ఈ మార్పులపై ఓ లుక్కేయండి! | Some key changes from April 1 in terms of income tax | Sakshi
Sakshi News home page

ఈ మార్పులపై ఓ లుక్కేయండి!

Published Mon, Apr 10 2023 3:08 AM | Last Updated on Mon, Apr 10 2023 7:34 AM

Some key changes from April 1 in terms of income tax - Sakshi

ఆదాయపన్ను పరంగా ఏప్రిల్‌ 1 నుంచి కొన్ని కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. కొన్ని పన్ను మిహాయింపులు తొలగిపోగా.. కొన్ని సాధనాలకు సంబంధించి పెట్టుబడి పరిమితుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. గతంతో పోలిస్తే ఆదాయపన్ను కొత్త విధానం మరింత ఆకర్షణీయంగా మారింది. ప్రధానంగా పన్నుల వ్యవస్థను మరింత సరళీకృతం చేయడం, పారదర్శకతను పెంచే లక్ష్యాలతో కేంద్ర సర్కారు ఎప్పటికప్పుడు కొత్త ప్రతిపాదనలు, సవరణలు తీసుకొస్తోంది. కనుక ఆదాయపన్ను పరిధిలోని ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన మార్పులను వివరించే కథనమిది...

నూతన  పన్ను విధానం... 
నూతన పన్ను విధానం ఎంపిక చేసుకునే వారికి వార్షిక ఆదాయం రూ.7 లక్షల వరకు ఉంటే రూపాయి పన్ను చెల్లించే పని లేకుండా పన్ను రాయితీని ప్రభుత్వం కల్పించింది. సెక్షన్‌ 87ఏ కింద గరిష్టంగా రూ.25,000 రాయితీని ప్రకటించింది. అంటే నికరంగా రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి పన్ను భారం ఉండదు. తక్కువ ఆదాయం కలిగిన వారికి ఉపశమనం కల్పించడమే ఈ రాయితీ ఉద్దేశ్యమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

2022–23 ఆర్థి క సంవత్సరం నుంచే ఈ రాయితీ అమల్లోకి వచ్చింది. ఈ రాయితీ వల్ల ఎక్కువ మందికి ప్రయోజనం లభించనుంది. ఒకవేళ ఆదాయం రూ.7లక్షలకు పైన స్వల్పంగా ఉన్నప్పుడు భారీగా పన్ను చెల్లించాల్సి వస్తోంది. దీన్ని అర్థం చేసుకున్న కేంద్ర సర్కారు ఆర్థిక బిల్లు 2023లో కొన్ని సవరణలు చేసింది. ఉదాహరణకు రూ.7 లక్షలకు పైన మరో రూ.5 వేల ఆదాయం ఉంటే అప్పుడు నిబంధనల కింద రూ.26,500 పన్ను (సెస్సులతో) చెల్లించాల్సి ఉంది. దీని స్థానంలో.. రూ.7లక్షలకు పైన అదనంగా ఉన్న రూ.5వేలపైనే పన్ను చెల్లిస్తే సరిపోతుంది.

అలాగే, నూతన పన్ను విధానంలోనూ రూ.50,000 స్టాండర్డ్‌ డిడక్షన్‌ ప్రయోజనం కల్పించారు. దీంతో నికరంగా రూ.7.50 లక్షల వరకు పన్ను భారం పడదు. నూతన పన్ను విధానం కింద పన్ను రేట్లలోనూ మార్పులు చేశారు. 60 ఏళ్లలోపు వారికి రూ.3 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి పన్ను ఉండదు. రూ.3–6 లక్షల ఆదాయంపై 5 శాతం పన్ను, రూ.6–9 లక్షల ఆదాయంపై 10 శాతం పన్ను పడుతుంది. రూ.9–12 లక్షల ఆదాయంపై 15 శాతం, రూ.12–15 లక్షల ఆదాయంపై 20 శాతం, రూ.15 లక్షల ఆదాయంపై 30 శాతం పన్ను రేటు వర్తిస్తుంది. 

బీమాపైనా పన్ను 
జీవిత బీమా పాలసీలకు చెల్లించే ప్రీమియంపైనే కాదు, గడువు తీరిన తర్వాత అందుకునే మొత్తంపైనా పన్ను ఉండదనేది అందరికీ తెలిసిన విషయం. కానీ, 2023 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చిన మార్పుల ప్రకారం.. జీవిత బీమా పాలసీలకు చెల్లించే వార్షిక ప్రీమియం రూ.5 లక్షలకు మించి ఉంటే.. పాలసీదారు జీవించి ఉన్న సందర్భాల్లో గడువు తీరిన తర్వాత అందుకునే మొత్తం పన్ను పరిధిలోకి వస్తుంది. అంటే అధిక ప్రీమియం పాలసీల మెచ్యూరిటీపై ఇప్పటి వరకు ఉన్న సున్నా పన్ను ప్రయోజనాన్ని సర్కారు తొలగించింది.

వార్షిక ప్రీమియం రూ.5 లక్షల వరకు ఉండే పాలసీల మెచ్యూరిటీపై ఇక ముందూ పన్ను మినహాయింపు ప్రయోజనం కొనసాగుతుంది. అలాగే, 2023 మార్చి 31వరకు కొనుగోలు చేసిన జీవిత బీమా పాలసీలకు సంబంధించి వార్షిక ప్రీమియం రూ.5 లక్షలకు మించి ఉన్నా, చివర్లో అందుకునే మొత్తంపై పన్ను ఉండదు. అలాగే, పాలసీదారు మరణించిన సందర్భంలో చెల్లించే పరిహారంపైనా పన్ను ఉండదు. యులిప్‌ ప్లాన్ల ప్రీమియం ఎంత ఉన్నా కానీ, పన్ను పరిధిలోకి రావు.

డెట్‌ ఫండ్స్‌పై కూడా...
డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులను మూడేళ్లపాటు కొనసాగించినప్పుడు వచ్చిన లాభం దీర్ఘకాల మూలధన లాభం కిందకు వస్తుంది. వచ్చిన లాభం నుంచి పెట్టుబడి పెట్టిన కాలంలో సగటు ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించి, మిగిలిన లాభంపైనే 20 శాతం పన్ను చెల్లిస్తే సరిపోయేది. ఇది గతంలో ఉన్న విధానం. కానీ, ఈ ప్రయోజనాన్ని తొలగించారు. 2023 ఏప్రిల్‌ 1 నుంచి డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడుల కాల వ్యవధి ఎంతైనా కానీయండి, వచ్చే లాభం మొత్తం వార్షిక ఆదాయానికి కలుస్తుంది.

ఏ శ్లాబు రేటు పరిధిలో ఉంటే, ఆ మేరకు పన్ను చెల్లించాల్సి వస్తుంది. అంటే ప్రస్తుతం డెట్‌ ఫండ్స్‌లో అమల్లో ఉన్న స్వల్పకాల మూలధన లాభాల పన్ను విధానమే ఇక మీదట అన్ని రకాల డెట్‌ ఫండ్స్‌ లాభాలకు అమలవుతుంది. మొత్తానికి డెట్‌ ఫండ్స్‌లో పెట్టుబడులకు దీర్ఘకాల మూలధన లాభాల పన్ను ప్రయోజనాన్ని తొలగించారు. తద్వారా డెట్‌ ఫండ్స్‌లో దీర్ఘకాల పెట్టుబడులను నిరుత్సాహపరిచినట్టయింది. దీంతో దీర్ఘకాల పెట్టుబడులు జీవిత బీమా, ఈక్విటీ సాధనాల వైపు వెళతాయన్నది నిపుణుల అంచనాగా ఉంది. 2023 ఏప్రిల్‌ 1 నుంచి చేసే తాజా డెట్‌ పెట్టుబడులకు నూతన పన్ను విధానం అమలవుతుంది. 2023 మార్చి 31 వరకు చేసిన పెట్టుబడులకు కొత్త నిబంధన వర్తించదు. 

రిటర్నుల దాఖలు
ఆదాయపన్ను రిటర్నులను దాఖలు చేసే వారు తప్పకుండా గమనించాల్సిన మార్పు ఒకటి ఉంది. పాత, కొత్త పన్ను విధానాలు ఉన్నప్పటికీ, నూతన పన్ను విధానమే డిఫాల్ట్‌గా కనిపిస్తుంది. పాత పన్ను విధానంలోనే కొనసాగాలని అనుకునేవారు రిటర్నులు దాఖలు చేసే ముందే దానిని ప్రత్యేకంగా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

నూతన పన్ను విధానంలో పన్ను రేట్లు తక్కువ. కానీ, చాలా వరకు పన్ను మినహాయింపులు, పన్ను తగ్గింపు ప్రయోజనాల్లేవు. అన్ని రకాల మినహాయింపు ప్రయోజనాలను ఉపయోగించుకునే వారికి పాత విధానం అనుకూలం. కనుక ఎవరికి వారు తమ వార్షిక ఆదాయం, పెట్టుబడుల ఆధారంగా ఏ పన్ను విధానం అనుకూలం అనేది ఎంపిక చేసుకోవాలి. ఈ విషయంలో స్పష్టత రాకపోతే పన్ను నిపుణుల సాయం తీసుకోవాలి. 

ఎస్‌సీఎస్‌ఎస్‌ 
పదవీ విరమణ పొందిన వారికి క్రమం తప్పకుండా ఆదాయం తెచ్చి పెట్టే పెట్టుబడి పథకాల్లో సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఎస్‌సీఎస్‌ఎస్‌) ఒకటి. ఈ పథకంలో పెట్టుబడిపై ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ ఆదాయం చెల్లిస్తారు. 60 ఏళ్లు నిండిన వ్యక్తులు ఎవరైనా ఈ పథకంలో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులు అయితే 55–60 ఏళ్ల మధ్యలో ఉన్నా పెట్టుబడికి అర్హులు. ఈ పథకంలో ఒక్కరు గరిష్టంగా రూ.15 లక్షల వరకే ఇన్వెస్ట్‌ చేసుకునేందుకు అనుమతి ఉండగా, ఏప్రిల్‌ 1 నుంచి దీన్ని రూ.30 లక్షలకు పెంచారు.

నగదు ఉపసంహరణలపై టీడీఎస్‌ 
బ్యాంకు ఖాతా నుంచి భారీగా నగదు ఉపసంహరణలను నిరుత్సాహ పరిచేందుకు గాను కేంద్ర సర్కారు మూలం వద్ద పన్ను మినహాయింపు (టీడీఎస్‌ను) ప్రవేశపెట్టింది. ఒక ఆర్థి క సంవత్సరంలో ఒక బ్యాంక్‌ ఖాతా నుంచి నగదు ఉపసంహరణలు రూ.కోటి మించితే టీడీఎస్‌ కింద బ్యాంకులు 2 శాతాన్ని మినహాయిస్తాయి. వ్యక్తులు, వ్యాపార సంస్థలకూ ఇది అమలవుతుంది.  

ఎల్‌టీఏ 
ప్రభుత్వ ఉద్యోగులు కాని వారు సెలవులను నగదుగా మార్చుకునే మొత్తంపై పన్ను ప్రయోజనానికి పరిమితి ఉంది. 2002 నుంచి ఈ పరిమితి రూ.3 లక్షలుగా ఉంటే, దాన్ని రూ.25 లక్షలకు పెంచారు. అంటే సెలవులను నగదుగా మార్చుకునే మొత్తం రూ.25 లక్షలు ఉన్నా కానీ పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు.

పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకం 
పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ (పీవో ఎంఐఎస్‌) కూడా నెలవారీ ఆదాయం కోరుకునే వారికి ఉద్దేశించిన పథకం. ఈ పథకంలోనూ ఒక్కరు గరిష్టంగా రూ.4.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టుకునేందుకు అనుమతి ఉంటే, దీన్ని రూ.9 లక్షలకు పెంచారు. జాయింట్‌ అకౌంట్‌ కింద రూ.9 లక్షల పరిమితిని రూ.15 లక్షలు చేశారు.  

హెచ్‌ఎన్‌ఐలపై పన్ను భారం 
బడ్జెట్‌లో అధిక సంపద కలిగిన వ్యక్తులకు సర్‌చార్జీ భారాన్ని తగ్గించారు. వార్షికాదాయం రూ.5 కోట్లకు పైన ఉన్న వారికి సర్‌చార్జీ 37 శాతం నుంచి 25 శాతానికి దిగొచ్చింది. కాకపోతే నూతన పన్ను విధానాన్ని ఎంపిక చేసుకునే వారికే దీన్ని పరిమితం చేశారు.  

ఎన్‌పీఎస్‌ నుంచి వైదొలగాలంటే.. 
ఏప్రిల్‌ 1 నుంచి ఎన్‌పీఎస్‌ పథకం నుంచి వైదొలిగే లేదా యాన్యుటీ ఎంపిక చేసుకునే వారికి కేవైసీ డాక్యుమెంట్లు అప్‌లోడ్‌ చేయడం తప్పనిసరి చేశారు. పథకం నుంచి వైదొలిగిన సభ్యులకు వేగంగా యాన్యుటీ చెల్లింపుల చేసేందుకే ఈ ఆదేశాలు అమల్లోకి తెచ్చారు. ఎన్‌పీఎస్‌ ఎగ్జిట్‌ లేదా విత్‌ డ్రాయల్‌ ఫారమ్, గుర్తింపు, చిరునామా ధ్రువీకరణ, బ్యాంక్‌ అకౌంట్‌ రుజువు, ప్రాన్‌ (పెన్షన్‌ అకౌంట్‌) కార్డ్‌ కాపీని సెంట్రల్‌ రికార్డ్‌ కీపింగ్‌ ఏజెన్సీ సిస్టమ్‌లోకి అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. అనారోగ్యం, వైకల్యం తదితర సందర్భాల్లో ఎన్‌పీఎస్‌ నుంచి 25 శాతం ఉపసంహరణకు అనుమతి ఉంది. ఆ సందర్భాల్లోనూ వీటిని అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.    

ఈ–గోల్డ్‌ 
భౌతిక బంగారాన్ని ఎలక్ట్రానిక్‌ గోల్డ్‌ రిసీప్ట్‌ (ఈజీఆర్‌) రూపంలోకి మార్చుకుంటే ఎలాంటి మూలధన లాభాల పన్ను పడదు.  

ఆన్‌లైన్‌ గేమింగ్‌ 
ఆన్‌లైన్‌ గేమింగ్‌ ద్వారా గెలుచుకునే మొత్తంపై 30 శాతం టీడీఎస్‌ అమలు కానుంది.  

ఈపీఎఫ్‌ ఉపసంహరణపై టీడీఎస్‌ 
ఈపీఎఫ్‌ ఖాతాకు పాన్‌ లింక్‌ చేయకపోతే.. సభ్యులు ఉపసంహరించుకునే మొత్తంపై 20 శాతం టీడీఎస్‌ అమలు చేస్తారు.  

ఇంటి మూలధన లాభంలో మార్పులు 
ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 54, 54 ఎఫ్‌ కింద ఒక ఇంటిని విక్రయించగా వచ్చే మొత్తాన్ని తిరిగి ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా పన్ను లేకుండా చూసుకోవచ్చు. ఈ సెక్షన్ల కింద తిరిగి పెట్టుబడి పెట్టే మూలధన లాభాలను రూ.10 కోట్లకు పరిమితం చేశారు. అంటే ఇంతకు మించి మూలధన లాభం ఉంటే దానిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది.   

మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ 
మహిళలకు 2023 బడ్జెట్‌లో కొత్తగా ప్రకటించిన పథకం ఇది. 2025 మార్చి వరకు ఈ పథకం ఉంటుంది. ఒక్కరు రూ.2 లక్షల వరకు ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. పెట్టుబడిపై 7.5% వడ్డీ రేటు చెల్లిస్తారు. గరిష్టంగా రెండేళ్లు డిపాజిట్‌ చేసుకోవచ్చు.  

బంగారం విక్రయం ఇలా.. 
హాల్‌ మార్క్‌ ఆభరణాలు, బంగారం వస్తువులను ఏప్రిల్‌ 1 నుంచి 6 నంబర్ల ఆల్ఫాన్యూమరిక్‌ హాల్‌ మార్క్‌ యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌ (హెచ్‌యూఐడీ)తోనే విక్రయించాల్సి ఉంటుంది. హాల్‌ మార్క్‌ జ్యుయలరీ పట్ల వినియోగదారుల్లో విశ్వాసాన్ని ఇది పెంచనుంది. హెచ్‌యూఐడీ లేకుండా విక్రయించడాన్ని బీఐఎస్‌ నిషేధించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement