పసిడి దిగుమతి సంస్థల గుత్తాధిపత్యం లేదు: సీసీఐ
న్యూఢిల్లీ: బంగారం దిగుమతి సంస్థలు గుత్తాధిపత్య ధోరణులను అనుసరిస్తున్నాయని దాఖ లైన కొన్ని ఆరోపణలను కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తిరస్కరించింది. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలుసహా మొత్తం 16 సంస్థలపై ఈ ఆరోపణలు దాఖలయ్యాయి. ఆర్థికమంత్రిత్వశాఖ, వాణిజ్య పరిశ్రమల శాఖ, ఆర్‌బీఐ, డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్‌తో పాటు మరో 12 ప్రభుత్వ నియమిత సంస్థలు ఇందులో ఉన్నాయి. ఎంఎంటీసీ, ఎస్‌టీసీ ఆఫ్ ఇండియా, పీఈసీ, హాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్‌లూమ్ ఎక్స్‌పోర్ట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నోవా స్కోటియా, కొటక్ మహీం ద్రా బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, యస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు ప్రభుత్వ నియమిత సంస్థలు.
మార్కెట్‌లో ఈ సంస్థలు తమ గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయన్న ఫిర్యాదులను సీసీఐ తోసిపుచ్చుతూ, కేవలం ఇదే వ్యాపారంలో ఈ సంస్థలు లేవని స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. డీలర్లు, బంగారు ఆభరణాల తయారీదారులు, రిటైలర్లు కూడా ఈ వ్యాపార కార్యకలాపాలను ఎటువంటి ఆటం కం లేకుండా చేస్తున్నారని సీసీఐ పేర్కొంది. ఆ యా వ్యాపార అంశాలకు సంబంధించి 16 సంస్థలు కుమ్మకైనట్లు సైతం ఆధారాలు లేవంది. శ్రీ గురు జ్యూవెల్స్, తుషార్ దాఖలు చేసిన ఫిర్యాదు నిరాధారమని తేల్చింది.