ఇన్‌ కమ్‌ ట్యాక్స్‌ చెల్లిస్తున్నారా? అయితే ఇది మీకోసమే! | What Is Tax And Tds And How Does It Work | Sakshi
Sakshi News home page

ఇన్‌ కమ్‌ ట్యాక్స్‌ చెల్లిస్తున్నారా? అయితే ఇది మీకోసమే!

Published Mon, Dec 19 2022 4:21 PM | Last Updated on Mon, Dec 19 2022 4:31 PM

What Is Tax And Tds And How Does It Work - Sakshi

పెట్టుబడి పెట్టే ముందు రాబడి ఒక్కటే చూస్తే కాదు. వచ్చిన లాభంపై పన్ను బాధ్యత ఎంతన్నది కూడా ముఖ్యమే. అప్పుడే కదా నికర రాబడి గురించి తెలిసేది. మ్యూచువల్‌ ఫండ్స్, చిన్న మొత్తాల పొదుపు పథకాలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు తదితర డెట్‌ సాధనాలు, బంగారం, జీవిత బీమా పథకాలు, యులిప్‌లు ఇలా ఎన్నో పెట్టుబడి సాధనాలున్నాయి. వీటన్నింటిపైనా ఒకే విధమైన పన్ను లేదు. పైగా కాల వ్యవధి ఆధారంగా పన్ను బాధ్యత కూడా మారిపోతుంది. అందుకే ఇన్వెస్టర్లు ప్రతి పెట్టుబడి సాధనం, అందులో వచ్చే రాబడులపై చెల్లించాల్సిన పన్ను, అమలయ్యే టీడీఎస్‌ తదితర వివరాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే. ఈ వివరాలను అందించే కథనమే ఇది.

సేవింగ్స్‌ బ్యాంకు అకౌంట్‌ 
సేవింగ్స్‌ బ్యాంక్‌ ఖాతాలో కనీస బ్యాలెన్స్‌ అంటూ కొంత ఉంచుతుంటాం. దీనికితోడు మనకు జమయ్యే వేతనం, ఇతరత్రా అన్నీ కూడా వచ్చి ముందుగా నిల్వ ఉండేది బ్యాంకు ఖాతాలోనే. మరి ఈ మొత్తంపై బ్యాంకులు సుమారు 3 శాతం మేర వడ్డీ చెల్లిస్తాయని తెలిసింది తక్కువ మందికే. ఇలా బ్యాంక్‌ సేవింగ్స్‌ ఖాతాలో జమయ్యే వడ్డీ ఆదాయం ఆదాయపన్ను పరిధిలోకి వస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో సేవింగ్స్‌ బ్యాంకు డిపాజిట్ల వడ్డీ ఆదాయం రూ.10,000 వరకు ఉంటే పన్ను లేదు. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 80టీటీఏ పన్ను మినహాయింపు కల్పిస్తోంది. రూ.10వేలలోపు ఉన్నా కానీ ఆదాయపన్ను రిటర్నుల్లో ఈ మొత్తాన్ని చూపించాలి. వడ్డీ ఆదాయం రూ.10,001 అంతకంటే ఎక్కువ ఉంటే పన్ను చెల్లించాలి. సంబంధిత వ్యక్తి ఆదాయం ఏ శ్లాబ్‌ పరిధిలో ఉంటే ఆ రేటు ప్రకారం, సేవింగ్స్‌ బ్యాంకు వడ్డీ ఆదాయంపై పన్ను చెల్లించాలి.  ఒకవేళ 60 ఏళ్లు నిండి ఉంటే వారికి రూ.50,000 వరకు సేవింగ్స్‌ బ్యాంకు వడ్డీ ఆదాయంపై పన్ను లేదు. రూ.50,001, అంతకంటే ఎక్కువ ఆదాయం ఉంటే సీనియర్‌ సిటిజన్లు (వృద్ధులు) సైతం తమ పన్ను రేటు ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది.

సావరీన్‌ గోల్డ్‌ బాండ్స్‌ 
సార్వభౌమ బంగారం బాండ్లను కేంద్ర ప్రభుత్వం తరఫున పూర్తి హామీతో ఆర్‌బీఐ ఏటా పలు విడతలుగా జారీ చేస్తుంటుంది. బంగారంలో పెట్టుబడుల కోసం ఉద్దేశించిన సాధనం ఇది. కాల వ్యవధి ఎనిమిదేళ్లు. కాల వ్యవధి ముగిసేవరకు పెట్టుబడిని కొనసాగించినట్టయితే, రాబడిపై ఎలాంటి పన్ను లేదు. మూడేళ్లు మించి, ఎనిమిదేళ్లలోపు విక్రయించినప్పుడు వచ్చే రాబడిపై 20 శాతం పన్ను చెల్లించాలి. ఇండెక్సేషన్‌ ప్రయోజనం ఉంది. మూడేళ్లలోపు విక్రయించినప్పుడు వచ్చే రాబడి వార్షిక ఆదాయానికి కలుస్తుంది.  

రిఫండ్‌ కోరొచ్చు 
కొన్ని రకాల పెట్టుబడి సాధనాలపై రాబడి నిర్ణీత పరిమితి దాటితే మూలం వద్ద పన్ను వసూలు చేసే (టీడీఎస్‌) విధానం అమల్లో ఉంది. 10–20 శాతం మేర టీడీఎస్‌ అమలవుతుంది. ఈ మొత్తాన్ని బ్యాంక్‌లు, పోస్టాఫీసులు, కంపెనీలు, ఎన్‌బీఎఫ్‌సీలు సంబంధిత ఇన్వెస్టర్‌ పాన్‌ నంబర్‌ ఆధారంగా ఐటీ శాఖకు జమ చేస్తాయి. ఒకవేళ ఇన్వెస్టర్‌ వార్షిక ఆదాయం పన్ను పరిధిలోకి వస్తే.. ఈ వడ్డీ ఆదాయంపైనా అంతే మేర పన్ను పడుతుంది. ఒకవేళ వార్షికాదాయం పన్ను వర్తించని పరిధిలో ఉంటే అప్పుడు రిటర్నులను విధిగా నిర్ణీత గడువులోపు దాఖలు చేయాలి. అలా దాఖలు చేసిన తర్వాత టీడీఎస్‌ రూపంలో మినహాయించిన మొత్తాన్ని తిరిగి తనకు చెల్లించాలంటూ రిఫండ్‌ క్లెయిమ్‌ చేసుకోవచ్చు. 

బంగారం 
బంగారం ఆభరణాలు, భౌతిక రూపంలో బంగారం కొనుగోలు చేసి, వాటిని మూడేళ్ల తర్వాత విక్రయిస్తే, రాబడిపై 20 శాతం దీర్ఘకాల మూలధన లాభాల పన్ను పడుతుంది. మూడేళ్లలోపు విక్రయించనప్పుడు వచ్చే లాభం వార్షిక ఆదాయానికి కలుస్తుంది.  

గోల్డ్‌ మానిటైజేషన్‌.. 
ఈ పథకంలో భాగంగా తమ వద్ద నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని జమ చేయవచ్చు. ఇలా జమ చేసే బంగారం విలువపై ఏటా 2.5% వరకు వడ్డీ లభిస్తుంది. ఈ మొత్తంపై పన్ను లేదు.   

అద్దె ఆదాయం 
అద్దె ఆదాయంపై 30 శాతం స్టాండర్డ్‌ డిడక్షన్‌ అమలవుతుంది. అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రాపర్టీలపై వచ్చే అద్దె ఆదాయంలో 30 శాతం పోను మిగిలిన మొత్తం వ్యక్తి వార్షిక ఆదాయానికి కలుస్తుంది. ఒకవేళ అదే ఇంటికి రుణం తీసుకుని వడ్డీ చెల్లిస్తుంటే, ఆదాయపన్ను చట్టంలోని నిబంధనల కింద రూ.2 లక్షల మొత్తంపై పన్ను మినహాయింపు క్లెయిమ్‌ కోరొచ్చు.  

ప్రాపర్టీ విక్రయం 
ప్రాపర్టీని రెండేళ్లకు మించి ఉంచుకుని విక్రయించినప్పుడు వచ్చే లాభంపై 20 శాతం దీర్ఘకాల మూలధన లాభాల పన్ను అమలవుతుంది. ద్రవ్యోల్బణం ప్రభావాన్ని మినహాయించుకోవచ్చు. రెండేళ్లలోపు విక్రయించినప్పుడు వచ్చే లాభం వ్యక్తిగత ఆదాయానికి కలుస్తుంది.

కంపెనీ ఎఫ్‌డీలు/ఆర్‌డీలు 
వీటి నుంచి వచ్చే వడ్డీ రాబడి అంతా వ్యక్తి వార్షిక ఆదాయానికి వెళ్లి కలుస్తుంది. ఒక ఏడాదిలో వీటిపై వడ్డీ ఆదాయం రూ.5,000 మించినప్పుడు ఆ మొత్తంపై 10 శాతం టీడీఎస్‌ కింద తగ్గించి, మిగిలినది ఇన్వెస్టర్‌కు చెల్లిస్తారు. 

పన్నులేని బాండ్లు 
పేరులో ఉన్నట్టుగా ఈ బాండ్లపై వచ్చే రాబడి కానీ, పెట్టుబడి వృద్ధిపైనా పన్ను ఉండదు. నిర్ణీత కాలానికి ముందుగా విక్రయించినట్టయితే అప్పుడు పన్ను పడుతుంది. ఏడాదిలోపు విక్రయిస్తే రాబడి అంతా వ్యక్తి ఆదాయానికి కలుస్తుంది. ఏడాది తర్వాత, నిర్ణీత గడువు ముగియకుండా అమ్మేస్తే రాబడిపై 20 శాతం దీర్ఘకాల మూలధన లాభాల పన్ను అమలవుతుంది. ఇక్కడ కూడా ఇండెక్సేషన్‌ ప్రయోజనం ఉండదు.

ఎన్‌ఎస్‌సీ/కేవీపీ 
ఈ సాధనాల్లో వచ్చే రాబడి సైతం వ్యక్తి ఆదాయానికి కలుస్తుంది. రిటర్నుల్లో చూపించి, పన్ను పరిధిలో ఉంటే పన్ను చెల్లించాలి. టీడీఎస్‌ అమలు చేయరు. 

మ్యూచువల్‌ ఫండ్స్‌ 
పన్ను విషయానికొస్తే మ్యూచువల్‌ ఫండ్స్‌లో డెట్‌ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్‌కు వేర్వేరు విధానాలు అమల్లో ఉన్నాయి. మ్యూచువల్‌ ఫండ్‌ పథకం ఏదైనా కానీ తన నిర్వహణ ఆస్తుల్లో 65 శాతం, అంతకంటే ఎక్కువ మొత్తాన్ని షేర్లలో ఇన్వెస్ట్‌ చేస్తే ఈక్విటీ పథకంగా పరిగణిస్తారు. ఇంతకంటే తక్కువ ఈక్విటీ పెట్టుబడులు కలిగి ఉంటే డెట్‌ ఫండ్స్‌ కిందకు వస్తాయి. ఆర్బిట్రేజ్‌ ఫండ్స్, 65 శాతం అంతకంటే ఎక్కువ ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేసే అగ్రెస్సివ్‌ హైబ్రిడ్‌ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్‌ అన్నింటికీ ఒక పన్ను విధానం అమల్లో ఉంది. వీటిల్లో పెట్టిన పెట్టుబడి ఒక ఏడాది నిండకుండా వెనక్కి తీసుకుంటే, రాబడి స్వల్పకాల మూలధన లాభాల పన్ను కిందకు వస్తుంది. ఈ మొత్తంపై 15 శాతం పన్ను చెల్లించాలి. వ్యక్తి వార్షిక ఆదాయం పన్ను పరిధిలో లేకపోయినా కానీ, ఈక్విటీ లాభాలపై పన్ను చెల్లించాల్సిందే. ఏడాది, అంతకుమించిన కాలానికి ఈక్విటీ పెట్టుబడులపై వచ్చే రాబడి దీర్ఘకాల మూలధన లాభాల పన్ను కిందకు వస్తుంది. దీనిపై 10 శాతం పన్ను చెల్లించాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో దీర్ఘకాల మూలధన రాబడి రూ.లక్ష వరకు పన్ను లేదు. లక్షకు మించినప్పుడు, ఆ అదనపు మొత్తంపైనే 10 శాతం పన్ను బాధ్యత అమలవుతుంది.  
   
లిక్విడ్‌ ఫండ్స్, డ్యురేషన్‌ ఫండ్స్, ఇంటర్నేషనల్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్, బ్యాలెన్స్‌డ్‌ ఫండ్స్, ఫిక్స్‌డ్‌ మెచ్యూరిటీ ప్లాన్లు తదితర సాధనాలన్నీ డెట్‌ ఫండ్స్‌ కిందకు వస్తాయి. వీటిల్లో పెట్టుబడులను మూడేళ్లు నిండకుండా వెనక్కి తీసుకున్నప్పుడు వచ్చే లాభంపై స్వల్పకాల మూలధన లాభాల పన్ను అమలవుతుంది. ఈ మొత్తం వ్యక్తి ఆదాయానికి కలిపి చూపించాలి. మూడేళ్లు నిండిన డెట్‌ పెట్టుబడి వెనక్కి తీసుకుంటే వచ్చే రాబడి, దీర్ఘకాల మూలధన లాభాల పన్ను కిందకు వస్తుంది. రాబడి నుంచి సగటు ద్రవ్యోల్బణాన్ని తీసేసి, మిగిలిన మొత్తంపై 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

ఉద్యోగుల భవిష్యనిధి 
ఈపీఎఫ్‌ పథకం కింద కనీసం ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు, రిటైర్మెంట్‌ సమయంలో ఉపసంహరించుకునే మొత్తం కూడా పన్ను మినహాయింపు కిందకు వస్తుంది. ఐదేళ్లలోపు సర్వీసు ఉండి, కార్పస్‌ను వెనక్కి తీసుకుంటే కనుక, ఈ మొత్తం వార్షిక ఆదాయానికి తోడు అవుతుంది. రిటైర్మెంట్‌ వరకు ఆగకుండా, గడువుకు ముందే ఈపీఎఫ్‌ నిధిని ఉపసంహరించుకుంటే, ఈ మొత్తం రూ. 50,000 మించితే దీనిపై 10% టీడీఎస్‌ అమలవుతుంది. పాన్‌ లేకపోతే 20% టీడీఎస్‌ అమలవుతుంది. 

ఎన్‌సీడీలు/బాండ్లు 
వీటిపై వచ్చే వడ్డీ ఆదాయం సైతం వ్యక్తి వార్షిక ఆదాయానికి కలుస్తుంది. ఒక ఏడాదిలో వీటిపై వడ్డీ ఆదాయం రూ.5,000 మించినప్పుడు ఆ మొత్తంపై 10 శాతం టీడీఎస్‌ పేరిట తగ్గించి, మిగిలినది ఇన్వెస్టర్‌కు చెల్లిస్తారు. అయితే, ఈ బాండ్లు లేదా ఎన్‌సీడీలను డీమ్యాట్‌ రూపంలో కలిగి ఉంటే టీడీఎస్‌ అమలు చేయరు. ఎన్‌సీడీలు/బాండ్లను కొనుగోలు చేసిన వారు నిర్ణీత కాలవ్యవధి వరకు కలిగి ఉండకుండా, ముందుగానే సెకండరీ మార్కెట్‌ అంటే స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌ల్లో విక్రయించినట్టయితే  మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది. ఏడాదిలోపు విక్రయించినట్టయితే స్వల్పకాల మూలధన లాభాల పన్ను అమలవుతుంది. దీనిపై ప్రత్యేకంగా పన్ను రేటు లేదు. వ్యక్తి వార్షిక ఆదాయానికి కలుస్తుంది. ఇన్వెస్టర్‌ పన్ను బాధ్యత ప్రకారం చెల్లిస్తే సరిపోతుంది. ఏడాది తర్వాత ఈ పెట్టుబడులను విక్రయించినప్పుడు దీర్ఘకాల మూలధన లాభాల కిందకు రాబడులు వస్తాయి. అప్పుడు రాబడిపై 10 శాతం పన్ను అమలవుతుంది. దీనికి ఇండెక్సేషన్‌ (ద్రవ్యోల్బణం మినహాయింపు) ప్రయోజనం లేదు.

పోస్టల్‌ సేవింగ్స్‌ అకౌంట్‌ 
పోస్టల్‌ సేవింగ్స్‌ ఖాతాలో ఒక్కరి పేరు మీదే ఖాతా ఉంటే, అందులోని బ్యాలెన్స్‌పై వడ్డీ ఆదాయం ఒక ఏడాదిలో రూ.3,500 వరకు పన్ను లేదు. జాయింట్‌ హోల్డర్‌ అకౌంట్‌ (ఇద్దరి పేరు మీద) అయితే ఈ ఆదాయం రూ.7,000 మొత్తంపై పన్ను లేదు. ఇంతకుమించి ఆదాయం ఉంటే, మినహాయింపు పోను మిగిలిన మొత్తం వ్యక్తి వార్షిక ఆదాయానికి కలుస్తుంది. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 10(15)(ఐ) కింద ఈ ప్రయోజనం ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తికి బ్యాంక్‌ సేవింగ్స్‌ ఖాతా ఉండి, అదే వ్యక్తి పోస్టల్‌ సేవింగ్స్‌ ఖాతా కూడా కలిగి ఉన్నాడని అనుకుందాం. అప్పుడు బ్యాంక్‌ సేవింగ్స్‌ ఖాతాపై ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10,000 మొత్తంపైనా (సెక్షన్‌ 80టీటీఏ కింద), పోస్టల్‌ సేవింగ్స్‌ ఖాతాలపై రూ.3,500 మొత్తంపైనా (సెక్షన్‌ 10(15)(ఐ)) పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందడానికి అర్హులే. పోస్టల్‌ సేవింగ్స్‌ వడ్డీ ఆదాయంపై టీడీఎస్‌ అమలు చేయరు. 

సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ 
60 ఏళ్లు నిండి, క్రమం తప్పకుండా ఆదాయం కోరుకునే వారికి ఉద్దేశించిన ఈ పథకంలో పెట్టుబడిపై రాబడి వ్యక్తి వార్షిక ఆదాయానికి కలుస్తుంది.  

ఎన్‌పీఎస్‌ 
ఎన్‌పీఎస్‌ సభ్యులు 60 ఏళ్లు రాగానే పథకం నుంచి వైదొలగొచ్చు. అప్పటి వరకు సమకూరిన కార్పస్‌లో కేవలం 60 శాతాన్ని వెనక్కి తీసుకోగలరు. ఈ మొత్తంపై ఎటువంటి పన్ను ఉండదు. మిగిలిన 40%తో యాన్యుటీ ప్లాన్‌ (పెన్షన్‌ చెల్లింపులకు సంబంధించి) తీసుకోవాల్సి ఉంటుంది.  

పెన్షన్‌ ప్లాన్లు 
పెన్షన్‌ ప్లాన్లలో ఇన్వెస్ట్‌ చేసిన వారు మెచ్యూరిటీలో మూడింట ఒక వంతును వెనక్కి తీసుకోవచ్చు. ఈ మొత్తంపై పన్ను ఉండదు. మిగిలిన రెండొంతులతో యాన్యుటీ ప్లాన్‌ తీసుకోవాలి. ఇలా యాన్యుటీ ప్లాన్లపై వచ్చే రాబడి పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. వ్యక్తి మొత్తం వార్షిక ఆదాయం పన్ను పరిధిలోకి వస్తే అప్పుడే పన్ను చెల్లించాలి. 

ఎండోమెంట్‌/మనీబ్యాక్‌ బీమా పథకాలు 
మనలో చాలా మందికి ఎండోమెంట్, మనీ బ్యాక్‌ పాలసీలు ఉంటాయి. జీవిత బీమా రక్షణతోపాటు, గడువు ముగిసేవరకు జీవించి ఉంటే, పాలసీదారులకు నిర్ణీత మొత్తం ఈ ప్లాన్ల కింద వస్తుంది. టర్మ్‌ ప్లాన్లలో కేవలం మరణించినప్పుడే పరిహారం దక్కుతుంది. చివరి వరకు జీవించి ఉంటే ఏమీ రాదు. అందుకని ఎక్కువ మంది ఎండోమెండ్‌ ప్లాన్లు తీసుకుంటుంటారు. ఈ పథకాల్లో గడువు ముగిసేవరకు కొనసాగితే వచ్చే మెచ్యూరిటీపై పన్ను ఉండదు. యూనిట్‌ లింక్డ్‌ ప్లాన్లు (యులిప్‌లకు) సైతం ఇదే అమలవుతుంది. వీటిల్లో వార్షికంగా చెల్లించే ప్రీమియం రూ.2.5 లక్షలు మించనప్పుడు ఈ ప్రయోజనానికి అర్హులు. వార్షిక ప్రీమియం రూ.2.5 లక్షలు మించినప్పుడు, ఈక్విటీ పథకాల మాదిరే ఉపసంహరణ సమయంలో పన్ను రేట్లు అమలవుతాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement