Gold jewelery manufacturers
-
జువెలర్ల ఆదాయమూ ‘బంగారమే’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బంగారు ఆభరణాల రంగంలో ఉన్న వ్యవస్థీకృత రిటైలర్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 17–10 శాతం ఆదాయ వృద్ధి సాధించే అవకాశం ఉందని క్రిసిల్ రేటింగ్స్ నివేదిక వెల్లడించింది. పుత్తడి ధర పెరగడమే ఇందుకు కారణమని తెలిపింది. క్రిసిల్ నివేదిక ప్రకారం.. ఆభరణాల అమ్మకాల పరిమాణం 2023–24 మాదిరిగానే స్థిరంగా ఉంటుందని అంచనా. బంగారం ధరలు గణనీయంగా పెరగడం, నూతన ఔట్లెట్స్ జోడింపులు.. వెరశి అధిక సరుకు నిల్వల స్థాయిల కారణంగా రిటైలర్ల మూలధన అవసరాలు పెరగవచ్చు. సురక్షిత పెట్టుబడి.. ఆభరణాల మార్కెట్లో వ్యవస్థీకృత రంగం వాటా మూడింట ఒక వంతు కంటే కొంచెం ఎక్కువగా ఉంది. మిగిలిన వాటా అవ్యవస్థీకృత రంగం కైవసం చేసుకుంది. దేశీయంగా బంగారం ధర 2023–24లో 15 శాతం పెరిగి 2024 మార్చి చివరి నాటికి 10 గ్రాములకు రూ.67,000కి చేరుకుంది. ఏప్రిల్‌లో ధర రూ.73,000 స్థాయికి వెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ సెంట్రల్ బ్యాంకులు, అలాగే భౌగోళిక రాజకీయ అనిశ్చితి మధ్య వినియోగదారులు చూసే సురక్షిత పెట్టుబడి ఎంపికలలో బంగారం ఒకటిగా నిలవడమే ధర పెరుగుదలకు కారణం. అధిక తగ్గింపులు.. బ్రాండింగ్, మార్కెటింగ్ వ్యయాన్ని పెంచడమే కాకుండా, అధిక బంగారం ధరల మధ్య వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నంలో ఉత్పత్తి డిజైన్స్, ఆఫర్లను విస్తరించడం కొనసాగించినప్పటికీ, రిటైలర్లు కొనుగోలుదారులకు అధిక తగ్గింపులను అందించే అవకాశం ఉంది. అమ్మకాలు దూసుకెళ్లేందుకు గోల్డ్ ఎక్సే్ఛంజ్ ఆఫర్లను ప్రమోట్ చేయవచ్చు. ఫలితంగా మూడింట ఒకవంతు ఉన్న గోల్డ్ ఎక్సే్చంజ్ పథకాల వాటా గణనీయంగా పెరగనుంది. కస్టమర్ల ప్రాధాన్యతల్లో మార్పు రావడం, విక్రయ సంస్థలు ప్రథమ, ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించడంతో వ్యవస్థీకృత రంగం వాటా వృద్ధి చెందనుంది. కాగా, పసిడి ధర దూసుకెళ్లిన నేపథ్యంలో తక్కువ క్యారట్ కలిగిన ఆభరణాలకు కస్టమర్లు మళ్లే అవకాశం ఉందని హీరావాలా జెమ్స్, జువెల్లర్స్ ఎండీ గౌతమ్ చవాన్ తెలిపారు.స్థిరంగా క్రెడిట్ ప్రొఫైల్స్..ఆరోగ్యకర బ్యాలెన్స్ షీట్స్ మద్దతుతో స్టోర్ విస్తరణలు మహమ్మారి తర్వాత బలమైన రెండంకెల వృద్ధిని సాధించాయి. స్థిర పరిమాణం కారణంగా 2024–25లో స్టోర్ల జోడింపు వేగం 10–12 శాతానికి తగ్గవచ్చు. పెరిగిన బంగారం ధరల ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ ధరతో బంగారం నిల్వలు భర్తీ అవుతాయి. వర్కింగ్ క్యాపిటల్ రుణాలలో ఆశించిన పెరుగుదల ఉన్నప్పటికీ.. ఆరోగ్యకర రాబడి పెరుగుదల, తగిన లాభదాయకత కారణంగా బలంగా నగదు రాకతో వ్యవస్థీకృత బంగారు ఆభరణాల రిటైలర్ల క్రెడిట్ ప్రొఫైల్స్‌ను స్థిరంగా ఉంచుతున్నట్టు క్రిసిల్ వెల్లడించింది. -
‘హాల్‌మార్క్’ తప్పనిసరి ఉత్తర్వులపై స్టే ఇవ్వండి
సాక్షి, అమరావతి: బంగారు ఆభరణాలపై హాల్‌మార్క్‌ను ముద్రించడం తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల చట్టబద్ధతను సవాల్ చేస్తూ ఏపీ బులియన్ బంగారు, వెండి, వజ్రాల వ్యాపారుల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. కేంద్రం ఉత్తర్వులను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి, వాటి అమలుపై స్టే ఇవ్వాలని కోరుతూ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాశీ విజయకుమార్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్రం ఇచ్చే వివరాల ఆధారంగా మధ్యంతర ఉత్తర్వుల జారీపై నిర్ణయం తీసుకుంటామంది. తదుపరి విచారణను సెప్టెంబర్ 6కి వాయిదా వేసింది. హాల్‌మార్క్ అమలులో అనేక ఇబ్బందులు.. అంతకుముందు పిటిషనర్ తరఫు న్యాయవాది మువ్వా రవీంద్ర వాదనలు వినిపిస్తూ.. బంగారు ఆభరణాలపై హాల్‌మార్క్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులు ఏకపక్షమన్నారు. బంగారు ఆభరణాలకు హాల్‌మార్క్ అమలులో అనేక ఇబ్బందులున్నాయని తెలిపారు. ‘దేశవ్యాప్తంగా 5 లక్షల మంది, రాష్ట్రంలో 50 వేల మంది బంగారు వ్యాపారులు ఉన్నారు. హాల్‌మార్క్ ముద్రించాల్సిన ఆభరణాల సంఖ్య దాదాపు 1,000 కోట్లు ఉంటుంది. హాల్‌మార్క్‌ను తప్పనిసరి చేస్తూ ఇచ్చిన గడువు ఈ ఏడాది జూన్ 15తో ముగిసింది. హాల్‌మార్క్ లేకుండా ఆభరణాలు అమ్మినవారికి జైలుశిక్ష, జరిమానా విధించవచ్చు. హాల్‌మార్క్ వేసే కేంద్రాలు చాలా తక్కువ సంఖ్యలో పెద్ద నగరాల్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కరోనా, లాక్డౌన్ వల్ల కేంద్రం నిర్దేశించిన గడువులోపు ఆభరణాలకు హాల్‌మార్క్ వేయించడం అసాధ్యంగా మారింది. హాల్‌మార్క్ వేసిన ఆభరణాలకు మెరుగుపెట్టిస్తే అది పోతుంది. అప్పుడు ఏం చేయాలనే దానికి ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఎలాంటి స్పష్టత లేదు’ అని రవీంద్ర ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. వినియోగదారుల ప్రయోజనాల కోసమే.. కేంద్రం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎన్.హరినాథ్ వాదనలు వినిపిస్తూ.. వినియోగదారుల ప్రయోజనాల కోసం ఆభరణాల నాణ్యత, శుద్ధత, మోసాలను అరికట్టడం కోసం కేంద్రం హాల్‌మార్క్‌ను తప్పనిసరి చేసిందన్నారు. గడువు ఇస్తే పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచుతానని తెలిపారు. -
బంగారు ఆభరణాలపై హాల్‌మార్క్ తప్పనిసరి
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 256 జిల్లాల్లో బంగారు ఆభరణాలపై హాల్‌మార్క్ తప్పనిసరి అని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) డైరెక్టర్ జనరల్ (డీజీ) ప్రమోద్‌కుమార్ తివారి తెలిపారు. ఈ ఆదేశాలు బుధవారం నుంచే అమలులోకి వస్తాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరు మినహా మిగిలిన జిల్లాల్లోను, తెలంగాణలోని ఏడు జిల్లాల్లోను ఇకపై విక్రయించే బంగారు ఆభరణాలపై హాల్‌మార్కు తప్పనిసరని తెలిపారు. ఆయన బుధవారం వర్చువల్‌గా మీడియా సమావేశంలో మాట్లాడారు. వార్షిక టర్నోవరు రూ.40 లక్షల కన్నా తక్కువ ఉన్న నగల వ్యాపారులను దీని నుంచి మినహాయిస్తున్నామని తెలిపారు. కేంద్ర వాణిజ్య పాలసీకి అనుగుణంగా ఎగుమతి, దిగుమతి ఆభరణాలు, అంతర్జాతీయ ఎగ్జిబిషన్ల ఆభరణాలు, ప్రభుత్వ అనుమతితో బీ2బీ డొమెస్టిక్ ఎగ్జిబిషన్ల ఆభరణాలకు కూడా మినహాయిస్తున్నట్లు వివరించారు. గడియారాలు, ఫౌంటెన్ పెన్నులు, కుందన్ పోల్కి తదితర ప్రత్యేక నగలను కూడా మినహాయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆభరణాల విక్రేతలు ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, ఎలాంటి రుసుములు ఉండవని చెప్పారు. ఎగుమతి, దిగుమతిదారులు, టోకు వర్తకులు, పంపిణీదారులు, విలువైన మెటల్ వస్తువుల రిటైల్ విక్రయదారులు తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. చేతివృత్తిదారులకు మినహాయింపు ఇస్తున్నామన్నారు. హాల్‌మార్క్ లేని పాత బంగారు నగలు ఇంట్లో ఉంటే వాటిని దుకాణదారులకు అమ్ముకోవచ్చని తెలిపారు. ఆ బంగారు నగల తయారీదారులు, టోకు వర్తకులు, రిటైలర్లకు ఆగస్టు చివరివరకు ఎలాంటి జరిమానా విధించబోమని చెప్పారు. హాల్మార్కులో ఆరు అంకెలకోడ్, బీఐఎస్ మార్కు, ప్యూరిటీ, డెలివరీ ఓచర్లను అమ్మకందార్లకు ఇస్తామన్నారు. ఏమైనా సమస్యలు వస్తే పరిష్కరించడానికి భాగస్వాములు, రెవెన్యూ అధికారులు, న్యాయ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఏపీలో హాల్‌మార్క్ కేంద్రాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలు తెలంగాణలో: మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్ (గ్రామీణ), వరంగల్ (పట్టణ), రంగారెడ్డి, హైదరాబాద్, ఖమ్మం జిల్లాలు -
పసిడి మోసాలకు పంచ్
సాక్షి, అమరావతి బ్యూరో: బంగారు ఆభరణాల విక్రయంలో మోసాలకు చెక్ పడనుంది. ఇకపై నగలకు హాల్‌మార్క్ తప్పనిసరి కానుంది. జూన్ 1నుంచి హాల్‌మార్క్ లేని ఆభరణాలను విక్రయించకూడదని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్నాళ్లూ పలు జ్యుయలరీ షాపుల్లో నాణ్యతకు తిలోదకాలిస్తూ నగలను విక్రయిస్తుండటంతో వినియోగదారులు మోసపోతున్నారు. ఇలాంటి మోసాలపై అందిన ఫిర్యాదుల నేపథ్యంలో బంగారు, వెండి నగలపై వాటి స్వచ్ఛతను తెలియజేసే హాల్‌మార్క్‌ను తప్పనిసరి చేస్తూ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనను జూన్ 1వ తేదీ నుంచి విధిగా అమలు చేయనుంది. ఈలోగా నగల దుకాణాల యజమానులు భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్) ద్వారా హాల్‌మార్క్ రిజిస్ట్రేషన్ చేయించుకుని లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. ఇలా లైసెన్స్ పొందిన జ్యుయలరీ దుకాణాలను మాత్రమే 14 (585), 18 (750), 22 (916) క్యారెట్ల బంగారు ఆభరణాల అమ్మకానికి అనుమతిస్తారు. హాల్‌మార్క్ లేని నగలను విక్రయిస్తే చట్టరీత్యా గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష లేదా రూ.2 లక్షల నుంచి 5 లక్షల వరకు జరిమానా విధిస్తారు. ఆ షాపులోని ఆభరణాలనూ సీజ్ చేస్తారు. అలాగే నగల కొనుగోలుదారుకు హాల్‌మార్క్ సర్టిఫికేషన్ ఉన్న బిల్లు తప్పనిసరిగా ఇవ్వాలి. బిల్లు ఇవ్వకపోయినా షాపు యజమానిపై చర్యలు తీసుకుంటారు. ఇకపై ఆభరణాల నాణ్యతపై అనుమానం వచ్చి బీఐఎస్ అధికారులకు ఫిర్యాదు చేస్తే వాటి స్వచ్ఛతను పరీక్షిస్తారు. స్వచ్ఛతలో తేడాలుంటే ఆ మొత్తాన్ని షాపు యజమాని నుంచి వసూలు చేసి కొనుగోలుదారుకు ఇప్పిస్తారు. మోసాలు ఇలా.. బంగారంలో ఇతర లోహాలను కలిపినా దాని సహజ రంగు పూర్తిగా కోల్పోదు. వ్యాపారులు దీనిని ఆసరా చేసుకుని కృత్రిమ లేపనాలతో మెరిసేలా చేసి, రాగి వంటి లోహాలను కలిపి మేలిమి బంగారంగా అంటగడతారు. ఇకపై అలాంటి మోసాలకు అడ్డుకట్ట వేయడానికి, వినియోగదారుడిని కల్తీ నుంచి కాపాడటానికి బీఐఎస్ హాల్‌మార్క్ నిబంధన ఉపయోగపడుతుందని కన్సూ్యమర్స్ అఫైర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ స్టేట్ విజిలెన్స్ కమిటీ సభ్యుడు కాండ్రేగుల వెంకటరమణ ‘సాక్షి’తో చెప్పారు. రాష్ట్రంలో 876 షాపులే.. ఆంధ్రప్రదేశ్‌లో 876 దుకాణాలకు మాత్రమే హాల్‌మార్క్ రిజిస్ట్రేషన్ ఉంది. ఈ లైసెన్స్ లేని షాపులు రాష్ట్రంలో 7 వేలకు పైగా ఉండవచ్చని అధికారుల అంచనా. రాష్ట్రంలో ఇలాంటి షాపుల గణనను చేపట్టే పనిలో బీఐఎస్ అధికారులున్నారు. హాల్‌మార్క్ అంటే.. ఆభరణాల బంగారంలో స్వచ్ఛత పాళ్లను తెలియజేసేదే హాల్‌మార్క్. నగలపై బంగారం స్వచ్ఛత, ముద్ర, హాల్‌మార్క్ వేసిన కేంద్రం పేరు, ఆభరణం తయారు చేసిన తేదీ, విక్రయించిన షాపు పేరు ఉంటాయి. ఆభరణం నాణ్యతలో తేడాలుంటే.. దీనిని బట్టి అది ఏ షాపులో కొనుగోలు చేసిందీ తెలిసిపోతుంది. ముద్ర లేజర్‌తో వేసింది కాబట్టి చెరిగిపోయే లేదా చెరిపేసే వీలుండదు. శిక్ష, జరిమానాలు తప్పవు జూన్ 1 నుంచి జ్యుయలరీ షాపుల్లో హాల్‌మార్క్ ఆభరణాలనే విక్రయించాలి. ఈలోగా దుకాణాల వారు బీఐఎస్ నుంచి హాల్‌మార్క్ రిజిస్ట్రేషన్ చేయించుకుని సర్టిఫికేషన్ పొందాలి. దీనిపై జ్యుయలరీ అసోసియేషన్ల ప్రతినిధులకు అవగాహన కల్పిస్తున్నాం. హాల్‌మార్క్ లేని ఆభరణాలు విక్రయిస్తే జైలు శిక్ష, భారీ జరిమానా తప్పదు. – ఆర్.తిరుమలరావు, సైంటిస్ట్–డి, బీఐఎస్ -
పసిడి దిగుమతి సంస్థల గుత్తాధిపత్యం లేదు: సీసీఐ
న్యూఢిల్లీ: బంగారం దిగుమతి సంస్థలు గుత్తాధిపత్య ధోరణులను అనుసరిస్తున్నాయని దాఖ లైన కొన్ని ఆరోపణలను కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తిరస్కరించింది. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలుసహా మొత్తం 16 సంస్థలపై ఈ ఆరోపణలు దాఖలయ్యాయి. ఆర్థికమంత్రిత్వశాఖ, వాణిజ్య పరిశ్రమల శాఖ, ఆర్బీఐ, డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్‌తో పాటు మరో 12 ప్రభుత్వ నియమిత సంస్థలు ఇందులో ఉన్నాయి. ఎంఎంటీసీ, ఎస్టీసీ ఆఫ్ ఇండియా, పీఈసీ, హాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్ ఎక్స్‌పోర్ట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నోవా స్కోటియా, కొటక్ మహీం ద్రా బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, యస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు ప్రభుత్వ నియమిత సంస్థలు. మార్కెట్లో ఈ సంస్థలు తమ గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయన్న ఫిర్యాదులను సీసీఐ తోసిపుచ్చుతూ, కేవలం ఇదే వ్యాపారంలో ఈ సంస్థలు లేవని స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. డీలర్లు, బంగారు ఆభరణాల తయారీదారులు, రిటైలర్లు కూడా ఈ వ్యాపార కార్యకలాపాలను ఎటువంటి ఆటం కం లేకుండా చేస్తున్నారని సీసీఐ పేర్కొంది. ఆ యా వ్యాపార అంశాలకు సంబంధించి 16 సంస్థలు కుమ్మకైనట్లు సైతం ఆధారాలు లేవంది. శ్రీ గురు జ్యూవెల్స్, తుషార్ దాఖలు చేసిన ఫిర్యాదు నిరాధారమని తేల్చింది.