ఇవాళ మార్చి 15.. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించడానికి ఆఖరు తేది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను మీ నికర ఆదాయాన్ని లెక్కించుకుని, వర్తించే పన్ను భారంలో నుంచి టీడీఎస్ తగ్గించి .. మిగతా మొత్తాన్ని జూన్, సెప్టెంబర్, డిసెంబర్, మార్చి నెలల్లో నిర్దేశించిన వాయిదాల ప్రకారం చెల్లించాలి. ఈ చెల్లింపులకు మార్చి పదిహేనే ఆఖరు తేదీ. వెంటనే చెల్లించేయండి. లేని పక్షంలో వడ్డీ భారం పడుతుంది. ఒకవేళ మార్చి 15న కుదరకపోతే కనీసం నెలాఖరు లోగానైనా చెల్లించేయాలి. ఇక 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను రిటర్న్ వేయలేకపోయిన వారు మార్చి నెలాఖరు లోపల వేయవచ్చు. 2019-20కి వేసిన రిటర్నులను సవరించుకోవడానికి కూడా మార్చి 31 ఆఖరు తేదీ.
చెల్లించాల్సినవి ఉంటే..
ప్రస్తుతం నడుస్తున్న ఆర్థిక సంవత్సరానికి సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్లు, మెడిక్లెయిమ్, పీఎఫ్, జీవిత బీమా, పిల్లల ట్యూషన్ ఫీజులు, మున్సిపల్ పన్నులు, విరాళాలు ఇలాంటివి ఎన్నో ఉంటాయి. ఇవన్నీ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే లోపలే చెల్లించాలి. ఏదైనా మర్చిపోతే వెంటనే చెల్లించేయండి. అలాగే నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్‌పీఎస్)లో డిపాజిట్ చేసిన వారికి అదనంగా రూ. 50,000 దాకా మినహాయింపు ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఇలా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్ను సంబంధ అంశాలన్నింటికీ మార్చి 31 గడువు తేదీ. ఆదాయ పన్ను ప్లానింగ్ గురించి మీరు ముందుగానే ఆలోచిస్తే.. మీ కుటుంబంతో పాటు మీ ఆర్థిక కార్యకలాపాల గురించి మంచి ప్రణాళిక తయారు చేసుకోవచ్చు. తద్వారా బండి సాఫీగా ముందుకు సాగిపోతుంది.
వివరాలన్నీ పోల్చి చూసుకోవాలి..
కొత్త అపార్ట్‌మెంట్లు కొనే వాళ్లు వాటి నిర్మాణం చివరి దశలో ఉంటే ఈ సంవత్సరంలోనే తీసుకోవడమో లేదా వచ్చే ఆర్థిక సంవత్సరంలో తీసుకోవడమో ఆలోచించుకోవచ్చు. అలాగే స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించి సమయం ఉంటుంది కాబట్టి వీలైతే ఏప్రిల్‌లో చేపట్టవచ్చు. అప్పుడు ప్లానింగ్ చేసుకోవడానికి, పన్నుల భారం చెల్లించడానికి తగినంత సమయం లభిస్తుంది. వ్యాపారస్తుల విషయంలో వారి వార్షిక టర్నోవరు వివరాలను అసెసీకి సంబంధించిన ఫారం 26ఏఎస్‌లో పొందుపరుస్తున్నారు. ఇందులోని వివరాలను మీ ఆర్థిక వ్యవహారాల చిట్టాగా .. మీ ఫైనాన్షియల్ రికార్డు .. మీ జాతకంగా అనుకోవచ్చు.
ఎక్కడ తేడా వచ్చిన ఆరా తీస్తారు. సరైన వివరణ ఇవ్వకపోతే ఏ అధికారులూ ఊరుకోరు. కాబట్టి ఏ తప్పులు లేకుండా అన్ని వివరాల రికార్డులు, రిటర్నులు మొదలైన వాటిని ఒకదానితో మరొకటి పోల్చి చూసుకుని, తప్పులు లేకుండా వేసుకోండి. ఇక చివరిగా రెసిడెంట్ల విషయానికొస్తే.. మీ పాన్‌కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలి. దీనికి 2021 మార్చి 31 ఆఖరు తేది. కనుక త్వరపడండి. అనుసంధానం చేయకపోతే పెనాల్టీలు వడ్డిస్తారు. అన్నీ సక్రమంగా చేసుకుంటే, చూసుకుంటే ఈ ఆర్థిక సంవత్సరం ప్రశాంతంగా గడిచిపోతుంది.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment