ముంబై: చైనీస్ కన్జూమర్ అప్లయెన్సెస్ కంపెనీ హేయర్ దేశీ కార్యకలాపాలపై పలు కార్పొరేట్ దిగ్గజాలు కన్నేసినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. హేయర్(Haier) అప్లయెన్సెస్ ఇండియాలో 51 శాతం వాటా కొనుగోలు చేయాలని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఇందుకు పలు పీఈ దిగ్గజాలు, దేశీ కార్పొరేట్ల(Corporate)తో చేతులు కలిపాయి. వార్‌బర్గ్ పింకస్.. భారతీ ఎంటర్‌ప్రైజెస్‌తో, బెయిన్ క్యాపిటల్ దాల్మియా భారత్ గ్రూప్‌తో జట్టు కట్టాయి. ఈ రేసులో వెల్‌స్పన్ గ్రూప్‌తోపాటు.. ఇతర పీఈ దిగ్గజాలు టీపీజీ క్యాపిటల్, గోల్డ్‌మన్ శాక్స్, జీఐసీ(సింగపూర్) పోటీ పడుతున్నాయి.
ఎలక్ట్రానిక్ అప్లయెన్సెస్ చైనీస్ దిగ్గజం హేయర్ ఇండియా దేశీయంగా హోమ్ అప్లయెన్సెస్‌లో మూడో పెద్ద కంపెనీగా నిలుస్తోంది. రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్, ఏసీ, టీవీల విక్రయాలలో కొరియన్ దిగ్గజాలు ఎల్‌జీ, శామ్‌సంగ్‌తో పోటీ పడుతోంది. అయితే హేయర్ ఇండియాలో నియంత్రిత వాటా (51 శాతం) కొనుగోలు చేసేందుకు దేశీ కార్పొరేట్లతోపాటు.. గ్లోబల్ పీఈ(Global PE) సంస్థలు సైతం దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. వివరాలు చూద్దాం..
ఇప్పటికే ఆఫర్లు
హేయర్ ఇండియాలో నియంత్రిత వాటా కొనుగోలుకి కొన్ని సంస్థలు ఇప్పటికే నాన్‌బైండింగ్ బిడ్స్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు ఆసక్తిని చూపుతున్న ఇతర దేశీ కార్పొరేట్లలో మణిపాల్ గ్రూప్, డాబర్ గ్రూప్, ముంజాల్ కుటుంబం ఉన్నట్లు సమాచారం. కంపెనీతో చర్చలు చేపట్టిన పీఈ దిగ్గజాలలో బ్లాక్‌స్టోన్, సీవీసీ క్యాపిటల్ పార్ట్‌నర్స్, ఈక్యూటీ, టీఏ అసోసియేట్స్ సైతం ఉన్నాయి. లిస్టెడ్ కంపెనీల ద్వారా కాకుండా ప్రమోటర్లు, గ్రూప్ ప్రయివేట్ సంస్థల నుంచి ఆసక్తిని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
స్థానికతకు ప్రాధాన్యం
దేశీ నియంత్రణ సంస్థల నిశిత పరీక్షల నేపథ్యంలో హేయర్ ఇండియా కార్యకలాపాలలో స్థానికతను పెంచుకునే వ్యూహాల్లో ఉంది. దీనిలో భాగంగా దేశీ భాగస్వామి కోసం చూస్తోంది. 20–49 శాతం వరకూ వాటాను సైతం ఆఫర్ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే 51 శాతం వాటాకు స్థానిక సంస్థలు డిమాండ్ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తద్వారా చైనాయేతర సంస్థలు మెజారిటీ వాటాను కలిగి ఉండటం ద్వారా యాజమాన్య నిర్వహణకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిపాయి. ఆపై స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు వీలుగా ఒప్పందం కుదుర్చుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: భారత్‌కు ‘తయారీ’ స్వర్ణయుగం
భారీ వృద్ధిపై దృష్టి
ఈ క్యాలెండర్ ఏడాది(2024)లో బిలియన్ డాలర్లకుపైగా(రూ.8,900 కోట్లు) ఆదాయ మైలురాయిని అధిగమించే లక్ష్యంలో సాగుతున్నట్లు హేయర్ ఇండియా ప్రెసిడెంట్ ఎన్‌ఎస్ సతీష్ వెల్లడించారు. ఇందుకు పండుగలు, వేసవి సీజన్, ప్రీమియం ధరలు సహకరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ బాటలో 2025లో రూ. 11,500 కోట్ల ఆదాయాన్ని అందుకోవాలని భావిస్తున్నట్లు తెలియజేశారు. వెరసి 2024లో 35 శాతం వృద్ధి సాధించడం ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించనున్నట్లు వివరించారు. ప్రధానంగా లెడ్, వాషింగ్ మెషీన్ల విభాగం పటిష్ట పురోగతిని అందుకుంటున్నట్లు వెల్లడించారు. కాగా.. ఇప్పటికే దేశీయంగా రూ. 2,500 కోట్లు ఇన్వెస్ట్ చేసిన ఎల్రక్టానిక్స్, కన్జూమర్ కంపెనీ మూడో తయారీ కేంద్రాన్ని దక్షిణాదిలో ఏర్పాటు చేసే సన్నాహాల్లో ఉంది. 2026 లేదా 2027కల్లా కార్యకలాపాలను ప్రారంభించే ప్రణాళికల్లో ఉంది. ప్రస్తుతం పుణే, గ్రేటర్ నోయిడాలలో తయారీ ప్లాంట్లను కలిగి ఉంది. కంపెనీ జనవరి–డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment