
గోల్డ్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్‌లలో పెట్టుబడులపై ఏ మేరకు పన్ను ఎలా విధిస్తారు? – గిరిరాజ్
మీరు ఏ తరహా బంగారం సాధనంలో ఇన్వెస్ట్ చేశారన్న అంశంపైనే పన్ను ఆధారపడి ఉంటుంది. గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌వోఎఫ్)లో పెట్టుబడులు పెట్టినట్టయితే.. వాటిని రెండేళ్ల పాటు కొనసాగించిన తర్వాత విక్రయిస్తే అప్పుడు దీర్ఘకాల మూలధన లాభాల పన్ను కిందకు వస్తుంది. లాభంపై 12.5 శాతం పన్ను చెల్లించాలి. రెండేళ్లలోపు విక్రయిస్తే వాటిని స్వల్పకాల మూలధన లాభాల పన్ను కింద పరిగణిస్తారు. ఈ మొత్తం వార్షిక ఆదాయానికి కలిపి, నిబంధనల మేరకు పన్ను చెల్లిస్తే సరిపోతుంది.
గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ అన్నవి గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు పెడుతుంటాయి. ఇవి మ్యూచువల్ ఫండ్స్ కనుక స్వల్ప మొత్తం నుంచి సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అదే గోల్డ్ ఈటీఎఫ్‌లు అయితే ఇవి స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ట్రేడ్ అవుతుంటాయి. ఏడాది తర్వాత పెట్టుబడులు విక్రయిస్తే వచ్చే లాభంపై 12.5 శాతం పన్ను పడుతుంది. ఏడాదిలోపు విక్రయించగా వచ్చిన లాభం ఇన్వెస్టర్ వార్షిక ఆదాయానికి కలుస్తుంది. గోల్డ్ ఈటీఎఫ్‌లలో ఎక్స్‌పెన్స్ రేషియో (ఫండ్స్ సంస్థ వసూలు చేసే చార్జీ) తక్కువగా ఉంటుంది. వ్యయాల పరంగా చౌక. కాకపోతే వీటిల్లో ఇన్వెస్ట్ చేసేందుకు డీమ్యాట్, డ్రేడింగ్ అకౌంట్ అవసరం అవుతాయి. గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్‌లో అయితే డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలు అవసరం లేకుండానే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో రాబడులపై ఆర్‌బీఐ వడ్డీ రేట్ల ప్రభావం ఉంటుందా? – ఇస్మాయిల్
ఆర్‌బీఐ రెపో రేటును 0.25 శాతం (25 బేసిస్ పాయింట్లు) తగ్గించడంతో 6.25 శాతానికి దిగొచ్చింది. దీనికి డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఎలా స్పందిస్తాయో అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం. వడ్డీ రేట్లు తగ్గినప్పుడు డెట్ మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని బాండ్లు (అధిక కూపన్ రేటుతో ఉన్నవి) మరింత విలువను సంతరించుకుంటాయి. ఎందుకంటే కొత్తగా జారీ చేసే బాండ్లతో పోల్చినప్పుడు అంతకుముందు కొనుగోలు చేసినవి ఎక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేస్తాయి. ఫలితంగా ఆయా బాండ్ల ధరలు పెరుగుతాయి. దీంతో సంబంధిత డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఎన్‌ఏవీ కూడా ఆ మేరకు లాభపడుతుంది. వడ్డీ రేట్ల క్షీణత ప్రభావం లాంగ్ డ్యురేషన్ ఫండ్స్‌పై ఎక్కువగా ఉంటుంది.
ఇదీ చదవండి: ఇవి రీచార్జ్ చేసుకుంటే ఫ్రీగా జియో హాట్‌స్టార్
అధిక రేటు బాండ్లలో చేసిన పెట్టుబడులతో లాంగ్ టర్మ్ డెట్ ఫండ్స్ ఎక్కువ లాభపడతాయి. దీనికి వ్యతిరేకంగా వడ్డీ రేట్లు పెరిగే క్రమంలో లాంగ్ డ్యురేషన్ ఫండ్స్‌పై ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కొత్తగా జారీ చేసే బాండ్లు అధిక రేటును ఆఫర్ చేస్తుంటాయి. దీంతో అప్పటికే ఫండ్స్ పోర్ట్‌ఫోలియోలో ఉన్న బాండ్లపై రేటు తక్కువగా ఉండడంతో అవి ఆకర్షణీయత కోల్పోతాయి. దీంతో ఆయా బాండ్ల ధరలు పడిపోతాయి. దీని ఫలితంగా వాటి ఎన్‌ఏవీ కూడా క్షీణిస్తుంది. ఈ ధరల ఆధారిత ప్రయోజనానికి అదనంగా.. డెట్ ఫండ్స్‌కు వాటి నిర్వహణలోని బాండ్ల రూపంలో వడ్డీ ఆదాయం కూడా వస్తుంటుంది. వడ్డీ రేట్లలో మార్పులు చోటుచేసుకున్నప్పుడు డెట్ ఫండ్స్ తిరిగి చేసే పెట్టుబడులపై ఆ మేరకు ప్రభావం ఉంటుంది. ఇవన్నీ ఆయా ఫండ్స్‌లో పెట్టుబడులపై రాబడులను ప్రభావితం చేస్తుంటాయి. డెట్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లు ఈ అంశాలపై అవగాహన కలిగి ఉండాలి.
- ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్
Comments
Please login to add a commentAdd a comment