్ పింగ్‌పై సంప్రదాయ ఇంధన వినియోగాన్ని తగ్గించాలనే ఒత్తిడి పెరుగుతోంది. ఆ లక్ష్యాలను చేరుకోవడానికే భారీగా విద్యుత్ కోతలు విధించారని తెలుస్తోంది. చైనాలో దాదాపుగా 20 ప్రాంతాల్లో అత్యధికంగా ఇంధనాన్ని వినియోగిస్తూ, ఉత్పత్తులు భారీగా చేపట్టడంతో కాలుష్యం పెరిగిపోయింది. చైనాలోని ఓ ఇంట్లో సెల్‌ఫోన్ వెలుగులో భోజనం చేస్తున్న కుటుంబ సభ్యులు -
‘ఎలక్ట్రానిక్స్’కు 50 వేల కోట్ల రాయితీలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా అగ్రగామి మొబైల్ తయారీ కంపెనీలను భారత్‌కు ఆకర్షించే లక్ష్యంతో.. రూ.50 వేల కోట్ల రాయితీలతో కేంద్రం ముందుకు వచ్చింది. ఈ రాయితీలను పొందేందుకు గాను ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల నుంచి దరఖాస్తులకు ఆహ్వానం పలికింది. ప్రపంచంలో అగ్రగామి ఐదు మొబైల్ తయారీ కంపెనీలను తొలి దశలో భారత్‌కు ఆకర్షించే లక్ష్యంతో ఉన్నట్టు కేంద్ర ఐటీ, టెలికం రంగాల మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ సందర్భంగా ప్రకటించారు. అదే సమయంలో దేశీయంగాను ఐదు కంపెనీలను ప్రోత్సహించనున్నామని (ఐదు ఛాంపియన్లను సృష్టించడం) చెప్పారు. ‘‘మొత్తం రూ.50,000 కోట్ల ప్రోత్సాహకాలు ఇస్తున్నాం. ప్రపంచ మొబైల్ మార్కెట్లో 80 శాతం వాటా 5–6 భారీ కంపెనీల చేతుల్లోనే ఉంది. పీఎల్ఐ పథకం కింద ఐదు అగ్రగామి కంపెనీలను అనుమతించనున్నాం’’ అని మంత్రి తెలిపారు. అంతర్జాతీయ, స్థానిక కంపెనీలతో కలసి భారత్‌ను మంచి ఉత్పాదకత, నైపుణ్య దేశంగా తీర్చిదిద్దనున్నట్టు చెప్పారు. ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ తయారీ దేశంగా ఉందంటూ, మొదటి స్థానాన్ని చేరుకునే దిశగా కృషి చేస్తున్నట్టు ప్రకటించారు. ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహించేందుకు ఇటీవలే ప్రభుత్వం మూడు పథకాలను ప్రకటించడం గమనార్హం. -
కంపెనీ పెట్టండి..రాయితీ పట్టండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 2016లో ‘ఎలక్ట్రానిక్స్ పాలసీ’ని రూపొందించింది.దీని అమలులో అనుసరించాల్సిన విధి విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.ఎలక్ట్రానిక్స్ పాలసీ మార్గదర్శకాల ముసాయిదాను ఇటీవల సిద్ధం చేసిన ఐటీ శాఖ..త్వరలో ప్రభుత్వ ఆమోదానికి పంపనుంది. పాలసీ అమలు తేదీ.. ఎప్పటి వరకు అమల్లో ఉంటుంది తదితర అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ‘ఈ–పాలసీ’కి ప్రభుత్వం ఆమోదం తెలిపితే రాష్ట్రంలో ‘ఈ– పరిశ్రమల’స్థాపన వేగం కానుందని ఐటీ శాఖ అంచనా. ఇది అమల్లోకి వస్తే ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ రంగంలోని సూక్ష్మ, చిన్న, మధ్య, పెద్ద, భారీ పరిశ్రమలకు లబ్ధి చేకూరుతుంది. స్టాంప్ డ్యూటీ చెల్లింపు, సరసమైన ధరల్లో భూ కేటాయింపు, నాలా నిబంధనల సడలింపు, గరిష్టంగా రూ.50 లక్షలకు మించకుండా పెట్టుబడి రాయితీ వంటి అంశాలు మార్గదర్శకాల్లో పొందుపరిచారు. కంపెనీ ఏర్పాటుకు భూమి కొంటే... ఎలక్ట్రానిక్స్ కంపెనీల ఏర్పాటుకు భూమి కొనుగోలు చేసే సంస్థకు వంద శాతం స్టాంప్ డ్యూటీతో పాటు, బదలాయింపు పన్ను,, రిజిస్ట్రేషన్ ఫీజును ప్రభుత్వం రీయంబర్స్ చేస్తుంది. ఒక వేళ అది రెండో లావాదేవీ అయ్యే పక్షంలో పైన పేర్కొన్న వాటిలో 50శాతం ప్రభుత్వం చెల్లిస్తుంది. అలాగే షెడ్లు, భవనాలు తదితరాలపైనా స్టాంప్ డ్యూటీని పూర్తిగా మినహాయిస్తారు.పరిశ్రమల స్థాపనకు వీలుగా భూములు అందుబాటు ధరల్లో లభించేలా చూడటంతో పాటు, లీజుకు తీసుకుని ఏర్పాటు చేసే సంస్థలకు పదేళ్ల పాటు 25% లీజ్ రెంటల్ సబ్సిడీ ఇస్తారు. మహేశ్వరంలోని ‘ఈ– సిటీ’లో ఏర్పాటయ్యే తొలి 30 పరిశ్రమలకు భూమి కొనుగోలుపై 60% సబ్సిడీ లభించనుంది. ఎలక్ట్రానిక్స్ కంపెనీలు స్థాపించే ప్రైవేటు సంస్థలకు వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చుకునేందుకు అవసరమైన ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం అందజేస్తుంది. పెట్టుబడిపై గరిష్టంగా రూ.50 లక్షల రాయితీ సూక్ష్మ, చిన్న తరహా కేటగిరీలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు ఏర్పాటు చేసే తొలి 50 సంస్థలకు 20శాతం పెట్టుబడి రాయితీ లేదా గరిష్టంగా 50లక్షల రాయితీ ఇవ్వాలని ముసాయిదాలో పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు 35%, మహిళా పారిశ్రామికవేత్తలకు 45% వరకు పెట్టుబడి రాయితీ కల్పిస్తారు. మధ్య, పెద్ద, భారీ తరహా పరిశ్రమల కేటగిరీలో అర్హత కలిగిన తొలి 25 పరిశ్రమలకు 20 % రాయితీ లేదా గరిష్టంగా రూ.2 కోట్ల మేర రాయితీ లభిస్తుంది. భవనం, యంత్రాలపై పెట్టుబడికి గాను ఆయా పరిశ్రమలు వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించింది మొదలు ఐదు నుంచి ఏడేళ్ల వరకు కేటగిరీ ఆధారంగా ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం రాయితీ ఇస్తారు. సూక్ష్మ పరిశ్రమలు యంత్రాలపై పెట్టే మొత్తంలో 10% సాయాన్ని ప్రభుత్వమే అందజేయనుంది. నాణ్యత సర్టిఫికెట్ల వ్యయంపైనా సబ్సిడీ ఉత్పత్తులకు గాను చైనా కంపల్సరీ సర్టిఫికెట్, కన్ఫర్మిటీ యూరోపియన్, యూఎల్ సర్టిఫికెషన్, ఐఎస్ఓ తదితర అంతర్జాతీయ నాణ్యత సర్టిఫికెట్ల కోసం ఈ పరిశ్రమలు పెట్టే ఖర్చులో 50శాతం లేదా గరిష్టంగా రూ.2లక్షలను ప్రభుత్వమే భరిస్తుంది. క్లీన్ ఎనర్జీ వినియోగించే పరిశ్రమలకు గరిష్టంగా రూ.2లక్షలు రాయితీ ఇవ్వడంతో పాటు, వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించిన నాటి నుంచి ఐదేళ్ల పాటు వంద శాతం విద్యుత్ సుంకంపై మినహాయింపు ఇస్తారు. తెలంగాణ కేంద్రంగా ఉండే ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు పేటెంట్ల సాధన కోసం ఖర్చులో 50% లేదా గరిష్టంగా రూ.2లక్షలు ప్రభుత్వం చెల్లిస్తుంది. విడి భాగాల రవాణాకు అయ్యే వ్యయంపైనా ఐదేళ్ల పాటు గరిష్టంగా 60% నుంచి 20% వరకు సబ్సిడీ కల్పిస్తారు. 50 మందికి ఉపాధి కల్పించే ‘ఈ పరిశ్రమలకు’రూ.5లక్షలను రిక్రూట్మెంట్ అసిస్టెన్స్‌గా ఐటీ శాఖ అందజేయనుంది -
ఎలక్ట్రానిక్ పరిశ్రమలతో తిరుపతికి మరింత ప్రగతి
రేణిగుంట (చిత్తూరు జిల్లా) : ఎలక్ట్రానిక్ పరిశ్రమలను తిరుపతి, చిత్తూరు ప్రాంతాల్లో ఎక్కువగా తీసుకొచ్చి ప్రజలకు ఉపాధి అవకాశాలను కల్పించాలనే దృక్పథంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నారని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి అన్నారు. రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బిజినెస్ సెంటర్ నూతన భవనాన్ని ఆయన శుక్రవారం ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామితో కలసి ప్రారంభించారు. వింగ్‌టెక్ సారథ్యంలో నడుస్తున్న సెల్కాన్ ఫెసిలిటీలో సెల్ఫోన్లు, చార్జర్ల తయారీ విభాగాన్ని పరిశీలించారు. అక్కడి కార్మికులతో మాట్లాడారు. కార్బన్ కంపెనీని పరిశీలించారు. ఇప్పటికే 7 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు, రెండో యూనిట్ పూర్తయితే మరో 7 వేల మందికి ఉద్యోగావకాశాలు వస్తాయని కంపెనీ ప్రతినిధులు మాలిక్, నాగేంద్ర మంత్రికి తెలిపారు. డిక్సన్ ఫేజ్–2 ప్రారంభం.. ఈఎంసీ–2లో నిర్మాణంలో ఉన్న సెవెన్ హిల్స్ డిజిటల్ పార్కును మేకపాటి గౌతంరెడ్డి, నారాయణస్వామి, స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి పరిశీలించారు. డిక్సన్ కంపెనీ ఫేజ్–2 కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. వివిధ కంపెనీల ఏర్పాటు ద్వారా ఈ ప్రాంతంలో సుమారు 10 వేల మందికి ఉద్యోగావకాశాలు రానున్నట్లు మేకపాటి చెప్పారు. పలు కంపెనీల్లో పనిచేస్తున్న యువతకు సాంకేతిక నైపుణ్యాన్ని అందించేందుకు ప్రభుత్వ నైపుణ్య సంస్థ ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. పరిశ్రమల స్థాపనకు భూములిచ్చిన వారికి ఉద్యోగాల కల్పనలో మొదటి ప్రాధాన్యం ఉంటుందని బియ్యపు మధుసూదన్‌రెడ్డి తెలిపారు. చంద్రగిరి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, కలెక్టర్ నారాయణ భరత్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
ఎలక్ట్రానిక్స్ సంస్థలకు 10 వేల కోట్ల ఫండ్!
న్యూఢిల్లీ: దేశీ ఎలక్ట్రానిక్స్ సంస్థలకు ఆర్థిక చేయూతను అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం త్వరలో రూ.10,000 కోట్ల మూలధనంతో ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ ఫండ్ (ఈడీఎఫ్)ను ఏర్పాటు చేయనున్నది. ఈ ఫండ్‌ను కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, పారిశ్రామికవేత్తలకు బాసటగా నిలువడానికి ఉపయోగిస్తామని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి జేఎస్ దీపక్ తెలిపారు. ఆయన ఇక్కడ జరిగిన క్వాల్కామ్ ‘డిజైన్ ఇన్ ఇండియా’ కార్యక్రమ ప్రారంభోత్సవంలో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ వ్యవస్థను మార్చడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. దేశంలో 2014-15 ఏడాదిలో ఇంజరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు 18 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయని, 2020 నాటికి ఈ ఎగుమతుల విలువ 40 బిలియన్ డాలర్లకు చేరే అవకాశముందని నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్.చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) అభివృద్ధి కోసం ఒక అనుకూల వ్యవస్థ ఏర్పాటుకు రూ.25 కోట్ల ప్రారంభ వ్యయంతో బెంగళూరులో ఒక ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు కానుందని తెలిపారు. 4 లక్షల డాలర్ల కార్పస్ ప్రకటించిన క్వాల్కామ్ ఐటీ పరిశ్రమ సమాఖ్య నాస్కామ్ భాగస్వామ్యంతో క్వాల్కామ్ కంపెనీ భారతీయ పారిశ్రామికవేత్తలు ‘డిజైన్ ఇన్ ఇండియా’ కార్యక్రమం కింద ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను తయారుచేయడానికి అనుగుణంగా 4 లక్షల డాలర్ల కార్పస్‌ను ప్రకటించింది. ‘డిజైన్ ఇన్ ఇండియా’ కార్యక్రమం కింద క్వాల్కామ్ వినూత్నంగా ఆలోచించే కంపెనీల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తుల స్వీకరణకు ఫిబ్రవరి 29 చివరి తేదీగా 10 సంస్థలను ఎంపిక చేసి, ఒక్కొక్క దానికి 10,000 డాలర్ల మూలధనాన్ని సమకూరుస్తుంది. ఈ మూలధనంతో ఆయా కంపెనీలు వాటి వాటి ఉత్పత్తి సంబంధిత ఆలోచనలను క్వాల్కామ్ బెంగళూరు ప్రయోగశాలలో కార్యరూపంలోకి తీసుకురావాల్సి ఉంటుంది. 3 ఉత్తమ ఉత్పత్తులను ఎంపిక చేసి, వాటిని రూపొందించిన కంపెనీలకు ఒక్కొక్క దానికి లక్ష డాలర్ల మూలధనాన్ని అందిస్తుంది. -
హైదరాబాద్‌లో 1,200 కోట్ల పెట్టుబడి
►సిద్ధంగా ఉన్న 64 ఎలక్ట్రానిక్ కంపెనీలు ►స్థలం కేటాయించగానే ప్లాంట్ల ఏర్పాటు ►ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూపు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ‘ఇ-సిటీ’లో అడుగు పెట్టేందుకు కంపెనీలు రెడీ అవుతున్నాయి. తొలుత 64 కంపెనీలు రూ.1,200 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చాయి. ప్రత్యక్షంగా 35 వేల మందికి, పరోక్షంగా 2.10 లక్షల మందికి ఉపాధి లభించనుంది. మరో 150 కంపెనీలు ప్లాంట్లను పెట్టేందుకు సుముఖంగా ఉన్నాయని ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(ఎలియాప్) చెబుతోంది. స్థలం ధర విషయంలో ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన కోసం కంపెనీలు ఎదురు చూస్తున్నాయి. ప్లాంట్ల ఏర్పాటు కార్యరూపంలోకి వస్తే ఎలక్ట్రానిక్స్ రంగంలో హైదరాబాద్ కొత్త పుంతలు తొక్కడం ఖాయమని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. వ్యాపారావకాశాలు మెరుగై మరిన్ని కంపెనీలు పెట్టుబడులతో ముందుకు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఐటీఐఆర్ పరిధిలో..: హైదరాబాద్ సమీపంలో రెండు ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను గతేడాదే కేంద్రం కేటాయించింది. ఫ్యాబ్‌సిటీలో 602 ఎకరాల్లో ఎలక్ట్రానిక్స్ సిటీ (ఇ-సిటీ) పేరుతో, రెండోది అనుబంధ పరిశ్రమల కోసం మహేశ్వరం వద్ద 310 ఎకరాల్లో ఇవి ఏర్పాటు కానున్నాయి. ఈ రెండు క్లస్టర్లు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐటీఐఆర్) పరిధిలోకి వస్తాయి. ఐటీఐఆర్ హైదరాబాద్‌కు రావడంలో ఎలియాప్, నాస్కామ్, హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ కృషి ఉంది. ఇక శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఇ-సిటీ ఉండడంతో ఎగుమతులకు కలిసొస్తుందని కంపెనీలు భావిస్తున్నాయి. తయారీ రంగానికి ఊతమిచ్చేలా బడ్జెట్లో కేంద్రం ప్రకటించిన వరాలు అమలైతే పరిశ్రమ రూపురేఖలు మారతాయన్నది కంపెనీల విశ్వాసం. తెలంగాణ ప్రభుత్వం సింగిల్ విండో విధానం ద్వారా 2 వారాల్లోనే ప్రాజెక్టులకు కావాల్సిన అనుమతులన్నీ ఇవ్వాలని కృతనిశ్చయంతో ఉంది. ధర విషయంలోనే.. ఇ-సిటీలో ప్లాంట్ల ఏర్పాటుకు ఏడాది నుంచి ఎలియాప్ తీవ్రంగా కృషి చేస్తోంది. ధర విషయంలో స్పష్టత రాకపోవడం, ఆ తర్వాత ఎన్నికల కోడ్‌తో ప్రతిపాదన కాస్తా ఆలస్యమైంది. కొత్త ప్రభుత్వం రాకతో తిరిగి ప్రక్రియను ఎలియాప్ వేగిరం చేసింది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తోపాటు వివిధ శాఖల అధికారులతో చర్చలు జరుపుతోంది. ఎకరాకు రూ.20 లక్షలు చెల్లించేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని ఎలియాప్ ప్రెసిడెంట్, ల్యామ్‌పెక్స్ ఎలక్ట్రానిక్స్ ఎండీ ఎన్.శివప్రసాద్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. 64 కంపెనీలు తొలి దశలో రూ.1,200 కోట్లు వెచ్చిస్తాయని పేర్కొన్నారు. ఎకరాకు రూ.35 లక్షలతోపాటు అభివృద్ధి వ్యయం కూడా చెల్లించాలని టీఎస్ఐఐసీ చెబుతోందని, ఇంత మొత్తం చెల్లించే స్తోమత కంపెనీలకు లేదని తెలిపారు. ఇప్పటికే చాలా ఆలస్యమైందని, ప్రభుత్వం నుంచి త్వరలోనే తీపి కబురు వస్తుందని విశ్వసిస్తున్నట్టు ఎలికో ఎండీ రమేష్ దాట్ల చెప్పారు. ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైతే హైదరాబాద్‌కు మరిన్ని సంస్థలు వస్తాయని అన్నారు. కంపెనీలకు పూర్తి తోడ్పాటు.. ప్లాంట్ల ఏర్పాటుకు కావాల్సిన పూర్తి సహకారం ప్రభుత్వం నుంచి ఉంటుందని తెలంగాణ పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రదీప్ చంద్ర తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ఏవైతే వర్తిస్తాయో అవే ప్రయోజనాలు తెలంగాణలోనూ అమలవుతాయని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఆందోళన చెందక్కర లేదని పేర్కొన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటైన కమిటీయే స్థలం ధర నిర్ణయిస్తుందని తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ(టీఎస్ఐఐసీ) ఎండీ జయేష్ రంజన్ వెల్లడించారు. -
పెట్టుబడులకు సిద్ధంగా 64 ఎలక్ట్రానిక్ కంపెనీలు
హైదరాబాద్: హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడానికి 64 ఎలక్ట్రానిక్ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. ఈ కంపెనీలు దాదాపు 1200 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. స్థలం కేటాయించగానే సంస్థలు తమ ప్లాంట్లను ఏర్పాటు చేస్తాయని ఎలక్ట్రానిక్ పరిశ్రమల సంఘం (ఎలియాప్)తెలిపింది. ఎలియాప్ పరిధిలో మొత్తం 64 కంపెనీలు ఉన్నాయి. ఇవి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నా భూముల కేటాయింపులు జరుగకపోవడం వల్ల ఆలస్యం జరుగుతోంది. భూవిస్తీర్ణం, భూమి ధరల విషయమై ఇంకా స్పష్టత రాలేదు. తెలంగాణ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, భూకేటాయింపుల ఆధారంగా ఈ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది.