నాణ్యత కొనుగోలుదారుడి హక్కు అని భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్) చెబుతోంది. ఈ క్రమంలో వివిధ వస్తువులు, ఉత్పత్తులు, పరికరాలు సహా అన్నీ బీఐఎస్ నిర్దేశిత ప్రమాణాల మేరకు ఉండాల్సిందేనని అధికారులు తెలిపారు. దేశ ప్రజలు నిత్యం వినియోగించే దాదాపు 344 వస్తువులకు విధిగా బీఐఎస్ నాణ్యత గుర్తు ఉండాల్సిందేనని స్పష్టం సంస్థ స్పష్టం చేసింది. విదేశాల నుంచి మన దేశానికి వస్తున్న మొబైల్‌ఫోన్‌లు సహా అనేక రకాల ఎలక్ట్రానిక్ వస్తువులకు బీఐఎస్ గుర్తింపు తప్పనిసరని తెలిపింది. బీఐఎస్ ఇప్పటి వరకూ సుమారు 20 వేల ప్రమాణాలను ధ్రువీకరించి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిసింది.
నాణ్యత లేని వస్తువుల దిగుమతిని అరికట్టడానికి, దేశీయ తయారీని పెంచడానికి ప్రభుత్వం స్విచ్, సాకెట్, కేబుల్ ట్రంక్.. వంటి ఎలక్ట్రికల్ వస్తువులకు నాణ్యత నిబంధనలను తప్పనిసరి చేసింది. ఎలక్ట్రికల్ యాక్సెసరీస్ (క్వాలిటీ కంట్రోల్) ఆర్డర్, 2023ని ఈ ఏడాది జనవరి 1న డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) జారీ చేసింది. ఈ ఆర్డర్ ప్రకారం ఎలక్ట్రిక్ వస్తువులకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) గుర్తు తప్పనిసరి చేసింది. లేదంటే వాటిని ఉత్పత్తి చేయడం, విక్రయించడం, వ్యాపారం చేయడం, దిగుమతి చేయడం, నిల్వ చేయడం సాధ్యం కాదు.
ఆర్డర్ వెలువడిన ఆరు నెలల నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయిని డీపీఐఐటీ తెలిపింది. ఎంఎస్ఎంఈ రంగాన్ని రక్షించడానికి అధికారులు నిబంధనల్లో కొన్ని సడలింపులు ఇచ్చినట్లు తెలుస్తుంది. చిన్న పరిశ్రమలకు అదనంగా తొమ్మిది నెలలు, మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌లు 12 నెలల తర్వాత నిబంధనల పరిధిలోకి వస్తాయని సమాచారం. బీఐఎస్ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘిస్తే, మొదటి నేరానికి గరిష్ఠంగా రెండేళ్ల జైలుశిక్ష లేదా కనీసం రూ.2 లక్షల జరిమానా విధించవచ్చు. రెండో, తదుపరి నేరాల విషయంలో మరింత కఠిన శిక్షలు ఉంటాయి.
ఇదీ చదవండి: ప్రపంచంలోనే అతిచిన్న ఎలక్ట్రిక్ కారు.. ధర ఎంతంటే?
బీఐఎస్ ప్రమాణాలను ఎలా నిర్ధారిస్తుందంటే..
తయారీదారులు, ప్రయోగశాలలు, సంబంధిత సైంటిస్టులు, నియంత్రణ సంస్థలు, వినియోగదారులు, ఆ రంగంలోని నిపుణులు కమిటీగా ఏర్పడి ప్రమాణాల ముసాయిదాను రూపొందిస్తారు. ఆపై భారతీయ ప్రమాణాలను తయారుచేస్తారు. ఏదైనా సంస్థ తయారు చేసిన వస్తువు నమూనా (శాంపిల్) తీసుకుని ప్రయోగశాలల్లో పరిశీలించి బీఐఎస్ నిర్దేశిత ప్రమాణాలు ఉంటే ఐఎస్‌ఐ మార్కు వినియోగానికి లైసెన్స్ కేటాయిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment