నేటి నుంచి ఆర్‌డీలపైనా టీడీఎస్
సేవా పన్ను పెరుగుతోంది
పలు కొత్త సేవలు సర్వీస్ ట్యాక్స్ పరిధిలోకి రావటంతో పాటు సోమవారం నుంచి సేవా పన్ను 14 శాతానికి చేరుతోంది. ప్రస్తుతం 12 శాతంగా ఉన్న ఈ పన్నును సోమవాంర నుంచి 14 శాతానికి పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్లోనే ప్రకటించారు. జూన్ 1 నుంచి రికరింగ్ డిపాజిట్ల(ఆర్‌డీ)పైనా ‘మూలం వద్ద పన్ను’ (టీడీఎస్) భారం పడనుంది. ఇప్పటి వరకూ ‘టైమ్ డిపాజిట్’లు మినహా ‘రికరింగ్ డిపాజిట్ల’పై టీడీఎస్ లేదు. అయితే ఇకపై రికరింగ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీపై సైతం టీడీఎస్ పడనుంది. వడ్డీ రూ.10,000 దాటి తే టీడీఎస్ అమలవుతుంది. ఇంతేకాదు ఇప్పటివరకూ నిర్దిష్ట బ్యాంక్ బ్రాంచీలో డిపాజిట్‌పై వడ్డీ రూ.10,000 దాటితేనే టీడీఎస్ భారం పడేది. జూన్ 1 నుంచి బ్రాంచ్‌తో సంబంధం లేకుండా ఒక బ్యాంక్‌లో (బ్రాంచీలనూ గమనంలోకి తీసుకుని) డిపాజిట్లన్నింటినీ పరిగణనలోకి తీసుకుని.. వాటిపై వచ్చే వడ్డీ వార్షికంగా రూ.10,000 దాటితే టీడీఎస్ పడుతుంది.
మీరేం చేయాలి?
ఆదాయపు పన్ను పడకుండా కొన్ని పరిమితులు ఉన్నాయి. 60 సంవత్సరాల లోపు కనీస ఆదాయ పరిమితి రూ.2.5 లక్షలు. 80 సంవత్సరాల వయస్సులోపు ఈ పరిమితి రూ.3 లక్షలు. రూ.80 సంవత్సరాల పైబడిన వారి విషయంలో ఈ పరిమితి రూ.5 లక్షలుగా ఉంది. ఈ మొత్తంకన్నా తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు బ్యాంకుల్లో 15జీ/15హెచ్ ఫారమ్‌లను దాఖలు చేసి తమ ఎఫ్‌డీ, ఆర్‌డీలపై టీడీఎస్ భారం నుంచి బైటపడవచ్చు. ఆదాయపు పన్ను పరిమితికన్నా తమ ఆదాయం తక్కువ ఉందని ధ్రువీకరిస్తూ... వ్యక్తులు దాఖలు చేయాల్సిన ఫామ్స్ ఇవి. 60 సంవత్సరాల లోపు వయస్సు వారికి ఫామ్ 15జీ వర్తిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 15హెచ్ వర్తిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇతర ఎటువంటి ఆదాయం లేకుండా... డిపాజిట్లపై వచ్చే వడ్డీపైనే బతికే వారికి ఈ ఫామ్‌ల దాఖలు మంచి ఫలితాలను అందిస్తాయి.
పీఎఫ్ విత్‌డ్రాయల్స్‌పై కూడా..
కొన్ని పరిమితులకు లోబడి ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) విత్‌డ్రాయల్స్ విషయంలో కూడా జూన్ 1 నుంచీ టీడీఎస్ భారం పడనుంది. ఐదు సంవత్సరాల లోపు (ఉద్యోగికి) సర్వీస్ ఉన్న ఉద్యోగి విత్‌డ్రాయల్స్‌పై టీడీఎస్ పడుతుంది. ఈ సందర్భంలో రూ.30,000 పైబడిన విత్‌డ్రాయల్స్‌పై టీడీఎస్ అమలవుతుంది. పాన్ నంబర్ సమర్పిస్తే టీడీఎస్ 10 శాతంగా ఉంటుంది. 15జీ, 15 హెచ్ ఫారమ్‌లు సమర్పిస్తే- టీడీఎస్ సమస్య ఉండదు. ఈ మూడూ సమర్పించకపోతే... టీడీఎస్ 33 శాతం వరకూ ఉంటుంది. ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్‌కు బదలాయింపులపై మాత్రం టీడీఎస్ పడదు. అనారోగ్యం కారణాల వల్ల ఉద్యోగిని తొలగించినా టీడీఎస్ కట్‌కాదు. ఉద్యో గి సర్వీస్ ఐదేళ్లకు పైగా కొనసాగుతూ చేసే పీఎఫ్ విత్‌డ్రాయల్స్‌పై సైతం టీడీఎస్ ఉండదు.