సాక్షి, అమరావతి బ్యూరో: బంగారు ఆభరణాల విక్రయంలో మోసాలకు చెక్ పడనుంది. ఇకపై నగలకు హాల్‌మార్క్ తప్పనిసరి కానుంది. జూన్ 1నుంచి హాల్‌మార్క్ లేని ఆభరణాలను విక్రయించకూడదని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్నాళ్లూ పలు జ్యుయలరీ షాపుల్లో నాణ్యతకు తిలోదకాలిస్తూ నగలను విక్రయిస్తుండటంతో వినియోగదారులు మోసపోతున్నారు. ఇలాంటి మోసాలపై అందిన ఫిర్యాదుల నేపథ్యంలో బంగారు, వెండి నగలపై వాటి స్వచ్ఛతను తెలియజేసే హాల్‌మార్క్‌ను తప్పనిసరి చేస్తూ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనను జూన్ 1వ తేదీ నుంచి విధిగా అమలు చేయనుంది.
ఈలోగా నగల దుకాణాల యజమానులు భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్) ద్వారా హాల్‌మార్క్ రిజిస్ట్రేషన్ చేయించుకుని లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. ఇలా లైసెన్స్ పొందిన జ్యుయలరీ దుకాణాలను మాత్రమే 14 (585), 18 (750), 22 (916) క్యారెట్ల బంగారు ఆభరణాల అమ్మకానికి అనుమతిస్తారు. హాల్‌మార్క్ లేని నగలను విక్రయిస్తే చట్టరీత్యా గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష లేదా రూ.2 లక్షల నుంచి 5 లక్షల వరకు జరిమానా విధిస్తారు. ఆ షాపులోని ఆభరణాలనూ సీజ్ చేస్తారు. అలాగే నగల కొనుగోలుదారుకు హాల్‌మార్క్ సర్టిఫికేషన్ ఉన్న బిల్లు తప్పనిసరిగా ఇవ్వాలి. బిల్లు ఇవ్వకపోయినా షాపు యజమానిపై చర్యలు తీసుకుంటారు. ఇకపై ఆభరణాల నాణ్యతపై అనుమానం వచ్చి బీఐఎస్ అధికారులకు ఫిర్యాదు చేస్తే వాటి స్వచ్ఛతను పరీక్షిస్తారు. స్వచ్ఛతలో తేడాలుంటే ఆ మొత్తాన్ని షాపు యజమాని నుంచి వసూలు చేసి కొనుగోలుదారుకు ఇప్పిస్తారు.
మోసాలు ఇలా..
బంగారంలో ఇతర లోహాలను కలిపినా దాని సహజ రంగు పూర్తిగా కోల్పోదు. వ్యాపారులు దీనిని ఆసరా చేసుకుని కృత్రిమ లేపనాలతో మెరిసేలా చేసి, రాగి వంటి లోహాలను కలిపి మేలిమి బంగారంగా అంటగడతారు. ఇకపై అలాంటి మోసాలకు అడ్డుకట్ట వేయడానికి, వినియోగదారుడిని కల్తీ నుంచి కాపాడటానికి బీఐఎస్ హాల్‌మార్క్ నిబంధన ఉపయోగపడుతుందని కన్సూ్యమర్స్ అఫైర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ స్టేట్ విజిలెన్స్ కమిటీ సభ్యుడు కాండ్రేగుల వెంకటరమణ ‘సాక్షి’తో చెప్పారు.
రాష్ట్రంలో 876 షాపులే..
ఆంధ్రప్రదేశ్‌లో 876 దుకాణాలకు మాత్రమే హాల్‌మార్క్ రిజిస్ట్రేషన్ ఉంది. ఈ లైసెన్స్ లేని షాపులు రాష్ట్రంలో 7 వేలకు పైగా ఉండవచ్చని అధికారుల అంచనా. రాష్ట్రంలో ఇలాంటి షాపుల గణనను చేపట్టే పనిలో బీఐఎస్ అధికారులున్నారు.
హాల్‌మార్క్ అంటే..
ఆభరణాల బంగారంలో స్వచ్ఛత పాళ్లను తెలియజేసేదే హాల్‌మార్క్. నగలపై బంగారం స్వచ్ఛత, ముద్ర, హాల్‌మార్క్ వేసిన కేంద్రం పేరు, ఆభరణం తయారు చేసిన తేదీ, విక్రయించిన షాపు పేరు ఉంటాయి. ఆభరణం నాణ్యతలో తేడాలుంటే.. దీనిని బట్టి అది ఏ షాపులో కొనుగోలు చేసిందీ తెలిసిపోతుంది. ముద్ర లేజర్‌తో వేసింది కాబట్టి చెరిగిపోయే లేదా చెరిపేసే వీలుండదు.
శిక్ష, జరిమానాలు తప్పవు
జూన్ 1 నుంచి జ్యుయలరీ షాపుల్లో హాల్‌మార్క్ ఆభరణాలనే విక్రయించాలి. ఈలోగా దుకాణాల వారు బీఐఎస్ నుంచి హాల్‌మార్క్ రిజిస్ట్రేషన్ చేయించుకుని సర్టిఫికేషన్ పొందాలి. దీనిపై జ్యుయలరీ అసోసియేషన్ల ప్రతినిధులకు అవగాహన కల్పిస్తున్నాం. హాల్‌మార్క్ లేని ఆభరణాలు విక్రయిస్తే జైలు శిక్ష, భారీ జరిమానా తప్పదు.
– ఆర్.తిరుమలరావు, సైంటిస్ట్–డి, బీఐఎస్
Comments
Please login to add a commentAdd a comment