
న్యూఢిల్లీ: యాజమాన్యాలు ఉద్యోగుల టీడీఎస్ (మూలం వద్ద పన్ను కోత) వివరాలకు సంబంధించి జారీచేసే ఫామ్ –16 సర్టిఫికెట్ ఫార్మాట్‌ను ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ సవరించింది. హౌస్ ప్రాపర్టీ నుంచి ఆదాయాలు, ఇతర యాజమాన్యాల నుంచి పారితోషికాలు సహా విస్తృత ప్రాతిపదికన సమాచారం అందుబాటులో ఉండేలా ఫామ్–16ను సవరించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పన్ను ఎగవేతల నిరోధమే లక్ష్యంగా సమగ్రంగా ఈ ఫార్మాట్‌ను రూపొందించినట్లు ఆ వర్గాలు చెప్పాయి.
వివిధ పన్ను పొదుపు పథకాల కింద కోతలు, పన్ను పొదుపు పథకాల్లో పెట్టుబడులు, ఉద్యోగులు అందుకునే వివిధ అలవెన్సులు అలాగే ఇతర వనరుల ద్వారా ఆదాయం, పొదుపు ఖాతాలో డిపాజిట్లపై వడ్డీలు, రిబేట్స్, సర్‌చార్జీలు.... ఇలా విస్తృత సమాచారం దీనివల్ల అందుబాటులోకి వస్తుంది. ఆదాయపు పన్ను శాఖ నోటిఫై చేసిన సవరిత ఫామ్–16 మే 12వ తేదీ నుంచీ అమల్లోకి వస్తుంది. దీని ప్రకారం, 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ తాజా ఫామ్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది.