
ఇంద్రుడికి వేయి కళ్లున్నాయి అనేది నాటి కథ. పురాణ కథ. ఇప్పుడు చెప్పుకోబోయేది నేటి కథ. జరగబోయే కథ. ఇన్‌కం ట్యాక్స్ వాళ్లు ఇప్పటికే తమకున్న విస్తృత అధికారాలను వాడుతూ, ఎన్నో రాళ్లు రువ్వుతున్నారు రతనాల కోసం. ప్రతి రాయీ రత్నం అవుతోంది. ఆదాయాన్ని తెస్తోంది. వారి దగ్గర ఉన్నది ‘‘డేటా’’ కాదు .. మీ బ్యాంకు బ్యాలెన్సు. ఆదాయాన్ని అసెస్ చేసి, వారి వాటా ఉంచుకుని మిగతాది మీకు ఇస్తారు. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ మైమరచిపోయే రోజులు పోయాయి. అరకొర సిబ్బంది ఏమీ చేయలేరని అనుకోకండి. అర కొర సిబ్బందికి కొత్త కోరలు వచ్చాయి. ఇక జాగ్రత్త.
‘‘సంసారం గుట్టు .. రోగం రట్టు’’ అనేది ఒక సామెత. ‘‘సంపాదన గుట్టు, రోగం గుట్టు’’ అనే వాళ్లూ ఉన్నారు. మగవాడి జీతం అడగకూడదనే నానుడి ఉంది. డిజిటల్ ప్రపంచంలో అన్నీ అందరికీ తెలిసిపోతున్నాయి. సీక్రెసీ లేదు. ప్రైవసీ లేదు. ఇనుపపెట్టెలో రొక్కం, బీరువాలో నగలు, లాకర్లో బంగారం, స్విస్ బ్యాంకులో జమలు.. ఇవన్నీ తెలుసుకుంటున్నారు.
మనం మన వంటికి ‘కవచకుండలం’లాగా భావించే సెల్‌ఫోన్ నిజానికి కవచ కుండలం కాదు. డేటాను వెదజల్లే కుండ. మన సంభాషణలు, వాట్సప్‌లో సందేశాలు, ఈమెయిళ్లు, గూగుల్ చెల్లింపులు, పేటీఎం చెల్లింపులు, అమెజాన్ ఆర్డర్లు, ఫ్లిప్‌కార్ట్ కొనుగోళ్లు, స్విగ్గీ ఆర్డర్లు, జొమాటో ఆర్డర్లు, విదేశీ ప్రయాణాలు, పండగ ఆఫర్లు, బంగారం కొనుగోళ్లు ప్రతీదీ తెలిసిపోతుంది. అలాగే బిల్డర్లతో, బ్రోకర్స్‌తో, బ్యాంకర్లతో, ఇన్వెస్ట్‌మెంట్ ప్లానర్స్‌తో, వ్యాపారవేత్తలతో స్నేహితులతో, పిల్లలతో, భాగస్వాములతో జరిపే ఈమెయిల్స్ సంభాషణలు, మన ఇన్‌స్ట్రాగామ్, వాట్సాప్, యూట్యూబ్, సోషల్ మీడియా, లింక్డిన్ ఖాతాలు మొదలైన వివరాలన్నీ తెలిసిపోతాయి.
2026 ఏప్రిల్ 1 నుంచి అంటే 2026–27 ఆర్థిక సంవత్సరం నుంచి ఇన్‌కం ట్యాక్స్ అధికారులకు ఇంద్రుడిలాగా విస్తృత అధికారాలు ఇచ్చారు. మీ సోషల్ మీడియా అకౌంటు, బ్యాంకు అకౌంట్లు, ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ అకౌంటు, ట్రేడింగ్ అకౌంటు ... ఇలా అన్నీ చెక్ చేయొచ్చు. బ్యాంకు లాకర్లు పగలకొట్టడం విన్నాం. ఇప్పుడు మీ కంప్యూటర్ సిస్టంను బ్రేక్ చేస్తారు. వర్చువల్ డిజిటల్ స్పేస్‌లో ప్రవేశిస్తారు. ఇప్పటికే అనుభవజ్ఞులైన ఎథికల్ హ్యాకర్స్‌ని ఇన్వాల్వ్ చేసి మన సమాచారం తప్పని, తక్కువని, పూర్తిగా జరిపిన వ్యవహారాలన్నీ చూపించి మన జాతక విశ్వరూప ప్రదర్శనం చేసి వారి ‘‘విశ్వరూపాన్ని’’ చూపిస్తున్నారు. మేఘాల్లో (క్లౌడ్) నుంచి కూడా సమాచారాన్ని సంగ్రహించి, అసెస్‌మెంట్ చేస్తున్నారు. వెబ్‌సైట్లు, క్లౌడ్ సర్వర్లు, డిజిటల్ ప్లాట్‌ఫాంలు దేన్నీ వదలడం లేదు. ‘‘ఇందుగలడందు లేడ’’ని చెప్పినట్లు, ఎక్కడికైనా వెళ్తారు. ఆగమేఘాల మీద రావడం అంటే ఇదేనేమో.
అధికార్లు ఎందుకు వస్తారు... నా ప్రైవసీలోకి రావచ్చా.. ఇది రాజ్యాంగబద్ధమా.. ఇది హక్కులు నేలరాయటం కాదా లాంటి ప్రశ్నలు వెయ్యకండి. కొత్త బిల్లులో నిర్వచనం చాలా పకడ్బందీగా రాశారు. ఉద్యోగి సిస్టం ద్వారా యజమాని వివరాలు తెలుసుకుంటారు. అంతే కాకుండా కొన్న సంవత్సరం నుంచి ఎనిమిదేళ్లు వెనక్కు వెళ్తారు. అందుకని జాగ్రత్త వహించండి. మనం ఎవరికీ తెలియకుండా వ్యాపారం/వ్యవహారం చేస్తున్నాం అనుకుంటాం. ఇరుగు పొరుగుకి, అన్నదమ్ములకు తప్ప అందరికీ తెలుస్తుంది. ‘కాగల కార్యం గంధర్వులే’ తీర్చినట్లుగా తెలియకూడని వాళ్లకే సర్వం తెలిసిపోతోంది. ‘సర్వం జగన్నాధం’.
అయితే, ఈ అధికారాలు దుర్వినియోగం కాకూడదు. అందరికీ సమానంగా, అంటే పన్ను ఎగవేసే ప్రతి బడాబాబుకీ వర్తించేలా, బంధుప్రీతి లేకుండా, కక్ష సాధింపులా కాకుండా, రాజకీయాలకు అతీతంగా జరిగితే ఎంతో మంచిది. అదే విశ్వకల్యాణం.
కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి
కె.వి.ఎన్ లావణ్య
ట్యాక్సేషన్ నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment