సాక్షి, రంగారెడ్డి : ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి రంగంలో రాబోయే పదేండ్లలో రెండున్నర లక్షల కోట్ల ఆదాయం, 16 లక్షల ఉద్యోగాలు సృష్టించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకెళ్తుందని, స్థిరమైన ప్రభుత్వం, సమర్థవంతమైన నాయకుడు ఉన్నందునే ఇది సాధ్యమవుతుందని ఉద్ఘాటించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని రావిర్యాల ఈ-సిటీలో రేడియంట్ ఎలక్ట్రానిక్స్ యూనిట్‌లో మరో నూతన ప్లాంట్‌ను మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి కలిసి సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రేడియంట్ కంపెనీ నుంచి 50 లక్షల టీవీలు తయారవ్వడం గర్వంగా ఉందన్నారు. దేశంలోనే అతిపెద్ద ఎల్ఈడీ టీవీ కంపెనీ ఇది అని పేర్కొన్నారు. రేడియంట్ కంపెనీలో 3,800ల మందికి పైగా పని చేస్తున్నారని తెలిపారు. యూనిట్ ప్రారంభంలో సంవత్సరానికి 4 లక్షల టీవీలు తయారు చేద్దామని అనుకున్నప్పటికీ.. నెలకు 4 లక్షల టీవీలు తయారు చేసే స్థాయికి ఎదగడం సంతోషంగా ఉందన్నారు. ఇది తెలంగాణకు గర్వకారణం అన్నారు. ఉద్యోగుల్లో 53 శాతం మహిళలు ఉండగా, 60 శాతం తెలంగాణ వారే ఉన్నారని కేటీఆర్ స్పష్టం చేశారు.
చదవండి: అన్నీ కొరతలే.. అద్భుతం: కేటీఆర్ ట్వీట్
అన్ని రంగాల్లో బహుముఖ అభివృద్ధి
ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో టెన్త్, ఇంటర్మీడియట్, ఐటీఐ చదువుకున్న పిల్లలను ఉద్యోగులుగా తీర్చిదిద్దే అవకాశం ఉందని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కేటీఆర్ తెలిపారు. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ మరింత విస్తరిస్తే వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఫ్యాబ్ సిటీలో 15 వేల మంది ప్రత్యక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. రాబోయే సంవత్సర కాలంలో 15 వేల సంఖ్య 40 వేలకు చేరుకోబోతుందన్నారు. శేరిలింగంపల్లిలో ఇటీవలే ప్రపంచంలోనే రెండో అతిపెద్దదైన గూగుల్ క్యాంపస్‌కు శంకుస్థాపన చేశామన్నారు. కొత్తూరులో లిక్విడ్ డిటర్జెంట్ యూనిట్‌ను ప్రారంభించామన్నారు. ఈ రకంగా తెలంగాణలో సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ రంగాలతో పాటు ఎలక్ట్రానిక్స్ రంగాలతో పాటు అన్ని రంగాల్లో బహుముఖంగా దూసుకుపోతున్నామని చెప్పారు.
చదవండి: తెలంగాణ గ్రూప్-1 పోస్టులకు అప్లై చేస్తున్నారా? బబ్లింగ్‌తో భద్రం!
Live: Addressing the gathering after inaugurating the Radiant Appliances and Electronics plant at E-City in Raviryala. https://t.co/x5aepfSErc
— KTR (@KTRTRS) May 2, 2022
రాబోయే 10 సంవత్సరాల్లో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో దాదాపు రెండున్నర లక్షల కోట్లు ఆదాయాన్ని సమకూర్చుకునే విధంగా ఎదగాలని, 16 లక్షల కొత్త ఉద్యోగావకాశాలు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. వ్యాపారానికి తెలంగాణలో సానుకూల వాతావరణం ఉంది. స్థిరమైన ప్రభుత్వం, సమర్థవంతమైన నాయకుడు తెలంగాణలో ఉన్నారు. హైదరాబాద్ చుట్టూ మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాలకు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్‌ను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేటీఆర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment