tds
-
అన్నింటికీ ఒక్కటే టీడీఎస్
న్యూఢిల్లీ: అన్ని రకాల చెల్లింపులకు 1 శాతం లేదా 2 శాతం టీడీఎస్ (మూలం వద్దే పన్ను కోత) అమలు చేయాలని వాణిజ్య మండలి ‘అసోచామ్’ ప్రభుత్వానికి కీలక సూచన చేసింది. వివాదాల నివారణకు, పన్ను నిబంధనల అమలును సులభతరం చేసేందుకు ఇలా కోరింది. బడ్జెట్‌కు ముందు కేంద్ర ఆర్థిక శాఖకు పలు సూచనలతో కూడిన వినతిపత్రాన్ని అందించింది. కొన్ని రకాల టీడీఎస్ వైఫల్యాలను నేరంగా పరిగణించరాదని కూడా కోరింది. కొన్ని రకాల చెల్లింపులకు టీడీఎస్ అమలు చేయకపోవడాన్ని నేరంగా చూడరాదని, ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించడం ద్వారా పన్ను చెల్లింపుదారు ప్రయోజనం పొందిన కేసుల్లోనే ఇలా చేయాలని అసోచామ్ ప్రెసిడెంట్ సంజయ్ నాయర్ సూచించారు. ‘‘వివాదాలను తగ్గించడం, నిబంధనల అమలు మెరుగుపరచడం పన్ను సంస్కరణల లక్ష్యం అవుతుందని భావిస్తున్నాం. ఈ దిశగా కార్పొరేట్ రంగం నిర్మాణాత్మక సూచనలు చేసింది. పెట్టుబడులు, వినియోగాన్ని పెంచే చర్యల కోసం కూడా కార్పొరేట్ ఇండియా చూస్తోంది’’అని చెప్పారు. కంపెనీల విలీనాలు, వేరు చేయడాలకు పన్ను న్యూట్రాలిటీని అందించాలని కూడా అసోచామ్ కోరింది. పన్ను అంశాల్లో సమానత్వాన్ని ట్యాక్స్ న్యూట్రాలిటీగా చెబుతారు. మూలధన లాభాల మినహాయింపులు లేదా నష్టాలను క్యారీ ఫార్వార్డ్ చేసుకునే విషయంలో, విలీనాలు, డీమెర్జర్లు (వేరు చేయడం), గుంపగుత్తగా విక్రయించడంలో ప్రస్తుతం నిబంధనల పరంగా అంతరాలు ఉండడంతో అసోచామ్ ఇలా కోరింది. బైబ్యాక్‌ల రూపంలో వచి్చన దాన్ని డివిడెండ్‌గా పరిగణించాలని సూచించింది. -
టీసీఎస్ ఉద్యోగులకు ఐటీ నోటీసులు
ప్రముఖ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉద్యోగులు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు అందుకున్నారు. టీడీఎస్ క్లెయిమ్‌లలో వ్యత్యాసాలు ఉన్నాయంటూ ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలోని సెక్షన్ 143(1) ప్రకారం ఐటీ శాఖ ఈ నోటీసులు జారీ చేసింది.2024 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఉద్యోగులకు కట్ చేసిన టీడీఎస్‌లలో కొంత భాగం ఆదాయపు పన్ను శాఖ రికార్డులలో నమోదు కాలేదని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసుల్లో డిమాండ్ చేసిన మొత్తాలు రూ.50,000 నుంచి రూ.1,45,000 వరకు ఉన్నాయి. టీడీఎస్ వ్యత్యాసాలపై వడ్డీ, ఛార్జీలను సైతం నోటీసుల్లో పేర్కొన్నారు.ట్యాక్స్ పోర్టల్‌లో సాంకేతిక సమస్యల కారణంగా టీడీఎస్ క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా అప్డేట్ కాకపోయి ఉండవచ్చని టీసీఎస్ ఉద్యోగి ఒకరు తెలిపారు. తాము క్లెయిమ్స్‌ను మ్యాన్యువల్ సమర్పించాల్సి వచ్చిందని, సిస్టమ్‌లో నమోదు కాని టీడీఎస్ మొత్తానికి సంబంధించి ఐటీ శాఖ నోటీసులు పంపిందని ఆ ఉద్యోగి వివరించారు.ఇదీ చదవండి: కలవరపెడుతున్న డెల్ ప్రకటనటీడీఎస్ రికార్డుల్లోని వ్యత్యాసాల కారణంగా చాలా మంది ఉద్యోగులకు ఆదాయపు పన్ను రీఫండ్లు ఆలస్యం అయ్యాయి. ఆదాయపు పన్ను శాఖ నుండి ప్రాథమిక అంచనా ఆందోళన కలిగించింది. సమస్యలను సరిదిద్దే వరకు ట్యాక్స్ రీఫండ్‌లో మరింత జాప్యం జరుగుతుందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. డిమాండ్ నోటీసులు ఉన్నప్పటికీ, పన్ను అధికారుల ద్వారా రీప్రాసెసింగ్ పూర్తయ్యే వరకు ఎలాంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదని టీసీఎస్ తమ ఉద్యోగులకు ఇంటర్నల్ ఈ-మెయిల్స్‌లో తెలియజేసింది. -
కొత్తకు జైజై.. పాతకు బైబై..
సాక్షి, అమరావతి : ఉద్యోగస్తులు పాత పన్నుల విధానం కాకుండా కొత్త పన్నుల విధానం ప్రోత్సహించే విధంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తుత బడ్జెట్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆదాయపన్ను రిటర్నులు దాఖలును సులభతరం చేస్తున్నామన్న నెపంతో పొదుపుపై ఎటువంటి పన్ను ప్రయోజనాలు ఉండని కొత్త పన్నుల విధానం ఎంచుకునే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. పాత ఆదాయ పన్ను విధానంలో బీమా ప్రీమియం, గృహరుణం, పిల్లల చదువులు, పోస్టాఫీసు వంటి వివిధ సేవింగ్ పథకాలకు చేసే వ్యయాలను చూపించడం ద్వారా పన్ను భారం తగ్గించుకోవచ్చు. కానీ 2020లో తక్కువ పన్నురేట్లతో వివిధ శ్లాబులను కొత్త పన్నుల విధానం ప్రవేశపెట్టింది. కొత్త పన్నుల విధానం ఎంచుకున్న వారు పొదుపు, వ్యయాలపై ఎటువంటి మినహాయింపులు వర్తించవు. మొత్తం ఆదాయం ఎంత అయితే అంత పన్ను చెల్లించాల్సిందే. కొత్త పన్నుల విధానం సులభతరంగా ఉండటంతో పన్ను చెల్లింపుదారులు ఈ విధానంవైపే మొగ్గు చూపుతున్నారని, 2023–24లో ఆర్థిక సంవత్సరంలో మూడింట రెండొంతుల మంది కొత్త పన్నుల విధానంలో రిటర్నులు దాఖలు చేసినట్లు సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 8.61 కోట్ల మంది రిటర్నులు దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని కొత్త పన్నుల విధానం ఎంచుకున్న వారికే ఈ మార్పులు వర్తిస్తాయని ఆమె స్పష్టం చేశారు. రానున్న కాలంలో అందరూ కొత్త పన్నుల విధానం ఎంచుకోవాలన్న ఉద్దేశ్యంతో పాత పన్నుల విధానంకు పన్ను మినహాయింపులను తగ్గిస్తూ కొత్త విధానానికి ప్రయోజనాలను పెంచుతున్నారని ట్యాక్స్ నిపుణులు పేర్కొంటున్నారు. కొత్తగా మార్పులు చేసిన తర్వాత పది లక్షల లోపు పన్ను ఆదాయం ఉన్న వారికి కొత్త పన్నుల విధానం ఎంచుకుంటేనే ప్రయోజనంగా ఉంటుందంటున్నారు. స్థిరాస్తి విలువ రూ.50 లక్షలు దాటితే టీడీఎస్..ఇక నుంచి రూ.50 లక్షలు దాటిన స్థిరాస్థి విలువను విక్రయిస్తే ఒక శాతం టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుందని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. ఆదాయపన్ను చట్టం సెక్షన్ 194ఐఏ సెక్షన్ ప్రకారం స్థిరాస్థి విలువ రూ.50 లక్షలు దాటితే ఒక శాతం టీడీఎస్ వసూలు చేయాలి. స్థిరాస్థి విలువను ఒకరికంటే ఎక్కువ మందికి అమ్మినా మొత్తం విలువను పరిగణనలోకి తీసుకొని టీడీఎస్‌ను వసూలు చేస్తారని ఆమె స్పష్టం చేశారు. కానీ ఈ టీడీఎస్ నుంచి వ్యవసాయ భూములకు మినహాయింపు ఇచ్చారు. స్టాండర్డ్ డిడక్షన్ రూ.75 వేలకు పెంపు కొత్త పన్ను విధానంలో ఉద్యోగులకు ఊరటనిస్తూ స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని 50% పెంచుతూ సీతారామన్ ప్రకటించారు. రూ.50 వేలుగా ఉన్న స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.75వేలకు పెంచారు. ఫ్యా మిలీ పెన్షన్‌దారుల స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ. 15వేల నుంచి రూ.25 వేలకు పెంచారు. కొత్త పన్నుల విధానంలో 10% పన్నులోపు శ్లాబుల్లో స్వల్ప మార్పుల ను ప్రతిపాదించింది. కొత్త పన్నుల విధానంలో 3 లక్షల ఆదాయం వరకు పన్ను చెల్లించాల్సిన అవస రం లేదు. గతంలో 5% పన్ను శ్లాబు పరిధి రూ.3– 6 లక్షలుగా ఉంటే ఇప్పుడు దాన్ని రూ.3–7 లక్షలకు, గతంలో రూ.6–9 లక్షలుగా 10% పన్ను పరిధిని రూ.7–10 లక్షలకు పెంచా రు. ఈ మార్పుల వల్ల ప్రతీ పన్ను చెల్లింపుదారునికి రూ.17,500 ప్రయోజనం లభిస్తుంది. -
టీడీఎస్ విధించకూడదంటే ఏం చేయాలో తెలుసా..
పన్నుదారులకు టీడీఎస్(ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్) విధించకుండా పాన్ కార్డు వివరాలు సమర్పించాలని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) తన వాటాదార్లను కోరింది. రూ.10 ముఖ విలువ ఉన్న ఒక్కో షేరుపై ఎల్ఐసీ రూ.6 డివిడెండ్ ప్రకటించింది. వ్యక్తులకు అందే డివిడెండ్ మొత్తం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.5,000 లోపు ఉంటే టీడీఎస్ ఉండదని పేర్కొంది. ఒకవేళ పాన్ వివరాలు ఇవ్వకపోయినా, ఇచ్చిన వివరాలు చెల్లకపోయినా (ఆధార్-పాన్ అనుసంధానం అవ్వకపోతే పాన్ చెల్లదు) డివిడెండ్‌పై 20 శాతం టీడీఎస్ కట్ చేసేకునే అవకాశం ఉందని తెలిపింది.డివిడెండ్ కోసం జులై 19ని రికార్డు తేదీగా ఎల్ఐసీ ప్రకటించింది. ఆ రోజు వరకు ఇన్వెస్టర్లు తమ డీమ్యాట్ అకౌంట్లో ఎల్ఐసీ షేర్లు కలిగి ఉంటే, సెప్టెంబరు 20 లోపుగా డివిడెండ్ మొత్తం బ్యాంకు ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంది. వాటాదార్లు తమ డిపాజిటరీ పార్టిసిపెంట్ల దగ్గర బ్యాంకు ఖాతా వివరాలను మరోసారి తనిఖీ చేసుకోవాలని ఎల్ఐసీ తెలిపింది. అవసరమైతే వాటిని అప్డేట్ చేసుకోవాలని కోరింది. అదే సమయంలో బ్యాంకు ఖాతాకు పాన్‌ను అనుసంధానం చేసుకోవాలని చెప్పింది. ఒకవేళ బ్యాంకు ఖాతా అందుబాటులో లేకపోతే, అనుమతించిన మార్గాల్లో డివిడెండ్ చెల్లిస్తామని స్పష్టం చేసింది. ఇదిలాఉండగా, ఆగస్టు 22న వార్షిక సాధారణ సమావేశంలో ఈ అంశంపై మరిన్ని వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.ఇదీ చదవండి: బడ్జెట్లో రైతన్న కోరుకుంటున్నవి.. -
అలర్ట్: ఆధార్-పాన్ లింక్ అవ్వకపోతే రెండింతలు టీడీఎస్
ఆధార్-పాన్ లింక్ ఇంకా చేయనివారికి ఐటీ శాఖ కీలక సమాచారం అందించింది. మే నెలాఖరుకల్లా ఆధార్‌తో పాన్ అనుసంధానం పూర్తయితేనే టీడీఎస్ షార్ట్ డిడక్షన్ కోసం పన్ను చెల్లింపుదారులపై ఏ చర్యలూ ఉండబోవని ఆదాయ పన్ను శాఖ తెలియజేసింది.ఐటీ శాఖ నిబంధనల ప్రకారం బయోమెట్రిక్ ఆధార్‌తో పర్మనెంట్ అకౌంట్ నెంబర్ (పాన్) లింక్ అవ్వకపోతే సాధారణంగా వర్తించే రేటుకు రెండింతల టీడీఎస్ కోతలుంటాయి. లావాదేవీ సమయంలో పాన్ ఇన్ఆపరేటివ్లో ఉన్న ట్యాక్స్‌పేయర్లకు టీడీఎస్/టీసీఎస్ షార్ట్ డిడక్షన్/కలెక్షన్ ఎగవేతకు పాల్పడ్డారన్న నోటీసులు వస్తున్నట్టు సీబీడీటీ తెలిపింది.ఈ మేరకు పన్ను చెల్లింపుదారుల నుంచి ఫిర్యాదులు అందాయని పేర్కొంది. ఇలా నోటీసులు అందుకున్న వారికి సీబీడీటీ స్పష్టత ఇచ్చింది. 31 మార్చి 2024 నాటికి ముందు చేసిన లావేదావేలకు సాధారణ రేటుకే టీడీఎస్/టీసీఎస్ వసూలుంటుందని స్పష్టం చేసింది.కాగా 2022 జూన్ 30 వరకు ఆధార్‌తో పాన్ అనుసంధానం ఉచితంగానే జరిగింది. జూలై 1 నుంచి 2023 జూన్ 30 వరకు రూ.1,000 ఆలస్య రుసుముతో అనుమతించారు. ఆ తర్వాత లింక్ అవ్వని పాన్ కార్డులు జూలై 1 నుంచి ఇన్‌ఆపరేటివ్‌లోకి వెళ్లాయి. ఇవి ఆపరేటివ్ కావాలంటే రూ.1,000 ఫైన్ కట్టాల్సిందే. కానీ 30 రోజుల సమయం పడుతుంది. ఆధార్, పాన్ లింక్ కాకపోతే ఐటీ రిఫండ్ ఉండదు. లింక్ చేసుకున్న తర్వాత రిఫండ్ వచ్చినప్పటికీ ఆలస్యమైన రోజులకు ఐటీ శాఖ వడ్డీ చెల్లించదు. -
అలా అయితే రెడీ అయిపోండి.. ఐటీ నోటీసులు వస్తున్నాయి..
ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ITR) దాఖలు చేయవారికి ఆదాయపు పన్ను శాఖ త్వరలో నోటీసులు పంపనుంది. టీడీఎస్ కట్ అయినవారికి కూడా ఐటీ నోటీసులు సిద్ధమయ్యాయని ది ఎకనామిక్ టైమ్స్ తాజా కథనం పేర్కొంది. కచ్చితమైన సమాచారం ఉన్న పన్ను చెల్లింపుదారులకు మాత్రమే ఐటీ శాఖ నోటీసులు పంపుతుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) చైర్మన్ నితిన్ గుప్తా తెలిపారు. రీఫండ్ వ్యవధిని తగ్గించడం దగ్గర నుంచి పెద్ద పెద్ద పన్ను వివాదాలను పరిష్కరించడం దాకా పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవలు అందించడంపైనే తమ దృష్టి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పన్ను వివాదాల పరిష్కారం కోసం సీబీడీటీ మైసూరులో డిమాండ్ మేనేజ్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఇది రూ. 1 కోటి కంటే ఎక్కువ పన్ను వివాదాలపై దృష్టి సారిస్తుందని చెప్పారు. గతంలో కర్ణాటక పరిధిలోని వివాదాలకే పరిమితమైన ఈ మేనేజ్మెంట్ సెంటర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కేసులను స్వీకరిస్తోందని సీబీడీటీ చైర్మన్ వివరించారు. -
ఇంటి అద్దె చెల్లిస్తున్నారా?అయితే ఈ విషయాలు గుర్తుంచుకోండి!
గతవారం స్థిరాస్తి అద్దెకిచ్చినప్పుడు ఓనర్‌గారికి ఆ ఆదాయం ఎలా లెక్కించాలి .. మినహాయింపులేమిటి? మొదలైన విశేషాలు తెలుసుకున్నాం. ఈసారి మీరు అద్దె చెల్లించే వారయితే .. అంటే మీరు కిరాయిదారైతే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గమనించాల్సిన విషయాలు, ఫాలో అవ్వాల్సిన రూల్స్ గురించి తెలుసుకుందాం. ♦మీరు ఇచ్చే రెంటుకి అగ్రిమెంటు రాసుకోండి. దయచేసి రెంటును నగదు రూపంలో ఇవ్వకండి. చెక్కు ద్వారా, డ్రాఫ్ట్ ద్వారా, బదిలీ ద్వారా రెంటు ఇవ్వండి. ♦కొంత నగదు, కొంత బ్యాంకు అని ఒప్పుకోకండి. రెంటు ఇవ్వగానే రసీదు పుచ్చుకోండి. కనీసం ఎస్ఎంఎస్, వాట్సాప్ ద్వారా, ఈమెయిల్ ద్వారానైనా తీసుకోండి. సత్సంబంధాలు కొనసాగినన్నాళ్లూ రసీదు లేకపోయినా ఏమీ అనిపించదు. కానీ జాతివైరం సహజం. ముందుగా ఆలోచించి ఒక అలవాటుగా అనుసరించండి. ♦ప్రత్యేకించి నగదు పుస్తకం, లెడ్జర్లో పద్దులు రాయకపోయినా, ఈ వ్యవహారాలను అన్ని వివరాలతో సహా ఒక పుస్తకంలో రాయండి. ♦మీరు ఉద్యోగైనా, వ్యాపారస్తులైనా, వృత్తి నిపుణులైనా ఇలా చెల్లించే అద్దెను ఖర్చుగా భావించి, మినహాయింపు పొందాలంటే కాగితాలు కావాలి. ♦మీ ఓనర్ పాన్ నంబరు, బ్యాంకు అకౌంటు వివరాలు తెలుసుకుని భద్రపర్చుకోండి. ♦ఇల్లు ఒకరి పేరు మీద ఉంటే మరొకరి పేరు మీద అద్దె వసూలయ్యే సందర్భాలూ ఉంటాయి. భార్యాభర్తలు, మామా అల్లుళ్లు, అన్నదమ్ములు, ఇలాంటి అతి తెలివి వారుంటారు. మీకు సంబంధం లేకపోయినా, మీరు గట్టిగా అడగలేకపోయినా.. కాగితాలు, రసీదు లు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ♦194– ఐ సెక్షన్ కొన్ని బాధ్యతలను అంటకట్టింది. అదే టీడీఎస్. ♦చెల్లించే వార్షిక అద్దె రూ. 2,40,000 దాటితే ప్రతి చెల్లింపునకు టీడీఎస్ కట్ చేసి, ఆ మొత్తాన్ని గవర్నమెంటు ఖాతాలో చెల్లించి ఆ మేరకు ఫారం 16 అని మీ యజమానికి ఇవ్వాలి. ♦194– ఐ వ్యక్తులకు, ఉమ్మడి కుటుంబాలకు వర్తించదు. ♦మరో సెక్షన్ 194 ఐఆ ఉందండోయ్. ఇది వ్యక్తులకు, ఉమ్మడి కుటుంబాలకు వర్తిస్తుంది. ♦వ్యక్తులు, ఉమ్మడి కుటుంబాలు, ‘ట్యాక్స్ ఆడిట్’ అవసరం లేని వారు, వర్తించనివారికి ఈ సెక్షన్ వర్తిస్తుంది. ♦అద్దె నెలకి రూ. 50,000 దాటిన వారికే వర్తిస్తుంది. నెలలో కొంత వ్యవధికి అయినా వర్తిస్తుంది. ♦నెలకి రూ. 50,000 అంటున్నారు, సంవత్సరానికి అని అనడం లేదు.. మీరు వారం రోజులకు అద్దె ఇచ్చి రూ. 50,000 దాటి పుచ్చుకుంటే చాలు. ♦ఇలా అద్దె ఇచ్చేటప్పుడు పన్ను రికవరీ చేసి మిగతా మొత్తమే ఇవ్వాలి. ట్యాక్సును సకాలంలో గవర్నమెంటుకు చెల్లించి, ఆ మేరకు టీడీఎస్ సర్టిఫికెట్ 16 ఇ ద్వారా ఇవ్వాలి. ♦పన్ను వసూలు చేయకపోయినా, వసూలు చేసిన మొత్తం సకాలంలో చెల్లించకపోయినా, సకాలంలో టీడీఎస్ సర్టిఫికెట్ ఇవ్వకపోయినా .. వడ్డీ, పెనాల్టీలు భరించాలి. ♦ఏతావతా.. రెంటు చెల్లించిన వారికి మాత్రమే టీడీఎస్ బరువు, బాధ్యతలు ఉన్నాయి. -
ట్యాక్స్ పేయర్స్‌కు ఊరట! టీసీఎస్, టీడీఎస్ అనుసంధానం..
న్యూఢిల్లీ: మూలం వద్దే పన్ను వసూలు చేయడం (టీసీఎస్), మూలం వద్ద పన్ను మినహాయించడం (టీడీఎస్)ను ప్రభుత్వం అనుసంధానించే ప్రయత్నం చేస్తోందని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ తెలిపారు. దీనివల్ల టీసీఎస్ చెల్లించిన వారిపై టీడీఎస్ భారం తగ్గుతుందని.. తద్వారా పన్ను చెల్లింపుదారు నగదు ప్రవాహాలపై ప్రభావం పడకుండా ఉంటుందన్నారు. జూలై 1 నుంచి కొన్ని రకాల అంతర్జాతీయ క్రెడిట్ కార్డు వ్యయాలపై 20 శాతం టీసీఎస్‌ను అమలు చేస్తున్న దశలో అనంతనాగేశ్వరన్ ఈ అంశంపై మాట్లాడడం ప్రాధాన్యం సంతరించుకుంది. వర్తకులు తాము విక్రయించే ఉత్పత్తులు లేదా సేవలపై టీసీఎస్‌ను వసూలు చేస్తుంటారు. అదే టీడీఎస్ అయితే ప్రభుత్వం అమలు చేస్తుంది. క్రెడిట్‌కార్డు లావాదేవీలపై 20 శాతం టీసీఎస్ పట్ల నిరసన వ్యక్తం కావడంతో రూ.7 లక్షల వరకు లవాదేవీలకు మినహాయింపునిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించడం గమనార్హం. దీనివల్ల చిన్న పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం లభించిందని... కనుక ఎక్కువ శాతం లావాదేవీలు 20 శాతం టీసీఎస్ పరిధిలోకి రావంటూ ప్రభుత్వ నిర్ణయాన్ని అనంత నాగేశ్వరన్ సమర్థించారు. -
Mahila Samman Scheme: గుడ్‌న్యూస్: మహిళా సమ్మాన్ డిపాజిట్‌పై కీలక ప్రకటన
న్యూఢిల్లీ: కేంద్ర సర్కారు 2023–24 బడ్జెట్లో మహిళా సమ్మాన్ (Mahila Samman Scheme) పేరుతో ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని ప్రకటించింది. గరిష్టంగా రూ.2 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వార్షిక వడ్డీ 7.5 శాతం. రెండేళ్లకు గడువు ముగుస్తుంది. మహిళల కోసమే ఈ డిపాజిట్‌ను తీసుకొచ్చింది. అయితే ఇందులో పెట్టుబడిపై వచ్చే వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుందని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) తాజాగా స్పష్టం చేసింది. ఇదీ చదవండి: Aditi Avasthi: రూ.1600 కోట్ల నిధులు.. ఎడ్టెక్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తున్న అదితి అవస్తీ! అదే సమయంలో రాబడిపై టీడీఎస్ (మూలం వద్ద పన్ను కోత) అమలు చేయరని పేర్కొంది. సీబీడీటీ ఆదేశాల ప్రకారం మహిళా సమ్మాన్ సర్టిఫికెట్లో వచ్చే వడ్డీ ఆదాయం రూ.40వేలు మించకపోతే టీడీఎస్ వర్తించదని స్పష్టమవుతోందని నాంజియా అండర్సన్ ఇండియా పార్ట్నర్ నీరజ్ అగర్వాల్ తెలిపారు. ఈ పథకంలో గరిష్ట పెట్టుబడిపై ఒక ఏడాదిలో 7.5 శాతం మేరకు రాబడి రూ.15,000గానే ఉంటుందని, కనుక టీడీఎస్ వర్తించదన్నారు. ఇదీ చదవండి: ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎంలకు షాక్! కొత్త సర్వీస్‌ను తీసుకొచ్చిన జొమాటో.. -
ఈ మార్పులపై ఓ లుక్కేయండి!
ఆదాయపన్ను పరంగా ఏప్రిల్ 1 నుంచి కొన్ని కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. కొన్ని పన్ను మిహాయింపులు తొలగిపోగా.. కొన్ని సాధనాలకు సంబంధించి పెట్టుబడి పరిమితుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. గతంతో పోలిస్తే ఆదాయపన్ను కొత్త విధానం మరింత ఆకర్షణీయంగా మారింది. ప్రధానంగా పన్నుల వ్యవస్థను మరింత సరళీకృతం చేయడం, పారదర్శకతను పెంచే లక్ష్యాలతో కేంద్ర సర్కారు ఎప్పటికప్పుడు కొత్త ప్రతిపాదనలు, సవరణలు తీసుకొస్తోంది. కనుక ఆదాయపన్ను పరిధిలోని ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన మార్పులను వివరించే కథనమిది... నూతన పన్ను విధానం... నూతన పన్ను విధానం ఎంపిక చేసుకునే వారికి వార్షిక ఆదాయం రూ.7 లక్షల వరకు ఉంటే రూపాయి పన్ను చెల్లించే పని లేకుండా పన్ను రాయితీని ప్రభుత్వం కల్పించింది. సెక్షన్ 87ఏ కింద గరిష్టంగా రూ.25,000 రాయితీని ప్రకటించింది. అంటే నికరంగా రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి పన్ను భారం ఉండదు. తక్కువ ఆదాయం కలిగిన వారికి ఉపశమనం కల్పించడమే ఈ రాయితీ ఉద్దేశ్యమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2022–23 ఆర్థి క సంవత్సరం నుంచే ఈ రాయితీ అమల్లోకి వచ్చింది. ఈ రాయితీ వల్ల ఎక్కువ మందికి ప్రయోజనం లభించనుంది. ఒకవేళ ఆదాయం రూ.7లక్షలకు పైన స్వల్పంగా ఉన్నప్పుడు భారీగా పన్ను చెల్లించాల్సి వస్తోంది. దీన్ని అర్థం చేసుకున్న కేంద్ర సర్కారు ఆర్థిక బిల్లు 2023లో కొన్ని సవరణలు చేసింది. ఉదాహరణకు రూ.7 లక్షలకు పైన మరో రూ.5 వేల ఆదాయం ఉంటే అప్పుడు నిబంధనల కింద రూ.26,500 పన్ను (సెస్సులతో) చెల్లించాల్సి ఉంది. దీని స్థానంలో.. రూ.7లక్షలకు పైన అదనంగా ఉన్న రూ.5వేలపైనే పన్ను చెల్లిస్తే సరిపోతుంది. అలాగే, నూతన పన్ను విధానంలోనూ రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనం కల్పించారు. దీంతో నికరంగా రూ.7.50 లక్షల వరకు పన్ను భారం పడదు. నూతన పన్ను విధానం కింద పన్ను రేట్లలోనూ మార్పులు చేశారు. 60 ఏళ్లలోపు వారికి రూ.3 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి పన్ను ఉండదు. రూ.3–6 లక్షల ఆదాయంపై 5 శాతం పన్ను, రూ.6–9 లక్షల ఆదాయంపై 10 శాతం పన్ను పడుతుంది. రూ.9–12 లక్షల ఆదాయంపై 15 శాతం, రూ.12–15 లక్షల ఆదాయంపై 20 శాతం, రూ.15 లక్షల ఆదాయంపై 30 శాతం పన్ను రేటు వర్తిస్తుంది. బీమాపైనా పన్ను జీవిత బీమా పాలసీలకు చెల్లించే ప్రీమియంపైనే కాదు, గడువు తీరిన తర్వాత అందుకునే మొత్తంపైనా పన్ను ఉండదనేది అందరికీ తెలిసిన విషయం. కానీ, 2023 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన మార్పుల ప్రకారం.. జీవిత బీమా పాలసీలకు చెల్లించే వార్షిక ప్రీమియం రూ.5 లక్షలకు మించి ఉంటే.. పాలసీదారు జీవించి ఉన్న సందర్భాల్లో గడువు తీరిన తర్వాత అందుకునే మొత్తం పన్ను పరిధిలోకి వస్తుంది. అంటే అధిక ప్రీమియం పాలసీల మెచ్యూరిటీపై ఇప్పటి వరకు ఉన్న సున్నా పన్ను ప్రయోజనాన్ని సర్కారు తొలగించింది. వార్షిక ప్రీమియం రూ.5 లక్షల వరకు ఉండే పాలసీల మెచ్యూరిటీపై ఇక ముందూ పన్ను మినహాయింపు ప్రయోజనం కొనసాగుతుంది. అలాగే, 2023 మార్చి 31వరకు కొనుగోలు చేసిన జీవిత బీమా పాలసీలకు సంబంధించి వార్షిక ప్రీమియం రూ.5 లక్షలకు మించి ఉన్నా, చివర్లో అందుకునే మొత్తంపై పన్ను ఉండదు. అలాగే, పాలసీదారు మరణించిన సందర్భంలో చెల్లించే పరిహారంపైనా పన్ను ఉండదు. యులిప్ ప్లాన్ల ప్రీమియం ఎంత ఉన్నా కానీ, పన్ను పరిధిలోకి రావు. డెట్ ఫండ్స్‌పై కూడా... డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులను మూడేళ్లపాటు కొనసాగించినప్పుడు వచ్చిన లాభం దీర్ఘకాల మూలధన లాభం కిందకు వస్తుంది. వచ్చిన లాభం నుంచి పెట్టుబడి పెట్టిన కాలంలో సగటు ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించి, మిగిలిన లాభంపైనే 20 శాతం పన్ను చెల్లిస్తే సరిపోయేది. ఇది గతంలో ఉన్న విధానం. కానీ, ఈ ప్రయోజనాన్ని తొలగించారు. 2023 ఏప్రిల్ 1 నుంచి డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడుల కాల వ్యవధి ఎంతైనా కానీయండి, వచ్చే లాభం మొత్తం వార్షిక ఆదాయానికి కలుస్తుంది. ఏ శ్లాబు రేటు పరిధిలో ఉంటే, ఆ మేరకు పన్ను చెల్లించాల్సి వస్తుంది. అంటే ప్రస్తుతం డెట్ ఫండ్స్‌లో అమల్లో ఉన్న స్వల్పకాల మూలధన లాభాల పన్ను విధానమే ఇక మీదట అన్ని రకాల డెట్ ఫండ్స్ లాభాలకు అమలవుతుంది. మొత్తానికి డెట్ ఫండ్స్‌లో పెట్టుబడులకు దీర్ఘకాల మూలధన లాభాల పన్ను ప్రయోజనాన్ని తొలగించారు. తద్వారా డెట్ ఫండ్స్‌లో దీర్ఘకాల పెట్టుబడులను నిరుత్సాహపరిచినట్టయింది. దీంతో దీర్ఘకాల పెట్టుబడులు జీవిత బీమా, ఈక్విటీ సాధనాల వైపు వెళతాయన్నది నిపుణుల అంచనాగా ఉంది. 2023 ఏప్రిల్ 1 నుంచి చేసే తాజా డెట్ పెట్టుబడులకు నూతన పన్ను విధానం అమలవుతుంది. 2023 మార్చి 31 వరకు చేసిన పెట్టుబడులకు కొత్త నిబంధన వర్తించదు. రిటర్నుల దాఖలు ఆదాయపన్ను రిటర్నులను దాఖలు చేసే వారు తప్పకుండా గమనించాల్సిన మార్పు ఒకటి ఉంది. పాత, కొత్త పన్ను విధానాలు ఉన్నప్పటికీ, నూతన పన్ను విధానమే డిఫాల్ట్‌గా కనిపిస్తుంది. పాత పన్ను విధానంలోనే కొనసాగాలని అనుకునేవారు రిటర్నులు దాఖలు చేసే ముందే దానిని ప్రత్యేకంగా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. నూతన పన్ను విధానంలో పన్ను రేట్లు తక్కువ. కానీ, చాలా వరకు పన్ను మినహాయింపులు, పన్ను తగ్గింపు ప్రయోజనాల్లేవు. అన్ని రకాల మినహాయింపు ప్రయోజనాలను ఉపయోగించుకునే వారికి పాత విధానం అనుకూలం. కనుక ఎవరికి వారు తమ వార్షిక ఆదాయం, పెట్టుబడుల ఆధారంగా ఏ పన్ను విధానం అనుకూలం అనేది ఎంపిక చేసుకోవాలి. ఈ విషయంలో స్పష్టత రాకపోతే పన్ను నిపుణుల సాయం తీసుకోవాలి. ఎస్సీఎస్ఎస్ పదవీ విరమణ పొందిన వారికి క్రమం తప్పకుండా ఆదాయం తెచ్చి పెట్టే పెట్టుబడి పథకాల్లో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్) ఒకటి. ఈ పథకంలో పెట్టుబడిపై ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ ఆదాయం చెల్లిస్తారు. 60 ఏళ్లు నిండిన వ్యక్తులు ఎవరైనా ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులు అయితే 55–60 ఏళ్ల మధ్యలో ఉన్నా పెట్టుబడికి అర్హులు. ఈ పథకంలో ఒక్కరు గరిష్టంగా రూ.15 లక్షల వరకే ఇన్వెస్ట్ చేసుకునేందుకు అనుమతి ఉండగా, ఏప్రిల్ 1 నుంచి దీన్ని రూ.30 లక్షలకు పెంచారు. నగదు ఉపసంహరణలపై టీడీఎస్ బ్యాంకు ఖాతా నుంచి భారీగా నగదు ఉపసంహరణలను నిరుత్సాహ పరిచేందుకు గాను కేంద్ర సర్కారు మూలం వద్ద పన్ను మినహాయింపు (టీడీఎస్‌ను) ప్రవేశపెట్టింది. ఒక ఆర్థి క సంవత్సరంలో ఒక బ్యాంక్ ఖాతా నుంచి నగదు ఉపసంహరణలు రూ.కోటి మించితే టీడీఎస్ కింద బ్యాంకులు 2 శాతాన్ని మినహాయిస్తాయి. వ్యక్తులు, వ్యాపార సంస్థలకూ ఇది అమలవుతుంది. ఎల్‌టీఏ ప్రభుత్వ ఉద్యోగులు కాని వారు సెలవులను నగదుగా మార్చుకునే మొత్తంపై పన్ను ప్రయోజనానికి పరిమితి ఉంది. 2002 నుంచి ఈ పరిమితి రూ.3 లక్షలుగా ఉంటే, దాన్ని రూ.25 లక్షలకు పెంచారు. అంటే సెలవులను నగదుగా మార్చుకునే మొత్తం రూ.25 లక్షలు ఉన్నా కానీ పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకం పోస్టాఫీసు మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (పీవో ఎంఐఎస్) కూడా నెలవారీ ఆదాయం కోరుకునే వారికి ఉద్దేశించిన పథకం. ఈ పథకంలోనూ ఒక్కరు గరిష్టంగా రూ.4.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టుకునేందుకు అనుమతి ఉంటే, దీన్ని రూ.9 లక్షలకు పెంచారు. జాయింట్ అకౌంట్ కింద రూ.9 లక్షల పరిమితిని రూ.15 లక్షలు చేశారు. హెచ్‌ఎన్‌ఐలపై పన్ను భారం బడ్జెట్లో అధిక సంపద కలిగిన వ్యక్తులకు సర్‌చార్జీ భారాన్ని తగ్గించారు. వార్షికాదాయం రూ.5 కోట్లకు పైన ఉన్న వారికి సర్‌చార్జీ 37 శాతం నుంచి 25 శాతానికి దిగొచ్చింది. కాకపోతే నూతన పన్ను విధానాన్ని ఎంపిక చేసుకునే వారికే దీన్ని పరిమితం చేశారు. ఎన్పీఎస్ నుంచి వైదొలగాలంటే.. ఏప్రిల్ 1 నుంచి ఎన్పీఎస్ పథకం నుంచి వైదొలిగే లేదా యాన్యుటీ ఎంపిక చేసుకునే వారికి కేవైసీ డాక్యుమెంట్లు అప్లోడ్ చేయడం తప్పనిసరి చేశారు. పథకం నుంచి వైదొలిగిన సభ్యులకు వేగంగా యాన్యుటీ చెల్లింపుల చేసేందుకే ఈ ఆదేశాలు అమల్లోకి తెచ్చారు. ఎన్పీఎస్ ఎగ్జిట్ లేదా విత్ డ్రాయల్ ఫారమ్, గుర్తింపు, చిరునామా ధ్రువీకరణ, బ్యాంక్ అకౌంట్ రుజువు, ప్రాన్ (పెన్షన్ అకౌంట్) కార్డ్ కాపీని సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ సిస్టమ్‌లోకి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అనారోగ్యం, వైకల్యం తదితర సందర్భాల్లో ఎన్పీఎస్ నుంచి 25 శాతం ఉపసంహరణకు అనుమతి ఉంది. ఆ సందర్భాల్లోనూ వీటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ–గోల్డ్ భౌతిక బంగారాన్ని ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీప్ట్ (ఈజీఆర్) రూపంలోకి మార్చుకుంటే ఎలాంటి మూలధన లాభాల పన్ను పడదు. ఆన్లైన్ గేమింగ్ ఆన్లైన్ గేమింగ్ ద్వారా గెలుచుకునే మొత్తంపై 30 శాతం టీడీఎస్ అమలు కానుంది. ఈపీఎఫ్ ఉపసంహరణపై టీడీఎస్ ఈపీఎఫ్ ఖాతాకు పాన్ లింక్ చేయకపోతే.. సభ్యులు ఉపసంహరించుకునే మొత్తంపై 20 శాతం టీడీఎస్ అమలు చేస్తారు. ఇంటి మూలధన లాభంలో మార్పులు ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 54, 54 ఎఫ్ కింద ఒక ఇంటిని విక్రయించగా వచ్చే మొత్తాన్ని తిరిగి ఇన్వెస్ట్ చేయడం ద్వారా పన్ను లేకుండా చూసుకోవచ్చు. ఈ సెక్షన్ల కింద తిరిగి పెట్టుబడి పెట్టే మూలధన లాభాలను రూ.10 కోట్లకు పరిమితం చేశారు. అంటే ఇంతకు మించి మూలధన లాభం ఉంటే దానిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ మహిళలకు 2023 బడ్జెట్లో కొత్తగా ప్రకటించిన పథకం ఇది. 2025 మార్చి వరకు ఈ పథకం ఉంటుంది. ఒక్కరు రూ.2 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పెట్టుబడిపై 7.5% వడ్డీ రేటు చెల్లిస్తారు. గరిష్టంగా రెండేళ్లు డిపాజిట్ చేసుకోవచ్చు. బంగారం విక్రయం ఇలా.. హాల్ మార్క్ ఆభరణాలు, బంగారం వస్తువులను ఏప్రిల్ 1 నుంచి 6 నంబర్ల ఆల్ఫాన్యూమరిక్ హాల్ మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ (హెచ్‌యూఐడీ)తోనే విక్రయించాల్సి ఉంటుంది. హాల్ మార్క్ జ్యుయలరీ పట్ల వినియోగదారుల్లో విశ్వాసాన్ని ఇది పెంచనుంది. హెచ్‌యూఐడీ లేకుండా విక్రయించడాన్ని బీఐఎస్ నిషేధించింది. -
జీతం నుంచి టీడీఎస్ మినహాయింపు.. ఐటీ శాఖ కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: ఉద్యోగుల వేతనం నుంచి టీడీఎస్ మినహాయించే ముందు పాత, కొత్త పన్ను విధానాల్లో వారికి ఏది సమ్మతమో సంస్థలు తెలుసుకోవాలని ఆదాయపన్ను శాఖ సూచించింది. ఉద్యోగులు ఎంపిక చేసుకున్న పన్ను విధానం పరిధిలోనే టీడీఎస్ వసూలు చేయాలని ఆదేశించింది. ఒకవేళ ఉద్యోగులు ఏ ఆప్షన్ చెప్పకపోతే, అప్పుడు నూతన పన్ను విధానం కింద టీడీఎస్ మినహాయించాలని కోరింది. ఇదీ చదవండి: త్వరలోనే యాపిల్ స్టోర్ గ్రాండ్ ఓపెనింగ్.. భారత్ రానున్న టిమ్‌కుక్! -
ఇన్ కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నారా? అయితే ఇది మీకోసమే!
పెట్టుబడి పెట్టే ముందు రాబడి ఒక్కటే చూస్తే కాదు. వచ్చిన లాభంపై పన్ను బాధ్యత ఎంతన్నది కూడా ముఖ్యమే. అప్పుడే కదా నికర రాబడి గురించి తెలిసేది. మ్యూచువల్ ఫండ్స్, చిన్న మొత్తాల పొదుపు పథకాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు తదితర డెట్ సాధనాలు, బంగారం, జీవిత బీమా పథకాలు, యులిప్‌లు ఇలా ఎన్నో పెట్టుబడి సాధనాలున్నాయి. వీటన్నింటిపైనా ఒకే విధమైన పన్ను లేదు. పైగా కాల వ్యవధి ఆధారంగా పన్ను బాధ్యత కూడా మారిపోతుంది. అందుకే ఇన్వెస్టర్లు ప్రతి పెట్టుబడి సాధనం, అందులో వచ్చే రాబడులపై చెల్లించాల్సిన పన్ను, అమలయ్యే టీడీఎస్ తదితర వివరాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే. ఈ వివరాలను అందించే కథనమే ఇది. సేవింగ్స్ బ్యాంకు అకౌంట్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో కనీస బ్యాలెన్స్ అంటూ కొంత ఉంచుతుంటాం. దీనికితోడు మనకు జమయ్యే వేతనం, ఇతరత్రా అన్నీ కూడా వచ్చి ముందుగా నిల్వ ఉండేది బ్యాంకు ఖాతాలోనే. మరి ఈ మొత్తంపై బ్యాంకులు సుమారు 3 శాతం మేర వడ్డీ చెల్లిస్తాయని తెలిసింది తక్కువ మందికే. ఇలా బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలో జమయ్యే వడ్డీ ఆదాయం ఆదాయపన్ను పరిధిలోకి వస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ల వడ్డీ ఆదాయం రూ.10,000 వరకు ఉంటే పన్ను లేదు. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80టీటీఏ పన్ను మినహాయింపు కల్పిస్తోంది. రూ.10వేలలోపు ఉన్నా కానీ ఆదాయపన్ను రిటర్నుల్లో ఈ మొత్తాన్ని చూపించాలి. వడ్డీ ఆదాయం రూ.10,001 అంతకంటే ఎక్కువ ఉంటే పన్ను చెల్లించాలి. సంబంధిత వ్యక్తి ఆదాయం ఏ శ్లాబ్ పరిధిలో ఉంటే ఆ రేటు ప్రకారం, సేవింగ్స్ బ్యాంకు వడ్డీ ఆదాయంపై పన్ను చెల్లించాలి. ఒకవేళ 60 ఏళ్లు నిండి ఉంటే వారికి రూ.50,000 వరకు సేవింగ్స్ బ్యాంకు వడ్డీ ఆదాయంపై పన్ను లేదు. రూ.50,001, అంతకంటే ఎక్కువ ఆదాయం ఉంటే సీనియర్ సిటిజన్లు (వృద్ధులు) సైతం తమ పన్ను రేటు ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. సావరీన్ గోల్డ్ బాండ్స్ సార్వభౌమ బంగారం బాండ్లను కేంద్ర ప్రభుత్వం తరఫున పూర్తి హామీతో ఆర్బీఐ ఏటా పలు విడతలుగా జారీ చేస్తుంటుంది. బంగారంలో పెట్టుబడుల కోసం ఉద్దేశించిన సాధనం ఇది. కాల వ్యవధి ఎనిమిదేళ్లు. కాల వ్యవధి ముగిసేవరకు పెట్టుబడిని కొనసాగించినట్టయితే, రాబడిపై ఎలాంటి పన్ను లేదు. మూడేళ్లు మించి, ఎనిమిదేళ్లలోపు విక్రయించినప్పుడు వచ్చే రాబడిపై 20 శాతం పన్ను చెల్లించాలి. ఇండెక్సేషన్ ప్రయోజనం ఉంది. మూడేళ్లలోపు విక్రయించినప్పుడు వచ్చే రాబడి వార్షిక ఆదాయానికి కలుస్తుంది. రిఫండ్ కోరొచ్చు కొన్ని రకాల పెట్టుబడి సాధనాలపై రాబడి నిర్ణీత పరిమితి దాటితే మూలం వద్ద పన్ను వసూలు చేసే (టీడీఎస్) విధానం అమల్లో ఉంది. 10–20 శాతం మేర టీడీఎస్ అమలవుతుంది. ఈ మొత్తాన్ని బ్యాంక్‌లు, పోస్టాఫీసులు, కంపెనీలు, ఎన్బీఎఫ్సీలు సంబంధిత ఇన్వెస్టర్ పాన్ నంబర్ ఆధారంగా ఐటీ శాఖకు జమ చేస్తాయి. ఒకవేళ ఇన్వెస్టర్ వార్షిక ఆదాయం పన్ను పరిధిలోకి వస్తే.. ఈ వడ్డీ ఆదాయంపైనా అంతే మేర పన్ను పడుతుంది. ఒకవేళ వార్షికాదాయం పన్ను వర్తించని పరిధిలో ఉంటే అప్పుడు రిటర్నులను విధిగా నిర్ణీత గడువులోపు దాఖలు చేయాలి. అలా దాఖలు చేసిన తర్వాత టీడీఎస్ రూపంలో మినహాయించిన మొత్తాన్ని తిరిగి తనకు చెల్లించాలంటూ రిఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చు. బంగారం బంగారం ఆభరణాలు, భౌతిక రూపంలో బంగారం కొనుగోలు చేసి, వాటిని మూడేళ్ల తర్వాత విక్రయిస్తే, రాబడిపై 20 శాతం దీర్ఘకాల మూలధన లాభాల పన్ను పడుతుంది. మూడేళ్లలోపు విక్రయించనప్పుడు వచ్చే లాభం వార్షిక ఆదాయానికి కలుస్తుంది. గోల్డ్ మానిటైజేషన్.. ఈ పథకంలో భాగంగా తమ వద్ద నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని జమ చేయవచ్చు. ఇలా జమ చేసే బంగారం విలువపై ఏటా 2.5% వరకు వడ్డీ లభిస్తుంది. ఈ మొత్తంపై పన్ను లేదు. అద్దె ఆదాయం అద్దె ఆదాయంపై 30 శాతం స్టాండర్డ్ డిడక్షన్ అమలవుతుంది. అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రాపర్టీలపై వచ్చే అద్దె ఆదాయంలో 30 శాతం పోను మిగిలిన మొత్తం వ్యక్తి వార్షిక ఆదాయానికి కలుస్తుంది. ఒకవేళ అదే ఇంటికి రుణం తీసుకుని వడ్డీ చెల్లిస్తుంటే, ఆదాయపన్ను చట్టంలోని నిబంధనల కింద రూ.2 లక్షల మొత్తంపై పన్ను మినహాయింపు క్లెయిమ్ కోరొచ్చు. ప్రాపర్టీ విక్రయం ప్రాపర్టీని రెండేళ్లకు మించి ఉంచుకుని విక్రయించినప్పుడు వచ్చే లాభంపై 20 శాతం దీర్ఘకాల మూలధన లాభాల పన్ను అమలవుతుంది. ద్రవ్యోల్బణం ప్రభావాన్ని మినహాయించుకోవచ్చు. రెండేళ్లలోపు విక్రయించినప్పుడు వచ్చే లాభం వ్యక్తిగత ఆదాయానికి కలుస్తుంది. కంపెనీ ఎఫ్డీలు/ఆర్డీలు వీటి నుంచి వచ్చే వడ్డీ రాబడి అంతా వ్యక్తి వార్షిక ఆదాయానికి వెళ్లి కలుస్తుంది. ఒక ఏడాదిలో వీటిపై వడ్డీ ఆదాయం రూ.5,000 మించినప్పుడు ఆ మొత్తంపై 10 శాతం టీడీఎస్ కింద తగ్గించి, మిగిలినది ఇన్వెస్టర్‌కు చెల్లిస్తారు. పన్నులేని బాండ్లు పేరులో ఉన్నట్టుగా ఈ బాండ్లపై వచ్చే రాబడి కానీ, పెట్టుబడి వృద్ధిపైనా పన్ను ఉండదు. నిర్ణీత కాలానికి ముందుగా విక్రయించినట్టయితే అప్పుడు పన్ను పడుతుంది. ఏడాదిలోపు విక్రయిస్తే రాబడి అంతా వ్యక్తి ఆదాయానికి కలుస్తుంది. ఏడాది తర్వాత, నిర్ణీత గడువు ముగియకుండా అమ్మేస్తే రాబడిపై 20 శాతం దీర్ఘకాల మూలధన లాభాల పన్ను అమలవుతుంది. ఇక్కడ కూడా ఇండెక్సేషన్ ప్రయోజనం ఉండదు. ఎన్ఎస్సీ/కేవీపీ ఈ సాధనాల్లో వచ్చే రాబడి సైతం వ్యక్తి ఆదాయానికి కలుస్తుంది. రిటర్నుల్లో చూపించి, పన్ను పరిధిలో ఉంటే పన్ను చెల్లించాలి. టీడీఎస్ అమలు చేయరు. మ్యూచువల్ ఫండ్స్ పన్ను విషయానికొస్తే మ్యూచువల్ ఫండ్స్‌లో డెట్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్‌కు వేర్వేరు విధానాలు అమల్లో ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్ పథకం ఏదైనా కానీ తన నిర్వహణ ఆస్తుల్లో 65 శాతం, అంతకంటే ఎక్కువ మొత్తాన్ని షేర్లలో ఇన్వెస్ట్ చేస్తే ఈక్విటీ పథకంగా పరిగణిస్తారు. ఇంతకంటే తక్కువ ఈక్విటీ పెట్టుబడులు కలిగి ఉంటే డెట్ ఫండ్స్ కిందకు వస్తాయి. ఆర్బిట్రేజ్ ఫండ్స్, 65 శాతం అంతకంటే ఎక్కువ ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్ అన్నింటికీ ఒక పన్ను విధానం అమల్లో ఉంది. వీటిల్లో పెట్టిన పెట్టుబడి ఒక ఏడాది నిండకుండా వెనక్కి తీసుకుంటే, రాబడి స్వల్పకాల మూలధన లాభాల పన్ను కిందకు వస్తుంది. ఈ మొత్తంపై 15 శాతం పన్ను చెల్లించాలి. వ్యక్తి వార్షిక ఆదాయం పన్ను పరిధిలో లేకపోయినా కానీ, ఈక్విటీ లాభాలపై పన్ను చెల్లించాల్సిందే. ఏడాది, అంతకుమించిన కాలానికి ఈక్విటీ పెట్టుబడులపై వచ్చే రాబడి దీర్ఘకాల మూలధన లాభాల పన్ను కిందకు వస్తుంది. దీనిపై 10 శాతం పన్ను చెల్లించాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో దీర్ఘకాల మూలధన రాబడి రూ.లక్ష వరకు పన్ను లేదు. లక్షకు మించినప్పుడు, ఆ అదనపు మొత్తంపైనే 10 శాతం పన్ను బాధ్యత అమలవుతుంది. లిక్విడ్ ఫండ్స్, డ్యురేషన్ ఫండ్స్, ఇంటర్నేషనల్ ఫండ్ ఆఫ్ ఫండ్స్, బ్యాలెన్స్డ్ ఫండ్స్, ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్లు తదితర సాధనాలన్నీ డెట్ ఫండ్స్ కిందకు వస్తాయి. వీటిల్లో పెట్టుబడులను మూడేళ్లు నిండకుండా వెనక్కి తీసుకున్నప్పుడు వచ్చే లాభంపై స్వల్పకాల మూలధన లాభాల పన్ను అమలవుతుంది. ఈ మొత్తం వ్యక్తి ఆదాయానికి కలిపి చూపించాలి. మూడేళ్లు నిండిన డెట్ పెట్టుబడి వెనక్కి తీసుకుంటే వచ్చే రాబడి, దీర్ఘకాల మూలధన లాభాల పన్ను కిందకు వస్తుంది. రాబడి నుంచి సగటు ద్రవ్యోల్బణాన్ని తీసేసి, మిగిలిన మొత్తంపై 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగుల భవిష్యనిధి ఈపీఎఫ్ పథకం కింద కనీసం ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు, రిటైర్మెంట్ సమయంలో ఉపసంహరించుకునే మొత్తం కూడా పన్ను మినహాయింపు కిందకు వస్తుంది. ఐదేళ్లలోపు సర్వీసు ఉండి, కార్పస్‌ను వెనక్కి తీసుకుంటే కనుక, ఈ మొత్తం వార్షిక ఆదాయానికి తోడు అవుతుంది. రిటైర్మెంట్ వరకు ఆగకుండా, గడువుకు ముందే ఈపీఎఫ్ నిధిని ఉపసంహరించుకుంటే, ఈ మొత్తం రూ. 50,000 మించితే దీనిపై 10% టీడీఎస్ అమలవుతుంది. పాన్ లేకపోతే 20% టీడీఎస్ అమలవుతుంది. ఎన్సీడీలు/బాండ్లు వీటిపై వచ్చే వడ్డీ ఆదాయం సైతం వ్యక్తి వార్షిక ఆదాయానికి కలుస్తుంది. ఒక ఏడాదిలో వీటిపై వడ్డీ ఆదాయం రూ.5,000 మించినప్పుడు ఆ మొత్తంపై 10 శాతం టీడీఎస్ పేరిట తగ్గించి, మిగిలినది ఇన్వెస్టర్‌కు చెల్లిస్తారు. అయితే, ఈ బాండ్లు లేదా ఎన్సీడీలను డీమ్యాట్ రూపంలో కలిగి ఉంటే టీడీఎస్ అమలు చేయరు. ఎన్సీడీలు/బాండ్లను కొనుగోలు చేసిన వారు నిర్ణీత కాలవ్యవధి వరకు కలిగి ఉండకుండా, ముందుగానే సెకండరీ మార్కెట్ అంటే స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల్లో విక్రయించినట్టయితే మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది. ఏడాదిలోపు విక్రయించినట్టయితే స్వల్పకాల మూలధన లాభాల పన్ను అమలవుతుంది. దీనిపై ప్రత్యేకంగా పన్ను రేటు లేదు. వ్యక్తి వార్షిక ఆదాయానికి కలుస్తుంది. ఇన్వెస్టర్ పన్ను బాధ్యత ప్రకారం చెల్లిస్తే సరిపోతుంది. ఏడాది తర్వాత ఈ పెట్టుబడులను విక్రయించినప్పుడు దీర్ఘకాల మూలధన లాభాల కిందకు రాబడులు వస్తాయి. అప్పుడు రాబడిపై 10 శాతం పన్ను అమలవుతుంది. దీనికి ఇండెక్సేషన్ (ద్రవ్యోల్బణం మినహాయింపు) ప్రయోజనం లేదు. పోస్టల్ సేవింగ్స్ అకౌంట్ పోస్టల్ సేవింగ్స్ ఖాతాలో ఒక్కరి పేరు మీదే ఖాతా ఉంటే, అందులోని బ్యాలెన్స్‌పై వడ్డీ ఆదాయం ఒక ఏడాదిలో రూ.3,500 వరకు పన్ను లేదు. జాయింట్ హోల్డర్ అకౌంట్ (ఇద్దరి పేరు మీద) అయితే ఈ ఆదాయం రూ.7,000 మొత్తంపై పన్ను లేదు. ఇంతకుమించి ఆదాయం ఉంటే, మినహాయింపు పోను మిగిలిన మొత్తం వ్యక్తి వార్షిక ఆదాయానికి కలుస్తుంది. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 10(15)(ఐ) కింద ఈ ప్రయోజనం ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తికి బ్యాంక్ సేవింగ్స్ ఖాతా ఉండి, అదే వ్యక్తి పోస్టల్ సేవింగ్స్ ఖాతా కూడా కలిగి ఉన్నాడని అనుకుందాం. అప్పుడు బ్యాంక్ సేవింగ్స్ ఖాతాపై ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10,000 మొత్తంపైనా (సెక్షన్ 80టీటీఏ కింద), పోస్టల్ సేవింగ్స్ ఖాతాలపై రూ.3,500 మొత్తంపైనా (సెక్షన్ 10(15)(ఐ)) పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందడానికి అర్హులే. పోస్టల్ సేవింగ్స్ వడ్డీ ఆదాయంపై టీడీఎస్ అమలు చేయరు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ 60 ఏళ్లు నిండి, క్రమం తప్పకుండా ఆదాయం కోరుకునే వారికి ఉద్దేశించిన ఈ పథకంలో పెట్టుబడిపై రాబడి వ్యక్తి వార్షిక ఆదాయానికి కలుస్తుంది. ఎన్పీఎస్ ఎన్పీఎస్ సభ్యులు 60 ఏళ్లు రాగానే పథకం నుంచి వైదొలగొచ్చు. అప్పటి వరకు సమకూరిన కార్పస్‌లో కేవలం 60 శాతాన్ని వెనక్కి తీసుకోగలరు. ఈ మొత్తంపై ఎటువంటి పన్ను ఉండదు. మిగిలిన 40%తో యాన్యుటీ ప్లాన్ (పెన్షన్ చెల్లింపులకు సంబంధించి) తీసుకోవాల్సి ఉంటుంది. పెన్షన్ ప్లాన్లు పెన్షన్ ప్లాన్లలో ఇన్వెస్ట్ చేసిన వారు మెచ్యూరిటీలో మూడింట ఒక వంతును వెనక్కి తీసుకోవచ్చు. ఈ మొత్తంపై పన్ను ఉండదు. మిగిలిన రెండొంతులతో యాన్యుటీ ప్లాన్ తీసుకోవాలి. ఇలా యాన్యుటీ ప్లాన్లపై వచ్చే రాబడి పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. వ్యక్తి మొత్తం వార్షిక ఆదాయం పన్ను పరిధిలోకి వస్తే అప్పుడే పన్ను చెల్లించాలి. ఎండోమెంట్/మనీబ్యాక్ బీమా పథకాలు మనలో చాలా మందికి ఎండోమెంట్, మనీ బ్యాక్ పాలసీలు ఉంటాయి. జీవిత బీమా రక్షణతోపాటు, గడువు ముగిసేవరకు జీవించి ఉంటే, పాలసీదారులకు నిర్ణీత మొత్తం ఈ ప్లాన్ల కింద వస్తుంది. టర్మ్ ప్లాన్లలో కేవలం మరణించినప్పుడే పరిహారం దక్కుతుంది. చివరి వరకు జీవించి ఉంటే ఏమీ రాదు. అందుకని ఎక్కువ మంది ఎండోమెండ్ ప్లాన్లు తీసుకుంటుంటారు. ఈ పథకాల్లో గడువు ముగిసేవరకు కొనసాగితే వచ్చే మెచ్యూరిటీపై పన్ను ఉండదు. యూనిట్ లింక్డ్ ప్లాన్లు (యులిప్‌లకు) సైతం ఇదే అమలవుతుంది. వీటిల్లో వార్షికంగా చెల్లించే ప్రీమియం రూ.2.5 లక్షలు మించనప్పుడు ఈ ప్రయోజనానికి అర్హులు. వార్షిక ప్రీమియం రూ.2.5 లక్షలు మించినప్పుడు, ఈక్విటీ పథకాల మాదిరే ఉపసంహరణ సమయంలో పన్ను రేట్లు అమలవుతాయి. -
10ఎఫ్ దాఖలుకు మార్చి వరకు గడువు
న్యూఢిల్లీ: నాన్ రెసిడెంట్ (భారత్‌లో నివసించని) పన్ను చెల్లింపుదారులు 10ఎఫ్ పత్రాన్ని మాన్యువల్‌గా (భౌతికంగా) దాఖలు చేసేందుకు 2023 మార్చి 31 వరకు కేంద్ర సర్కారు గడువు ఇచ్చింది. దీనివల్ల నిబంధనల అమలు భారం తగ్గుతుందని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) ప్రకటించింది. తక్కువ టీడీఎస్ అమలు చేసేందుకు వీలుగా నాన్ రెసిడెంట్ పన్ను చెల్లింపుదారులు ఆన్లైన్లో ఫామ్ 10ఎఫ్ దాఖలు చేయడం తప్పనిసరి అంటూ ఈ ఏడాది జూలైలో సీబీడీటీ ఆదేశాలు తీసుకొచ్చింది. పాన్ నంబర్లు లేని వారు ఫామ్ 10ఎఫ్ దాఖలు చేసేందుకు ఆదాయపన్ను శాఖ ఈఫైలింగ్ పోర్టల్ అనుమతించడం లేదు. దీంతో పన్ను చెల్లింపుదారులు ఫామ్10 ఎఫ్ దాఖలు విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి వెళ్లాయి. దీంతో భౌతికంగా దాఖలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. -
క్రిప్టో కరెన్సీపై టీడీఎస్, సీబీడీటీ ఏం చెప్పిందంటే!
న్యూఢిల్లీ: ఇద్దరు వ్యక్తుల మధ్య (పీర్ టు పీర్/పీటూపీ) నడిచే క్రిప్టో లావాదేవీలలో టీడీఎస్ మినహాయించి, ఆదాయపన్ను శాఖకు జమ చేయాల్సిన బాధ్యత కొనుగోలుదారులపై ఉంటుంది. ఆదాయపన్ను శాఖకు చెందిన ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) క్రిప్టో పన్నులపై ఈ మేరకు మరోసారి స్పష్టత ఇచ్చింది. సెక్షన్ 194 ఎస్ కింద.. పీర్‌టుపీర్ లావాదేవీల్లో వర్చువల్ డిజిటల్ అస్సెట్ (వీడీఏ/క్రిప్టోలు,ఎన్ఎఫ్టీలు) కొనుగోలు చేసే వారు టీడీఎస్‌ను మినహాయించి, మిగిలిన మొత్తాన్నే విక్రయదారుకు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పీర్‌టూపీర్ అంటే ఎక్సే్ఛంజ్ ప్రమేయం లేకుండా వ్యక్తులు చేసుకునే లావాదేవీలు. ఎక్సే్ఛంజ్‌ల్లో అయితే ఆయా ప్లాట్‌ఫామ్‌లు క్లయింట్ల తరఫున టీడీఎస్ మినహాయిస్తాయి. ఒకవేళ వీడీఏలను ఇద్దరు వ్యక్తులు మార్పిడి చేసుకుంటే (ఒకరి వద్దనున్న డిజిటల్ అసెట్స్‌ను అవతలి వ్యక్తికి ఇచ్చి, అవతలి వ్యక్తి వద్దనున్న వేరే వీడీఏలను తీసుకోవడం) అప్పుడు ఇద్దరు సైతం కొనుగోలుదారులు, విక్రయదారుల కిందకు వస్తారని సీబీడీటీ తెలిపింది. అప్పుడు ఇద్దరూ టీడీఎస్‌ను చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. దీంతో టీడీఎస్ బాధ్యతను కొనుగోలుదారుపై పెట్టినట్టయింది. క్రిప్టోల లావాదేవీలపై ఒక శాతం టీడీఎస్ నిబంధన 2022 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావడం తెలిసిందే. -
మారనున్న ట్యాక్స్ రూల్స్, క్రిప్టో కరెన్సీలపై!
న్యూఢిల్లీ: వర్చువల్ డిజిటల్ అసెట్స్‌పై టీడీఎస్ (ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్) వివరాల వెల్లడికి సంబంధించి ఆదాయ పన్ను శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం డిడక్షన్ చేసిన నెల ముగిశాక, 30 రోజుల్లోగా టీడీఎస్‌ను జమ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం చలానా–కమ్–స్టేట్మెంట్ ఫారం 26క్యూఈని ఉపయోగించాలి. వర్చువల్ డిజిటల్ అసెట్స్ (వీడీఏ) బదలాయింపు తేదీ, విలువ, చెల్లింపు విధానం మొదలైన వివరాలన్నీ దగ్గర ఉంచుకోవాలి. జూలై 1 నుంచి వీడీఏలు లేదా క్రిప్టోకరెన్సీలపై 1 శాతం టీడీఎస్ విధించనున్న నేపథ్యంలో తాజా వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. తాజా నిబంధనలు వీడీఏ లావాదేవీల గురించి తెలుసుకునేందుకు ట్యాక్స్ విభాగానికి ఉపయోగపడతాయని, కానీ పన్ను చెల్లింపుదారులపై మాత్రం నిబంధనల భారం పెరిగిపోతుందని ఏకేఎం గ్లోబల్ ట్యాక్స్ పార్ట్నర్ అమిత్ మహేశ్వరి తెలిపారు. -
లావాదేవీలపై టీడీఎస్‌ను తగ్గించండి
న్యూఢిల్లీ: క్రిప్టోకరెన్సీలలో ట్రేడింగ్ చేయడం వల్ల వచ్చే లాభాలపై చెల్లింపులకు సంబంధించి టీడీఎస్‌ను ప్రతిపాదిత 1 శాతం నుండి 0.01 లేదా 0.05 శాతానికి తగ్గించాలని క్రిప్టో పరిశ్రమ ప్రభుత్వాన్ని కోరింది. ఒక టీడీఎస్ రిటైల్ వ్యాపారుల ప్రయోజనాలకు విఘాతమని పేర్కొంది. ఇక క్రిప్టోకరెన్సీల ద్వారా వచ్చే ఆదాయంపై 30 శాతం పన్ను చాలా ఎక్కువని, ఈ పన్ను రేటును తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని కాయిన్ డీసీఎక్స్ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు సుమిత్ గుప్తా పేర్కొన్నారు. కొత్త పన్ను నిబంధనలు, వాటి అమలు విషయంలో తన ప్లాట్‌ఫారమ్‌లోని వ్యాపారులతో కాయిన్ డీసీఎక్స్ సంప్రదింపులు జరుపుతోందని కూడా ఆయన చెప్పారు. క్రిప్టో అసెట్స్‌పై ఆదాయపు పన్నుకు సంబంధించి 2022–23 బడ్జెట్ స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో తాజా పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. గుర్రపు పందెం లేదా ఇతర స్పెకిలేటివ్ లావాదేవీల నుండి గెలుపొందిన మొత్తాలపై ఏప్రిల్ 1 నుండి 30 శాతం ఆదాయపు పన్ను, సెస్, సర్‌చార్జీలు విధించనున్న సంగతి తెలిసిందే. వార్షికంగా రూ. 10,000 దాటిన వర్చువల్ కరెన్సీల చెల్లింపులపై, అంతే పరిమాణానికి సంబంధించి బహుమతులపై 1 శాతం టీడీఎస్ విధించాలని బడ్జెట్ 2022–23 ప్రతిపాదించింది. ఆదాయపు చట్టం ప్రకారం ఖాతాలను ఆడిట్ చేయాల్సిన నిర్దిష్ట వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌లకు టీడీఎస్ పరిమితి సంవత్సరానికి రూ. 50,000గా ఉంది. 1 శాతం టీడీఎస్‌కు సంబంధించిన నిబంధనలు 2022 జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. -
స్థిరాస్తుల లావాదేవీలపై కేంద్రం భారీ షాక్!
న్యూఢిల్లీ: స్థిరాస్తి లావాదేవీల విలువ రూ.50 లక్షలు మించితే ఒక శాతం టీడీఎస్ మినహాయింపు నిబంధన శుక్రవారం (ఏప్రిల్ 1) నుంచి అమల్లోకి రానుంది. స్టాంప్ డ్యూటీ విలువ లేదా ఒప్పందం విలువ ఏది ఎక్కువైతే దానిపైనే ఇది అమలవుతుంది. అలాగే, వర్చువల్ డిజిటల్ అసెట్స్ (క్రిప్టోలు, ఎన్ఎఫ్టీలు) బదిలీలు, ట్రేడింగ్ లావాదేవీలపై 30 శాతం మూలధన లాభాల పన్ను అమల్లోకి రానుంది. ఈ మేరకు బడ్జెట్లో కేంద్రం ప్రతిపాదనలు చేర్చడం తెలిసిందే. -
అడ్వాన్స్ ట్యాక్స్ సకాలంలో చెల్లించకపోతే జరిమానా ఎంతో తెలుసా?
గత వారం ట్యాక్స్ ప్లానింగ్ గురించి తెలుసుకున్నాం. ఈ రోజు నుంచి ట్యాక్స్ ప్లానింగ్ అమలుపర్చే దారిలోని ముఖ్యమైన అంశాలను తెలుసుకుందాం. ట్యాక్స్ ప్లానింగ్‌లో ముఖ్యమైన భాగం.. చట్టాన్ని తప్పనిసరిగా సకాలంలో పాటించడమే. నిబంధనలను గౌరవించి అమలుపర్చడమే. పన్ను చెల్లించడం కూడా ప్లానింగ్‌లో ఒక భాగమే! ప్రతి అస్సెస్సీ తన నికర ఆదాయాన్ని ముందుగానే ఊహించడం చేయాలి. అంటే 2021-22 ఆర్థిక సంవత్సరాన్ని కనీసం జూన్ మొదటి వారంలోగా అంచనా వేయాలి. ఇది వ్యాపారస్తులు, వృత్తి నిపుణులకు కష్టమే. అందునా ఇప్పుడు మనల్ని పీడిస్తున్న అనిశ్చితిలో ఇది మరింత కష్టమే. అయినప్పటికీ ఇది తప్పదు. ఉద్యోగస్తులకు సంబంధించిన పన్ను భారం టీడీఎస్ రూపంలో యజమాని రికవర్ చేస్తారు. కానీ వీరికి జీతం కాకుండా ఇతర ఆదాయం, ఇంటద్దె, క్యాపిటల్ గెయిన్స్ డివిడెండ్లు, వడ్డీ.. ఇలా ఎన్నో ఉండవచ్చు. ఇలాంటివన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. చాలా మంది బ్యాంకులో ఉన్న ఎఫ్డీలకు సంబంధించిన వడ్డీ మీద ఏర్పడ్డ పన్ను భారం .. టీడీఎస్‌తో సరిపోతుందనుకుంటారు. అలా సరిపోదు. ఎందుకంటే బ్యాంకు కేవలం 10 శాతం మాత్రమే రికవర్ చేస్తుంది. మీకు మీ శ్లాబుని బట్టి మరో 10 శాతం లేదా 20 శాతం పడుతుంది. ఈ అదనపు ఆదాయాన్ని మీరు.. అంచనాల్లోకి తీసుకోవాలి. ఇక వ్యాపారస్తులు, వృత్తి నిపుణులు ముందు ముందు వ్యాపారం ఎలా ఉంటుందని ఊహించటం తప్పనిసరి. కనీసం గత ఆర్థిక సంవత్సరంలోని ఆదాయం బేసిస్‌గా తీసుకోండి. ఇది రెసిడెంట్లకు వర్తిస్తుంది. మొత్తం నికర ఆదాయం లెక్కించి, పన్ను భారాన్ని లెక్కించిన తర్వాత నాలుగు వాయిదాల్లో కింద పేర్కొన్న పట్టిక ప్రకారం చెల్లించాలి. 15 జూన్‌లోగా 15 శాతం 15 సెప్టెంబర్‌లోగా 30 శాతం 15 డిసెంబర్‌లోగా 30 శాతం 15 మార్చిలోగా 25 శాతం మార్చి 15 లోగా మొత్తం పన్ను భారం చెల్లించాలి. మీరు ఎస్టిమేట్ చేసినప్పుడు టీడీఎస్ తగ్గించాలి. ఏదేని కారణం వల్ల కట్టకపోతే, చెల్లించేందుకు ఇంకా పదిహేను రోజుల సమయం ఉంది. మార్చి 15లోగా చెల్లించాలి. అడ్వాన్స్ ట్యాక్స్ సకాలంలో చెల్లించకపోతే అలా చెల్లించనందుకు గాను నెలకు 1 శాతం లోపు వడ్డీ కట్టాల్సి వస్తుంది. ఇది అనవసరపు ఖర్చు. అంతే కాదు. మొత్తం అడ్వాన్స్ ట్యాక్స్ భారంలో 90 శాతం భాగాన్ని మార్చి 15లోగా చెల్లించకపోతే అదనంగా చెల్లించాల్సిన పన్ను మీద నెలకు 1 శాతం వడ్డీ వడ్డిస్తారు. కాబట్టి వెనువెంటనే 31-3-22కి సంబంధించి నికర ఆదాయాన్ని, పన్ను భారాన్ని లెక్కించండి. అడ్వాన్స్ ట్యాక్స్ భారం రూ.10,000 లోపు ఉన్న వారికి పైన చెప్పిన నిబంధనలు వర్తించవు. (చదవండి: మీ పాన్ కార్డుతో ఎవరైనా లోన్ తీసుకున్నారో తెలుసుకోండి ఇలా..!) -
స్థిరాస్తులపై కొత్త నిబంధనలు..అమ్మకాలు, కొనుగోలు చేసేటప్పుడు..
స్థిరాస్తి వ్యవహారాల మీద టీడీఎస్ (ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్)కి సంబంధించి కొత్త నిబంధనలు రాబోతున్నాయి. మొన్నటి బడ్జెట్లో తాజా ప్రతిపాదనల సారాంశం మీకోసం.. ప్రస్తుతం స్థిరాస్తులకు సంబంధించి అమ్మకపు విలువపై టీడీఎస్ వర్తిస్తుంది. ఇక నుం చి స్థిరాస్తి కొనుగోలు చేసేటప్పుడు (వ్యవసాయ భూమిని మినహాయించి) ఆ విలువ రూ. 50,00,000 దాటితే అమ్మకపు విలువ లేదా స్టాంపు డ్యూటీ విలువ.. ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే ఆ మొత్తం మీద 1 శాతం టీడీఎస్ చేయాలి. క్యాపిటల్ గెయిన్స్ లెక్కించడానికి ప్రతి ఫలం విషయంలో ఇదే రూలు ఉంది.. అమ్మకపు విలువ ఎక్కువ? స్టాంపు డ్యూటీ విలువ ఎక్కు వ? ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే దాన్ని ప్రతిఫలంగా పరిగణిస్తారు. ఇప్పుడు టీడీఎస్‌కి ఈ నిబంధన తెచ్చారు. సాధారణంగా బయట మన కు కనిపించేది.. స్టాంప్ డ్యూటీ విలువ తక్కువ ఉంటుంది. నిజంగా ఇచ్చే ప్రతిఫలం ఎక్కువ ఉంటుంది. అంతే కాకుండా బ్లాక్, వైట్ వ్యవహారం ఉంటుంది. ఈ నేపథ్యంలో కొత్త విధానం ద్వారా పన్ను ఎగవేతను అరికట్టవచ్చని ప్రభుత్వం అంచనా. ఉదాహరణగా చెప్పాలంటే ఒక వ్యక్తి ఇల్లు రూ. 60,00,000కు కొన్నారనుకుందాం. కానీ ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించాలంటే స్టాంపు డ్యూటీ రూ. 72,00,000 అనుకోండి.. పాత రూల్స్ ప్రకారం రూ. 60,00,000 మీద టీడీఎస్ చేయాలి. కానీ తాజా ప్రతిపాదనల ప్రకారం రూ. 72,00,000 మీద 1 శాతం చొప్పున టీడీఎస్ చేయాలి. దీనివల్ల టీడీఎస్ మొత్తం పెరుగుతుంది. అంతే కాకుండా, క్యాపిటల్ గెయిన్స్ లెక్కించడానికి ఎక్కువ మొత్తాన్నే పరిగణిస్తారు. ప్రతిఫలం ఎక్కువ, మూలధన లాభం .. ఫలితంగా పన్ను ఎక్కువ వసూలు చేయవచ్చు. ఇది రెసిడెంట్లకు మాత్రమే వర్తిస్తుంది. విలువ రూ. 50,00,000 దాటితేనే వర్తిస్తుంది. అమ్మకపు విలువ, స్టాంపు డ్యూటీ విలువ.. ఈ రెండూ రూ. 50,00,000 కన్నా తక్కువ ఉంటే టీడీఎస్ ప్రశ్న ఉండదు. విలువ రూ. 50,00,000 దాటితేనే టీడీఎస్ రూల్స్ వర్తిస్తాయి. దీని వల్ల ఎక్కువ పన్ను ఖజానాలోకి వచ్చి పడుతుంది. కొన్న వ్యక్తి ఎక్కువ మొత్తం పన్నుని రికవరీ చేసి టీడీఎస్ ఖాతాలోకి జమ చేస్తారు. అయితే, ఈ జమ .. అమ్మే వ్యక్తి స్వంత ఖాతాలో పన్ను చెల్లించినట్లుగా పడుతుంది. అమ్మే వ్యక్తి పన్ను చెల్లించాల్సి ఉంటే టీడీఎస్‌ను పరిగణనలోకి తీసుకుని మిగతా మొత్తాన్ని చెల్లిస్తారు. కానీ పూర్తిగా మినహాయింపు పొందే వ్యక్తికి ఈ టీడీఎస్ మొత్తం రిఫండ్ రూపంలో వస్తుంది. అలా వచ్చే వరకు, గవర్నమెంటు ఖజానాలో ఉంటుంది. రిఫండు వచ్చాక సరే సరి. అంటే, ప్రభుత్వం ముందుగానే ఎక్కువ టీడీఎస్ వసూలు చేసి అసెస్మెంట్ తర్వాత వెనక్కు ఇస్తుంది. మొదటి నుంచి ఇదే పాలసీ.. పన్ను వసూళ్లను టీడీఎస్ రూపంలో ఆదిలోనే వసూలు చేయటం ఆనవాయితీ. కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి; కె.వి.ఎన్‌లావణ్య ట్యాక్సేషన్ నిపుణులు -
ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 74% వృద్ధి
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను వసూళ్లు (వ్యక్తిగత, కార్పొరేట్) సెపె్టంబర్ 22వ తేదీ నాటికి (2021 ఏప్రిల్ నుంచి) నికరంగా రూ.5.70 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలి్చతే ఇది 74 శాతం అధికం. అడ్వాన్స్ పన్నులు, మూలం వద్ద పన్ను (టీడీఎస్) భారీ వసూళ్లు దీనికి కారణం. ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు... ► ఏప్రిల్–1 నుంచి సెపె్టంబర్ 22 మధ్య నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.5,70,568 కోట్లు. గత ఏడాది ఇదే కాలం (రూ.3.27 లక్షల కోట్లు) వసూళ్లతో పోల్చి చూస్తే 74.4 శాతం పెరుగుదల. కరోనా ముందస్తు సమయం 2019–20 ఇదే కాలంతో పోలి్చనా ఈ వసూళ్లు 27 శాతం అధికం. సంబంధిత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వసూళ్ల పరిమాణం రూ.4.48 లక్షల కోట్లు. ► ఇక స్థూలంగా చూస్తే, ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 47 శాతం పెరుగుదలతో రూ.4.39 లక్షల కోట్ల నుంచి రూ.6.45 లక్షల కోట్లకు ఎగశాయి. కరోనా కాలానికి ముందు 2019–20 ఆర్థిక సంవత్సరంతో (2019 సెపె్టంబర్ 22 వరకూ) పోలి్చతే 16.75 పెరుగుదల నమోదయ్యింది. అప్పట్లో స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 5.53 లక్షల కోట్లు. ఇప్పటివరకూ రిఫండ్స్ రూ.75,111 కోట్లు. -
పీఎఫ్ విత్ డ్రాపై ట్యాక్స్ మినహాయింపు పొందడం ఎలా?
Tax On EPF Withdrawl: కరోనా వైరస్ మహమ్మారి వల్ల సామాన్య ప్రజానీకం సేవింగ్స్ కోసం దాచుకున్న నగదును మొత్తం ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ప్రైవేట్ ఉద్యోగుల పరిస్థితి మరి దారుణంగా మారింది. ఈ మహమ్మారి వల్ల చాలా మంది ఉద్యోగాలు కూడా కోల్పోయారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రైవేట్ ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతా నుంచి భారీ మొత్తంలో నగదును ఉపసంహరించుకున్నారు. సాదారణంగా అయితే, పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేస్తే కొన్ని సందర్భాల్లో పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయం తెలియక ఈపీఎఫ్ ఖాతాదారులు చిక్కుల్లో పడుతున్నారు. ఇతర కారణాల చేత ఐదేళ్ల సర్వీస్ కన్నా తక్కువగా ఉన్నప్పుడు డబ్బులు డ్రా చేస్తే పన్నులు చెల్లించాలి. విత్‌డ్రా చేసే మొత్తం రూ.50,000 కన్నా ఎక్కువ ఉంటే సెక్షన్ 192ఏ ప్రకారం 10 శాతం టీడీఎస్ వర్తిస్తుంది. అంతకన్నా తక్కువ డ్రా చేస్తే టీడీఎస్ వర్తించదు. ఒకవేళ పాన్ కార్డు లేకపోతే 30 శాతం టీడీఎస్ వర్తిస్తుంది. రూ.30,000 కన్నా తక్కువ డ్రా చేస్తే టీడీఎస్ ఉండదు. ఐదేళ్ల సర్వీస్ దాటితే ఎలాంటి పన్నులు ఉండవు. ఇక ఉద్యోగం మానేసిన రెండు నెలల తర్వాత ఈపీఎఫ్ బ్యాలెన్స్ మొత్తం డ్రా చేసుకోవచ్చు. ఆదాయపు పన్ను చట్టం, 1961 నాల్గవ షెడ్యూల్ రూల్ 8 సెక్షన్ 10(12) ప్రకారం.. ఒక వ్యక్తి తన ఉద్యోగం మానేసిన తేదీ నాటికి ముందు అతను ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పని చేసినట్లయితే విత్ డ్రా చేసే నగదుపై పన్ను నుంచి మినహాయింపు లభిస్తుంది. 5 ఏళ్లు పైగా పని చేసి ఉండాలి అలాగే ఒక వ్యక్తి ఒక కంపెనీలో 2 ఏళ్లు పనిచేసి తర్వాత మరో కంపెనీలో 3 ఏళ్లు పైగా పనిచేస్తే ఇటువంటి సందర్భంలో కూడా తను ఉపసంహరించే నగదుపై పన్ను వర్తిస్తుంది. కానీ, అతను మొదటి సంస్థలో పనిచేసినప్పుడు అక్కడ ఉన్న పీఎఫ్ ఖాతాను, మరో సంస్థలో జాయిన్ అయినప్పుడు పూర్వ పీఎఫ్ ఖాతాను కొత్త పీఎఫ్ కొత్త లింకు చేయడం వల్ల అతను 5 ఏళ్లకు పైగా పనిచేసినట్లు పరిగణించబడుతుంది. ఇలాంటి సందర్భంలో మాత్రమే పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ సందర్భంలో కూడా అతను పూర్తి సర్విస్ పీరియడ్ కనుక 5 ఏళ్లు కంటే తక్కువగా ఉంటే కచ్చితంగా తను ఉపసంహరించే నగదుపై పన్ను పడుతుంది. కరోనా మహమ్మరి కాలంలో కాకుండా సాధారణంగా నగదు డ్రా చేసినప్పుడు పన్ను నుంచి మినహాయింపు పొందాలంటే కచ్చితంగా 5 ఏళ్లు పని చేసి అయిన ఉండాలి లేదా గత కంపెనీలో పనిచేసిన సర్వీస్ పీరియడ్ అయిన 5 ఏళ్లు పైగా అయిన ఉండాలి. -
జూలై 1 నుంచి అమలులోకి రానున్న కొత్త రూల్స్ ఇవే!
డ్రైవింగ్ లైసెన్స్ నుంచి బ్యాంక్ చార్జీల వరకు జూలై 1, 2021 నుంచి అనేక కొత్త మార్పులు చోటు చేసుకొనున్నాయి. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రేపటి నుంచి ఛార్జీలు పెంచేందుకు సిద్దమవుతుంది. అలాగే ఎల్పీజీ ధరలో కూడా మార్పులు చోటు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఈ కొత్త మార్పుల వల్ల సామాన్యుడి జేబుకు చిల్లు పడనుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఎస్బీఐ బీఎస్‌బీడీ జూలై 1 నుంచి ఎస్బీఐ బీఎస్‌బీడీ ఖాతాదారుల జేబుకు చిల్లు పడనుంది. ఒక నెలలో బ్యాంకు శాఖలు, ఏటీఎంల నుంచి కూడా కలిపి నెలకు ఉచితంగా నాలుగుసార్లు మాత్రమే నగదు తీసుకునే వీలుంటుంది. ఆపై ఒక్కో లావాదేవీపై రూ.15 (జీఎస్టీ అదనం) చొప్పున రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, ఒక ఆర్ధిక సంవత్సరంలో 10 చెక్స్ మాత్రమే ఉచితంగా అందించనున్నారు. అంతకంటే ఎక్కువ 10 లీఫ్ల చెక్ బుక్కు కోసం అయితే రూ. 40, 25 లీఫ్‌లదైతే రూ.75 చార్జీలు ప్లస్ జీఎస్టీ వర్తిస్తుంది. ఇక అత్యవసర చెక్ బుక్ కోసం రూ. 50 (జీఎస్టీ అదనం) చెల్లించాల్సి ఉంటుంది. ఎల్పీజీ గ్యాస్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(ఎల్పీజీ) లేదా కిచెన్ గ్యాస్ రేట్లు కూడా జూలై 1 నుండి సవరించనున్నారు. ప్రతి 5 రోజులకోసారి అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా చమురు కంపెనీలు ఎల్పీజీ ధరలను సవరిస్తాయి. డ్రైవింగ్ లైసెన్స్ జూలై 1 నుంచి కేంద్రం ఏర్పాటు చేస్తున్న కొత్త సిస్టమ్ ప్రకారం, ఇక నుంచి ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ కోసం రీజనల్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీస్(ఆర్ టీఓ) ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కేంద్రం గుర్తించిన డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలలో డ్రైవింగ్ కోర్సు పూర్తి చేసిన తర్వాత వారు ఆ కేంద్రం నుంచే శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు. ఐఎఫ్ఎఎస్ సీ కోడ్లు కేంద్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా సిండికేట్ బ్యాంక్ కెనరా బ్యాంక్‌లో విలీనం అయిన సంగతి తెలిసిందే. అయితే, జులై 1 నుంచి సిండికేట్ బ్యాంక్ ఖాతాదారులు కెనరా బ్యాంక్‌కు చెందిన కొత్త ఐఎఫ్ఎఎస్ సీ కోడ్లు వినియోగించాల్సి ఉంటుంది. ఐఎఫ్ఎఎస్ సీ కోడ్ లను కెనరా బ్యాంక్ వెబ్సైట్ ద్వారా పొందొచ్చు. చెక్కు బుక్కులు చెల్లవు మీరు ఆంధ్రాబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ ఖాతాదారులా? అయితే ఇది మీ కోసమే. ఈ రెండు బ్యాంకులు యూనియన్ బ్యాంకులో విలీనం అయిన కారణంగా పాత చెక్కు బుక్కులు జులై 1 నుంచి చెల్లవ్. కొత్త చెక్కు బుక్కులు యూనియన్ బ్యాంకు శాఖల్లో తీసుకోవాల్సి ఉంటుంది. టీడీఎస్ కొత్త రూల్స్ ఇటీవల కేంద్రం అమల్లోకి తెచ్చిన ఫైనాన్స్ యాక్ట్ 2021 ప్రకారం గత రెండేళ్లలో చెల్లించాల్సిన టీడీఎస్, టీసీఎస్ పన్ను రూ.50,000 కంటే ఎక్కువగా ఉంటే వారి నుంచి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే సమయంలో అధిక శాతంలో పన్ను వసూలు చేయాలని ఆదాయపు పన్ను విభాగం నిర్ణయించింది. ఇది జులై 1 నుంచి అమల్లోకి రానుంది. చదవండి: ఇజ్రాయిల్ తరహా 'ఐరన్ డోమ్'ను భారత్ నిర్మించాలి -
రిటర్నుల దాఖలు చేయకపోతే భారీ జరిమానా?
న్యూఢిల్లీ: గత రెండేళ్లుగా మూలం వద్ధపన్ను కోత(టీడీఎస్), మూలం వద్దే పన్ను వసూలు(టీసీఎస్) చేసేవారు.. పన్ను రిటర్నులు దాఖలు చేయని వారిని గుర్తించేందుకు తగిన సదుపాయాన్ని ప్రత్యక్ష పన్నుల కేంద్రమండలి(సీబీడీటీ) ప్రారంభించింది. సెక్షన్206ఏబీ, సెక్షన్ 206సీసీఏ విషయమై ఆదేశాలు జారీ చేసింది. వరుసగా రెండు ఆర్థిక సంవత్సరాలకు పన్ను రిటర్నులు దాఖలు చేయని వారీ విషయంలో జూలై 1 నుంచి అధిక టీడీఎస్, టీసీఎస్ అమల్లోకి రానుంది. వీరిని ‘ప్రత్యేక వ్యక్తులు’ (స్పెసిఫైడ్ పర్సన్స్)గా గుర్తించేందుకు అవసరమైన ఒక యుటిలిటీని టీడీఎస్, టీసీఎస్ వసూలు చేసేవారికి అందుబాటులోకి తెచ్చింది. అంటే 2018-19, 2019-20 అర్థిక సంవత్సరాల రిటర్నులు వేయకుండా.. టీడీఎస్ లేదా టీసీఎస్ రూ.50,000, అంతకుమించి మినహాయించి ఉంటే, అటువంటి వారికి(నిర్ధేశిత వ్యక్తులు) జూలై 1 నుంచి 5 శాతం అధిక రేటును వసూలు చేయనన్నారు. ఇటువంటి నిర్దేశిత వ్యక్తులను తెలుసుకునే సదుపాయాన్ని https://report.insight.gov.in/ పోర్షల్పై అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సీబీటీటీ ప్రకటించింది. చదవండి: 21 రోజుల్లో భారీగా తగ్గిన బంగారం ధర -
Income Tax Return: ఐటీ రిటర్నుల చివరి గడువు తేదీ తెలుసా?
పన్ను చెల్లింపు దారులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్(సీబీడీటీ) 2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్ను దాఖలు గడువును పొడిగించింది. సర్క్యులర్ ప్రకారం.. 2020-21 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికం టీడీఎస్ పన్ను దాఖలు చివరి తేదీని జూన్ 30 వరకు పొడగించినట్లు పేర్కొంది. అంతకుముందు టీడీఎస్ ను దాఖలు చేయడానికి గడువు మే 31 వరకు ఉండేది. ఈ కొత్త సర్క్యులర్ ప్రకారం.. ఫారం 16 జారీ చేయవలసిన తేదీని జూన్ 15 నుంచి జూలై 15 వరకు పొడగించారు. తాజా టీడీఎస్ రిటర్న్ ఫైలింగ్ ఫారమ్ లలో ఉద్యోగుల కోసం మరో కాలమ్ జోడించబడింది. దీని ప్రకారం, టీడీఎస్ రిటర్న్ దాఖలు చేసే సమయంలో కొత్తగా పన్ను చెల్లించే వారు ఈ ఎంపికను ఎంచుకోవాల్సి ఉంటుందని టాక్స్ 2 విన్ సహ వ్యవస్థాపకుడు & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అభిషేక్ సోని అన్నారు. అలాగే గత రెండేళ్లలో వ్యక్తి టీడీఎస్ దాఖలు చేయకపోతే, రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు ప్రభుత్వం ఎక్కువ పన్ను వసూలు చేస్తుంది అని అన్నారు. ఐటీఆర్ దాఖలు చేసేటప్పుడు నగదు రూపంలో చెల్లించాల్సిన పన్ను మొత్తం లక్ష రూపాయల కన్నా ఎక్కువ ఉంటే, సెక్షన్ 234ఎ కింద జరిమానా, వడ్డీ ఐటీఆర్ దాఖలు చేసిన తర్వాత తేదీ నుంచి వర్తిస్తుంది. చదవండి: కేవలం వారంలో భారీగా ముకేశ్ అంబానీ సంపద -
అలర్ట్: జూన్ 30లోగా ఎఫ్డీ దారులు ఈ ఫామ్‌లు నింపాల్సిందే
కరోనా మహమ్మరి నేపథ్యంలో కొద్దీ రోజుల క్రితం పన్ను చెల్లింపుదారులకు ఊరటనిచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ సమర్పించడానికి ప్రభుత్వం గడువును పొడిగించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్(సీబీడీటీ) వ్యక్తిగత ఐటీఆర్ కోసం 2 నెలలు, కంపెనీలు లేదా భాగస్వామ్య సంస్థలకు ఒక నెల గడువును పొడిగించింది. సీబీడీటీ కొత్త నోటిఫికేషన్ ప్రకారం, ఎఫ్డీ గడువు విషయంలో ఎటువంటి మార్పు లేదు. అందుకే ఎఫ్డీలో పెట్టుబడులు పెట్టిన వారు జూన్ 30 న లేదా అంతకన్నా ముందు 15 జీ, 15 హెచ్‌లను సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఫామ్‌లను నింపి గడువులోగా బ్యాంకుల్లో సమర్పిస్తే డబ్బు ఆదా అవుతుంది. లేకపోతే బ్యాంకులు పన్ను మొత్తాన్ని కట్ చేస్తాయి. 15జీ, 15హెచ్ ఫామ్‌ల వల్ల ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) ఉన్న వారికి ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్(టీడీఎస్) నుంచి మినహాయింపు ఉంటుంది. ప్రస్తుతం మంచి వడ్డీ రేట్లు వస్తుండడంతో ఎక్కువ మంది మదుపరులు ఎఫ్డీలలో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే ఎఫ్‌డీల ద్వారా వచ్చే ఆదాయానికి పన్ను కట్టాల్సి ఉంటుంది. అయితే ఇందుకోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఓ పరిధిని నిర్ణయించింది. అది దాటిన వారికి టీడీఎస్ వర్తిస్తోంది. టీడీఎస్‌పై గరిష్ట పరిమితి ఎంత..? మొదట్లో టీడీఎస్ పరిమితి రూ.10వేలు ఉండగా ప్రస్తుతం అది రూ.40వేలకు పెరిగింది. ఈ పరిమితి పోస్టాఫీసులు, బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన వారికి వర్తిస్తుంది. ఆపై టీడీఎస్ నుంచి మినహాయింపు పొందాలంటే.. 15G, 15H ఫామ్‌లను సమర్పించాల్సి ఉంటుంది. 15 జీ ఫామ్ అంటే..? మీరు పెట్టుబడి పెట్టిన నగదు ద్వారా వచ్చే వడ్డీపై టీడీఎస్ పన్ను మినహాయింపు కోసం ఫామ్ 15జీని సమర్పించాలి. దీనికి కొన్ని షరతులు ఉన్నాయి. దాని ఆధారంగా ఈ ఫారం నింపబడుతుంది. ఈ ఫారమ్‌ను ఎవరు పూరించవచ్చో తెలుసుకుందాం. ఒక భారతీయ పౌరుడు లేదా ఉమ్మడి హిందూ కుటుంబం లేదా ట్రస్ట్ ఈ ఫారమ్ నింపవచ్చు. 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు ఈ ఫారమ్‌ను పూరించవచ్చు. ఈ ఫారం కంపెనీకి లేదా సంస్థకు వర్తించదు. మొత్తం రాబడిపై ట్యాక్స్ లియబులిటీ సున్నాగా ఉండాలి. ఓ సంవత్సరంలో వడ్డీ రాబడి పన్ను మినహాయింపు పరిధిని దాటి ఉండకూడదు. 15 హెచ్ ఫామ్ అంటే..? 60 ఏళ్లు పైబడిన వారు టీడీఎస్ పన్ను మినహాయింపు కోసం ఫామ్ 15 హెచ్ ఫామ్ సమర్పించాలి. ఏ భారతీయ పౌరుడైనా ఈ ఫారమ్ నింపవచ్చు. వ్యక్తికి కనీసం 60 సంవత్సరాలు ఉండాలి. మొత్తం రాబడిపై ట్యాక్స్ లియబులిటీ సున్నాగా ఉండాలి. ఈ రెండు ఫామ్‌ల్లో మీ ప్రాథమిక సమాచారాన్ని చాలా జాగ్రత్తగా నింపాలి. ఆ తర్వాత వీటికి పాన్ కార్డ్ కాపీని, ట్యాక్స్ డిక్లరేషన్‌ను జత చేయాలి. ఆ తర్వాత ఫిక్స్ డిపాజిట్ ఉన్న బ్యాంకులో సమర్పించాలి. ఈ రెండు ఫామ్‌ల కాల పరిమితి ఓ సంవత్సరం ఉంటుంది. చదవండి: కేవలం 1 శాతం వడ్డీకే రుణం.. వారికి మాత్రమే