హైదరాబాద్‌లో 1,200 కోట్ల పెట్టుబడి
►సిద్ధంగా ఉన్న 64 ఎలక్ట్రానిక్ కంపెనీలు
►స్థలం కేటాయించగానే ప్లాంట్ల ఏర్పాటు
►ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూపు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ‘ఇ-సిటీ’లో అడుగు పెట్టేందుకు కంపెనీలు రెడీ అవుతున్నాయి. తొలుత 64 కంపెనీలు రూ.1,200 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చాయి. ప్రత్యక్షంగా 35 వేల మందికి, పరోక్షంగా 2.10 లక్షల మందికి ఉపాధి లభించనుంది. మరో 150 కంపెనీలు ప్లాంట్లను పెట్టేందుకు సుముఖంగా ఉన్నాయని ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(ఎలియాప్) చెబుతోంది. స్థలం ధర విషయంలో ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన కోసం కంపెనీలు ఎదురు చూస్తున్నాయి. ప్లాంట్ల ఏర్పాటు కార్యరూపంలోకి వస్తే ఎలక్ట్రానిక్స్ రంగంలో హైదరాబాద్ కొత్త పుంతలు తొక్కడం ఖాయమని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. వ్యాపారావకాశాలు మెరుగై మరిన్ని కంపెనీలు పెట్టుబడులతో ముందుకు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఐటీఐఆర్ పరిధిలో..: హైదరాబాద్ సమీపంలో రెండు ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను గతేడాదే కేంద్రం కేటాయించింది. ఫ్యాబ్‌సిటీలో 602 ఎకరాల్లో ఎలక్ట్రానిక్స్ సిటీ (ఇ-సిటీ) పేరుతో, రెండోది అనుబంధ పరిశ్రమల కోసం మహేశ్వరం వద్ద 310 ఎకరాల్లో ఇవి ఏర్పాటు కానున్నాయి. ఈ రెండు క్లస్టర్లు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (ఐటీఐఆర్) పరిధిలోకి వస్తాయి. ఐటీఐఆర్ హైదరాబాద్‌కు రావడంలో ఎలియాప్, నాస్కామ్, హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ కృషి ఉంది. ఇక శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఇ-సిటీ ఉండడంతో ఎగుమతులకు కలిసొస్తుందని కంపెనీలు భావిస్తున్నాయి. తయారీ రంగానికి ఊతమిచ్చేలా బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించిన వరాలు అమలైతే పరిశ్రమ రూపురేఖలు మారతాయన్నది కంపెనీల విశ్వాసం. తెలంగాణ ప్రభుత్వం సింగిల్ విండో విధానం ద్వారా 2 వారాల్లోనే ప్రాజెక్టులకు కావాల్సిన అనుమతులన్నీ ఇవ్వాలని కృతనిశ్చయంతో ఉంది.
ధర విషయంలోనే..
ఇ-సిటీలో ప్లాంట్ల ఏర్పాటుకు ఏడాది నుంచి ఎలియాప్ తీవ్రంగా కృషి చేస్తోంది. ధర విషయంలో స్పష్టత రాకపోవడం, ఆ తర్వాత ఎన్నికల కోడ్‌తో ప్రతిపాదన కాస్తా ఆలస్యమైంది. కొత్త ప్రభుత్వం రాకతో తిరిగి ప్రక్రియను ఎలియాప్ వేగిరం చేసింది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తోపాటు వివిధ శాఖల అధికారులతో చర్చలు జరుపుతోంది. ఎకరాకు రూ.20 లక్షలు చెల్లించేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని ఎలియాప్ ప్రెసిడెంట్, ల్యామ్‌పెక్స్ ఎలక్ట్రానిక్స్ ఎండీ ఎన్.శివప్రసాద్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. 64 కంపెనీలు తొలి దశలో రూ.1,200 కోట్లు వెచ్చిస్తాయని పేర్కొన్నారు. ఎకరాకు రూ.35 లక్షలతోపాటు అభివృద్ధి వ్యయం కూడా చెల్లించాలని టీఎస్‌ఐఐసీ చెబుతోందని, ఇంత మొత్తం చెల్లించే స్తోమత కంపెనీలకు లేదని తెలిపారు. ఇప్పటికే చాలా ఆలస్యమైందని, ప్రభుత్వం నుంచి త్వరలోనే తీపి కబురు వస్తుందని విశ్వసిస్తున్నట్టు ఎలికో ఎండీ రమేష్ దాట్ల చెప్పారు. ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైతే హైదరాబాద్‌కు మరిన్ని సంస్థలు వస్తాయని అన్నారు.
కంపెనీలకు పూర్తి తోడ్పాటు..
ప్లాంట్ల ఏర్పాటుకు కావాల్సిన పూర్తి సహకారం ప్రభుత్వం నుంచి ఉంటుందని తెలంగాణ పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రదీప్ చంద్ర తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ఏవైతే వర్తిస్తాయో అవే ప్రయోజనాలు తెలంగాణలోనూ అమలవుతాయని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఆందోళన చెందక్కర లేదని పేర్కొన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటైన కమిటీయే స్థలం ధర నిర్ణయిస్తుందని తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ(టీఎస్‌ఐఐసీ) ఎండీ జయేష్ రంజన్ వెల్లడించారు.