![One of the key changes proposed in the bill is the introduction of the concept of a tax year](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/tax01.jpg.webp?itok=QFTN1EM7)
పార్లమెంటులో త్వరలో ప్రవేశపెట్టనున్న కొత్త ఆదాయపు పన్ను బిల్లు(New Income Tax Bill) సామాన్యులకు ప్రత్యక్ష పన్ను చట్టాలను సులభతరం చేయడమే లక్ష్యంగా రూపొందించినట్లు అధికారులు తెలియజేస్తున్నారు. బిల్లులో ప్రతిపాదించిన కీలక మార్పుల్లో ‘ట్యాక్స్ ఇయర్’ ఒకటని సమాచారం. ఈ మార్పువల్ల వ్యాపారుల పన్ను చెల్లింపులను సులభతరం చేసేందుకు వీలవుతుందని భావిస్తున్నారు.
టాక్స్ ఇయర్(Tax Year) అంటే ఏమిటి?
టాక్స్ ఇయర్ అనేది నిర్దిష్ట ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను ప్రయోజనాల కోసం ఉపయోగించే 12 నెలల వ్యవధి. కొత్త ఆదాయపు పన్ను బిల్లు ప్రకారం ట్యాక్స్ ఇయర్ ఏప్రిల్ 1న ప్రారంభమై మరుసటి ఏడాది మార్చి 31న ముగుస్తుంది. 1961 ఆదాయపు పన్ను చట్టంలో ఉపయోగించిన ‘ప్రివియస్ ఇయర్’, ‘అసెస్‌మెంట్ ఇయర్(మదింపు సంవత్సరం)’ స్థానంలో ఈ ట్యాక్స్ ఇయర్‌ను వాడనున్నారు.
ఇదీ చదవండి: ఎల్ అండ్ టీ చైర్మన్ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు
పన్ను చట్టాలను ఎలా సులభతరం చేస్తుంది?
స్థిరమైన ట్యాక్స్ ఇయర్‌ను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా పన్ను చెల్లింపుదారులు ఆదాయాన్ని నివేదించడానికి, పన్నులు చెల్లించడానికి నిర్దిష్ట వ్యవధిని కలిగి ఉంటారు. ఇది విభిన్న ఆర్థిక సంవత్సరాలకు వేర్వేరు అసెస్‌మెంట్ ఇయర్(మదింపు సంవత్సరం-వచ్చే ఆర్థిక సంవత్సరం)లను కలిగి ఉండటం వల్ల తలెత్తే గందరగోళాన్ని తొలగిస్తుంది.
పన్ను చెల్లింపుదారులు తమ బాధ్యతలను అర్థం చేసుకోవడానికి సులభమైన, స్పష్టమైన భాషను ఉపయోగించాలని కొత్త బిల్లు లక్ష్యంగా పెట్టుకుంది. ఏళ్ల తరబడి పేరుకుపోయిన కాలం చెల్లిన నిబంధనలు, వివరణలను తొలగించాలని నిర్ణయించారు.
పన్ను విధానాలకు సంబంధించి స్పష్టమైన నిర్వచనాలు, క్రమబద్ధమైన విధానాతతో కొత్త పన్ను చట్టాలు వివాదాలు, లిటిగేషన్లను తగ్గిస్తాయని భావిస్తున్నారు. దీనివల్ల మరింత పన్ను వసూలుకు వీలవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పన్నుకు సంబంధించి వివాదాలు తగ్గడం వల్ల న్యాయవ్యవస్థపై భారం తగ్గుతుందని చెబుతున్నారు.
తరచూ శాసన పరమైన సవరణలు అవసరం లేకుండా పన్ను పథకాలను ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ)కి ఎక్కువ అధికారాన్ని ఈ బిల్లు కల్పిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment