Indian Govt Raises Import Tax On Gold To Support Rupee, Details Inside - Sakshi
Sakshi News home page

Import Tax On Gold In India: పసిడిపై ట్యాక్స్‌, బంగారం డిమాండ్‌పై నిర్మలా సీతారామన్‌ ఆసక్తిర వ్యాఖ్యలు!

Published Sat, Jul 2 2022 6:59 AM | Last Updated on Sat, Jul 2 2022 1:08 PM

India Raises Import Tax On Gold - Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పసిడి ప్రియులకు షాకిచ్చింది. బంగారం దిగుమతులపై తాజాగా సుంకాన్ని పెంచింది. ప్రస్తుతం అమల్లో ఉన్న 10.75 శాతం నుంచి పసిడి దిగుమతుల సుంకాన్ని 15 శాతానికి చేర్చింది. తద్వారా బలపడుతున్న బంగారం దిగుమతులకు తోడు కరెంట్‌ ఖాతా లోటు (క్యాడ్‌)కు చెక్‌ పెట్టాలని భావిస్తోంది. దిగుమతి సుంకంలో తాజా మార్పులు జూన్‌ 30 నుంచే అమల్లోకి వచ్చినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. జూన్‌ నెలాఖరువరకూ బంగారంపై బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీ 7.5 శాతంగా అమలు కాగా.. ప్రస్తుతం 12.5 శాతానికి పెరిగింది. దీనికి వ్యవసాయ రంగ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్‌ 2.5 శాతం జత కలుస్తోంది. వెరసి పసిడి దిగుమతుల సుంకం 15 శాతానికి చేరింది.  

ఫారెక్స్‌పై ఒత్తిడి..:
దేశీయంగా పసిడి ఉత్పత్తి తగినంత లేకపోవడంతో గరిష్ట స్థాయిలో దిగుమతి చేసుకోవలసి వస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. దీంతో విదేశీ మారకం(ఫారెక్స్‌)పై ఒత్తిడి పడుతున్నట్లు తెలియజేశారు. పసిడికి డిమాండ్‌ కొనసాగుతూనే ఉంటుందని, దీంతో కనీసం దిగుమతులను నిరుత్సాహపరిచేందుకు ప్రయత్నించవలసి ఉంటుందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అలాకాకుండా పసిడిని దిగుమతి చేసుకునేందుకు ఆసక్తిగానే ఉంటే మరింత సొమ్ము వెచ్చించవలసి వస్తుందని చెప్పారు. దీంతో దేశానికి కొంతమేర ఆదాయం సమకూరుతుందని ఆమె వివరించారు. 

107 టన్నులు..:
ఇటీవల పుత్తడి దిగుమతులు ఉన్నట్టుండి ఊపందుకున్నాయి. మే నెలలో 107 టన్నుల బంగారం దిగుమతికాగా.. జూన్‌లోనూ ఇదే స్థాయిలో నమోదుకానున్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. పసిడి దిగుమతుల కారణంగా కరెంట్‌ ఖాతాపై ఒత్తిడి పడుతోంది. తద్వారా లోటు పెరుగుతున్నట్లు పేర్కొంది. కొద్ది రోజులుగా విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు తరలిపోతుండటం, దిగుమతి వ్యయాలు పెరగడంతో విదేశీ మారక నిల్వలు తరుగుతున్నట్లు తెలియజేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం ప్రారంభమయ్యాక డాలరుతో మారకంలో రూపాయి విలువ భారీగా పతనమవుతూ వస్తోంది. దీన్ని నివారించే బాటలో రిజర్వ్‌ బ్యాంక్‌ విదేశీ మారకాన్ని వెచ్చిస్తోంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 25 నుంచి ఫారెక్స్‌ నిల్వలు దాదాపు 41 బిలియన్‌ డాలర్లమేర క్షీణించడం గమనార్హం!

స్మగ్లింగ్‌ పెరుగుతుంది... 
పసిడి దిగుమతులపై ఉన్నపళాన దిగుమతి సుంకాలను పెంచడం ఆశ్చర్యాన్ని కలిగించింది. డాలరుతో మారకంలో రూపాయి క్షీణతపై ప్రభుత్వ పరిస్థితులను అర్ధం చేసుకోగలం. అయితే ఇది మొత్తం పరిశ్రమకు సవాళ్లు విసురుతుంది. సుంకాల పెంపు స్మగ్లింగ్‌కు ప్రోత్సాహాన్నిచ్చే అవకాశముంది. దేశీ పరిశ్రమకు మేలు చేసేలా పరిస్థితులను సరిదిద్దేందుకు ప్రభుత్వానికి తోడ్పాడును అందించనున్నాం.

– ఆశిష్‌ పెథే, చైర్మన్, ఆల్‌ ఇండియా జెమ్, జ్యువెలరీ దేశీ కౌన్సిల్‌ (జీజేసీ)  

సమస్య మరింత జటిలం..
దేశీయంగా పసిడి డిమాండు దిగుమతుల ద్వారానే తీరుతోంది. డాలరుతో దేశీ కరెన్సీ బలహీనపడుతున్న వేళ దిగుమతి సుంకం పెంపు.. సమస్యను మరింత పెంచనుంది. వాణిజ్య అంతరాలు, ద్రవ్యోల్బణం రూపాయిని దెబ్బతీస్తున్నాయి. ప్రస్తుతం పసిడిపై మొత్తంగా పన్ను భారం 14 శాతం నుంచి 18.45 శాతానికి పెరగనుంది. ఇది తాత్కాలిక చర్యకాకుంటే అనధికార మార్కెట్‌ పుంజుకునే వీలుంది.

– సోమసుందరం పీఆర్, ప్రాంతీయ సీఈవో (ఇండియా), వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement