Gold imports
-
బంగారం దిగుమతి లెక్కల్లో పొరపాటు
వాణిజ్య లోటు రికార్డు స్థాయికి పెరగడానికి కారణమైన నవంబర్ బంగారం దిగుమతి (Gold Import) డేటాలో చూసిన "అసాధారణ" పెరుగుదలను ప్రభుత్వం తాజాగా సరిదిద్దింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కమర్షియల్ ఇంటెలిజెన్స్ అండ్ స్టాటిస్టిక్స్ డేటా ప్రకారం నవంబర్ నెలలో బంగారం దిగుమతి విలువ 14.8 బిలియన్ డాలర్లు నుండి 9.8 బిలియన్ డాలర్లకు సర్దుబాటు చేసింది.గణన లోపం కారణంగా మునుపటి సంఖ్య తప్పుగా ఉంది. జూలైలో పద్దతిలో మార్పును అనుసరించి గిడ్డంగులలో రెట్టింపు లెక్కింపు దీనికి కారణం కావచ్చు. ఈ విషయంపై వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.2024 జనవరి నుండి నవంబర్ వరకు బంగారం దిగుమతులపై సవరించిన డేటా "వార్షిక సగటు 800 టన్నుల కంటే చాలా తక్కువగా ఉంది" అని జెమ్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ చైర్మన్ విపుల్ షా అన్నారు. జనవరి నుండి నవంబర్ వరకు మొత్తం బంగారం దిగుమతులు 796 టన్నుల నుండి 664 టన్నులకు సరిదిద్దారు. అక్టోబర్‌కు సంబంధించి 97 టన్నులు నుండి 58 టన్నులకు, నవంబర్‌లో దిగుబడులను 170 టన్నుల నుండి 117 టన్నులకు సర్దుబాటు చేశారు.డిసెంబర్ 16న జరిగిన సాధారణ నెలవారీ ట్రేడ్ డేటా బ్రీఫింగ్లో, బంగారం దిగుమతులు పెరగడం వల్ల నవంబర్‌లో భారతదేశ వాణిజ్య లోటు రికార్డు గరిష్ట స్థాయి 37.8 బిలియన్ డాలర్లకు విస్తరించిందని డేటా చూపించింది . 2024 డిసెంబరులో అసాధారణ పెరుగుదలను గమనించిన డీజీసీఐఎస్.. కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు, కస్టమ్స్ అందుకున్న డేటాతో సమన్వయం చేసుకుంటూ బంగారం దిగుమతి డేటాపై వివరణాత్మక పరిశీలనను చేపట్టింది. -
యూఏఈ నుంచి 160 టన్నుల బంగారం దిగుమతి
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో యునైటెట్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ) నుంచి అధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది. ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత 2024–25 ఆర్థిక సంవత్సరంలో యూఏఈ నుంచి భారత్ తయారీదారులు, వ్యాపారులు రాయితీ రేటుతో 160 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకునేలా ప్రభుత్వం నోటిఫై చేసింది. భారతదేశం–యూఏఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)లో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నత స్థాయి అధికారి తెలిపారు.రెండు దేశాల మధ్య 2022 మే 1వ తేదీ నుంచి సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పదం ప్రకారం, టారిఫ్ రేట్ కోటా (టీఆర్‌క్యూ) కింద ఒక శాతం టారిఫ్ రాయితీతో యూఏఈ నుండి ఏటా 200 మెట్రిక్ టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకోవడానికి భారత్ అంగీకరించింది. గత ఏడాది 140 టన్నులు ఈ తరహాలో నోటిఫైకాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తాజాగా 160 టన్నుల దిగుమతులకు ఆమోదముద్ర వేసింది.భారత్ బంగారం దిగుమతులలో 40 శాతంతో స్విట్జర్లాండ్ అతిపెద్ద వాటా కలిగిఉంది. యూఏఈ వాటా 16 శాతం కాగా, దక్షిణాఫ్రికా వాటా 10 శాతంగా ఉంది. దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ నిధులకు సంబంధించిన కరెంట్ అకౌంట్‌పై పసిడి కొనుగోళ్ల (దిగుమతుల) ప్రభావం కనబడుతోంది. 2023–24లో భారత్ పసిడి దిగుమతుల విలువ 30 శాతం పెరిగి 45.54 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది.జీఎస్టీ లేకపోవడం, తయారీ ఖర్చులు తక్కువగా ఉండడంతో భారత్‌లో కంటే దుబాయ్‌లో బంగారం ధరలు చౌకగా ఉంటాయి. బంగారం దిగుమతులపై ప్రభుత్వం అందిస్తున్న ఈ వెసులుబాటుతో రెండు దేశాల మధ్య పసిడి వాణిజ్యం మరింత బలపడటమే కాకుండా భారతీయ జువెలరీ పరిశ్రమకూ ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. -
బంగారం దిగుమతులు డౌన్
న్యూఢిల్లీ: పసిడి దిగుమతులు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) మొదటి నాలుగు నెలల్లో.. ఏప్రిల్ నుంచి జూలై వరకు 12.64 బిలియన్ డాలర్ల (రూ.1.05 లక్షల కోట్లు సమారు) విలువైన బంగారం దిగుమలు నమోదయ్యాయి. 2023 ఏప్రిల్–జూలై మధ్య దిగుమతులు 13.2 బిలియన్ డాలర్లతో పోలి్చనప్పుడు 4.23 శాతం తగ్గాయి. ఒక్కజూలై నెల వరకే చూస్తే పసిడి దిగుమతులు 10.65 శాతం తగ్గి 3.13 మిలియన్ డాలర్లుగా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2023 జూలైలో 3.5 బిలియన్ డాలర్ల దిగుమతులు నమోదు కావడం గమనించొచ్చు. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశి్చతులకు తోడు, అధిక ధరలే బంగారం దిగుమతులపై ప్రభావం చూపించినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. పండుగల సీజన్ నేపథ్యంలో సెపె్టంబర్ నుంచి దిగుమతులు పెరగొచ్చని, దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం తగ్గించడం సైతం ఇందుకు మద్దతుగా నిలుస్తుందని ఓ జ్యుయలరీ వర్తకుడు అభిప్రాయపడ్డారు. బంగారం, వెండి దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని 15 శాతం నుంచి 6 శాతానికి ఇటీవలి బడ్జెట్లో భాగంగా కేంద్రం తగ్గించడం తెలిసిందే. గడిచిన ఆర్థిక సంవత్సరం (2023–24) మొత్తం మీద బంగారం దిగుమతులు 30 శాతం పెరిగి 45.54 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. మన దేశానికి దిగుమతి అవుతున్న బంగారంలో 40 శాతం స్విట్జర్లాండ్ నుంచి వస్తుంటే, యూఏఈ 16 శాతం, దక్షిణాఫ్రికా 10 శాతం వాటా కలిగి ఉన్నాయి. మన దేశ మొత్తం దిగుమతుల్లో బంగారం వాటా 5 శాతంగా ఉంది. గణనీయంగా వెండి దిగుమతులు ఏప్రిల్ నుంచి జూలై మధ్య మన దేశం నుంచి 9.1 బిలియన్ డాలర్ల విలువైన రత్నాలు, ఆభరణాల ఎగుమతులు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలోని గణాంకాలతో పోల్చి చూస్తే 7.45 శాతం తగ్గాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో 648 మిలియన్ డాలర్ల విలువైన వెండి దిగుమతులు జరిగాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో దిగుమతులు 215 బిలియన్ డాలర్లతో పోల్చి చూసినప్పుడు రెండు రెట్లు పెరిగాయి. యూఏఈతో 2022 మే 1 నుంచి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచి్చంది. దీంతో ఆ దేశం నుంచి బంగారం, వెండి దిగుమతులు పెరిగిపోయాయి. దీనిపై పరిశ్రమ నుంచి ఆందోళన వ్యక్తం అవుతుండంతో కొన్ని నిబంధనలను సమీక్షించాలని భారత్ కోరుతోంది. పెరిగిన వాణిజ్య లోటు ఏప్రిల్ నుంచి జూలై వరకు దేశ వాణిజ్య లోటు 85.58 బిలియన్ డాలర్లకు చేరింది. ఒక్క జూలై నెలకే 23.5 బిలియన్ డాలర్లుగా వాణిజ్యలోటు నమోదైంది. చైనా తర్వాత బంగారం వినియోగంలో భారత్ రెండో అతిపెద్ద దేశంగా ఉంది. ప్రధానంగా జ్యుయలరీ పరిశ్రమ నుంచి బంగారానికి ఎక్కువ డిమాండ్ ఉంటోంది. -
బంగారం అక్రమ రవాణా తగ్గుతుంది..
న్యూఢిల్లీ: బంగారంపై భారీగా కస్టమ్స్ సుంకాన్ని తగ్గించాలనే నిర్ణయం స్మగ్లింగ్‌ను అరికట్టడానికి దోహదపడుతుందని సీబీఐసీ (పరోక్ష పన్నులు, కస్టమ్స్ కేంద్ర బోర్డ్) చైర్మన్ సంజయ్ కుమార్ మల్హోత్రా తెలిపారు. అలాగే దేశంలోని రత్నాలు ఆభరణాల ఎగుమతులు పెరగడానికి, ఉపాధి వృద్ధికి సహాయపడుతుందని ఆయన ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం (2023–24) కస్టమ్స్ శాఖ, డీఆర్ఐ కలిసి 4.8 టన్నుల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 2022–23లో ఈ పరిమాణం 3.5 టన్నులు కావడం గమనార్హం. యల్లోమెటల్సహా పలు విలువైన లోహాల దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి భారీగా తగ్గిస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. భారీ ఉపాధి కల్పన రత్నాలు, ఆభరణాల రంగంలో దాదాపు 50 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని, ఎగుమతుల్లో ఈ రంగం వాటా 8 శాతం వరకూ ఉందని కుమార్ మల్హోత్రా తెలిపారు. దేశానికి 2023–24లో 45.54 బిలియన్ డాలర్ల విలువైన పసిడి దిగుమతులు జరిగాయి. వెండి విషయంలో ఈ విలువ 5.44 బిలియన్ డాలర్లుగా ఉంది. అదే సమయంలో ఆభరణాల ఎగుమతులు విలువ 13.23 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వార్షికంగా భారత్ 800 నుంచి 900 టన్నుల పసిడి దిగుమతులను చేసుకుంటోంది. బంగారం దిగుమతులలో స్విట్జర్లాండ్ అతిపెద్ద వాటాదారుగా ఉంది. మొత్తం దిగుమతుల్లో ఈ దేశం వాటా దాదాపు 40 శాతం. తరువాతి 16 శాతానికిపైగా వాటాతో యూఏఈ రెండవ స్థానంలో ఉంది. 10 శాతం వాటాలో దక్షిణాఫ్రికా మూడవ స్థానంలో నిలుస్తోంది. 2022లో పెరిగిన సుంకాలుదేశంలోకి వచీ్చ–వెళ్లే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసానికి సంబంధించి కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) భారీ పెరుగుదలను నివారించడానికి 2022 జూలైలో (10.75 శాతం నుంచి 15 శాతానికి) కస్టమ్స్ సుంకాన్ని భారీగా పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. 2022–23లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 2 శాతంగా ఉన్న క్యాడ్, 2023–24లో ఏకంగా 0.7 శాతానికి తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఏకంగా మిగులు నమోదయ్యింది. -
పసిడి, వెండి దిగుమతికి అనుమతులు పొందిన బ్యాంకులివే
వచ్చే ఆర్థిక సంవత్సరంలో బంగారం, వెండి దిగుమతి చేసుకోవడానికి అనుమతించిన బ్యాంకుల జాబితాను కేంద్రం ప్రకటించింది. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా, ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, యెస్ బ్యాంక్‌లు మనదేశంలోకి పసిడి, వెండి దిగుమతి చేసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆమోదం తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31 వరకు ఈ అనుమతులు వర్తిస్తాయి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్‌లు బాంగారాన్ని మాత్రం దిగుమతి చేసుకోవచ్చు. ఇదీ చదవండి..అలర్ట్.. రెండు రోజుల్లో ముగియనున్న గడువు -
బంగారం దిగుమతిపై జ్యుయలర్లకు వెసులుబాటు
న్యూఢిల్లీ: స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం పరిధిలో యూఏఈ నుంచి రాయితీతో కూడిన కస్టమ్స్ డ్యూటీపై బంగారం దిగుమతి చేసుకునే జ్యుయలర్లకు కేంద్రం మరో వెసులుబాటు కల్పించింది. ఇటువంటి వర్తకులు ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్ఛేంజ్ ఐఎఫ్ఎస్సీ లిమిటెడ్ (ఐఐబీఎక్స్) ద్వారా బంగారాన్ని యూఏఈ నుంచి దిగుమతి చేసుకోవచ్చంటూ డెరక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారీన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) నోటిఫికేషన్ జారీ చేసింది. దిగుమతి బంగారాన్ని భౌతిక రూపంలోనూ పొందొచ్చని పేర్కొంది. ఐఎఫ్ఎస్సీఏ నమోదిత ఖజానాల ద్వారా భౌతిక బంగారాన్ని పొందాల్సి ఉంటుందని తెలిపింది. భారత్–యూఏఈ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం 2022 మే నుంచి అమల్లోకి రావడం గమనార్హం. టారిఫ్ రేట్ కోటా (టీఆర్‌క్యూ) నిబంధనల కింద దేశీయ దిగుమతి దారులు నిర్ధేశిత పరిమాణంలో బంగారాన్ని రాయితీతో కూడిన సుంకం చెల్లించి పొందడానికి అనుమతి ఉంటుంది. -
ఏడోనెలా ఎగుమతులు రివర్స్..పసిడి దిగుమతులు రయ్!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి మందగమన పరిస్థితులను ప్రతిబింబిస్తూ ఎగుమతి–దిగుమతి గణాంకాలు వెలువడుతున్నాయి. భారత్ వస్తు ఎగుమతులు వరుసగా ఏడవనెల వృద్ధిలేకపోగా క్షీణబాటనే నడిచాయి. దిగుమతుల విషయంలో ఈ క్షీణత తొమ్మిది నెలల నుంచి నమోదవుతోంది. అధికారిక గణాంకాలను పరిశీలిస్తే.. ► ఆగస్టులో ఎగుమతులు 2022 ఇదే నెలతో పోల్చితే 6.86 శాతం తగ్గి 34.48 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► ఇదే నెల్లో దిగుమతులు 5.23 శాతం క్షీణించి 58.64 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ► ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం-వాణిజ్యలోటు 24.16 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. జూలైలో ఈ విలువ 20.67 బిలియన్లు కావడం గమనార్హం. ► ఎగుమతుల రంగంలో తేయాకు, కాఫీ, బియ్యం, సుగంధ ద్రవ్యాలు, తోలు, రత్నాలు–ఆభరణాలు, జౌళి, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు పడిపోయాయి. అయితే ముడి ఇనుము, ఎలక్ట్రానిక్ గూడ్స్, ఆయిల్ సీడ్స్, జీడిపప్పు, తివాచీ, ఇంజనీరింగ్, ఫార్మా, సముద్ర ఉత్పత్తులుసహా మొత్తం 30 కీలక రంగాల్లో 15 సానుకూల వృద్ధి రేటును నమోదు చేసుకున్నాయి. ఆర్థిక సంవత్సరం ఐదు నెలల్లో...కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకూ ఐదు నెలల్లో ఎగుమతులు 11.9 శాతం క్షీణించి 172.95 బిలియన్ డాలర్లుగా నమోదుకాగా, దిగుమతుల విలువ 12 శాతం క్షీణించి 271.83 బిలియన్ డాలర్లుగా ఉంది. వెరసి వాణిజ్యలోటు 98.88 బిలియన్ డాలర్లు. పసిడి దిగుమతులు: పసిడి దిగుమతులు ఆగస్టులో 38.75% పెరిగి 4.93 బిలియన్ డాలర్లుగా నమోదవగా, ఆగస్టు–ఏప్రిల్ మధ్య 10.48% పెరుగుదలతో 18.13 బిలియన్ డాలర్లుగా పసిడి దిగుమతుల విలువ ఉంది. రష్యా నుంచి దిగుమతులు రెట్టింపు రష్యా నుంచి భారత్ దిగుమతులు ఏప్రిల్-ఆగస్టు మధ్య రెట్టింపయ్యాయి. క్రూడ్ ఆయిల్, ఎరువుల దిగుమతులు పెరగడం దీనికి ప్రధాన కారణమని వాణిజ్య మంత్రిత్వశాఖ గణాంకాలు వెల్లడించాయి. 2022 ఏప్రిల్–ఆగస్టు మధ్య రష్యా నుంచి దిగుమతుల విలువ 13.77 బిలియన్ డాలర్లుకాగా, తాజా సమీక్షా కాలంలో ఈ విలువ 25.69 బిలియన్ డాలర్లకు ఎగసింది. చైనా, అమెరికాల తర్వాత రష్యా చమురు కొనుగోలులో భారత్‌ది మూడవ స్థానం. ఇక చైనా నుంచి దిగుమతులు ఈ ఐదు నెలల కాలంలో 43.96 బిలియన్ డాలర్ల నుంచి 42 బిలియన్ డాలర్లకు తగ్గాయి. -
పసిడి దిగుమతులు 24 శాతం డౌన్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి నెలకొ న్న నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరం (2022– 23)లో పసిడి దిగుమతులు 24% తగ్గాయి. వాణిజ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 35 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. 2021– 22లో ఇవి 46.2 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2022 ఆగస్టు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు మందగించిన పసిడి దిగుమతులు మార్చిలో ఒక్కసారిగా ఎగిశాయి. ఆ నెలలో 3.3 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అంతక్రితం ఏడాది మార్చిలో ఇవి 1 బిలియన్ డాలర్లే. ఇక వెండి దిగుమతులు గత ఆర్థిక సంవత్సరం 6 శాతం పెరిగి 5.29 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. బంగారం దిగుమతులు తగ్గినప్పటికీ వాణిజ్య లోటు భర్తీ యత్నాలకు పెద్దగా తోడ్పడలేదు. 2022– 23లో ఉత్పత్తులపరమైన వాణిజ్య లోటు 181 బిలియన్ డాలర్ల నుంచి 267 బిలియన్ డాలర్లకు పెరిగింది. రత్నాభరణాల ఎగుమతులు 3 శాతం క్షీణించి 38 బిలియన్ డాలర్లకు పరిమిత మయ్యాయి. అధిక సుంకాలు, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు బంగారం దిగుమతులపై ప్రతికూల ప్రభావం చూపినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. దేశీ పరిశ్రమకు తోడ్పాటు అందించే దిశగా సుంకాలను తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని పేర్కొన్నాయి. అమెరికాలో అధిక ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు అధిక స్థాయిలో ఉండటం, రష్యా–ఉక్రెయిన్ సంక్షోభం, చైనా ఇంకా పూర్తిగా కోలుకోకపోవడం తదితర అంశాల కారణంగా రత్నాభరణాల రంగానికి సవాళ్లు తప్పకపోవచ్చని పరిశ్రమ సమాఖ్య జీజేఈపీసీ మాజీ చైర్మన్ కొలిన్ షా అభిప్రాయపడ్డారు. జ్యుయలరీ పరిశ్రమ అవసరాల కోసం భారత్ ఏటా దాదాపు 800–900 టన్నులను దిగుమతి చేసుకుంటోంది. కరెంటు అకౌంటు లోటు (సీఏడీ)ని కట్టడి చేసే దిశగా పసిడిపై దిగుమతి సుంకాన్ని కేంద్రం 10.75 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. -
Budget 2023: ఆభరణాల ఎగుమతులుకు ఊతం ఇవ్వాలి
న్యూఢిల్లీ: రత్నాలు– ఆభరణాల తయారీ, ఎగుమతుల రంగం పురోగతికి రాబోయే బడ్జెట్లో కీలక చర్యలు ఉండాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా ప్రధానంగా బంగారంపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని ఆర్థిక శాఖను కోరుతున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. ఇందుకు సంబంధించి ఆ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం.. ► దేశంలోకి ఒక నిర్దిష్ట కాలంలో వచ్చీ–పోయే విదేశీ మారక నిధుల మధ్య నికర వ్యత్యాసం– కరెంట్ ఖాతా లోటు (క్యాడ్) కట్టడిలో భాగంగా బంగారం దిగుమతులపై సుంకాన్ని కేంద్రం జూలైలో 10.75 శాతం నుండి 15 శాతానికి పెంచింది. ఇందులో బంగారంపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం 12.5 శాతం. వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్ (ఏఐడీసీ) 2.5 శాతంగా ఉన్నాయి. ► ప్రతి సంవత్సరం, రత్నాలు– ఆభరణాల ఎగుమతి పరిశ్రమ దిగుమతి సుంకాన్ని తగ్గించాలని కోరుతుంది. ► రత్నాలు, ఆభరణాల ఎగుమతుల అభివృద్ధి మండలి (జీజేఈపీసీ) మాజీ చైర్మన్ కోలిన్ షా ఈ అంశంపై మాట్లాడుతూ, ఈ రంగంలో ఎగుమతులను పెంచడానికి, ఉద్యోగాలను సృష్టించడానికి రాబోయే బడ్జెట్‌పై పరిశ్రమ ఆశలు పెట్టుకుందని అన్నారు. ఇందులో ప్రధానంగా కస్టమ్స్ సుంకాన్ని తగ్గించాలని కోరుతున్నట్లు వివరించారు. ► మండలి అంచనా ప్రకారం.. భారతదేశం ప్రపంచంలో ఆభరణాలకు రిపేర్ హబ్‌గా ఉండగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ విధానం 400 మిలియన్ డాలర్ల వరకు ఎగుమతులను పెంచడంలో సహాయపడుతుంది. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022 ఏప్రిల్–నవంబర్ మధ్య రత్నాలు –ఆభరణాల ఎగుమతులు 2 శాతం పెరిగి 26.45 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అయితే బంగారం దిగుమతులు 18.13 శాతం తగ్గి 27.21 బిలియన్ డాలర్లకు దిగాయి. ► భారతదేశం బంగారాన్ని అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశం. ప్రధానంగా ఆభరణాల పరిశ్రమ డిమాండ్‌ను తీర్చడంలో భాగంగా అత్యధికంగా దిగుమతి చేసుకుంటుంది. ఈ పరిమాణం వార్షికంగా 800 నుంచి 900 టన్నుల వరకూ ఉంటుంది. -
17 శాతం తగ్గిన పసిడి దిగుమతులు
న్యూఢిల్లీ: భారత్ పసిడి దిగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల కాలంలో (2022–23, ఏప్రిల్–అక్టోబర్) 17.38 శాతం తగ్గి 24 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో ఈ విలువ 29 బిలియన్ డాలర్లు. దేశీయంగా డిమాండ్ తగ్గడం దీనికి కారణం. ఒక్క అక్టోబర్ నెలను తీసుకున్నా, దిగుమతులు 27.47 శాతం పడిపోయి 3.7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. భారత్ దాదాపు వార్షికంగా 800 నుంచి 900 టన్నుల పసిడిని దిగుమతి చేసుకునే సంగతి తెలిసిందే. కాగా, దేశం నుంచి రత్నాలు, ఆభరణాల ఎగుమతులు ఏప్రిల్–అక్టోబర్ మధ్య 1.81 శాతం పెరిగి 24 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. జనవరి నుంచి ఎగుమతులు మరింత ఊపందుకుంటాని పరిశ్రమ భావిస్తోంది. వెండి దిగుమతులు అప్... ఇక వెండి దిగుమతులు అక్టోబర్‌లో 34.80 శాతం తగ్గి 585 మిలియన్ డాలర్లుగా నమోదయ్యితే, ఆర్థిక సంవత్సరం ఏడు నెలల కాలంలో మాత్రం భారీగా పెరిగాయి. 2021–22 ఏడు నెలల్లో ఈ విలువ 1.52 బిలియన్ డాలర్లయితే, తాజా సమీక్షా నెల్లో ఈ విలువ ఏకంగా 4.8 బిలియన్ డాలర్లకు చేరింది. పసిడి, వెండి దిగుమతుల విలువ కలిపిచూస్తే, కరెంట్ అకౌంట్‌కు దాదాపు మిశ్రమ ఫలితంగానే ఉండడం గమనార్హం. దేశంలోకి వచ్చీ–పోయే మొత్తం విదేశీ మారకద్రవ్యం లెక్కలను ‘కరెంట్ అకౌంట్’ (లోటు లేదా మిగులు రూపంలో) ప్రతిబింబిస్తుంది. -
ఎగుమతుల క్షీణత... వాణిజ్యలోటు తీవ్రత
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు–దిగుమతులకు సంబంధించి జూలై గణాంకాలు నిరాశాజనకంగా ఉన్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం, ఎగుమతులు స్వల్పంగా 0.76 శాతం క్షీణించి (2021 జూలై నెలతో పోల్చి) 35.24 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ఇక ఎగుమతులు 44 శాతం పెరిగి 66.26 బిలియన్ డాలర్లకు ఎగశాయి. వెరసి ఎగుమతులు–దిగుమతుల విలువ మధ్య వ్యత్యాసం వాణిజ్యలోటు భారీగా 31.02 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2021 జూలైలో భారత్ వాణిజ్యలోటు 10.63 బిలియన్ డాలర్లు మాత్రమే. పసిడి దిగుమతులు జూలైలో వార్షికంగా సగానికి సగం పడిపోయి 2.37 బిలియన్ డాలర్లకు చేరడం గమనార్హం. ఏప్రిల్ నుంచి జూలై వరకూ...: ఆర్థిక సంవత్సరం తొలి 4 నెలల్లో భారత్ ఎగుమతుల విలువ 156 బిలియన్ డాలర్లు. దిగుమతుల విలువ 48 శాతం ఎగసి 256 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వెరసి వాణిజ్యలోటు 100 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం భారత్ ఎగుమతుల లక్ష్యం 400 బిలియన్ డాలర్ల సాధన నెరవేరింది. 2022–23లో కూడా 470 బిలియన్ డాలర్ల లక్ష్య సాధన నెరవేరుతుందన్న విశ్వాసాన్ని వాణిజ్యశాఖ కార్యదర్శి బీవీఆర్ సుబ్రమణ్యం వ్యక్తం చేశారు. డిమాండ్–సరఫరాల సవాళ్లు, నియంత్రణలు, కోవిడ్–19 సమస్యలు, రష్యా–ఉక్రెయిన్ భౌగోళిక ఉద్రిక్తతలు వంటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ, ఎగుమతుల విభాగం చక్కని పనితీరునే కనబరుస్తున్నట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖ మరో ప్రకటనలో పేర్కొంది. -
పసిడిపై ట్యాక్స్,నిర్మలా సీతారామన్ ఆసక్తిర వ్యాఖ్యలు!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పసిడి ప్రియులకు షాకిచ్చింది. బంగారం దిగుమతులపై తాజాగా సుంకాన్ని పెంచింది. ప్రస్తుతం అమల్లో ఉన్న 10.75 శాతం నుంచి పసిడి దిగుమతుల సుంకాన్ని 15 శాతానికి చేర్చింది. తద్వారా బలపడుతున్న బంగారం దిగుమతులకు తోడు కరెంట్ ఖాతా లోటు (క్యాడ్)కు చెక్ పెట్టాలని భావిస్తోంది. దిగుమతి సుంకంలో తాజా మార్పులు జూన్ 30 నుంచే అమల్లోకి వచ్చినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. జూన్ నెలాఖరువరకూ బంగారంపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 7.5 శాతంగా అమలు కాగా.. ప్రస్తుతం 12.5 శాతానికి పెరిగింది. దీనికి వ్యవసాయ రంగ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్ 2.5 శాతం జత కలుస్తోంది. వెరసి పసిడి దిగుమతుల సుంకం 15 శాతానికి చేరింది. ఫారెక్స్‌పై ఒత్తిడి..: దేశీయంగా పసిడి ఉత్పత్తి తగినంత లేకపోవడంతో గరిష్ట స్థాయిలో దిగుమతి చేసుకోవలసి వస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. దీంతో విదేశీ మారకం(ఫారెక్స్)పై ఒత్తిడి పడుతున్నట్లు తెలియజేశారు. పసిడికి డిమాండ్ కొనసాగుతూనే ఉంటుందని, దీంతో కనీసం దిగుమతులను నిరుత్సాహపరిచేందుకు ప్రయత్నించవలసి ఉంటుందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అలాకాకుండా పసిడిని దిగుమతి చేసుకునేందుకు ఆసక్తిగానే ఉంటే మరింత సొమ్ము వెచ్చించవలసి వస్తుందని చెప్పారు. దీంతో దేశానికి కొంతమేర ఆదాయం సమకూరుతుందని ఆమె వివరించారు. 107 టన్నులు..: ఇటీవల పుత్తడి దిగుమతులు ఉన్నట్టుండి ఊపందుకున్నాయి. మే నెలలో 107 టన్నుల బంగారం దిగుమతికాగా.. జూన్‌లోనూ ఇదే స్థాయిలో నమోదుకానున్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. పసిడి దిగుమతుల కారణంగా కరెంట్ ఖాతాపై ఒత్తిడి పడుతోంది. తద్వారా లోటు పెరుగుతున్నట్లు పేర్కొంది. కొద్ది రోజులుగా విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు తరలిపోతుండటం, దిగుమతి వ్యయాలు పెరగడంతో విదేశీ మారక నిల్వలు తరుగుతున్నట్లు తెలియజేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమయ్యాక డాలరుతో మారకంలో రూపాయి విలువ భారీగా పతనమవుతూ వస్తోంది. దీన్ని నివారించే బాటలో రిజర్వ్ బ్యాంక్ విదేశీ మారకాన్ని వెచ్చిస్తోంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 25 నుంచి ఫారెక్స్ నిల్వలు దాదాపు 41 బిలియన్ డాలర్లమేర క్షీణించడం గమనార్హం! స్మగ్లింగ్ పెరుగుతుంది... పసిడి దిగుమతులపై ఉన్నపళాన దిగుమతి సుంకాలను పెంచడం ఆశ్చర్యాన్ని కలిగించింది. డాలరుతో మారకంలో రూపాయి క్షీణతపై ప్రభుత్వ పరిస్థితులను అర్ధం చేసుకోగలం. అయితే ఇది మొత్తం పరిశ్రమకు సవాళ్లు విసురుతుంది. సుంకాల పెంపు స్మగ్లింగ్‌కు ప్రోత్సాహాన్నిచ్చే అవకాశముంది. దేశీ పరిశ్రమకు మేలు చేసేలా పరిస్థితులను సరిదిద్దేందుకు ప్రభుత్వానికి తోడ్పాడును అందించనున్నాం. – ఆశిష్ పెథే, చైర్మన్, ఆల్ ఇండియా జెమ్, జ్యువెలరీ దేశీ కౌన్సిల్ (జీజేసీ) సమస్య మరింత జటిలం... దేశీయంగా పసిడి డిమాండు దిగుమతుల ద్వారానే తీరుతోంది. డాలరుతో దేశీ కరెన్సీ బలహీనపడుతున్న వేళ దిగుమతి సుంకం పెంపు.. సమస్యను మరింత పెంచనుంది. వాణిజ్య అంతరాలు, ద్రవ్యోల్బణం రూపాయిని దెబ్బతీస్తున్నాయి. ప్రస్తుతం పసిడిపై మొత్తంగా పన్ను భారం 14 శాతం నుంచి 18.45 శాతానికి పెరగనుంది. ఇది తాత్కాలిక చర్యకాకుంటే అనధికార మార్కెట్ పుంజుకునే వీలుంది. – సోమసుందరం పీఆర్, ప్రాంతీయ సీఈవో (ఇండియా), వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ -
2020-21లో పసిడికి తగ్గిన డిమాండ్..!
న్యూఢిల్లీ: బంగారం అంటే భారతీయులకు.. ప్రత్యేకించి ఆడపడుచులకు చాలా ఇష్టం.. వీలైతే బంగారం ఆభరణాల కొనుగోలు చేయడానికే మొగ్గు చూపుతుంటారు. భారత్‌లో పెండ్లిండ్లలో నవ వధువుకు బంగారం ఆభరణాలు తప్పనిసరి. పండుగల సమయంలో గిఫ్ట్‌లుగానూ ఆభరణాలు బహుకరిస్తుంటారు. అయితే, అలాంటి బంగారాన్ని దేశీయంగా ఉత్పత్తి చేసేది కేవలం ఒకశాతమే మాత్రమే. మిగతా అంతా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. భారత్ 2020-21 ఆర్థిక సంవత్సరంలో 651 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో (2019-20) పసిడి దిగుమతులు 720 టన్నులుగా ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ బుధవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల్లో రాతపూర్వక సమాధానంలో చెప్పారు. ఇక 2018-19లో 983 టన్నుల బంగారం దిగుమతి అయినట్టు ప్రకటించారు. పుత్తడి దిగుమతిలో పొరుగు దేశం చైనా తర్వాతీ స్థానం మనదే. కానీ గత ఆర్థిక సంవత్సరం పుత్తడి దిగుమతులు తగ్గాయి. (చదవండి: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..! వచ్చే 6 రోజుల్లో 4 రోజులు బంద్..!) -
Gold Demand: తగ్గేదే లే.. భారత్‌లో పసిడికి తగ్గని డిమాండ్..!
దేశ కరెంట్ ఖాతా లోటు(సీఏడీ)పై ప్రభావం చూపే భారతదేశ బంగారం దిగుమతులు ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య కాలంలో సుమారు 73 శాతం పెరిగి 45.1 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే కాలంలో(ఏప్రిల్-ఫిబ్రవరి 2021లో) ఈ దిగుమతులు విలువ 26.11 బిలియన్ డాలర్లుగా ఉంది. వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన డేటా ప్రకారం.. ఫిబ్రవరి 2022లో విలువైన లోహం దిగుమతులు 11.45 శాతం తగ్గి 4.7 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గత 11 నెలల కాలంలో బంగారం దిగుమతుల పెరగడంతో వాణిజ్య లోటు 176 బిలియన్ డాలర్లకు చేరుకుంది. చైనా తర్వాత భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద బంగారు దిగుమతిదారుగా ఉంది. ప్రధానంగా ఆభరణాల పరిశ్రమ నుంచి ఎక్కువ డిమాండ్ రావడంతో దిగుమతులు భారీగా పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల్లో రత్నాలు & ఆభరణాల ఎగుమతులు 57.5 శాతం పెరిగి 35.25 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ప్రకారం సెప్టెంబర్ త్రైమాసికంలో భారతదేశ కరెంట్ ఖాతా లోటు 9.6 బిలియన్ డాలర్లకు పడిపోయింది. వచ్చే నెల నుంచి పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో దిగుమతులు పెరిగి కరెంట్ ఖాతా లోటుపై మరింత ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు నిపుణులు తెలియజేస్తున్నారు. (చదవండి: రష్యాకు భారీ షాక్ ఇచ్చిన మరో కంపెనీ..!) -
పసిడి దిగుమతులు జూమ్..
న్యూఢిల్లీ: దేశీయంగా డిమాండ్ పెరగడంతో ఈ ఏడాది ఏప్రిల్ – సెప్టెంబర్ మధ్య కాలంలో పసిడి దిగుమతులు భారీగా పెరిగాయి. ఏకంగా 24 బిలియన్ డాలర్లకు చేరాయి. గతేడాది ఇదే వ్యవధిలో బంగారం దిగుమతుల విలువ సుమారు 6.8 బిలియన్ డాలర్లు. కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. నెలవారీగా చూస్తే గతేడాది సెపె్టంబర్లో 601.4 మిలియన్ డాలర్లుగా ఉన్న పసిడి దిగుమతులు ఈ ఏడాది సెపె్టంబర్లో 5.11 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. మరోవైపు, ఏప్రిల్ – సెప్టెంబర్ మధ్య కాలంలో వెండి దిగుమతులు 15.5 శాతం తగ్గి 619.3 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. అయితే, కేవలం సెప్టెంబర్ నెలే పరిగణనలోకి తీసుకుంటే 9.23 మిలియన్ డాలర్ల నుంచి 552.33 మిలియన్ డాలర్లకు చేరాయి. పసిడి దిగుమతులు ఎగియడంతో దేశ వాణిజ్య లోటు సెప్టెంబర్ లో (దిగుమతులు, ఎగుమతుల మధ్య వ్యత్యాసం) 2.96 బిలియన్ డాలర్ల నుంచి 22.6 బిలియన్ డాలర్లకు చేరింది. భారత్ ఏటా 800–900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా పండుగ సీజన్, భారీ డిమాండ్ తదితర అంశాలు పసిడి దిగుమతులు పెరగడానికి కారణమని రత్నాభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) చైర్మన్ కొలిన్ షా తెలిపారు. -
దేశంలో బంగారం దిగుమతుల జోరు
ముంబై: భారత్ 2021 మార్చిలో భారీగా 160 టన్నుల బంగారం దిగుమతి చేసుకున్నట్లు రత్నాలు, ఆభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) మంగళవారం పేర్కొంది. 2020లో ఈ పరిమాణం కేవలం 28.09 టన్నులు. సుంకాలు 5 శాతానికి తగ్గింపు, ధర తగ్గుదల, అమెరికా, బ్రిటన్ వంటి ఎగుమతుల మార్కెట్లో డిమాండ్ పెరుగుదల, భారత్‌లో పెళ్లిళ్ల సీజన్, మెరుగుపడిన వ్యాపార వినియోగ సెంటేమెంట్ వంటి అంశాలు మార్చిలో బంగారం దిగుమతులు భారీగా పెరగడానికి కారణమని మండలి పేర్కొంది. వాణిజ్య మంత్రిత్వశాఖ ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం గడచిన ఆర్థిక సంవత్సరం (2020-21) బంగారం దిగుమతులు 22.58 శాతం పెరిగాయి. విలువలో ఇది 84.6 బిలియన్ డాలర్లు (దాదాపు 2.54 లక్షల కోట్లు). 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఈ విలువ 28.28 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.2 లక్షల కోట్లు). రానున్న అక్షయ తృతీయ, పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో పసిడికి డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందన్నదని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. పసిడిని దిగుమతి చేసుకుంటున్న ప్రధాన దేశాల్లో భారత్ ఒకటి. వార్షికంగా 800 నుంచి 800 టన్నుల పసిడిని దిగుమతి చేసుకుంటోంది. చదవండి: ప్రీమియం వసూళ్లలో ఎల్ఐసీ రికార్డు -
జూన్‌లో బంగారం దిగుమతులు 11టన్నులే..!
బంగారం దిగుమతులు ఈ జూన్‌లో భారీగా క్షీణించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ఈ నెలలో కేవలం 11టన్నుల బంగారం మాత్రమే దిగుమతి అయినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కిందటేడాది ఇదే జూన్‌లో దిగుమతైన మొత్తం 77.73 టన్నులతో పోలిస్తే ఇది 86శాతం తక్కువ. కరోనా కట్టడిలో భాగంగా అంతర్జాతీయ విమాన ప్రయాణాలను నిషేధించడం, దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో బంగారు ఆభరణాల దుకాణాలు మూసివేసివేయడం, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడం తదితర కారణాలు బంగారం దిగుమతులు పడిపోవడానికి కారణమైనట్లు బులియన్ విశ్లేషకులు చెబుతున్నారు. విలువ పరంగా చూస్తే.., గతేడాది జూన్‌లో దిగుమతుల మొత్తం విలువ 2.7బిలయన్ డాలర్లు ఉండగా, ఈ జూన్‌లో 608.76మిలియన్ డాలర్లకు పరిమితమైంది. (లాభాల స్వీకరణతో దిగివచ్చిన బంగారం) -
రికార్డు కనిష్టానికి బంగారం దిగుమతులు
సాక్షి, ముంబై : కరోనా వ్యాధిని అడ్డుకునేందుకు విధించిన దేశ వ్యాప్త లాక్ డౌన్ బంగారం దిగుమతులపై కూడా భారీ ప్రభావాన్ని చూపింది. దీంతో దేశీయంగా బంగారం దిగుమతులు మార్చిలో రికార్డు కనిష్టానికి పడిపోయాయి. వార్షిక ప్రాతిపదికన 73 శాతానికి పైగా పడిపోయిన పసిడి దిగుమతి ఆరున్నర ఏళ్ల కనిష్ట స్థాయికి చేరుకుంది. ప్రపంచంలోనే బంగారానికి రెండో అతిపెద్ద దిగుమతిదారు అయిన భారత్‌కు మార్చి నెలలో దిగుమతులు ఏకంగా 73 శాతం పడిపోయాయి. వాల్యూ పరంగా మార్చి దిగుమతులు దాదాపు 63 శాతం తగ్గి 1.22 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 2019 మార్చిలో 93.24 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకోగా, ఈ ఏడాది మార్చిలో కేవలం 25 టన్నులకు పడిపోయిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. గత ఆరున్నర సంవత్సరాల్లో ఇదే అతితక్కువ దిగుమతి. కోవిడ్ -19 (కరోనా) మహమ్మారి వేగంగా విస్తరింస్తుండటంతో దాదాపు ప్రపంచమంతా లాక్డౌన్ పరిస్థితుల్లోకి వెళ్లిపోవడం, అంతర్జాతీయ రవాణా పూర్తిగా స్తంభించిపోవటంతో దిగుమతులపై ప్రభావం పడింది. అలాగే లాక్డౌన్ కారణంగా దేశంలో బంగారం దుకాణాలు మూత పడటం ఒకప్రధాన కారణమని బులియన్ వ్యాపారస్తులు తెలిపారు. చదవండి : దేశంలో తీవ్ర అత్యవసర పరిస్థితి: రాజన్ -
7 శాతం తగ్గిన పుత్తడి దిగుమతులు
న్యూఢిల్లీ: పుత్తడి దిగుమతులు ఈ ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల కాలంలో 7 శాతం తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–డిసెంబర్ కాలానికి 2,473 కోట్ల డాలర్లుగా ఉన్న బంగారం దిగుమతులు ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి 2,300 కోట్ల డాలర్లకు తగ్గాయని ప్రభుత్వం వెల్లడించింది. దీంతో వాణిజ్య లోటు 14,823 కోట్ల డాలర్ల నుంచి 11,800 కోట్ల డాలర్లకు తగ్గిందని పేర్కొంది. కాగా 2018 , జూలై–సెప్టెంబర్ కాలానికి 2.9 శాతంగా ఉన్న కరంట్ అకౌంట్ లోటు(క్యాడ్) గత ఏడాది ఇదే కాలానికి 0.9%కి తగ్గింది. విలువ పరంగా చూస్తే క్యాడ్ 1,900 కోట్ల డాలర్ల నుంచి 630 కోట్ల డాలర్లకు చేరింది. ఈ ఏడాది జూలై నుంచి పుత్తడి దిగుమతులు తగ్గుతూనే ఉన్నాయి. వార్షిక దిగుమతులు 800–900 టన్నులు ప్రపంచంలోనే పుత్తడిని అత్యధికంగా దిగుమతి చేసుకునేది మన దేశమే. వార్షికంగా దిగుమతులు 800–900 టన్నుల మేర ఉంటాయని అంచనా. ఈ నేపథ్యంలో పుత్తడి దిగమతులకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని 10% నుంచి 12.5 శాతానికి పెంచింది. ఈ సుంకం పెంపు కారణంగా పలు కంపెనీలు తమ తయారీ కేంద్రాలను పొరుగు దేశాలకు తరలిస్తున్నాయని పుత్తడి పరిశ్రమ పేర్కొంది. దిగుమతి సుంకాన్ని 4 శాతానికి తగ్గించాలని కోరుతోంది. -
ఎగసిన వాణిజ్య లోటు
న్యూఢిల్లీ: ఇంజనీరింగ్ ఉత్పత్తులు, వజ్రాభరణాలు, లెదర్ ఉత్పత్తులు మొదలైన వాటి ఎగుమతులు గత నెల గణనీయంగా తగ్గాయి. దీంతో ఏప్రిల్‌లో ఎగుమతుల వృద్ధి 0.64 శాతానికి పరిమితమైంది. ఇది నాలుగు నెలల కనిష్ట స్థాయి. చివరిసారిగా 2018 డిసెంబర్లో ఎగుమతుల వృద్ధి అత్యల్పంగా 0.34 శాతంగా నమోదైంది. ఫలితంగా వాణిజ్య లోటు అయిదు నెలల గరిష్టానికి ఎగిసింది. బుధవారం విడుదలైన వాణిజ్య గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మరోవైపు దిగుమతులు 4.5 శాతం పెరిగాయి. ఇది గత ఆరు నెలల్లో అత్యధికం. క్రూడాయిల్, బంగారం దిగుమతులు గత నెలలో ఎగియడమే ఇందుకు కారణం. వ్యాపార ఉత్పత్తుల ఎగుమతులు ఏప్రిల్‌లో 26 బిలియన్లు ఉండగా.. దిగుమతుల పరిమాణం 41.4 బిలియన్ డాలర్లుగా నమోదైంది. దీంతో వాణిజ్య లోటు 15.33 బిలియన్ డాలర్లకు పెరిగింది. 2018 నవంబర్ తర్వాత వాణిజ్య లోటు ఇంతలా పెరగడం ఇదే తొలిసారి. కీలక రంగాల తగ్గుదల..: ఇంజనీరింగ్, వజ్రాభరణాలు, లెదర్, కార్పెట్, ప్లాస్టిక్, మెరైన్ ఉత్పత్తులు, ధాన్యం, కాఫీ తదితర విభాగాల్లో ప్రతికూల వృద్ధి నమోదైంది. దీంతో వ్యాపార ఉత్పత్తుల ఎగుమతులు ఏప్రిల్‌లో తగ్గాయి. చమురు దిగుమతులు 9.26 శాతం పెరిగి 11.38 బిలియన్ డాలర్లకు చేరాయి. చమురుయేతర దిగుమతులు 2.78 శాతం పెరిగాయి. బంగారం దిగుమతులు 54 శాతం ఎగిసి 3.97 బిలియన్ డాలర్లకు చేరాయి. అయితే, తాజాగా పెట్రోలియం, చేతివృత్తులు, రెడీమేడ్ దుస్తులు, ఫార్మా రంగాల ఎగుమతులు మాత్రం సానుకూల వృద్ధి నమోదు చేశాయి. నిరాశపర్చే గణాంకాలు.. ఏప్రిల్‌లో ఎగుమతుల వృద్ధి అంత ఆశావహంగా లేదని వాణిజ్య ప్రోత్సాహక మండలి (టీపీసీఐ) చైర్మన్ మోహిత్ సింగ్లా చెప్పారు. అయితే, సానుకూల ధోరణి కొనసాగించగలిగామని ఆయన పేర్కొన్నారు. టీ, సుగంధ ద్రవ్యాలు, ఫలాలు, కూరగాయలు వంటి వ్యవసాయోత్పత్తుల ఎగుమతుల్లో సానుకూలత కనిపించినట్లు చెప్పారు. కార్మిక శక్తి అత్యధికంగా ఉండే అన్ని రంగాలు ప్రతికూల పరిస్థితుల్లోనే ఉండటంతో ఎగుమతుల గణాంకాలు నిరాశపర్చేవిగా ఉన్నాయని భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్ఐఈవో) ప్రెసిడెంట్ గణేష్ కుమార్ గుప్తా చెప్పారు. ‘నిధుల కొరతతో పాటు అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధాలు, రక్షణాత్మక ధోరణులు, ప్రపంచవ్యాప్తంగా బలహీన వ్యాపార పరిస్థితులు, దేశీయంగా అనేక పరిమితులు తదితర అంశాల కారణంగా ఈ రంగాలు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నాయి‘ అని ఆయన పేర్కొన్నారు. ఒక వైపు చమురు ధరలు పెరుగుతుండటం, మరోవైపు ఇరాన్ నుంచి దిగుమతులపై ఆంక్షల నేపథ్యంలో పసిడి, చమురు దిగుమతుల భారం ఎగుస్తుండటంతో వాణిజ్య లోటు మరింత పెరుగుతుండటంపై గుప్తా ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధాల భయాలతో అంతర్జాతీయంగా వ్యాపార పరిస్థితులు మరింతగా దిగజారవచ్చన్నారు. రాబోయే రోజుల్లో భారత ఎగుమతులపై మరింత ఒత్తిడి పెరగవచ్చన్నారు. -
చిదంబరంపై చర్యకు కేంద్రం సంకేతాలు
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పీ. చిదంబరంపై చర్యలకు కేంద్రం సిద్ధమవుతోంది. యూపీఏ హయాంలో ప్రైవేట్ వర్తక సంస్థలకు అనుకూలంగా బంగారం దిగుమతి నిబంధనలను సడలించిన వారిపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. బంగారం దిగుమతి నిబంధనల సడలింపుతో ఆయా సంస్థలకు కేవలం ఆరు నెలల్లోనే రూ 4,500 కోట్లు వచ్చిపడ్డాయని పేర్కొంది. పీఎన్బీ స్కామ్‌లో కాంగ్రెస్ నుంచి ఎదురవుతున్న విమర్శల దాడి నేపథ్యంలో 80:20 గోల్డ్ ఇంపోర్ట్ స్కీమ్ ద్వారా నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలకు చిదంబరం సాయపడ్డారని పాలక బీజేపీ ఆరోపిస్తోంది. ప్రైవేట్ గోల్డ్ దిగుమతిదారులకు అనుకూలంగా ఉన్న ఈ పథకాన్ని తాము అధికారంలోకి వచ్చిన కొద్దినెలల్లోనే తొలగించామని పేర్కొంది. 2014, మార్చి 5న ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన అనంతరం మే 13న అప్పటి ఆర్థిక మంత్రి సవరించిన 80:20 స్కీమ్‌కు ఆమోదముద్ర వేశారని వాణిజ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. మే 16న ఎన్నికల ఫలితాలు వెలువరించనున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపింది. ఆపద్ధర్మ ప్రభుత్వం బంగారం దిగుమతులకు ప్రైవేట్ సంస్థలను అనుమతిస్తూ వాటికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన పరిస్థితులపై ప్రభుత్వం పరిశీలించి..దీనిలో ప్రమేయం ఉన్న వ్యక్తులపై చర్యలు తీసుకుంటుందని ప్రకటన పేర్కొంది. -
డీఆర్ఐ వద్దన్నా.. 80:20 తెచ్చారు
న్యూఢిల్లీ: పి.చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉండగా 2013లో ప్రవేశపెట్టిన 80:20 బంగారం దిగుమతుల పథకాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) వ్యతిరేకించినట్లు తెలిసింది. ప్రజా పద్దుల సంఘం(పీఏసీ) ఉప కమిటీతో ఆర్థిక శాఖ అధికారులు ఈ వివరాలు పంచుకున్నట్లు వెల్లడైంది. ఆ పథకం ప్రారంభించడంలో అవలంబించిన పద్ధతులు, విధానాలపై సీబీఐ విచారణకు సిఫార్సు చేయాలని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే నేతృత్వంలోని ఉప కమిటీ నిర్ణయించింది. రెవెన్యూ కార్యదర్శితో పాటు ఈడీ, సీబీడీటీ, సీబీఈసీ ఉన్నతాధికారులు ఉప కమిటీ ముందు హాజరై ఈ పథకం గురించి వివరణ ఇచ్చారు. 80:20 పథకంతో నల్లధనం తెల్లధనంగా మారడంతో పాటు, మనీ లాండరింగ్ పెరుగుతుందని అప్పట్లోనే డీఆర్ఐ ఆందోళన వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పూర్వ ఏడాది దిగుమతుల నుంచి 20 శాతం బంగారాన్ని ఎగుమతి చేసిన తరువాతే మళ్లీ బంగారాన్ని దిగుమతి చేసుకోవాలనే నిబంధనతో తెచ్చిన ఈ పథకాన్ని ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తరువాత 2014 నవంబర్‌లో రద్దు చేసింది. కార్తీకి నార్కో పరీక్షలు?: ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో అరెస్టయిన కార్తీ చిదంబరానికి నార్కో పరీక్ష చేయడానికి అనుమతి కోరుతూ సీబీఐ ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక కోర్టును ఆశ్రయించింది. మార్చి 9న ఈ విజ్ఞప్తిని పరిశీలిస్తామని స్పెషల్ జడ్జీ సునీల్ రానా చెప్పారు. మూడు రోజుల సీబీఐ కస్టడీ ముగించుకుని కార్తీ మళ్లీ అదే రోజు కోర్టుకు హాజరుకానున్నారు. మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన కార్తీ చార్టర్డ్ అకౌంటెంట్ భాస్కరరామన్, సహ నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీలపై జారీ అయిన వారెంట్లు కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్లనూ కోర్టు విచారణకు చేపడుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కార్తీ విచారణకు సహకరించడం లేదన్న నేపథ్యంలో నార్కో పరీక్షల కోసం పిటిషన్ వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
చివరిరోజు ఆమోదించారు
న్యూఢిల్లీ: 2014లో లోక్‌సభ ఎన్నికల ఫలితాల రోజు. ప్రైవేటు కంపెనీలకు లబ్ధిచేకూర్చేలా మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం పలు బిల్లులను ఆమోదించారని బీజేపీ ఆరోపించింది. గీతాంజలి జెమ్స్ సహా పలు కంపెనీలకు మేలు చేసేలా బంగారు దిగుమతి పథకాన్ని తీసుకొచ్చారని పేర్కొంది.ఈ నిర్ణయం ద్వారా చిదంబరం ఎంత లాభం పొందారని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. విపక్షాలు బీజేపీపై చేస్తున్న అసత్యాలను ప్రజలకు వివరించేందుకు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ.. దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసింది.మొండి బకాయిలు బ్యాంకు పుస్తకాల్లో లేకుండా చేసింది. ప్రభుత్వం చివరి ఆరేళ్లలో రూ.52.15లక్షల కోట్లను అడ్వాన్స్‌గా కంపెనీలకు ఇచ్చింది. ఇందులో 36 శాతం నిధులు మొండి బకాయీలుగా గుర్తించగా.. అవి ప్రభుత్వం గద్దెదిగే సమయానికి 82 శాతానికి చేరాయి. గొప్ప ఆర్థికవేత్తలైన మన్మోహన్ సింగ్, చిదంబరంల హయాంలో అనవసర జోక్యం, మొండి బకాయిలను ప్రోత్సహించటం, ఒత్తిడి చేయటంతో బ్యాంకింగ్ వ్యవస్థ పట్టాలు తప్పింది’ అని వెల్లడించారు. 80:20 పథకం ద్వారా ఏడు ప్రైవేటు కంపెనీలకు భారీగా లబ్ధి చేకూరిందన్నారు. ‘మే 16న మన్మోహన్సింగ్ ప్రభుత్వం ఓడిపోయింది. చిదంబరం కుర్చీ ప్రమాదంలో పడింది. చివరి రోజు అత్యవసరంగా ఏడు ప్రైవేటు కంపెనీలకు మేలు చేసేలా ఎందుకు నిర్ణయం తీసుకున్నారో.. చిదంబరం, రాహుల్ గాంధీ వెల్లడించాలి’ అని రవిశంకర్ చెప్పారు. పీఏసీకి ‘80:20’ వివరాలు యూపీఏ హయాంలో తెచ్చిన 80:20 బంగారు దిగుమతి పథకం వివరాలను పార్లమెంటు ప్రజాపద్దుల సంఘానికి (పీఏసీ) ఆర్థిక శాఖ అందజేయనుంది. ఈ పథకంలోని లొసుగులను వినియోగించుకునే గీతాంజలి గ్రూప్ ప్రమోటర్ మెహుల్ చోక్సీ మనీల్యాండరింగ్‌కు పాల్పడ్డారం టూ పీఏసీలోని బీజేపీ సభ్యులు ఆరోపించిన నేపథ్యంలో.. ఆర్థిక శాఖ పథకం వివరాలను సేకరిస్తోంది. పథకం, తదనంతర పరిణామాలపై 10 రోజుల్లో పీఏసీకి వివరాలు ఇవ్వనుంది. 80:20 బంగారు దిగు మతి పథకం ప్రకారం.. వ్యాపారస్తులు తా ము గతంలో దిగుమతి చేసుకున్న బంగారంలో కనీసం 20 శాతమైనా ఎగుమతి చేసి ఉంటేనే.. తర్వాత మరోసారి బంగారం దిగుమతి చేసుకునేందుకు వీలుంటుంది. -
846 టన్నుల బంగారం దిగుమతి
న్యూఢిల్లీ: బంగారం దిగుమతులు గతేడాది భారీ ఎత్తున పెరిగాయి. ఏకంగా 846 టన్నుల పసిడి దేశంలోకి దిగుమతి అయింది. అంతర్జాతీయంగా ధరలు తక్కువ స్థాయిలో ఉండటంతో పాటు దేశీయంగా డిమాండ్ పెరగడమే దిగుమతులు అధికం కావడానికి కారణాలుగా ఎంఎంటీసీ– పీఏఎంపీ ఇండియా పేర్కొంది. 2016లో దిగుమతి అయిన బంగారం 550 టన్నులతో పోలిస్తే గతేడాది దిగుమతులు 53 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. 2017లో పసిడి దిగుమతులు గణనీయంగా పెరిగినట్టు ఎంఎంటీసీ–పీఏఎంపీ ఇండియా ప్రెసిడెంట్ విపిన్ రైనా తెలియజేశారు. ఒక్క డిసెంబర్ నెలలోనే దిగుమతి అయిన బంగారం 70 టన్నులుగా ఉండటం విశేషం. 2016 డిసెంబర్ మాసంలో ఇది 49 టన్నులు మాత్రమే. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ డిమాండ్‌కు తోడు అంతర్జాతీయంగా తక్కువ ధరలు ఉండటం పసిడి దిగుమతులను పెంచాయని రైనా అన్నారు. బంగారం దిగుమతులపై ప్రస్తుతం 10 శాతం సుంకం అమల్లో ఉంది. గతేడాది జూలై నుంచి జీఎస్టీ అమల్లోకి రాగా, ఇందులో బంగారంపై 3 శాతం పన్ను వేసినప్పటికీ డిమాండ్ తగ్గకపోవడం విశేషం. -
బంగారం దిగుమతులు పెరిగే చాన్స్!
న్యూఢిల్లీ: భారత్ పసిడి దిగుమతులు– ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017–18) పెరిగే అవకాశం ఉందని రత్నాలు, ఆభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) అంచనావేసింది. ఈ పరిమాణాన్ని 700 టన్నులుగా మండలి పేర్కొంది. 2016–17లో ఈ పరిమాణం 500 టన్నులు. ఇక్కడ జరిగిన ఒక విలేకరుల సమావేశంలో మండలి చైర్మన్ ప్రవీణ్ శంకర్ పాండ్య మాట్లాడుతూ, 2017–18 వార్షిక బడ్జెట్లో దిగుమతుల సుంకాన్ని 4 నుంచి 5 శాతం శ్రేణికి తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న 10 శాతం వల్ల బంగారం అక్రమ రవాణా సమస్య ఉంటుందని పేర్కొన్నారు. పరిశ్రమ వృద్ధికి కూడా ఈ స్థాయి దిగుమతి సుంకం సరికాదని అన్నారు. కాగా ఇదే సమావేశంలో మాట్లాడిన మండలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సవ్యసాచి రాయ్ మాట్లాడుతూ.. వచ్చే ఆర్థిక సంవత్సరం దిగుమతులు పెరుగుతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పసిడి విధానాన్ని వచ్చే బడ్జెట్లో ప్రకటించే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు. -
బంగారం దిగుమతులు బ్యాన్
సాక్షి, న్యూఢిల్లీ : దక్షిణ కొరియా నుంచి విపరీతంగా బంగారం, వెండి దిగుమతులు పెరుగుతుండటంతో, వీటిపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ ఉత్పత్తులను నియంత్రిత కేటగిరీలోకి చేర్చింది. దీంతో బంగారం, వెండిని దిగుమతి చేసుకోవాలంటే దిగుమతిదారులు ముందస్తుగా ప్రభుత్వం వద్ద నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. జూలై 1 నుంచి ఆగస్టు 21 వరకు మధ్య కాలంలో దక్షిణ కొరియా నుంచి 1 బిలియన్ డాలర్ల విలువ కలిగిన బంగారం దిగుమతులు చేసుకున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాయిన్లు, ఆభరణాల రూపంలో అన్ని రకాల బంగారం, వెండి ఉత్పత్తులపై ఈ పరిమితి విధిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. బేసిక్ కస్టమ్ డ్యూటీ లేకుండా దక్షిణ కొరియాకు, భారత్‌కు మధ్య ఉచిత వాణిజ్య ట్రేడ్ జరుగుతోంది. ఉచిత వాణిజ్య ఒప్పందం లేని దేశాల నుంచి దిగుమతి చేసుకునే బంగారం ఉత్పత్తులపై 10 శాతం కస్టమ్ డ్యూటీ ఉంది. చైనా తర్వాత ప్రపంచంలో అతిపెద్ద బంగారం వినియోగదారునిగా భారత్ ఉంది. ప్రస్తుతం 400 ప్లస్ ఉత్పత్తులు నియంత్రిత దిగుమతుల జాబితాలో ఉన్నాయి. వాటిలో జంతువులు, కొన్ని విత్తనాలు, యూరేనియం, పేలుడు పదార్థాలున్నాయి. డబ్ల్యూటీఓ నిబంధనలకు అనుగుణంగానే ఈ నిషేధం ఉందని, ఎఫ్‌టీఏ నిబంధనలను ఇది ఉల్లంఘించడం లేదని అధికారులు పేర్కొన్నారు. జూలైలో బంగారం దిగుమతులు 95 శాతం పెరిగాయి. -
అక్కడి నుంచి భారీగా బంగారం దిగుమతి
పనాజీ : ఇటీవల అమల్లోకి వచ్చిన కొత్త పన్ను విధానం బంగారం దిగుమతులకు భారీగా కలిసివస్తోంది. పన్ను విధానంలో వచ్చిన ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుని జూలై, ఆగస్టు కాలంలో దక్షిణ కొరియా నుంచి భారతీయ వర్తకులు 25 టన్నుల మేర బంగారాన్ని దిగుమతి చేసుకోనున్నట్టు దేశీయ అధికారులు చెప్పారు. ఈ మేరకు వీటికి 10 శాతం కస్టమ్స్ డ్యూటీని కూడా వర్తకులు చెల్లించాల్సినవరం లేకపోవడం ఈ దిగుమతులకు మరింత సహకరిస్తోందని పేర్కొన్నారు. జీఎస్టీ అమలు తర్వాత ఇప్పటికే 12 టన్నుల బంగారం దక్షిణకొరియా నుంచి భారత్‌లోకి ప్రవేశించిందని, ఈ నెల ఆఖరికి ఇది కాస్త 25 టన్నుల మేర పెరిగే అవకాశముందని అసోసియేషన్ ఆఫ్ గోల్డ్ రిఫైనరీస్ అండ్ మింట్స్ సెక్రటరీ జేమ్స్ జోష్ తెలిపారు. చైనా తర్వాత ప్రపంచంలో రెండో అతిపెద్ద బంగార వినియోగదారునిగా ఉన్న భారత్, బంగారంపై 10 శాతం ఇంపోర్టు డ్యూటీని విధిస్తోంది. కానీ దక్షిణ కొరియా లాంటి దేశాలతో చేసుకున్న ఉచిత వాణిజ్య ఒప్పందాల ప్రకారం ఈ డ్యూటీ లేదు. ఆయా దేశాల దిగుమతులపై డ్యూటీలను మినహాయించడానికి అంతకముందు 12.5 శాతం ఎక్సైజ్ డ్యూటీని భారత్ విధించింది. ఎప్పుడైతే జీఎస్టీ అమల్లోకి వచ్చిందో ఇక అప్పటి నుంచి అన్ని స్థానిక పన్నులు కనుమరుగయ్యాయి. కేవలం ఒక్క జీఎస్టీ మాత్రమే అమలువుతోంది. భారత్‌తో ఎఫ్‌టీఏలు కలిగి ఉంది కాబట్టే ఇతర దేశాలతో పోలిస్తే, దక్షిణ కొరియానే బంగారం దిగుమతులకు అనుకూలంగా ఉంటోందని తెలిసింది. ఇంపోర్టు డ్యూటీ లేని కాయిన్లు, ఇతర ఆర్టికల్స్ రూపంలో బులియన్‌ను డెలివరీ చేసుకుంటున్నారని వెల్లడైంది. ఈ నెల మొదట్లో బంగారంపై డిస్కౌంట్లు కూడా ఔన్స్‌కు 11 డాలర్లు ఉంది. ఇది 10 నెలల కాలంలో అత్యధికం. 2017 తొలి ఏడు నెలల కాలంలో బంగారం దిగుమతులు గతేడాది కంటే రెట్టింపయ్యాయని కన్సల్టెన్సీ జేఎఫ్ఎంఎస్ ప్రొవిజనల్ డేటాలో వెల్లడైంది. -
అప్పటి నుంచే గోల్డ్ దిగుమతులు పెరిగాయ్!
పెద్ద నోట్ల రద్దు అనంతరం బంగారానికి భారీగా డిమాండ్ ఎగిసిన సంగతి తెలిసిందే. బ్లాక్ మనీ హోల్డర్స్ అందరూ తమ నగదును వైట్ గా మార్చేసుకుని, బంగారం కొనుగోలుపై ఎగబడ్డారు. బంగారం కొనుగోళ్లపై ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా.. అక్రమంగా కొనుగోళ్లు జరిగినట్టు కూడా తెలిసింది. 2013 తర్వాత మొదటిసారి బంగారం దిగుమతులకు బెస్ట్ క్వార్టర్ గా జనవరి-మార్చి 2017 నమోదైనట్టు తెలిసింది. గత క్వార్టర్లో బంగారం దిగుమతలు దాదాపు 230 టన్నులకు పెరిగినట్టు రిపోర్టులు వెల్లడించాయి. కేవలం మార్చిలోనే 100 టన్నులకు పైగా బంగారం దిగుమతి అయిందని పేర్కొన్నాయి. అంటే గతేడాది కంటే మార్చిలో ఏడింతలు దిగుమతులు పెరిగినట్టు బ్లూమ్ బర్గ్ కూడా నివేదించింది. రాబోతున్న పెళ్లిళ్ల సీజన్, ఏప్రిల్ నెలలో అక్షయ తృతియ ఈ దిగుమతులను పెంచినట్టు పేర్కొంది. 2016 ఏప్రిల్ నుంచి అక్టోబర్ కాలంలో 264 టన్నుల బంగారం దిగుమతి కాగ, తర్వాతి ఐదు నెలల కాలంలో ఏకంగా 360 టన్నులకు పైగా బంగారం దిగుమతి జరిగిందట. గత క్వార్టర్లో బంగారం దిగుమతుల బిల్లులు కూడా పైకి ఎగిసినట్టు రిపోర్టుల్లో తెలిసింది. ఓ వైపు డీమానిటైజేషన్, మరోవైపు బంగారం ధరలు అంతర్జాతీయంగా పెరగడం ఈ బిల్లులపై పడినట్టు నిపుణులు పేర్కొంటున్నారు. నవంబర్ 8న ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు నిర్ణయం తీసుకోవడంతో చాలామంది బ్లాక్ మనీ హోల్డర్స్, పాత నోట్లతో బంగారం కొన్నట్టు చెప్పారు. నవంబర్ నెలలోనే 100 టన్నుల దిగుమతులు జరిగాయని నివేదికల్లో వెల్లడైంది. ప్రభుత్వ దాడులతో కొంత మేర దిగుమతులు డిసెంబర్ లో తగ్గిపోయాయి. అనంతరం, ఫిబ్రవరి, మార్చిల్లో ఈ దిగుమతులు మళ్లీ పుంజుకున్నట్టు తెలిసింది. ఏప్రిల్ లోనూ బంగారానికి భారీగా డిమాండ్ ఉంటుందని కొటక్ ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శేఖర్ బండారి చెప్పారు. -
32 శాతం తగ్గిన బంగారం దిగుమతులు
న్యూఢిల్లీ: బంగారానికి దేశీయంగా డిమాండ్ తగ్గింది. 2016 ఏప్రిల్–డిసెంబర్ మధ్యలో దిగుమతులు 32% క్షీణించాయి. 17.7 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1.18 లక్షల కోట్లు) విలువైన బంగారం దిగుమతి జరిగింది. 2015 ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో 26.4 బిలియన్ డాలర్ల మేర (రూ.1.77 లక్షల కోట్లు) బంగారం దిగుమతులు జరిగాయి. 2016 ఒక్క డిసెంబర్ నెలలో బంగారం దిగుమతులు 48.49% క్షీణించి 1.96 బిలియన్ డాలర్ల (రూ.13,132 కోట్లు) విలువకు పరిమితం కావడం గమనార్హం. ధరలు తగ్గుదల, డీమోనిటైజేన్ కారణాలుగా నిపుణులు పేర్కొంటున్నారు. దిగుమతులు తగ్గడంతో వాణిజ్య లోటు ఏప్రిల్–డిసెంబర్ కాలానికి 76.54 బిలియన్ డాలర్లకు తగ్గింది. -
బంగారం దిగుమతి సుంకాల తగ్గింపు?
ముంబై: స్మగ్లింగ్‌ను నిరోధించే దిశగా పసిడి దిగుమతులపై సుంకాలను తగ్గించాలని యోచిస్తోంది ప్రభుత్వం. ప్రస్తుతం 10 శాతంగా ఉన్న దీన్ని 6 శాతానికి తగ్గించాలని భావిస్తున్నట్లు సమాచారం. రికార్డు స్థాయిలోని కరెంటు అకౌంటు లోటును భర్తీ చేసుకునేందుకు, రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు 2013లో ప్రభుత్వం పసిడి దిగుమతి సుంకాన్ని మూడు సార్లు పెంచింది. దీంతో పసిడి దిగుమతులు భారంగా మారడంతో .. స్మగ్లింగ్‌కు ఊతమిచ్చినట్లయిందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. సుంకాల విధానం పారదర్శకతను పెంచే విధంగానే ఉండాలి తప్ప స్మగ్లింగ్‌కు ఊతమిచ్చేలా ఉండకూడదని వ్యాఖ్యానించాయి. గతేడాది దాదాపు 120 టన్నుల బంగారం దిగుమతి స్మగ్లింగ్ జరగ్గా ఈ ఏడాది ఈ పరిమాణం మరింత పెరిగి 140 టన్నుల నుంచి 160 టన్నుల దాకా ఉండొచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) అంచనా. వివిధ అంశాల కారణంగా ఈ ఏడాది దేశీయంగా పసిడి వినియోగం ఏడేళ్లలో కనిష్ట స్థాయికి తగ్గిపోవచ్చని..సుమారు 650 టన్నుల నుంచి 750 టన్నుల దాకా మాత్రమే ఉండొచ్చని డబ్ల్యూజీసీ నవంబర్‌లో అంచనా వేసింది. -
మే నెలలోనూ ఎగుమతులు డౌన్
వరుసగా 18వ నెలలోనూ క్షీణతే న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా డిమాండ్ మందగించడంతో ఎగుమతులు మే నెలలో 0.79 శాతం క్షీణించి 2,217 కోట్ల డాలర్లకు పడిపోయాయి. ఎగుమతులు వరుసగా 18వ నెలలో కూడా పతనమయ్యాయి. మే నెలలో ఎగుమతులతో పాటు దిగుమతులు కూడా క్షీణించాయి. గత ఏడాది మేలో 3,275 కోట్లు డాలర్లుగా ఉన్న దిగుమతులు ఈ ఏడాది మేలో13 శాతం తగ్గి 2,844 కోట్ల డాలర్లకు పడిపోయాయి. గత ఏడాది మేలో 1,040 కోట్లుగా ఉన్న వాణిజ్య లోటు ఈ ఏడాది మేలో 627 కోట్ల డాలర్లకు తగ్గింది. ఎగుమతుల్లో క్షీణత తగ్గిందని ఈ గణాంకాల విడుదల సందర్భంగా వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతర్జాతీయంగా డిమాండ్ బలహీనంగా ఉండడం, ముడి చమురు ధరల పతనం కారణంగా 2014 డిసెంబర్ నుంచి ఎగుమతులు క్షీణిస్తున్నాయని వివరించింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో(ఏప్రిల్-మే) ఎగుమతులు 3.7 శాతం క్షీణించి 4,273 కోట్ల డాలర్లకు, అలాగే దిగుమతులు 18 శాతం క్షీణించి 5,385 కోట్ల డాలర్లకు తగ్గాయని పేర్కొంది. ఫలితంగా ఈ రెండు నెలల్లో వాణిజ్య లోటు 1,111 కోట్ల డాలర్లుగా ఉందని తెలిపింది. పుత్తడి దిగుమతులు 39 శాతం డౌన్ బంగారం దిగుమతులు మేలో 39% తగ్గి 147 కోట్ల డాలర్లకు పడిపోయాయి. పుత్తడి దిగుమతులు తగ్గడం ఇది వరుసగా 4వ నెల. గత ఏడాది మేలో పుత్తడి దిగుమతులు 242కోట్ల డాలర్లుగా ఉన్నాయి. పుత్తడి దిగుమతుల క్షీణత కారణంగా వాణిజ్య లోటు 627 కోట్ల డాలర్లకు పరిమితమైంది. గత ఏడాది మేలో వాణిజ్య లోటు 1,040 కోట్లు. -
పసిడిపై బడ్జెట్ ఎఫెక్ట్!
2016-17 వార్షిక బడ్జెట్ ప్రభావం బడ్జెట్‌పై ఉంటుందని నిపుణుల అంచనా. ప్రత్యేకించి పసిడి దిగుమతి సుంకంపై కేంద్రం నిర్ణయం పసిడి ధరలపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం పసిడిపై దిగుమతి సుంకం 10 శాతంగా ఉంది. దీనిని పెంచితే దేశీయంగా ధర మరింత పెరుగుతుందని, తగ్గిస్తే, కొంత తగ్గుదలకు అవకాశం ఉంటుందని ఈ రంగంలో నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌తో పోల్చితే భారత్‌లో ధర దాదాపు రూ.3,000 అధిక ప్రీమియంతో ఉంది. వారంలో ధర కదలికలు ఇలా... అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ నెమైక్స్‌లో చురుగ్గా ట్రేడవుతున్న ఏప్రిల్ డెలివరీ పసిడి ఔన్స్ (31.1గ్రా) కాంట్రాక్ట్ ధర వారం వారీగా దాదాపు 10 డాలర్లు తగ్గింది. 1,220 డాలర్లు వద్ద ముగిసింది. లాభాల స్వీకరణ దీనికి కారణంగా పేర్కొంటున్నారు. అయితే రూపాయి బలహీనత కారణంగా, దేశీయంగా ప్రధాన ముంబై స్పాట్ మార్కెట్లో పసిడి 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర వారం వారీగా స్వల్పంగా రూ.135 ఎగసింది. రూ.29,230 వద్ద ముగిసింది. 99.5 స్వచ్ఛత ధర సైతం ఇంతే స్థాయిలో ఎగసి 29,080కి చేరింది. -
పసిడి దిగుమతుల టారిఫ్ విలువ పెంపు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ధోరణికి అనుగుణంగా గురువారం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) పసిడి దిగుమతులపై టారిఫ్ విలువను పెంచింది. 10 గ్రాములకు 363 డాలర్ల నుంచి 388 డాలర్లకు ఈ ధర పెరిగింది. వెండి విషయంలో ఈ ధర 443 డాలర్ల నుంచి 487 డాలర్లకు ఎగసింది. ఎటువంటి అవకతవకలకూ(అండర్ ఇన్వాయిసింగ్) వీలులేకుండా పసిడి దిగుమతులపై కస్టమ్స్ సుంకం విధించడానికి దిగుమతి టారిఫ్ విలువ ప్రాతిపదికగా ఉంటుంది. అంతర్జాతీయ ధోరణులకు అనుగుణంగా లేదా ప్రతి 15 రోజులకు ఒకసారి సీబీఈసీ ఈ టారిఫ్‌లను సమీక్షించి, తగిన నిర్ణయం తీసుకుంటుంది. గోల్డ్ ఈటీఎఫ్ అవుట్‌ఫ్లో రూ.656 కోట్లు... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గడచిన 10 నెలల కాలంలో ఇన్వెస్టర్లు పసిడి ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) నుంచి రూ.656 కోట్లు వెనక్కు తీసుకున్నారు (అవుట్‌ఫ్లోస్). దీనితో ఫండ్స్ నిర్వహణలోని ఈటీఎఫ్‌ల విలువ (ఏయూఎం) మొత్తం దాదాపు 8.5 శాతం వరకూ పడిపోయింది. ఈటీఎఫ్‌ల నికర అవుట్‌ఫ్లోలు ఈ ఏడాది వరుసగా మూడవ సంవత్సరం. అయితే ఈక్విటీ మార్కెట్లు, ఆర్థిక వ్యవస్థల మందగమనం వల్ల గడచిన రెండేళ్లతో పోల్చితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అవుట్‌ఫ్లో స్పీడ్ తగ్గుతుందని నిపుణులు భావిస్తున్నారు. 2014-15 మొత్తం ఆర్థిక సంవత్సరంలో అవుట్‌ఫ్లో మొత్తం విలువ రూ.1,475 కోట్లు. మొదటి 10 నెలల కాలానికి రూ.1,290 కోట్లు. 2013-14లో వెనక్కు వెళ్లిన మొత్తం రూ. 2,293 కోట్లు. -
ఎగుమతులు 11 వ‘సారీ’..
అక్టోబర్‌లో 17.5 శాతం క్షీణత * 11 నెలల నుంచీ ఇదే ధోరణి * దిగుమతులూ తగ్గుముఖం... * ఎనిమిది నెలల కనిష్టానికి వాణిజ్యలోటు న్యూఢిల్లీ: ఎగుమతుల క్షీణ ధోరణి వరుసగా 11వ నెలా కొనసాగింది. వాణిజ్య మంత్రిత్వశాఖ సోమవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. దీనిప్రకారం 2014 అక్టోబర్ ఎగుమతుల విలువతో పోల్చితే 2015 అక్టోబర్‌లో ఎగుమతులు అసలు పెరక్కపోగా 17.5 శాతం క్షీణించాయి. విలువలో 25.89 బిలియన్ డాలర్ల నుంచి 21.36 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. అంతర్జాతీయంగా డిమాండ్ మందగమనం దీనికి ప్రధాన కారణం. దిగుమతులు చూస్తే... ఇక ప్రధానంగా కమోడిటీ ధరల కనిష్ట స్థాయి, అలాగే దేశీయ మందగమన పరిస్థితులను దిగుమతులు ప్రతిబింబిస్తున్నాయి. ఈ రేటు 21 శాతం పడిపోయింది. విలువ 39.46 బిలియన్ డాలర్ల నుంచి 31.12 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అక్టోబర్ నెలలో చమురు దిగుమతులు 45.31 శాతం పడ్డాయి. విలువలో 6.84 బిలియన్లుగా నమోదయ్యాయి. చమురుయేతర దిగుమతులు 10 శాతం క్షీణతతో 24.2 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వాణిజ్యలోటు 8 నెలల కనిష్టం...: ఎగుమతులు-దిగుమతుల మధ్య వ్యత్యాసానికి సంబంధించి వాణిజ్యలోటు 9.76 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇంత తక్కువ స్థాయి వాణిజ్యలోటు ఫిబ్రవరి తరువాత ఇదే తొలిసారి. ముఖ్య రంగాలు చూస్తే... పెట్రోలియం ప్రొడక్టులు (-57 శాతం), ముడి ఇనుము (-85.5 శాతం), ఇంజనీరింగ్ (-11.65 శాతం) రత్నాలు, ఆభరణాలు (-12.84 శాతం) విభాగాల ఎగుమతుల్లో అసలు వృద్ధి లేకపోగా క్షీణత నమోదయ్యింది. బంగారం దిగుమతులూ తగ్గాయ్.. దేశ దిగుమతుల్లో ప్రధాన పాత్ర పోషించే పసిడి దిగుమతులూ అక్టోబర్‌లో పడిపోయాయి. 59.5 శాతం క్షీణించాయి. విలువ 4.20 బిలియన్ డాలర్ల నుంచి 1.70 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఇది దేశ కరెంట్ అకౌంట్ లోటు కట్టడికి దోహదపడే అంశమని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దిగుమతుల విలువ భారీగా తగ్గడానికి పసిడి విలువ గణనీయంగా పడిపోవడం కారణం. ఏడు నెలల్లో...: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గడచిన ఏడు నెలల కాలంలో (ఏప్రిల్-అక్టోబర్) ఎగుమతులు 18% క్షీణించాయి. విలువ 154 బిలియన్ డాలర్లు. దిగుమతులు సైతం 15% తగ్గి 232 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి వాణిజ్య లోటు 77 బిలియన్ డాలర్లుగా ఉంది. ఏడు నెలల కాలంలో చమురు దిగుమతుల విలువ 42% పడిపోయి 95 బిలియన్ డాలర్ల నుంచి 55 బిలియన్ డాలర్లకు పడిపోయింది. లక్ష్యం కష్టమే... గతేడాది దేశం 310 బిలియన్ డాలర్ల ఎగుమతులు చేసింది. అయితే ఈ ఏడాది 300 బిలియన్ డాలర్లనే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుత ధోరణుల వల్ల ఈ లక్ష్య సాధన కూడా కష్టమేనని ఎగుమతుల సంస్థ... ఎఫ్ఐఈఓ ప్రెసిడెంట్ ఎస్సీ రెల్హాన్ అన్నారు. -
‘ట్రీటీ’తో బురిడీ...!
♦ ఇండోనేషియా నుంచి అక్రమంగా బంగారం దిగుమతి ♦ రెండేళ్లలో వివిధ దఫాల్లో దాదాపు 400 కేజీల పైనే ♦ భారత్‌కు ఇండోనేషియాతో ఉన్న ఒప్పందంతో మాయ ♦ కస్టమ్స్ కళ్లుగప్పిన చిక్కడపల్లికి చెందిన పసిడి వ్యాపారి ♦ నోటీసుల జారీకి కస్టమ్స్ సన్నద్ధం సాక్షి, హైదరాబాద్: ఇండోనేషియా నుంచి రెండేళ్లలో 400 కేజీల పసిడి దిగుమతి.. ఆన్ రికార్డు ప్రకారం అంతా క్లీన్.. కానీ రెండేళ్లలో ఒకే వ్యాపారికి, ఒకే దేశం నుంచి, ఒకే రకమైన ఆభరణాలు రావడంతో అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు ఆరా తీయగా.. ‘ట్రీటీ’(ఒప్పందం) పేరుతో బురిడీ కొట్టించినట్టు తేలింది. హైదరాబాద్‌లోని చిక్కడపల్లికి చెందిన ఓ పసిడి వ్యాపారి శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి 400 కేజీల గోల్డ్‌స్కామ్ దందా నడిపినట్టు గుర్తించారు. ట్రీటీని అనుకూలంగా మార్చుకున్న వ్యాపారి.. బంగారం సహా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ప్రతి వస్తువుపైనా నిర్ణీత శాతం కస్టమ్స్ డ్యూటీ(పన్ను) చెల్లించాలి. అయితే అంతర్జాతీయ సంబంధాలు, వాణిజ్య లావాదేవీలతో పాటు అనేక కారణాల నేపథ్యంలో భారత్ కొన్ని దేశాలతో ఒప్పందం కుదుర్చుకుంటుంది. ఇలా ఒప్పందం చేసుకున్న దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై పూర్తి స్థాయిలో/నిర్ణీత శాతం కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు ఉంటుంది. బంగారంతో పాటు కొన్ని రకాల వస్తువుల దిగుమతికి సంబంధించి భారత్‌కు ఇండోనేషియాతో ఒప్పందం ఉంది. దీని ప్రకారం సదరు బంగారం, వస్తువు ఆ దేశంలోనే తయారైందని ధ్రువీకరణ పత్రంతో దిగుమతి చేసుకుంటే కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. సరిగ్గా ఇదే ఒప్పందాన్ని చిక్కడపల్లికి చెందిన పసిడి వ్యాపారి తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. రెండేళ్లుగా ఇండోనేషియా నుంచి బంగారం దిగుమతి చేసుకుంటున్న సదరు వ్యాపారి.. అధికారిక ధ్రువీకరణ పత్రాలతో పాటు ఆన్ రికార్డ్ అన్నీ పక్కాగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. రెండేళ్లలో 400 కేజీల వరకు దిగుమతి.. ఇండోనేషియా నుంచి బంగారాన్ని కడ్డీలు, దిమ్మెల రూపంలో తెచ్చుకోవడానికి నిబంధనలు అంగీకరించవు. కచ్చితంగా ఆభరణాలుగానే దిగుమతి చేసుకోవాలి. దీంతో ఇండోనేషియాలోనే కొందరు ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్న సదరు వ్యాపారి కడ్డీలు, దిమ్మెలను నామ్‌కే వాస్తేగా రింగుల రూపంలోకి మార్చి దిగుమతి చేసుకోవడం ప్రారంభించాడు. అయితే ఒకే వ్యాపారికి, ఒకే దేశం నుంచి, ఒకే రకమైన ఆభరణాలు వస్తుండటం, రెండేళ్లలో పలు దఫాల్లో 400 కేజీల వరకు దిగుమతి కావడంతో కస్టమ్స్ అధికారులకు సందేహం వచ్చింది. ఆరా తీయాలని ఢిల్లీలోని కస్టమ్స్ ప్రధాన కార్యాలయాన్ని(సీబీఈసీ)కోరారు. దీంతో ప్రత్యేక అధికారిని ఇండోనేషియా పంపి ఆరా తీయగా.. పసిడి వ్యా పారి చెపుతున్నట్లుగా బంగారం ఆ దేశానికి చెందినది కాద ని తేలింది. ఏజెంట్ల సహకారంతో దుబాయ్, సౌదీ వంటి దేశాల నుంచి ఇండోనేషియాకు తరలించి, అక్కడ అధికారిక ధ్రువీకరణ పత్రాలు పుట్టించి విమానంలో హైదరాబాద్‌కు తీసుకువస్తూ సుంకం ఎగ్గొడుతున్నట్లు నిర్ధారించారు. దీంతో 400 కేజీల పసిడిపై పన్ను చెల్లించాల్సిన సదరు వ్యాపారికి నోటీసులు జారీ చేయడానికి కస్టమ్స్ విభాగం సన్నద్ధమవుతోంది. ఈ తరహా వ్యాపారం చేసే ముఠాలు మరికొన్ని ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు జరుపుతోంది. -
పసిడి దిగుమతులపై టారిఫ్ విలువ పెంపు
న్యూఢిల్లీ: పసిడి దిగుమతులపై టారిఫ్ విలువ పెరిగింది. దీని ప్రకారం- ఈ రేటు 10 గ్రాములకు 354 డాలర్ల నుంచి 363 డాలర్లకు పెరిగింది. ఇక వెండి కేజీపై రేటు కూడా 498 డాలర్ల నుంచి స్వల్పంగా 499 డాలర్లకు ఎగసింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరల మార్పులకు అనుగుణంగా సాధారణంగా ప్రతి 15 రోజులకు ఒకసారి ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ కేంద్ర బోర్డ్ (సీబీఈసీ) పసిడి, వెండి టారిఫ్ విలువను నిర్ణయిస్తుంది. దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని విధించడానికి ఈ టారిఫ్ విలువనే ప్రాతిపదికగా తీసుకుంటారు. అయితే ఈ విలువలో 5 శాతం మేర మార్పు ఉంటే... అది దేశీయ స్పాట్ బులియన్ మార్కెట్‌పై ప్రభావం చూపుతుంది. -
ఎగుమతులు 8వ నెలా డీలా!
♦ 10 శాతం క్షీణత నమోదు ♦ దిగుమతులూ తగ్గాయ్ ♦ వాణిజ్యలోటు 13 బిలియన్ డాలర్లు న్యూఢిల్లీ : ఎగుమతులు వరుసగా ఎనిమిది నెల జూలైలోనూ క్షీణించాయి. 2014 జూలై విలువతో పోల్చితే 2015 జూలైలో ఎగుమతుల విలువలో అసలు వృద్ధిలేకపోగా- 10.3 శాతం క్షీణించింది. విలువ 23 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. అంతర్జాతీయ మందగమనం, క్రూడ్ ఆయిల్ ధరల పతనం వల్ల... ఆ ఎగుమతుల విలువ పెద్దగా లేకపోవడం వంటి కారణాలు దిగుమతుల తిరోగమనానికి కారణం. మొత్తం దేశ ఎగుమతుల్లో పెట్రోలియం ప్రొడక్టుల వాటా దాదాపు 18 శాతం. వాణిజ్య మంత్రిత్వశాఖ శుక్రవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. దిగుమతులూ అంతే... దేశానికి దిగుమతులు కూడా 10 శాతం తగ్గాయి. విలువ 36 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. చమురు దిగుమతులు బిల్లు తగ్గడం దీనికి ప్రధాన కారణం. దీనితో ఎగుమతి-దిగుమతుల వ్యత్యాసానికి సంబంధించి వాణిజ్యలోటు 13 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. కాగా చమురు దిగుమతుల విలువ 34.91 శాతం తగ్గి, 9.48 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. మొత్తం దిగుమతుల్లో ఈ విభాగం వాటా 31 శాతం. చమురు యేతర దిగుమతుల విలువ 3.8 శాతం పెరిగి 26.46 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. విభాగాల వారీగా: పెట్రోలియం ప్రొడక్టులు (-43 శాతం), తోలు, తోలు ఉత్పత్తులు (-10 శాతం), సముద్ర ఉత్పత్తులు (-18 శాతం), రసాయనాల (-6 శాతం) ఎగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా క్షీణించాయి. పసిడి దిగుమతులు 62 శాతం అప్ పసిడి దిగుమతులు జూలైలో 62 శాతం ఎగశాయి. జూలైలో ఈ విలువ దాదాపు 3 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. -
61 శాతం పెరిగిన పసిడి దిగుమతులు
న్యూఢిల్లీ : రిజర్వు బ్యాంక్ దిగుమతుల నిబంధనలను సడలించడం, అంతర్జాతీయంగా ధరలు క్షీణించడం వంటి పలు అంశాల వల్ల దేశంలోకి పసిడి దిగుమతి బాగా పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి రెండు మాసాల్లో (ఏప్రిల్-మే) బంగారం దిగుమతి 61% వృద్ధితో 155 టన్నులకు చేరింది. గతేడాది ఇదే సమయంలో బంగారం దిగుమతి 96 టన్నులు. జ్యూయలరీ పరిశ్రమ నుంచి డిమాండ్ అధికంగా ఉండటం వల్ల బంగారం దిగుమతి బాగా పెరిగింది. బంగారం దిగుమతి 2013-14 ఆర్థిక సంత్సరంలో 662 టన్నులుగా, 2014-15లో 916 టన్నులుగా ఉంది. అధిక మొత్తంలో బంగారం దిగుమతి ప్రభావం దేశ కరెంటు ఖాతా లోటుపై ఉంటుంది. 2013-14లో 1.7%గా ఉన్న కరెంటు ఖాతా లోటు 2014-15లో 1.3%కి తగ్గింది. -
బంగారుమయం అవుతున్న భారత్....
-
అమ్మో అంత బంగారమా?
(సాక్షి వెబ్ ప్రత్యేకం) పండలైనా, శుభకార్యాలైనా స్వర్ణ కాంతులు విరాజిల్లాల్సిందే. ముఖ్యంగా పడుతులకు పసిడిపై మక్కువ అధికం. కాసు కాంచనమైనా లేకుండా గడప దాటరు కాంతలు. ఇక పండగలు, శుభకార్యాల్లో అయితే నిండుగా నగానట్రా ఉండాల్సిందే. ఏ మాటకామాటే చెప్పుకోవాలి. ఒంటినిండా నగలతో నడిచొచ్చే నారీమణులను మోడ్రన్ మహాలక్ష్ములే. ఆ మాటకొస్తే గోల్డ్ పై మక్కువచూపే మగవాళ్లు తక్కువేం కాదు. ఒళ్లంతా కాకపోయినా వీలున్నంత మేర స్వర్ణమయం చేసుకునే పురుషులు ఉన్నారు. మనదేశంలో ఉన్నంత బంగారం మరెక్కడా లేదని అనధికారిక అంచనా. జనం దగ్గర ఉన్న గోల్డ్ కు అయితే లెక్కేలేదు. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్ లో స్వయంగా వెల్లడించారు. గత మూడేళ్లలో పసిడి దిగుమతులపై విదేశీ మారకద్రవ్యం ఎంతమేరకు ఖర్చుచేశారని అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. అయితే కొన్ని నివేదిక ప్రకారం ప్రజల వద్ద 20 వేల టన్నుల బంగారం ఉన్నాయని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుత ధర ప్రకారం దీని విలువ సుమారు రూ.54 లక్షల కోట్లు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా 2014, నవంబర్ లో 80:20 నిబంధన ఎత్తివేశాక గోల్డ్ ఇంపోర్ట్స్ స్థిరంగా పెరుగుతూ వచ్చాయని వెల్లడించారు. జనం వద్ద ఉందని అంచనా కడుతున్న కాంచనంతో పోలిస్తే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద బంగారం నిల్వలు చాలా స్వల్పం. ఆర్ బీఐ వద్ద 5 లక్షల కిలోల గోల్డ్ నిల్వలు ఉన్నాయి. 2014-15లో బంగారం దిగుమతి కోసం ఖర్చు చేసిన మారకద్రవ్యం 34.41 బిలియన్ డాలర్లు(సుమారు రూ.2 లక్షల కోట్లు), 2012-15లో ఇది 53.82 బిలియన్ డాలర్లు(సుమారు రూ.3 లక్షల కోట్లు)గా ఉంది. ఇక సగటు వార్షిక సువర్ణ దిగుమతులు 8-9 లక్షల కేజీలుగా ఉన్నాయి. పండగలు, శుభాకార్యలకు బంగారం కొనడం భారతీయులకు అలవాటు. అలంకరణ వస్తువుగానే కాకుండా ఆర్థిక అవసరాల్లో ఆదుకుంటాయనే భావనతో స్వర్ణాభరణాలపైపు మొగ్గుచూపుతుంటారు. ఇన్వెస్ట్ మెంట్ గానూ గోల్డ్ కొంటుంటారు మనవాళ్లు. అందుకే చేతిలో ఏమాత్రం డబ్బు ఉన్నా బంగారం షాపులకు బయలుదేరతారు. అందుకేనేమో మనవాళ్ల దగ్గర 2 కోట్ల కిలోల బంగారం కొండ ఉంది. ఏమైనా మనవాళ్లు బంగారం!! -పీఎన్ఎస్సార్ -
బంగారం దిగుమతి టారిఫ్ విలువ పెంపు
న్యూఢిల్లీ: బంగారం దిగుమతి టారిఫ్ విలువను 10 గ్రాములకు 385 డాలర్ల నుంచి 388 డాలర్లకు పెంచుతున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) ఒక ప్రకటనలో తెలిపింది. కాగా వెండికి సంబంధించి ఈ విలువను కేజీకి 543 డాలర్ల నుంచి 524 డాలర్లకు తగ్గించింది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా సీబీఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మెటల్స్ దిగుమతులపై కస్టమ్స్ సుంకం విధింపునకు ఈ టారిఫ్ విలువ(బేస్ ధర)ను సీబీఈసీ పరిగణనలోకి తీసుకుంటుంది. విలువను తక్కువచేసి చూపేందుకు (అండర్ ఇన్వాయిసింగ్) ఆస్కారం లేకుండా చేయడమే దీని ప్రధానోద్దేశం. సాధారణంగా అంతర్జాతీయంగా బంగారం ధరల ధోరణికి అనుగుణంగా ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రభుత్వం ఈ టారిఫ్ విలువను సమీక్షించి, మార్పులపై ఒక నిర్ణయం తీసుకుంటుంది. -
25 కేజీల పురాతన బంగారం పట్టివేత
బ్యూనస్ ఎయిర్స్: పురాతన కాలానికి చెందిన బంగారాన్ని భారీ ఎత్తున దేశం నుంచి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసు ఉన్నతాధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 25 కేజీల బంగారపు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన అర్జంటైనాలో మంగళవారం చోటు చేసుకుంది. అదుపులోకి తీసుకున్న వ్యక్తులు అర్జంటైనాలో నివసిస్తున్న పెరుగ్వే దేశానికి చెందిన వారని పోలీసులు వెల్లడించారు. ట్రక్‌లో ప్రయాణికుల సిట్ కింద పెట్టి ఈ బంగారాన్ని తరలిస్తున్న క్రమంలో సరిహద్దులో పోలీసులు ఎప్పటిలాగా తనిఖీలు నిర్వహించారు. ఆ క్రమంలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు నిందితుల్లో ఒకరు కంగారు పడుతు సమాధానం ఇవ్వడంతో పోలీసులు ట్రక్‌ను స్కాన్ చేశారు. దాంతో సీట్ కింద భారీ ఎత్తున బంగారం కడ్డీలు కనుగొన్నారు. బంగారం స్వాధీనం చేసుకుని పరీక్షించగా వాటిపై సెంట్రల్ బ్యాంకు ఆఫ్ పెరుగ్వే 1824 అని ముద్రితమై ఉందని పోలీసులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ. 2.27 మిలియన్ అమెరికన్ డాలర్లు ఉంటుందని చెప్పారు. వీటితో పాటు కేజీ బంగారం కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
పుత్తడిపై ‘అశోక’ చక్రం
- ఇక ఇండియా బ్రాండ్ గోల్డ్ కాయిన్స్.. - మూడు కొత్త స్కీమ్‌ల ఆవిష్కరణ - బంగారం ధరలు దిగొచ్చే అవకాశం.. న్యూఢిల్లీ: పుత్తడి దిగుమతులు తగ్గించడం, ప్రజలు, దేవాలయాల్లో నిష్ర్పయోజనంగా మూలుగుతున్న బంగారం నిల్వలను ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడం లక్ష్యాలుగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో మూడు స్కీమ్‌లను ప్రతిపాదించింది. ఈ మూడు స్కీమ్‌లు-సావరిన్ గోల్డ్ బాండ్(ఎస్జీబీ), గోల్డ్ మోనెటైజేషన్ స్కీమ్(జీఎంఎస్), ఇండియా బ్రాండెడ్ గోల్డ్ కాయిన్ల కారణంగా పుత్తడి దిగుమతులు తగ్గుతాయని, దేశీయంగా సరఫరా పెరుగుతుందని, ధరలు దిగొస్తాయని నిపుణులంటున్నారు. బంగారంపై దిగుమతి ఆంక్షలను యథాతథంగా కొనసాగిస్తామని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. దేశంలో 20 వేట టన్నుల బంగారం ఉందని, అయితే ఇది వ్యాపారానికి పనికిరాక, నిరుపయోగంగా ఉంటోందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని వినియోగిస్తున్న దేశం ఇదే. అంతేకాకుండా ప్రతి ఏడాది 800-1,000 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. 1. సావరిన్ గోల్డ్ బాండ్ పుత్తడికి ప్రత్యామ్నాయంగా మరో ఆర్థిక ఆస్తి, సావరిన్ గోల్డ్ బాండ్‌ను అభివృద్ధి చేయాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. బంగారం కొనుగోళ్లకు ఇది ప్రత్యామ్నాయమని పేర్కొన్నారు. ఈ స్కీమ్‌లో ఈ బాండ్లపై స్థిరమైన వడ్డీరేటును చెల్లిస్తారు. నగదుగా ఈ బాండ్‌ను రిడీమ్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్ ఫలితంగా వాణిజ్య లోటు, కరంట్ అకౌంట్ లోటులను నియంత్రించవచ్చు. ప్రజలు భౌతికంగా బంగారాన్ని కొనుగోలు చేయడాన్ని నివారించడానికి ఈ ఎస్జీబీ అందుబాటులోకి తెస్తున్నారు. 2. గోల్డ్ మోనెటైజేషన్ స్కీమ్: ప్రస్తుతమున్న గోల్డ్ డిపాజిట్, బంగారు లోహ రుణాల స్కీమ్‌ల స్థానంలో ఈ స్కీమ్‌ను పరిచయం చేస్తున్నారు. ఈ స్కీమ్‌లో బంగారాన్ని డిపాజిట్ చేసిన వినియోగదారులకు వడ్డీని చెల్లిస్తారు. అదే ఆభరణాల వర్తకులకైతే రుణాలను మంజూరు చేస్తారు. బ్యాంకులు/ఇతర డీలర్లు కూడా తమ వద్దనున్న బంగారాన్ని నగదుగా వ్యవస్థలో చలామణిలోకి తీసుకురావచ్చు. 3. ఇండియా బ్రాండెడ్ గోల్డ్ కాయిన్: అశోక చక్ర చిహ్నం ఉన్న పుత్తడి నాణాలను దేశీయంగా తయారు చేయడం ప్రారంభించనున్నామని జైట్లీ చెప్పారు. దీంతో విదేశాల నుంచి నాణాల దిగుమతికి డిమాండ్ తగ్గుతుందని, దేశంలో లభ్యమయ్యే పుత్తడిని రీసైకిల్ చేయవచ్చని వివరించారు. తమ అవసరాల నిమిత్తం ప్రజలు విదేశాల నుంచి బంగారు నాణాలు కొనుగోలు చేస్తున్నారని, ఈ కారణంగా మన విదేశీ మారకద్రవ్యం తరిగిపోతోందని చెప్పారు. బంగారం లాంటి స్కీమ్‌లు బడ్జెట్లో పుత్తడి ప్రతి పాదనల పట్ల పుత్తడి పరిశ్రమ నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. గోల్డ్ మోనెటైజేషన్ స్కీమ్‌తో పుత్తడి దిగుమతులు తగ్గుతాయని, సరఫరా పెరుగుతుందని, ధర తగ్గుతుందని పేర్కొంది. అయితే పుత్తడిపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. గోల్డ్ మోనెటైజేషన్ స్కీమ్ కారణంగా పుత్తడి దిగుమతులు తగ్గుతాయని, బంగారం సరఫరా పెరుగుతుందని, కరంట్ అకౌంట్ లోటు(క్యాడ్) తగ్గుతుందని జెమ్స్ అండ్ జ్యూయలరీ ట్రేడ్ ఫెడరేషన్ చైర్మన్ హరీష్ సోని చెప్పారు. పుత్తడిపై దిగుమతి సుంకం తగ్గించకపోవడం నిరాశపరిచిందని పేర్కొన్నారు. గోల్డ్ మొనైటేజేషన్ స్కీమ్ వల్ల ఆర్థిక వ్యవస్థలోకి పుత్తడి అందుబాటులోకి వస్తుందని జెమ్స్ అండ్ జ్యూయలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్(జీజేఈపీసీ) చైర్మన్ విపుల్ షా వెల్లడించారు. ఇండియా బ్రాండెడ్ గోల్డ్ కాయిన్ కారణంగా పుత్తడి ఆర్థిక విలువ మరింతగా పెరుగుతుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఎండీ(ఇండియా) సోమసుందరం పీఆర్. అభిప్రాయపడ్డారు. గోల్డ్ మోనెటైజేషన్ స్కీమ్ స్థూల ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనకరమని, కోట్లాది కుటుంబాల వద్ద నున్న పుత్తడి పొదుపులు ఆర్థిక పెట్టుబడులుగా మారతాయని వివరించారు. ఈ మూడు స్కీమ్‌ల కారణంగా దేశంలో పుత్తడి సరఫరా పెరుగుతుందని తారా జ్యూయెల్స్ సీఎండీ రాజీవ్ సేథ్ చెప్పారు. దిగుమతి సుంకం తగ్గించకపోవడం నిరాశ పరచిందని గీతాంజలి గ్రూప్ సీఎండీ మేహుల్ చోక్సి పేర్కొన్నారు. రూ.లక్షకు మించి కొనుగోళ్లకు పాన్ నంబర్ తప్పనిసరి చేయడం ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ఈ స్కీమ్‌ల కారణంగా నిరుపయోగంగా ఉన్న నిల్వలను వినియోగంలోకి తేవచ్చని జెమ్ అండ్ జ్యూయలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఈడీ సవ్యసాచి రే చెప్పారు. గుడులు, ఇళ్లలో రూ.47.25 లక్షల కోట్ల విలువైన పుత్తడి నిరుపయోగంగా ఉంటుందన్నారు. పుత్తడి దిగుమతులపై 2,000 కోట్ల డాలర్లు ఆదా అవుతాయని, పుత్తడి ధరలు దిగొస్తాయని సెన్కో గోల్డ్ ఈడీ సువంకర్ సేన్ పేర్కొన్నారు. -
బంగారం దిగుమతి సుంకాలను తగ్గించాలి
వాణిజ్య మంత్రిత్వశాఖ న్యూఢిల్లీ: బంగారం దిగుమతి సుంకాలను తగ్గించాలని ఆర్థిక మంత్రిత్వశాఖను కోరుకుంటున్నట్లు వాణిజ్య మంత్రిత్వశాఖ తాజాగా పేర్కొంది. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, మరో రెండు రోజుల్లో పార్లమెంటులో 2015-16 వార్షిక బడ్జెట్ సమర్పించనున్న నేపథ్యంలో వాణిజ్య శాఖ కార్యదర్శి రాజీవ్ ఖేర్ గురువారం ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఇక్కడ సీఐఐ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఖేర్ ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే... ⇒ పలు ఆంక్షల వల్ల బంగారం దిగుమతులు తగ్గాయి. అనుకున్న క్యాడ్(కరెంట్ అకౌంట్ లోటు) లక్ష్యం నెరవేరింది. ఈ పరిస్థితుల్లో ఇక పసిడి దిగుమతి సుంకాలను తగ్గించాలని వాణిజ్య మంత్రిత్వశాఖ కోరుకుంటోంది. ⇒ రత్నాలు, ఆభరణాల తయారీ, ఎగుమతుల వృద్ధికి ఇది అవసరం. జనవరిలో రత్నాలు, ఆభరణాల రంగాల నుంచి ఎగుమతులు 3.73 శాతం క్షీణించడం పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశం. ఈ రంగంలో ప్రస్తుతం 35 లక్షల మంది జీవనం సాగిస్తున్నారు. ⇒ ప్రస్తుతం 10 శాతంగా ఉన్న పసిడి దిగుమతి సుంకం 2 శాతానికి తగ్గించాలని పరిశ్రమ కోరుతోంది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో గుర్తించిన కీలక రంగాల్లో రత్నాలు, ఆభరణాల పరిశ్రమ కూడా ఒకటి. -
ఆభరణాలకు రికార్డు స్థాయి డిమాండ్
-
ఆభరణాలకు రికార్డు స్థాయి డిమాండ్
⇒ 2014లో 662 టన్నులు ⇒ పెట్టుబడుల్లో వెనుకంజ ⇒ మొత్తంగా తగ్గిన డిమాండ్ ⇒ భారత్‌పై డబ్ల్యూజీసీ నివేదిక న్యూఢిల్లీ: భారత్ పసిడి ఆభరణాల డిమాండ్ 2014లో 662.1 టన్నులుగా నమోదయ్యింది. 2013తో పోల్చితే ఇది ఎనిమిది శాతం ఎక్కువ. పసిడి దిగుమతులపై పలు ఆంక్షలు ఉన్నప్పటికీ డిమాండ్ పెరగడం విశేషం. 1995 నుంచీ చూసుకుంటే, ఒక్క ఆభరణాల కోసం ఇంత డిమాండ్ పెరగడం ఇదే మొదటిసారి. అయితే పెట్టుబడుల డిమాండ్ మాత్రం 50 శాతం పడిపోయింది. ఈ విలువ 180.6 టన్నులుగా నమోదయ్యింది. ఇది ఐదేళ్ల కనిష్ట స్థాయి. అంటే అటు ఆభరణాలకు, ఇటు పెట్టుబడులకు కలిపి 2014లో భారత్ మొత్తం డిమాండ్ పరిమాణం 842.7 టన్నులు. 2013లో ఈ పరిమాణం 974.8 టన్నులు. కాగా చైనాతో (813.6 టన్నులు) పోలిస్తే భారత్ డిమాండ్‌లో మొదటిస్థానంలో ఉంది. దీనితో ఈ విషయంలో ప్రపంచంలోనే భారత్ తొలి స్థానంలో నిలిచినట్లయ్యింది. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోతే, 2015లో కూడా ఆభరణాలకు డిమాండ్ పెరుగుతుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) తన తాజా నివేదికలో అభిప్రాయపడింది. మరిన్ని అంశాల్లోకి వెళితే... ⇒ 2014లో బంగారం దిగుమతులు 769 టన్నులు. 2013లో ఈ పరిమాణం 825 టన్నులు. అయితే వార్షికంగా పసిడి అక్రమ రవాణా దాదాపు 175 టన్నులు ఉంటుందని అంచనా. ⇒ పరిశ్రమలు, డెకరేటివ్ అప్లికేషన్స్ వంటి విభాగాల్లో పసిడి వినియోగం 2014లో ఆరుశాతం తగ్గింది. ఐదేళ్ల కనిష్ట స్థాయి 87.5కి ఈ పరిమాణం పడిపోయింది. ⇒ పట్టు వంటి వస్త్రాల్లో జరి దారం వినియోగం ఏయేటికాయేడు తగ్గుతూ వస్తోంది. మారుతున్న వినియోగదారుల అభిరుచికి ఇది అద్దం పడుతోంది. -
పసిడిపై దిగుమతి సుంకం తగ్గింపు?
బడ్జెట్లో ప్రకటించే అవకాశం న్యూఢిల్లీ: కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) పూర్తి అదుపులో ఉన్న నేపథ్యంలో పసిడిపై దిగుమతి సుంకాన్ని కేంద్రం రానున్న బడ్జెట్లో 2 నుంచి 4 శాతం వరకూ తగ్గించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. దేశంలోకి వచ్చీ-పోయే విదేశీ మారకద్రవ్యం విలువ మధ్య నికర వ్యత్యాసాన్ని క్యాడ్‌గా వ్యవహరిస్తారు. దేశంలో రత్నాలు, ఆభరణాల తయారీ విభాగం వృద్ధికి, ఎగుమతులు పెరగడం లక్ష్యంగా కేంద్రం దిగుమతి సుంకాల తగ్గింపు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. దేశ ఎగుమతుల్లో ఈ విభాగం కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్లో ఈ రంగం నుంచి ఎగుమతుల్లో వృద్ధిలేకపోగా (2013 డిసెంబర్‌తో పోల్చితే) 1.2 శాతం క్షీణించి (మైనస్) 2.66 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. దాదాపు 35 లక్షల మంది ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. నవంబర్‌లో 152 టన్నుల పసిడి దిగుమతులు డిసెంబర్లో 39 టన్నులకు పడిపోయాయి. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద అత్యంత ప్రాముఖ్యత కలిగిన రంగాలుగా గుర్తించిన 25 విభాగాల్లో రత్నాలు, ఆభరణాల రంగం కూడా ఒకటి. ఈ నేపథ్యంలో పసిడిపై దిగుమతి సుంకాన్ని 2- 4 శాతం శ్రేణిలో తగ్గించే అవకాశం ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. 2013లో క్యాడ్ 4 శాతానికి పైగా పెరిగి, డాలర్ మారకంలో రూపాయి విలువ దాదాపు 68 వరకూ బలహీనపడిన పరిస్థితుల్లో పసిడి దిగుమతులపై కేంద్రం 10 శాతానికి సుంకాలను పెంచింది. ఆభరణాల విషయంలో ఈ దిగుమతి సుంకం 15 శాతంగా ఉంది. దీనితో అంతర్జాతీయంగా పసిడి ధర దిగివచ్చినా, ఆ ప్రభావం దేశంలో కనబడలేదు. ఒక దశలో 10 గ్రాములకు ప్రీమియం (దేశీయ-అంతర్జాతీయ ధరల మధ్య వ్యత్యాసం) రూ.3 వేలకు పైగా కనబడింది. దీనితో దేశంలోకి బంగారం అక్రమ రవాణా పెరుగుతూ వస్తోంది. -
పుత్తడి పై కొత్త ఆంక్షలు ఉండవు
న్యూఢిల్లీ: బంగారం దిగుమతులపై కొత్త ఆంక్షలను కేంద్రం విధించబోదని వాణిజ్య కార్యదర్శి రాజీవ్ ఖేర్ బుధవారం తెలిపారు. కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) పూర్తిగా అదుపులో ఉండడమే దీనికి కారణమని తెలిపారు. క్యాడ్‌కు మరింత సానుకూలమైన రీతిలో 2014 డిసెంబర్లో కేవలం 39 టన్నుల బంగారం మాత్రమే దిగుమతి జరిగినట్లు వెల్లడించారు. జనవరిలో ఇప్పటి వరకూ 7 టన్నుల దిగుమతి జరిగిందన్నారు. భారత్ బంగారం దిగుమతులు నవంబర్‌లో 151.59 టన్నులు. పరిశ్రమ ప్రతినిధులతో సమావేశం: విలేకరులతో మాట్లాడడానికి ముందు రాజీవ్ ఖేర్ పసిడి పరిశ్రమ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అఖిల భారత్ రత్నాలు, ఆభరణాల వాణిజ్య సమాఖ్య డెరైక్టర్ బాచ్రాజ్ బమల్వా విలేకరులతో మాట్లాడుతూ, ‘దిగుమతి సుంకాన్ని సైతం తగ్గించే విషయాన్ని పరిశీలిస్తామని కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది’’ అని తెలిపారు. -
పుత్తడి దిగుమతులపై తాజా ఆంక్షలు లేనట్టే!
న్యూఢిల్లీ: పుత్తడి దిగుమతులు ఈ డిసెంబర్ మొదటి రెండు వారాల్లో భారీగా తగ్గడంతో బంగారం దిగుమతులపై ప్రభుత్వం కొత్తగా ఆంక్షలు విధించే అవకాశాల్లేవు. ఈ ఏడాది నవంబర్‌లో 150 టన్నుల బంగారం దిగుమతులు జరిగాయి. గత నెల 28న బంగారం దిగుమతులకు సంబంధించిన వివాదస్పదమైన 80:20 స్కీమ్‌ను ఆర్బీఐ రద్దు చేసింది. ఈ స్కీమ్‌ను రద్దు చేసినప్పటికీ, డిసెంబర్లో మొదటి రెండు వారాల్లో 25 టన్నుల బంగారం దిగుమతులే జరిగాయని ప్రభుత్వ ఉన్నతాధికారొకరు చెప్పారు. దీంతో ప్రభుత్వం పుత్తడి దిగుమతులపై తాజాగా ఎలాంటి ఆంక్షలు విధించే అవకాశాల్లేవని ఆయన వివరించారు. కాగా గత ఏడాది డిసెంబర్లో 30 టన్నుల బంగారం దిగుమతులు జరిగాయి. విలువ పరంగా చూస్తే ఈ ఏడాది నవంబర్‌లో పుత్తడి దిగుమతులు ఆరు రెట్ల వృద్ధితో రూ.35,000 కోట్లకు పెరిగాయి. -
రూ. లక్ష కోట్లకు చేరువో ‘స్విస్’ పసిడి దిగుమతులు
-
రూ. లక్ష కోట్లకు చేరువో ‘స్విస్’ పసిడి దిగుమతులు
న్యూఢిల్లీ: గత కొంత కాలంగా స్విట్జర్లాండ్ పసిడికి దేశీయంగా గిరాకీ బాగా పుంజుకుంటోంది. వెరసి ఈ ఏడాది(2014) ఇప్పటివరకూ దిగుమతైన పసిడి విలువ రూ. లక్ష కోట్ల(ట్రిలియన్) సమీపానికి చేరింది. ఇందుకు అక్టోబర్ నెల కూడా జత కలిసింది. అక్టోబర్‌లో స్విస్ నుంచి దేశానికి రూ. 18,000 కోట్ల(2.8 బిలియన్ ఫ్రాంక్‌లు) విలువైన బంగారం దిగుమతి అయ్యింది. అంతకుముందు ఆగస్ట్‌లోనూ 2.2 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌ల విలువైన దిగుమతులు నమోదుకావడం గమనార్హం. ఈ గణాంకాలను స్విస్ కస్టమ్స్ పాలనా విభాగం తాజాగా విడుదల చేసింది. దీంతో జనవరి మొదలు అక్టోబర్ చివరివరకూ మొత్తం 14.2 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌ల(రూ. 93,000 కోట్లు) విలువైన బంగారం దేశానికి దిగుమతి అయ్యింది. పసిడి ట్రేడింగ్ ద్వారా దేశంలోకి నల్లధనం దిగుమతి అవుతోందన్న ఆందోళనల నేపథ్యంలో ఈ గణాంకాలకు ప్రాధాన్యత ఏర్పడింది. -
ఆరుగురి చేతిలో 40% పసిడి దిగుమతులు
న్యూఢిల్లీ: విదేశాల నుంచి భారత్‌కు దిగుమతి అవుతున్న పసిడిలో 40% పరిమాణాన్ని కేవలం ఆరుగురు ట్రేడర్లు నియంత్రిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం(2014-15) తొలి ఆరు నెలల(ఏప్రిల్-సెప్టెంబర్) కాలంలో వీరి ద్వారానే 40% పసిడి దిగుమతులు జరిగాయని ప్రభుత్వ వర్గాలు విశ్లేషించాయి. వీరిలో ముగ్గురు ముంబైకి చెందిన పసిడి ట్రేడర్లుకాగా, మిగిలినవారు ముంబై, బెంగళూరు, హర్యానాలకు చెందిన వర్తకులు. అయితే ఈ ఆరుగురు ట్రేడర్లు నిర్వహించే వర్తకంలో చట్టవిరుద్ధమైన అంశాలేవీ లేవని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఇటీవల పసిడి దిగుమతులు పుంజుకోవడంతో ప్రభుత్వం మళ్లీ ఆంక్షలు విధించే యోచనలో ఉన్న సంగతి తెలిసిందే. -
బంగారు నాణాలు, కడ్డీలు విక్రయించవద్దు: జీజేఎఫ్
ముంబై: బంగారు నాణాలు, కడ్డీల విక్రయాలను నిలిపేయాలని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యూవెలరీ ట్రేడ్ ఫెడరేషన్(జీజేఎఫ్) తన సభ్యులను కోరుతోంది. బంగారం దిగుమతులపై ఆంక్షలు ప్రభుత్వం విధించకుండా ఉండటానికి ఈ విక్రయాలను ఆపేయాలని ఈ సంస్థ ప్రతిపాదిస్తోంది. గత నెలలో బంగారం దిగుమతులు బాగా పెరిగిన నేపథ్యంలో పుత్తడి దిగుమతులపై ఆంక్షలను విధించడమే కాకుండా కొన్ని ప్రైవేట్ ట్రేడింగ్ కంపెనీలపైనా ఆంక్షలను విధించాలని ప్రభుత్వం యోచిస్తోందని సమాచారం. కాగా ఈ ఏడాది బంగారం దిగుమతులు 850 టన్నులుగా ఉంటాయని, వీటిల్లో నాణాలు, కడ్డీల వాటా 200-250 టన్నుల రేంజ్లో ఉండొచ్చని జీజేఎఫ్ డెరైక్టర్ బచ్చరాజ్ బమల్వ అంచనా వేస్తున్నారు. వాణిజ్య లోటు భారీగా పెరిగిపోవడంతో బంగారంపై దిగుమతి సుంకాన్ని 10 శాతానికి గత ఏడాది ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. అయితే, దీనిని 2 శాతానికి తగ్గించాలని బంగారం వర్తకులు కోరుతున్నారు. -
బంగారం దిగుమతులపై నేడోరేపో ఆంక్షలు!
న్యూఢిల్లీ: బంగారం దిగుమతులు గత రెండు నెలలుగా పెరిగిన నేపథ్యంలో, ఈ మెటల్ దిగుమతులపై నేడోరేపో ఆంక్షలు విధించే అవకాశం ఉందని అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) ఎట్టి పరిస్థితుల్లోనూ కట్టుతప్పరాదని కేంద్రం భావిస్తోందని, ఈ పరిస్థితుల్లో దిగుమతులపై మరికొన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు. దీనిపై ఆర్థిక మంత్రిత్వశాఖ పూర్తిస్థాయి దృష్టి పెట్టినట్లు సమాచారం. పసిడి దిగుమతులు ప్రధాన కారణంగా అక్టోబర్ వాణిజ్యలోటు పెరిగిన సంగతి తెలిసిందే. 2013 అక్టోబర్‌లో బంగారం దిగుమతుల విలువ 1.09 బిలియన్ డాలర్లు. అయితే 2014 అక్టోబర్‌లో ఈ విలువ ఏకంగా 4.17 బిలియన్ డాలర్లకు ఎగసింది. బంగారం, వెండి రెండింటినీ చూస్తే ఈ విలువ 1.38 బిలియన్ డాలర్ల నుంచి 4.85 బిలియన్ డాలర్లకు చేరింది. దేశ కరెంట్ అకౌంట్ లోటు కట్టడిలో భాగంగా ప్రభుత్వం గత కొన్ని నెలలుగా కనకం దిగుమతుల కట్టడికి తీసుకుంటున్న చర్యల వల్ల ఈ మెటల్ దిగుమతులు గణనీయంగా తగ్గిపోయిన సంగతి తెలిసిందే. వరుసగా రెండవ నెల అక్టోబర్‌లోనూ(సెప్టెంబర్ 4.22 బిలియన్ డాలర్లు) బంగారం దిగుమతులు 4 బిలియన్ డాలర్లు పైగా నమోదుకావడం- తాజా ఆందోళనకు కారణం. ఈ మెటల్ దిగుమతుల కట్టడికి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముంద్రా సోమవారం తెలిపారు. -
స్విట్జర్లాండ్ నుంచి భారీగా బంగారం దిగుమతులు
న్యూఢిల్లీ/బెర్న్: స్విట్జర్లాండ్ నుంచి భారత్‌కు ఈ ఏడాది రూ.70 వేల కోట్ల విలువైన బంగారం దిగుమతులు జరిగాయి. ఒక్క సెప్టెంబర్‌లోనే రూ.15,000 కోట్ల బంగారం దిగుమతులు స్విట్జర్లాండ్ నుంచి భారత్‌కు జరిగాయి. ఇది అంతకు ముందటి నెల బంగారం దిగుమతులతో పోల్చితే రెండు రెట్లు అధికం. ఈ వివరాలను స్విస్ కస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. సెప్టెంబర్‌లో అధిక సంఖ్యలో బంగారం దిగుమతులు జరగడానికి దీపావళి, ఇతర పండుగలు ఒక కారణమని నిపుణులంటున్నారు. నల్లధనం విషయమై భారత్‌లో రాజకీయంగా దుమారం చెలరేగుతున్న నేపథ్యంలో కొందరు తమ సొమ్ములను స్విట్జర్లాండ్ నుంచి బంగారం రూపంలో లేయరింగ్ చేస్తున్నారన్న అనుమానాలూ లేకపోలేదు. ఈ లేయరింగ్ కారణంగానే బంగారం దిగుమతులు సెప్టెంబర్‌లో భారీగా పెరిగాయన్ని వాదన కూడా ఉంది. నల్లధనం దాచుకున్న వారి వివరాలు వెల్లడి కాకుండా బంగారం, వజ్రాల వ్యాపారం ముసుగులో లేయరింగ్ అనే కొత్తవ్యూహాం వెలుగులోకి వచ్చిందని ప్రభుత్వ, బ్యాం కింగ్ వర్గాలంటున్నాయి. స్విట్జర్లాండ్ నుంచి భారత్‌కు తమ నల్లధనం నిధులను బంగారం, వజ్రాల వ్యాపారం ముసుగులో తరలిస్తున్నారని సందేహం పెరిగిపోతోంది. మనీ లాండరింగ్‌లో ఇది కీలకమైనదని నిపుణులంటున్నారు. స్విస్ బ్యాంకుల జాగ్రత్త భారతీయులు స్విట్జర్లాండ్‌లో నల్లధనాన్ని పోగేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో స్విస్ బ్యాంక్‌లు భారత క్లయింట్లతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయని సమాచారం. నల్లధనం విషయమై వివిధ దేశాలు తీసుకునే చర్యలకు సంబంధించి, స్విస్ బ్యాంకులకు ఎలాంటి బాధ్యత లేదంటూ అండర్ టేకింగ్స్ ఇవ్వాలని క్లయింట్లను స్విస్ బ్యాంకులు కోరుతున్నాయి. ఇలాం టి అండర్ టేకింగ్స్ ఇవ్వకపోతే సదరు క్లయింట్లు తమ ఖాతాలను మూసేయాలని కూడా ఈ బ్యాంకులు కోరుతున్నాయని సమచారం. -
బంగారు దిగుమతులపై మరిన్ని ఆంక్షలు
న్యూఢిల్లీ: బంగారం దిగుమతిపై కేంద్రం మరిన్ని ఆంక్షలు విధించనుంది. దీపావళి పండగ తర్వాత ఈ విషయంపై దృష్టిసారించనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. బంగారం దిగుమతులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. దీపావళి సీజన్ సందర్భంగా ఎలాంటి చర్యలూ తీసుకోబోమని, పండుగ తర్వాత నిర్ణయం తీసుకుంటామని జైట్లీ చెప్పారు. -
పసిడి దిగుమతి సంస్థల గుత్తాధిపత్యం లేదు: సీసీఐ
న్యూఢిల్లీ: బంగారం దిగుమతి సంస్థలు గుత్తాధిపత్య ధోరణులను అనుసరిస్తున్నాయని దాఖ లైన కొన్ని ఆరోపణలను కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తిరస్కరించింది. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలుసహా మొత్తం 16 సంస్థలపై ఈ ఆరోపణలు దాఖలయ్యాయి. ఆర్థికమంత్రిత్వశాఖ, వాణిజ్య పరిశ్రమల శాఖ, ఆర్బీఐ, డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్‌తో పాటు మరో 12 ప్రభుత్వ నియమిత సంస్థలు ఇందులో ఉన్నాయి. ఎంఎంటీసీ, ఎస్టీసీ ఆఫ్ ఇండియా, పీఈసీ, హాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్ ఎక్స్‌పోర్ట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నోవా స్కోటియా, కొటక్ మహీం ద్రా బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, యస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు ప్రభుత్వ నియమిత సంస్థలు. మార్కెట్లో ఈ సంస్థలు తమ గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయన్న ఫిర్యాదులను సీసీఐ తోసిపుచ్చుతూ, కేవలం ఇదే వ్యాపారంలో ఈ సంస్థలు లేవని స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. డీలర్లు, బంగారు ఆభరణాల తయారీదారులు, రిటైలర్లు కూడా ఈ వ్యాపార కార్యకలాపాలను ఎటువంటి ఆటం కం లేకుండా చేస్తున్నారని సీసీఐ పేర్కొంది. ఆ యా వ్యాపార అంశాలకు సంబంధించి 16 సంస్థలు కుమ్మకైనట్లు సైతం ఆధారాలు లేవంది. శ్రీ గురు జ్యూవెల్స్, తుషార్ దాఖలు చేసిన ఫిర్యాదు నిరాధారమని తేల్చింది. -
సుంకాల తగ్గింపు యోచన లేదు
న్యూఢిల్లీ: బంగారం దిగుమతి సుంకాల తగ్గింపు తక్షణ యోచన లేదని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పేర్కొన్నారు. కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) కట్టడిలో భాగంగా గత యేడాది బంగారంపై దిగుమతి సుంకాన్ని 10 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. దిగుమతి సుంకాల పెంపు వల్లే బంగారం అక్రమ రవాణా పెరిగిందని తాను చెప్పలేనని అన్నారు. మోడీ సర్కారు అధికారం చేపట్టి వంద రోజులు పూర్తై సందర్భంగా బుధవారం న్యూఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడారు. విభిన్నంగా నూతన విదేశీ వాణిజ్య విధానం 2014-19 కాలానికి త్వరలో ప్రకటించనున్న నూతన విదేశీ వాణిజ్య విధానం (ఎఫ్టీపీ) గత విధానాలతో పోలిస్తే భిన్నంగా ఉంటుందని కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. తయారీ, ఎగుమతుల రంగాల్ని ప్రోత్సహించేదిగా నూతన విధానం ఉంటుందని అన్నారు. ఈయూతో స్వేచ్ఛా వాణిజ్యం... యూరోపియన్ యూనియన్(ఈయూ)తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదుర్చుకోవడానికి ఇండియా సుముఖంగా ఉందనీ, అయితే భారత్ లేవనెత్తిన అంశాల పరిష్కారానికి ఈయూ కృషిచేయాలని కోరుకుంటున్నామనీ నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈయూ రాయబారి ఇటీవల తనతో సమావేశమైనపుడు ఈ విషయం ఎఫ్‌టీఏ ప్రస్తావన వచ్చిందని పేర్కొన్నారు. జీ-20లో భారత్‌కు నిర్మల ప్రాతినిధ్యం ఆస్ట్రేలియాలో ఈ నెల 20,21 తేదీల్లో నిర్వహించనున్న జీ20 దేశాల ఆర్థిక మంత్రుల సమావేశంలో కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి నిర్మలా సీతారామన్ భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మధుమేహానికి చికిత్స తీసుకుంటుండడంతో ఆమె ప్రాతినిధ్యం వహిస్తారని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. సోలార్ ప్యానెళ్లపై సుంకాలు ఉండావు.. అమెరికా, చైనా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకునే సోలార్ ప్యానెళ్లపై యాంటీ డంపింగ్ సుంకం విధించరాదని ప్రభుత్వం నిర్ణయించినట్లు సీతారామన్ తెలిపారు. యాంటీ డంపింగ్ సుంకం విధిస్తే సౌర పరికరాల ధరలు పెరుగుతాయంటూ విద్యుదుత్పత్తి సంస్థలు ఈ సుంకాన్ని వ్యతిరేకిస్తున్నాయి. అయితే, దేశీయ పరిశ్రమను కాపాడేందుకు అమెరికా, చైనా, మలేసియాల నుంచి దిగుమతి చేసుకునే సోలార్ సెల్స్‌పై ఒక వాట్‌కు 0.11-0.81 డాలర్ల సుంకం విధించాలని వాణిజ్యశాఖ గత మేనెలలో సిఫార్సు చేసింది. -
ఆర్థిక పరిస్థితి గాడిలో పడ్డాకే...
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక స్థితి మెరుగుపడిన తర్వాత బంగారం దిగుమతులపై ఆంక్షలు ఎత్తివేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. అయితే వెంటనే ఆంక్షలు సడలించే ఉద్దేశం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆర్థిక పరిస్థితి కుదటపడనంత వరకు ఆంక్షలు ఎత్తివేయడం సాధ్యం కాదని అన్నారు. కరెంట్ ఎకౌంట్ లోటు(సీఏడీ), ఆర్థిక లోటుపై తమ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని చెప్పారు. బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని గతేడాది ఆగస్టు నుంచి 10 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. దిగుమతి సుంకం పెంచడంతో 2013-14లో ఈ రెండు లోహాల దిగుమతులు 40% క్షీణించాయన్నాయి. కాగా, సుంకాన్ని 10 నుంచి 2 శాతానికి తగ్గించాలని రత్నాలు, ఆభరణాల ఎగుమతుల అభివృద్ధి మండలి (జీజేఈపీసీ) కేంద్రాన్ని కోరింది. -
సగానికి తగ్గిన పసిడి ప్రీమియం
ముంబై/ సింగపూర్: బంగారం దిగుమతులపై ఆంక్షలను మోడీ ప్రభుత్వం సడలిస్తుందన్న అంచనాలతో పసిడిపై ప్రీమియం ఈ వారంలో సగానికి తగ్గిపోయింది. ఔన్సు (31.1 గ్రాములు) పుత్తడిపై ప్రీమియం గత వారంలో 80-90 డాలర్లుండగా ఇపుడది 30-40 డాలర్లకు క్షీణించిందని డీలర్లు తెలిపారు. ధరలు తగ్గినప్పటికీ ఇతర ఆసియా దేశాల్లో బంగారానికి డిమాండు పెరగలేదు. భారీగా పెరిగిన కరెంటు అకౌంటు లోటును అదుపు చేసేందుకు కేంద్రం గతేడాది జూలై నుంచి బంగారం దిగుమతులపై తీవ్ర ఆంక్షలు విధించింది. దిగుమతి చేసుకున్న పసిడిలో 20 శాతాన్ని తిరిగి ఎగుమతి చేయాలనే నిబంధన (80:20 ఫార్ములా) కూడా పెట్టింది. కరెంటు అకౌంటు లోటు అదుపులోకి వచ్చిన నేపథ్యంలో దిగుమతులపై ఆంక్షలను కొత్త ప్రభుత్వం సడలించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఆంక్షలను సడలించడానికి ముందు విధాన, ఆర్థికాంశాలనే కాకుండా ప్రజలు, వ్యాపారుల ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని ప్రధాని మోడీ చెప్పారు. పసిడి దిగుమతులకు స్టార్ ట్రేడింగ్ హౌస్‌లను అనుమతిస్తూ రిజర్వు బ్యాంకు ఇటీవలే ఆంక్షలు సడలించింది. త్వరలోనే మరిన్ని సడలింపులు ఉంటాయనే అంచనాతో ప్రీమియంలు భారీగా తగ్గిపోయాయని అఖిల భారత రత్నాలు, ఆభరణాల వ్యాపారుల సమాఖ్య డెరైక్టర్ బచ్‌రాజ్ బామాల్వా తెలిపారు. 80:20 ఫార్ములాను పూర్తిగా తొలగించే వరకు ప్రీమియంలు ఇక తగ్గబోవని భావిస్తున్నట్లు చెప్పారు. ఏమిటీ ప్రీమియం..: బంగారం దిగుమతి ధరతో పోలిస్తే ఏడాదికాలంగా భారత్‌లో ఎక్కువ రే టు పలుకుతోంది. ఈ అధిక ధరనే ప్రీమియంగా పరిగణిస్తాం. మన దేశంలోకి దిగుమతి చేసుకునే సంస్థలే ఈ ప్రీమియంను వసూలు చేస్తున్నాయి. ఉదాహరణకు ప్రపంచ మార్కెట్లో ఔన్సు బంగారం ధర ప్రస్తుతం 1245 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ధరకు 11.5 శాతం దిగుమతి సుంకాలు కలిపితే 1388 డాలర్ల చొప్పున ఇక్కడి మార్కెట్లో విక్రయించాలి. కానీ దీనికి మరో 30 డాలర్లను ప్రీమియంగా కలుపుకొని 1418 డాలర్ల వరకూ దిగుమతి సంస్థలు ఇక్కడి బులియన్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. దాంతో ఇక్కడ 10 గ్రాముల ధరపై అదనంగా రూ. 600 భారం వినియోగదారులపై పడుతోంది. గతేడాది ఈ ప్రీమియం రూ. 3,000 వరకూ కూడా చేరింది. తదుపరి క్రమేపీ తగ్గుతూ వచ్చింది. బంగారం, వెండిపై దిగుమతి టారిఫ్ విలువ తగ్గింపు న్యూఢిల్లీ: ప్రభుత్వం సోమవారం బంగారం, వెండి దిగుమతులపై టారిఫ్ విలువను తగ్గించింది. పసిడి 10 గ్రాముల టారిఫ్ విలువను 424 డాలర్ల నుంచి 408 డాలర్లకు తగ్గించింది. వెండి కేజీ విషయంలో ఈ విలువను 650 డాలర్ల నుంచి 617 డాలర్లకు తగ్గించింది. అంతర్జాతీయంగా ధరల బలహీన ధోరణి దీనికి కారణం. టారిఫ్‌లను తగ్గిస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రధానంగా దిగుమతులపై కస్టమ్స్ సుంకం విధింపునకు ఈ టారిఫ్ విలువ(బేస్ ధర)ను సీబీఈసీ పరిగణనలోకి తీసుకుంటుంది. విలువను తక్కువచేసి చూపేందుకు(అండర్ ఇన్వాయిసింగ్) ఆస్కారం లేకుండా చేయడమే దీని ప్రధానోద్దేశం. సహజంగా 5 శాతం మేర మార్పు ఉంటే స్పాట్ మార్కెట్లో ఈ విలువ ప్రభావం పడే అవకాశం ఉంటుందన్నది నిపుణుల విశ్లేషణ. -
‘లోటు’ దిగొచ్చింది!
ముంబై: దేశాన్ని వణికించిన కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్)కు కళ్లెం పడింది. ప్రధానంగా బంగారం ఇతరత్రా దిగుమతులు దిగిరావడంతో గత ఆర్థిక సంవత్సరం(2013-14)లో క్యాడ్ జీడీపీలో 1.7 శాతానికి తగ్గింది. అంటే 32.4 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2012-13)లో ఈ లోటు చరిత్రాత్మక గరిష్టమైన 4.7 శాతానికి(87.8 బిలియన్ డాలర్లు) ఎగబాకిన సంగతి తెలిసిందే. సోమవారం రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) విడుదల చేసిన తాజా గణాంకాల్లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. మూలధన పెట్టుబడులు మినహా దేశంలోకి వచ్చే, బయటికిపోయే విదేశీ మారక నిధుల మధ్య వ్యత్యాసాన్ని క్యాడ్‌గా పరిగణిస్తారు. దిగుమతుల భారం కారణంగా ఈ లోటు ఆందోళనకస్థాయికి ఎగబాకి... డాలరుతో రూపాయి మారకం విలువ భారీ పతనం ఇతరత్రా అనేక ఆర్థిక ఇబ్బందులకు కారణమైంది. గతేడాది ఆగస్టులో రూపాయి విలువ ఆల్‌టైమ్ కనిష్టస్థాయి అయిన 68.85కు కరిగిపోయింది. దీంతో క్యాడ్ కట్టడి కోసం ప్రభుత్వం, ఆర్బీఐ తీసుకున్న చర్యలు ఎట్టకేలకు సత్ఫలితాలిచ్చాయి. ముఖ్యంగా బంగారం దిగుమతులపై నియంత్రణలతో క్యాడ్ దిగొచ్చేందుకు దోహదం చేసింది. మార్చి క్వార్టర్లో మరింత ఉపశమనం... గతేడాది ఆఖరి త్రైమాసికం(జనవరి-మార్చి)లో క్యాడ్ ఏకంగా జీడీపీలో 0.2 శాతానికి(1.2 బిలియన్ డాలర్లు) పరిమితమైంది. అంతక్రితం సంవత్సరం ఇదే కాలంలో 3.6 శాతం(18.1 బిలియన్ డాలర్లు)గా నమోదైంది. వాణిజ్య లోటు(ఎగుమతులు-దిగుమతుల మధ్య వ్యత్యాసం) తగ్గుముఖం పట్టడం.. తాజాగా విదేశీ నిధు ప్రవాహం పుంజుకోవడం కూడా క్యాడ్ భారీగా రికవరీ అయ్యేందుకు తోడ్పడింది. ఎగుమతులు మెరుగుపడటం.. దిగుమతుల కట్టడి కారణంగా గతేడాది వాణిజ్య లోటు 147.6 బిలియన్ డాలర్లకు తగ్గుముఖం పట్టింది. అంతక్రితం ఏడాది వాణిజ్య లోటు 195.7 బిలియన్ డాలర్లుగా ఉంది. కాగా, గతేడాది దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) భారీగా తగ్గి.. 48.8 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. అంతక్రితం ఏడాదిలో ఈ మొత్తం 89 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు ఆర్బీఐ గణాంకాలు పేర్కొన్నాయి. ప్రధానంగా విదేశీ రుణాలపై నికర చెల్లింపులు పెరగడం ఇతరత్రా అంశాలు దీనికి కారణమైనట్లు రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది. భారీగా తగ్గిన బంగారం దిగుమతులు గతేడాది చివరి క్వార్టర్(క్యూ4)లో బంగారం దిగుమతులు మరింత దిగొచ్చాయి. విలువపరంగా 5.3 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో దిగుమతులు(15.8 బిలియన్ డాలర్లు)తో పోలిస్తే భారీగా పడిపోయాయి. ఇక వాణిజ్య లోటు కూడా క్యూ4లో 45.6 బిలియన్ డాలర్ల నుంచి 30.7 బిలియన్ డాలర్లకు తగ్గింది. గతేడాది మొత్తం తీవ్ర నష్టాలతో కొట్టుమిట్టాడిన రూపాయి ప్రస్తుతం అట్టడుగు స్థాయి నుంచి భారీగా కోలుకుని కొంత స్థిరత్వాన్ని కూడా సంతరించుకుంటోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 58-59 స్థాయిలో కదలాడుతోంది. ఇటీవలి కాలంలో స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తుండటం... విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐ) నిధుల ప్రవాహం కూడా రూపాయికి బలాన్నిస్తున్నాయి. -
బంగారు కొండ.. దిగొస్తోంది!
6 నెలల్లో మరో 10 శాతం తగ్గుతుందని అంచనా పది గ్రాములు రూ. 26,000-24,000 శ్రేణికి రావొచ్చు కలిసొస్తున్న డాలరు పతనం, ఆంక్షల సడలింపు అంతర్జాతీయంగా బంగారానికి తగ్గుతున్న డిమాండ్ ఇప్పట్లో పెరిగే అవకాశాలు తక్కువే అంటున్న నిపుణులు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత కొద్దికాలంగా స్థిరంగా కదులుతున్న బంగారం ధరలు రానున్న కాలంలో మరింత తగ్గుతాయని బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ద్రవ్యలోటు తగ్గించడానికి గతంలో బంగారం దిగుమతులపై ఆంక్షలు విధించడం, రూపాయి పతనం కారణాలతో అంతర్జాతీయంగా తగ్గుతున్నా, దేశీయంగా తగ్గకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. మోడీ నాయకత్వంలో స్థిరమైన ప్రభుత్వం రావడంతో ఎఫ్ఐఐ నిధుల ప్రవాహం పెరిగి రూపాయి విలువ బలపడ సాగింది. దీనికి తోడు బంగారం దిగుమతులపై ఆంక్షలు తొలగించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ అంశాల నేపథ్యంలో రానున్న కాలంలో బంగారం ధరలు మరింతగా తగ్గుతాయంటున్నారు. ఇప్పటికే బంగారం ధరలు 5 శాతం క్షీణించాయని, మరో మూడు నుంచి నాలుగు నెలల్లో తక్కువలో తక్కువ మరో 5-7 శాతం వరకు తగ్గే అవకాశాలున్నాయని జెన్‌మనీ డెరైక్టర్, బులియన్ నిపుణులు ఆర్.నమశ్శివాయ పేర్కొన్నారు. ప్రస్తుత స్థాయి నుంచి పది గ్రాముల బంగారం ధర రూ. 26,000-25,000కి తగ్గొచ్చన్నారు. రానున్న కాలంలో డాలరుతో రూపాయి మారకం విలువ రూ 56-54 స్థాయికి చేరొచ్చని అంచనాలు వేస్తున్నారని, దీనికి ప్రభుత్వం సుంకాలు తగ్గించడం తోడైతే ప్రస్తుత స్థాయి నుంచి బంగారం ధరలు గరిష్టంగా 15 నుంచి 18 శాతం తగ్గినా ఆశ్చర్చపోనవసరం లేదని నమశ్శివాయ పేర్కొన్నారు. పెళ్లిల సీజన్, శ్రావణ మాసం వంటివి ఉండటంతో బంగారం కొనుగోళ్లకు డిమాండ్ బాగుంటుందని, దీంతో తక్షణం ధరలు బాగా తగ్గే అవకాశాలు తక్కువని, నవంబర్ నాటికి బాగా తగ్గొచ్చని అంచనా వేస్తున్నట్లు ఐడీబీఐ మ్యూచువల్ ఫండ్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ బి.శరత్ శర్మ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కిలోకి ఐదు లక్షలు అధికం బంగారంపై ప్రభుత్వ ఆంక్షల వల్ల అంతర్జాతీయ ధరల కంటే దేశీయంగా కిలో బంగారం ధర రూ. 5 లక్షలు అధికంగా ఉందని రిద్ధిసిద్ధి బులియన్స్ డెరైక్టర్ గుంపెళ్ల శేఖర్ పేర్కొన్నారు. బంగారం దిగుమతులపై ఆర్బీఐ విధించిన 20:80 శాతం నిబంధనలతో రూ. 2 లక్షలు, దిగుమతి సుంకంతో రూ. 2 లక్షలు, వ్యాట్ లక్ష చొప్పున మొత్తం అయిదు లక్షలు అధికంగా ఉందన్నారు. ఇప్పుడు ఆర్బీఐ 20:80 పరిధి కింద మరో పది కంపెనీలకు బంగారం దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఇవ్వడంతో ఇప్పటి వరకు ఉన్న ప్రీమియం కిలోకి రూ.80,000 తగ్గిందన్నారు. మోడీ ప్రభుత్వం సుంకాలు తగ్గిస్తే మరో 5 శాతం తగ్గుతుందని, అప్పుడు పది గ్రాముల బంగారం ధర రూ.25,000కి రావచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం బంగారం అమ్మకాలకు డిమాండ్ లేదని, ప్రభుత్వం తీసుకునే చర్యలపై స్పష్టత వస్తే కాని ఎంత వరకు తగ్గవచ్చన్నది చెప్పలేమని ఆంధ్రప్రదేశ్ గోల్డ్ మర్చంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బి.సూర్య ప్రకాష్ పేర్కొన్నారు. ప్రస్తుతం పది శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని 4-5 శాతానికి తగ్గిస్తే దీపావళి నాటికి బంగారం ధరలు రూ. 23,000 నుంచి రూ.24,000కు తగ్గుతాయని ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ అంచనా వేస్తోంది. ఇప్పట్లో పెరిగే అవకాశం లేదు అంతర్జాతీయంగా పుత్తడికి డిమాండ్ తగ్గడం, ఇదే సమయంలో బంగారం ఉత్పత్తి పెరుగుతుండటంతో ఇప్పట్లో ధరలు పెరిగే అవకాశాలు కనిపించడం లేదని బులియన్ నిపుణులు అంటున్నారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం జనవరి- మార్చి త్రైమాసికంలో బంగారం అత్యధికంగా దిగుమతి చేసుకునే ఇండియాలో 26%, చైనాలో 16% క్షీణించడంతో అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరిగే అవకాశాలు కనిపించడం లేదంటున్నారు. ఒకవేళ ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర 1,280 డాలర్ల వద్దే స్థిరంగా ఉన్నా, దేశీయ పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ తగ్గుతుందని నమశ్శివాయ పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు 1,050 డాలర్ల వరకు క్షీణించే అవకాశం ఉందని, ఒకవేళ పెరిగితే 1,320-1,400 డాలర్ల వద్ద తీవ్ర నిరోధాలున్నాయన్నారు. ఇలా ఏ విధంగా చూసినా రానున్న కాలంలో ఇండియాలో బంగారం ధరలు తగ్గడమే కాని పెరిగే అవకాశాలు తక్కువన్నది చాలామంది నిపుణుల అభిప్రాయం. -
పడిన పసిడి ధర
ముంబై: దిగుమతులపై ఆంక్షలను రిజర్వు బ్యాంకు సడలించడంతో బంగారం ధర గురువారం భారీగా పతనమైంది. పది నెలల కనిష్టస్థాయికి చేరింది. ముంబై బులియన్ మార్కెట్లో 10 గ్రాముల స్టాండర్డ్ బంగారం (99.5 ప్యూరిటీ) రేటు రూ.780 క్షీణించి రూ.27,690కి చేరింది. బుధవారం క్లోజింగ్ ధర రూ.28,470. ప్యూర్ గోల్డ్ (99.9 ప్యూరిటీ) ధర ఇదే స్థాయిలో పతనమై రూ.28,620 నుంచి రూ.27,840కి చేరుకుంది. వెండి ధర కిలోకు రూ.85 పెరిగి రూ.41,860 వద్ద ముగిసింది. బుధవారం క్లోజింగ్ ధర రూ.41,775. ఢిల్లీలో రూ.800... దేశ రాజధానిలో బంగారం ధర రూ.800 వరకు క్షీణించింది. ఒక్కరోజులో ఈ స్థాయిలో రేటు పతనం కావడం ఈ ఏడాది ఇదే ప్రథమం. పది గ్రాముల పసిడి ధర రూ.28,550కి చేరింది. గత పది నెలల్లో ఇదే కనిష్ట ధర. చెన్నై మార్కెట్లోనూ ధర దిగజారింది. పది గ్రాముల పుత్తడి రేటు రూ.800 తగ్గిపోయి రూ.28,310కి చేరుకుంది. కోల్‌కతాలోనూ రూ.665 తగ్గుదలతో రూ.28,340కి చేరింది. పసిడి దిగుమతికి ట్రేడింగ్ హౌస్‌లను అనుమతిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. పెరుగుతున్న కరెంటు అకౌంటు లోటు(క్యాడ్)ను అదుపు చేసేందుకు గతేడాది జూలై నుంచి పుత్తడి దిగుమతులపై తీవ్రమైన ఆంక్షలు విధించింది. బ్యాంకులను మాత్రమే, అది కూడా 80ః20 ఫార్ములాతో(దిగుమతి చేసుకున్న బంగారంలో 20 శాతాన్ని తిరిగి ఎగుమతి చేయాలనే నిబంధన) దిగుమతి చేసుకోవడానికి అనుమతించింది. ప్రస్తుతం క్యాడ్ అదుపులోకి రావడం తో పాటు ఆభరణాల తయారీదారులు, బులి యన్ డీలర్ల విజ్ఞప్తులతో దిగుమతులపై ఆంక్షల ను సడలించారు. దీంతో స్టాకిస్టులు భారీగా అ మ్మకాలు జరపడంతో ధరలు పతనమయ్యాయి. నెలకు 10-15 టన్నులు పెరగనున్న దిగుమతులు.. దిగుమతులపై ఆంక్షలు సడలించడంతో బంగారం దిగుమతులు నెలకు 10-15 టన్నుల మేరకు పెరిగే అవకాశముంది. ఎన్నికల ఫలితాల తర్వాత రూపాయి మారకం రేటు పుంజుకుందనీ, కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఏర్పడనుండడంతో మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడిందనీ అఖిల భారత రత్నాలు, ఆభరణాల సమాఖ్య (జీజేఎఫ్) డెరైక్టర్ బచ్‌రాజ్ బామాల్వా న్యూఢిల్లీలో తెలిపారు. సరఫరాలు పెరుగుతాయి: ఆంక్షల సడలింపు నేపథ్యంలో భారత్‌లోకి బంగారం అధికారిక సరఫరాలు పెరుగుతాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యుజీసీ) అభిప్రాయపడింది. దిగుమతి లెసైన్సు ఉన్న వారు మళ్లీ మార్కెట్లోకి వస్తారని కౌన్సిల్ ఎండీ సోమసుందరం చెప్పారు. అయితే 80ః20 ఫార్ములా నేటికీ కొనసాగడం ప్రతికూల అంశమని వ్యాఖ్యానించారు. -
పసిడి దిగుమతిపై ఆంక్షల సడలింపు
ముంబై: బంగారం దిగుమతులపై ఆంక్షలను రిజర్వు బ్యాంకు సడలించింది. ఇప్పటికే అనుమతించిన బ్యాంకులతో పాటు ఎంపిక చేసిన ట్రేడింగ్ హౌస్‌లను పసిడి దిగుమతులకు అనుమతించింది. విదేశీ వాణిజ్య డెరైక్టర్ జనరల్ (డీజీఎఫ్టీ) వద్ద నామినేటెడ్ ఏజెన్సీలుగా నమోదైన స్టార్ ట్రేడింగ్ హౌస్‌లు, ప్రీమియర్ ట్రేడింగ్ హౌస్‌లు ఇకనుంచి 20:80 ఫార్ములా ప్రకారం పుత్తడిని దిగుమతి చేసుకోవచ్చు. ఈ మేరకు రిజర్వు బ్యాంకు బుధవారం ఓ నోటిఫికేషన్ జారీచేసింది. భారీగా పెరిగిపోయిన కరెంటు అకౌంటు లోటు(క్యాడ్)ను, రూపాయి పతనాన్ని అదుపుచేసేందుకు రిజర్వు బ్యాంకు గత జూలైలో బంగారం దిగుమతులపై తీవ్రమైన ఆంక్షలు విధించింది. కొన్ని బ్యాంకులకు మాత్రమే... అది కూడా 20:80 ఫార్ములాతో దిగుమతి చేసుకునేందుకు అనుమతించింది. దిగుమతి చేసుకున్న బంగారంలో ఐదో వంతును, అంటే 20 శాతాన్ని తిరిగి ఎగుమతి చేయడమే ఈ ఫార్ములా. 2012-13లో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 4.8 శాతంగా ఉన్న కరెంటు అకౌంటు లోటు ప్రభుత్వ చర్యల ఫలితంగా 2013-14లో సుమారు 1.7 శాతానికి తగ్గిపోయిందని అంచనా. గతేడాది ఆగస్టులో అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ.69గా ఉండగా ప్రస్తుతం అది రూ.59 దిగువ స్థాయికి చేరింది. ఆభరణాల తయారీదారులు, బులియన్ డీలర్లు, బ్యాంకులు, వ్యాపార సంస్థల విజ్ఞప్తి మేరకు ఆంక్షలను సడలించారు. బీఎంబీ డిపాజిట్లకు ఇక మరింత రక్షణ! భారతీయ మహిళా బ్యాంక్(బీఎంబీ) డిపాజి టర్లకు మరింత రక్షణ కల్పించే కీలక చర్యను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం తీసుకుంది. ఆర్బీఐ చట్టం, 1934 రెండవ షెడ్యూల్లో బ్యాం క్‌ను చేర్చుతున్నట్లు ఒక నోటిఫికేషన్లో తెలిపింది. దీనిప్రకారం కమర్షియల్ బ్యాంక్ కేటగిరీలోకి బీఎంబీ చేరుతుంది. మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన బ్యాంక్ ఇది. రూ.1,000 కోట్ల ముందస్తు మూలధనంతో 2013 నవంబర్ నుంచీ బ్యాంక్ కార్యకలాపాలను ప్రారంభించింది. -
బంగారం దిగుమతులపై మరిన్ని ఆంక్షలు
-
అంతా తగ్గుదలే!
న్యూఢిల్లీ: జనవరిలో ఎగుమతి-దిగుమతుల రంగం మిశ్రమ ఫలితాలు చవిచూసింది. 2013లో ఇదే నెలతో పోలిస్తే ఎగుమతుల్లో 3.79 శాతం వృద్ధి మాత్రమే నమోదయింది. అయితే బంగారం, వెండి దిగుమతుల తగ్గడం వల్ల ఎగుమతులు-దిగుమతుల మధ్య ఉన్న వ్యత్యాసం సానుకూల రీతిలో 9.92 బిలియన్ డాలర్లకు దిగింది. ఎగుమతుల్లో నిరాశ... జనవరిలో ఎగుమతుల వృద్ధి నామమాత్రంగా ఉంది. 2013 అక్టోబర్ నుంచి ఎగుమతులు నిరాశాజనకంగా పడిపోతున్నాయి. అప్పట్లో ఎగుమతుల్లో 13.47 శాతం వృద్ధి నమోదుకాగా, నవంబర్‌లో 5.86 శాతం, డిసెంబర్లో 3.49 శాతం మాత్రమే వృద్ధి నమోదయింది. రత్నాలు- ఆభరణాలు, పెట్రోలియం వంటి ప్రధాన ఉత్పత్తుల ఎగుమతులు తగ్గడం ఈ విభాగంపై ప్రభావం చూపినట్లు విదేశీ వాణిజ్య డెరైక్టర్ జనరల్ అనుప్ పూజారి చెప్పారు. ఈ రెండు విభాగాల నుంచి ఎగుమతులు 2013 జనవరితో పోలిస్తే అసలు వృద్ధి లేకపోగా వరుసగా 13.1 శాతం, 9.39 శాతం చొప్పున క్షీణతను నమోదుచేశాయి. తగ్గిన దిగుమతులు... బంగారం, వెండి దిగుమతులు 2013 జనవరితో పోలిస్తే 77 శాతం పడిపోయి 7.49 బిలియన్ డాలర్ల నుంచి 1.72 బిలియన్ డాలర్లకు చేరాయి. చమురు దిగుమతులు సైతం 10.1 శాతం క్షీణించి 13.18 బిలియన్ డాలర్లకు చేరాయి. ప్రభుత్వ నియంత్రణల వల్ల ఏప్రిల్-జనవరి మధ్య ఈ రెండు విలువైన మెటల్స్ దిగుమతులు 37.8 శాతం క్షీణించి 27 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గడచిన ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో అంటే 2012 ఏప్రిల్-2013 జనవరి మధ్య ఈ విలువ 46.7 బిలియన్ డాలర్లు. కరెంట్ ఖాతా లోటు కట్టడి... వాణిజ్యలోటు తగ్గడం కరెంట్ ఖాతా లోటుకు (క్యాడ్) సానుకూలాంశం. క్యాపిటల్ ఇన్‌ఫ్లోస్-విదేశీ సంస్థాగత పెట్టుబడులు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, విదేశీ వాణిజ్య రుణాలు మినహా దేశంలోకి వచ్చీ-పోయే మొత్తం విదేశీ మారక ద్రవ్య నిల్వల మధ్య ఉన్న వ్యత్యాసమే క్యాడ్. ఇదెంత ఎక్కువైతే ఆర్థిక వ్యవస్థకు అంత ప్రమాదం. రూపాయి విలువ కదలికలపై సైతం ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తిలో ఈ రేటు 4.8 శాతం (88.2 బిలియన్ డాలర్లు). ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ)లో 3.7 శాతానికి అంటే దాదాపు 70 బిలియన్ డాలర్లకు తగ్గుతుందని తొలుత ప్రభుత్వం అంచనా వేసింది. అయితే ఇప్పుడు ఇది 50 బిలియన్ డాలర్ల లోపునకు తగ్గుతుందని (జీడీపీలో 3 శాతం వరకూ) భావిస్తోంది. -
సుఖేష్ గుప్తా రిమాండ్ పొడిగింపు
హైదరాబాద్: బంగారం దిగుమతికి సంబంధించి మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎంఎంటీసీ)ను మోసం చేసిన కేసులో నిందితులుగా ఉన్న ముసద్దీలాల్ భగవత్ స్వరూప్ (ఎంబీఎస్) జ్యూవెల్లర్స్ డెరైక్టర్ సుఖేష్‌గుప్తా, ఎంఎంటీసీ సీనియర్ మేనేజర్ రవిప్రసాద్‌ల రిమాండ్‌ను సీబీఐ కోర్టు ఈనెల 17 వరకు పొడిగించింది. వీరి రిమాండ్ ముగియడంతో సోమవారం న్యాయమూర్తి ఎన్.బాలయోగి ఎదుట హాజరుపర్చగా రిమాండ్‌ను పొడిగించారు. బంగారం దిగుమతి వ్యవహారంలో ఎంఎంటీసీకి రూ.194 కోట్లు నష్టం చేకూర్చారంటూ ఎంబీఎస్ డెరైక్టర్‌తోపాటు ఎంఎంటీసీకి చెందిన అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. -
బంగారంపై కస్టమ్స్ సుంకం తగ్గింపు?
న్యూఢిల్లీ: బంగారం దిగుమతులపై విధించిన నియంత్రణలను సడలించే అవకాశముందని కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం సూచనప్రాయంగా వెల్లడించారు. బంగారం దిగుమతులపై విధించిన నియంత్రణలపై మార్చి నెలాఖరులో సమీక్షించే అవకాశముందని ఆయన తెలిపారు. 'బంగారం దిగుమతులపై విధించిన నియంత్రణల్లో కొన్నింటిపై ఈ ఆర్థిక సంవత్సరం చివర్లో సమీక్షించే అవకాశముందని గట్టిగా చెప్పగలను. అయితే కరెంట్ ఎకౌంట్ లోటు పూర్తిగా అదుపులోకి వచ్చాకే సమీక్షిస్తాం' అని చిదంబరం తెలిపారు. కస్టమ్స్ దినం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ట్యాక్స్ అధికారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. బంగారం దిగుమతులు పెరగడంతో ప్రభుత్వం గతేడాది కస్టమ్స్ సుంకం మూడింతలు పెంచిన సంగతి తెలిసిందే. -
ఎగుమతుల మందగమనం
డిసెంబర్: భారత ఎగుమతుల వృద్ధి వేగం తగ్గింది. డిసెంబర్లో ఈ రేటు కేవలం 3.49%గా నమోదయ్యింది. ఇది 6 నెలల కనిష్ట స్థాయి. విలువ పరంగా చూస్తే డిసెంబర్లో ఎగుమతులు విలువ 26.34 బిలియన్ డాలర్లు. పెట్రోలియం ఉత్పత్తులు ఎగుమతులు పడిపోవడం మొత్తం వృద్ధి స్పీడ్ తగ్గడానికి కారణమని వాణిజ్య కార్యదర్శి ఎస్ఆర్ రావు తెలిపారు. 2012 డిసెంబర్లో ఎగుమతుల విలువ 25.45 బిలియన్ డాలర్లు. దిగుమతులు ఇలా.. ఇక డిసెంబర్ నెలలో దిగుమతులు 15.25% పడిపోయాయి. 2012 డిసెంబర్లో ఎగుమతుల విలువ 43.05 బిలియన్ డాలర్లయితే, ఈ విలువ 2013 డిసెంబర్లో 36.48 బిలియన్ డాలర్లు. వాణిజ్యలోటు మొత్తంగా ఎగుమతులు-దిగుమతులకు మధ్య ఉన్న వ్యత్యాసం వాణిజ్యలోటు డిసెంబర్లో 10.14 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2012 ఇదే నెలలో ఈ లోటు 17.6 బిలియన్ డాలర్లు. బంగారం, వెండి ఎఫెక్ట్ దిగుమతులు భారీగా తగ్గడం, దీనితో వాణిజ్యలోటు తగ్గడం వంటి అంశాలపై బంగారం, వెండి మెటల్స్ ప్రభావం పడింది. కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) కట్టడికి దిగుమతి సుంకాల పెంపుసహా ప్రభుత్వం కొనసాగిస్తున్న పలు కఠిన చర్యల నేపథ్యంలో బంగారం, వెండి దిగుమతులు డిసెంబర్లో కేవలం 1.77 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2012 ఇదే నెలలో ఈ విలువ 5.6 బిలియన్ డాలర్లు. అంటే దాదాపు ఈ దిగుమతుల రేటు 69 శాతం పడిపోయిందన్నమాట. ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలాన్ని చూస్తే బంగారం, వెండి దిగుమతుల విలువ 30 శాతానికి పైగా పడిపోయాయి. 2012 ఇదే కాలంలో ఈ విలువ 39.2 బిలియన్ డాలర్లయితే 2013 ఇదే నెలల్లో ఈ విలువ 27.3 బిలియన్ డాలర్లకు దిగివచ్చింది. ఇక చమురు దిగుమతులు 1.1 శాతం వృద్ధితో 13.89 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 9 నెలల్లో: కాగా ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలల్లో ఎగుమతులు 5.94 శాతం వృద్ధితో 217 బిలియన్ డాలర్ల నుంచి 230 డాలర్లకు పెరిగాయి. దిగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా 6.55 శాతం క్షీణత(-)తో 364 బిలియన్ డాలర్ల నుంచి 340.37 బిలియన్ డాలర్లకు పడ్డాయి. ఈ కాలంలో వాణిజ్యలోటు 110 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. తొమ్మిది నెలల కాలంలో చమురు దిగుమతుల విలువ 2.6శాతం పెరుగుదలతో 124.95 బిలియన్ డాలర్లుగా నమోదుకాగా, చమురు రహిత వస్తువుల దిగుమతుల విలువ 11.1శాతం పడిపోయి 215.42 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. గత ఆర్థిక సంవత్సరం (2012-13) మొత్తంలో దేశం మొత్తం ఎగుమతుల విలువ 300 బిలియన్ డాలర్లు. దిగుమతుల విలువ 491 బిలియన్ డాలర్లు. వాణిజ్యలోటు 190 బిలియన్ డాలర్లు. 2013-14లో భారత్ ఎగుమతుల లక్ష్యం 325 బిలియన్ డాలర్లు. -
పసిడి పై ఆంక్షలు సబబే
న్యూఢిల్లీ: బంగారం దిగుమతులపై ఆంక్షలను కొనసాగించడం సబబేనని కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం సమర్థించుకున్నారు. పసిడి దిగుమతులు తగ్గడం వంటి కారణాలతో కరెంట్ ఖాతా లోటు 50 బిలియన్ డాలర్ల దిగువకు చేరినప్పటికీ ఆంక్షలు కొనసాగించాల్సిందేనని వ్యాఖ్యానించారు. అయితే దేశీయంగా పసిడి ఉత్పత్తిపై దృష్టి పెట్టాల్సి ఉన్నదని చెప్పారు. మూతపడ్డ బంగారం గనులను వేలం వేయాల్సిందిగా ఆదేశిస్తూ ఇటీవల వెలువడ్డ సుప్రీంకోర్టు తీర్పుపై స్పందిస్తూ చిదంబరం మైనింగ్ శాఖ వీటిని విక్రయించాల్సి ఉన్నదని తెలిపారు. తద్వారా పసిడి అన్వేషణకు తెరలేపాలని పేర్కొన్నారు. కాగా, దిగుమతులపై అమలు చేస్తున్న ఆంక్షల కారణంగా పసిడి దొంగరవాణా పుంజుకుంటుందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ తదితరులు అభిప్రాయపడిన నేపథ్యంలో చిదంబరం వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కాగా, గత ఆర్థిక సంవత్సరం(2012-13)లో కరెంట్ ఖాతాలోటు చరిత్రాత్మక గరిష్ట స్థాయి 88 బిలియన్ డాలర్లకు ఎగసిన నేపథ్యంలో అటు ప్రభుత్వం, ఇటు రిజర్వ్ బ్యాంక్ బంగారం దిగుమతులపై పలు ఆంక్షలను విధించాయి. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో కరెంట్ ఖాతా లోటు 50 బిలియన్ డాలర్లలోపునకు దిగివచ్చింది. ఇక జనవరి 28న రిజర్వ్ బ్యాంక్ చేపట్టనున్న పరపతి సమీక్షపై స్పందిస్తూ చిదంబరం తొలుత ధరల అదుపుపై దృష్టిపెట్టాల్సి ఉన్నదని చెప్పారు. -
కొత్త ఏడాది బంగారం ధరలకు రెక్కలు
-
బంగారం దిగుమతుల విలువ తగ్గింపు
న్యూఢిల్లీ: బంగారం టారిఫ్ విలువ తగ్గింది. 10 గ్రాములకు 440 డాలర్లుగా ఉన్న ఈ విలువ 417 డాలర్లకు (5%)తగ్గింది. వెండి విషయంలో ఈ విలువ యథాపూర్వం కేజీకి 738 డాలర్లుగా కొనసాగనుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ నెలారంభంలో ఔన్స్(31.1గ్రా)కు 1322 డాలర్ల వద్ద ఉన్న పసిడి విలువ గత రాత్రి 1266 డాలర్లకు పడిపోయిన నేపథ్యంలో ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ సెంట్రల్ (సీబీఈసీ) తాజా నిర్ణయం తీసుకుంది. బంగారంపై 10 శాతం దిగుమతి సుంకాన్ని ఈ నిర్దేశిత విలువపై విధిస్తారు. అంటే తాజా టారీఫ్ విలువ ప్రకారం దిగుమతి సుంకం 44 డాలర్ల నుంచి 41.7 డాలర్లకు (3.2 డాలర్ల వ్యత్యాసం) తగ్గుతుంది. రూపాయిల్లో ఈ తగ్గుదల దాదాపు రూ. 200 వుంటుంది. ఈ మేరకు గురువారం స్పాట్ మార్కెట్లో బంగారం ధర తగ్గుతుంది. -
పసిడికి చెక్!
ముంబై: దేశంలోకి బంగారం దిగుమతులకు కళ్లెంవేసేందుకు ప్రభుత్వం కొరఢా ఘులిపించింది. ప్రజల మోజును తగ్గించడానికి మంగళవారం పరోక్ష చర్యలకు దిగింది. బంగారం, వెండి ఆభరణాల దిగుమతి సుంకాన్ని ప్రస్తుత 10% నుంచి 15 శాతానికి పెంచింది. దీంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆభరణాల విలువ మరింత పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, దేశీయ పరిశ్రమ ప్రయోజనాల పరిరక్షణకే ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇక బంగారు ఆభరణాలపై రుణ నిబంధనలనూ మరింత కఠినతరం చేస్తూ మంగళవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. కారణాల్లోకి వెళితే... ఒక్క పసిడి దిగుమతిపై ప్రస్తుతం 10% సుంకం అమల్లో ఉంది. ఇక ఆభరణాల దిగుమతులపై సైతం ఇప్పటివరకూ 10% సుంకమే అమల్లో ఉంది. ఇవి యంత్రాలమీద తయారై, తక్కువధరకు దిగుమతయ్యే పరిస్థితి నెలకొంది. రెండు రకాల సుంకాల మధ్య వ్యత్యాసం లేకపోవడంతో కొందరు వినియోగదారులు విదేశాల నుంచి దిగుమతి అవుతున్న ఆభరణాల కొనుగోలు వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ పరిస్థితి దేశీయ పరిశ్రమ, ఈ పరిశ్రమపై ఆధారపడుతున్న చిన్న స్థాయి దేశీయ స్వర్ణకారులు, ఈ రంగంలోని కార్మికుల ప్రయోజనాలకు విఘాతంగా మారుతోంది. ఈ పరిస్థితుల నుంచి దేశ పరిశ్రమను రక్షించడానికే తాజా నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 2012 జనవరిలో పసిడికి సంబంధించి ఈ సుంకాల వ్యత్యాసం 8 శాతంగా ఉండేది. వెండి విషయంలో 4 శాతంగా ఉండేది. అటు తర్వాత కేవలం బంగారం, వెండి దిగుమతులపై సుంకాలను క్రమంగా ప్రభుత్వం 10 శాతానికి పెంచుతూ పోయింది. కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్- క్యాపిటల్ ఫ్లోస్ మినహా దేశంలోకి వచ్చీ పోయే విదేశీ మారకద్రవ్య విలువ మధ్య ఉన్న వ్యత్యాసం) తీవ్ర సమస్యగా మారడం దీనికి కారణం. ప్రధానంగా ఈ మెటల్స్ డిమాండ్‌ను నెరవేర్చుకోవడానికి మనం అధికంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల దేశంపై దిగుమతుల భారం పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో వీటి కట్టడి కోసం ప్రభుత్వం, ఆర్బీఐ దృష్టి సారించాయి. వర్తకులు, ఎగుమతిదారుల హర్షం ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం దేశీయ పరిశ్రమ ప్రయోజనాలకు దోహదపడుతుందని దేశీయ ఆభరణాల తయారీ సంస్థలు, సంబంధిత చిన్న వర్తకులు, ఎగుమతిదారులు అభిప్రాయపడుతున్నారు. దేశీయ ఆభరణాల వర్తకులకు ఇది ప్రయోజనం కలిగిస్తుందని పీసీ జ్యూవెలర్స్ ఎండీ బలరామ్ గర్గ్ పేర్కొన్నారు. రత్నాలు, ఆభరణాల ఎగుమతి అభివృద్ధి మండలి చైర్మన్ విపుల్ షా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 2012-13లో బంగారం ఆభరణాల దిగుమతుల విలువ 5.04 బిలియన్ డాలర్లు. 2013-14 జూన్ క్వార్టర్లో ఈ విలువ 112 మిలియన్ డాలర్లు. భారత్‌కు ఆభరణాల దిగుమతులు ప్రధానంగా థాయ్‌లాండ్ నుంచి జరుగుతున్నాయి. పుత్తడి రుణాలపై నిబంధనలు కఠినం బంగారు ఆభరణాలపై రుణ నిబంధనలనూ కఠినతరం చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక చర్య తీసుకుంది. బంగారం ధర తీవ్ర ఒడిదుడుకులకు లోనుకాకుండా, ఆభరణాలకు విలువకట్టే ప్రక్రియలో ప్రామాణీకీకరణను తీసుకురావడం, రుణ గ్రహీతకు పారదర్శక విధానం అందుబాటులో ఉంచడం తాజా నిబంధనల ప్రధాన లక్ష్యం. దీనిప్రకారం రుణం పొందడానికి హామీగా ఉంచిన పసిడి ఆభరణాలపై విలువ కట్టడానికి ఆర్బీఐ ఒక నిర్దిష్ట విధానాన్ని నిర్ణయించింది. ఇకపై 22 క్యారెట్లకు సంబంధించి రుణం మంజూరు చేసేటప్పటికి అంతకుముందటి 30 రోజుల్లో బొంబాయి బులియన్ అసోసియేషన్(బీబీఏ) కోట్ చేసిన ముగింపు ధరల సగటును ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది. ఈ మేరకు ఆర్బీఐ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం రుణాలు ఇవ్వడానికి హామీగా తీసుకునే పసిడి ఆభరణాలను విలువ కట్టడానికి ఒక నిర్దిష్ట విధానం అమల్లో లేదు. విలువ కట్టే విధానం ఏకపక్షంగా, ఎటువంటి పారదర్శకతా లేకుండా జరుగుతోంది. విలువలో 60 శాతమే రుణం..: సూచించిన నిబంధనలకు లోబడి లెక్కించిన ఆభరణాల విలువలో 60 శాతాన్నే రుణంగా ఇవ్వాల్సి ఉంటుంది. రూ.5 లక్షలకు పైబడిన అన్ని లావాదేవీలకు సంబంధించి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు(ఎన్బీఎఫ్సీలు) రుణ గ్రహీత నుంచి పాన్ కార్డ్ కాపీని తప్పనిసరిగా తీసుకోవాలి. రూ.లక్ష ఆపైన రుణాలు కేవలం చెక్కు ద్వారానే మంజూరు చేయాలి. అన్ని బ్రాంచీల్లో ఒకే విధమైన డాక్యుమెంటేషన్‌ను నిర్వహించేలా పసిడి రుణ సంస్థలు చర్యలు తీసుకోవాలి. ‘కేవలం 2-3 నిముషాల్లోనే బంగారంపై రుణం’ వంటి తప్పుదోవపట్టించే ప్రకటనల జారీని ఆర్బీఐ నిషేధించింది. శాఖ విస్తరణ కట్టుదిట్టం: బంగారంపై రుణాలిచ్చే ఎన్‌బీఎఫ్‌సీల బ్రాంచీల విస్తరణ నిబంధనలను సైతం ఆర్బీఐ కట్టుదిట్టం చేసింది. ఇప్పటికే 1000 బ్రాంచీలకుపైగా ఉన్న ఎన్బీఎఫ్సీలు తదుపరి బ్రాంచీల విస్తరణకు ఆర్బీఐ ఆమోదం పొందాలి. ఒకవేళ హామీగా ఉంచిన ఆభరణాలను వేలం వేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమయితే, రుణం ఇచ్చిన బ్రాంచ్ ఉన్న పట్టణం, తాలూకాల్లోనే ఈ వేలం జరగాలి. తాకట్టు ఆభరణాలకు ఎన్బీఎఫ్సీలు రిజర్వ్ ధరను నిర్ణయించాలి. ఈ రిజర్వ్ ధర అప్పటికి గడచిన 30 రోజులుగా బొంబాయి బులియన్ అసోసియేషన్ ప్రకటించిన ధర సగటులో 85 శాతానికి తక్కువకాకుండా ఉండాలి. -
ఎగుమతులు ఓకే..
న్యూఢిల్లీ: గతకొన్ని నెలలుగా కుంటుపడిన దేశ ఎగుమతులు అకస్మాత్తుగా వృద్ధిబాటలోకి వచ్చాయి. ఒకపక్క ఆర్థికవ్యవస్థ మందగమనంలోనే కొనసాగుతున్నప్పటికీ... జూలైలో ఎగుమతులు క్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే 11.64 శాతం ఎగబాకాయి. రెండేళ్లలో ఇదే అత్యధిక స్థాయి వృద్ధిరేటు కావడం గమనార్హం. మొత్తంమీద గత నెలలో 25.83 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు నమోదయ్యాయి. 2011 సెప్టెంబర్ నెలలో 35 శాతం ఎగుమతుల వృద్ధి తర్వాత మళ్లీ ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. కాగా, ఈ ఏడాది మే(-1.1%), జూన్(-4.6%) నెలల్లో ఎగుమతులు తిరోగమనంలో కొనసాగడం తెలిసిందే. తగ్గిన దిగుమతులు...: ఇక జూలై నెలలో దిగుమతులు తగ్గుముఖం పట్టాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 6.2 శాతం తగ్గి 38.1 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు జరిగాయి. ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసం(వాణిజ్య లోటు) జూన్‌లో మాదిరిగానే 12.2 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ముఖ్యంగా బంగారం, వెండి దిగుమతులు శాంతించడంతో వాణిజ్యలోటు ఎగబాకకుండా అడ్డుకట్టపడేందుకు దోహదం చేసింది. క్రితం ఏడాది జూలైలో 4.4 బిలియన్ డాలర్ల విలువైన పసిడి, వెండి దిగుమతికాగా.. ఈ ఏడాది ఇదే నెలలో 34 శాతం తగ్గి 2.9 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. అయితే ఈ ఏడాది జూన్‌లో 2.4 బిలియన్ డాలర్ల దిగుమతులతో పోలిస్తే జూలై పెరగడం గమనార్హం. కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) ఆందోళనకరంగా ఎగబాకుతున్న నేపథ్యంలో పుత్తడి దిగుమతులను తగ్గించేందుకు ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని భారీగా పెంచగా... ఆర్బీఐ కూడా నియంత్రణ చర్యలను తీసుకున్న సంగతి తెలిసిందే. గతేడాది(2012-13)లో క్యాడ్ చరిత్రాత్మక కనిష్టానికి(4.8%) ఎగబాకడం విదితమే. బంగారం, ముడిచమురు దిగుమతుల జోరే దీనికి ప్రధానకారణంగా నిలిచింది. మరోపక్క, అధిక క్యాడ్, వాణిజ్యలోటు ప్రభావంతో డాలరుతో రూపాయి విలువ కూడా రోజుకో కొత్త కనిష్టాలకు పడిపోతోంది. తాజాగా 61.80 స్థాయిని తాకింది కూడా.ఏప్రిల్-జూలైలోనూ...: ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూలై.. 4 నెలల వ్యవధిలోకూడా ఎగుమతులు వృద్ధి చెందాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 1.72% పెరిగి 98.2 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇక దిగుమతులు 2.82 శాతం తగ్గాయి. 160.7 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు జరిగాయి. వాణిజ్యలోటు 62.4 బిలియన్ డాలర్లుగా నమోదైంది. మరింత పుంజుకుంటాయ్: రావు ఎగుమతుల పెంపు చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ప్రోత్సాహకాలు త్వరలోనే ఫలితాలిస్తాయని వాణిజ్య శాఖ కార్యదర్శి ఎస్ఆర్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా వడ్డీ సబ్సిడీ పెంపు వంటి నిర్ణయాలవల్ల రానున్న నెలల్లో ఎగుమతులు మరింత పుంజుకోనున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియాన్, దూర ప్రాచ్య దేశాలకు ఎగుమతులు మెరుగుపడుతుండటం దీనికి ఆసరాగా నిలవనుందన్నారు. గతేడాది 300.6 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఈ ఏడాది ఎగుమతులు కాస్త ఎక్కువగానే ఉండొచ్చని ఆయన అంచనా వేశారు. ప్రభుత్వం ఈ ఏడాదిలో 10 శాతం ఎగుమతుల వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు.